నాగ బంధం - 15


                    💎 నాగ ' బంధం' 💎
                     ( పదహారవ భాగం)

తన వెనుక జరుగుతున్న దేదీ తెలీన శతాక్షి పెళ్లి వారింటికి తలంబ్రాల బియ్యం పట్టుకుని వెళ్లి...  చారులత తల్లికి ఇచ్చి..  తన తల్లిదండ్రుల కోసం వెతకడం మొదలు పెట్టింది.

వారెక్కడా ఆమె కి కనపడలేదు.శంకరుడు ఒక దగ్గర కూర్చుని ఉండటం చూసి "అన్నా!అమ్మా నాన్నా ఎక్కడ ఉన్నారు?"  అని అడిగింది.

"నేను చూడలేదు సోదరీ.... అవునూ నీవు చాలా సేపటి నుంచి కనపడలేదు ఎక్కడ ఉన్నావూ" అని అడిగాడు.

"అదా... చారులత ని తయారు చేస్తూ ఆమె గదిలో ఉన్న నాకు వాళ్లమ్మ తలంబ్రాల బియ్యం విడిదింట్లో ఉన్నాయి తెమ్మంటే వెళ్లాను" అంది శతాక్షి.

"అవునా... నాకు చెప్పకుండా ఒక్కదానివే ఎక్కడికీ పోకూడదని చెప్పాను కద సోదరీ" అన్నాడు కంగారు గా

"ఇప్పుడేమైనది అన్నా... నేను క్షేమము గానే ఉన్నాను కదా" అంది శతాక్షి.

"అయిననూ...  నీవు ఒక్కదానివే ఎచటికీ పోకూడదు. అదంత క్షేమకరం కాదు.. ఇంకోసారి ఇలా జరిగినచో నేను నీతో మాట్లాడను శతా" అన్నాడు శంకరుడు కినుకుగా.

"ఈ ఒక్కసారికీ క్షమించు సోదరా..ఇంకోసారి ఇలా చేయను..  సరేనా" అంది శతాక్షి మన్నింపుమన్నట్టు రెండు చెవులూ పట్టుకొని..

"ఆ చర్య కి నవ్వుతూ నీవు నా ముద్దుల సోదరివి..  నీకేదైనా ఆపద వాటిల్లుతుందనే నేనిలా నిన్ను అన్నిటికీ అడ్డుపడుచుంటిని. నా మీద ఏమైనా కోపము వచ్చుచున్నదా సోదరీ"  అన్నాడు శంకరుడు.

"అయ్యో...  అన్నా...  నీవు కూడా నా బంగారం లాంటి అన్నవి. నా క్షేమము కోసమే కదా నీవిలా చెప్తున్నావు. ఇకనుంచి నీకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లను" అంది శతాక్షి.. 

'అలా వెళ్లడం వల్ల ఓ దుర్మార్గుడు చేతికి చిక్కాను.ఆ భగవంతుని దయవల్ల నాకేమీ కాలేదు.. లేకుంటే ఏం జరిగేదో తలుచుకుంటుంటే భయం వేస్తుంది.

కానీ అటువంటి దుర్మార్గునికి నా స్నేహితురాలి తో వివాహం జరిగితే దాని జీవితం నాశనం అవుతుంది. శివయ్యా.. వాడి చెర నుంచి కాపాడిన నీవే నా స్నేహితురాలిని కూడా కాపాడు' అని మనసులో శివయ్య ని వేడుకుంది.

వసంతుడు విడిదింటి నుంచి వచ్చి సరాసరి తన గది లోకి వెళ్లాడు ఎవరూ గమనించకుండా. తనకి జరిగిన అవమానానికి ఎలాగైనా శతాక్షి కి బుద్ది చెప్పాలని అనుకున్నాడు.

"ఏరా ఇంతసేపూ కనపడలేదు ఎక్కడికి వెళ్లావు" అన్నాడు వసంతుని స్నేహితుడు ఒకడు..

"ఎవరో బంధువులు వస్తే పలకరిస్తూ బయటే ఉన్నాను రా" అన్నాడు వసంతుడు తన తడబాటుని కప్పిపుచ్చుకుంటూ.

"అవునా! బయట ఉన్నావా. మరి నువ్వు విడిదింటివైపు నుంచి రావడం చూశానని చెప్తున్నాడు మన రమణ" అన్నాడు ఇంకో స్నేహితుడైన శశిధరుడు.

"ఓ అదా !"అని ఏదో చెప్పబోతున్న వసంతుడు.. 

"ఆపరా ఆ విడిదింటి వైపు నీ కాబోయే భార్య స్నేహితురాలు ఒక్కతే వెళ్లడం కూడా చూశా నేను చెప్పు ఏంటి కథ..చూసిన మరుక్షణం ఆమె తో...  ఊ..  ఊ.."  అంటూ వసంతునికి గిలిగింతలు పెట్టడం మొదలుపెట్టాడు రమణ.

"ఆపరా... ఆపు... ఇంతవరకూ నా చేతిలో నుంచి ఏ ఒక్క అమ్మాయి కూడా తప్పించుకున్నది లేదు..  కానీ అది నాకు చెంపదెబ్బ కొట్టి పారిపోయింది..  దానికెంత ధైర్యం లేకపోతే నా మీదే చేయివేస్తుందా" అన్నాడు వసంతుడు కోపంగా.

"ఏంటి...  నీ చేతిలో నుంచి ఓ ఆడది తప్పించుకుందా. అదీ చెంపదెబ్బ కొట్టిమరీ. నమ్మమంటావా" అన్నారు అతని స్నేహితులు.

"నిజమురా.. అది నన్ను కొట్టి పారిపోయింది. దానికి తగిన ఫలితం అనుభవిస్తుంది. ఈ పెళ్లి కూతురు దాని ప్రాణ స్నేహితురాలు. ఈ పెళ్లి ఆగిపోయి తన స్నేహితురాలు తన కళ్లెదుట బాధగా తిరుగుతుంటే పెళ్లి అది కుమిలిపోవాలి.

జన్మలో  తన స్నేహితురాలికి పెళ్లి కాకుండా చేస్తా ఎందుకంటే ఆ చారులత నాతో పెళ్లికి ముందు..  ముద్దూ ముచ్చట్లు అన్నీ తీర్చుకుంది... అవి అన్నీ చెప్పి  ఇంకెవరూ దాన్ని పెళ్లి చేసుకోకుండా ఆపుతా" అన్నాడు కోపంగా వసంతుడు.

"కానీ ఎలా రా... ముహూర్తం ఇంకా ఎంతో సమయం లేదు.." అన్నాడు రమణ.

"ఉండనీ.ఏదో ఒక అవకాశం రాకుండాపోదు.అప్పుడు  ఈ పెళ్లి ఆపడానికి నా ప్రయత్నం నేను మొదలుపెడతా" అన్నాడు వసంతుడు.

"కానీ ఇంతవరకూ వచ్చాక  పెళ్లి ఆపడం సరియైన పద్ధతి కాదేమో వసంతా.. పాపం ఆ పెళ్లి కూతురు నీపై చాలా ఆశలు పెట్టుకుని ఉంటుంది. అలాంటప్పుడు ఇలా పెళ్లి ఆపాలని అనుకోకూడదు"అన్నాడు శశిధరుడు.

"బాబూ...నువ్వు ఆపుతావా వింటే ఎన్నైనా చెప్తావు. దాని స్నేహితురాలు చేసిన తప్పుకి చారులత శిక్ష అనుభవించి తీరాల్సిందే" అన్నాడు వసంతుడు కోపంగా.

ఇంతలో వసంతుని తండ్రి వచ్చి"వసంతా! మీ మామ గారు ఓసారి నీతో ఏదో విషయమై మాట్లాడాలటా" అని అనడంతో

"ఏమిటి మామయ్య గారూ.. " అన్నాడు వసంతుడు చారులత తండ్రి అయిన గణపతి గారి ని చూస్తూ.

"బాబూ అదీ... అదీ.." అని చేతులు నులుపుకుంటున్న ఆయన్ని చూసి...

"ఏంటి మామగారు.చెప్పండి విషయం ఏంటో" అన్నాడు వసంతుడు... 'ఈయనేదో తనకి పెళ్లి ఆపడానికి ఓ అవకాశం ఇచ్చేలా ఉన్నాడు' అనుకుంటూ..

"బాబూ... అదీ మీకు పెడతానన్న లాంఛనాల్లో కొంత సొమ్ము ని ఈ పెళ్లి అయ్యాక మీకు ఇస్తామని చెప్పడానికి వచ్చాను" అన్నారు గణపతి గారు.

"అదేంటి మామయ్య గారూ.ముందే చెప్పానుకదా. పెళ్లికి పెడతానన్న అన్ని లాంఛనాలూ పెళ్లి సమయానికన్నా ముందే ఇవ్వాలని. మీరిలా ఆఖరి నిమిషంలో వచ్చి చెప్తే పెళ్లి నిరాటంకంగా జరిగిపోతుందనా మీ ఉద్దేశ్యం" అన్నాడు వసంతుడు.

"అదేంటి బాబూ..  మీకివ్వాల్సిన సొమ్ము లో కొంత మాత్రమే తగ్గింది. అది కూడా మీ పెళ్లి అయిన వారం లోపల ఇచ్చేస్తాను" అన్నారు గణపతి గారు.

"అదేం కుదరదండీ.. అన్నీ పెళ్లి సమయం కంటే ముందు ఇస్తేనే పెళ్లి జరుగుతుంది. లేదంటే ఈ పెళ్లిని ఆపేద్దాం" అన్నాడు వసంతుడు.

"అయ్యో బాబూ అదేంటి అలా అంటున్నారు.పెళ్లి ఆపితే నా బిడ్డ బ్రతుకు ఏం కావాలి.. ఆడపిల్ల పెళ్ళి పీటల మీద ఆగిపోతే దాని బ్రతుకు బుగ్గి పాలు అవుతుంది బాబూ" అంటూ ఏడుస్తూ ప్రాధేయ పడసాగారు గణపతి గారు.

"కుదరదండీ...  ఈ పెళ్లి జరగదు" అన్నాడు గట్టిగా వసంతుడు.

ఆ అరుపు తో  అందరూ అటువైపు చూశారు. నాగేంద్ర గారూ, కైవల్య గారూ..  అక్కడికి వెళ్లి "ఏం జరిగింది గణపతి గారూ!" అని అడిగారు.

"పెళ్లి కి ఇస్తానన్న సొమ్ము కొంత తగ్గింది అని పెళ్లి ఆపేస్తాను అంటున్నారు నాగేంద్ర గారు. ఇప్పటికే చాలా అప్పు చేసి వీరికి ఇవ్వాల్సిన లాంఛనాలు ఏర్పాటు చేసా. ఆ కాస్త సొమ్ము కూడా పెళ్లి జరిగిన వారం నాటికి ఇచ్చేస్తాను అంటున్నా కూడా అబ్బాయి ఒప్పుకోవడం లేదు" అన్నారు గణపతి గారు ఏడుపు ముఖం తో.

"అదేంటి బాబూ..  వారం లో ఏర్పాటు చేసి ఇచ్చేస్తాను అంటున్నారు కదా.. ఈ పెళ్లి జరగనీయండి బాబూ" అన్నారు నాగేంద్ర గారు.

ఇంతలో శతాక్షీ, శంకరుడూ కూడా అక్కడికి చేరారు.

"లేదండీ ఈ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. ఇప్పుడే ఇవ్వని వారు పెళ్లి తర్వాత ఇస్తారని ఏంటి నమ్మకం.." అన్నాడు వసంతుడు శతాక్షి వైపు కోపంగా చూస్తూ.

"వద్దు... జరగవద్దు.. ఈ పెళ్లి జరగకూడదు" అన్న మాటలు వినపడి అందరూ అటువైపు చూశారు.

ఎదురుగా చారులత... ఆమె తల్లి ఉన్నారు కోపంగా.

"ఏంటి చారూ... ఏం మాట్లాడుతున్నావూ" అన్నారు గణపతి గారు... 

"నాన్నా... ఈ పెళ్లి జరగదు. ఒకవేళ అతను చేసుకుంటాను అన్నా నేను చేసుకోను" అంది చారులత కోపంగా.

"ఆడపిల్లకి అంతకోపం పనికిరాదు తల్లీ.. పీటలు మీద పెళ్లి ఆగిపోతే ఆ ఆడపిల్ల జీవితం ఏం  కావాలి..  నేను మాట్లాడుతాను.. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు" అన్నారు గణపతి గారు.

"అవసరం లేదు నాన్న గారూ.. ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు. ఇలాంటి ఓ కామాంధుడిని, నీచుడ్నీ, పరాయి ఆడవాల్లని మోహించేవాడిని పెళ్లి చేసుకోడానికి నేను సిద్దంగా లేను" అంది చారులత.

"ఏయ్..ఏం మాట్లాడుతున్నావే"అన్నాడు కోపంగా వసంతుడు.

"ఏం మాట్లాడుతున్నానా. నువ్వు ఇంతవరకూ నీ స్నేహితులతో ఏం మాట్లాడావో తెలిసే మాట్లాడుతున్నాను. నా ప్రాణ స్నేహితురాలిని నువ్వు చెడు ఉద్దేశం తో చూసి దాని జీవితాన్నీ..ఛీ...  చెప్పడానికి కూడా అసహ్యం వేస్తుంది.

ఆ శివయ్య దయ వల్ల మా అమ్మ నీ స్నేహితులతో నువ్వు అంటున్న మాటలు వింది కాబట్టి నాకు నీ నిజ స్వరూపం తెలిసింది. లేదంటే నా జీవితం నిజంగా నాశనం అయ్యేదే"  అంది చారులత కోపంగా ఎర్రగా నిప్పులు కక్కుతున్న కళ్లతో.

ఏంటీ...  మన  శతాక్షి ని... వీడు.. అంటూ అంతవరకూ వసంతుడిని బ్రతిమలాడిన గణపతిగారు రేయ్..  నీచుడా... శతాక్షి ని నీచ బుద్ధ తో చూశావా.. మా ఊరి శివయ్య అనుగ్రహం ఆ బంగారు తల్లి.. అటువంటి ఆమెని నీచమైన బుద్దితో చూశావంటే నువ్వెంత కాముకుడివో అర్థం అవుతుంది అని చాచి పెట్టి వసంతుని చెంప పై కొట్టారు.

అక్కడే ఉన్న  మిగతా వారిలో కొందరు వసంతుడిని ఇష్టం వచ్చినట్లు కొట్టారు.

నీలాంటి నీచున్ని మా ఊరి ఆడబిడ్డకి చచ్చినా ఇచ్చేది లేదు. ఈ రోజు ఇలా చేసిన వాడివి రేపు ఇంకేదైనా చేస్తావు.. నీ గురించి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వారికి చెప్పి వారి ఆడబిడ్డలను ఇవ్వకుండా చేస్తాం..  పదండి గణపతి గారూ అంటూ కదిలారు అంతా..

చారులత.. శతాక్షి చేరి.. నన్ను క్షమించు శతా.. ఇతను ఇలాంటి వాడని నాకు ముందు తెలీదు. మంచిగా మాట్లాడి నన్ను ఏమార్చాడు..అతను చేసిన దానికి నన్ను క్షమించు అంది నొచ్చుకుంటూ.

అయ్యో.. చారూ.. నువ్వేం చేస్తావు.. అతని నీచ బుద్ధి నీకు  తెలీదు కదా. తెలిస్తే ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటావు చెప్పూ. ఏదైతేనేం మంచే జరిగింది కదా అంది శతాక్షి.

                        💎💎💎

చండా ప్రచండలు సెలయేటి దగ్గర స్పృహ లేకుండా పడిన తరువాత అదృశ్యరూపమునుంచి మళ్లీ రామచిలుక రూపంలోకి మారాడు తక్షక.

తన లోకానికి వెళ్లాలనుకుని మనసులో తలుచుకుని చివరి నిమిషంలో ఆగాడు తక్షక.... శతాక్షి ఆపద సంబవించబోతోందని తన మనోనేత్రం నందు కనపడుట చేత వెంటనే తన ప్రయాణాన్ని ఆపుకుని చండా, ప్రచండలు శతాక్షి చేరుతున్న ఆఖరి నిమిషాన చేరి వారిని బంధించి మంత్ర పఠనం కావింపనీకుండా చేసి సేలయేటి వద్ద స్పృహ లేని పరిస్థితుల్లో ప్రత్యక్షమయ్యే లా చేశాడు.

అంతవరకూ అక్కడ జరిగేదేది క్షుద్ర దివ్యదృష్టి కి కూడా తారసపడలేదు. కాసేపటికి సెలయేటి ఒడ్డున కనపడుతున్న చండా, ప్రచండ లను కాంచి...

"చండా.... ప్రచండా....  చండా...  ప్రచండా... "అంటూ పిలుస్తున్నా వారిద్దరికీ ఏమీ వినపడక బదులు ఇవ్వడం లేదు.

మళ్లీ మరోసారి ప్రయత్నించాడు క్షుద్ర ,,శతాక్షి ని అపహరించి తీసుకుని రావడానికి చండా, ప్రచండలు వెళ్లాక ఏం జరిగిందో తెలుసుకోడానికి...కానీ అతనికి ఏమీ కనపడటం లేదు.

వెంటనే తన మంత్రశక్తి తో సెలయేటిలో ఉన్న  నీరు వారిద్దరి ముఖాలపై పడేలా చేసాడు... ఒక్కసారి గా ఉలిక్కిపడి లేచారు ఇద్దరూ. తామెక్కడ ఉన్నామో అని చుట్టూ చూశారు. అసలక్కడికి ఎలా వచ్చామో తెలీని అయోమయం లో ఉండగా...

"చండా!" అని  క్షుద్ర పలుకులు వినపడి గురువు గారు మేమిచటికి ఎలా వచ్చాము అని అడిగారు ఇద్దరూ.

"ఆమె ని మరలా ఆ మాయా శక్తే కాపాడినది. నా నుంచి ఎన్ని దినములు దాన్ని కాపాడుతుందో ఆ శక్తి నేనూ  చూస్తా... మనకు అనుకూలమైన అమావాస్య గడియలు  త్వరలోనే రాబోవుచున్నవి. ఆ గడియలలో ఏ దైవశక్తి కూడా ఆమె ని కాపాడలేదు. ఇప్పటికి మీరు మీ స్థావరం నకు చేరుకోండి " అన్నాడు క్షుద్ర.

"అటులనే గురువు గారూ" అని తమ గురువు ని తలచుకుని మంత్రాలను పటించారు ఇద్దరూ ఒకరి చేయి ఇంకొకరు పట్టుకుని... కాసేపటికి ఇద్దరూ తాము బస చేయుచున్న ఇంటి కి చేరారు.

"మాతా! ఈ భక్తునిపై నీకు ఇంకనూ అనుగ్రహము కలుగలేదా. ఆ కన్య నాకు చిక్కినట్టే చిక్కి ప్రతీసారీ తప్పించుకొనుచున్నది. ఇటులే జరిగినచో నా కోరిక ఎట్లు నెరవేరును.

నీ పరమభక్తుడినైన నా మీద నీకింత కినుకేల మాతా...  నా పూజలలో ఏమయినా లోపము జరుగుచున్నదా  లేదా నన్ను మించిన శక్తి ఆమె ని  కాపాడు చున్నదా.

ఎందుకనిన మానవ మాత్రులెవ్వరైనా ఎధిరించినచో నా దివ్య దృష్టితో చూడగలను. కానీ ఆ శక్తి ఎప్పుడూ అదృశ్య రూపమున నా మంత్ర, తంత్రాలకూ చిక్కకుండా ఉండె...

సమస్త భూమండలం నందు అత్యంత శక్తివంతమైన, తాంత్రిక విద్యలు తెలిసిన ఈ  క్షుద్ర మాయల నుంచి తప్పించుచున్న ఆ శక్తి ఎవరో నా కళ్లముందు కనపడేలా చేయు మాతా" అని తన మంత్రశక్తి తో దూరాన గడ్డి మేయుచున్న మేకల మందలోనుంచి కొన్ని మేకలను మాయం చేసి

"మాతా! ఈ బలిని స్వీకరించి...  ఆ శక్తి ఎవరో నాకు చూపించు. నన్ను ఆపుతున్న ఆ శక్తి ఈ దినము ఎటులైనా కాంచవలె అని ప్రార్థిస్తుండగా ఓ ఖడ్గము ప్రత్యక్షమై ఆ మేకల శిరస్సు లను ఖండించినది...  ఆ శిరస్సు ల ను కాళీ మాత పాదాల చెంత పెట్టి... మాతా నాకా శక్తిని చూపించు" అని వేడుకున్నాడు.

వెంటనే ఓ వెలుగు సాక్షాత్కారం అయ్యింది కాళీమాత విగ్రహం నుంచి......

"క్షుద్రా...  నీవు కోరిన అదృశ్య శక్తి ఎవరో మాయా దర్పణము నందు దర్శనము అగును పొమ్ము" అని పలికినది.

"అటులనే మాతా!" అని క్షుద్ర ఆ దర్పణము వద్దకు చేరుకుని చూశాడు....  అందులో ఓ ఎనిమిది అడుగుల సర్పము అతనికి కనపడినది..

"ఇదేమి మాయ.. ఆ కన్యను చేరనీయకుండా ఆపుచున్నది ఈ సర్పమా. ఇదేమి వింత. ఓ సర్పము ఆమెని చేరనీయకుండా ఆపుచున్నదా" అనుకొనుచూ "అసలు ఆ సర్పమునకూ,  ఆమె కీ మధ్య సంబంధం ఏమిటో తెలుసుకొనవలెనని" కాళీమాత విగ్రహము చెంతకి చేరి ఒంటి కాలిపై నిలబడి ఉపాసన చేయడం మొదలు పెట్టాడు.

                          💎💎💎

వారిని సెలయేటి వద్ద విడిచిపెట్టిన తక్షక రామ చిలుక రూపంలోకి మారి శైలేంద్ర భుజం పై  నిలబడి

"మిత్రమా!" అని పిలిచాడు.

అంతవరకూ జంగడూ, హరులు ఏదో చెప్తుంటే వింటున్న  శైలేంద్ర..

"నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పి తన  గదిలోకి వెళ్లాడు.

ఆ ఏంటీ.. అన్నట్టు సైగ చేశాడు శైలేంద్ర.

తక్షక జరిగింది మొత్తం చెప్పాడు..

💐💐💐

చూద్దాం తరువాత ఏం జరుగుతుందో. ఇది ఓ ఊహాజనిత కథ. ఇందులోని పాత్రలూ, కథా, కథనం అంతా కల్పితం.

ఇందులోని ప్రతీ ప్రాంతానికీ ఓ కథ ఉంది అవన్నీ కలిసేవి ఓ దైవిక కార్యం కోసం.. గమనించగలరు.

కథని కథలాగే చదివండి..... నాకు పురాణాలు ఇతిహాసాలూ అంతగా తెలీవు. నాకున్న నాలెడ్జ్ లో ఎంతో ఆలోచించి రాస్తున్న కథ ఇది.

మీ 🤗
కమల'శ్రీ '✍️.


Rate & Review

Bhargava Kumar

Bhargava Kumar 3 months ago

mamidi snehashilpa

When will be next part released

ashok

ashok 3 months ago

Chala Gap teesukuntunnaru

sravanthi koyyada

sravanthi koyyada 3 months ago

ROSAIAH GOTTIPATI

ROSAIAH GOTTIPATI 3 months ago