నందిత పదవ తరగతి చదువుతున్న తెలివైన విద్యార్థిని. చదువులో ఆమెకు సాటివారు అరుదు. ప్రతి పరీక్షలో మొదటి స్థానం సాధించడం ఆమెకు అలవాటే. చిత్రలేఖనం, పెయింటింగ్, భరతనాట్యం, సంగీతం వంటి సహపాఠ్య కార్యక్రమాల్లోనూ ఆమె అసాధారణ ప్రతిభ కనబరుస్తూ ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకునేది. ఇన్ని మంచి లక్షణాలున్నా ఆమె జీవితాన్ని వెనక్కి లాగే రెండు అలవాట్లు మాత్రం ఉన్నాయి. ఒకటి బద్ధకం, రెండోది నిర్లక్ష్యం. తీసిన వస్తువును తిరిగి యథాస్థానంలో పెట్టేది కాదు. పుస్తకాలు, పెన్నులు, నోట్‌బుక్కులు, సర్టిఫికెట్లు, కవర్లు—ఏది చేతికి వచ్చినా ఎక్కడో ఒకచోట పడేసేది. అంతేకాదు, చదువు తప్ప మిగతా పనులన్నింటినీ “రేపు చూద్దాం” అంటూ వాయిదా వేయడం ఆమెకు అలవాటైపోయింది.
తల్లిదండ్రులు ఎన్నోసార్లు ప్రేమగా హెచ్చరించారు. “ప్రతిభ ఒక్కటే చాలదు. క్రమశిక్షణ, సమయపాలన కూడా ఉంటేనే జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటావు” అని చెప్పేవారు. కానీ నందిత మాత్రం, “చదువు విషయంలో నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయను కదా! మిగతా పనులు ఒకరోజు ఆలస్యమైతే ఏమవుతుంది?” అంటూ నవ్వేసేది.
ఒకసారి సైన్స్ ప్రాజెక్ట్‌ను మూడు రోజుల ముందే పూర్తి చేయమని ఉపాధ్యాయులు సూచించారు. చివరి రోజు చేస్తానని వాయిదా వేసిన నందిత, ఆ సాయంత్రం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయలేకపోయింది. మరుసటి రోజు అసంపూర్తిగా సమర్పించడంతో ఆమెకు పూర్తి మార్కులు రాలేదు.
మరోసారి భరతనాట్య పోటీకి వెళ్లే సమయానికి ఘుంఘురులు కనిపించలేదు. ఇంట్లో అందరూ కలిసి వెతికితే అవి పుస్తకాల కుప్ప కింద దొరికాయి. అప్పటికే పోటీ ప్రారంభమైపోయింది. ఆమె ప్రదర్శన బాగున్నప్పటికీ ఆలస్యంగా చేరుకోవడంతో ప్రత్యేక బహుమతి చేజారిపోయింది.
ఇంకోసారి డ్రాయింగ్ పోటీకి అవసరమైన రంగుల పెట్టె కనిపించలేదు. చివరకు అది పాత వార్తాపత్రికల మధ్య దొరికేలోపే పోటీ ప్రారంభమైంది. తొందరపాటులో వేసిన చిత్రం ఆమె అసలు ప్రతిభను ప్రతిబింబించలేకపోయింది. ఫలితంగా ఎప్పుడూ బహుమతి అందుకునే నందిత ఆ రోజు నిరాశతో ఇంటికి చేరుకుంది.
ఒకరోజు పాఠశాలకు వెళ్లే ముందు గణిత నోట్‌బుక్ కనిపించక ఇల్లంతా వెతికింది. చివరకు అది సోఫా కింద దొరికింది. అప్పటికే ఆలస్యమవడంతో మొదటి పీరియడ్ మిస్ అయింది. ఉపాధ్యాయురాలు ప్రేమగా, “తెలివి ఉన్నంత మాత్రాన సరిపోదు. వస్తువులను క్రమంగా ఉంచుకోవడం కూడా విద్యలో భాగమే” అని చెప్పింది. అయినా ఆ మాటలు ఆమెపై పెద్దగా ప్రభావం చూపలేదు.
కాలం గడిచింది. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఎంతో శ్రమించి చదివిన నందిత ప్రతి పరీక్షను అద్భుతంగా రాసింది. ఫలితాలు వచ్చిన రోజు ఆమెకు 97 శాతం మార్కులు వచ్చాయి. పాఠశాలలో మొదటి ర్యాంకుతో పాటు పట్టణంలో నాలుగో స్థానం సాధించింది. కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయింది. ఆమె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు మంచి భవిష్యత్తు కోసం ప్రసిద్ధ కార్పొరేట్ కళాశాలలో చేర్పించారు.
దాదాపు రెండు నెలల తర్వాత ఒకరోజు తన బీరువాను సర్దుతుండగా పాత కవర్ల మధ్య ఒక అధికారిక కవరు కనిపించింది. అది తన పాఠశాల నుంచి వచ్చినదని చూసి ఆశ్చర్యపోయింది. ఆసక్తిగా తెరిచి చదవగానే ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది. పదవ తరగతిలో ఉత్తమ ర్యాంకు సాధించినందుకు అభినందిస్తూ, ప్రత్యేక సన్మాన కార్యక్రమానికి తల్లిదండ్రులతో కలిసి రావాలని ఆహ్వానిస్తూ పంపిన లేఖ అది. ఆ కార్యక్రమంలో మంత్రివర్యుల చేతుల మీదుగా బహుమతితో పాటు ఇంటర్మీడియట్ చదువు కోసం యాభై వేల రూపాయల స్కాలర్‌షిప్‌ను అందించనున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఆ కార్యక్రమం జరిగి రెండు నెలలు దాటిపోయింది.
ఆ క్షణంలో పోస్టుమ్యాన్ ఇచ్చిన ఆ కవరును “తర్వాత చూద్దాం” అంటూ తెరవకుండానే బీరువాలో పడేసిన రోజు గుర్తుకొచ్చింది. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎంత గొప్ప అవకాశాన్ని దూరం చేసిందో ఆమెకు అర్థమైంది. మంత్రిగారి చేతుల మీదుగా సన్మానం అందుకునే గౌరవం, యాభై వేల రూపాయల స్కాలర్‌షిప్, ఆ డబ్బుతో కొనాలని కలలు కన్న ల్యాప్‌టాప్—అన్నీ తన చేతులారా జారిపోయాయి. ఇంతకాలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి మాట ఇప్పుడు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించింది. చిన్న చిన్న అలవాట్లను సరిదిద్దుకోకపోతే పెద్ద పెద్ద అవకాశాలు కూడా చేతులెదురుగా జారిపోతాయని ఆమె గుండెల్లో బలంగా ముద్రపడింది.
ఆ రోజు నుంచి నందిత పూర్తిగా మారిపోయింది. వచ్చిన ఉత్తరాలను అదే రోజు తెరిచి చదవడం, ప్రతి వస్తువును తీసిన చోటే తిరిగి పెట్టడం, చేయాల్సిన పనులను చిన్న డైరీలో రాసుకొని సమయానికి పూర్తి చేయడం అలవాటు చేసుకుంది. క్రమంగా ఆమె గది కూడా పరిశుభ్రంగా, సక్రమంగా మారింది. తల్లిదండ్రులు ఆమె మార్పును చూసి ఆనందించారు. ప్రతిభకు క్రమశిక్షణ తోడైతేనే విజయం శాశ్వతమవుతుందని నందిత తన అనుభవంతో గ్రహించింది. అప్పుడే ఆమెకు “ఆలస్యం అమృతం విషం” అనే సామెతలోని అసలు జీవనసత్యం అనుభవపూర్వకంగా అర్థమైంది.
వాయిదా వేసే అలవాటు మనిషి జీవితంలో కనిపించని శత్రువులాంటిది. మొదట్లో అది చిన్న విషయంలా అనిపించినా, క్రమంగా విలువైన అవకాశాలు, సమయం, ఆత్మవిశ్వాసాన్ని దూరం చేస్తుంది. ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడం వల్ల పనిభారం పెరిగి, ఒత్తిడి, ఆందోళన, తొందరపాటు నిర్ణయాలకు దారితీస్తుంది. సమయానికి పూర్తయ్యే పని ఆలస్యమైతే దాని నాణ్యత కూడా తగ్గిపోతుంది. విద్యార్థుల విషయంలో మార్కులు, పోటీ పరీక్షల అవకాశాలు, ఉద్యోగుల విషయంలో పదోన్నతులు, వ్యాపారుల విషయంలో లాభాలు కూడా ఈ అలవాటు వల్ల చేజారే ప్రమాదం ఉంది. అంతేకాదు, పదేపదే పనులను వాయిదా వేయడం బాధ్యతారాహిత్యానికి సంకేతంగా మారి ఇతరుల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందుకే విజయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ సమయాన్ని గౌరవించి, ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసే అలవాటును పెంపొందించుకోవాలి. చిన్న చిన్న పనులను సమయానికి పూర్తి చేయడం గొప్ప విజయాలకు బలమైన పునాది అవుతుంది.