నా గురించి చెప్పడానికి ఏముంది కిషోర్ గారు? కానీ మీరు వదలడం లేదు, అడుగుతూనే ఉన్నారు" అంటూ వెన్నెల ఒక్క క్షణం ఆగి నిట్టూర్చింది. కిషోర్ వెన్నెల కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. ఆమె మౌనం వెనుక ఏదో పెద్ద సముద్రమే దాగి ఉందని అతనికి అర్థమవుతోంది. పెదవి విప్పడానికి వెన్నెల తటపటాయిస్తుంటే.. కిషోర్ ఆకాశంలోని చందమామను చూపిస్తూ నెమ్మదిగా ఇలా అన్నాడు.. "చూడు వెన్నెలా! మనకు ప్రతిరోజూ రాత్రి చందమామ కనిపిస్తుంది. అది వింతేమిటి అనిపిస్తుందా? కానీ మనం చూసే కళ్ళలోనే అదంతా ఉంటుంది. ఒక్కోసారి నిండుగా, ఇంకోసారి సగంలా, అప్పుడప్పుడు సూర్యుడిలా ప్రకాశిస్తుంది.. కొన్నిసార్లు అసలు కనిపించదు. అలాగని దాని అందం తగ్గిపోతుందా? లేదు కదా! మనిషి జీవితం కూడా అంతే. మనలోని వెలుగు చీకట్లు మనల్ని మార్చలేవు."ఆ మాటలు వెన్నెల గుండెల్లో ఎక్కడో గుచ్చుకున్నాయి. ఒక అపరిచితుడు తన మనసులోని శూన్యాన్ని ఇంతలా ఎలా చదివేస్తున్నాడా అని ఆశ్చర్యపోయింది.