భారతీయ ఋషి పరంపరలో వశిష్ఠ మహర్షి స్థానం అత్యున్నతమైనది. ఆయన కేవలం మహాతపస్వి, బ్రహ్మజ్ఞాని మాత్రమే కాక రాజగురువుగా, తత్త్వవేత్తగా, రాజనీతికోవిదుడిగా, సద్ధర్మబోధకుడిగా విరాజిల్లారు. సప్తర్షులలో ప్రధానుడైన వశిష్ఠుడు ఇక్ష్వాకు సూర్యవంశాలకు కులగురువుగా వ్యవహరించి, తరతరాల పాలకులకు ధర్మమార్గాన్ని ఉపదేశించిన మహనీయుడు. వైవస్వత మన్వంతరంలోని సప్తర్షులలో ఈయన ఒకరుగా సంప్రదాయం కీర్తిస్తోంది. పురాణాలలో వశిష్ఠుని జన్మవృత్తాంతం అలౌకిక భావనలతో శోభిల్లుతుంది. ఒక సంప్రదాయం ప్రకారం ఈయన బ్రహ్మదేవుని మానసపుత్రుడు. నిమి మహర్షి శాపవశాత్తు తొలినాటి దేహాన్ని విడిచిన పిమ్మట, మిత్రావరుణుల దివ్యతేజస్సు ద్వారా పునర్జన్మ పొందారని కథనం. ఊర్వశిని దర్శించిన వేళ మిత్రావరుణుల తేజస్సు ఒక కుంభంలో నిక్షిప్తమై, దాని నుంచి వశిష్ఠుడు, అగస్త్య మహర్షి ఆవిర్భవించారు. ఈ కారణంగా వీరిద్దరినీ ‘కుంభజులు’ అని వ్యవహరిస్తారు. ఈ జన్మవృత్తాంతం భారతీయ పురాణేతిహాసాల్లోని గంభీరమైన తాత్త్విక ప్రతీకలను ఆవిష్కరిస్తుంది. వశిష్ఠుని ధర్మపత్ని అరుంధతి పాతివ్రత్యానికి, ధర్మనిష్ఠకు, ఓర్పునకు, జ్ఞానానికి పరాకాష్ఠగా నిలిచింది. అందుకే