ఆఫీసులోని ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ మోగుతున్న సైరన్ శబ్దం అద్వైత్ చెవుల్లో సీసం పోసినట్లుంది. గాలిలో గస్తీ తిరుగుతున్న రెండు సెక్యూరిటీ డ్రోన్లు అతని ముఖానికి అంగుళం దూరంలో ఆగి, తమ ఎర్రటి లేజర్ కళ్ళతో అతని కనుపాపలను స్కాన్ చేస్తున్నాయి. ఆ ఎర్రటి కాంతి అద్వైత్ ముఖంపై పడినపుడు, అతను ఏదో ఒక భయంకరమైన నేరం చేసిన వాడిలా కనిపిస్తున్నాడు.
అది చూడగానే చుట్టూ ఉన్న సహోద్యోగులు తమ తమ సీట్ల నుండి లేచి, ఏదో అంటువ్యాధి సోకిన వాడిని చూసినట్లు అద్వైత్ వైపు భయంగా చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ హెడ్ రాఘవ అడుగుల శబ్దం వినిపించడంతో, అతని షూస్ ఆ గాజు నేలపై చేస్తున్న శబ్దం ఒక మృత్యుఘంటలా మారుమోగుతోంది. రాఘవ తన మణికట్టుపై ఉన్న ప్రీమియం హోలోగ్రాఫిక్ ప్యానెల్‌ను గాలిలో ట్యాప్ చేయగా, అద్వైత్ ప్రొఫైల్ అందరికీ కనిపించేలా పెద్దగా ప్రత్యక్షమైంది.
"45%... కేవలం నలభై ఐదు శాతం!" అని అన్న రాఘవ స్వరం గదిలోని ఏసీ హమ్మింగ్‌ను కూడా అణచివేసింది. అతను అద్వైత్ వైపు అత్యంత అసహ్యంగా చూస్తూ, "అద్వైత్! అసలు నువ్వు బతికే ఉన్నావా లేక సిస్టమ్‌లో పడి ఉన్న పనికిరాని ఒక డెడ్ ఫైల్ లాంటి వాడివా? పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నీ డేటా గ్రాఫ్ ఒకే సరళరేఖలా ఉంది. అటు పుణ్యం లేదు, ఇటు పాపం లేదు, అసలు అల్గారిథమ్ నిన్ను రీడ్ కూడా చేయలేకపోతోంది. నువ్వు ఒక స్తంభించిన డేటాలాంటి వాడివి!" అంటూ అద్వైత్ గురించి అవమానకరంగా మాట్లాడదు.
అద్వైత్ తన బాస్ మాటలను మౌనంగా వింటున్నాడు. కానీ, అతని మణికట్టులోని చిప్ మాత్రం ఉన్నట్టుండి వేడెక్కుతోంది, అది అతని ఆందోళనను సిస్టమ్‌కు పంపిస్తోంది.
ఆ తర్వాత రాఘవ ఇంకా ఆవేశంగా ముందుకు వచ్చి, "నీలాంటి ఒక Noice వల్ల మా కంపెనీ యావరేజ్ కర్మ స్కోర్ పడిపోతోంది. ఈ రోజు నీ కారణంగా మా ప్రాజెక్ట్ ఇన్సెంటివ్స్ కూడా కట్ అయ్యాయి. డేటాలోకి ప్రాసెస్ కాని భావోద్వేగాలు నీలో ఉండటం అంటే.. నువ్వు ధర్మ-X దృష్టిలో ఒక డిజిటల్ వ్యర్థానివి. గెట్ అవుట్! ఇక్కడి నుండి వెళ్ళిపో!" అని గట్టిగా అరిచాడు.
అందరి ముందు జరిగిన ఆ అవమానం అద్వైత్ గుండెల్లో ఒక మంటను రేపింది. కానీ ఆ మంటను కూడా అతని చిప్ ఒక స్టాటిక్ నాయిస్ అని లేబుల్ చేస్తోంది. అవమానంతో తన వస్తువులను తీసుకుని నిశ్శబ్దంగా ఆఫీసు నుండి బయటకు అడుగు పెట్టాడు అద్వైత్.
బయట న్యూ అమరావతి వీధులు మధ్యాహ్నపు ఎండలో నియాన్ కాంతులతో మెరుస్తున్నాయి. అద్వైత్ ఆఫీసునుండి బయటకు వచ్చి అలా నడుచుకుంటూ వెళ్తుండగా, అకస్మాత్తుగా అతనికి కాలేజీ స్నేహితులు నలుగురు ఎదురయ్యారు. ఒకప్పుడు గంటల తరబడి కబుర్లు చెప్పుకున్న ఆ ముఖాలు చూడగానే అద్వైత్ ముఖంలో చిన్న ఆశ మెరిసింది.
"రేయ్ వరుణ్..!" అని పిలుస్తూ అద్వైత్ వారి దగ్గరకు వెళ్లబోయాడు.
కానీ అది విన్న వరుణ్ మరియు మిగిలిన వారు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. వారి మణికట్టులోని చిప్స్ నుండి చిన్నపాటి వైబ్రేషన్ వినిపించడం మొదలైంది. వారు తమ హోలోగ్రాఫిక్ డిస్ప్లేలను చూసుకోగా, 'హెచ్చరిక: తక్కువ స్కోర్ ఉన్న వ్యక్తితో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడితే మీ పాయింట్లు సింక్ అయ్యి పడిపోయే ప్రమాదం ఉంది' అనే నోటీసు వారి కళ్ళముందు మెరిసింది.
అది చూసిన వరుణ్ కళ్ళలో ఒక రకమైన విచారం ఉన్నా, అది అతని భయం ముందు ఓడిపోయింది. "క్షమించు అద్వైత్.. మా స్కోర్లు ఇప్పుడు క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాయి. వచ్చే వారం మా ఫ్యామిలీ పుణ్య-ట్రిప్ కి వెళ్లాలి. ఇప్పుడు నీతో మాట్లాడి పాయింట్లు పోగొట్టుకోలేను." అంటూ తల దించుకుని త్వరత్వరగా అక్కడినుండి వెళ్ళిపోయారు.
వాళ్ళను పలకరించడానికి పైకెత్తిన అద్వైత్ చేతులు గాలిలో అలాగే ఉండిపోయాయి. మనుషుల మధ్య ఇలాంటి గోడలు కట్టిన ఈ Dharma-X బైనరీ కోడ్‌ను చూసి అతనిలో ఆక్రోశం సుడులు తిరిగింది. ఇక్కడ బంధాలు ప్రేమాభిమానాల మీద కావు, డేటా సింక్ అయ్యే రిస్క్ మీద ఆధారపడి ఉన్నాయి. ఒక మనిషిని తాకడం అంటే అతని పాయింట్స్ తో పాటూ, అతని పాపాన్ని కూడా షేర్ చేసుకోవడమే అనే భయంలో ఈ లోకం బతుకుతోంది.
అలాగే ముందుకు నడుస్తూ అలసిపోయిన అద్వైత్ ఒక డిజిటల్ రేషన్ షాప్ దగ్గర ఆగాడు. అతని లోపలి ఆకలి అతన్ని దహించి వేస్తుండటంతో, ఏదైనా తినడానికి అతను తన మణికట్టును వెండింగ్ మెషిన్ సెన్సార్ దగ్గర ఉంచాడు.
అద్వైత్ అలా తన మణికట్టును మెషిన్ దగ్గర పెట్టగానే, మెషిన్ నుండి బీప్ అని శబ్దం వచ్చింది. ఆ మెషిన్ స్క్రీన్ పై ఇలా ప్రత్యక్షమైంది: "కర్మ స్కోర్: 45%. అర్హత: గ్రేడ్-సి న్యూట్రియంట్ జెల్."
ఆ మెషిన్ లోనుండి ఒక ప్లాస్టిక్ ప్యాకెట్‌లో రంగులేని, రుచిలేని ఒక జిగట పదార్థం బయటకు వచ్చింది. అద్వైత్ దాని వైపు చూస్తుండగానే, పక్కనే ఉన్న మరో మెషిన్ దగ్గర 90% స్కోర్ ఉన్న ఒక వ్యక్తి తన మణికట్టును స్కాన్ చేశాడు. అతనికి సువాసనలు వెదజల్లే వేడి వేడి బిర్యానీ, పక్కనే మలాయ్ లస్సీ డిస్పెన్స్ అయ్యాయి. ఆ వ్యక్తి అద్వైత్ వైపు ఒక రకమైన హేళనగా చూస్తూ, "కర్మ అద్వైత్.. అంతా కర్మ!" అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
అది చూసిన అద్వైత్, "చీ.. నా కడుపు ఆకలిని కూడా ఈ అల్గారితమే నిర్ణయిస్తుందా?" అని పళ్ళు నూరాడు. చేతిలోని ఆ జెల్ ప్యాకెట్‌ను చూస్తుంటే అతనికి వాంతి వచ్చినంత పనైంది. రివార్డ్ పాయింట్లు లేకపోతే కనీసం రుచికరమైన ఆహారానికి కూడా మనిషి అనర్హుడే అని అనుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు.
అలా అక్కడి నుండి వెళ్లిపోయాక, చీకటి పడ్డాక అద్వైత్ తన చిన్న గదికి చేరుకోగానే, ఆ గది అతనికి ఒక జైలు గదిలా అనిపించింది. అతను తలుపు గడియ పెట్టి, మెల్లగా తన బెడ్ కింద ఉన్న ఒక రహస్య అరను తెరిచాడు. అందులో ధూళి పట్టిన కొన్ని పురాతన కాగితపు పుస్తకాలు ఉన్నాయి. ఈ డిజిటల్ యుగంలో ఫిజికల్ బుక్స్ చదవడం అంటే డేటా వేస్ట్ మరియు పర్యావరణ ద్రోహం కిందకు వస్తుంది. ఎందుకంటే ఆ జ్ఞానం ధర్మ-X సర్వర్లలో ఒక పాత పాడుబడ్డ అలవాటు.
అందులోనుండి అతను తన వ్యక్తిగత డైరీని బయటకు తీసి, వణుకుతున్న చేతులతో, పాతకాలపు పెన్నుతో ఒక వాక్యం రాశాడు: "కోడ్ లో లేకపోతే.. ప్రాణానికి కూడా విలువ ఉండదు."
అలా అతను ఆ వాక్యాన్ని రాస్తుండగా, గది మూలన ఉన్న ధర్మ-X సర్వైలెన్స్ లెన్స్ మెల్లగా అతని వైపు జూమ్ అయింది. అతని కళ్ళలో తిరుగుతున్న కన్నీరు, అతని గుండె చప్పుడులో ఉన్న వేదనను అది స్కాన్ చేస్తోంది.
కానీ ధర్మ-X మెయిన్ ఫ్రేమ్ సర్వర్‌లో అద్వైత్ రిపోర్ట్ ఇలా అప్డేట్ అయింది: "సబ్జెక్ట్ అద్వైత్: అధిక స్థాయి స్టాటిక్ నాయిస్ గుర్తించబడింది. హృదయ స్పందన రేటు సక్రమంగా లేదు కానీ నిర్దిష్ట కర్మ-డేటా కనుగొనబడలేదు. స్థితి: నేపథ్య అంతరాయం. విస్మరించండి.”
మనిషి ఆత్మఘోషను ఆ అల్గారిథమ్ కేవలం స్టాటిక్ నాయిస్ లాగా చూస్తోంది. దానికి భావోద్వేగాలు అంటే ఏమిటో కూడా తెలియదు, దానికి తెలిసింది కేవలం బైనరీ లాజిక్ మాత్రమే. అద్వైత్ అనుభవిస్తున్న ఈ నరకం ఆ సిస్టమ్ దృష్టిలో ఒక క్యాలిక్యులేషన్ ఎర్రర్ మాత్రమే.
అలాంటి ఆలోచనల్లోనే అర్ధరాత్రి అవ్వగా, అద్వైత్ లో అస్తిత్వ సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకుంది. తానొక శూన్యం అని ఒకవైపు సమాజం ముద్ర వేయగా, ఇంకోవైపు తానొక నాయిస్ అని సిస్టమ్ అంటోంది.
"అసలు నేను ఎందుకు ఇంకా బతికి ఉండాలి? ఈ బైనరీ బానిసత్వం కంటే చావు మేలు కదా!" అని అతను విలపించాడు. అతని మణికట్టుపై ఉన్న చిప్ మళ్ళీ గీకడం మొదలుపెట్టగా, అది ఇప్పుడు ఎర్రగా కందిపోయి, రక్తం చిందించినట్టుగా కనబడుతుంది.
ఆవేశంలో అతను పక్కనే ఉన్న ఒక గాజు గ్లాసును నేలకేసి కొట్టి, పగిలిన గాజు ముక్కల్లో ఒక పదునైన ముక్కను చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్లు ఆ మణికట్టులోని చిప్ వైపు చూస్తూ, ఆ చిప్ లేకపోతే ధర్మ-X తనను ట్రాక్ చేయలేదు, ఆ చిప్పే లేకపోతే తను ఒక స్వేచ్ఛా జీవిగా కనీసం ప్రాణాలు వదలవచ్చు కదా అని అనుకున్నాడు.
అలా అనుకుంటూ అతను ఆ గాజు ముక్కను తన మణికట్టు దగ్గరకు తీసుకెళ్లాడు. ఒకవైపు అతని చేతులు భయంతో వణుకుతుండగా, అతని మనసులో మాత్రం ఒక భయంకరమైన నిశ్చయముంది. సరిగ్గా అతను ఆ చిప్ ను కోయబోతుండగా…
ఒక్కసారిగా గదిలోని హోలోగ్రాఫిక్ గోడపై ఉన్న నీలి కాంతి అంతా మాయమైపోయింది. దానికి బదులుగా, ముదురు పచ్చ రంగులో కోడ్ అక్షరాలు గాలిలో మెరవడం మొదలయ్యాయి. ఆ అక్షరాలు స్క్రీన్ మీద కాకుండా, అద్వైత్ కళ్ళముందు గాలిలో తేలుతూ వస్తున్నాయి.
అందులో ఉన్న సందేశం చూసి అద్వైత్ శ్వాస ఆగిపోయినంత పనైంది.
“నువ్వు కేవలం ఒక అంకెలా మిగిలిపోవడానికి అలసిపోయావా? ఈ శూన్యం నిన్ను పిలుస్తోంది, అద్వైత్.”
అది చూడగానే అద్వైత్ చేతిలోని గాజు ముక్క కింద పడిపోయింది. అతను ఆశ్చర్యంతో, భయంతో కిటికీ వైపు చూడగా, బయట న్యూ అమరావతి చీకటిలో, ఒక నల్లటి నీడ మెరుపు వేగంతో అక్కడినుండి మాయమవ్వడం అతను గమనించాడు.
ధర్మ-X కంటికి కనపడని ఏదైనా శక్తి తన కోసం వేచి చూస్తుందా అని అద్వైత్‌కు అనుమానం మొదలైంది. అది మోక్షమా లేక మరో మాయాజాలమా?