Part - 6
చిక్కుముడి (A Difficult puzzle)
హాల్ ప్రక్కన ఉన్న గదిలోంచి వచ్చిన చప్పుడు విని
లక్ష్మీ (అర్జున్ తల్లి) : ఇంతకి ఆ గదిలో ఉన్న దాని సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నారు?
అని లక్ష్మి కొంచెం కోపంగా అడుగుతుంది. అది విని భవ్య, అర్జున్లిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
కృష్ణమూర్తి (అర్జున్ తల్లి) : లక్ష్మీ... నెమ్మదిగా మాట్లాడు. ఆ అమ్మాయి వింటుంది.
లక్ష్మీ : ఎంతకాలం ఇలా దాచిపెడతాం? పోలీసులు ఇక్కడికి వస్తే?
అర్జున్ : అమ్మ... తనకి ఇంకా పూర్తిగా స్పృహ రాలేదు. డాక్టర్ కూడా ఒత్తిడి పెట్టొద్దన్నాడు కదా...
భవ్య : ఆంటి... నేను చూసి వస్తాను.
భవ్య నెమ్మదిగా ఆ గది తలుపు తెరిచింది. లోపల మంచంపై ఒక స్త్రీ పడుకొని ఉంది. మత్తులొ ఆమె చెయ్యి మంచం ప్రక్కన స్టూల్ మీద ఉంచిన మంచి నీళ్ళ సీసాకి తగిలి క్రింద పడింది.
భవ్య వెళ్ళి క్రింద పడిన ఆ మంచినీళ్ళ సీసాని తీసి స్టూల్ మాద పెడుతుంది. మళ్ళి తన చెయ్యి తగలకుండా స్టూల్ కొంచెం ప్రక్కకి జరుపుతుంది.
ఆ మంచంపై పొడుకున్న ఆమె ముఖంపై ఇంకా గాయాల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతులపై కట్టిన బ్యాండేజీలు, మెడపై గోకిన గుర్తులు, కళ్లల్లో ఇంకా చెదరని భయం...
ఆమె పేరు సరోజ. వయసు 33 సంవత్సరాలు. ఇంకా పెళ్ళికాలేదు.
బొబ్బిలిలోని మీరా తల్లిదండ్రులు ఇంటి పక్కనే తన ఇల్లు కూడా ఉంది..
సరోజ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తనకంటు ఉన్నది తన చెల్లి సుమిత్ర ఒక్కర్తె తనకి సరోజకి 7 ఏళ్ళ వయసు తేడా. చెల్లెలి కోసం పెళ్ళి కూడా చేసుకోకుండా కష్టపడి పని చేసి తనని ఇంజినేరింగ్ వరకు చదివించింది. రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి కూడా చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరు బెంగుళూరులొ ఉంటున్నారు.
అప్పట్నించి ఆ ఇంట్లో సరోజ ఒక్కర్తె ఉంటుంది. పెళ్ళి చేసుకోమని తన చెల్లి సుమిత్ర ఎంత చెప్పిన పట్టించుకునేది కాదు. తనకి పిల్లలు పుట్టాక అప్పుడు చేసుకుంటాలె అని సుమిత్రకి చెప్పేది.
మీరా చిన్నప్పటి నుంచే సరోజకు తెలుసు. కొన్ని కారణాల వల్ల మీరా కుంటుంబం తన చిన్నతనంలోనె విశాఖపట్నానికి మారిపోయారు. అప్పటి నుంచి బొబ్బిలిలొ ఉన్న వాళ్ళ ఇంటిని సరోజె చూసుకునేది. బయట వాళ్ళకి ఆ ఇంటిని అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బులు వీళ్ళకి పంపించేది. మీరా పెళ్లికి కూడా సరోజ వెళ్లింది.
ఒకసారి సరోజ తన చెల్లెలి సుమిత్ర భర్తకు ఉద్యోగం కోసమని అర్జున్ ని అడగమని మీరాని కోరింది....
ఆ ముక్క మీరా అర్జున్ కి చెప్పి తన చేత ఫోన్లొ మాట్లాడించింది.
సరోజ : నమస్తె అర్జున్ గారు..
అర్జున్ : నమస్తె. మీరా నాకంతా చెప్పింది. ఏం ఫరవాలేదు. మీ మరిది గారిని నాకొకసారి కాల్ చేయమని చెప్పండి. నేను చూసుకుంటాను.
సరోజ : సరేనండి. తనకి చెప్తాను.
అర్జున్ : సరె ఉంటానండి..
సరోజ : చాలా ఠాంక్స్ అండి.... మీ మేలు నేను ఎప్పటికి మర్చిపోలేను...
అర్జున్ : అయ్యొ అంత పెద్ద మాటలెందుకు లెండి. మీరు మీరా వాళ్ళకి కావలసిన వ్యక్తి అంటె నా కూడా కావలసిన వాళ్ళెగా...
సరోజ : సరేనండి ఉంటాను...
అని చెప్పి కాల్ కట్ చేసింది.
అన్న మాట ప్రకారం అర్జున్ బెంగళూరులోని తమ కంపెనీ బ్రాంచ్‌లో అతనిని రికమెండ్ చేస్తాడు. తనె దగ్గరుండి అతనిని ఇంటర్వ్యూ చేసి బెంగుళూరులొ ఉద్యోగం వచ్చేలా సహాయం చేశాడు.
ఆ రోజు నుంచి సరోజ మనసులో అర్జున్ మీద గౌరవం ఏర్పడింది.
వారం రోజులు క్రితం మీరా తల్లిదండ్రులు చనిపోయిన రోజు...
పోలీసులు సమాచారం ఇవ్వగానే...
అర్జున్, అతని తల్లిదండ్రులు, సమీర, భవ్య అందరూ బొబ్బిలికి బయలుదేరారు.
పోలీసులు పంచనామ పూర్తి చేసిన తర్వాత...
మీరా తల్లిదండ్రుల మృతదేహాలను అర్జున్‌కు అప్పగించారు.
ఎందుకంటే...
చట్టపరంగా వారికి చివరి సంస్కారాలు చేసే హక్కు ఇప్పుడు అల్లుడైన అర్జున్‌కే ఉంది.
ఆ రోజు సాయంత్రం మీరా తల్లిదండ్రుల అంత్యక్రియలు ముగిసిన తరువాత...
అర్జున్, భవ్య, కృష్ణమూర్తి, లక్ష్మీ మరియు సమీర చివరిసారిగా మీరా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు.
ఇంటి వెనుక వైపు నుండి స్వల్పంగా ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించింది.
భవ్య : అర్జున్... అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు...
అని భవ్య చెప్పడంతో...
అందరూ టార్చ్‌లైట్లు వేసుకుంటూ వెనుకకు వెళ్లారు.
అక్కడ...
ఒక యువతి అపస్మారక స్థితిలో నేలపై పడివుంది.
బట్టలు చిరిగిపోయాయి.
శరీరమంతా గాయాలు.
అర్జున్ ఆమెను జాగ్రత్తగా తిప్పాడు. ఆమె ముఖం మొత్తం దుమ్ము, రక్తంతో నిండిపోయింది.
మొదట ఎవరూ గుర్తుపట్టలేదు.
అర్జున్ కొంచె జాగ్రత్తగా చూసి...
అర్జున్ : అరె.... ఈమె సరోజ కదా?"
అన్నాడు.
భవ్య : ఈవిడ నీకు ముందె తెలుసా...?
అర్జున్ : తెలుసు ఈ ప్రక్కింట్లోనె ఉంటుంది. ఎవరు ఇలా తనని కొట్టి పడేశారొ...?
కృష్ణమూర్తి : సరోజ ఎవరురా...?
అర్జున్ : అదె నాన్న మీరా తల్లిదండ్రుల ఇంటి ప్రక్కన ఉంటుది. ఒకసారి మా పెళ్ళి వచ్చింది.
కృష్ణమూర్తికి ఇంకా గుర్తురాలేదు.
అర్జున్ : అదె నాన్న తన చెల్లెలి భర్త ఉద్యోగం కోసం మీరా ద్వారా ఒకసారి నన్ను అడిగిందని చెప్పాను కదా....?
కృష్ణమూర్తి : ఆఆ గుర్తొచ్చింది రా... సరోజ కదు... ఇలా అయిపోయిందేమిటి...?
భవ్య : ఆలస్యం చేయకుండా తనని హాస్పెటల్ కి తీసుకెళదాం పదండి.
అందరూ కలిసి ఆమెను బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కొన్ని గంటల తర్వాత...
డాక్టర్ చికిత్స చేసి బయటకు వచ్చాడు.
డాక్టర్ : ప్రాణాపాయం లేదు గానీ ఎవరొ ఆమెని తీవ్రంగా హింసించినట్లు కనిపిస్తోంది. ఒంటి నిండా గాయాలె.. కాసేపటిలొ స్పృహ వస్తుంది.
అంతలో...
లోపల నుంచి ఒక్కసారిగా అరుపు వినిపించింది.
అందరూ పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లారు.
సరోజ కళ్లు తెరిచి...
భయంతో వణికిపోతూ...
"నన్ను కొట్టద్దు..."
"దయచేసి నన్ను వదిలేయండి..."
"నాకు ఏమీ తెలియదు..."
అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. డాక్టర్ వెంటనే ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు.
కొద్ది సేపటికే సరోజ మళ్లీ నిద్రలోకి జారుకుంది.
డాక్టర్ బయటకు వచ్చి...
డాక్టర్ : చూస్తుంటె మానిసికంగా ఆమె చాలా భయాందోళనకు గురయినట్టుంది. ఇది తీవ్రమైన మానసిక దెబ్బ. మీరు వెంటనె ఆమెను ఎవరైన సైక్యాట్రిస్టుకి చూపించడం మంచిది.
అక్కడే నిలబడి ఉన్న భవ్య నెమ్మదిగా అర్జున్ వైపు చూసింది.
భవ్య : మీరా తల్లిదండ్రుల మరణం గురించి ఈ అమ్మాయికి ఏదో తెలుసుండచ్చు
అని మెల్లగా చెప్పింది.
అర్జున్ కూడా మౌనంగా తల ఊపాడు.
ఆ రాత్రే...
సరోజను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్టణానికి తీసుకొచ్చారు. ఇప్పుడు అర్జున్ ఇంట్లోనె తనని ఉంచి రహస్యంగా చికిత్స చేయిస్తున్నారు."
కాసేపటికి సరోజ కళ్ళు తెరిచింది గాని ఎవరిని గుర్తుపట్టె స్థితిలొ లేదు.
కళ్ళు తెరిచిన సరోజ ఒక్కసారిగా భవ్యను చూసి వణికిపోతూ...
"వద్దు... నన్ను కొట్టకండి... నాకు ఏమీ తెలియదు..."
అంటూ ఏడవడం మొదలుపెట్టింది.
భవ్య వెంటనే ఆమె చేతిని పట్టుకుని...
భవ్య : భయపడకు... నువ్వు సేఫ్‌గా ఉన్నావు.
అని ధైర్యం చెప్పింది.
కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి పరీక్షించాడు.
డాక్టర్ : శారీరక గాయాల కంటే మానసిక దెబ్బ ఎక్కువగా ఉంది. కొద్ది రోజులు ప్రశాంతంగా ఉంచండి. బలవంతంగా ఏమీ అడగకండి. తనకు గుర్తొచ్చినప్పుడు తనే చెబుతుంది.
డాక్టర్ వెళ్లిపోయాడు.
అదే సమయంలో...
విశాఖపట్టణం...
DCP సంతోష్ తన ఆఫీసులో ఒంటరిగా కూర్చుని ASI వెంకట్ తీసుకొచ్చిన మూడు మొబైల్ ఫోన్లను చూస్తున్నాడు.
అందులో రెండు ఫోన్లు మీరా తల్లిదండ్రులవని ఇప్పటికే నిర్ధారణ అయింది.
మూడో ఫోన్ మాత్రం ఎవరిదో తెలియడం లేదు.
సంతోష్ ఆ ఫోన్ IMEI నంబర్‌ను నోట్ చేసుకుని...
డీ.సీ.పి సంతోష్ : ముందు ఈ ఫోన్ ఎవరిదో తెలుసుకోవాలి
అని ఆలోచిస్తుండగా. అప్పుడే తలుపు తట్టిన శబ్దం.
C.I. సురేష్ : మే.. ఐ.. కమ్.. ఇన్ ... సర్..?
ఏ.సీ.పి సంతోష్ : కమ్....
సీ. ఐ సురేష్ : సర్ మీరా అర్జున్ల అపార్ట్మెంట్ సీ.సీ.టీ.వి ఫూటేజస్ మొత్తం పరిశీలించాం..
ఏ.సీ.పి సంతోష్ : ఏమైనా దొరికిందా?
సీ.ఐ సురేష్ : అవును సర్. వింతగా ఒక విషయం కనిపించింది.
అని చెప్పి సంతోష్ వాట్సాప్ కి ఆ ఫూటేజ్ క్లిప్పింగ్స్ పంపించాడు.
సంతోష్ వెంటనే స్క్రీన్ వైపు చూశాడు.
సీ.ఐ సురేష్ : మీరా చనిపోయిందని పోలీసులు చెప్పిన నాలుగు రోజుల ముందు వరకు అన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ... ఆ తర్వాత నాలుగు రోజుల పాటు...ఆ ఫ్లాట్ తలుపు ఒక్కసారి కూడా తెరుచుకోలేదు.
సంతోష్ కనుబొమ్మలు ముడిచాడు.
ఏ.సీ.పి సంతోష్ : ఎవరూ లోపలికి వెళ్ళడం గాని... బయటకు రావడం గాని చేయలేదా..?
సీ.ఐ సురేష్ : లేదు సార్.
ఏ.సీ.పి సంతోష్ : అయితే మీరా మొబైల్ లొ ఆ వీడియో జనవరి 06 మధ్యాహ్నం 3:30కి ఎలా రికార్డ్ అయింది?
గదిలో నిశ్శబ్దం నెలకొంది.
సంతోష్ మెల్లగా కుర్చీలో వెనక్కి ఆనుకుని...
ఏ.సీ.పి సంతోష్ : మనకు కనిపిస్తున్న దానికంటే... ఈ కేసులో కనిపించని విషయాలే ఎక్కువ ఉన్నాయి...
అని ఆలొచిస్తూ సీ.ఐ సురేష్ పంపించిన క్లిప్పింగ్స్ మాత్రమె కాకుండా. ఈసారి మొత్తం సీ.సీ.టీ.వి ఫూటేజ్ లన్నీ చూస్తాడు. అపార్ట్మెంట్స్ ఫూటేజీలె కాకుండా ఆ ఆపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న షాపుల ఫూటేజీలు కూడా చూస్తాడు.
సడన్ గా ఒక వీడియొ దగ్గర ఆగుతాడు. అది ఆ అపార్ట్మెంట్ కి కొంచెం దూరంలొ ఉన్న ఒక కరెంట్ స్తంభం దగ్గరున్న వీడియొ ఫూటేజ్.
ఆ వీడియొలొ ఒక ఎరుపు రంగు ఆల్టొ 800 కార్ ఒకటి దాదాపు 5 గంటల వరకు అక్కడె ఉండి. తెల్లవార్జామున 4:30 కి వెళ్ళిపోతుంది.
సంతోష్ ఆ వీడియోలో ఉన్న కారు నంబర్‌ను జూమ్ చేసి చూడడానికి ప్రయత్నించాడు. కానీ వీడియో నాణ్యత తక్కువగా ఉండడంతో పూర్తి నంబర్ కనిపించలేదు. మొదటి సగం నంబర్ మాత్రమే స్పష్టంగా కనిపించింది.
ఆ మొదటి సగం నంబర్లొ 'MH' అని ఉండడం చూసి అది మహారాష్ట్రాకు చెందినదని తెలుసుకుంటాడు.
అదే సమయంలో...
బొబ్బిలిలో జరిగిన ఘటన గుర్తు చేసుకుంటూ...
సరోజ ఒక్కసారిగా నిద్రలో కేక వేసింది.
"మీరా...! వద్దు... వాళ్లు వస్తున్నారు...!"
అని అరుస్తూ లేచింది.
ఆమె మాటలు విన్న భవ్య వెంటనే ఆమె దగ్గరకు పరుగెత్తింది.
ఆ ఒక్క పేరు...
"మీరా..."
భవ్య గుండెల్లో కొత్త అనుమానానికి నాంది పలికింది.