Those three - 38 books and stories free download online pdf in Telugu

ఆ ముగ్గురు - 38

అన్వర్ ది హిట్ అండ్ రన్ కేసన్న నిశ్చయానికి వచ్చాక నగరం పరిధి లోని అన్ని స్టేషన్ లకు పంపబడింది. అన్వర్ కు
ఆక్సిడెంట్ అయిన రాత్రి నాటకీయంగా అయిదు హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి.వెంటనే ఆ స్టేషన్ లకు సెర్చ్ టీమ్స్ వెళ్ళాయి. అప్పుడు సమయం అయిదు గంటలు.
ఆక్సిడెంట్ జరిగిన రాత్రి ఆదిత్య ఆ స్పాటుకు దగ్గర్లో ఉన్న
ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు అంబులెన్స్ పంపమని మెసేజ్ పంపాడు. కేస్ క్రిటికల్ అని తెలిసిన హాస్పిటల్ అథారిటీస్
కావలసిన ఎక్విప్మెంట్ తో డాక్టర్ ను పంపారు. డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లీడింగ్ కంట్రోల్ చేసి నిమిషాల్లో హాస్పిటల్ కు
పేషెంట్ ను పంపాడు.
" హిట్ అండ్ రన్ మెడికో లీగల్ కేసు. మీరు పూర్తి బాధ్యత తీసుకుని హామీ ఇస్తేనే మేము కేస్ అటెండ్ అవుతాం. " డాక్టర్ కండిషన్. వెంటనే ఒప్పుకున్నాడు ఆదిత్య. ముందు జాగ్రత్త గా తమ సేఫ్టీ కోసం హాస్పిటల్ అథారిటీస్ ఆదిత్య ID కార్డ్ వివరాలు ఆధార్ నంబర్ నోట్ చేసుకున్నారు. ఇవ్వక తప్పింది కాదు.
సాధ్యమైనంత వరకు ఇంతియాజ్ డేగ కళ్ళల్లో పడకుండా
అన్వర్ ఉనికి ని దాచాలని ఆదిత్య ఆరాటం. కానీ అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు.
తమ వంతు బాధ్యతగా హాస్పిటల్ వాళ్ళు తమ పరిధి లో ఉన్న పోలీసు స్టేషన్ కు కేసు వివరాలు తెలియ చేశారు. పది నిముషాల్లో నైట్ పెట్రోలింగ్ టీం హాస్పిటల్ లో వాలిపోయింది. కేస్ రిజిస్టర్ అయింది. ఆ సమయంలో ఆదిత్య హాస్పిటల్ లో లేడు. మెహర్ కోసం ఆమె ఇంటికి వెళ్లాడు. కేస్ రిజిస్టర్ అయినట్లు అతడికి తెలీదు.
ఎనిమిది గంటల ఇరవై నిమిషాల కు అన్వర్ డిశ్చార్జ్ అయ్యాడు. అతడిని ఆదిత్య, సర్దార్జీ సమతా సదన్ కు తీసుకు రాలేదు. సిటీ లోనే సర్దార్జీ చెల్లెలు ఉంది. ఆమె ఇంటి మేడ మీద బస ఏర్పాటు చేశారు. అన్వర్ బాధ్యత పూర్తిగా సర్దార్జీ తీసుకున్నాడు
నైట్ పెట్రోలింగ్ పోలీస్ నేరుగా హాస్పిటల్ వెళ్ళి అన్వర్ వివరాలు సేకరించారు. కనుక అతడిని సెర్చ్ టీం వెంటనే ట్రేస్ అవుట్ చేయగలిగారు. కానీ అన్వర్ డిశ్చార్జ్ అయిన విషయం తెలిసి అవాక్కయారు.
విహారి చెప్పిన కబురు విని ఇంతియాజ్ ఉలిక్కిపడ్డాడు. తల తిరిగింది. అన్వర్ ఆదిత్య రక్షణ లో ఉన్నాడు అన్న నిజం ఆ ఏ.సీ.పీ జీర్ణించుకోలేక పోయాడు. ఎవరూ కనీసం ఊహించలేని సంఘటన ఎలా జరిగింది. ? అతడి బుర్ర కు అందని పజిల్. వెంటనే ఆదిత్య పర్సనల్ నెంబరు కు కాల్ చేశాడు. అతడు రెస్పాండ్ అవుతాడో లేదో టెన్షన్.

" ఆదిత్యా "
" హలో ఇంతియాజ్ " ఈ కాల్ ఆదిత్య ఊహించినదే.
తనూ ఇందు కోసమే చూస్తున్నాడు.
" ఎందుకిలా చేశావ్ ?"
అవతల నుండి జవాబు రాలేదు.
" అన్వర్ ఉగ్రవాది అని తెలిసి ఎందుకు దాచావ్ ? మెహర్
మెహర్బానీ కోసమా ?
చివరి మాటతో ఆదిత్య కు కోపం వచ్చింది.
" ఒకరి మెహర్బానీ కోసం, మెప్పు కోసం నేనీ పని చేయలేదు
అతడి లో మార్పు రావాలని మీ నుండి కొద్ది సేపు...... కొద్ది సేపే దూరం గా ఉంచాలను కున్నాను."
పెద్దగా నవ్వాడు ఇంతియాజ్.
" ఒక కరుడు గట్టిన ఉగ్రవాదిని కొన్ని గంటల్లో ఉత్తముడిగా
మార్చగలిగిన మ్యాజిక్ ఏమైనా ఉందా నీ దగ్గర. అలాంటి దేదైనా ఉంటే చెప్పు. నేనూ ప్రయోగించి మి లిటెంట్లను
మహాత్ములు గా మార్చేస్తాను. "
" సింపుల్ క్లారిటీ ..... అన్వర్ కరుడు గట్టిన ఉగ్రవాది కాడు.
మతోన్మాదీ కాడు. తెలిసీ తెలియని వయసులో తీసుకున్న
తొందరపాటు నిర్ణయం తర్వాత అతడు ఎదుర్కొన్న పరిస్థితులు ఉగ్రవాది ని చేశాయి."

"సో"...... ఆ ఒక్క ఆంగ్ల పదంలో తన కోపాన్ని, అసహనాన్ని
వ్యక్తం చేశాడు ఇంతియాజ్.
"సో .... అన్వర్ లో మార్పు రావడానికి అవకాశం ఉంది."
" నువ్వన్నట్లు గంటల్లో అది జరగదు. నీది ఒట్టి భ్రమ.
బాధ్యత గల అధికారిగా చెబుతున్నాను.వెంటనే అతడిని సరెండర్ చేయండి. డోంట్ ఇన్వైట్ ట్రబుల్ " హెచ్చరిక చేశాడు.
" ఒక పోలీసులా కాకుండా మనిషిలా ఆలోచించు ఇంతియాజ్. మార్పు అనేది మనిషి లో పుట్టే చైతన్యం.... పరివర్తన. అందుకు ఒక సంఘటన చాలు. ఒక విస్ఫోటనం లాంటి క్షణం మనిషిని తలక్రిందులు చేయగలదు."
" చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నావ్ ఆదిత్యా ! అన్వర్ ఒక్క రాత్రి లో బోధిసత్వుడో, గౌతమ
అవుతాడంటే నమ్మమంటావా ?"
" నమ్మవద్దు. కానీ అతడిలో మార్పు ఇప్పటిది కాదు. అందుకు కారణం సమతాసదన్ . ఆ నాలుగు వాటాల్లో ఉంటున్న కలిసి మెలిసి ఉంటున్న సగటు మనుషులు అభిమానులు అతడిని కదిలించింది. తనేం పోగొట్టుకున్నాడో అతడికి అర్థమైంది. ఓ మంచి కుటుంబాన్ని
తన వాళ్ళ ప్రేమ ను. ఇందుకే అమ్మను చెల్లెల్ని చూడాలని ఆరాటపడిపోయాడు. ఆ ప్రయత్నం లో ఉన్నప్పుడే ప్రమాదం జరిగింది. రోడ్డు మీద అర్థ రాత్రి దిక్కు లేకుండా పొడి ఉన్న తనను ఎవరో దారినపోయే దానయ్య ఆస్పత్రిలో చేర్చటం, డబ్బు ఖర్చు పెట్టి శ్రద్ధ గా చూసుకోవటం క్లైమాక్స్. ఇప్పుడు చెప్పు అతడిలో మార్పు రాదా ?"
ఈ సుదీర్ఘ కధనం తో ఇంతియాజ్ కొంత శాంతించాడు.
" ఓకే. నువ్వన్నట్లు అన్వర్ లో మార్పు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తను అమ్మను చూడాలనుకోవటం సహజమే. మరి అందుకు మేము అభ్యంతరం చెబుతామని నీకెందుకనిపించింది ? తనను అరెస్టు చేసిన తర్వాత అమ్మ ను చూసే అవకాశం కల్పించారు ? కాదంటామా ? అతడికి బేడీలు వేసి ఆమె ముందు నిలబెడతామా ? మంచి మార్పు కోరుకునే వ్యక్తి ని చట్టం తప్పక ప్రోత్సహిస్తుంది."
" ఇలాంటి హామీ ఇస్తానని ముందే తెలిసుంటే ఇంత సాహసం చేసి ఉండేవాడిని కాను. కాస్త టెన్షన్ పడ్డాను. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం అన్వర్ తల్లి ఆరోగ్య పరిస్థితి. ఆమె ఆరోగ్యం ఏమంత బాగాలేదు. కొడుకు ను చూచిన ఆనందం కన్నా అతడు నేరస్తుడన్న నిజం ఆమెను బాధించవచ్చు. ఆ పరిస్థితి రాకూడదని ఈ సాహసం చేశాను '"
" ఓకే ... ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్ ?"
" ఇంట్లో మాత్రం లేను ." నవ్వాడు ఆదిత్య
" తెలుసు. అందుకే అడుగు తున్నా ను.'"
తను ఎక్కడ ఉన్నాడో చెప్పాడు ఆదిత్య.
" ప్లీజ్ ఇంతియాజ్ ! నేను కాల్ చేసేంతవరకు నీ సిబ్బంది తో నీవు రంగప్రవేశం చేయకు. అన్వర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. హి ఈజ్ టోటలీ బెడ్ రిడన్. సమతా సదన్ ఓనర్. రిటైర్డ్ మేజర్ సర్దార్జీ కేర్ అండ్ కంట్రోల్ లో ఉన్నాడు. "
" ఓకే. బట్ ఐ విల్ వెయిట్ ఫార్ యువర్ అర్లీయస్ట్ కాల్. Things should not take a serious turn. హెడ్ క్వార్టర్స్ కు తెలిసిందంటే పెద్ద ఇష్యూ అవుతుంది.
*************************************************
కొనసాగించండి 39