Andhala Rakshasi books and stories free download online pdf in Telugu

అందాల రాక్షసి

సమయం ఉదయం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు...

నేను నిద్ర మేల్కొని, బెడ్ దిగి, బాల్కనీ వైపు నడిచాను...

శీతాకాలం కావడంతో వణుకు పుట్టిస్తుంది వాతావరణం... చేతులు కట్టుకొని చుట్టూ చూస్తూ వున్నాను...

అంతలో రూంలో అలారం క్లాక్ మోగుతుంది.. నా పెదవుల మీద సన్నని చిరునవ్వు... ఇది రోజూ జరిగేదే...

నాలుగు గంటలకు అలారం మోగడానికి కొన్ని నిమిషాల ముందే నేను మేల్కొంటాను... ప్రతీ రోజూ నేను నా క్లాక్ ని ఓడిస్తాను... ఎందుకో ఇందులో నాకు ఆనందం వుంది... కాలం నా చేతిలో ఓడిపోతుంది అనిపిస్తుంది... ఇలా గెలుపుతో నా రోజు మొదలవుతుంది...

అలారం క్లాక్ గొంతు నొక్కి, యోగా చేస్తాను వన్ అవర్ పాటు... తరువాత నా పర్సనల్ వర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని సరిగ్గా సెవెన్ కల్లా నేను నా రూంలో నుంచి బయటకు వస్తాను...

నేను బయటకు రావడంతోనే సర్వెంట్స్ అందరూ ఎలర్ట్ అవుతారు... అందరూ భయపడతారు నాకు... ఎదుటి మనిషి నా ముందు భయంతో తల వంచితే నాకు చాలా ఇష్టం...

నా ఇంట్లో నేను మాత్రమే వుంటాను ఒంటరిగా...

అవును... ఒంటరిగానే వుంటాను...

నా తల్లి ఒక మోడల్... తండ్రి సినీ యాక్టర్...
ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు... కానీ లవ్ చేసుకోలేదు... అవును... వీళ్ళు ఒకరికొకరు ఎట్రాక్ట్ అయ్యారు...
లివింగ్ రిలేషన్ షిప్ స్టార్ట్ చేసారు...

ఆ అట్రాక్షన్ ఫలితం! నేను నా తల్లి కడుపులో పడ్డాను... వెంటనే ఇద్దరూ వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకున్నారు...

అప్పుడే మొదలైంది...

పెళ్ళి తరువాత తన స్వేచ్ఛకు అత్తింటి వాళ్ళు సంకెళ్ళు వేశారు... వాళ్ళతో నా తండ్రి కూడా వంత పాడాడు అమ్మ మోడలింగ్ చెయ్యడం ఇష్టంలేక...

ఇంతలో నేను భూమి మీదకు ఎంట్రీ ఇచ్చాను... నన్ను చూసుకుంటూ ఇక నా తల్లి ఇంటికే పరిమితం అయిపోవలసి వచ్చింది పూర్తిగా...

నేను పుట్టిన రెండు సంవత్సరాలకు....

నా తండ్రి తన కో-యాక్టరెస్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో వున్నాడని నా తల్లికి తెలిసింది... ఇదేమిటని నిలదీస్తే, సింపుల్ గా డివోర్స్ అన్నాడు...

అప్పటికే తన కెరియర్ మీద దెబ్బ కొడుతున్న, భర్త ఇంకా అత్తింటి వాళ్ళ ప్రవర్తనకి విసిగిపోయిన నా తల్లి కూడా వెంటనే డివోర్స్ కి ఓకే చెప్పేసింది...

ఇద్దరూ డివోర్స్ తీసుకున్నారు... నన్ను పంచుకున్నారు...

సంవత్సరంలో ఆరు నెలలు నా తండ్రి దగ్గర వుంటే, ఇంకో ఆరు నెలలు తల్లి దగ్గర వుండాలి...

ఇద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు, వాళ్ళకి నచ్చినట్టు లీడ్ చెయ్యడం స్టార్ట్ చేసారు...

అమ్మ మోడలింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి, కొన్నాళ్ళకి తన కాస్ట్యూమ్ డిజైనర్ ని లవ్ చేసి, పెళ్ళి చేసుకుంది...

నాన్న కూడా తన కో-యాక్టరెస్ ని పెళ్ళి చేసుకున్నాడు...

ఇద్దరూ వాళ్ళ వాళ్ళ లైఫ్స్ లీడ్ చేసుకుంటూ నన్ను వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించారు ఇద్దరి తరపున కొంత ఆస్తి నా పేరున రాసి...

ఆరు నెలలు నా తల్లి ఫ్యామిలీ మెంబెర్స్ దగ్గర వుంటే, ఆరునెలలు నా తండ్రి ఫ్యామిలీ మెంబెర్స్ దగ్గర వుండాలి నేను...

అమ్మమ్మ ఇంట్లో అమ్మమ్మ, అత్త, మావయ్య, వాళ్ళ పిల్లలు వుండేవారు...

నానమ్మ ఇంట్లో నానమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, వుండేవారు...

అందరికీ నేను అడ్డుగానే కనిపించేదాన్ని... కానీ వాళ్ళందరూ నా ఆస్తి చూసి, ఇష్టం లేకపోయినా నన్ను విసుక్కుంటూ, తిట్టుకుంటూ చూసుకునేవారు...

ఆరునెలల్లో ఒకటి, రెండు సార్లు వచ్చి నన్ను చూసి పోతూ వుంటుంది నా తల్లి...

షూటింగ్ లేని సమయంలో ఇంట్లో వుంటే, నా రూంకి వచ్చి రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోయేవాడు నాన్న మిగిలిన ఆరు నెలల్లో...


నానమ్మ ఇంటికి అప్పుడప్పుడు అత్తయ్య, మావయ్య వచ్చేవారు కెనడా నుంచి... వాళ్ళు మాత్రమే నాకు నచ్చేవారు... ఎందుకంటే నన్ను కేవలం వాళ్ళు మాత్రమే ఇష్టంగా దగ్గరికి తీసుకునేవారు...

నా ఎనిమిది సంవత్సరాల వయసులో నానమ్మ ఇంట్లో ఆరునెలలు పూర్తి కావడంతో అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను...

అత్తయ్య పెద్ద కొడుకు సుభాష్ ఎందుకో మాటి మాటికి నన్ను టచ్ చేస్తూ, నాకు దగ్గరగా వస్తూ నన్ను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు... చిరాగ్గా అనిపించేది అతను నన్ను పట్టుకుంటే... ఒకరోజు నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు... గట్టిగా అరిచి, వాడిని నెట్టేసాను... అత్తయ్య, అమ్మమ్మ నా అరుపులు విని మా దగ్గరికి వచ్చారు...

వాళ్ళని చూసి వెంటనే సుభాష్ ఏడుపు నటిస్తూ, వాడు చేసిన పని నా మీదకు నెట్టేసాడు...

నేనే తనని హగ్ చేసుకుంటే వాడు నాకు తప్పని చెప్పినట్టు, అది విని నేను కోపంతో వాడిని తోసేసినట్టు అబద్దం చెప్పాడు...

అమ్మమ్మ, అత్తయ్య నన్ను కొట్టారు...

అప్పుడే అర్థమైంది నేనిక వాళ్ళతో కలిసుండటం సేఫ్ కాదని... మా క్లాస్ టీచర్ నాకు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కోసం ముందే చెప్పారు... నా క్లాస్ మిస్, నా ఒక్కగానొక్క ఫ్రెండ్ ప్రవీణ మదర్... సుహాసిని ఆమె పేరు...

నేను తరువాతి రోజు ఆవిడతో సుభాష్ విషయం చెప్పాను... నా తల్లికి కాల్ చేసి ఢిల్లీలో వున్న ఇంటర్నేషనల్ *****బోర్డింగ్ స్కూల్ లో నన్ను జాయిన్ చెయ్యమని, అక్కడ స్టడీస్ బాగుంటుందని స్కూల్ తరపున మాట్లాడుతున్నట్టు సలహా ఇచ్చింది...

నా కోసం అస్సలు పట్టించుకోని నా తల్లికి నేను ఎక్కడుంటే ఏంటి?? తనకి ఓకే అని చెప్పి, నా తండ్రిని కూడా కనుక్కోమని చెప్పి కాల్ కట్ చేసింది...

నా తండ్రికి ఇదే విధంగా చెప్పారు సుహాసిని మిస్... అతను కూడా ఓకే చెప్పడంతో వెంటనే నన్ను ఢిల్లీ పంపించడానికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి సుహాసిని మిస్ ఇంకా ఆవిడ భర్త కలిసి చూసుకొని, వాళ్ళకి నన్ను పంపించడం ఇష్టం లేకపోయినా, నా సేఫ్టీ కోసం ఢిల్లీ పంపించేశారు...

రాబందుల నుంచి తప్పించుకొని ఒంటరిగా బ్రతకడం మొదలుపెట్టాను... నా స్టడీస్ మీదనే ఫోకస్ మొత్తం పెట్టాను...

గ్రాడ్యుయేషన్ చేస్తూనే సొంతంగా యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చెయ్యాలనే ఆశయంతో నా పేరు మీదున్న ఆస్తులు అమ్మేసాను ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా...

సంవత్సరం క్రితం యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసాను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే... అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అయ్యాను నా టాలెంట్ తో...

ఇక్కడికి వచ్చాక కూడా నేను రెంట్ కి ఫ్లాట్ తీసుకొని, ఒంటరిగా వున్నాను... అమ్మ, నాన్న వాళ్ళ ఫ్యామిలీతో వుండమని ఎంత అడిగినా నేను వినలేదు... ఇష్టం లేదని మొహం మీదనే చెప్పేసాను... ఇక వాళ్ళు కూడా బలవంతం చెయ్యలేదు...

నేను మనుషులను అస్సలు నమ్మను... ఒక్క నా స్నేహితురాలు ప్రణవిని తప్ప... ఆరు నెలల క్రితం ప్రణవి మదర్ సుహాసిని మ్యామ్ ఎక్స్పైర్ అయ్యారు ఏక్సిడెంట్ జరిగి...

అదే ఏక్సిడెంట్ లో వాళ్ళ నాన్న గారి స్పైనల్ కార్డ్ దెబ్బతిని మంచాన పడ్డారు... ప్రణవిని నా కంపెనీలోనే సీఈవో గా ఎపాయింట్ చేసాను... దాని మీద జాలిపడి కాదు సీఈవో గా ఎపాయింట్ చేసింది... దాని ట్యాలెంట్ చూసి... ప్రణు చాలా ఇంటెలిజెంట్, టాలెంటెడ్ అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను నమ్మే ఏకైక వ్యక్తి...

ఇప్పుడు నేను, నా కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీస్ లెవెల్... అతి తక్కువ సమయంలోనే, చిన్న వయసులోనే నేను సాధించిన ఈ సక్సెస్ నన్ను, నా కంపెనీని మరింత పాపులర్ చేసింది...

నా కోసం నాకు నచ్చినట్టు నా మ్యాన్షన్ డిజైన్ చేయించుకున్నాను... ప్రణుని కూడా నాతో ఉండమన్నాను అంకుల్ తో పాటు... కానీ దానికి అభిమానం ఎక్కువ... వుండనంది... బలవంతం చేసాను... నా ఔట్ హౌస్ లో వుండటానికి ఒప్పుకుంది...

నేను మనుషుల్ని, వాళ్ళు చూపించే ప్రేమని అస్సలు నమ్మను... ప్రేమ... ఈ పదానికి నేను చాలా దూరం...

నాకు బాగా ఇష్టమైనది గెలుపు... యస్ సక్సెస్... నాకు గెలవడమంటే ఇష్టం...

నాకు అస్సలు నచ్చనిది ఓటమి... ఓడిపోవడమనే పదం... అసలు నా లైఫ్ డిక్షనరీలో ఎక్కడా కనిపించదు... నేను కనిపించనివ్వను కూడా...

గెలుపు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను... ఏమైనా చేస్తాను...

సక్సెస్ ఎప్పుడూ నాతోనే వుంటుంది...

జెస్సీ!! జెస్సీ అంటేనే సక్సెస్...

✨✨✨✨✨✨✨✨✨✨✨

అరే యార్... ఓటమి గెలుపుకు తొలి మెట్టు...

గెలుపు ఆనందాన్ని, గర్వాన్ని ఇస్తుంది... కానీ ఓటమి... మనకి లైఫ్ అంటే ఏంటో చూపిస్తుంది...

చూడు బ్రదర్... ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్... నీ దగ్గర టాలెంట్ వున్నప్పుడు ఓటమిని చూసి ఎందుకు బాధపడటం చెప్పు...

చూడు బాస్!!! ఈ మాటలన్నీ చెప్పడానికే బాగుంటాయి... వినడానికి అస్సలు బాగోవు... ప్లీజ్ ఇక మీరు నాకు జ్ఞాన బోధ చెయ్యడం ఆపి, నెక్స్ట్ మీరే... లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెంట్ అవ్వండి... నేను మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తాను... మీ డైలాగ్స్ మీకే వినిపించడానికి...

హుమ్మ్!!! నీకు బాగా కాలినట్టుంది కదా బ్రదర్... కానీ మీరు అనుకున్నది జరగదు... నేను డెఫినెట్ గా సెలెక్ట్ అవుతాను... ఎందుకంటే నేను ఓటమిని చూసి నీలా భయపడను...

లోపలున్నది ఎవరో నీకు సరిగా తెలియదనుకుంట... జెస్సీ!!! జెస్సీ మేడమ్ వున్నారు... ఆవిడ ముందు నువ్వు ఇంటర్వ్యూ ఆన్సర్స్ కాదు కదా కనీసం నీ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకోలేవు... సో! బయటకు వచ్చాక చెప్పు ఓటమి అంటే భయపడని నువ్వు జెస్సీ మ్యామ్ ని చూసి ఎంత భయపడ్డావో...

హుమ్మ్!!! చూడు బాస్... నాకు నిజంగానే లోపలున్న ఆ జెస్సీ మేడమ్ కోసం అస్సలు తెలియదు... కానీ నా గురించి నాకు బాగా తెలుసు...

ఈ రిషి ఎవ్వరికీ భయపడడు...

✨✨✨✨✨✨✨✨✨✨✨✨

ఇంకా వుంది... ట్యాగ్ యువర్ కామెంట్స్...