Veda - 7 in Telugu Fiction Stories by Eshwarchandra Rathnapalli books and stories PDF | వేద - 7

Featured Books
Categories
Share

వేద - 7

తుఫానులా కురుస్తున్న భారీ వర్షం బస్సు అద్దాలను తడుపుతోంది. బయట ప్రపంచం మసక మసకగా కనిపిస్తుంటే, లోపల కూర్చున్న వేద మనసులో మాత్రం అంతకంటే పెద్ద తుపాను చెలరేగుతోంది.

తలకు ముసుగు వేసుకుని, బస్సు మూలలో నక్కి కూర్చున్న ఆమెకు.. పక్కన ఉన్న ప్రతియొక్క ప్రయాణీకుడి చూపు తనపైనే ఉందేమో అన్న భయం వేధిస్తోంది.

"బస్సులో ఉన్నవాళ్లు కూడా నన్ను గుర్తుపట్టే లోపల నేను వెళ్ళిపోవాలి.. నా లోపల నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ మంట నన్ను, నాతో పాటు ఈ సమాజాన్ని కూడా హానికరం." 

ఇలాంటి ఆలోచనల భయంతో, తనను తాను అదుపు చేసుకుంటూ జాగ్రత్తగా ఒకమూల కూర్చుంది.

బస్సు అద్దం మీద తన ప్రతిబింబాన్ని చూసుకున్న వేదకు ఒక క్షణం వణుకు పుట్టింది. 

"నా కళ్ళు మళ్ళీ ఎర్రబడుతున్నాయా? లేదు.. ఇది కేవలం నా భ్రమ మాత్రమే." కానీ ఆ భయం ఆమెను నీడలా వెంటాడుతూనే ఉంది.

హఠాత్తుగా ఒక పెద్ద కుదుపుతో బస్సు ఆగిపోయింది. కిటికీలోంచి బయటకు చూస్తే, హైవే మీద ఒక భారీ వృక్షం కూలిపోయి దారిని మూసేసింది. 

బస్సు ఆగిన ప్రదేశం చోటు అడవి మార్గం.. అటు ఇటు మొత్తం కారు చీకటి. డ్రైవర్, క్లీనర్ దిగి పరిస్థితిని గమనిస్తుండగా, వేదకు అక్కడ ఉండటం సురక్షితం కాదనిపించింది. 

బస్సు ఆగిన తీరుకు బస్సులో నిద్రపోతున్న వారంతా లేచి, అటూ ఇటూ చూస్తున్నపుడు, వారి చూపు అనుకోకుండా వేద మీద పడింది. అందులో కొంతమంది మొబైల్ తీసి, వీడియో చూస్తూ ఆమెను అనుమానంగా చూస్తున్నారు.

అది గమనించిన వేద, వెంటనే తన బ్యాగును గట్టిగా పట్టుకుని, ఎవరికీ తెలియకుండా బస్సు వెనుక వైపు నుండి చీకట్లోకి అడుగులు వేసింది.

వర్షంలో తడుస్తూ ఆమె అడవి దారిలోకి పరుగు తీస్తుంటే, ఆమె పాదముద్రలు పడిన చోట, వర్షంలో కూడా ఆకులు వింతగా మాడిపోతున్నాయి. ఆమె లోపలి వేడి ప్రకృతిని కూడా ప్రభావితం చేస్తోంది.

అదే సమయంలో, కొంచెం దూరంలో తన నల్లటి కారును ఆపి వేద కోసం వెతుకుతున్నాడు అర్జున్. ఉన్నట్టుండి బస్సు ఆగడం, వేద మాయమవ్వడం అతనికి అతనికి ఏమీ అర్థం కాలేదు. 

టార్చ్ లైట్ వేసి, వేద కోసం వెతుకుతుండగా, నేల మీద వంగిపోయిన కొమ్మలు, కాలిపోయిన పచ్చి ఆకులు అతన్ని ఆశ్చర్యపరిచాయి.

ఇలాంటి భారీ వర్షంలో కూడా, వేద అడుగులు పడిన చోట వేడిగా ఉండడం, ఆ వేడికి వర్షంలో తడిసిన ఆకులు కూడా కాలిపోయి ఉండడం చూసి, "ఇదేదో మామూలు విషయం కాదు.. తనలో ఏదో ఒక వింత శక్తి ఉంది?" అని తనలో తానే గొణుక్కున్నాడు.

మరుసటి రోజు ఉదయం.. సిటీలోని ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ ఆఫీసు.

వేద కనబడకపోవడంతో, అర్జున్ తడిచిన బట్టలతో, ఎర్రబడిన కళ్ళతో తన ఎడిటర్ ముందు నిలబడ్డాడు. టీవీ స్క్రీన్ మీద వేద వైరల్ వీడియో ప్లే అవుతోంది.

"సార్, ఇది అందరూ అనుకుంటున్నట్టు ఎలాంటి గ్రాఫిక్స్ కాదు. నేను ఆమె కళ్ళను నేరుగా చూశాను. ఆ కళ్ళలో ఉన్నది టెక్నాలజీ కాదు, అది మన ఊహకందని ఒక భయంకరమైన సత్యం.. ఒక ఒక ప్రాచీన శక్తి! మనం దీన్ని ఒక సాధారణ వీడియోలా చూడకూడదు." అన్నాడు అర్జున్ గంభీరంగా.

అతని మాటల్లోని పట్టుదల ఎడిటర్ ని ఆలోచనలో పడేసింది. "కానీ అర్జున్, జనాలు లాజిక్ లేకుండా దేన్నీ నమ్మరని నీకు తెలుసు కదా.. మరి మనం ఇలాంటి విషయాల గురించి చూపిస్తే, జనం నమ్ముతారా?" అని అడిగాడు.

"మనం చెప్పేది జనాలు నమ్మకపోవచ్చు, కానీ వాళ్ళే నేరుగా చూస్తే నమ్ముతారు కదా.." అని అన్నాడు అర్జున్.

"మన కళ్ళతో చూసింది ఎప్పటికీ అబద్దం కాలేదు సార్. నా కళ్ళతో నేను స్వయంగా చూసాను, ఆ అమ్మాయి వేటలో ఉన్న ప్రాణిలా ప్రవర్తిస్తోంది. ఆమె వెనుక ఎవరో ఉన్నారు, లేదా ఆమె లోపలే ఏదో ఉంది. నేను దాన్ని నిరూపిస్తాను." అంటూ అక్కడి నుండి నిశ్చయంతో బయటకు వచ్చాడు.

న్యూస్ చానెల్ ఆఫీస్ నుండి బయలుదేరిన అర్జున్ నేరుగా అనన్యను కలిశాడు. ఆమె అప్పటికే వేద జీవితాన్ని చిన్నాభిన్నం చేశాననే అపరాధ భావంతో ఉంది. 

అర్జున్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, "ఆమె ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్.. ఆ రోజు షూటింగ్ సమయంలో తనని చూసినప్పుడు ఏదో వింతగా అనిపించింది. తన కాలేజీ వివరాలు ఇవిగో.." అంటూ ఒక ఐడి కార్డ్ ఫోటోను చూపించింది.

రాత్రి పది గంటలు.. వర్షం కాస్త తగ్గింది కానీ గాలిలో చలి పుడుతోంది. ఆర్కిటెక్చర్ కాలేజీ గేటు బయట అర్జున్ కాపు కాశాడు. 

అతని లాజిక్ ప్రకారం, వేద నగరం వదిలి వెళ్ళినా, తన సర్టిఫికెట్లు లేదా తన గతానికి సంబంధించిన ముఖ్యమైన వస్తువుల కోసం తప్పక కాలేజీకి వస్తుంది. 

చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎక్కడో ఒక తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది.

అర్జున్ నెమ్మదిగా కాలేజీ కాంపౌండ్ గోడ దూకి లోపలికి వెళ్ళాడు. అడ్మిన్ ఆఫీసు కిటికీ కొద్దిగా తెరిచి ఉంది. లోపల ఏదో వస్తువు కింద పడిన చప్పుడు.. 'డభీం!'

అర్జున్ తన టార్చ్ ఆన్ చేసి ఒక్కసారిగా లోపలికి విసిరాడు. ఆ వెలుతురులో ఒక మూల వేద కుంచించుకుపోయి కూర్చుని ఉంది. 

ఆమె చేతుల్లో తుప్పు పట్టిన ఒక పాత లోహపు డబ్బా ఉంది. వెలుతురు ఆమె ముఖం మీద పడగానే, వేద కళ్ళు పిల్లి కళ్ళలా మెరిశాయి. ఆమె చూపులో కోపం కంటే ప్రాణభయం ఎక్కువగా ఉంది.

"వేద.. భయపడకు, నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను." అన్నాడు అర్జున్. "ఎవరు నువ్వు? అసలు నీకు ఏమైంది?" అని అర్జున్ అడగబోయాడు.

కానీ వేద సమాధానం చెప్పకుండా, ఆమె చూపు అర్జున్ వెనుక ఉన్న కిటికీ వైపు మళ్ళింది. అక్కడి దృశ్యం చూసి, ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. 

అది గమనించిన అర్జున్ చప్పున వెనక్కి తిరిగి చూశాడు.

చీకట్లో.. ఒక భారీ నీడ కదులుతోంది. అది ఒక మనిషి నీడలా లేదు, ఏదో క్రూర మృగంలా గోడల మీద పాకుతూ వారిద్దరి వైపు దూసుకొస్తోంది! 

రుద్ర భైరవ పంపిన వేటగాడు వాళ్ళను చేరిపోయాడు.

వేద తన చేతిలోని డబ్బాను గుండెలకు హత్తుకుంది. 

వేద వైపుగా వస్తున్న ఆ నీడను చూసి, అర్జున్ తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఆ చీకటి నీడ చేతిలో మెరుస్తున్న కత్తి వేద ప్రాణాలను తీయడానికి సిద్ధంగా ఉంది.

"వేద.. పరుగు తీయ్!" అని అర్జున్ అరవబోతుండగా, ఆ గదిలోని విద్యుత్ దీపాలు ఒక్కసారిగా పేలిపోయి, ఆ చోటు మొత్తం చిమ్మ చీకటిగా మారింది..

ఇంతకీ, వేద రహస్యం అర్జున్ కు దొరికిందా? లేక ఆమె ప్రాణాలు ఆ నీడలో కలిసిపోయాయా?

మరిన్ని మలుపులతో వచ్చే ఎపిసోడ్ లో…