Veda - 8 in Telugu Fiction Stories by Eshwarchandra Rathnapalli books and stories PDF | వేద - 8

Featured Books
Categories
Share

వేద - 8

ఆ చీకటి గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. విద్యుత్ దీపాలు పేలిపోయిన తర్వాత ఆవరించిన ఆ గాఢాంధకారం వేద గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. 

పక్కనే కిటికీ బయట ఏదో నీడ కదిలినట్లు అనిపించినా, అంతకంటే ముందు తన కళ్ళ ముందు టార్చ్ లైట్ పట్టుకుని నిలబడిన ఈ మనిషి నుంచి ఎలా తప్పించుకోవాలా అన్నదే ఆమె తాపత్రయం.

ఇటువైపు, అడ్మిన్ ఆఫీస్ బయట నిలబడి ఉన్న అర్జున్, బయట జరిగిన దృశ్యం చూసి, ఒక్కసారిగా కంగుతిన్నాడు. 

ఇంతవరకు వేద వైపు తరుముకొస్తున్న ఆ చీకటి నీడ ఉన్నట్టుండి మాయమైంది. అది తన భ్రమా లేదా ఇది కూడా వేద చేసిన ఏదైనా మాయా అని ఏదో ఆలోచనలో పడ్డాడు.

అర్జున్ టార్చ్ లైట్ వెలుతురు నేరుగా వేద కళ్ళ మీద పడింది. ఆ వెలుగులో ఆమె కళ్ళు పిల్లి కళ్ళలా మెరుస్తూ, క్షణక్షణానికీ రంగు మారుతున్న తీరు అతన్ని నివ్వెరపరిచింది.

"దొరికావు వేద! ఇక నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు?" అని అన్న అర్జున్ గొంతులో ఒక విధమైన గెలుపు గర్వం వినిపించింది.

వేద తన చేతిలోని సర్టిఫికెట్స్ ఫైల్‌ను, ఆ పాత లోహపు డబ్బాను గుండెలకు గట్టిగా హత్తుకుంది. ఆమె శ్వాస వేగంగా సాగుతూ, తన చుట్టూ ఉన్న గాలి వేడెక్కుతున్నట్టు ఆమెకు అనిపిస్తోంది.

'అసలు ఎవరితను, నా వెంట పడ్డాడు..? కోరి కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.. లేదంటే ఇంకా ఎంతమంది ఇలా నావెంట పడతారో!' అని ఆమె మనసు అరుస్తోంది.

"చూడండి మిస్టర్.. మీరు ఎవరో నాకు తెలియదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి." అంటూ వేద గంభీరంగా నటించడానికి ప్రయత్నించింది కానీ, ఆమె గొంతులోని వణుకు ఆమెను మోసం చేసింది.

"నేను మీకు తెలియక పోవచ్చు కానీ మీరు మాత్రం సోషల్ మీడియాలో ఉన్న అందరికీ తెలుసు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఉన్నది మీరే కదా?" అంటూ అర్జున్ తన ఫోన్ తీసి, ఆ వీడియోను స్లో-మోషన్‌లో ప్లే చేశాడు. 

"ఇటు చూడండీ.. సామాన్యంగా ఒక మనిషి కనురెప్పలు ఆర్పే సమయం కంటే వేగంగా నీ కళ్ళు రంగు మార్చుకున్నాయి. ఒక సాధారణ మనిషి కంటే భిన్నంగా నీ శరీరంలో ఏదో వింత మార్పు జరుగుతోంది. నిజం చెప్పండీ.. ఎవరు మీరు? అసలు నీకు ఏమైంది?"

అర్జున్ అడుగుతున్న ప్రశ్నలు ఆమెను ఊపిరాడకుండా చేస్తున్నాయి. నిజం చెబితే తనను ఒక వింత ప్రాణిలా చూస్తారు, అబద్ధం చెబితే, నిజం తెలిసేంతవరకూ వదిలిపెట్టరు. 

దానితో వేద కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లు కన్నీళ్లు కావు.. ఆమె కళ్ళలో పుడుతున్న సెగను ఆర్పడానికి ప్రకృతి చేస్తున్న ప్రయత్నంలా ఉన్నాయి.

"అది.. అది మీరు అనుకుంటున్నట్టు ఏమీ కాదు.." అంటూ వేద ఒక్కసారిగా కిందకు వంగి కన్నీళ్లు తుడుచుకుంది. 

"నాకు ఒక అరుదైన జన్యుపరమైన కంటి వ్యాధి ఉంది. అందుకే వెలుతురు ఎక్కువైతే నా కళ్ళు అలా వింతగా కనిపిస్తాయి. డాక్టర్లు కూడా ఏమీ చేయలేమని చెప్పారు. ప్రతిరోజూ నేను ఈ శాపాన్ని మోస్తూ బ్రతుకుతున్నాను." అని ఏదో ఒక అనారోగ్య సమస్యను సృష్టించింది.

"అయినా మీరెవరు ఇవన్నీ అడగడానికి? నేనెందుకు మీకు సమాధానం చెప్పాలి..? దయచేసి నన్ను ఒక వింత జంతువులా చూడకండి.. నన్ను వెళ్ళనివ్వండి." అంటూ వేద కన్నీళ్ళు పెట్టింది.

ఆమె మాటల్లోని ఆర్తి అర్జున్‌ను ఒక క్షణం కదిలించింది.

'నిజంగా ఇలాంటి వ్యాధి ఒకటి ఉంటుందా? ' అని అతను ఆలోచనలో పడ్డాడు. కానీ అతనిలోని జర్నలిస్ట్ మాత్రం అది నమ్మడానికి సిద్ధంగా లేడు. 

"సరే, మీరు అన్నట్టు ఇది ఒక జన్యుపరమైన కంటి వ్యాధే అనుకుందాం, మరి మీ శరీరంలో జరుగుతున్న వింత మార్పుల విషయం ఏంటి?" అని అనుమానంతో ఇంకో ప్రశ్న వదిలాడు.

అందుకు వేద ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది.

"ఆ వీడియోలో, మీ శరీరంలో మార్పును నేను గమనించాను. అంతేకాక అడవిలో మీ అడుగు పడ్డ చోట నేల వేడెక్కింది. ఇది జన్యుపరమైన వ్యాధి అయితే మీ అడుగులు పడ్డ చోట ఆకులు ఎందుకు మాడిపోతాయి?" అని అతను ముందుకు అడుగు వేశాడు.

అర్జున్ అడుగు ముందుకు వేయడంతో, భయంతో వేద వెనక్కి తగ్గుతూ, కారిడార్‌లోని ఇనుప ర్యాక్ ల పక్కకు చేరింది. అర్జున్ ఆమెను ఆపడానికి ఆమె చేయి పట్టుకోబోయాడు.

"వద్దు! నన్ను ముట్టుకోకండి!" అని వేద ఆవేశంతో అరిచింది. ఆమెలోని భయం కోపంగా మారింది. తనను తాను రక్షించుకోవాలనే ఆరాటంలో, పక్కనే ఉన్న ఒక భారీ ఇనుప రేకును పట్టుకుని బలంగా పక్కకు నెట్టింది.

'కిర్ర్.....' అంటూ ఆ ఇనుప ర్యాక్ నేల మీద ఈడ్చుకుపోయిన శబ్దం ఆ నిశ్శబ్ద కారిడార్‌లో భయంకరంగా ప్రతిధ్వనించింది.

అది చూసిన అర్జున్ ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు. వేద ఆ క్షణం ఎక్కడ లేని వేగంతో కాలేజీ కాంపౌండ్ దాటి చీకట్లోకి పరుగు తీసింది. 

అర్జున్ ఆమె వెంట పడబోయి ఆగిపోయాడు. అతని కళ్ళు పక్కనే ఉన్న ఆ ఇనుప రేక్ మీద పడ్డాయి.

టార్చ్ లైట్ వేసి చూసిన అర్జున్ గుండె ఆగినంత పనైంది. గట్టి ఇనుముతో చేసిన ఆ భారీ రేకు, వేద చేతి స్పర్శ తగిలిన చోట బెండులా వంగిపోయి ఉంది. 

అంతకంటే భయంకరమైన విషయం ఏమిటంటే.. ఆ ఇనుప రేకు మీద ఆమె వేలి ముద్రలు లోతుగా ముద్రించబడి ఉన్నాయి. అక్కడ ఇనుము కరిగిపోయినట్టుగా కనిపిస్తోంది!

"ఇది ఎలాంటి మెడికల్ కండిషన్ కాదు.. ఇది హ్యూమన్లీ ఇంపాజిబుల్! తన చేతులతో ఇనుమును వంచేంత శక్తి.. ఆ వేడి.. తను అసలు మనిషేనా?" అర్జున్ గొంతులో వణుకు మొదలైంది.

ఆ పక్కనే కారిడార్ చివర, అప్పటిదాకా చీకట్లో దాగి ఉన్న ఆ భారీ నీడ నెమ్మదిగా వెలుతురులోకి రాసాగింది. 

ఆ నీడ చేతిలో ఉన్న కత్తి మెరుపును చూస్తుంటే, వేద కోసం వస్తున్న ప్రమాదం అర్జున్ ఊహకందని రీతిలో ఉందని అర్థమవుతోంది.

మరి వేద ఆ వేటగాడి నుండి తప్పుకోగలదా? అర్జున్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమెను రక్షిస్తాడా?

మరిన్ని మలుపులతో వచ్చే ఎపిసోడ్ లో…