నా గురించి చెప్పడానికి ఏముంది కిషోర్ గారు? కానీ మీరు వదలడం లేదు, అడుగుతూనే ఉన్నారు" అంటూ వెన్నెల ఒక్క క్షణం ఆగి నిట్టూర్చింది. కిషోర్ వెన్నెల కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. ఆమె మౌనం వెనుక ఏదో పెద్ద సముద్రమే దాగి ఉందని అతనికి అర్థమవుతోంది. పెదవి విప్పడానికి వెన్నెల తటపటాయిస్తుంటే.. కిషోర్ ఆకాశంలోని చందమామను చూపిస్తూ నెమ్మదిగా ఇలా అన్నాడు.. "చూడు వెన్నెలా! మనకు ప్రతిరోజూ రాత్రి చందమామ కనిపిస్తుంది. అది వింతేమిటి అనిపిస్తుందా? కానీ మనం చూసే కళ్ళలోనే అదంతా ఉంటుంది. ఒక్కోసారి నిండుగా, ఇంకోసారి సగంలా, అప్పుడప్పుడు సూర్యుడిలా ప్రకాశిస్తుంది.. కొన్నిసార్లు అసలు కనిపించదు. అలాగని దాని అందం తగ్గిపోతుందా? లేదు కదా! మనిషి జీవితం కూడా అంతే. మనలోని వెలుగు చీకట్లు మనల్ని మార్చలేవు."ఆ మాటలు వెన్నెల గుండెల్లో ఎక్కడో గుచ్చుకున్నాయి. ఒక అపరిచితుడు తన మనసులోని శూన్యాన్ని ఇంతలా ఎలా చదివేస్తున్నాడా అని ఆశ్చర్యపోయింది. కిషోర్ పిలుపుతో స్పృహలోకి వచ్చిన ఆమె, తన గతంలోకి అడుగుపెట్టింది. "నా చిన్నప్పుడే మా నాన్నగారు రాజు గారు చనిపోయారు. గుండె నొప్పితో ఆయన హఠాత్తుగా వెళ్ళిపోవడంతో, అప్పటి నుంచి మా అమ్మే నాకు తండ్రి కూడా అయింది. నాన్న ఏ లోటు రాకుండా ఆర్థికంగా అన్నీ సమకూర్చారు. కానీ, నాన్న లేని ఆ వెలితి నా మనసులో ఒక రకమైన నిశ్శబ్దాన్ని నింపేసింది. లోకమంతా సందడిగా ఉన్నా, నా లోపల మాత్రం ఎప్పుడూ ఒక మౌనం రాజ్యమేలుతుంటుంది. అప్పుడప్పుడు ఆ నాన్న జ్ఞాపకాలు కళ్ళముందు కదిలితే, నా చుట్టూ ఉన్న ప్రపంచమంతా చిన్నబోతుంది. నా చదువు ఇంటర్ వరకు పూర్తయింది. నా గురించి చెప్పడానికి ఇంతే ఉంది" అని ముగించి, కళ్ళు చెమర్చగా మెల్లగా అడిగింది—"మరి కిషోర్ గారు, మీ గురించి మీరు చెబుతారా?"కిషోర్ ఏదో చెప్పబోతుండగా, జానకి పెద్దమ్మ పిలుపుతో ఆ క్షణం ముగిసిపోయింది. వెన్నెల తన పని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి శారదమ్మకు ఆ రోజు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ తల్లి ప్రేమ వెన్నెలకు ఒక రక్షణ కవచంలా అనిపిస్తుంది. అలా ఆ తల్లికూతుళ్ల ముచ్చట్లతో ఆ రాత్రి గడిచిపోయింది.మరుసటి రోజు ఉదయం శారదమ్మ వెన్నెలను కిషోర్ ఇంటి వద్ద వదిలి వెళ్ళింది. ప్రతిరోజూ మేడ మీద కనిపించే కిషోర్, జానకి గారు ఈరోజు అక్కడ లేకపోవడంతో వెన్నెల మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఏమి జరిగింది అన్నట్టు శారద వెన్నెల నీ కంటి సైగతో అడగగా ఏమీ లేదన్నట్టు అమ్మకు వీడ్కోలు చెప్పి లోపలికి వెళ్ళింది. తోటలో మొక్కల మధ్య కిషోర్ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. వెన్నెల ఉత్సాహంగా దగ్గరకు వెళ్లి, "కిషోర్ గారు! ఏం చేస్తున్నారు?" అని ఎప్పటిలాగే చొరవగా అడిగింది.కానీ, కిషోర్ ఆమె వైపు చూసిన చూపు వెన్నెలను ఒక్కసారిగా స్తంభింపజేసింది. ఆ చూపులో నిన్నటి ఆత్మీయత లేదు, ఆకర్షణ లేదు, కనీసం గుర్తింపు కూడా లేదు. "నన్నా అడిగింది?" అన్నట్టు ఒక వింతైన, పరాయితనంతో కూడిన చూపు చూశాడు. "అవునండి.. మిమ్మల్నే!" అని వెన్నెల నవ్వుతూ అన్నా, కిషోర్ ముఖంలో మాత్రం "ఎవరీ అమ్మాయి? నాతో ఇంత చొరవగా మాట్లాడుతోంది ఏంటి?" అన్న అనుమానం స్పష్టంగా కనిపిస్తోంది.వెన్నెల గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. నిన్న రాత్రి వరకు తన జీవితంలోని చీకటి కోణాలను విన్న మనిషి, నేడు తనను ఒక అపరిచితురాలిలా చూడటం ఆమె తట్టుకోలేకపోయింది. "కిషోర్ గారు.. నేనండి వెన్నెలను.." అని చెప్పబోయి ఆగిపోయింది. ఆ తోటలోని నిశ్శబ్దం ఆమెను భయపెట్టసాగింది. నిన్నటి ఆత్మీయ కిషోర్ ఎక్కడ? నేడు కనిపిస్తున్న ఈ శిల లాంటి వ్యక్తి ఎవరు? వెన్నెల కళ్ళలో మళ్ళీ నీళ్లు తిరిగాయి, కానీ ఈసారి అది నాన్నను కోల్పోయిన బాధ కాదు.. తనను తాను కోల్పోయినంత వేదన కలిగింది వెన్నెల కు!
కిషోర్ ప్రవర్తన వెన్నెలను నిలువునా నీరుగార్చింది. ఆ నిమిషం వరకు అతని కళ్ళలో తన కోసం వెతికిన ఆత్మీయత, ఇప్పుడు నిప్పులు చెరుగుతున్న కోపంగా మారడం ఆమె ఊహించలేకపోయింది."ఎవరండీ మీరు? ఎందుకు నన్ను పలకరిస్తున్నారు?" అని అతను చిరాగ్గా అడిగేసరికి, వెన్నెల పాదాల కింద భూమి కదిలినట్టయింది. గొంతులో మాట పెకలక, కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతుండగా.. "నన్ను ఆట పట్టిస్తున్నారా కిషోర్ గారు? ఈరోజు ఏమైనా ఏప్రిల్ ఫస్ట్ ఆ? ఎందుకిలా పరాయిదానిలా చూస్తున్నారు?" అని వణుకుతున్న స్వరంతో అడిగింది.ఆమె మాటలకు కిషోర్ ముఖం మరింత కఠినంగా మారింది. "ఏమిటీ.. ఆట పట్టించడమా? మీరేమైనా నా మరదలా? నాకు వరుస అవుతారా? అసలు పరిచయం లేని వ్యక్తితో ఎందుకు అంత చొరవగా మాట్లాడుతున్నారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి!" అని అతను గట్టిగా అరిచాడు. ఆ అరుపు వెన్నెల గుండెకు బాణంలా తగిలింది. నిన్నటి వరకు 'చందమామ' గురించి కవిత్వం చెప్పిన మనిషి, నేడు తనను ఒక అపరిచితురాలిలా ఛీత్కరించుకోవడం ఆమెను నిశ్చేష్టురాలిని చేసింది.