అంతలో ఆర్య అక్కడికి వచ్చి, "ఏంటి షీలా.. అలా నిల్చుని ఏం ఆలోచిస్తున్నావ్?" అని పలకరించాడు. అప్పుడే రాజు గారు కూడా అటుగా వస్తూ, "ఏమ్మా షీలా! ఎలా ఉన్నావ్?" అని ఎంతో ఆప్యాయంగా అడిగారు.
అప్పుడు షీలా వినయంగా, "నమస్తే అంకుల్ గారు! నేను మిమ్మల్ని ఒక విషయం మీద కలవాలనుకుంటున్నాను" అంది.
రాజు గారు ఆశ్చర్యంగా, "దేని గురించి అమ్మా షీలా?" అని అడిగారు.
"ఏం లేదు అంకుల్.. అది వచ్చి.." అని షీలా నసుగుతుంటే, నీల తట్టుకోలేక, "ఎందుకు చెప్పకుండా ఊరుకుంటావ్.. చెప్పేయ్!" అని కాస్త గట్టిగా అంది.
నీల కోపాన్ని చూసి షీలా, "చూడండి అంకుల్ గారు! ఈ మధ్య నీల పద్ధతి అస్సలు బాలేదు. నన్ను చూస్తేనే చాలు.. కారాలు మిరియాలు నూరుతోంది!" అని రాజు గారికి కంప్లైంట్ చేసింది.
రాజు గారు నవ్వుతూ, "సరేలేమ్మా.. ఇంతకీ నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావో చెప్పు షీలా?" అని అడిగారు.
నీల కంగారు పడిపోతూ, "నాన్నగారూ! ఇప్పుడు ఇవన్నీ ఎందుకు.. ముందు పార్టీని ఎంజాయ్ చేద్దాం రండి నాన్నగారూ!" అంటూ రాజు గారిని అక్కడి నుండి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది.
కానీ రాజు గారు, "నీలా.. కాసేపు ఆగు! నువ్వు చెప్పు షీలా" అన్నారు.
అప్పుడు షీలా తన అసలు విషయం బయటపెట్టింది, "అంకుల్.. అయాన్‌ను నా కోసం ఒక్క రోజు ఇస్తారా? నా రీసెర్చ్ కోసం వాడు చాలా ఉపయోగపడతాడు" అని అడిగింది.
రాజు గారు ఆలోచించకుండానే, "సరే షీలా! దానికేముంది.. నువ్వు తీసుకొని వెళ్ళి, నీ పని అయిపోయాక జాగ్రత్తగా తీసుకురా. ఇంతకీ రేపు తీసుకువెళ్తావా?" అని అడిగారు.
రాజు గారి మాట వినగానే నీల గుండె ఆగిపోయినంత పనైంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాన్నగారు ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తీసుకోరు. 'ఇప్పుడు నేను ఏం చేయాలి దేవుడా? ఒక్కసారి నన్ను కరుణించు.. ప్లీజ్, నా అయాన్‌ను నా నుండి దూరం చేయకుండా చూడు దేవుడా!' అని నీల మనసులో ఏడుస్తూ దేవుడిని వేడుకుంది.
నీల మనసులో ఆ మాట పూర్తి అయిందో లేదో.. సడెన్‌గా వెనక నుండి, "అది ఎలా కుదురుతుంది చెప్పు?" అనే కఠినమైన స్వరం వినిపించింది.
ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. అక్కడ నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే రాజు గారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆయన మరెవరో కాదు.. రాజు గారి ప్రాణ స్నేహితుడు, అయాన్‌ను సృష్టించడానికి సహాయం చెసిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రసాద్ గారు!
"రా ప్రసాద్! భలే సరైన సమయానికి గుర్తుపెట్టుకుని ఇంటికి వచ్చావే!" అన్నాడు అవును లాబ్ నుంచీ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చావా అని రాజు గారు అడిగారు
ప్రసాద్ గారు ఎంతో సంతోషంగా "ఎలా రాకుండా ఉంటానురా? నన్ను రమ్మని అడిగింది మా చిట్టి తల్లి నీల కదా!" అన్నారు ప్రసాద్ గారు నవ్వుతూ.
రాజు గారు ఆశ్చర్యపోతూ నీల వైపు చూసి, "ఏమిటి.. నీలా? నువ్వు పిలిచావా?" అని అడిగారు.
"అవును నాన్నగారూ.. ఇవాళ అయాన్ పుట్టినరోజు కదా, అందుకే నేనే అంకుల్‌ను రమ్మని ఫోన్ చేశాను" అంది నీల మెల్లగా.
రాజు గారు నకిలీ కోపం నటిస్తూ, "అంటే.. నేను పిలిస్తే రానివాడివి, మా అమ్మాయి పిలవగానే వచ్చేశావన్నమాట!" అన్నారు.
దానికి ప్రసాద్ గారు నవ్వుతూ, "రేయ్! నీకు ఈ కోపం అస్సలు సెట్ అవ్వదురా.. ఎన్నిసార్లు చెప్పాలి నీకు?" అనడంతో ఇద్దరు స్నేహితులు ఒక్కసారిగా నవ్వుకుంటూ గట్టిగా హత్తుకున్నారు.
అంతలో అక్కడే ఉన్న అయాన్, ప్రసాద్ గారిని చూసి, "ప్రసాద్ సార్!" అని పిలిచాడు.
ఆ పిలుపు వినగానే ప్రసాద్ గారు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. చకచకా అయాన్ దగ్గరకు వెళ్లి, వాడి భుజాలు పట్టుకుని, "నా ప్రియమైన కొడుకా!" అంటూ వాడిని గట్టిగా తన గుండెలకు హత్తుకున్నారు. ఒక యంత్రాన్ని తండ్రిలా ప్రేమించే ప్రసాద్ గారిని చూసి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.
ఆ దృశ్యం చూసి ఆర్య, షీలా, నీల, రాజు గారు, సుస్మితల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒకరినొకరు చూసుకుంటూ అందరూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.
రాజు గారు నెమ్మదిగా ప్రసాద్ భుజం తడుతూ, తన కళ్లల్లోని ఆనంద బాష్పాలను దాచుకుంటూ.. "ఎందుకురా ఏడుస్తున్నావ్?" అని అడిగాడు. "రేయ్!" అంటూ ప్రసాద్ గారు మళ్లీ రాజు గారిని గట్టిగా హత్తుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి అయాన్ చేత కేక్ కట్ చేయించి, వచ్చిన అతిథులతో సరదాగా గడిపారు.
పార్టీ అయిపోయాక వచ్చిన వాళ్లంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. షీలా మాత్రం రాజు గారి దగ్గరకు వచ్చి, "అంకుల్ గారు! మరి రేపు నేను అయాన్‌ను నా పరిశోధన కోసం తీసుకువెళ్లవచ్చా?" అని ఆశగా అడిగింది.
రాజు గారు సమాధానం చెప్పేలోపే.. "వద్దు షీలా!" అని ప్రసాద్ గారు గట్టిగా వారించారు.
"ఎందుకు ప్రసాద్ గారు?" అని షీలా నిరాశగా అడిగింది.
దానికి ప్రసాద్ గారు వివరిస్తూ, "అయాన్‌కు ఉన్నది కేవలం తాత్కాలిక జ్ఞాపకశక్తి మాత్రమే. ఒకవేళ వాడు నీతో ప్రయోగశాలకు వచ్చినప్పుడు నిన్ను పూర్తిగా మర్చిపోతే.. అది నీకే అంత మంచిది కాదు. ఎందుకంటే నీకు సంబంధించిన సమాచారం ఏదీ మేము వాడి వ్యవస్థలో నమోదు చేయలేదు. అక్కడ వాడు ఏదైనా కొత్త వాతావరణంలో ఇబ్బందిగా ఫీల్ అయితే.. వాడి మెదడులోని సమాచారం మొత్తం పాడైపోయి, పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఇన్నేళ్లుగా మేము పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది!" అని గంభీరంగా చెప్పారు.
ఆ మాటతో షీలా మరేమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా చాటుగా నిలబడి వింటున్న నీల మనసంతా ఒక్కసారిగా తేలికైపోయింది. తను ఎంతో కృతజ్ఞతగా ప్రసాద్ గారి వైపు చూసింది. ప్రసాద్ గారు నీల వైపు చూసి రహస్యంగా కన్ను కొడుతూ.. 'నీ పని అయిపోయింది' అన్నట్టు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయారు.