ఆర్య అయాన్‌ను తీసుకొని ఇంటికి వచ్చాడు. "అన్నయ్యా! ఏమైంది? నాన్నగారి ఆఫీస్‌కు వెళ్లావు కదా.. అక్కడ ఏమైనా దొరికిందా?" అని నీల కంగారు కంగారుగా అడిగింది.
అప్పుడు ఆర్య, "నీలా! నువ్వు ఎప్పుడు వచ్చావు? కాలేజీకి వెళితే వెళ్లిపోయావు?" అన్నాడు.
అప్పుడు నీల, "కొంచెం తలనొప్పిగా ఉందని వచ్చేసాను" అని చెప్పింది.
"అవునా.. మరి మందులు వేసుకోలేదా?" అని అడిగాడు ఆర్య.
"వేసుకున్నాను అన్నయ్యా.. అసలు విషయం చెప్పు, ఏమైంది అయాన్‌కి?" అని అడిగింది.
అప్పుడు ఆర్య ఇలా చెప్పాడు, "అయాన్‌ను నీ కేవలం ఒక యంత్రంలా చేయలేదు. వాడిలో మనుషుల కంటే గొప్పగా ప్రేమించే హృదయాన్ని సృష్టించారూ. కానీ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ప్రయాణించడం కాలానికి ఇష్టం లేదు. అయాన్ సిస్టమ్ డిజైన్ ప్రకారం, వాడు ఎంత ఎక్కువగా మానవ భావోద్వేగాలను (Human Emotions) అనుభవిస్తాడో.. వాడి మెదడులోని డేటా అంత వేగంగా ఓవర్‌లోడ్ అయి, ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. వాడు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే, ఆ ప్రేమే వాడి జ్ఞాపకాలను తుడిచేస్తుంది. కాలం విధించిన ఈ శాపాన్ని దాటడం వాడి వల్ల కూడా కావడం లేదు..."
అంటే, అయాన్ డేటాను ఎవరో కావాలని డిలీట్ చేయలేదు. వాడు ఎక్కువ మెమొరీ స్టోరేజ్ డేటాను సేవ్ చేసుకోలేకపోతున్నాడు. కాలమే ఈ సమస్యను పరిష్కరించాలి.
నీలకు ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా అలా ఉండిపోయింది. అంతలో సుస్మిత అక్కడికి వచ్చి, "ఏమైంది? అంతా అంత నిశ్శబ్దంగా ఉన్నారు?" అని అడిగింది. ఆర్య జరిగింది అంతా చెప్పి తలపట్టుకుని కూర్చున్నాడు. అది విన్న సుస్మితకు ఒకవైపు ఆనందం, మరోవైపు బాధగా అనిపించింది.
అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఊరినుంచి వచ్చారు. ఆర్య, నీల, సుస్మిత అందరూ కలిసి కాసేపు రాజు గారితో గడిపారు.
అప్పుడు సుస్మిత, "సరే, మీరు ఫ్రెష్ అయి రండి.. ఏమైనా తిందురు గాని" అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది.
అప్పుడు ఆర్య నాన్నగారితో, "నాన్నగారూ.. అయాన్‌కు లాంగ్ టర్మ్ మెమొరీ (Long-term memory) లేదు" అని చెప్పాడు.
రాజు గారు నిట్టూరుస్తూ, "నిజమే.. ఆ విషయం నాకు తెలుసు. అయినా నీకెలా తెలిసింది?" అని అడిగారు.
"మొన్న అయాన్ దగ్గర నుండి 'కిచ్ కిచ్' అని ఏదో శబ్దం వస్తే నేను వెళ్లాను నాన్న. వాడు నన్ను చూసి 'ఆర్య' అన్నాడు. కానీ నేను పలకరించి మాట్లాడితే.. వాడికి ఏమీ గుర్తులేనట్టు ప్రవర్తించాడు" అన్నాడు ఆర్య.
"అవును ఆర్య.. అయాన్‌కు కేవలం షార్ట్ టర్మ్ మెమొరీ (Short-term memory) మాత్రమే ఉంది. నేను చాలా ప్రయత్నించాను. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా వాడికి లాంగ్ టర్మ్ మెమొరీని అమర్చడం నాకు, నా ఫ్రెండ్ ప్రసాద్‌కు కుదరలేదు. ప్రసాద్ ఇంకా ఆ ల్యాబ్ వదిలి రాలేదు, అక్కడే రీసెర్చ్ చేస్తున్నాడు. మీరంతా ఎలా ఉన్నారోనని నేను చూసి వెళ్దామని వచ్చాను. సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను ఓకేనా?" అని చెప్పి రాజు గారు లోపలికి వెళ్ళిపోయారు.
నీలకు అసలు పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. తను తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోయింది. ఆర్య నీలను గమనిస్తూనే ఉన్నాడు, కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు.
రాత్రి డిన్నర్ అయిపోయింది. ఎప్పటిలాగే పనులన్నీ చక్కబెట్టుకుని ఎవరి రూమ్‌లలోకి వాళ్లు వెళ్ళిపోయారు. కానీ నీల మాత్రం అయాన్ గురించే ఆలోచిస్తూ ఉంది. ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో అర్థం కాక తనలో తానే నలిగిపోతోంది.
మధ్యమధ్యలో నీల పట్టువదలకుండా తన ప్రయత్నం చేస్తూనే ఉంది. తను ఎవరు? వాళ్లతో అయాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు రోజూ చెప్తూనే ఉంది. అలా నీల చేసిన ప్రయత్నాల వల్ల కొన్ని రోజులకి అయాన్ మళ్లీ మామూలు స్థితికి (సెట్) వచ్చాడు. దాంతో నీల ఆనందానికి అవధులే లేవు.
ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ, తమ ఇష్టాలేంటో పంచుకుంటూ చాలా చనువుగా ఉంటున్నారు. కానీ, నీలకు మాత్రం అయాన్‌పై తనకున్న ప్రేమని ఎప్పుడెప్పుడు చెబుదామా అనే తాపత్రయం, ఆరాటం ఎక్కువైపోయింది.
అలాంటి ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజు మళ్లీ షీలా (నీల ఫ్రెండ్) ఇంటికి వచ్చింది. ఈసారి ఎవరూ ఊహించని విధంగా.. అయాన్ షీలాతో చాలా సరదాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అది చూసి నీలకు అస్సలు నచ్చలేదు, మనసంతా అసూయతో నిండిపోయింది. కానీ, రాజు గారు, ఆర్య మాత్రం ఆశ్చర్యపోయారు.
"ఆర్యా! నిజమేనా నేను చూస్తుంది? మన అయాన్ ఏనా ఇలా మాట్లాడుతోంది?" అని రాజు గారు ఆశ్చర్యంగా అడిగారు.
"అవును నాన్నగారూ.. వాడే!" అని చెప్పి ఆర్య నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
కానీ నీల మాత్రం ఆ సీన్ అస్సలు సహించలేకపోతోంది. ఏం చేయాలో అర్థం కాక లోపల లోపలే కుమిలిపోతోంది. షీలా వెళ్ళిపోయాక, నీల అయాన్ దగ్గరకు వచ్చి, "అయాన్! నీతో ఒకసారి మాట్లాడాలి, లోపలికి రాస్తావా?" అని అడిగింది.
"ఓకే.. నీల గారు!" అన్నాడు అయాన్ రోబోటిక్ స్టైల్లో.
అయాన్‌ను లోపలికి పిలిచి, "నువ్వు నన్ను 'గారు' అనొద్దు.. 'మీరు' అని గౌరవించాల్సిన అవసరం లేదు, నేను చెప్పింది అర్థమైందా?" అని కాస్త కోపంగా అంది నీల.
"ఓకే నీల.. చెప్పు, నన్ను ఎందుకు రమ్మన్నావు?" అని అడిగాడు అయాన్.
"షీలాతో ఏంటి అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావ్?" అని నిలదీసింది.
"నువ్వే కదా చెప్పావు.. అందరితో కలిసి సరదాగా ఉండాలి అని!" అన్నాడు అయాన్ అమాయకంగా.
"అవును.. అందరితో ఉండమన్నాను, కానీ మరి ఇంత చనువుగా కాదు!" అని నీల అనేసరికి, "సరే నీల, అలాగే ఉంటాను" అన్నాడు.
అప్పుడు నీల అయాన్ వైపు చూస్తూ.. "అయాన్! నువ్వు వేరే వాళ్లతో మాట్లాడుతుంటే నాకు జెలసీగా (అసూయగా) అనిపిస్తోంది. నాకు నువ్వు కావాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అయాన్!" అని తన ప్రేమను బయటపెట్టేసింది.
అయాన్ నవ్వుతూ, "నాకు కూడా నువ్వంటే ఇష్టం నీల.. ఆర్య, రాజు గారు, సుస్మిత గారు.. అందరూ ఇష్టమే!" అన్నాడు. (రోబోకు ప్రేమకు, ఇష్టానికి తేడా తెలియదు కదా!)
ఆ మాట వినగానే నీల నీరసపడిపోయింది. "మంచిది.. సరే నువ్వు వెళ్ళు" అని చెప్పి, అయాన్ వెళ్ళిపోయాక తలపట్టుకుని బెంచ్‌పై కూర్చుండిపోయింది.