padam nilichna chotu in Telugu Love Stories by Dathathreya books and stories PDF | పాదం నిలిచిన చోటు

Featured Books
Categories
Share

పాదం నిలిచిన చోటు

నవంబర్ నెల సాయంత్రం... హైదరాబాద్ నగరపు ఆకాశం నెమ్మదిగా నారింజ రంగులోకి మారుతోంది. ట్రాఫిక్ రణగొణ ధ్వనులు, ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే వారి హడావిడి, రోడ్ల పక్కన వెలుగుతున్న రంగురంగుల నియాన్ బోర్డులు... ఇవన్నీ ఆ నగరానికే సొంతమైన ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
ట్రెండ్స్, పుమా, జాకీ లాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్, విభిన్న రకాల రెస్టారెంట్స్ తో ఉన్న ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అది. వాటి పైన రెండు పోష్ అపార్ట్మెంట్స్ ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. కింద ముందర భాగంలో ఒక ఛాయ్ పాయింట్, కుంభకోణం కాఫీ లాంటి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సాయంత్రం ఆ ప్లేస్ చాలా మంది యంగ్ పీపుల్ తో నిండిపోయి ఉంటుంది. ముందర కూర్చోవడానికి వీలుగా కొన్ని టేబుల్స్, అరుగులు ఏర్పాటు చేశారు. రోస్ట్ చేసిన కాఫీ గింజల సువాసన ఆ చుట్టుపక్కల గాలిలో ఒక రకమైన మత్తుని చల్లుతోంది.
విజయ్ కి ఈవెనింగ్స్ అక్కడ అరుగు మీద కూర్చొని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కాఫీ తాగడం చాలా ఇష్టం. తన చేతిలో ఉన్న వేడి వేడి కుంభకోణం ఫిల్టర్ కాఫీ కప్పు నుండి వస్తున్న పొగలను చూస్తూ, నిన్న జరిగిన సంఘటననే మళ్ళీ మళ్ళీ తన మనసులో రీప్లే చేసుకుంటున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత అనుకోకుండా ఆమె కనిపించడం, తను ఉత్సాహంగా వెళ్లి పలకరించడం, కానీ ఆమె ముఖంలో ఏదో తెలియని చిరాకు, అసహనం కనిపించడంతో... తను వెంటనే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోవడం... ఇవన్నీ అతనికి ఇంకా గుర్తున్నాయి. ఆమెకు తనంటే ఇష్టం లేదా? లేక నన్ను గుర్తుపట్టలేదా? అనే ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడు విజయ్.
సరిగ్గా అదే సమయంలో...
"సారీ విజయ్, నిన్న నేను అలా ఉన్నందుకు..."
వెనక నుండి వచ్చిన ఆ సుపరిచితమైన స్వరం వినిపించగానే, విజయ్ తన ఆలోచనల ప్రపంచం నుండి ఒక్కసారిగా బయటపడ్డాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు.
ఎదురుగా ఇషా!
ఆమెను అంత దగ్గరగా చూడగానే విజయ్ కాస్త కంగారుపడ్డాడు. తను తాగుతున్న కాఫీ కప్పుని టేబుల్ మీద పక్కన పెట్టేసి, గౌరవంగా లేచి నిల్చున్నాడు. ఆమె కళ్ళలో ఒక విధమైన గిల్ట్ స్పష్టంగా కనిపిస్తోంది.
మళ్ళీ ఇషా తన గొంతు సవరించుకుని, కాస్త నెమ్మదిగా, "సారీ విజయ్" అంది. ఆమె వాయిస్ లో ఈసారి నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం ఉంది.
విజయ్ తేరుకుని, పెదవులపై ఒక చిన్న చిరునవ్వు తెచ్చుకుంటూ, "ఎందుకు సారీ ఇషా గారూ... నథింగ్... నేనేమీ అనుకోలేదు," అన్నాడు.
నిజానికి నిన్న ఇషా చూపులకి, ఆమె ప్రవర్తించిన తీరుకి విజయ్ కాస్త ఇబ్బంది పడ్డాడు. తన పలకరింపు ఆమెకు నచ్చలేదేమో అన్న మొహమాటంతోనే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆమె స్వయంగా వచ్చి క్షమాపణ అడిగేసరికి, అతనిలోని ఆ చిన్న అసంతృప్తి కూడా గాలిలో కలిసిపోయింది.
వాళ్ళిద్దరి మధ్య కొద్ది క్షణాల పాటు ఒక భయంకరమైన నిశ్శబ్దం. ఇద్దరికీ ఒకరికొకరు తెలుసు, ఒకే కాలేజ్, కానీ ఎప్పుడూ అంత క్లోజ్ గా మాట్లాడుకున్నది లేదు. ఇప్పుడు ఈ కొత్త వాతావరణంలో ఎలా సంభాషణ మొదలుపెట్టాలో ఇద్దరికీ అర్థం కావడం లేదు.
విజయ్ తమ మధ్య ఉండే ఈ బిగుతైన, ఇబ్బందికరమైన వాతావరణాన్ని డైవర్ట్ చేయడానికి, క్యాజువల్ గా అడిగాడు, "ఒక కాఫీ తాగుతారా?"
ఇషా ఒక క్షణం ఆలోచించి, చుట్టూ ఉన్న ఆ ప్లెజెంట్ వాతావరణాన్ని చూసి, "సరే..." అంది తల ఊపుతూ.
విజయ్ లోపలికి వెళ్లి ఇంకో కాఫీ ఆర్డర్ చేసి వచ్చాడు. ఇద్దరూ ఆ అరుగు మీద ఒకరికొకరు కొంచెం దూరంగా, రోడ్డు వైపు చూస్తూ కూర్చున్నారు. ఈ కాఫీ తాగే క్రమంలో వాళ్ళ మధ్య ఉన్న ఒక విచిత్రమైన, అదృశ్యమైన పొర నెమ్మదిగా తొలగిపోవడం మొదలైంది.
రోడ్ కి ఆపోజిట్ లో పెద్ద అక్షరాలతో నియాన్ లైట్స్ వెలుగుతున్న "అనుపమ బోటిక్" ఉంది. ఆ బోటిక్ ముందు చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి. లోపల ఆడవాళ్ళ హడావిడి ఇక్కడి నుండి కూడా స్పష్టంగా తెలుస్తోంది.
ఇషా తన కాఫీ కప్పును రెండు చేతులతో పట్టుకుని, అటువైపు చూస్తూ నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది. "బేసికల్లీ... నాకు ఈ షాపింగ్ చేయడం అంటే అస్సలు రాదు విజయ్. నా టేస్ట్ వేరు, ఇక్కడ మార్కెట్ లో ఉండే ట్రెండ్స్ వేరు. నిన్న నేను ఒక్కదాన్నే ఆ అనుపమ బోటిక్ లోకి షాపింగ్ కి వచ్చాను..." అంటూ కాస్త ఆగి, ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది.
"ఇంకో పదిరోజుల్లో నా పెళ్లి."
ఆ మాట వినగానే విజయ్ చేతిలో ఉన్న కాఫీ కప్పు కాస్త వణికినట్లు అనిపించింది. కానీ అతను దాన్ని బయటపడనివ్వలేదు. అతని ముఖంలో చిన్న ఆశ్చర్యం, దాని వెంటే ఒక ఫార్మల్ స్మైల్.
"ఓహ్... కంగ్రాట్యులేషన్స్!" అన్నాడు విజయ్, తన స్వరాన్ని వీలైనంత సాధారణంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ.
"థ్యాంక్స్..." అంది ఇషా అప్రయత్నంగా. ఆమె మనసులో ఉన్న భారం కాస్త తగ్గించుకోవాలన్నట్టుగా, ఏమీ ఆలోచించకుండా తన మనసులోని మాటలను విజయ్ తో పంచుకోవడం మొదలుపెట్టింది.
"లాస్ట్ నెల నుండి షాపింగ్ చేస్తున్నా విజయ్. తిరిగీ తిరిగీ అలిసిపోయాను కానీ, ఇంకా డ్రెస్సెస్ ఫైనలైజ్ అవ్వడం లేదు. నాకేమో ఒకలా కావాలి అనుకుంటాను, తీరా చూస్తే వాళ్ళు చూపించేవి నాకు అస్సలు ఎక్కవు. పైగా పెళ్లి అంటే వంద రకాల పనులు, అందరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. ఆ స్ట్రెస్ అంతా నా మీద పడింది. నిన్న ఆ బోటిక్ లో గంటల తరబడి వెతికినా నాకు నచ్చిన ఒక్క చీర కూడా దొరకలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో, కాస్త చిరాకుగా ఉన్నాను. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. సరిగ్గా అప్పుడే విజయ్... నువ్వు అనుకోకుండా పలకరించావు."
ఆమె తన వైపు తిరిగి చూస్తూ మళ్ళీ చెప్పింది, "నిజంగా, ఆ టైమ్ లో నిన్ను చూస్తానని నేను అస్సలు ఊహించలేదు. అసలు నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలా బ్లాంక్ గా ఉండిపోయాను. కొద్దిసేపటికి నార్మల్ అయ్యి నీతో మాట్లాడదాం అనుకునే లోపే... నువ్వు మళ్ళీ వెంటనే వెళ్ళిపోయావు. అప్పటినుండి నాకు చాలా గిల్టిగా అనిపించింది. నిన్ను హర్ట్ చేశానేమో అనిపించింది. అందుకే ఇప్పుడు నిన్ను చూడగానే ఫస్ట్ సారీ చెప్పేశాను."
ఆమె మాటలు వింటున్న విజయ్ కి, ఆమె పడుతున్న కంగారు, పెళ్లి షాపింగ్ తెచ్చిన స్ట్రెస్ స్పష్టంగా అర్థమయ్యాయి. అతను కొన్ని క్షణాల్లోనే ఇషా వేసుకున్న డ్రెస్ ని, తన డ్రెస్సింగ్ సెన్స్ ని చాలా నిశితంగా గమనించాడు.
ఇషా ఒక సింపుల్ రెడ్ కలర్ కుర్తా టాప్, దానికి మ్యాచింగ్ బ్లూ జీన్స్ వేసుకుంది. ఆ కుర్తా మీద ఎలాంటి గ్రాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లేదు, చాలా ప్లెయిన్ గా, ఎలిగెంట్ గా ఉంది. ఆమె జుట్టును క్యాజువల్ గా ఒక క్లిప్ పెట్టుకుంది. మేకప్ కూడా చాలా సింపుల్ గా ఉంది... అసలు వేసుకున్నట్టు కూడా లేదు. పెదవులపై లైట్ లిప్ బామ్, కళ్ళకు కాస్త కాటుక. ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నవి. ఆమె ముఖంపై వేరే ఆర్నమెంట్స్ ఏమీ లేవు. మెడలో ఎలాంటి చైన్ లేదు. అయినా సరే, ఆమె ఆ సింప్లిసిటీలోనే చాలా అందంగా, హుందాగా కనిపిస్తోంది. ఆమెకు ఎందుకు ఆ బోటిక్ లోని గ్రాండ్ బట్టలు నచ్చలేదో విజయ్ కి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది.
విజయ్ తనని పైనుండి కింద వరకు అలా గమనిస్తున్నాడు అని ఆలోచన రాగానే, ఇషా కన్నులు వెంటనే అతని వైపు చూశాయి. ఆ చూపుల్లో ఒక చిన్న ప్రశ్న, ఒక చిన్న బిడియం.
విజయ్ కి ఏమీ మాట్లాడాలో టక్కున అర్థం కాలేదు. ఒక అమ్మాయిని అలా తదేకంగా చూడటం తప్పని రియలైజ్ అయ్యి, కవర్ చేసుకోవడానికి వెంటనే తన చేతిలో ఉన్న ఖాళీ కాఫీ కప్పుని పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో వేస్తూ అడిగాడు...
"మీకు ఆ బోటిక్ లో 'స్వర్ణ' తెలుసా?"
ఇషా కనుబొమ్మలు ముడిచి ఆలోచిస్తూ, "స్వర్ణనా? తెలియదే..." అంది.
"మీరు ఇప్పటికీ ఎన్ని సార్లు వెళ్ళారు ఆ బొటిక్ కి?"
"అబ్బా... అదో పెద్ద కథ. ఈ వారం రోజుల్లో ఒక నాలుగు సార్లు అయినా తిరిగి ఉంటాను."
"అయినా మీకు స్వర్ణ తెలియదా?" అన్నాడు విజయ్ కాస్త ఆశ్చర్యంగా.
"లేదు విజయ్. అక్కడ చాలా మంది సేల్స్ గర్ల్స్ ఉన్నారు. అందరూ ఏదో ఒకటి చూపిస్తూనే ఉన్నారు కానీ, నా టేస్ట్ కి తగ్గట్టు ఎవరూ క్యాచ్ చేయలేకపోయారు. ఇంతకీ ఈ స్వర్ణ ఎవరు?" అని అడిగింది ఇషా.
విజయ్ ముఖంలో ఒక చిరునవ్వు వెలిసింది. "తను అక్కడ వర్క్ చేస్తుంది. కానీ తను మిగతా వాళ్లలా కాదు. కస్టమర్ మైండ్ సెట్ ని, వాళ్ళ క్యారెక్టర్ ని బట్టి వాళ్లకి ఎలాంటి డ్రెస్స్ సూట్ అవుతుందో ఇట్టే పసిగట్టేస్తుంది. మీరు ఏమీ అనుకోకపోతే, ఈ రోజు నేను కూడా మీతోపాటు వచ్చి ఆ స్వర్ణ ని పరిచయం చేస్తాను. తను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మీ పెళ్లి షాపింగ్ కి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది." అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా.
ఇషా ఒక క్షణం ఆలోచించింది. పది రోజుల్లో పెళ్లి పెట్టుకుని, ఇంకా షాపింగ్ పూర్తికాని టెన్షన్ ఆమెను వేధిస్తోంది. ఒకవైపు కాలేజ్ మేట్, ఇన్నాళ్ల తర్వాత కలిశాడు... పైగా తనకు హెల్ప్ చేస్తానంటున్నాడు. కాదనలేకపోయింది. అతడు చూపిస్తున్న ఆ కన్సర్న్ ఆమెకు ఎందుకో బాగా నచ్చింది.
"ఓకే... అయితే వెళ్దామా?" అంటూ సరే అంది.
ఇద్దరూ ఆ అరుగు మీద నుండి లేచారు. ట్రాఫిక్ ని దాటుకుంటూ రోడ్డుకి అవతలి వైపు ఉన్న 'అనుపమ బోటిక్' వైపు అడుగులు వేశారు. ఆ నడిచే కొద్ది నిమిషాల వ్యవధిలో, వారిద్దరి మధ్య ఎన్నో ఏళ్ల నాటి కాలేజ్ పరిచయం, ఇప్పుడు ఒక కొత్త స్నేహంగా మారబోతోందన్న నిజం ఇద్దరికీ ఇంకా తెలియదు.
బోటిక్ డోర్ తీసుకుని లోపలికి వెళ్లగానే, ఏసి గాలి వారిని తాకింది. కలర్ ఫుల్ డ్రెస్సులు, కస్టమర్ల సందడి మధ్యలో... ఒక మూల కౌంటర్ దగ్గర బట్టలు సర్దుతున్న ఒక అమ్మాయి విజయ్ ని చూడగానే, ముఖమంతా నవ్వు పులుముకుని గట్టిగా అరిచింది.
"హాయ్ అన్నా!! ఎట్లున్నవు?"
ఇషా ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూసింది.



పాఠకులకు ఒక చిన్న విన్నపం...
ప్రియమైన పాఠకులకు నమస్కారం!
జీవితంలో మనం ఒకటి ప్లాన్ చేసుకుంటే, కాలం మనల్ని ఇంకో తీరానికి తీసుకెళ్తుంది. సరిగ్గా అలాంటి ఒక అనుకోని అందమైన ప్రయాణమే ఈ నా కొత్త సిరీస్ "పాదం నిలిచిన చోటు".
ఇది కేవలం ఒక సాధారణ ప్రేమకథ కాదు. జీవితంలో మనకు నిజమైన ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? బంధాల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలు, గతం తాలూకు జ్ఞాపకాలు మన వర్తమానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఏ బంధానికి పేరు పెట్టలేకపోయినా, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఆ పరిపక్వమైన అనుబంధం ఎలా ఉంటుంది? అనేవి ఈ కథలో చాలా సహజంగా, లోతుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
ఈ ఎమోషనల్ అండ్ ఫీల్-గుడ్ జర్నీలో విజయ్, ఇషాలతో పాటు మీరు కూడా మనస్ఫూర్తిగా ప్రయాణిస్తారని ఆశిస్తున్నాను. నా మునుపటి రచనలను ఆదరించి, ప్రోత్సహించినట్లే... ఈ కొత్త సిరీస్ కు కూడా మీ అపారమైన ప్రేమను అందిస్తారని నమ్ముతున్నాను.
కథను క్రమం తప్పకుండా ప్రతి భాగం ఉత్కంఠభరితంగా మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను.
మీ సపోర్ట్ నాకు చాలా అవసరం:
ప్రతి భాగం చదివిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాలను కచ్చితంగా కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. మీ ప్రతి కామెంట్, విమర్శ నాకు మరింత బాగా రాయడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
కథ నచ్చితే రేటింగ్ మరియు రివ్యూ ఇవ్వడం మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే నా బలం.
మరి ఇంకెందుకు ఆలస్యం, విజయ్ మరియు ఇషాల ప్రపంచంలోకి అడుగుపెడదామా?
కథలో కలుద్దాం!
కృతజ్ఞతలతో...
మీ రచయిత