Donar in Telugu Anything by Writer raguvaran books and stories PDF | Donar

Featured Books
Categories
Share

Donar

పిల్లల కోసం తపిస్తున్న చంద్రిక, డోనర్‌ను అంగీకరించలేకపోతుంది; మరోవైపు ప్రతాప్ తన లోపం వల్ల భార్యకు అన్యాయం చేశాననే అపరాధభావంతో, ఎలాగైనా తండ్రి కావాలని కోరుకుంటాడు.
తన జీవితంలో పెళ్లి, ప్రేమ రెండింటిలోనూ ఓడిపోయిన రుద్ర, చంద్రిక–ప్రతాప్‌ల కుటుంబానికి దగ్గరవుతూ తనకంటూ ఒక భావోద్వేగ బంధాన్ని వెతుక్కుంటాడు.
ప్రేమలో మోసపోయిన అంజు, రుద్రను నమ్మి అతనితో కొత్త జీవితాన్ని ఊహిస్తుంది; కానీ రుద్ర జీవితంలోకి వచ్చిన ఈ కొత్త బంధం ఆమె ప్రేమకు పరీక్షగా మారుతుంది.
చంద్రికకు కావాల్సింది బిడ్డ, ప్రతాప్‌కు కావాల్సింది భార్య సంతోషం, రుద్రకు కావాల్సింది ప్రేమ, అంజుకు కావాల్సింది రుద్రతో జీవితం—నలుగురి కోరికలు ఒకే చోట ఢీకొంటాయి.
ఒక బిడ్డ కోసం తీసుకోబోయే “డోనర్” నిర్ణయం, ఈ నలుగురి మధ్య ప్రేమ, స్నేహం, దాంపత్యం, నమ్మకాలను ఎంతవరకు మార్చబోతుందో అదే కథ.

అధ్యాయం — ఒక రిపోర్ట్... నాలుగు జీవితాలు

బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రి.

ఆసుపత్రి కారిడార్ అంతా పిల్లల నవ్వులతో నిండిపోయింది. ఒకవైపు చిన్నారులు పరుగులు తీస్తుంటే, మరోవైపు తమ పిల్లల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ముఖాల్లో ఆందోళన కనిపిస్తోంది. గోడల నిండా నవ్వుతున్న చిన్నపిల్లల ఫొటోలు ఉన్నాయి.

ఆ నవ్వుల మధ్యలోనే...

ఒక రిపోర్ట్ టేబుల్ మీదకు జారిపడింది.

డాక్టర్ ఆ రిపోర్ట్‌ను మరోసారి చూసి, ఎదురుగా కూర్చున్న చంద్రిక వైపు చూశాడు.

“సారీ మేడమ్... సారీ మిసెస్ చంద్రిక. ఇలా చెప్పడం బాధగా ఉండొచ్చు. మీ ఆయన పర్మి కౌంట్ చాలా తక్కువగా ఉంది. ఉన్న వాటిలో కూడా యాక్టివ్‌గా ఉన్నవి నాకు కనిపించలేదు.”

చంద్రిక చేతిలోని రిపోర్ట్‌ను మెల్లగా తీసుకుంది.

డాక్టర్ కొనసాగించాడు.

“మీకు నిజంగా పిల్లలు కావాలంటే... మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి... ఎవరైనా అనాథ పిల్లలను పెంచుకోవడం. రెండోది... డోనర్ ద్వారా ప్రయత్నించడం.”

చంద్రిక ఏమీ మాట్లాడలేదు.

రిపోర్ట్‌లోని అక్షరాలను చూస్తూ ఉండిపోయింది.

తర్వాత నెమ్మదిగా తన భర్త ప్రతాప్ వైపు చూసింది.

“ఏం చేద్దాం?”

ప్రతాప్ కళ్లను కిందకు వంచుకున్నాడు.

“సారీ...”

అతని మాట పూర్తయ్యేలోపే చంద్రిక అడ్డుకుంది.

“మీరు సారీ చెప్పడం ఎందుకు? వదిలేయండి.”

డాక్టర్ కొద్దిసేపు వాళ్లిద్దరినీ చూసి,

“ఎవరినైనా వెతుకువచ్చారా?” అని అడిగాడు.

చంద్రిక తల ఊపింది.

“మూడేళ్లు అవుతుంది సర్. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. అనాథ పిల్లలను పెంచుకోవడం అయినా... డోనర్ ద్వారా వచ్చిన పిల్లలు అయినా... వాళ్ల గురించి నాకు ఏమీ తెలియదు. నాకు నచ్చదు. నా వల్ల కాదు సర్.”

అని చెప్పి రిపోర్ట్‌ను తన హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుంది.

“వెళ్దాం.”

ప్రతాప్ ఏమీ మాట్లాడకుండా ఆమె వెంట నడిచాడు.

కారులోకి వెళ్లిన చంద్రిక ముందుగా రిపోర్ట్ ఉన్న బ్యాగ్‌ను వెనుక సీట్లో పెట్టి, ముందు సీట్లో కూర్చుంది.

ప్రతాప్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.

కారు నెమ్మదిగా ఆసుపత్రి నుంచి బయటికి వచ్చింది.

బెంగళూరు ట్రాఫిక్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు.

కొద్దిసేపటికి ట్రాఫిక్‌లో కారు ఆగిపోయింది.

ప్రతాప్ స్టీరింగ్‌పై చేతులు ఉంచుకుని విసుగ్గా అన్నాడు.

“ఈ ట్రాఫిక్‌తో చావవుతుంది.”

అంతలో చంద్రిక ఫోన్ మోగింది.

“హలో?”

అవతల నుంచి ఎవరో మాట్లాడుతున్నారు.

“ఏంటి? జాబ్ అని వెళ్లారు... ఇంటి దగ్గర మమ్మల్ని మొక్కల్ని వదిలేశారు కదా!”

చంద్రిక చిరాకుగా ఊపిరి తీసుకుంది.

“ఎప్పుడు చూడు ఇదే నా అమ్మ. ఇక్కడ బ్రతకడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? అయినా నాకు, ప్రతాప్‌కి ఇప్పుడే పిల్లలు కనడం లేదు. ఊరికే విసిగించకండి. ఇక్కడ పని చాలా కష్టంగా ఉంది. ఎందుకని మీరు చెబితే వినరు?”

అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

ప్రతాప్ ఆమె వైపు చూశాడు.

“చంద్రా... అలా ఎందుకు అంత సైలెంట్‌గా ఉంటావ్?”

ఆమె స్పందించలేదు.

“నాదే తప్పు. కానీ నేను కావాలని చేయలేదు కదా. కొంపతీసి సినిమాలోలాగా నన్ను కూడా వదిలేయవు కదా?”

చంద్రిక అతని వైపు చూసింది.

“నిజంగా నిన్ను వదిలేసే ఉద్దేశం ఉంటే ఇంట్లో చెప్పకపోయానా? ఇప్పుడు కాకపోతే మళ్లీ నేను చెప్పిన పని నువ్వు ఎప్పుడైనా చేశావా?”

ప్రతాప్ మౌనంగా ఉన్నాడు.

“మందు, సిగరెట్ లాంటివి మానేయమని ఎప్పటినుంచో చెబుతున్నా. స్ట్రెస్ తీసుకోకు. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పిన నువ్వు వినలేదు. వినకపోతే ఇప్పుడు నిన్ను నువ్వు తప్పు చేశానని గిల్టీగా ఫీల్ అవ్వడం వల్ల ఏం లాభం?”

ఆమె స్వరం కొంచెం మృదువైంది.

“నువ్వు ఇప్పటికైనా నీ పని నువ్వు సరిగ్గా చేస్తే... మనకు పాపో, బాబో పుడతారు. మందు, సిగరెట్ లాంటివి మానేయి. ఎక్కువ ఆలోచించకు.”

ప్రతాప్ ఏదో చెప్పబోతుండగా...

“హే చంద్రా! ప్రతాప్! ఆగండి... వెళ్లకండి! వచ్చేస్తున్నా!”

అని ఎవరో దూరం నుంచి అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు.

రుద్ర.

కారు ఆపగానే ప్రతాప్ నవ్వుతూ,

“రా రా! ఎక్కడికి వెళ్లావు? చాలా రోజులుగా కనిపించడం లేదు,” అన్నాడు.

“ఇంటికి వెళ్లి వస్తున్నా.”

అని చెప్పి రుద్ర వెనుక సీట్లో కూర్చున్నాడు.

ఇద్దరి ముఖాలు చూసి,

“ఏంటి? ఇద్దరూ చాలా వింతగా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమా?” అన్నాడు.

చంద్రిక వెంటనే మాట మార్చింది.

“ఏంటి రా... ఈరోజు పెళ్లిచూపులు అని బాగానే డుమ్మా కొట్టావు కదా? అప్పుడే వచ్చేశావ్?”

రుద్ర నిట్టూర్చాడు.

“ఏం పెళ్లిచూపులు? నా ఆకారం చూసి పెళ్లికూతురు భయపడినట్టుంది. నాకొద్దు... వద్దనే వద్దు అని తరుముకుంది.”

కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి,

“ఆ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేయలేక మైండ్ రిఫ్రెష్ కోసం మళ్లీ జాబ్‌లోకి వచ్చేసా.”

ప్రతాప్ నవ్వాడు.

“అయ్యో! జాబ్‌లోకి వస్తే రిఫ్రెష్ కాదు. ఉన్న డేటాబేస్ పోతుంది.”

“పోతే పోయింది. బొక్కలో డేటాబేస్. ఇప్పుడు పోయినా పరువు కంటే తక్కువ ఏం కాదు.”

రుద్ర చిరాకుగా అన్నాడు.

“మనుషులు అనుకుంటూ సేవ్ చేసుకుందాం లే.”

చంద్రిక నవ్వింది.

కొద్దిసేపటికి ముగ్గురూ మాట్లాడుకుంటూ తమ ఫ్లాట్ దగ్గరకు చేరుకున్నారు.

చుట్టూ దాదాపు పదిహేను ఐదంతస్తుల భవనాలు వరుసగా ఉన్నాయి.

ముగ్గురూ లిఫ్ట్‌లోకి ఎక్కారు.

రుద్రకు చంద్రిక చేతిలో ఉన్న బ్యాగ్ కనిపించింది.

“ఏంటి బ్యాగ్‌లో ఏదో రిపోర్ట్‌లా ఉంది?”

అని బ్యాగ్ వైపు చూడబోయాడు.

చంద్రిక వెంటనే జిప్ వేసేసింది.

“కనీసం నీకు సిగ్గు లేదా? పక్క వాళ్ల ప్రైవసీని దొంగతనంగా చూడ్డం అంటే?”

రుద్ర నవ్వాడు.

“అంతేలే చంద్రా... నా గురించి నేను చెప్పాను. కానీ మీ గురించి మీరు చెప్పారు కదా! నన్ను ఎప్పుడో బయటికి గెంటేశారు కదా!”

చంద్రిక కళ్లతోనే బెదిరించింది.

“ఇంకొంచెం సేపు ఉంటే లిఫ్ట్‌లో నుంచి తోసేస్తా.”

ముగ్గురూ నవ్వుకున్నారు.

ఆ నవ్వుల మధ్య చంద్రిక రిపోర్ట్‌ను పక్కకు తోసేసింది.

“ఇది కూడా మీకు తెలియాలి కదా. మన ఫ్రెండ్ సతీష్ గాడికి పిల్లలు పుట్టారంట.”

ప్రతాప్ ఆశ్చర్యంగా చూశాడు.

“అవునా?”

“వాడి బర్త్‌డే పార్టీకి ఓపెనింగ్ అందరినీ పిలిచాడంట. వాళ్లిద్దరికీ జీతాలు కూడా బాగానే ఉన్నాయి. భార్యకి అటు ఇటుగా తొంభై వేలు... భర్తకి యాభై, అరవై వేల వరకు. అందుకే అందరికీ టెక్కు చూపిస్తూ ఉంటారు.”

ప్రతాప్ నవ్వాడు.

“అయినా సీనియర్ కదా. ఆ మాత్రం ఉంటుందిలే.”

రుద్ర వెంటనే అన్నాడు.

“వాళ్ల టెక్కు దించాలంటే అందరం వెళ్లి వాళ్ల ఫుడ్ అంతా తినేయాలి. ఆ దెబ్బకి జేబులో ఉన్న డబ్బులు ఖాళీ.”

ప్రతాప్ సీరియస్‌గా ముఖం పెట్టాడు.

“వేశావులే జోకు. నవ్వలేక చచ్చిపోతున్నాం.”

“అవును, ఎప్పుడు పార్టీ?”

“ఈరోజు అంటే?”

“ఈరోజుకి ఇంకో రెండు రోజుల్లో పార్టీ రెడీ అవుతుంది.”

“అప్పుడే ఇన్వైట్ కూడా చేశాడా?”

“అబ్బో! వాళ్లది మామూలు టెక్కు కాదు. ఎక్కడెక్కడి నుంచి బంధువులు వస్తున్నారంట. అందుకే వాళ్లకి ఇస్తూ... మనకూ ఇచ్చేద్దామని వచ్చారంట.”

ప్రతాప్ కాసేపు ఆలోచించాడు.

“సతీష్ గాడి జీవితం బాగుంది. వాడు నాకంటే అంత అందంగా కూడా ఉండడు. నాకూ వాడి మాదిరే హైట్ ఉంది. వెయిట్ ఉంది. నెలకు యాభై వేల పైనే వస్తుంది. వాడికి పెళ్లి ఎలా అయింది? నాకెందుకు రిజెక్ట్ అయింది?”

చంద్రిక నవ్వింది.

“అందరి జీవితం ఒకలా ఉండదు. ఎవరి కష్టాలు వాళ్లవి... ఎవరి ఆనందం వాళ్లది.”

తలుపు తెరిచి లోపలికి వెళ్తూ,

“ఈ కాలంలో డామినేషన్ అబ్బాయిలది కాదు... అమ్మాయిలది. వాళ్లు ఏమనుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న అమ్మాయిలకు మెచ్యూరిటీ ఉంటే నీలాంటి అబ్బాయిని ఎందుకు వద్దంటారు? దాని గురించి ఆలోచించకు. కావాలంటే నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరైనా ఉంటే పరిచయం చేస్తా.”

అని నవ్వుతూ లోపలికి వెళ్లిపోయింది.

రుద్ర కూడా తన గదిలోకి వెళ్లి స్నానం చేసి వంట చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ఇంతలో ప్రతాప్ వచ్చాడు.

“హలో... ఈరోజు మా ఇంట్లో చిన్న పార్టీ. భోజనం చేయకు.”

“దేనికి పార్టీ?”

“చేసుకోవడానికి డబ్బులు ఉంటే చాలు. పండగలు పంపాలి అవసరమా?”

రుద్ర నవ్వాడు.

ప్రతాప్ కూడా నవ్వుతూ,

“అంటే... ఈరోజు నుంచి మేము వ్రతం చేస్తున్నాం. ఈసారైనా గట్టిగా పిల్లల్ని కనాలి.”

రుద్ర వెంటనే,

“హలో! పూజలు చేస్తే పిల్లలు పుట్టారా? ఏది చేయాలో అది చేస్తే పుడతారు.”

“మాకు తెలుసు బట్... చంద్రిక కోరిక. తను ఏదో పూజ చేస్తుంది. రాత్రి ఎనిమిది గంటలకల్లా అయిపోతుంది. ఆ తర్వాత ఫుడ్ రెడీ చేశాం. వచ్చి తిను.”

అని చెప్పి బయటకు వెళ్లబోతున్నాడు.

అప్పుడే రుద్ర వెనక్కి తిరిగి చూశాడు.

“ఇంత తొందరగా ఎక్కడికి?”

ప్రతాప్ నవ్వాడు.

“పద... అలా వెళ్లి చిన్న సిగరెట్ కొట్టేద్దాం. ఇంటికి వచ్చేలోపు వ్రతం చేయొచ్చు.”

రుద్ర అసహ్యంగా ముఖం పెట్టాడు.

“ఛీ దరిద్రుడా! ఇంట్లో పూజ పెట్టుకొని సిగరెట్ తాగుతాను అంటావా?”

“ఏంటి అంత మాట అంటున్నావ్? నేనేమీ తాగి పూజ చేస్తానని అనలేదు కదా. చాలా టెన్షన్‌గా ఉంది. తల పగిలిపోతున్నట్టు ఉంది. ఒక పఫ్ లాగితే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది.”

“నాకైతే నేను రాను.”

రుద్ర చెప్పగానే ప్రతాప్ అతని చొక్కా పట్టుకున్నాడు.

“రా!”

అంటూ లాక్కెళ్లిపోయాడు.

సిటీకి కొంచెం అవతల ఓ చిన్న డాబా దగ్గర ఇద్దరూ కూర్చున్నారు.

ప్రతాప్ సిగరెట్ వెలిగించాడు.

రుద్ర మాత్రం టీ తాగుతూ దూరంగా చూస్తున్నాడు.

“ఏంటో రా... పెళ్లిచూపుల్లో రిజెక్ట్ అయ్యానని డిప్రెషన్‌లోకి వెళ్తున్నా. చొక్కా వేసుకోవడం మర్చిపోతున్నా. అసలు నా ల్యాప్‌టాప్ ఎక్కడ పెట్టానో కూడా గుర్తుకు రావడం లేదు.”

ప్రతాప్ నవ్వాడు.

“ఓహో...”

“సారీ.”

“అది సరే. చంద్రిక ల్యాప్‌టాప్ పనిచేయకపోతే నీది వాడుకుంది. అది ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఇంటికి వెళ్లిన తర్వాత ఇచ్చేస్తానులే.”

రుద్ర ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు.

“మీ దగ్గరే ఉందా? నాది ఎక్కడ పోయిందో అని మళ్లీ ఆఫీసులో గలాటా చేయాలో అని భయపడి చచ్చాను.”

“సారీ రా.”

“పర్లేదు. మీ దగ్గరే కదా ఉండేది.”

సాయంత్రం దాదాపు ఏడు గంటలకు ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు.

వాళ్లు లోపలికి అడుగుపెట్టగానే చంద్రిక కోపంగా బయటికి వచ్చింది.

“ఎన్నిసార్లు చెప్పాలి ఇలా బయటికి వెళ్లి సిగరెట్ తాగొద్దని?”

ప్రతాప్ వెంటనే చేతులు పైకెత్తాడు.

“లేదు బేబీ... లేదు చంద్రా. నేను తాగలేదు. కావాలంటే రుద్రనే అడుగు. ఇద్దరం టీ తాగి వస్తున్నాం.”

చంద్రిక అతని చొక్కా పట్టుకుంది.

“అబద్ధం చెప్పకు.”

అని చొక్కా దగ్గరికి ముఖం తీసుకెళ్లి వాసన చూసింది.

“సిగరెట్ వాసన వస్తోంది.”

ప్రతాప్ తలదించుకున్నాడు.

“సారీ.”

రుద్ర వెంటనే పక్కకు తిరిగి నవ్వుతూ,

“ఏంటమ్మా మీ ఇద్దరూ? రొమాన్స్ చూపించడానికి నన్ను తీసుకొచ్చారా?”

చంద్రిక అతని వైపు చూసింది.

“అది ఒక్కటే తక్కువ. నువ్వు వెళ్లి స్నానం చేసుకో.”

అని ప్రతాప్ చొక్కా పట్టుకుని లోపలికి లాక్కెళ్లింది.

రుద్ర వాళ్లిద్దరినీ చూస్తూ నవ్వుకున్నాడు.

కానీ...

ఆ రోజు టేబుల్ మీద పడిన ఆ చిన్న రిపోర్ట్ మాత్రం...

నలుగురి జీవితాలను ఎంతగా మార్చబోతుందో అప్పటికి వాళ్లలో ఎవరికీ తెలియదు.