నీల అయాన్ వైపు చూస్తూనే ఉంది.
అయాన్ మాత్రం పూర్తిగా ఏదో మాయలో పడిపోయినట్టుగా ఆమెనే చూస్తున్నాడు. అతని చూపు నీల ముఖం మీద నుంచి పక్కకు తప్పడం లేదు.
ఆ నిశ్శబ్దంలో నీల నెమ్మదిగా పిలిచింది.
“అయాన్...”
ఆ ఒక్క పిలుపులోనే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
ఇప్పటికైనా నిజం చెబుతావా?
ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది ఒప్పుకుంటావా?
అయాన్ ఏమీ మాట్లాడలేదు.
నీల కళ్లలోకి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.
నీల మరో అడుగు ముందుకు వేసింది.
“అయాన్...”
ఆమె గొంతు వినగానే అతని ఛాతీలోని కోర్ ఒక్కసారిగా వేగంగా స్పందించింది.
అతను తనను తాను నెమ్మదించుకోవడానికి ప్రయత్నించాడు.
కంట్రోల్... అయాన్. కంట్రోల్.
ఇప్పటికీ నీ మనసులో దాచుకుంటావా?
ఎందుకు ఒప్పుకోవడం లేదు?
అతని సిస్టమ్‌లో ఆలోచనలు వేగంగా పరుగులు తీస్తున్నాయి.
చివరికి అయాన్ తన చూపును నీల మీద నుంచి తిప్పుకున్నాడు.
“నీలా... నేను ఒక రోబోని.”
అతని గొంతులోని భావాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది.
“మన ఇద్దరి మధ్య ఇది వర్కవుట్ అవ్వదని నీకు చాలాసార్లు చెప్పాను.”
నీల ముఖంలో ఉన్న చిన్న ఆశ ఒక్కసారిగా మసకబారింది.
ఆమె కొద్దిసేపు అతని వైపు చూస్తూ ఉండిపోయింది.
“మరి...”
ఆమె గొంతు కాస్త వణికింది.
“నాకు కాలి నొప్పి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అంత రియాక్ట్ అయ్యావు?”
అయాన్ సమాధానం చెప్పడానికి కాసేపు ఆగాడు.
“నువ్వు మా సార్ కూతురివి. నిన్ను నాకు అప్పగించారు. నిన్ను జాగ్రత్తగా తిరిగి ఆయనకు అప్పగించాలి. అది నా బాధ్యత.”
చాలా సాధారణమైన విషయాన్ని చెబుతున్నట్టుగా అన్నాడు.
నీల అతని వైపు చూస్తూనే ఉంది.
ఆమె ఏమీ మాట్లాడలేదు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి.
తర్వాత మెల్లగా అడిగింది.
“అయితే... అపార్ట్మెంట్‌లో పిల్లలు నన్ను ఏడిపించినప్పుడు?”
అయాన్ ఆమె వైపు చూశాడు.
“ఆ ఆకతాయిలకు ఎందుకు వార్నింగ్ ఇచ్చావు?”
అతను మౌనంగా ఉన్నాడు.
“అంతేకాదు...”
నీల ఒక్కొక్క ప్రశ్నను అతని ముందుంచసాగింది.
“ఆ రోజు నువ్వు ఎందుకు వేరే వెర్షన్‌లోకి వెళ్లిపోయావు?”
అయాన్ కళ్లలో చిన్న కదలిక.
“ఎందుకు?”
నీల అడిగింది.
“నిజం చెప్పు అయాన్.”
అయాన్ మళ్లీ చూపు తిప్పుకున్నాడు.
నీల మాత్రం ఆగలేదు.
“నేను ఏం చెప్పకముందే... నేను ఏ విషయం గురించి మాట్లాడబోతున్నానో నీకు ఎలా తెలుసు?”
అయాన్ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు.
“నేను ఏమీ చెప్పలేదు కదా... మరి నీకు ఎలా తెలిసింది?”
అతని దగ్గర సమాధానం లేదు.
నీల స్వరంలో ఇప్పుడు బాధతో పాటు చిన్న చిరునవ్వు కూడా కలిసింది.
“సరే... అదంతా పక్కన పెడదాం.”
ఆమె అతని ముఖాన్ని గమనిస్తూ అంది.
“నన్ను ఒక్కోసారి దొంగతనంగా ఎందుకు చూస్తావు?”
అయాన్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు.
“నేను నిన్ను చూడనట్టు అనుకుంటావేమో... కానీ నాకు తెలుసు.”
అయాన్ వెంటనే చూపు పక్కకు తిప్పుకున్నాడు.
“అదేమీ లేదు నీలా.”
“ఏమీలేదా?”
“నేను మామూలుగానే చూశాను. అంతే.”
అతను తన పైపు చూడకుండా, ఎదురుగా ఉన్న చీకటి వైపు చూస్తూ అన్నాడు.
నీల అతన్ని కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయింది.
ఆ తర్వాత మెల్లగా నవ్వింది.
“ఓహో...”
ఆ నవ్వులో బాధ ఉంది.
“అంతా ఇంతేనా?”
అయాన్ ఏమీ మాట్లాడలేదు.
“నేను మా ప్రొఫెసర్ కూతురిని కాబట్టే ఇవన్నీ చేశావు...”
ఆమె తల ఊపింది.
“సరే.”
ఒక్క క్షణం ఆగి, నీల అతని కళ్లలోకి చూస్తూ అంది.
“అయితే ఆ ప్రొఫెసర్ కూతురిని... ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే?”
అయాన్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు.
నీల ఆ చూపును గమనించినా, తన మాటను కొనసాగించింది.
“నీకు ఓకేనా?”
అయాన్ ఏమీ మాట్లాడలేదు.
నీల గొంతు మరింత మృదువైంది.
“అప్పుడు నువ్వు నన్ను దొంగచాటుగా చూడాల్సిన అవసరం ఉండదు.”
ఒక్క క్షణం అతని కళ్లలోకి నేరుగా చూస్తూ...
“నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు.”
ఆమె కళ్లలో నీళ్లు చేరుతున్నాయి.
కానీ వాటిని బయటకు రానివ్వకుండా ప్రయత్నిస్తూ చివరి మాట అంది.
“సరే అయితే...”
చిన్న విరామం.
“నీ మనసులో నేను లేను కదా?”
అయాన్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
నీల తన చూపును కిందికి దించింది.
“అయితే నేను వేరే వాళ్లని చూసుకుంటాను.”
ఆ మాట వినగానే...
అయాన్ ఒక్కసారిగా నీల వైపు చూశాడు.
అది ఇంతకుముందు ఆమె చూసిన అయాన్ చూపు కాదు.
ఆ చూపులో ఏదో తెలియని తీవ్రత ఉంది.
నీల కూడా అతని కళ్లలోకి చూసింది.
ఇద్దరి మధ్య మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది.
కానీ ఈసారి...
ఆ నిశ్శబ్దం వెనుక దాగి ఉన్నది ఒక ప్రశ్న కాదు.
ఒక నిజం.
అయాన్ ఎంతకాలంగా తనలో దాచుకున్నాడో... అతనికే తెలియని ఒక నిజం.
అతని కోర్ మళ్లీ వేగంగా స్పందించడం ప్రారంభించింది.
CORE ACTIVITY: ABNORMAL
EMOTIONAL RESPONSE: UNIDENTIFIED
అయాన్ ఆ సమాచారాన్ని పట్టించుకోలేదు.
అతని చూపు మాత్రం నీల మీద నుంచి కదల్లేదు.
ఎందుకంటే...
“నీలను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే?”
అనే ఒక్క ఆలోచన అతని మొత్తం సిస్టమ్‌ను తలకిందులు చేస్తోంది.
అయాన్ నీల వైపు చూస్తూనే ఉన్నాడు.
ఆ చూపులో ఈసారి ఎప్పటిలా తప్పించుకోవాలనే ప్రయత్నం లేదు.
ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా ఉంది.
నీల కూడా అతని కళ్లలోకి చూస్తూ మౌనంగా నిలబడింది.
“అయాన్...?” అని మళ్లీ మెల్లగా పిలిచింది.
అతను ఏదో చెప్పబోయాడు.
అంతలో—
“SYSTEM ALERT...”
అయాన్ కళ్లలో ఒక్కసారిగా ఎర్రటి కాంతి మెరిసింది.
నీల ఆశ్చర్యంగా అతని వైపు చూసింది.
“ఏమైంది అయాన్?”
అయాన్ మాత్రం సమాధానం చెప్పలేదు.
కొన్ని క్షణాల తర్వాత అతని సిస్టమ్‌లో ఒకే ఒక్క వాక్యం కనిపించింది—
“EMOTIONAL RESPONSE IDENTIFIED.”
అతని కళ్లలోని కాంతి మెల్లగా తగ్గింది.
నీలకు తెలియని ఒక నిజం...
అయాన్‌కి మాత్రం అప్పటికే స్పష్టంగా అర్థమైంది.
తాను ఆమెను కోల్పోవాలనుకోవడం లేదు.
కానీ ఆ నిజాన్ని నీల ముందు చెప్పగలడా?
లేక... మరోసారి తన మనసును దాచుకుంటాడా?
అయాన్ పెదవులు కదిలాయి.
“నీల... నేను—”
ఇప్పుడు అయినా అయాన్ తన మనసులో ఏముందో తెలుసుకోగలిగాడా?
నిజంగా అయాన్ నీలను ప్రేమిస్తున్నాడా?
తన పరిధిని దాటి ఆ నిజాన్ని నీలతో చెప్పగలడా?
లేక... ఎప్పటిలాగే
“నేను ఒక రోబోని...” అంటూ తన మనసును తన పరిధిలోనే బంధించుకుంటాడా?
తెలుసుకోవాలంటే...
నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే... ♥️
మీ అక్షరమౌనం