You are mine - 2 in Telugu Love Stories by Vijayalaxmi Velamala books and stories PDF | నా నువ్వే - 2

Featured Books
Categories
Share

నా నువ్వే - 2

“సార్ ఎవరితో మాట్లాడారు? నీ ఒక్కదానితో తప్ప...” అని భవ్య అనడంతో వెంటనే కీర్తి,

“హలో పాపా... ఆగు! నాతో ఎప్పుడూ మాట్లాడారు ఆయన?” అని అడుగుతుంది.

“అంటే... నిన్ను ఎప్పుడూ తిడతారు కదా... దాన్ని మాట్లాడడం అంటారు మీ ఊరిలో?” అని వెటకారంగా అంటుంది కీర్తి.

“నీతో అలా అయినా మాట్లాడుతారు కదా...” అని భవ్య అనడంతో ప్రియ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది.

ప్రియ అలా నవ్వడంతో కీర్తి కోపంగా ప్రియ వైపు చూస్తుంది.

కీర్తి కోపాన్ని అర్థం చేసుకున్న ప్రియ, బలవంతంగా వస్తున్న నవ్వుని ఆపుకుని మనసులోనే నవ్వుకుంటుంది.

“అయినా ఆ సార్‌ని ఎలా లవ్ చేశావే?” అని కీర్తి చిరాకుగా భవ్యను అడుగుతుంది.

“ఏమో తెలీదే... ఆరు నెలల నుంచి ఆ సార్ అంటే నాకు ఇష్టం. ఆ సార్ తప్ప ఇంకెవ్వరూ నా మనసులోకి రావడం లేదు. విరాట్ సార్‌ని చూడడం కోసం నేను కాలేజీకి వస్తున్నానంటే తెలుసా?

ఆ సార్ కోసం నేను నా గుండెలో గుడి కట్టుకున్నా... నా గుండె గుడిలో ఉన్న దేవుడు నా విరాట్ సార్...” అని భవ్య చెప్తుంటే,

“హ్మ్మ్... ఒక్క కొబ్బరికాయ తెచ్చి ఆ సార్ నెత్తిమీద కొట్టు. పీడ విరగడవుతుంది...” అని వెటకారంగా అంటుంది కీర్తి.

కీర్తి మాటలు విని ప్రియ తన చేతిని నోటికి అడ్డం పెట్టుకుని మరీ నవ్వుతుంది.

“ప్లీజ్ కీర్తి... నువ్వు తప్ప ఈ హెల్ప్ నాకు ఎవ్వరూ చెయ్యరు...” అని భవ్య కీర్తిని రిక్వెస్ట్ చేస్తుంది.

“చూడు భవ్య... నీ కర్మ కొద్దీ ఆ సార్‌ని లవ్ చేశావ్.

ఈ లెటర్ కూడా నువ్వే ఇవ్వు. అప్పుడే బాగుంటుంది. నువ్వే నీ లవ్‌ని సార్‌కి చెప్తే సార్‌కి అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో గుడి, దేవుడు అన్నావు కదా... ఆ మాటలన్నీ ఏవో సార్‌కి చెప్తే ఆయనే అర్థం చేసుకుంటారు.”

“అవును భవ్య... కీర్తి చెప్పింది నిజమే. కొంచెం ధైర్యం తెచ్చుకుని నువ్వే సార్‌తో చెప్పు...” అని కీర్తిని సమర్థిస్తూ మాట్లాడింది ప్రియ.

“అంత ధైర్యం ఉంటే నేను కీర్తిని ఎందుకు హెల్ప్ అడుగుతాను?” అని భవ్య నిరాశగా అంటుంది.

“సారీ భవ్య... ఇది నా వల్ల కాదు...” అని కీర్తి అనగానే భవ్య ఏడుపు మొహం పెట్టి,

“సెకండ్ సెమిస్టర్‌లో నువ్వు 10 మార్క్స్ క్వశ్చన్ రాయకపోతే నేనే కదా నీకు చూపించాను... నేను మాత్రం ఈ చిన్న హెల్ప్ అడిగితే నువ్వు చెయ్యట్లేదు...” అని అంటుంది.

“ఏంటమ్మా చిట్టి తల్లి... చిన్న హెల్ప్ ఆ?” అని కీర్తి ఆశ్చర్యంగా అడుగుతుంది.

“ప్లీజ్ కీర్తి... నా ప్రేమని నీ చేతిలో పెడుతున్నా. దాన్ని గెలిపిస్తావని ఆశగా ఎదురుచూస్తున్నా...” అని భవ్య అంటుంది.

‘నీ ప్రేమ మండిపోను... నీ ప్రేమ నా మెడకి చుట్టుకుంది కదే...’ అని మనసులోనే తిట్టుకుంటూ,

“సర్లే... ఏదో ఒకటి చేస్తా,” అని కీర్తి చెప్పగానే,

“థ్యాంక్యూ కీర్తి!” అని హ్యాపీగా కీర్తిని హగ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది భవ్య.

“ఇదిగో భవ్య...” అని కీర్తి పిలుస్తుంది.

కీర్తి పిలవగానే భవ్య వెనక్కి తిరిగి,

“ఏంటి కీర్తి?” అని అడుగుతుంది.

“ఇంకెప్పుడూ ఆ సెకండ్ సెమిస్టర్ 10 మార్క్స్ గురించి మాట్లాడకు. అలా అని ప్రామిస్ చేస్తేనే నేను ఈ హెల్ప్ చేస్తా,” అని కీర్తి భవ్య దగ్గర ఇంకెప్పుడూ ఆ టాపిక్ గురించి మాట్లాడనని ప్రామిస్ తీసుకుంటుంది.

@@@##&&&&

“ప్రియా... ఆకలి అవుతుంది. త్వరగా తీసుకురా!” అని హాల్‌లో కూర్చొని గట్టిగా అరుస్తుంది కీర్తి.

“అబ్బా... అరవకే! వస్తున్నా...” అని రెండు ప్లేట్లలో ఫుడ్ తీసుకుని వస్తుంది ప్రియ.

“హమ్మయ్య... వచ్చేసావా?” అని ప్రియ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని తినడం స్టార్ట్ చేస్తుంది కీర్తి.

ఫుడ్ తింటూ,

“అయినా ఆ భవ్య ఆ సైకోని ఎలా లవ్ చేసిందే బాబు... దానికి అస్సలు టేస్ట్ లేదు. పిచ్చి మొహం ది,” అని కీర్తి అంటుంది.

“హ్మ్మ్... నీ లాంటి పర్ఫెక్ట్ పర్సన్స్‌కి అలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ నచ్చారులే...” అని వెటకారంగా అంటుంది ప్రియ.

ఆ మాటలకు కీర్తి మూతి ముడుచుకుని ప్లేట్‌లో ఉన్న ఫుడ్ మొత్తం తినేసి,

“థ్యాంక్యూ బంగారం... ఫుడ్ చాలా బాగుంది,” అని ప్రియ తలపై ముద్దు పెడుతుంది.

ప్రతిరోజూ రెండు, మూడు గంటల వరకు ఫోన్ చూసుకుని పడుకునే కీర్తి... ఈరోజు మాత్రం బుద్ధిగా పది గంటలకే ఫోన్ పక్కన పెట్టి పడుకోవడం చూసి ప్రియ షాక్ అవుతుంది.

“ఏంటి పాపా... తుఫాను, సునామీ లాంటివి ఏమైనా వస్తున్నాయా?” అని ప్రియ అడుగుతుంది.

“ఏంటే... నేనేమైనా వెదర్ రిపోర్ట్‌లో వర్క్ చేస్తున్నానా? నన్ను అడుగుతున్నావ్?” అని కీర్తి విసుగ్గా అంటుంది.

“అది కాదే... తమరు పది గంటలకే పడుకోవడానికి రెడీ అవుతున్నావ్ కదా... అందుకనే అడుగుతున్నా.”

“హ్మ్మ్... రేపు ఆ సైకో సార్ క్లాస్ ఉంది కదా. మళ్లీ క్లాస్‌లో నిద్రపోతే ఆ సార్‌లో ఉన్న రాక్షసుడు బయటికి వచ్చి నన్ను టార్చర్ చేస్తారు కదా... అందుకే త్వరగా పడుకుంటున్నా,” అని కీర్తి దుప్పటి కప్పుకుని పడుకుంటుంది.

“పోనీలే... ఆ విరాట్ సార్ దయవల్ల అయినా నీకు జ్ఞానోదయం వస్తుంది,” అని ప్రియ కూడా పడుకుంటుంది.

కొద్దిసేపటికి కీర్తి ఫోన్ రింగ్ అవుతుంది.

“అబ్బా... ఈ టైమ్‌లో ఎవరు రా బాబు?” అని ఫోన్ చూడగా భవ్య అని ఉంటుంది.

‘దీనికి ఆ సైకో చేతిలో బలి అయ్యేంతవరకు ఆత్రం ఆగడం లేదేమో...’ అని తిట్టుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి,

“హలో... ఏంటి ఈ టైమ్‌లో కాల్ చేశావ్?” అని కోపంగా అడుగుతుంది కీర్తి.

“విరాట్ సార్‌కి కచ్చితంగా ఆ లెటర్ ఇస్తావ్ కదా?” అని భవ్య అడుగుతుంది.

“విరాట్ సార్... విరాట్ సార్... విరాట్ సార్...

ఒక పని చెయ్యి... విరాట్ సార్ అని తపస్సు చెయ్యి. నీ తపస్సుకి మంత్రముగ్ధుడు అయ్యి నిన్ను లవ్ చేస్తాడు,” అని కోపంగా అంటుంది కీర్తి.

“లెటర్ ఇస్తా లే!” అని చెప్పి కాల్ కట్ చేస్తుంది.

“ప్రియా... ఆ లెటర్‌లో ఏం రాసిందో ఒకసారి చదువుదామా?” అని కీర్తి అడుగుతుంది.

“అలా వేరే వాళ్ల లెటర్ చదవడం మానర్స్ కాదే,” అని ప్రియ చెప్పడంతో,

“నిజమేలే... అయినా ఆ సైకోకి అర్థమైపోతుంది మనం లెటర్ ఓపెన్ చేసి చదివామని. మళ్లీ క్లాస్ పీకుతాడు,” అని కీర్తి అంటుంది.

కొద్దిసేపటికి ఇద్దరూ నిద్రపోతారు.

@@@@@##

మరుసటి రోజు ఉదయం కీర్తి, ప్రియ త్వరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్లిపోతారు.

కరెక్ట్‌గా టైమ్ తొమ్మిది అయ్యింది.

విరాట్ సార్ క్లాస్‌లోకి ఎంట్రీ ఇస్తారు.

విరాట్ రావడం చూసి,

“సార్ వచ్చేశారు. బుద్ధిగా క్లాస్ విను... ఎలాంటి తింగరి పని చెయ్యకు,” అని ప్రియ కీర్తికి చెప్తుంది.

“సర్లే,” అని కీర్తి క్లాస్ వింటుంది.

కాసేపటికి కీర్తికి ఆకలి వేయడంతో తన బ్యాగ్‌లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ తీస్తుంది.

విరాట్ బోర్డు వైపు తిరగడం చూసి ఒక బిస్కెట్ తీసి నోట్లో పెట్టుకుంటున్న టైమ్‌లో విరాట్ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు.

కీర్తి బిస్కెట్ తింటున్నట్టు దొరికిపోతుంది.

‘వామ్మో... చూసేశాడా? అయినా ప్రతి సారీ ఈయనకి దొరికిపోతాను ఏంటి రా దేవుడా? ఇప్పుడు ఏం అంటాడో ఏంటో...’ అని మనసులో భయపడుతుంది కీర్తి.

ఇదంతా చూసిన ప్రియ, కీర్తి దగ్గరికి వచ్చి మెల్లగా,

“విరాట్ సార్ చేతిలో తిట్లు తినడం నీకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కదా... ఇంకా అది మారదు లే,” అని అంటుంది.

విరాట్ కీర్తి వైపు చూసి,

“నిల్చో!” అని గట్టిగా అరుస్తాడు.

ఆ అరుపుకి క్లాస్ అంతా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు.

చేసేదేం లేక కీర్తి నిల్చుంటుంది.

“ముందు చెప్పిన క్వశ్చన్‌కి ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పు,” అని విరాట్ అడగడంతో కీర్తి వెంటనే ప్రియని నెమ్మదిగా అడుగుతుంది.

“ప్రియా...”

“ఐదు,” అని ప్రియ నెమ్మదిగా కీర్తికి మాత్రమే వినిపించేలా చెప్తుంది.

కీర్తి వెంటనే,

“ఫైవ్ సార్,” అని ఆన్సర్ చెప్పేసరికి... తన పక్కన ఉన్న ప్రియ కీర్తికి హెల్ప్ చేసిందని విరాట్‌కి అర్థమవుతుంది.

“ఇక్కడికి వచ్చి ఆ ఆన్సర్ ఎలా వచ్చిందో చేసి చూపించు,” అని విరాట్ అనేసరికి చేసేదేం లేక కీర్తి ముందుకు వెళ్తుంది.

విరాట్ కీర్తిని చూస్తూ,

“దేనికి... ఆన్సర్ వచ్చా? రాదా?” అని అడుగుతాడు.

“రాదు సార్...” అని కీర్తి చెప్పడంతో,

“బయటికి పో!” అని విరాట్ గట్టిగా చెప్తాడు.

కీర్తి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్లిపోతుంది.

క్లాస్ అయిపోవడంతో విరాట్ బయటికి వస్తాడు.

కీర్తి పాటలు పాడుకోవడంలో లీనమైపోతుంది.

విరాట్ కోపంగా కీర్తి వైపు చూస్తాడు.

విరాట్‌ని చూసిన కీర్తి ఒక్కసారిగా పాటలు ఆపేసి,

“సార్...” అని అనబోయేలోపే విరాట్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

‘దేవుడా... ఎందుకయ్యా నేను అంటే అంత కోపం నీకు?

ప్రతి సారీ ఈ రాక్షసుడికి దొరికేలా చేస్తావ్...’ అని మనసులో అనుకుంటుంది కీర్తి.

ఈలోపు ప్రియ అక్కడికి వచ్చి,

“ఒసేయ్ కీర్తి... నువ్వు మారవా? ఎన్ని సార్లు చెప్పాలే నీకు? ఆయన క్లాస్‌లో జాగ్రత్తగా ఉండు, ఎలాంటి తింగరి పని చెయ్యకు అని...

ఏదో ఒకటి చేసి సార్‌తో తిట్లు తినకపోతే నీకు రోజు గడవదు,” అని కీర్తికి చివాట్లు పెడుతుంది.

“వదిలేయ్ వే... ఇదంతా నా కర్మ. పద... క్యాంటీన్‌కి వెళ్దాం,” అని ప్రియతో అంటుంది కీర్తి.

ఇద్దరూ క్యాంటీన్‌లోకి వెళ్లి కూర్చుంటారు.

కీర్తి ఫోన్ చూడగానే భవ్య నుంచి మెసేజ్ వస్తుంది.

“కీర్తి... ఈరోజు నేను కాలేజ్‌కి రావడం లేదు. నువ్వు విరాట్ సార్‌కి లెటర్ ఇవ్వడం మర్చిపోకు.”

“అబ్బా... ఈ భవ్య ఒక్కర్తి నా ప్రాణం మీదకి! దీని పని ఇలా కాదు...” అని అనుకుని,

“ప్రియా... ఒక మంచి ప్లాన్ చెప్పు. ఆ విరాట్ సార్‌కి లెటర్ ఎలా ఇవ్వాలి?” అని కీర్తి అడుగుతుంది.

“ఏంటే... నిజంగా ఆ లెటర్ ఇస్తావా సార్‌కి? నీకు ఇంత ధైర్యం ఎప్పుడొచ్చిందే?” అని ప్రియ అడుగుతుంది.

“అది కాదే... ఆ లెటర్ ఆ సైకోకి ఇచ్చేస్తే ఆ రాక్షసుడే దాని పని చూసుకుంటాడు. అప్పుడు కానీ ఆ భవ్య తిక్క కుదరదు,” అని కీర్తి అంటుంది.

కీర్తి, ప్రియ కలిసి లెటర్ విరాట్‌కి ఇవ్వడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తారు?




                 To be continued ❤️