Ishwar's second wife in Telugu Love Stories by Padmavathi Universe books and stories PDF | ఈశ్వర్ రెండో భార్య

Featured Books
Categories
Share

ఈశ్వర్ రెండో భార్య

రాత్రి రెండు గంటలు దాటింది.
పెద్దల ఒత్తిడితో, ఇరు కుటుంబాల పరువు కోసం జరిగిన ఆ పెళ్లి తంతు ముగిసి ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది.

వరండాలో ఆరిపోతున్న దీపాలు, నేలపై చెదిరిన తలంబ్రాలు. ఈశ్వర్ బరువైన అడుగులతో శోభనం గది వైపు నడుస్తున్నాడు. సమాజం అతనిపై వేసిన ముద్ర—'రెండో పెళ్లి వాడు'. మొదటి భార్య చనిపోయిన తర్వాత తన జీవితం ముగిసిపోయిందనుకున్నాడు.

కానీ కుటుంబం కోసం, తన ఒంటరితనాన్ని భరించలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లిపీటలపై ఉన్నప్పుడు ముసుగులో ఉన్న అమ్మాయిని అతను సరిగ్గా గమనించలేదు.

కానీ ఇప్పుడు, ఆమెకి తన జీవితంలో అత్యున్నత స్థానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాడు.

గది తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు.
గది నిండా గుభాళించే మల్లెల వాసన, పడకపై ఎర్రటి గులాబీ రేకలు. ఆ పూల మంచం అంచున, ఎర్రటి పట్టుచీర కట్టుకుని, తల నిండా ముసుగు వేసుకుని ఒదిగిపోయి కూర్చునుంది పెళ్లికూతురు.

ఈశ్వర్ తలుపు మూసి లాక్ చేశాడు. అతని మనసులో ఎన్నో ఆశలు, ఆమెను అలా  కంటికి రెప్పలా చూసుకోవాలో అన్న తపన.

మెల్లగా మంచం దగ్గరకు వెళ్లి, నేలమీద మోకాళ్లపై కూర్చున్నాడు. ముసుగు తీయకుండానే, ఆమెను ఎంతగా గౌరవిస్తున్నాడో చెప్పాలనుకున్నాడు.
"రాణీ..." అతని గొంతు ఎంతో ఆర్ద్రంగా పలికింది.
ఆమె శరీరంలో చిన్న వణుకు వచ్చింది కానీ కదలకుండా అలాగే కూర్చుంది.

"నాకు తెలుసు రాణీ... ఇది నాకు రెండో పెళ్లి. నా గతం గురించి బహుశా నీకు ఎంతోమంది ఎన్నో చెప్పి ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం నా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నాను... ఇది నాకు రెండో పెళ్లే కావొచ్చు, కానీ నా గుండెల్లో మాత్రం నిన్ను నా రాణిలా చూసుకుంటాను. మన కొత్త జీవితం ఎన్నో సంతోషాలతో నిండాలి. నీ కళ్లల్లో ఏనాడూ కన్నీరు రానివ్వను. నన్ను నమ్ము."

అతని కళ్లలో నీటిపొర కమ్మింది. ఎంతో భక్తిగా, ప్రేమగా ఆమె చీర అంచుని కాస్త పక్కకు జరిపాడు. 

అక్కడ పాలరాతి లాంటి తెల్లటి పాదాలు, వాటి అంచున ఎర్రటి పారాణి మెరిసిపోతోంది.

ఈశ్వర్ ఆ పాదాలను ఎంతో మృదువుగా తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. మెల్లగా తన చొక్కా గుండీలు తీసి, తన గుండెలపై ఆ పాదాలను అదిమి పెట్టుకున్నాడు.
"ఈ గుండె చప్పుడు వింటున్నావా? ఇది ఇకపై నీ కోసమే కొట్టుకుంటుంది. నీ పాదాలు ఎప్పుడూ కష్టంతో నేలమీద పడకూడదు... నా గుండె మీదే ఉండాలి."

అతని కంటి నుంచి రాలిన ఒక కన్నీటి చుక్క ఆమె పాదాలపై ఉన్న పారాణిపై పడింది.

ఈశ్వర్ తలవంచి, ఆ తెల్లటి పాదాలపై ఉన్న ఎర్రటి పారాణిపై ఎంతో సున్నితంగా ఒక ముద్దు పెట్టాడు. ఆ తర్వాత చాలా ప్రేమగా ఆ పాదాలను మంచంపై ఉన్న పూలరేకలపై ఉంచాడు.

ఇక ఆత్రుత ఆపుకోలేక మంచంపై ఆమె పక్కన కూర్చున్నాడు.
"రాణీ... ఒక్కసారి నీ ముఖం చూపించవా?" అంటూ వణుకుతున్న చేతులతో ఆ ఎర్రటి పట్టు ముసుగును నెమ్మదిగా పైకి లేపాడు.
ముసుగు తొలగింది.

దీపాల వెలుగు ఆమె ముఖంపై పడగానే... ఈశ్వర్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది! కళ్లు పెద్దవి చేసుకుని, నోట మాట రాక స్థంభించిపోయాడు.


ముసుగు తొలిగింది.
గదిలోని పాలవెలుగు ఆమె ముఖం మీద పడింది.

ఈశ్వర్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది! కళ్లముందు ఉన్నది రాణి కాదు! ఆ ఇంట్లో అంట్లు తోమే, ఇల్లు ఊడ్చే పనిమనిషి... పార్వతి!

ఒక్క ఉదుటున మంచం పైనుంచి వెనక్కి లేచాడు.
అసహ్యం. ఒళ్లంతా ఏదో విషపు పురుగు పాకినంత అసహ్యం.

కాసేపటి క్రితం తను ప్రాణంగా భావించిన పాదాలు... కన్నీటితో గుండెలపై పెట్టుకుని ముద్దాడిన ఆ పాదాలు... ఒక పనిమనిషివా?!
రక్తం మరిగిపోయింది. కళ్లల్లో ఎర్రటి నిప్పుకణాలు.

"నువ్వు... నువ్వా?!"
ఈశ్వర్ కంఠం గదిని చీల్చుకుంటూ గర్జించింది.

ఆమె భుజాలను తన బలమైన చేతులతో ఇనుప పట్కార్లతో పట్టినట్టు గట్టిగా పట్టేసుకున్నాడు.
"ఎంత ధైర్యం నీకు? ఒక పనిమనిషివి! నా పక్కన పడుకోవడానికి, సిగ్గులేకుండా పెళ్లిపీటలెక్కి కూర్చుంటావా?! నన్ను మోసం చేస్తావా? నన్నే మోసం చేస్తావా?!"


పార్వతి భుజాలెముకలు విరిగిపోయేంతగా పిండేస్తున్నాడు.
"మీలాంటి వాళ్ల గురించి నాకు బాగా తెలుసు... డబ్బు! ఆస్తి! అంతస్తు! ఆ డబ్బంటే మీలాంటి బిచ్చగత్తెలు ఏ గడ్డి అయినా తింటారు! నా ఇంట్లోనే  నా నెత్తిన ఇంత పెద్ద బండ వేశావా?!"

‘డబ్బు కోసం’ అనే మాట వినగానే పార్వతి గుండెల్లో సూది గుచ్చినట్టయింది.

కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కానీ పెదవి విప్పి మాట్లాడలేకపోతోంది. అసలు తనకేం తెలుసు? ఆ పెళ్లి మండపంలోకి తను ఎలా వచ్చిందో తనకే అర్థం కావడం లేదు.
మెలకువ వచ్చేసరికి ఈశ్వర్ మెడలో మూడు ముళ్ళు వేసేశాడు... తన నుదుట సింధూరం పెట్టేశాడు!


అప్పుడే... ఆమె మొద్దుబారిన మెదడులోకి ఒక చీకటి జ్ఞాపకం మెదిలింది.

రమ్య మేడం... రాణి గారి తల్లి!
'ఇదిగో పార్వతీ, బాగా అలిసిపోయావు... ఈ పాలు తాగు' అని చేతికి గ్లాసు ఇచ్చింది. ఆ పాలు తాగిన కాసేపటికే ఒంట్లోకి ఏదో మత్తు పాకింది. కళ్లు తిరిగాయి. సోఫా మీద వాలిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? రాణి ఏమైంది? తనని పెళ్లి బట్టలు వేసి ఎందుకు మండపంలో కూర్చోబెట్టారు? ఏదీ గుర్తులేదు!