ఆనందరావు నగరంలోని కోటీశ్వరులలో ఒకరు వ్యాపారంలో బాగా సంపాదించాడు. తన బావమరిది సబ్ ఇన్స్పెక్టర్గా ఆనగరంలోనే పనిచేస్తున్నాడు తన తమ్ముడు ఒక లాయర్ తన బంధువులు కూడా మంచి ధనవంతులు ఆనందరావుకు సంఘంలో మంచి పేరు కలదు. ఆనందరావుకు మాట వినే భార్య ఒక కొడుకు కూతురు ఉన్నారు కూతురి వివాహం తన స్నేహితుడైన జగన్మోహన్ గారి కుమారుడైన ఆర్యతో నిశ్చయించారు పెళ్ళికి రెండు రోజుల సమయం ఉంది ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి ఇంటి బయట కూడా డెకరేషన్ పనులు జరుగుతున్నాయి దాదాపు 30 మంది పెళ్లి పనుల్లో ఉన్నారు.
ఆనందరావు భార్య సుభద్ర ఇంట్లో పనులు పర్యవేక్షిస్తూ ఉన్నది. ఆనందరావు కూతురు సుమ తన స్నేహితురాలతో సరదాగా మాట్లాడుతూ ఉంది ఆనందరావు కొడుకు అమర్ సెల్ ఫోన్ను చూస్తూ గేమ్స్ ఆడుతున్నాడు ఇంటి లోపల అందరూ ఆడవాళ్లు పనిచేస్తున్నారు. ఆనందరావు ఇంట్లో పనిమనిషి హేమ సొంత ఇంటి మనిషి లా అందరికీ పనులు పురమాయిస్తూ ఉంది.ఇంటి లోపల,బయట చాలా సందడిగా ఉంది.
ఇంతలో పనిమనిషి హేమ సుభద్ర దగ్గరికి వచ్చి అమ్మగారు వంట పనుల్లో సహాయం చేయడానికి మరియు కొన్ని బరువులు మోయడానికి ఒక ఇద్దరు మగవాళ్లు కావాలి. బయట పనిచేసే వారిలో ఇద్దరినీ పిలిపించండి అని అడిగింది సుభద్ర కిటికీలో నుండి బయటకు చూసింది అందరినీ పరిశీలించింది వారిలో ఒకడు పాతిక సంవత్సరాల యువకుడు కనిపించాడు మరి సన్నగా లేడు లావుగా లేడు తెల్లగా ఎత్తుగా ఉన్నాడు అయితే ఇప్పటి యువకుల్లా ఫ్యాషన్ దుస్తులు ధరించలేదు పని బాగా చేస్తున్నాడు. ఎందుకో అతడు పనిచేస్తుంటే అలా చూడాలనిపిస్తుంది ఇంకొక యువకుడు కూడా దాదాపు అదే వయస్సులో నల్లగా సన్నగా ఉన్నాడు మిగిలిన వారంతా 50 సంవత్సరాల పైబడిన వారే. వెంటనే సుభద్ర లేబర్ కాంట్రాక్టర్ ని పిలిచి ఆ ఇద్దరినీ ఇంటి లోపల పనులకు పంపమని అడిగింది మేస్త్రి బయట పనిచేస్తున్న వారిద్దరినీ లోపలికి తీసుకొని వచ్చాడు సుభద్ర మీ పేర్లు ఏమిటి అని అడిగింది నల్లగా బలహీనంగా ఉన్న అబ్బాయి రహీం అని చెప్పాడు.తెల్లగా ఎత్తుగా ఉన్న అబ్బాయి కార్తీక్ అని చెప్పాడు. ఇంట్లో హేమ చెప్పే పనులు చేయాలని చెప్పింది సరే అని వారు హేమ చెప్పే పనులు చేయసాగారు.
మధ్యాహ్నం అయింది బయట ఉన్నవారు భోజనాలు చేయసాగారు రహీం కూడా బయటకు వెళ్లి భోజనం చేసి వచ్చి పనులు చేయసాగాడు కార్తీక్ మాత్రం బయటకు వెళ్లలేదు పనులు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆనందరావు అతని బావమరిది సురేంద్ర వచ్చారు సుభద్ర వారితో మాట్లాడుతూ వారికి భోజనాలు వడ్డించింది వారు భోజనాలు చేయసాగారు ఇంట్లో పనిచేస్తున్న అందరూ భోజనాలు చేశారు మరియు పనులు చేయసాగారు కార్తీక్ మాత్రం భోజనం చేయలేదు అలాగే పని చేస్తున్నాడు ఇదంతా సుభద్ర గమనిస్తూనే ఉంది. సమయం నాలుగు గంటలు కావస్తోంది సుభద్ర హాల్లోకి వచ్చి అన్ని పరిశీలించి చూసింది అందరూ పనులు చేస్తున్నారు
ఇంతలో పెళ్లికూతురు సుమ సుభద్ర దగ్గరికి వచ్చి అమ్మ మన వీధి చివరన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి టెంకాయ కొట్టి వస్తాను నా ఫ్రెండ్స్ ను తీసుకొని వెళ్తాను తోడుగా అని అడిగింది సుభద్ర సరేలే కారు తీసుకుని వెళ్ళు అని చెప్పి హేమను తోడుగా వెళ్ళమని చెప్పింది వారు వెళ్ళిపోయారు. కార్తీక్ నీళ్లు తాగడం సుభద్ర చూసింది సుభద్ర కార్తీక్ దగ్గరికి వెళ్లి భోజనం చేశావా అని అడిగింది లేదు అమ్మగారు అని చెప్పాడు.
ఎందుకు చెయ్యలేదు అని అడిగింది నన్ను ఎవరు భోజనానికి పిలవలేదు అని చెప్పాడు అక్కడ భోజనం ఉంది కదా అందరూ తింటున్నారు వారిని ఎవ్వరు ప్రత్యేకంగా భోజనం చేయమని చెప్పలేదు భోజనం అక్కడ ఉంది అంటే తినమని అర్థం నిన్ను ప్రత్యేకంగా తినమని ఎవరు చెప్పరు అని కోప్పడింది.. వారి సంగతి నాకు తెలియదు అమ్మగారు నాకు భోజనం పిలుపు రాకపోతే నేను అక్కడికి వెళ్ళను తినను నేను పని చేయడానికి వచ్చాను భోజనం చేయమని చెబితే తింటాను లేకపోతే తినను అని వాదించాడు సుభద్రకు కోపం నషాలానికి అంటింది ఇంతలో ఆనందరావు అతని బావమరిది ఎస్ఐ సురేంద్ర వచ్చారు. సుభద్ర జరిగిన విషయం అంతా చెప్పింది. ఆనందరావుకు కార్తీక్ చెప్పిన దాంట్లో ఏమి తప్పు అనిపించలేదు.కానీ సురేంద్ర మా అక్కకి ఎదురు చెప్తావా?అంటూ చెయ్యెత్తి కొట్టబోయాడు.
అప్పుడు అకస్మాత్తుగా పనిమనిషి హేమ పెద్దగా కేకలు వేస్తూ లోపలికి పరిగెత్తుకుతూ వచ్చింది. అయ్యగారు, సుమా మేము గుడి నుండి బయటకు రాగానే నలుగురు యువకులు తుపాకులతో నన్ను మిగిలిన వారిని బెదిరించి సుమను కారులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు అని ఆయాసపడుతూ చెప్పింది. ఆనందరావు హడలిపోయాడు సుభద్ర నెత్తిన పిడుగు పడినట్లు అయింది.సురేంద్ర కూడా షాక్ లోకి వెళ్లిపోయాడు. హాలంతా నిశ్శబ్దం అయిపోయింది ఎవ్వరికి ఏమీ పాలు పోలేదు వెంటనే సురేంద్ర తేలుకొని హేమ వారు ఏ వైపు వెళ్తున్నారు? అని అడిగాడు. వారు తూర్పు వైపు రోడ్డులో వేగంగా వెళుతున్నారు అని చెప్పింది సురేంద్ర "బావ నాతోరా ఫంక్షన్ అని నేను యూనిఫామ్ లేకుండా సింగిల్ గా వచ్చాను నేను ఫోన్ చేసి పోలీస్ ఫోర్సును పంపమని అడుగుతాను "అని ఫోన్ స్టేషన్కు చేసి విషయం అంతా వివరించి కానిస్టేబుల్స్ ను పంపమని చెప్పాడు.బయటకు సురేంద్ర ఆనంద్ రావు వెళుతూ కార్తీక్ ను రహీంను మరికొందరిని వారికి సహాయంగా పోలీసు వెహికల్ లో ఎక్కించుకొని వేగంగా వెళ్ళసాగారు.
వారు అలా ఐదు నిమిషాల పాటు వేగంగా వెళుతూ ఉండగా సుమ కారు కనపడింది. వారు కారును వేగంగా నడపగా కారులోని దుండగులు ముఖానికి ముసుగులు ధరించి ఉన్నారు వారు పోలీసు వాహనం తమను వెంబడించసాగింది అని తెలుసుకొని కారును ఒక పాడుబడిన ఫ్యాక్టరీలోకి దారి మళ్లించారు ఫ్యాక్టరీ గేటును ఢీ కొట్టుకుంటూ లోపటికి వెళ్లిపోయారు.పోలీసు వాహనం కూడా వారిని అనుసరిస్తూ వెళ్ళింది.వారు కారు దిగగానే సుమను బలవంతంగా బయటకు దించి ఫ్యాక్టరీ లోకి తీసుకెళ్లసాగారు.సురేంద్ర కూడా వాయువేగంతో వాహనం ఆపి తుపాకీ తీసుకొని కిందకు దిగాడు. ఆనందరావు,కార్తీక్,రహీం మరికొంతమంది పనివాళ్ళు కూడా దిగారు.వెంటనే అగంతకులు కాల్పులు జరపసాగారు. ఆ కాల్పులకు బదులుగా తుపాకీతో కాలుస్తూ సురేంద్ర,ఆనందరావు, కార్తీక్ మాత్రం ముందుకు వెళ్ళసాగారు.మిగిలిన కూలి వాళ్లు భయంతో కూలీ పని కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవాలా? మాకేం సంబంధం అని భయపడి కారు దగ్గర నిలబడిపోయారు.
సురేంద్ర,ఆనందరావు కాల్పులను తప్పించుకుంటూ ఫ్యాక్టరీ లోపలికి వెళ్లారు. లోపల హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. కార్తీక్ ఆనందరావు సురేంద్ర వెనకాలే వెళ్తున్నారు సురేంద్రకు వారు ఎవరో ఎందుకు ఇలా చేసారో అర్థం కావడం లేదు. ఆనందరావుకు మైండ్ మొత్తం బ్లాక్ అయింది. ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు తను ఎవరికీ అన్యాయం పని చేయలేదు తనకి శత్రువులు ఎవరూ లేరు తను చాలా భయస్తుడు ఎవరితోనూ గట్టిగా మాట్లాడింది లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?ఇందులోనుండి నా కూతుర్ని కాపాడుకోగలనా లేదా? ఇది బయటకు తెలిస్తే తన కూతురు పెళ్లి జరుగుతుందా లేదా అని భయపడసాగాడు. అలా కాల్పులు జరుపుకుంటూ అగంతకులు ఫ్యాక్టరీ లోపలనే తిరుగుతున్నారు. కార్తీక్ బాగా ఆలోచించి సురేంద్రను దాటి కాల్పులను తప్పించుకుంటూ మెరుపు వేగంతో సుమను పట్టుకున్న వారిని తోసివేసి సుమ చేయి పట్టుకొని వేగంగా, చాకచక్యంగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు.వారు కాల్పులు జరుపుతూ పారిపోయారు వెంటనే సుమను కార్తీక్ కారులో ఎక్కించుకొని డ్రైవ్ చేసుకుంటూ నగరంలోకి వెళ్లిపోయాడు. ఫ్యాక్టరీ బయటకు వచ్చిన సురేంద్ర ఆనందరావుకు సుమ కారు గాని సుమా కార్తీక్ కనపడలేదు. బయట ఉన్న కూలీలు కార్తీక్ సుమను తీసుకొని కారులో వెళ్లిపోయాడు అని చెప్పారు.సరే అని ఆనందరావు, సురేంద్ర ఇంటికి వెళ్లారు. ఆనందరావుని చూడగానే సుభద్ర ఏడుస్తూ ఎదురు వెళ్లి సుమ ఎక్కడ అని అడిగింది. సురేంద్ర ఆనందరావు షాక్ అయ్యారు కార్తీక్ సుమా మాకంటే ముందుగా కారులో బయలుదేరారు ఇంకా ఇల్లు చేరలేదా?అని అడిగారు. రాలేదండి అని సుభద్ర ఏడుస్తూ చెప్పింది.
వారు కొయ్యబారిపోయారు. సురేంద్ర ఆనందరావు ఒక అరగంట ఎదురుచూసిన కార్తీక్ సుమ ఇంటికి రాలేదు దీంతో వారికి అనుమానం ఎక్కువ అయ్యింది. సురేంద్ర లేబర్ కాంట్రాక్టర్ ని పిలిచి కార్తీక్ గురించి వివరాలు అడ్రస్సు అడిగాడు. అప్పుడు ఆ లేబర్ కాంట్రాక్టర్ అతని వివరాలు అడ్రస్సు తెలియదు అని బదులిచ్చాడు. సురేంద్ర కోపంతో బూటు కాలితో తన్నాడు ఎవడో తెలియని వాడిని పనికి ఎలా తీసుకొచ్చావు?అంటూ చెంప మీద మళ్ళీ కొట్టాడు. నిజం సార్ తను ఎవరో నిజంగా నాకు తెలియదు. ఫంక్షన్ కోసం 30 మంది కూలీలు కావాలని అడిగారు. వారిలో ఒకనికి జ్వరం వచ్చి రాలేకపోయాడు. అప్పుడు కార్తీక్ కనబడితే కూలికి వస్తావా అని అడిగాను. కూలీతో పాటు భోజనం పెడతామని చెప్పాను. సరే అని వచ్చాడు అంతే సార్ అంటూ చెప్పాడు.సురేంద్ర కోపంతో వాని వివరాలు మీలో ఎవరికైనా తెలుసా అని గట్టిగా అడిగాడు. సార్ కార్తీక్ బ్యాగ్ నా దగ్గర ఉంది అని రహీమ్ బ్యాగ్ ఇచ్చాడు.
సురేంద్ర ఆ బ్యాగ్ అంతా వెతికాడు. కొన్ని బట్టలు, సర్టిఫికెట్లు ఒక లెటర్ ఉన్నాయి. సర్టిఫికెట్స్ చూశాడు లెటర్ చదివిన సురేంద్ర కోపంతో ఊగిపోతూ కార్తీక్ ఒక హంతకుడు. వాడు ఒక యావజ్జీవ కారాగార శిక్ష పడ్డఖైదీ. వాడి చదువు అంతా జైల్లో సాగింది. ఇటీవలే జైలు నుంచి విడుదలై వచ్చాడు అని చెప్పగానే ఆనందరావు కుప్పకూలిపోయాడు. సుభద్ర సొమ్మసిల్లిపోయింది. కూలీ అంతా కొయ్యబారిపోయారు ఇల్లంతా గప్చిప్ అయిపోయింది.