అలా వారం రోజులు గడిచిపోయాయి.
ఒకరోజు ఆనందరావు, సత్య కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. అది నగరంలోనే ఖరీదైనది మరియు ధనవంతులు వెళ్లేది. వారు లోపలికి వెళ్లే దారిలో కార్తీక్ కనిపించాడు. చాలా ఖరీదైన దుస్తులు ధరించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అతను సూట్ ధరించి ఉన్నాడు. కార్తీక్ చెప్పే మాటలు వింటూ ఉన్నాడు.
ఆనందరావు కార్తీక్ ను పలకరించగానే సూటు ధరించిన వ్యక్తి, కార్తీక్ వైపు చూసి వెళ్తాను అన్నట్టుగా సైగ చేసి వెళ్ళిపోయాడు. ఆనందరావు, సత్యలు కార్తీక్ ఎదురుగా కూర్చున్నారు. కుశల ప్రశ్నలు అయిపోయాక ఆనందరావు " కార్తీక్ ఎలా ఉన్నావు? గాయం తగ్గిందా? ఇక్కడ ఎవరి కోసం వచ్చావు? ఆయన ఎవరు? " అని అడిగాడు.
అప్పుడు కార్తీక్, " గాయం చాలా వరకు తగ్గిపోయింది. సుమ బాగానే ఉంది కదా? తెలిసిన మనిషితో మాట్లాడడానికి వచ్చాను "అని చెబుతుండగా.... ఆనందరావు ఫోన్ మోగింది.
"ఇది ముఖ్యమైన ఫోన్ కాల్. మాట్లాడి వస్తాను "అని పక్కకు వెళ్ళాడు.
సత్య, "కార్తీక్! నీ గురించి నాకు అర్థం కావడం లేదు. మొన్న మా మామయ్య ఇంట్లో కూలీ పని కోసం వచ్చావు. ఇవాళ ఇంత ఖరీదైన హోటల్లో మంచి దుస్తులు ధరించి ధనవంతుడిగా కనిపిస్తున్నావు! నీ గురించి నిజం చెప్పు?"అని అడిగింది.
దానికి కార్తీక్, " సత్య! కొన్ని రహస్యాలు అందరికీ చెప్పడం కుదరదు. నీ సంగతికి వస్తే అందం, వయస్సు, ఆస్తి అన్నీ ఉన్న నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదు? నీ విషయం మీదే నీ నాన్న బెంగ పెట్టుకున్నాడు. ఆ రహస్యం ఏమిటో చెప్పు? " అనేసరికి...సత్యకు కోపం వచ్చింది.
నా గురించి అన్ని విషయాలు తెలుసు, కార్తీక్ అమాయకుడు కాదు అని అర్థం అయింది. "ఇందులో రహస్యం ఏమీ లేదు. పెళ్లిచూపులకై వచ్చిన అబ్బాయిలు నాకు నచ్చలేదు,అందుకే చేసుకోలేదు. నీ లాంటి వాడు వస్తే చేసుకుంటాను. ఏం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడిగింది.
అదే సమయానికి ఆనందరావు ఆ మాట వింటూ వచ్చాడు. వస్తూనే, " ఏంటమ్మా పెళ్లి చేసుకుంటా అంటున్నావ్, ఎవరిని? " అని అడగగా...
" అదేం లేదు మామయ్య. అబ్బాయి నాకు నచ్చితే పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నాను, అంతే" అన్నది.
ముగ్గురు కలిసి మాట్లాడుతూ భోజనం చేయసాగారు....ఆనందరావు అన్ని గమనిస్తూ ఉన్నాడు. ఎందుకో సత్య కార్తీక్ ను పదేపదే చూడ్డం, మాట్లాడడం చూసి సత్యకు కార్తీక్ అంటే ఇష్టమని అర్థమైంది. కానీ కార్తీక్ ఒక అనాధ మరియు అతని ఆర్థిక పరిస్థితి తెలియదు. ఒకరోజు పేదవానిలా కనిపించి ఈరోజు ధనవంతుడిలా మాట్లాడుతున్నాడు. ఇది జరిగే విషయం కాదులే అని ఆలోచించడం మానేశాడు.
భోజనం చేశాక కార్తీక్ వెళ్లిపోయాడు. ఇద్దరు బిల్ పే చేయడానికి వెళ్లారు. వాళ్ల బిల్ డబ్బులు తీసుకోలేదు ఎందుకంటే కార్తీక్ రెస్టారెంట్ ఓనర్ అని చెప్పేసరికి షాక్ అయ్యారు.
రెండు రోజుల తర్వాత సత్య యధావిధిగా తన ఇద్దరు స్నేహితులైన కబీర్, జాన్ తో కలిసి జాగింగ్ చేస్తూ పార్కులోనికి వెళ్లారు. ప్రతిరోజు అలా వెళ్లడం వారికి అలవాటే. పార్కులో ఒక చివర సత్య ప్రాణాయామం చేస్తుంటే, కబీర్ జాన్లు వర్కౌట్లు చేస్తుంటారు.. వారిద్దరూ కరాటే కూడా సాధన చేశారు. వాళ్లు ముగ్గురు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్.
సమయం తెల్లవారుజామున ఆరు గంటలు కావస్తోంది... చీకట్లు చిన్నగా తొలుగుతున్నాయి...
అప్పుడు నడి వయస్సు గల ఒక వ్యక్తి పరిగెత్తుతూ "కాపాడండి, కాపాడండి".. అని అరుస్తూ వీరి దగ్గరికి వచ్చాడు. వాళ్లు ముగ్గురు "నీకేం కాదు. మేమున్నాం" అంటూ ధైర్యం చెబుతుండగా...
సత్య అతన్ని గుర్తుపట్టింది. అతను ఎవరో కాదు తన దూరపు చుట్టం.. అయిన పెదనాన్న గారి అబ్బాయి. వరుసకు అన్న అయినటువంటి భుజంగం.
"భయపడకు.. నీకేమీ కాదు. ఏం జరిగింది? ఎవరు నిన్ను తరుముతున్నారు?" అని అడగింది సత్య.
"నేను, నా వాళ్లు ముగ్గురు కార్లో వస్తుండగా ముసుగు ధరించిన యువకుడు లారీ తో మా వాహనం ను ఢీకొట్టాడు. మాపై కాల్పులు జరుపగా ముగ్గురూ చనిపోయారు.నేను ఎలాగో తప్పించుకొని బయటపడితే నన్ను చంపాలని తుపాకీతో తరుముతున్నాడు "అని చెబుతుండగా...
ముసుగు ధరించిన యువకుడు అక్కడికి వచ్చాడు. అతని చేతిలో తుపాకీ కలదు. వస్తూనే...
"ఇందులో మీకు సంబంధం లేదు, దయచేసి వెళ్ళిపోండి "అని చాలా గట్టిగా ఆవేశంగా చెప్పాడు.
సత్య, "కబీర్, జాన్ ఎలాగైనా మా అన్నని కాపాడాలి" అని అనగానే వాళ్లు, "అతని దగ్గర గన్ లేకపోతే అతన్ని తుక్కుతుక్కుగా కొట్టే వాళ్ళం." అన్నారు.
అది విన్న ముసుగు మనిషి తుపాకీ దూరంగా విసిరే శాడు. దాంతో కబీర్, " సత్య! వాడిని మేము కొట్టే దెబ్బలకు చనిపోతే మాపై కేసు లేకుండా చూసుకోవాలి "అని నవ్వుతూ అన్నాడు.
భుజంగం వెంటనే, "వాడిని చంపండి లేదా బంధించండి. మీపై కేసు కాదు కదా కనీసం ఈగ కూడా వాడకుండా చూస్తాను, మరియు చెరి 10 లక్షలు ఇస్తాను" అంటూ ప్రకటించాడు.
రెట్టించిన ఉత్సాహంతో గాలిలో పల్టీలు కొడుతూ ఇద్దరు ఆ ముసుగు మనిషిపై విరుచుకుపడ్డారు. అతని ముఖంపై, గుండెలపై, తలపై పిడి గుద్దులు కురిపించారు. ఆ దెబ్బలకు ముసుగు వ్యక్తి మూతి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది మరియు రెండు అడుగులు వెనకకు పడిపోయాడు.
సత్య, భుజంగంలు సంతోషించారు. కబీర్ జాన్లు ఇద్దరూ, " ఏంటి ఒక్క రౌండ్కే పడిపోయాడు. చచ్చాడేమో చూడు" అంటూ హేళనగా మాట్లాడసాగారు.
ముసుగు వ్యక్తి మెల్లగా లేచి నిలబడ్డాడు. అతని బాడీ లాంగ్వేజ్ లో ఎలాంటి భయం, బేరుకు కనబడలేదు. దృఢంగా, స్థిరంగా నిలబడ్డాడు.
ఇంతలో కబీర్ ఒక్కడే వెళ్లి, చేతులతో దాడి చేయడం ప్రారంభించాడు. అయితే ఈసారి ముసుగు వ్యక్తి కబీర్ దెబ్బలు అన్నింటినీ తన రెండు చేతులతో అడ్డుకున్నాడు.. అలా అడ్డుకుంటూనే వీలు చూసుకొని ఒకే ఒక్క దెబ్బ గట్టిగా గుండెలపై కొట్టగానే కబీర్ కుప్పకూలిపోయాడు.
జాన్ దాన్ని చూసి ఆవేశపడి, కొంత అయోమయానికి లోనైనా ముందుకే ఉరికాడు. అతడు ముసుకు తొలగించాలని ప్రయత్నిస్తూ ఒక చేత్తో కొట్టడానికి ప్రయత్నిస్తూ రెండో చేత్తో ముసుగును తొలగించేలోగా... ముసుగు వ్యక్తి తన రెండు చేతులతో అతని రెండు చెవులపై గట్టిగా కొట్టేసరికి జాన్ పడిపోయాడు...
ముసుగు కూడా తొలగిపోయింది...
ముసుగు తొలిగిన ముఖాన్ని చూసి సత్య ఆశ్చర్యపోయింది. ఆ ముసుగు వ్యక్తి ఎవరో కాదు కార్తీక్...
ఏమి జరుగుతుందో అర్థం చేసుకునే లోపలనే కార్తీక్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి భుజంగం పైకి ఎగిరి అతని తల పట్టుకొని అలాగే కిందికి తోసేసాడు.. భుజంగం కింద పడగానే అతని తల బండరాయికి మోది రక్తం ధారగా కారుతూ తక్షణం మరణించాడు.
వెంటనే కార్తీక్ ఎగిరి ఎదురుగా ఉన్న గోడ దూకి పారిపోయాడు.. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది.
సత్య, " కార్తీక్ జైలు నుంచి వచ్చినా మంచివాడని అనుకున్నాను, కానీ తనకళ్ళ ముందే ఒక హత్య చేశాడు. అది తన సొంత అన్నయ్యని. అసలు కార్తీక్ భుజంగంను ఎందుకు చంపాడు? భుజంగంకు కార్తీక్కు సంబంధం ఏమిటి? " అని ఆలోచిస్తూ ఎలాగైనా సరే కార్తీక్ ను వదలకూడదని నిశ్చయించుకుంది.
ఆనందరావు సుభద్రలు సుమ గురించి మాట్లాడుకుంటున్నారు... కార్తీక్ వల్ల సుమ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది. సుమ చక్కగా కాపురం చేసుకుంటుంది..అని
ఇంతలో మేనేజర్ వచ్చి, "సార్ కార్తీక్ ను నిన్న పోలీసులు అరెస్టు చేశారంట. ఇప్పుడే విషయం తెలిసింది " అని చెప్పగానే...
ఆనందరావు, "పద స్టేషన్కు వెళదాం.ఏం జరిగిందో కనుక్కుందాం. అవసరం అనుకుంటే నా సొంత పూచి మీద విడిపిస్తాను" అంటూ పోలీస్ స్టేషన్కు బయలుదేరాడు. ఆనందరావు, మేనేజర్ తో పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడ ఎస్సైని కలిసి కార్తీక్ గురించి అడిగారు. దానికి ఎస్ఐ, " ఇది చిన్న కేసు కాదు. మర్డర్ కేసు. అయినా కంప్లైంట్ ఇచ్చేది మీరే, బెయిల్ అడిగేది కూడా మీరేనా? " అన్నాడు.
ఆనందరావుకు అర్థం కాలేదు.
"ఏంటండీ మేము కంప్లైంట్ ఇవ్వడమేమిటి?" అనగా ఎస్సై, " మీ సత్య కంప్లైంట్ ఇచ్చింది. పైగా చనిపోయింది మీ బావమరిది కొడుకు భుజంగం" అనగానే మేనేజర్, ఆనందరావు ఆశ్చర్యపోయారు.
వెంటనే జైలు గదిలో ఉన్న కార్తీక్ దగ్గరికి వెళ్లారు. పోలీసులు చాలా దారుణంగా కార్తీకుని కొట్టినట్టు కనిపిస్తోంది. అది చూసి మేనేజర్, " సార్ ఇది ఏదో చాలా పెద్ద కేసు లా ఉంది. మన వల్ల కాదు "అని అనగానే...
పోలీస్ స్టేషన్లోకి ఒక లాయర్ల బృందం వచ్చింది. అందులో నగరంలోనే ప్రముఖమైన ఖరీదైన క్రిమినల్ లాయర్ కామేశ్వర్ ఉన్నాడు. వచ్చి బెయిల్ పేపర్స్ ఎస్సైకి ఇవ్వడం జరిగింది. ఎస్సై వాటిని పరిశీలించి కార్తీక్ ని విడుదల చేయిస్తానని చెప్పాడు.
కార్తీక్ చిన్నగా కుంటుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు... దెబ్బలతో కార్తీక్ నలిగిపోయినట్లు కనిపిస్తున్నాడు. బయటకు రాగానే కామేశ్వర్ తో కలిసి కార్ ఎక్కి వెళ్లిపోయాడు.
ఆనందరావు లాయర్కు కార్తీక్కు ఏమి సంబంధం? భుజంగం ను నిజంగానే చంపాడా?లాంటి ప్రశ్నలతో బుర్ర తిరిగిపోయింది.
ఆనందరావు స్టేషన్ బయటకు రాగానే సుమ, సత్య కూడా వచ్చారు. వారందరూ కార్తీక్ కారు వెంబడి ఫాలో అవుతూ వెళ్లారు..
ఒక పెద్ద భవంతిలోకి వెళ్ళింది కారు. ఆనందరావు గారిని గేటు దగ్గరే కాపలా వారు ఆపివేశారు. ఆనందరావును వివరాలు అడిగి కాల్ చేశారు. ఐదు నిమిషాల తర్వాత లాయర్లు కార్లు బయటికి వెళ్లిపోయాక వీరిని లోపలికి అనుమతించారు.
ఆనందరావు సుమ సత్య లోపలికి వెళ్లారు. ఆ ఇల్లు చాలా అందంగా, విశాలంగా ఉంది. వీరు వెళ్లి కూర్చోగానే పనివాళ్ళు కాఫీ తెచ్చి ఇచ్చారు. కాఫీ తాగుతుండగా పైనుంచి కార్తిక్ చిన్నగా నడుస్తూ వచ్చి మీరు ఎదురుగా కూర్చున్నాడు
. అతనికి పనివాళ్ళు మద్యం సరఫరా చేశారు.కార్తీక్ మద్యం తాగుతూ ఆనందరావుతో, " సార్ నన్ను క్షమించండి. పోలీస్ వాళ్ళు చాలా బలంగా కొట్టారు. నొప్పి భరించలేకుండా ఉన్నాను. అందుకే కొంచెం మద్యం తీసుకుంటున్నాను" అన్నాడు.
అప్పుడు సుమ vహాల్ అంతా గమనించింది. ఒక అమ్మాయి ఫోటో కనపడింది.
" అన్నయ్య ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? చాలా అందంగా ఉంది "అని అడిగింది.
అప్పుడు కార్తీక్, "నా భార్య ఫోటో "అని చెప్పాడు.
సుమ వెంటనే, " అన్నయ్య అమ్మాయిని ఒకసారి పిలువు మాట్లాడదాము "అని అడిగింది.
అప్పుడు కార్తీక్, "తను చనిపోయింది " అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు.