సరిగ్గా అప్పుడే లోపల నుండి జానకి గారు, ఆమె పెద్ద కొడుకు రాజు బయటకు వచ్చారు. బయట జరుగుతున్న రభస చూసి రాజు కంగారుగా పరుగెత్తుకు వచ్చాడు. "ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏమైంది?" అని రాజు అడగ్గా.. "చూడు అన్నయ్యా! ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ ఎప్పటి నుంచో తెలిసినట్టు పలకరిస్తోంది. ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది!" అని కిషోర్ విసుక్కున్నాడు
రాజు వెన్నెల కళ్ళలోని నిస్సహాయతను చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతని కళ్ళలో ఏదో తెలియని జాలి మెరిసింది. "నువ్వు లోపలికి వెళ్ళు కిషోర్.. నేను మాట్లాడుతాను" అని తమ్ముడిని లోపలికి పంపివేసి, వెన్నెల వైపు తిరిగాడు. "లోపలికి రామ్మా.. వెన్నెలా.." అని ఆదరంగా పిలిచాడు. జానకి గారు మౌనంగా వెళ్లి నీళ్లు తెచ్చి వెన్నెలకు ఇచ్చారు. ఆమె చేతులు వణుకుతుంటే, ఆ నీళ్ల గ్లాసును అందుకోవడానికి కూడా వెన్నెలకు శక్తి లేకపోయింది. ఆ గదిలో ఆవరించిన నిశ్శబ్దం వెన్నెలను ఊపిరాడకుండా చేస్తోంది.తన గతాన్ని కిషోర్‌కు చెప్పి తన మనసులోని భారమంతా దింపుకున్నానన్న తృప్తి మాయమై, ఇప్పుడు అతని జ్ఞాపకాల్లో తన ఆనవాళ్లు కూడా లేవన్న చేదు నిజం వెన్నెలను వేధించసాగింది.
జానకి గారు ఇచ్చిన నీళ్లను వెన్నెల ఒక్క గుక్కలో గటగటా తాగేసింది. గొంతు వరకు వచ్చిన దుఃఖాన్ని ఆ నీళ్లతో పాటే లోపలికి మింగేయాలని చూసింది. ఆ గదిలో ఆవరించిన భయంకరమైన నిశ్శబ్దాన్ని చీలుస్తూ రాజు ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు."సారీ వెన్నెల.. అంతా నా తప్పే! మీ ఇద్దరి మధ్య పెరుగుతున్న ఆ చొరవ చూసి, కనీసం నిన్నైనా వాడు గుర్తుపడతాడు ఏమో అని ఒక చిన్న ఆశ కలిగింది. కానీ మా కర్మ.. అది జరగలేదు," అన్నాడు రాజు దీనంగా. వెన్నెల ఏమీ అర్థం కానట్టు, శూన్యంలోకి చూస్తున్న కళ్లతో రాజు వైపు తిరిగింది. రాజు కిషోర్ గతాన్ని ఒక్కో పొరగా విప్పడం మొదలుపెట్టాడు."కిషోర్ చిన్నప్పటి నుండి చాలా మొండివాడు. చదువులో ఎప్పుడూ తానే మొదటి స్థానంలో ఉండాలని పరితపించేవాడు. పొరపాటున ఎప్పుడైనా సెకండ్ ర్యాంక్ వస్తే, అది తను చేసిన పెద్ద నేరంగా భావించేవాడు. అన్నం నీళ్లు మానేసి, రాత్రనక పగలనక పుస్తకాలతోనే యుద్ధం చేసేవాడు. గెలుపు మీద వాడికున్న ఆ పిచ్చి ప్రేమే ఇప్పుడు వాడి పాలిట శాపమైంది. శరీరానికి కావాల్సిన విశ్రాంతి ఇవ్వకుండా, మెదడును అతిగా శ్రమ పెట్టడం వల్ల వాడి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఆ ఒత్తిడి ఎంతకు దారితీసిందంటే.. తను చదివిన చదువే కాదు, ప్రాణంగా ప్రేమించే మనుషులను కూడా మర్చిపోయే స్థితికి చేరుకున్నాడు."రాజు మాటలు వింటుంటే వెన్నెలకు నిన్న కిషోర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. 'చందమామ ఒక్కోసారి నిండుగా, ఇంకోసారి సగంలా కనిపిస్తుంది' అన్నాడు.. అంటే అది తన పరిస్థితినే తనకు చెప్పాడా? రాజు ఆవేదనగా కొనసాగించాడు, "సిటీలోని రొటీన్ లైఫ్ వాడిని ఇంకా ఇబ్బంది పెడుతుందని, డాక్టర్ల సలహాతో ప్రశాంతత కోసం ఈ పల్లెటూరికి తీసుకొచ్చాం. ఇక్కడైనా వాడికి పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయని ఆశపడ్డాం. కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను మీ ఇద్దరిని చాలా సన్నిహితంగా ఉంటున్నారు కనీసం నిన్ను అయిన గుర్తు పడుతున్నాడు ఇప్పుడు సమస్య లేదు అనుకునే సమయంలో ఇలా జరిగింది. కనీసం వాడు
ఇలా నిన్ను కూడా ఒక అపరిచితురాలిలా చూస్తాడని అనుకోలేదు వెన్నెలా!"వెన్నెల కళ్లలో నీళ్లు ఆగడం లేదు.
అప్పుడు జానకి గారు వెన్నెల తోటి మీ అమ్మ గారు నిన్ను ఇక్కడ దింపడానికి వచ్చినప్పుడు నేను వీడు మెడ మీద నీ గురించి చెపుతాను వాడికి అప్పుడు అంత గుర్తు వచ్చి పాత వాడిలా నీ దగ్గర కు వచ్చి పలకరిస్తారు వాడి కి తగ్గిపోతుంది ఇప్పుడు బాగానే ఉంది ఇంకా నీ గురించి గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదు అని అనుకున్నాను అప్పుడు వెన్నెల కి అవును రెండు రోజుల నుంచి మెడపైన కనపడలేదు కిషోర్ లో మార్పు ఇవ్వని చూస్తూ ఉంటే వెన్నెల కు ఎలా స్పందించాలో తెలియడం లేదు సరి కదా ! నిన్న తను తన గతాన్ని చెబుతుంటే అంత ఆత్మీయంగా విన్న మనిషి, ఇప్పుడు తన పేరును కూడా తన జ్ఞాపకాల అరల్లో వెతుక్కోలేకపోతున్నాడనే సత్యం ఆమెను కలిచివేసింది. తండ్రి లేని వెలితిని మౌనంతో నింపుకున్న వెన్నెలకు, ఇప్పుడు కిషోర్ స్థితి మరో తీరని వేదనగా మారింది.
జానకి గారు, రాజు లోపలికి వెళ్ళిపోయాక ఆ విశాలమైన హాల్లో వెన్నెల, కిషోర్ మాత్రమే మిగిలారు. ఆ నిశ్శబ్దం వెన్నెలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తన ఉనికినే గుర్తించని వ్యక్తి ముందు నిలబడలేక, మౌనంగా తలదించుకుని ఆమె బయటకు అడుగులు వేయసాగింది. వెన్నెల వెళ్ళిపోతుంటే కిషోర్ మనసులో ఒకటే ఆవేదన.. 'తను నాతో ఇక మాట్లాడదా? మా స్నేహం ఇక్కడితో ముగిసిపోయిందా?' అని. పరిచయం లేని వ్యక్తిగా మాట్లాడినా, అతని అంతరాత్మలో ఏదో తెలియని భయం మొదలైంది.
మొదలైంది.చివరికి నిగ్రహించుకోలేక, భయం భయంగానే "వెన్నెలా!" అని పిలిచాడు. ఆ పిలుపులో అంతులేని నిస్సహాయత ఉంది. ఆ స్వరానికి వెన్నెల వెనుతిరిగి చూసింది. కిషోర్ కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. 'మగవారు కూడా ఇంతలా ఏడుస్తారా?' అని ఆమె ఆశ్చర్యపోయింది. అతని దగ్గరకు వెళ్లి, ఆ కన్నీళ్ల వెనుక ఉన్న బాధను తన పెద్ద కళ్ళతోనే ప్రశ్నిస్తున్నట్టుగా నిలబడింది. ఆ క్షణం అక్కడ మాటలు లేవు, కేవలం ఇద్దరు మనుషుల మధ్య మిగిలిన అసంపూర్ణ కావ్యం మాత్రమే అక్కడ ప్రతిధ్వనిస్తోంది."నా లోపం తెలిసి వెళ్ళిపోతున్నావా వెన్నెలా?" అని కిషోర్ దీనంగా అడిగినప్పుడు, వెన్నెల గుండె కరిగింది. ఆమె చేత్తో కన్నీళ్లు తుడుచుకోమని సైగ చేసింది. "కిషోర్.. మనల్ని తిడుతున్నారని, కొడుతున్నారని తల్లిదండ్రుల్ని వదిలేస్తామా? లేదు కదా! మనకి జన్మనిచ్చిన వారు మన మంచి కోసమే అది చేస్తారని మనకి తెలుసు. మనకేం జరిగినా వాళ్లు మనల్ని వదలకుండా చూసుకుంటారు. ఆఖరికి వాళ్లు ఆకలితో ఉన్నా మన కడుపు నింపాలని చూస్తారు. తల్లిదండ్రులు మనల్ని ఎలా వదిలిపెట్టరో, నీకు ఈ లోపం ఉందని నేను కూడా నిన్ను వదిలి వెళ్లను."ఆమె గొంతులో గట్టి నిబ్బరం ఉంది. "కొన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి కూడా స్నేహితులతో పంచుకుంటాం. ఆ స్నేహానికి ఇంత చిన్న కారణంతో ముగింపు పలకలేను. ఇక చాలు.. కళ్ళు తుడుచుకుని పద, మొక్కలకు నీళ్లు పోయాలి" అంటూ మళ్ళీ ఎప్పటిలాగే చొరవగా అతన్ని తోటలోకి తీసుకెళ్లింది. కిషోర్ మనసు ఇప్పుడు తేలికపడింది. తనను జాలితో కాకుండా, ఒక బాధ్యతగా అంగీకరించిన వెన్నెల వైపు చూస్తూ మౌనంగా అడుగులు వేశాడు. ఆ మాటలను చాటుగా విన్న జానకి గారు, రాజు.. వెన్నెల గొప్ప మనసును, ఆమెలోని నిస్వార్థమైన స్నేహాన్ని చూసి కళ్లారా మురిసిపోయారు.