అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి సరిగ్గా పన్నెండు గంటలైంది. ఇల్లంతా గాఢాంధకారంలో మునిగిపోయింది. నీల సడెన్‌గా కళ్లు తెరిచింది. బెడ్ పక్కన ఉన్న క్లాక్ వైపు చూసింది. టైమ్ కరెక్ట్‌గా 12:00 అయింది. ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది.
మంచం దిగి, పిల్లిలా అడుగులు వేస్తూ నెమ్మదిగా ఆర్య రూమ్ వైపు నడిచింది. అక్కడ మూలలో అయాన్ చార్జింగ్ పెట్టుకుని, కళ్లు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. నీల చాలా సైలెంట్‌గా లోపలికి వచ్చి, నిద్రపోతున్న ఆర్యను భుజం తట్టి లేపింది. అదే సమయానికి రాజు గారు, కాస్త నిద్రమత్తులో చిరాకు పడుతూనే సుస్మిత గారు కూడా ఆర్య గదిలోకి అడుగుపెట్టారు. రూమంతా చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది.
అందరూ ఒకరినొకరు చూసుకుంటూ నెమ్మదిగా అయాన్ దగ్గరకు వచ్చారు. నీల చేతిలో ఉన్న క్యాండిల్‌ని ఒక్కసారిగా వెలిగించి, అందరూ కలిసి ఒకే గొంతుతో, "హ్యాపీ బర్త్ డే అయాన్!" అని ప్రేమగా విష్ చేశారు.
ఆ చిన్న క్యాండిల్ కాంతిలో ఆ చీకటి గది అంతా ఒక్కసారిగా వెలిగిపోయింది. అయాన్ కళ్లు తెరిచాడు. తన ముందు ఉన్న నలుగురి కళ్లల్లోని స్వచ్ఛమైన ఆనందాన్ని, కల్మషం లేని ప్రేమని చూశాడు. వాడి మెమొరీ సిస్టమ్ ఆ క్షణంలో ఉన్న (డేటా) మొత్తాన్ని, వాళ్ల భావోద్వేగాలను స్పెషల్ ఫోల్డర్‌లో స్టోరేజ్ చేసుకోవడం మొదలుపెట్టింది. అయాన్ ‘THANK YOU 😊’ అని చెప్పాడు. వాడు కేక్ కట్ చేస్తుంటే ఆ గది మొత్తం నవ్వులతో, కోలాహలంతో నిండిపోయింది.
అప్పుడు రాజు గారు అయాన్ వైపు చూస్తూ, "అయాన్! నిన్ను తయారు చేసి మా ఇంటికి తీసుకువచ్చి ఇప్పటికి సరిగ్గా ఒకసంవత్సరం అయింది. మొదట్లో నీ ప్రవర్తన నచ్చకపోతే నెల రోజుల్లోనే బయటకు పంపించేస్తానని సుస్మిత నాతో అంది. కానీ, నా మాటకు గౌరవించి ఏ మాత్రం అడ్డు చెప్పకుండా నిన్ను ఏడాది పాటు మన ఇంట్లోనే ఉంచింది. తను పైకి అలా కఠినంగా మాట్లాడుతుంది కానీ, లోపల మాత్రం తన మనసు వెన్న" అని నవ్వుతూ చెప్పారు.
ఆ మాట వినగానే అయాన్ నెమ్మదిగా సుస్మిత దగ్గరకు వచ్చి, ఎంతో వినయంగా ఆమె కాళ్లకు నమస్కారం చేశాడు. అది చూసి నీల, ఆర్య, రాజు గారు ఎంతో ఆత్మీయంగా అయాన్ వైపు చూశారు. ఆ తర్వాత "దీవించు" అన్నట్టు సుస్మిత వైపు సైగ చేశారు.
నిజానికి అప్పటివరకు సుస్మిత ఎలాగైనా అయాన్‌ను ఈ ఇంట్లో నుండి బయటకు పంపించాలని చూసింది. కానీ, ఇప్పుడు అయాన్ చూపిస్తున్న పద్ధతిని, వాడి అమాయకత్వాన్ని చూసి ఆమె మనసు పూర్తిగా కరిగిపోయింది. 'ఈ సంవత్సరంలో ఎప్పుడూ వాడు విసిగించలేదు సరే కదా, చెడ్డగా ప్రవర్తించిన రోజే లేదు' అని మనసులో అనుకుంది. కళ్లల్లో నీళ్లతో వాని తల నిమిరి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఒకరి మనసు గెలవడానికి (యుద్ధాలు) చేయాల్సిన అవసరం లేదు, కొంచెం సహనం, ప్రేమ ఉంటే చాలని ఒక యంత్రమైన అయాన్ నిరూపించాడు.
కేక్ కట్ చేసిన తర్వాత, అయాన్ అందరి వైపు చూశాడు. చివరిగా వాడి చూపు నీలపై ఆగింది. ఎప్పుడూ ఒక మిషన్ లా ఉండే అయాన్ ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. వాడి పెదవుల అంచులు కొద్దిగా పైకి లేచాయి. అయాన్ నీల వైపు చూసి చాలా చిన్నగా, ఎంతో క్యూట్‌గా స్మైల్ ఇచ్చాడు.
ఆ క్షణం.. నీల ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది.
అయాన్ ఏమిటి ఇంత అందంగా నవ్వుతున్నాడు? ఆమె గుండెల్లో ఏదో తెలియని అలజడి. హఠాత్తుగా గూటి నుంచి ఒక పక్షి ఎగిరినట్టు ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఊపిరి ఆగిపోయినంత పనైంది. చుట్టూ ఉన్నవాళ్ల నవ్వులు, మాటలు ఏవీ ఆమెకి వినబడటం లేదు. కాళ్ల కింద నేల లేనట్టు, తను మెల్లగా గాల్లో తేలుతున్నట్టు ఒక వింత అనుభూతి. ఆ చిన్న నవ్వుతో అయాన్ తన మనసును పూర్తిగా దోచేశాడని నీలకి అర్థమైంది.
అంతలోనే అయాన్ కేక్ ముక్కను తీసుకువచ్చి నీల నోట్లో పెట్టాడు. ఆ వేళ్ల స్పర్శ తగలగానే నీల ఒంట్లో కరెంట్ పాకినట్టయింది. వాడి కళ్లల్లోని అమాయకమైన చూపును తట్టుకోలేక, ముఖం సిగ్గుతో పూర్తిగా కందిపోయి, తల దించేసుకుంది.
మరుసటి రోజు అయాన్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి షీలాతో పాటు అపార్ట్‌మెంట్‌లోని మరికొంత మంది అతిథులు కూడా వచ్చారు. సుస్మిత ఎంతో సంతోషంగా, ఏమాత్రం విసుకోకుండా వచ్చిన వారందరినీ నవ్వుతూ ఇంట్లోకి ఆహ్వానిస్తోంది.
అక్కడికి వచ్చిన వాళ్లంతా అయాన్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అది వింటున్న సుస్మిత మనసులో.. 'రోబోలు మనుషులకు హాని చేస్తాయి' అనే పాత అభిప్రాయం పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు తను అయాన్‌ను ఒక యంత్రంలా కాకుండా, తమ ఇంట్లో మనిషిలా మనస్ఫూర్తిగా నమ్మింది.
వచ్చిన వారిలో ఒకరు, "మొన్న మా బామ్మగారు కళ్లు తిరిగి పడిపోతుంటే అయాన్ కరెక్ట్ టైమ్‌కి పట్టుకున్నాడండీ.. ఆవిడను భుజం మీద వేసుకుని మరి ఫ్లాట్‌కు తీసుకువెళ్లాడు. అప్పుడు లిఫ్ట్ పని చేయకపోతే అయాన్ ఏమాత్రం అలసిపోకుండా బామ్మను ఎత్తుకుని మెట్లు ఎక్కేసాడు!" అని చెప్పారు.
మరొకరు అందుకొని, "అంతేకాదండీ.. మొన్న ఒక పిల్లి పైనుండి పడిపోతుంటే, మన అయాన్ చకచకా అపార్ట్‌మెంట్ గోడలు ఎక్కి ఆ పిల్లి ప్రాణాలను కాపాడాడు!" అని వాళ్లు చేసిన మంచి పనులను మెచ్చుకుంటూ ఉంటే.. అక్కడ సుస్మిత ఒక్కతే కాదు, షీలా కూడా చాలా శ్రద్ధగా వింటోంది. ఆ మాటలకు షీలా ముఖంలో తెలియని సిగ్గు మొలిచింది. అది చూసిన నీలకు లోపల ఉక్రోషం, కోపం ఎక్కువైపోయాయి. 'దీనికి ఎందుకు అంత సిగ్గు వస్తోంది? అయాన్ నావాడు!' అని మనసులోనే కుళ్లుకుంది.