హేమ వెంటనే విక్రమ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, “కళ్ళు నెత్తి మీద ఉన్నాయా నీకు, నేను ఇంతసేపు కష్టపడి కట్టినదంతా కూల్చేశావు” అంది.. ఒక అమ్మాయి అలా అరవడం మొదటిసారి చూస్తున్నాడు విక్రమ..
నువ్వు పిలిస్తే పలకలేదు, కంగారుగా వస్తున్నప్పుడు నా కాలికి తగిలిన రాయి వాటిని పడేసింది, ఇందులో నా తప్పు ఏముంది అన్నాడు విక్రమ్.
నా పనిని చెడగొట్టింది గాక, ఇంకా నిన్ను సమర్థించుకుంటున్నావా.
ఓ కట్టావులే! ఐఫిల్ టవర్.
నేను ఐఫిల్ టవర్ కడతానో లేదా మొబైల్ టవర్ కడతానో నీకెందుకు, ఇంతకీ ఎందుకు వచ్చావు మా ఇంటికి అంది హేమ.
నీకోసమేం కాదు లే, నేను ఆకాష్ కోసం వచ్చా అన్నాడు గట్టిగా..
ఆకాష్ లేడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు…
అది ముందే చెప్పుంటే అక్కడినుంచే వెళ్ళేవాడిని గా, నీతో ఇన్ని మాటలు పడే అవసరం ఉండేది కాదు..
మళ్ళీ సీరియస్ గా చూసింది హేమ..
నేను వెళ్తా వాడొచ్చినప్పుడు చెప్పు..
ఎక్కడికీ వెళ్ళేది, దీన్ని కట్టివ్వు..
“నేనా.., నాకేం పనీపాట లేదా..”
క్రికెట్ ఆడదానికే గా వెళ్తున్నావ్, ఏదో చదవడానికి వెళ్తున్నట్టు ఎందుకు ఆ బిల్డప్..అంది హేమా
“దేవుడా… ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం చదువుతూ బ్రతికేస్తున్నారుగా” అని అన్నాడు..
ఏమన్నావ్..
“నీతో వాదించలేను తల్లి ఇక వదిలేయ్” అంటూ, ఈ సంభాషణ కొనసాగించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
హేమాతో స్నేహంగా ఉండాలని విక్రమ్ కి ఉండేది, కానీ ఈరోజు జరిగిన సంఘటన అతనికి ఆ అభిప్రాయాన్ని పోగొట్టేసింది..
మరుసటి రోజు రోడ్డుకు చెరో వైపు నడుస్తూ స్కూల్ కి వెళ్తున్నారు ఇద్దరు, హేమ రోడ్డుకు ఎడమవైపు నడుస్తుంటే విక్రమ్ కుడి వైపు వెళుతున్నాడు. ఎడమవైపు ఒక టీ జంక్షన్ ఉంది, స్కూల్ కి దాన్ని దాటి వెళ్లాలి, హేమ ఆ టీ జంక్షన్ ను దాటుతోంది, ఇంతలో అటువైపు నుంచి ఒక కుర్రాడు స్కూటీ వేసుకుంటూ వేగంగా వస్తున్నాడు .హేమ దాన్ని గమనించకుండా ముందుకెళ్ళింది..
ఇదంతా గమనిస్తున్న విక్రమ్ మొదట ఎందుకులే అన్నిటికి కసురుతుంది అనుకున్నాడు. తర్వాత పాపం అనిపించి గట్టిగా పిలిచాడు..
తనకు వినిపించలేదు, ఇక చేసేదేమీ లేక వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పక్కకు తోసాడు , ఆ చప్రి- గాడు స్కూటీని విక్రమ్ కాలికి కి తగిలించాడు..
విక్రమ్ ఒక పక్కకు పడిపోయాడు . స్కూటీ ఫుట్ రెస్ట్ తగిలి కాలు నుంచి రక్తం కారుతోంది, దీన్ని చూసిన ఆ కుర్రాడు బండాపకుండా అలాగే పారిపోయాడు, హేమ వెంటనే తన కర్చీఫ్ తీసి కాలుకి కట్టింది..
అరుస్తుంటే వినపడదా, నీకేమైనా చెవుడా.., అన్నాడు విక్రమ్.
అవును చెవుడే అంటూ తను ఏడవడం మొదలు పెట్టింది..
నువ్వు ఏడవడం ఆపుతావా ఇక్కడ దెబ్బ తగిలింది నాకు..
ప్రతి ఒకరు ఇలానే అంటారు “ఈ చెవిటి దానికి ఎంత పొగరు”, అని నువ్వు కూడా అలానే అంటున్నావ్ అంటూ ఏడ్చింది..
సరే I am sorry ఇంటికి వెళ్దామా అన్నాడు విక్రమ్..
సరే అంది హేమ..
ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్ళారు, శారదమ్మ ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కట్టింది. ఆ రోజు స్కూల్ మానుకున్నారు. ఇద్దరి ఇళ్లలో కొంత నిశబ్దం.
మరుసటి రోజు పొద్దున్నే విక్రమ్ కుంటుకుంటూ వెళ్లి ఇంటి ముందు కూర్చున్నాడు, ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు అతని ఒంటిమీద పడుతూ హాయినిస్తున్నాయి..
అప్పుడే గేట్ తెరిచాడు రమణ, నాన్న వెనకాల దాక్కున్న హేమ పక్కకు వచ్చింది..
ఆమె తెల్లటి గౌనుతో ఒక పగటి చందమామ లా ప్రకాశిస్తూ ఉంది. హేమా తో విక్రమ్ కు థ్యాంక్స్ చెప్పించాడు రమణ.
సూర్య బయటకు వస్తూ “అందులో ఏముంది లేండి పిల్లలు క్షేమంగా ఉన్నారు అదే చాలు” అన్నాడు.
రమణ మాట్లాడుతూ,” సరే అయ్యిందేదో అయింది ఇవాళ మా ఇంటికి మీరంతా భోజనానికి రావాలి అన్నాడు”.
అయ్యో! చెప్పడం మర్చిపోయా మా ఇంట్లో ఈరోజు ఆంజనేయ స్వామి పూజుంది. మీరే మా ఇంటికి భోజనానికి కచ్చితంగా రావాలి అన్నాడు సూర్య.
ఇద్దరు, మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలంటూ కొంతసేపు వాధించుకున్నారు, చివరికి రమణ “ సరే వస్తాం” అని వెళ్ళిపోయాడు, హేమ నాన్నతో పాటు వెళుతూ విక్రమ్ వంక ఒక చూపు చూసింది.
బస్సు బెంగళూరుని దాటింది.
బస్సు ఎక్కినప్పటినుంచి ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు, విక్రమ్ ఆలోచనలో పడ్డాడు..
*******””
మొదట సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేరిన రోజుల్లో నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడిని కాదు. ఎప్పుడూ నిశ్శబ్దంగా నా పనిలో మునిగిపోయేవాడిని.
అలాంటిది ఒక రోజు, ఓ కొత్త వచ్చి నా పక్కన కూర్చున్నాడు.. నేను కొత్త వాళ్ళను అంత తొందరగా పలకరించను, కాబట్టి మౌనంగా ఉన్నా
అతేనే కల్పించుకొని —
"హాయ్ బ్రో, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్?" అని అడిగాడు, చూడటానికి కాస్త విచిత్రంగా ఉన్నాడు.
"మై నేమ్ ఇస్ విక్రమ్… యువర్స్?" అని షేక్ హ్యాండ్ ఇచ్చా.
"హో… నువ్వు తెలుగు వాడివా? నా పేరు జయ," అన్నాడు నవ్వుతూ.
"నేను తెలుగువాడినని నీకెలా తెలిసింది?" అని అడిగా.
"నీ పేరు బట్టి, నువ్వు మాట్లాడుతున్న స్లాంగ్ బట్టి గెస్ చేశా… అది నిజమైంది," అన్నాడు.
నువ్వు ఎక్కడినుంచి, జయ?
మాది తాడిపత్రి పక్కన దాంచర్లా, మరి నీది?.
నాది "హిందూపూర్ పక్కన మందలపల్లి".
మా ఊరిపేరు వినగానే అతను నన్ను విచిత్రంగా చూసాడు. ఇది నాకు కొత్తేం కాదు. “చిన్నప్పటి నుంచి మా ఊరి పేరు విన్న మొదటి సారి అందరూ ఇలాగే రియాక్ట్ అవుతారు”.
అలా కరోనా కు ముందు మొదలైన ఆ పరిచయం… మూడు ఏళ్ల లోనే జయా ను నా బెస్ట్ ఫ్రెండ్ గా మార్చేసింది…, లాక్ డౌన్ లో కూడా మేము అప్పుడప్పుడు కలిసే వాళ్ళం.
ఆకాష్ తర్వాత నాకు అంతగా దగ్గరయ్యింది జయా గాడే.
*********
ఇవన్నీ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు విక్రమ్..
మరుసటి రోజు, ఉదయం 8 గంటలకల్లా ఊరు చేరుకున్నారు, ఇంటికి వెళ్ళగానే విక్రమ్ ను కౌగిలించుకున్నాడు తాత, విక్రమ్ వాళ్ల తాతయ్య పేరు రామన్న..
ఎరా కరోనా లో అన్న ఇంటికి రావచ్చు కధా…
ఇక్కడ నెట్‌వర్క్ సరిగ్గా రాదు తాతయ్య అందుకే రాలేదు..
సరే.. పదండి వేడి నీళ్ళు పెట్టాం, ముందు స్నానం చెయ్యండి..
అందరూ స్నానం చేసిన తర్వాత నాయనమ్మ చేసిన వంటలు తిని, అలా మధ్యాహ్నం వరకు చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, తాతయ్య విక్రమ్ కు ఊళ్ళో విషయాలు చెప్పడం మొదలు పెట్టాడు.., విక్రమ్ మంచం మీద పడుకొని “ఊ ….” కొడుతున్నాడు..
అలా మాట్లాడుతున్న తాతకి మనవడి స్వరం వినిపించలేదు, చూస్తే విక్రమ్ కునుకు తీస్తున్నాడు.., “రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదేమో పాపం” అని మనసులో అనుకుని, మనవడికి బెడ్-షీట్ కప్పి ఏదో పని మీద వెళ్ళిపోయాడు..
ఫోన్ గట్టిగా మోగింది, శబ్దానికి ఉలిక్కిపడ్డాడు విక్రమ్ , చూస్తే అది తన డైలీ అలారం సాయంత్రం నాలుగు అవగానే మోగుతుంది.
విక్రమ్ చిన్నప్పటి స్నేహితులు పక్కూరిలో ఉన్నారు ఎందుకంటే బాల్యం లో అక్కడే చదువుకున్నాడు.
“నాన్న ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నా” అని స్కూటీ కీస్ తీసుకున్నాడు.
విక్రమ్… నువ్వెళ్ళేది పక్కూరికేగా, మీ మల్లీ మావయ్య అటే వెళ్తున్నాడు చూడు, ఆయనతో కలిసి వెళ్ళు.
ఎందుకు నాన్న స్కూటీ తో ఏమన్నా పనుందా..
అవును రా.. నేను మీ తాతయ్య పొలం పని మీద బయటకు వెళ్తున్నాం , అన్నాడు సూర్య..
‘సరే నాన్న’ అంటూ, స్కూటీ కీస్ తో పాటు తన మొబైల్ అక్కడే వదిలేసి గుమ్మం వైపు నడిచాడు విక్రమ్..
ఒరేయ్ ఫోన్ తీసుకెళ్ళరా…
వద్దులే నాన్న ఆ ఫోన్ ఒక డిస్టర్బెన్స్, కాసేపు ప్రశాంతంగా గడుపుతా..అంటూ వెళ్ళిపోయాడు..
అలా వాళ్ల మామయ్య తో కలిసి బయలుదేరాడు విక్రమ్, ఊళ్ళోకి వెళ్ళగానే మహి ఎదురుపడి పలకరించాడు, అతని పూర్తి మహేష్ చంద్రా, మహి అని పిలుస్తుంటారు అందరూ, అతను కూడా బెంగళూరులో జాబ్ చేస్తుంటాడు..
విక్రమ్ రాక తెలుసుకొని చిన్నప్పటి ఫ్రెండ్స్ అతన్ని కలవడానికి వచ్చారు, అందరూ ఒక చోట చేరి పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ నవ్వుకుంటున్నారు, వాళ్లు చిన్నప్పుడు తిరిగిన అన్ని చోట్లను గుర్తు చేసుకున్నారు, అక్కడే పొలం లో వండుకుని తిన్నారు, అంతా తమ జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకున్నారు, వాళ్ళతో గడపడం విక్రమ్ కు చాలా ఆనందంగా అనిపించింది, చాలా రోజుల తరవాత అతని మనస్సు ప్రశాంతంగా ఉంది, అలా అక్కడున్న వాళ్ళకి సమయం తెలియట్లేదు..
వాచ్ వంక చూశాడు విక్రమ్, 8 అవుతోంది..
“రేయ్ మహి, నన్ను మా ఇంటి దగ్గర దింపేస్తావా” అడిగాడు విక్రమ్..
ఎందుకురా మా ఇంట్లోనే ఉండు., రేపు ఉదయం వెళుదువు గాని….
అది కాదు, ఏదో ముఖ్యమైన పనుందని తాతయ్య ఇంటికి రమ్మన్నాడు మహీ.. వెళ్ళాలి.
ఏంట్రా… “పెళ్ళి గళ్ళి లాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా..” అని నవ్వాడు..
అలాంటిదేం లేదు, నేనూ విషయం ఏంటో అడగలేదు..
సరే ఒక పని చెయ్, నా బైక్ తీసుకొని వెళ్ళు రేపు మీ ఊర్లో కొంచెం పనుంది, వచ్చినప్పుడు తీసుకుంటా .
విక్రమ్ కు కొంచెం కంగారుగా అనిపించింది. కానీ వాళ్లకి తన సమస్య తెలిస్తే ఇంతవరకు పొందిన సంతోషం అంతా మర్చిపోతారని, “సరే రా బాయ్” అని కీస్ తీసుకొని బైక్ దగ్గరికి వెళ్తున్నాడు..
ఆ రెండు ఊళ్ళకి దాదాపు 5 km దూరం ఉంది,దారి మధ్యలో మర్రి చెట్లు, చింత చెట్లు వరుసగా రోడ్డు పక్కనే ఉన్నాయి, ఆ చెట్ల దగ్గర జరిగిన చాలా సంఘటనలను కథలుగా చెప్పుకుంటూ ఉంటారు, చాలామంది గతంలో ఆ మర్రి తీగలకు ఉరిపోసుకున్నారని, అలా చనిపోయిన వాళ్లంతా తీగలకు వేలాడుతూ కనిపిస్తారని చాలామంది కళ్ళతో చూసినట్టు చెప్తూ ఉంటారు, దురదృష్టవశాత్తు ఈ కథలన్నీ విక్రమ్ కు తెలుసు.
ధైర్యం తెచ్చుకొని బయలుదేరాడు , మందుకు వెళ్ళేకొద్దీ వేరే బైక్స్ ఎదురుగా వస్తున్నాయి ఇక భయం లేకుండా వేగం పెంచాడు, సరిగ్గా ఆ చెట్లను సమీపిస్తుండగా, ఎంతసేపైనా ఒక్క బండి కూడా ఎదురు రావట్లేదు, విక్రమ్ కు చిన్నప్పటి అదే ఆలోచన గుర్తొచ్చింది. ఆ ఆలోచన ప్రతిసారి అతన్ని చిక్కుల్లో పడేస్తుంది, ఎలాగైనా ఆ చెట్లను దాటెయ్యాలని కొంత ధైర్యం తెచ్చుకుని బండి ఆక్సిలరేటర్ పెంచాడు. సరిగ్గా చెట్ల కింద వెళ్తున్నప్పుడు వెనకనుంచి ఎవరో పరిగెడుతూ వస్తున్న శబ్దం వినిపించింది. బైక్ ను కొంచెం స్లో చేసి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసాడు, అక్కడ ఎవరూ లేరు. మళ్లీ ముందుకు తిరిగి చూశాడు , అకస్మాత్తుగా ఒక చిన్న కుర్రాడు మర్రి ఊడకు వేలాడుతూ భయంకరమైన నవ్వుతో విక్రమ్ మీదకి దూకాడు, అతన్ని పక్కకు తోయడానికి ప్రయత్నించగా విక్రమ్ గొంతుని పట్టేసుకున్నాడు, బైక్ అదుపుతప్పి ఆ వేగానికి జారుకుంటూ రోడ్డు పక్కకు వెళ్ళి పడ్డాడు.
“మొబైల్ తెచ్చింటే బాగుండేది” అనుకున్నాడు, రాయికి గీసుకున్న మోచేతిని తన ఎడమ చేతితో అదిమి పట్టి, మెల్లగా పైకి లేచి కూర్చున్నాడు, చుట్టు ఎవరు కనబడలేదు , భయం భయంగా బైక్ దగ్గరికి నడవసాగాడు.