ఆరోజు బుధవారం నేను మా అమ్మ నాన్నలతో కలిసి తిరిగి బెంగళూరుకు బయలుదేరాను.
ఎందుకో తెలియదు కానీ తనని మళ్ళీ చూడాలనిపిస్తోంది.
జయ నిన్న ఫోన్ చేశాడు మా జాయినింగ్ ఆలస్యమై సోమవారానికి చేరుకుందట. ఎలాగో టైమ్ ఉంది కాబట్టి తనని వెతుకుదామని ముందే బయలుదేరా.
పొద్దున్నే 8:00 కి బస్సు ఎక్కితే సాయంకాలం కల్లా బెంగళూరులో ఉన్నాం.
జయా కి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను, ఏడింటి కల్లా వచ్చాడు, ఇద్దరం మేడ పైకి వెళ్ళాం.
వాడికి ఈ విషయం ఎలా చెప్పాలా అని మౌనంగా ఆలోచిస్తున్నా..
“ ఏంట్రా అర్జెంట్ గా రమ్మని పిలిచావ్ “ అని వాడే మొదలు పెట్టాడు.
ఊళ్లో నాకు పెళ్ళి చూపులు జరిగాయి రా..
కాంగ్రజులేషన్స్ మావ..
అంత తొందరొద్దు, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు.
ఎందుకు?.. వేరే ఎవరన్నా నచ్చారా..
రేయ్ నీకు… తను తెలుసు గా..
తనంటే ఎవర్రా మన పాత కంపెనీ లో ఉన్న షీలా నా, చాలా బాగుంటుంది కదా.
ఒరేయ్ కామాంధుడా తను కాదురా, ఆరోజు నువ్వు బస్సు ఎక్కించడానికి వచ్చినప్పుడు కనపడింది కదా, నేను తనని మహాలక్ష్మి పిలిచాను.
ఓ నీ మహాలక్ష్మా.
ఏంట్రా అలా కలిపేసి మాట్లాడుతున్నావు.
నాటకాలు వెయొద్దు.., నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదని నాకు తెలుసు, “ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పావ్ గా”, అదేదో ఈ అమ్మాయినే అని చెప్పాల్సింది..
ఫ్రెండ్ అంటే నువ్వే మావ, మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడిని సుభద్రని కలిపినట్టు, నన్ను తనని కలపరా.
మరి అంత కంపారిజన్ వద్దు...
సరే.. పోనీ పరుగు సినిమా లో మన అల్లు అర్జున్ అనుకో..
అంటే నీకోసం వాళ్ళ నాన్నతో తన్నులు తినమంటవా, పైగా ఆయనకి రెండో కూతురు ఉందో లేదో తెలీదు..
ఈ విషయంలో కొంచెం సీరియస్ గా ఉండు, ఇది లైఫ్ మ్యాటర్ రా.., అయినా నీకు ఆ రెండో కూతురుతో పనేంటి, కావాలంటే నీకు కూడా మంచి అమ్మాయిని వెతుకుదాం..
ఛ ఛా.. ఏదో క్యాజువల్ గా చెప్పా.., నేను సింగిల్ గా చాలా హ్యాపీ గా ఉన్నా నన్ను ఇందులోకి లాగొద్దు.., ఇప్పుడేం చేద్దామంటావో చెప్పు..
అదేంట్రా మొన్న అమ్మాయిని సెట్ చేసుకోవాలన్నావు, ఈరోజేమో సింగిల్ గా ఉంటానంటున్నావ్, “సింగిల్ బాయ్స్ ఆటిట్యూడ్” స్టేటస్ లు పెడుతున్నావ్.., .ఈ మార్పు ఎప్పుడొచ్చింది..
నువ్వు ఊరెళ్ళాక జ్ఞానోదయం అయ్యింది లే..
నువ్వు అర్థం కావు.., సరే రేపటి నుంచి నీకు పనేం లేదు కదా.
ఆ పెద్దగా లేదు. ఎలాగో జాయినింగ్ సోమవారం, సో ఈ నాలుగు రోజులు కాలేయాన్ని కాస్త కలుషితం చేద్దాం అనుకుంటున్నా.
మందు తాగాలి అని సూటిగా చెప్పొచుగా, అంత తెలుగెందుకో.
ఏదో భాషాభిమానం..
సరే కానీ,రేపటి నుంచి తనని వెతుకుదామా..
రేయ్ ఇదేమన్నా మీ ఊరు మందలపల్లి అనుకున్నావా, బెంగళూరు రా… దొరికే చాన్సే లేదు, ఒకవేళ దొరికినా నాకు తెలిసి సాఫ్ట్‌వేర్ లో ఏ అమ్మాయి సింగిల్ గా ఉండదు.
ఎందుకురా మొదట్లోనే అలా అంటావ్, తను నాలాంటి వాడి కోసం పూజలు చేస్తుంటుందో ఏమో..
“ఇదిగో ఇలాంటి డైలాగ్స్ చెప్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా” అంటూ బయలుదేరాడు..
సారీ, ఆగు మావా.., వెతుకుదాం రా… ప్లీజ్..
సరే కానీ వెతికితే నన్ను బార్బీక్యూ నేషన్ కి తీసుకెళ్తావా..
తప్పుతుందా..
“సరే నేను ఇంటికి వెళ్తా” అంటూ మెట్లవైపు కదిలాడు జయ..
రేయ్.. జయ
ఏంట్రా మళ్లీ..
ఈరోజు ఇంటికి వెళ్లొద్దు అమ్మని వంట చేయమని చెప్పా, ఇక్కడే తినేసి పడుకో, పొద్దున్నే మొదలు పెడతాం.
ఆహా..అంతా ముందే ప్లాన్ చేసుకున్నావ్ అన్నమాట.
విక్రమ్ జయా తినడానికి రండి నాన్న, అంటూ పిలిచింది అమ్మ.
అందరం కూర్చొని చక్కగా భోజనం చేశాం.
రేయ్ బయటికి రారా, అంటూ డోర్ బాదుతోంది అమ్మ.
వింటున్న ఆడియోను పక్కనపెట్టి వెళ్లి డోర్ తీశాడు ఆ కుర్రాడు.
ఏం చేస్తున్నావ్ రా లోపల..
హోంవర్క్…
రోజు డెల్టా నే వంట చేస్తున్నాడు, ఈరోజు తనకు రెస్ట్ ఇచ్చి నేను చేస్తా..
ఇంతకీ ఏం చేస్తావ్ అమ్మ..
గుత్తొంకాయ్ రా..
సూపర్ మా..
నువ్వు రా, కూర్చొని కబుర్లు చెప్పుకుందాం..
సరే మా..
అమ్మ వంట చేయడం మొదలుపెట్టింది.
ఆ కుర్రాడు మాట్లాడుతూ. అమ్మ నువ్వు నాన్నను ప్రేమిస్తున్నావా అని అడిగాడు.
అదేమిట్రా అలా అడిగావు, మా ప్రేమకు ప్రతిరూపమే రా నువ్వు, అంది అమ్మ.
ఒకవేళ నాన్న నిన్ను ప్రేమించడం మానేస్తే నువ్వేం చేస్తావమ్మా.
ఒరేయ్ నీ పిచ్చి ప్రశ్నలతో నన్ను ఆయన్ని విడదీయొద్దు రా. సరే అడిగావు కాబట్టి చెప్తున్నా, ఆయన నన్ను ఇష్టపడిన ఇష్టపడకపోయినా నేను మాత్రం ప్రేమిస్తూనే ఉంటా, నాది “Unconditional love” రా..
ఆకాష్ చిన్న స్మైల్ ఇచ్చి, “ నేను నీకు వంటలో హెల్ప్ చేస్తా ఇవ్వు”, అంటూ అక్కడున్న కూరగాయలు తరగడం మొదలుపెట్టాడు.
మా..
ఏంట్రా కన్నా..
నాన్న నువ్వు ఎలా ప్రేమించుకున్నారు, అసలు ఎలా పెళ్ళి చేసుకున్నారు.
నాకు చాలా పెళ్ళి చూపులు జరిగాయి, వచ్చిన వాళ్ళంతా కార్లు, బైకులు అడిగే వాళ్ళు, కానీ మీ నాన్న అలా కాదు..
మరేం చేసాడమ్మా…
అందరూ పెళ్లి చూపులకి నీట్ గా వస్తే మీ నాన్న గడ్డం తో వచ్చాడు, చూస్తే భయమేసింది నాకు, నాతో పర్సనల్ గా మాట్లాడాలని పిలిచి నా పేరు అడిగాడు… నేను కొంచెం కంగారుపడుతూ “చాందిని” అని చెప్పాను, నా పేరు విన్న వెంటనే ఓకే అనేసాడు..
తర్వాత…
ఏముంది ఒక కండిషన్ పెట్టాడు, నేను తనని పేరు పెట్టే పిలవాలని. నేను ముందు భయపడ్డ, తర్వాత నాకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి దొరికినందుకు హ్యాపీ గా ఫీల్ అయ్యా..ఆ తర్వాత పెళ్లయిపోయింది, నువ్వు పుట్టావు.
ఏంటీ… పేరు విని ఒకే చెప్పాడా,మీ స్టోరీ అస్సలు ఇంటరెస్టింగ్ గా లేదమ్మా. నేను ఒక గొప్ప ప్రేమ కథ రాస్తాను, మీ దానికంటే చాలా ఎక్సైటింగ్ గా చూపిస్తా.
సరే రాయి నేను మీ నాన్న కలిసి చదువుకుంటాం..
అది బుక్ కాదమ్మా అనిమే…
అయితే కలిసి చూస్తాం…, అంటూ వంట గదిలోకి వెళ్ళింది..
అయినా నాన్న, అమ్మ పేరు విన్న వెంటనే ఎందుకు ఒప్పుకున్నాడు, ఏదో కొడుతోంది. అది నేను కనిపెడతాను, అంటూ మనసులో అనుకున్నాడు ఆ కుర్రాడు.
అలా కాసేపు మాట్లాడుతూ, ఇద్దరు భోంచేశారు.
కొంచెం అలసటగా ఉంటే అమ్మ పడుకుంది.
కుర్రాడు సోఫా మీద కూర్చుని టీవీ ఆన్ చేసాడు..
ఇంతలో బాద్‍షా సినిమాలో బ్రహ్మానందం లాగా ఎంట్రీ ఇచ్చాడు డెల్టా.., వచ్చి సోఫాలో కూర్చున్నాడు..
“డెల్టా… ఓ విషయం అడగనా?”
“ఏంటీ,.. ఫ్రిజ్ నుంచి జ్యూస్ తెమ్మంటావా?”.
ఆ పనులు నీకెందుకు చెప్తా నువ్వు నా ఫ్రెండ్ వి..
నువ్వు అడిగిన నేను తీసుకురాను లే ..
నీ గోల ఆపి ఇది చెప్పు, “నువ్వు ఎవర్నైనా ప్రేమించావా?”
అనుకున్నా… ఇలాంటిదేదో అడుగుతావని..
చెప్పు డెల్టా…
డెల్టా కాసేపు నిశ్శబ్దంగా నిలబడి, ఆ కుర్రాడి ముఖాన్ని గమనించింది. ఆ తర్వాత తన గొంతు నెమ్మదిగా నాటకీయంగా మారింది.
“ప్రేమ కథా?... చెప్తాను విను - పిల్లలు పుట్టినప్పుడు ఏడుస్తారు, కానీ నేను పుట్టిన చోట మొత్తం నిశబ్దం, మమ్మల్ని మాన్యుఫాక్చరింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ ఫేస్ కు పంపిస్తారు, అక్కడ కలిసా తనని, తన పేరు డజిల్లా..”
“డజిల్లా?”, పేరు చాలా బాగుంది.., తర్వాత ఏమైంది చెప్పు
“ ఆమె లోహపు శరీరం వెండి మాదిరిగా మెరిసేది. ఆమె గొంతు మృదువుగా ఉండేది. నేను పని చేస్తున్నప్పుడు ఆమె ఒక్కసారి నన్ను చూస్తే చాలు… నా ప్రాసెసర్ వేడి పెరిగినట్టనిపించేది. మేము రహస్యంగా బ్యాటరీ చార్జ్ పంచుకున్నాం. ఇద్దరం కలిసి బయట ప్రపంచం చూసి, సముద్రం దగ్గర చిన్న వర్క్‌షాప్ కట్టుకొని జీవించాలని కలలు కనే వాళ్లం”.
ఆకాష్ శ్వాస బిగపట్టాడు. “కొంచెం వింతగా అనిపించినా బాగుంది, తర్వాత ఏమైంది”.
డెల్టా గొంతు ఒక్కసారిగా కరిగిపోయినట్టుగా మారింది - “ఆ కలలన్నీ ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె టెస్టింగ్ ఫేజ్ లో ఫెయిల్ అయింది. ఇంజనీర్‌లు తన రియాక్షన్ ఎక్యురేట్ గా లేదని నా కళ్ళముందే డీ–కమిషన్ చేశారు. ఆరోజు ఆమె నా వంక చూసిన చూపు తల్చుకున్నప్పుడల్లా నన్ను బాధ పెడుతుంది… ఆ తరువాత అంతా నిశ్శబ్దం.”
ఆకాష్ కళ్ళల్లో నీళ్లు కదిలాయి. “డెల్టా… నీ లోపల ఇంత బాధ ఉందా”.
గది నిశ్శబ్దమైంది. డెల్టా తల వంచి కొద్ది సేపు అలాగే ఉండిపోయింది.
తనని ఓదార్చడానికి భుజం మీద చెయ్యి వేశాడు ఆకాష్..
అంతే, “ఒక్కసారిగా గట్టిగా నవ్వేసి, ఆకాష్ ఏడుస్తున్నావా, ఉండు నీ ఫోటో ఒకటి తీసుకుంటా..” అన్నాడు. డెల్టా
కుర్రాడు బిక్కమొహం పెట్టి చూశాడు. “అంటే… ఇది అంతా నిజం కాదా?”.
అంతా అయిపోయాక బానే గెస్ చేశావే, “నేను రోబోట్ ని మిత్రమా, ప్రేమా?, గర్ల్‌ఫ్రెండా? ఇలాంటివేవి నేను ఫీల్ అవ్వలేను.”
కుర్రాడు చిరాకుగా, “ఏంటి డెల్టా ఇలా చేసావ్. నేను నిజంగానే నీకోసం బాధపడ్డా.”
డెల్టా అతని తలపై చిలిపిగా తాకి చూడు కుర్రాడా, “ నా దగ్గర కేవలం మెమొరీ మాత్రమే ఉంది అందులో మేమోరీస్ లేవు .”
అలా అనకు నేను నిజంగా నీ ఫ్రెండ్‌షిప్ ను ఫీల్ అవుతున్నా..
థ్యాంక్స్ ఆకాష్, ఇక వెళ్ళి పడుకో..
“గుడ్ నైట్ డెల్టా” అంటూ పడుకునే వాడిలా రూమ్ లోకి వెళ్ళి హెడ్సెట్ పెట్టుకొని కథ కొనసాగించాడు..
గురువారం పొద్దున్నే సమయం 6 అవుతోంది, వెలుగు పెరిగే కొద్ది తనని చూడాలనే ఆశ కూడా నాలో పెరుగుతోంది.
రేయ్ జయ లేవరా టైం 9 అవుతుంది , అంటూ నిద్ర లేపాను.
ఏంట్రా ప్రశాంతంగా నిద్రపోనివ్వవా అంటూ కసురుకుంటూనే బయటకు వచ్చాడు.
శీతాకాలం కావడంతో సూర్యుడు ఇంకా రాలేదు..
రేయ్ ఇంత పొద్దున్నే చలిలో ఎక్కడికి రా.. పైగా తొమ్మిది అయిందని అబద్ధం కూడా చెప్పావు.
అదే మావ త్వరగా వెతికితే త్వరగా దొరుకుతుందని…
మీరు మారరా, మాలా సింగిల్గా బతకండి రా అంటే మీరు వినరే…, ప్రేమలో చాలా కష్టాలు ఉంటాయి మావ..
నా తపన అర్థం చేసుకో రా..
ఎన్ని కోణాలు తీసినా మీరు మారారు, సరే పద..
గురువారం మొత్తం మారతహళ్లిలో జల్లడ పట్టాము, ఎక్కడ కనిపించలేదు.
నిరాశ పడకుండా మరో మూడు రోజులు వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ ఇంకా వేరే టెక్ పార్కులలో వెతికాం ఎక్కడ దొరకలేదు.
అయినా చివరి రోజు నాకు అర్థమైంది ఏంటంటే మా పిచ్చి కాకుంటే తను ఎక్కడో ఆఫీస్ లో ఉంటుంది కానీ నాకోసం బయట ఎందుకు తిరుగుతుంది...., ఆఖరికి శని ఆదివారాలు కూడా ఎక్కడ కనపడలేదు.
వెతికి వెతికి అలిసిపోయాం నిరాశతో నా మనసు నిండిపోయింది.. బండిని ఒకచోట ఆపి అలా దూరంగా వెళ్లి కూర్చొన్నాను..
జయా వచ్చి నా పక్కన కూర్చున్నాడు..
ఏం కాదులే విక్రమ్ తను కచ్చితంగా దొరుకుతుంది, గుర్తుపెట్టుకో దొరికిందంటే తను కచ్చితంగా నీదే, దొరక్కపోతే ఆ దేవుడి నిర్ణయం.
చేసేదేమీ లేక ఇద్దరం తిరిగి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయాము.
మొదటి రోజు ఉదయం పొద్దున్నే ఆఫీస్ కి బయలుదేరా…
అమ్మ ఎదురొస్తూ,” ఏంట్రా నాన్న కొత్త ఆఫీస్ కి వెళ్తూ అలా దిగాలుగా ఉన్నావ్” అని అడిగింది..
ఏం లేదమ్మా రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు అంతే…
మళ్ళీ పీడకలా.
ఆ అలాంటిదే, ఒక అందమైన పీడకల..
ఏరా విచిత్రంగా మాట్లాడుతున్నావ్, సరే జాగ్రత్తగా వెళ్ళు..
సరే మా..అంటూ బెళందూరుకు బయలుదేరా, మా కొత్త ఆఫీస్ అక్కడే ఉంది..
ఆఫీస్ చాలా బాగుంది, హెచ్ ఆర్ ని కలిసాం,అక్కడ చాలా ప్రాజెక్ట్ డిస్కషన్స్ జరిగాయి, అక్కడున్న టీం ను పరిచయం చేసుకున్నాం.
హెచ్ ఆర్ ఏమో మాట్లాడడం అంతా అయ్యాక మమ్మల్ని క్లైంట్ లొకేషన్ కి వెళ్ళమంటోంది, మేము వద్దంటున్నా వినట్లేదు
నాకు పిచ్చ కోపం వస్తోంది, “ నాకు ఈ ఆఫీస్ కె రావాలని లేదు, అలాంటిది క్లైంట్ లొకేషన్ అంటే “అని మనసులో అనుకున్న
జయా తో కంపెనీ మారుదామని చెప్పా, వాడేమో ఒకసారి క్లైంట్ లొకేషన్ చూసి ఆ తర్వాత డిసైడ్ అవుదామని చెప్పాడు.., వాడి మాట కాదనలేక లేక ఒప్పుకున్నా..
వచ్చే సోమవారమే అక్కడికి ప్రయాణం..