Witness in Telugu Anything by Writer raguvaran books and stories PDF | సాక్షి

Featured Books
  • సాక్షి

    రేటెడ్ హౌస్ఆ అడవిలో రాత్రి ఎప్పుడూ చీకటిగా ఉండదు.చెట్ల మధ్య...

  • తొలి పౌర్ణమి - 20

    నేను వేసే ప్రతి అడుగూ అక్కడి వాతావరణాన్ని కాస్త భారంగా, నా వ...

  • రుధిరపు అడుగులలో - 17

    ముద్దనహళ్లి అరణ్యపు ఆ కటిక గెస్ట్ హౌస్ లో ఎసిపి విక్రమ్ అనుభ...

  • Super Brain - 2

    డాక్టర్ కొద్దిసేపు ఆ యువకుడిని గమనించాడు.ఆ తర్వాత నర్సు వైపు...

  • ఒక్క క్షణం కోపం

    విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద సాయంత్రపు ట్రాఫిక్ ఎప్పటిలాగే నరక...

Categories
Share

సాక్షి

రేటెడ్ హౌస్

ఆ అడవిలో రాత్రి ఎప్పుడూ చీకటిగా ఉండదు.

చెట్ల మధ్య నుంచి జారిపడే వెన్నెల అక్కడక్కడా నేలను తాకుతూ ఉంటుంది. కానీ ఆ వెన్నెల కూడా ఆ అడవిలోని భయాన్ని పోగొట్టలేకపోయేది.

చుట్టూ దట్టమైన చెట్లు.

ఆకుల మధ్య నుంచి వీచే గాలి.

దూరంగా కీచురాళ్ల నిరంతర శబ్దం.

మధ్య మధ్యలో వినిపించే గుడ్లగూబ అరుపులు.

ఆ శబ్దాలన్నింటినీ జాగ్రత్తగా వింటూ ఒక యువకుడు చెట్ల మధ్య తిరుగుతున్నాడు.

అతని పేరు రఘు.

వయసు ఇరవై ఎనిమిది.

సినిమా పరిశ్రమలో ప్రొఫెషనల్ సౌండ్ డిజైనర్.

ప్రకృతిలోని అసలైన శబ్దాలను రికార్డ్ చేయడం అతని ప్రత్యేకత. స్టూడియోలో కృత్రిమంగా తయారుచేసిన సౌండ్స్ కంటే, నిజమైన అడవి తనకు ఎక్కువ ఇష్టం.

అందుకే ఆ రాత్రి కూడా అతను ఒంటరిగా ఆ దట్టమైన అడవిలోకి వచ్చాడు.

రఘు ఒక చెట్టు దగ్గర మైక్రోఫోన్ స్టాండ్‌ను సెట్ చేశాడు.

మరో మైక్రోఫోన్‌ను పొదల మధ్య అమర్చాడు.

ఇంకొకదాన్ని కొంత దూరంలో ఉన్న చిన్న వాగు వైపు తిప్పాడు.

అన్నింటికీ కేబుల్స్ కనెక్ట్ చేసి, రికార్డింగ్ యూనిట్‌ను ఆన్ చేశాడు.

హెడ్‌ఫోన్స్ చెవులకు పెట్టుకున్నాడు.

కొన్ని క్షణాలు కళ్లుమూసుకుని విన్నాడు.

కీచురాళ్లు...

గాలి...

ఆకుల కదలిక...

దూరంగా ఏదో రాత్రి పక్షి అరుపు...

అన్నీ అద్భుతంగా రికార్డ్ అవుతున్నాయి.

రఘు పెదవులపై చిన్న చిరునవ్వు కనిపించింది.

“పర్ఫెక్ట్...”

అతను రికార్డింగ్ బటన్ నొక్కాడు.

ఎర్రటి లైట్ వెలిగింది.

రికార్డింగ్ మొదలైంది.

రఘు తన టెంట్‌లోకి వెళ్లి పడుకున్నాడు.

అతనికి తెలియదు...

ఆ రాత్రి అతను రికార్డ్ చేస్తున్నది కేవలం అడవి శబ్దాలు కాదని.

---

మరుసటి రోజు

ఉదయం.

రఘు తన చిన్న సౌండ్ స్టూడియోలో కంప్యూటర్ ముందు కూర్చున్నాడు.

రాత్రి అడవిలో రికార్డ్ చేసిన ఆడియో ఫైల్స్‌ను ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకున్నాడు.

ఒక చేతిలో కాఫీ కప్పు.

మరో చేతితో మౌస్.

హెడ్‌ఫోన్స్ చెవులకు.

అతను రికార్డింగ్ ప్లే చేశాడు.

పక్షుల కిలకిలలు...

ఆకుల సవ్వడి...

గాలి శబ్దం...

ప్రకృతి అంతా అతని హెడ్‌ఫోన్స్‌లో సజీవంగా వినిపిస్తోంది.

రఘు కాఫీని నెమ్మదిగా సిప్ చేశాడు.

అంతలో...

స్క్రీన్ మీద ఉన్న ఆడియో వేవ్‌ఫార్మ్ ఒక్కసారిగా పైకి ఎగిరింది.

ఒక భారీ స్పైక్.

రఘు కనుబొమ్మలు ముడుచుకున్నాయి.

అతను వెంటనే కాఫీ కప్పును పక్కన పెట్టాడు.

వాల్యూమ్ పెంచాడు.

హెడ్‌ఫోన్స్‌ను చెవులకు మరింత గట్టిగా నొక్కుకున్నాడు.

మొదట కొన్ని సెకన్ల పాటు కేవలం అడవి శబ్దాలే వినిపించాయి.

తర్వాత—

ఒక అమ్మాయి గొంతు.

భయంతో వణుకుతున్నా, కోపంతో నిండిన స్వరం.

“నన్ను వదిలేయ్... నిన్ను చంపేస్తాను!”

రఘు ఒక్కసారిగా కదలకుండా పోయాడు.

అతని వేళ్లు మౌస్ మీదే ఆగిపోయాయి.

తర్వాత మరో గొంతు వినిపించింది.

గంభీరమైన మగ గొంతు.

దాని వెనుక ఒక భయంకరమైన నవ్వు.

“మీ అందర్నీ నేనే చంపేస్తాను!”

రఘు ఉలిక్కిపడ్డాడు.

హెడ్‌ఫోన్స్‌ను ఒక్కసారిగా తీసేశాడు.

అతని చేతిలోని కాఫీ కప్పు స్వల్పంగా వణికింది.

కొన్ని క్షణాలు అతను స్క్రీన్ వైపు చూస్తూనే ఉన్నాడు.

“ఇదేంటి...?”

మళ్లీ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నాడు.

ఆ భాగాన్ని రివైండ్ చేశాడు.

మళ్లీ విన్నాడు.

అదే గొంతులు.

అదే మాటలు.

రఘు నెమ్మదిగా వెనక్కి వాలాడు.

“రాత్రి అక్కడ ఎవరైనా సినిమా షూటింగ్ చేశారా?”

అనుమానం మొదలైంది.

అతను వెంటనే ఆడియో ట్రాక్‌ను విడదీశాడు.

వాయిస్‌ను ఐసోలేట్ చేశాడు.

బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌ను పెంచాడు.

అప్పుడు...

ఆ గొంతుల వెనుక దాగి ఉన్న మరో శబ్దం అతని చెవికి తగిలింది.

ఒక కారు.

వేగంగా దూసుకొస్తున్న కారు.

రఘు వాల్యూమ్ మరింత పెంచాడు.

టైర్లు రాసుకున్నాయి.

బ్రేకుల శబ్దం.

తర్వాత—

ఢాం!

కారు చెట్లను ఢీకొట్టిన శబ్దం.

రఘు కుర్చీలో నుంచి దాదాపు లేచిపోయాడు.

“మై గాడ్...”

అతని ముఖం మారిపోయింది.

“ఇది షూటింగ్ కాదు.”

కొన్ని క్షణాలు స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయాడు.

“అక్కడ నిజంగా ఏదో జరిగింది.”

---

అడవిలోకి తిరిగి

మధ్యాహ్నం అయ్యేలోపే రఘు తన కారులో మళ్లీ అదే అడవికి బయలుదేరాడు.

రాత్రి మైక్రోఫోన్లు పెట్టిన ప్రాంతానికి చేరుకున్నాడు.

చుట్టూ జాగ్రత్తగా పరిశీలించాడు.

కొంత దూరంలో మట్టి రోడ్డుపై అతని కంటికి కొన్ని టైర్ల గుర్తులు కనిపించాయి.

అవి రోడ్డుపై నుంచి అడవిలోకి వెళ్లాయి.

రఘు వాటిని అనుసరించాడు.

కొంత దూరం వెళ్లగానే అతని అడుగులు ఆగిపోయాయి.

రెండు పెద్ద చెట్లు విరిగిపోయి ఉన్నాయి.

వాటి మధ్యలో...

ఒక కారు తలకిందులుగా పడి ఉంది.

కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది.

రఘు గుండె వేగంగా కొట్టుకుంది.

అతను నెమ్మదిగా కారు దగ్గరకు వెళ్లాడు.

లోపల తొంగి చూశాడు.

ఎవరూ లేరు.

కానీ సీట్ల మీద...

డోర్ల మీద...

చిన్న చిన్న రక్తపు మరకలు ఉన్నాయి.

రఘు ముఖంలో ఆందోళన పెరిగింది.

ఎవరైనా గాయపడ్డారా?

ఎవరైనా చనిపోయారా?

లేదా...

ఎవరైనా ఇక్కడి నుంచి ఎవరినైనా తీసుకెళ్లారా?

ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని కారులో వెతకడం మొదలుపెట్టాడు.

డ్యాష్‌బోర్డ్ కింద ఒక చిన్న ర్యాక్ కనిపించింది.

అతను దాన్ని తెరిచాడు.

అందులో ఒక కాగితం మడతపెట్టి ఉంది.

రఘు దాన్ని బయటకు తీశాడు.

విప్పి చూశాడు.

అది ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్.

దానిపై పెద్ద అక్షరాలతో ఒక పేరు ఉంది.

WELCOME TO RATED HOUSE AREA

రఘు ఆ పేరును కొన్ని క్షణాలు చూస్తూ నిలబడ్డాడు.

అతని చేతిలో ఉన్న ఆ కాగితం...

అతన్ని ఒక కొత్త రహస్యానికి తీసుకెళ్లబోతోందని అప్పటికి అతనికి తెలియదు.

---

రేటెడ్ హౌస్

సాయంత్రం.

రఘు ఆ బ్రోచర్‌లో ఉన్న చిరునామాను వెతుక్కుంటూ రేటెడ్ హౌస్ ప్రాంతానికి చేరుకున్నాడు.

ప్రవేశద్వారం దగ్గర ఒక పాత ఆర్చ్ ఉంది.

పెయింట్ మొత్తం ఊడిపోయి ఉంది.

దానిపై ఇంకా ఒక బోర్డు వేలాడుతోంది.

WELCOME TO RATED HOUSE

రఘు లోపలికి అడుగుపెట్టాడు.

అక్కడ కనిపించిన దృశ్యం అతనికి ఆశ్చర్యం కలిగించింది.

సగం కట్టిన ఇళ్లు.

మధ్యలో పెరిగిపోయిన గడ్డి.

పూర్తికాని రోడ్లు.

ఎక్కడ చూసినా నిర్మానుష్యం.

ఒకప్పుడు ఇక్కడ పెద్ద కాలనీ నిర్మించాలనుకున్నట్టుంది.

కానీ ఏదో కారణంతో ఆ పని మధ్యలోనే ఆగిపోయింది.

అక్కడక్కడా కనిపిస్తున్న కొంతమంది వృద్ధులు మాత్రమే ఆ ప్రాంతంలో ఇంకా జీవిస్తున్నట్టున్నారు.

రఘు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక సగం కట్టిన ఇంటి ముందు ఇద్దరు వృద్ధులు కనిపించారు.

వాళ్లు భయంగా ఏదో మాట్లాడుకుంటున్నారు.

రఘు కొంత దూరంలో ఆగి వాళ్ల మాటలు విన్నాడు.

“ఆ పాత బంగ్లా వైపు ఎవరూ వెళ్లకండిరా బాబూ...”

మొదటి వృద్ధుడి గొంతులో భయం స్పష్టంగా ఉంది.

“రాత్రి అక్కడి నుంచి చాలా బీభత్సమైన అరుపులు వచ్చాయి.”

రెండో వృద్ధుడు వెంటనే తల ఊపాడు.

“అవును... ఆ ఇంట్లో ఏదో ఘోరం జరిగింది.”

అతను చుట్టూ చూసి గొంతు తగ్గించాడు.

“అటువైపు వెళ్తే ప్రాణాలతో తిరిగి రారు. ఆ ఇంటిని ఏదో పీడిస్తోంది.”

రఘు చూపు నెమ్మదిగా కాలనీ చివరికి వెళ్లింది.

అక్కడ...

ఒక పాత బంగ్లా కనిపించింది.

సూర్యుడు అస్తమిస్తున్నాడు.

చీకటి నెమ్మదిగా ఆ బంగ్లాను చుట్టుకుంటోంది.

ఆ ఇంటి రూపమే ఏదో తెలియని భయాన్ని కలిగిస్తోంది.

రఘు గుండె వేగంగా కొట్టుకుంది.

అయినా అతని కళ్లలో భయం కంటే ఒక ప్రశ్న పెద్దదిగా మారింది.

అక్కడ అసలు ఏం జరిగింది?

---

పాత బంగ్లా

రఘు బంగ్లా వైపు నడుస్తుండగా వెనుక నుంచి పిల్లల అరుపులు వినిపించాయి.

కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు.

వృద్ధులు ఒక్కసారిగా వాళ్లను చూసి భయపడ్డారు.

“ఒరేయ్! అక్కడికి వెళ్లకండి!”

పిల్లల చేతులు పట్టుకుని వాళ్లను తమవైపు లాక్కున్నారు.

“ఆ బంగ్లా వైపు అస్సలు వెళ్లకండి. ఆ దయ్యం మరీ భయంకరంగా మారిపోయినట్టుంది!”

పిల్లలను ఇళ్లలోకి తీసుకెళ్లి తలుపులు గట్టిగా మూసేశారు.

రఘు ఒంటరిగా నిలబడ్డాడు.

అతను బంగ్లా గేటు వైపు చూశాడు.

కొన్ని క్షణాలు ఆగాడు.

తర్వాత...

గేటును నెమ్మదిగా నెట్టాడు.

కీచుమనే శబ్దంతో గేటు తెరుచుకుంది.

రఘు లోపలికి అడుగుపెట్టాడు.

---

ఆ శవం

బంగ్లా లోపల గాలి కూడా భారంగా అనిపించింది.

గోడలన్నీ దుమ్ముతో, బూజుతో కప్పబడి ఉన్నాయి.

రఘు ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు.

చుట్టూ వెలుగు తిప్పుతూ ముందుకు నడిచాడు.

ఒక పెద్ద హాల్‌లోకి అడుగుపెట్టాడు.

అక్కడే...

అతని అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి.

టార్చ్ వెలుగు పైకి వెళ్లింది.

పైకప్పు నుంచి ఒక మగవాడి శవం వేలాడుతోంది.

రఘు గొంతులో మాట ఆగిపోయింది.

అతని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.

“ఓహ్ గాడ్...”

అతను వణుకుతూ శవం దగ్గరకు వెళ్లాడు.

అప్పుడు అతని దృష్టి కాళ్లపై పడింది.

శవం కాలి వేళ్ల నుంచి...

ఒక రక్తపు బొట్టు నేలపై పడింది.

టప్.

మరో బొట్టు.

టప్.

రఘు చూపు ఆ రక్తం పడుతున్న ప్రదేశాన్ని అనుసరించింది.

అక్కడ ఒక చిన్న మట్టి విగ్రహం ఉంది.

ఒక చిన్న పాప రూపం.

చేతిలో చిన్న త్రిశూలం.

తలపై టెంకాయ చిప్పను బోర్లించినట్టుగా ఉన్న విచిత్రమైన అలంకారం.

ఆ విగ్రహం ముఖం మాత్రం...

భయంకరమైన పరిస్థితిలో కూడా ఎంతో క్యూట్‌గా ఉంది.

చిన్న చిరునవ్వుతో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

కానీ శవం నుంచి కారుతున్న రక్తం దాని మీద పడుతుండటంతో...

ఆ చిన్న విగ్రహం మొత్తం ఎర్రగా మారిపోయింది.

రఘు గుండెల్లో ఏదో తెలియని భయం పుట్టింది.

అతను వెంటనే ఫోన్ తీసి పోలీసులకు కాల్ చేశాడు.

పోలీసులు వచ్చేలోపు అతని చూపు మళ్లీ ఆ విగ్రహం మీద పడింది.

ఎందుకో తెలియదు.

ఆ విగ్రహం అతన్ని ఆకర్షించింది.

ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకుని...

రక్తంతో తడిసిన ఆ చిన్న మట్టి విగ్రహాన్ని తన బ్యాగ్‌లో పెట్టుకున్నాడు.

అది తాను చేసిన జీవితంలోనే అతిపెద్ద తప్పు అని...

రఘుకు అప్పటికి తెలియదు.

---

పోలీసుల అనుమానం

కొద్దిసేపటికే బంగ్లా బయట పోలీస్ జీపుల సైరన్లు వినిపించాయి.

సీఐ మరియు కానిస్టేబుల్స్ లోపలికి వచ్చారు.

శవాన్ని పరిశీలించిన సీఐ వెంటనే రఘువైపు తిరిగాడు.

“అసలు నీకు బుద్ధుందా?”

రఘు అయోమయంగా చూశాడు.

“ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నువ్వేమైనా సీబీఐ ఆఫీసరువా? నువ్వే ఫాలోఅప్ చేస్తావా?”

“సార్... నేను—”

“అసలు ఈ మర్డర్ నువ్వే చేసి, ఆధారాలు లేకుండా తప్పించుకోవడానికి ఈ డ్రామా ఆడుతున్నావేమో కూడా అనిపిస్తోంది.”

రఘు భయపడ్డాడు.

“కాదు సార్! నేను సౌండ్ ఇంజనీర్‌ని. సినిమాలకు పనిచేస్తాను. నా పేరు రఘు. అడవుల్లో నేచురల్ సౌండ్స్ రికార్డ్ చేస్తుంటాను.”

అతను తన ఫోన్‌లో ఆడియో ప్లే చేశాడు.

“రాత్రి నేను రికార్డ్ చేసిన ఆడియోలో ఇవి వినిపించాయి. మొదట సినిమా షూటింగ్ అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నిజంగానే ప్రమాదం జరిగిందని తెలిసింది. అందుకే మీకు ఫోన్ చేశాను.”

సీఐ ఆడియో విన్నాడు.

అతని ముఖంలో అనుమానం అలాగే ఉంది.

ఇంతలో ఫోరెన్సిక్ డాక్టర్ శవాన్ని పరిశీలిస్తూ సీఐ దగ్గరకు వచ్చాడు.

“సార్... బాడీ మీద పెద్దగా ఎలాంటి గాయాలు లేవు.”

“అయితే మరణం ఎలా జరిగింది?”

డాక్టర్ కాసేపు ఆలోచించాడు.

“అది క్లియర్‌గా చెప్పలేం. కానీ బాడీ మొత్తం చాలా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఏదో సూదితోనో... ముల్లుతోనో పొడిచినట్టున్నాయి.”

రఘు ఒక్కసారిగా నిశ్చలంగా మారాడు.

అతని మెదడులో ఆడియో మళ్లీ వినిపించింది.

నన్ను వదిలేయ్... నిన్ను చంపేస్తాను!

అతను వెంటనే సీఐ వైపు తిరిగాడు.

“సార్!”

అందరూ అతని వైపు చూశారు.

“నేను రికార్డ్ చేసిన ఆడియోలో ఒక అమ్మాయి గొంతు ఉంది.”

సీఐ కనుబొమ్మలు పైకెత్తాడు.

“ఏమంది?”

“‘నన్ను వదిలేయ్... నిన్ను చంపేస్తాను’ అని అరిచింది.”

అతను శవం వైపు చూశాడు.

“కానీ ఇక్కడ చనిపోయింది మగవాడు.”

గదిలో నిశ్శబ్దం అలుముకుంది.

రఘు నెమ్మదిగా అన్నాడు—

“అంటే... ఈ హత్య చేసింది ఆ అమ్మాయా?”

సీఐ అతన్ని గట్టిగా చూశాడు.

“అది మేం తేలుస్తాం.”

కొద్దిసేపు ఆగి—

“నువ్వు ముందు స్టేషన్‌కు రా.”

---

22 హత్యలు

మరుసటి రోజు ఉదయం.

పోలీస్ స్టేషన్‌లో కేసు దర్యాప్తు జరుగుతోంది.

గోడకు ఫొటోలు.

మ్యాప్‌లు.

పాత కేసుల ఫైల్స్.

రేటెడ్ హౌస్ చుట్టూ జరిగిన అనుమానాస్పద సంఘటనల వివరాలు.

అంతా గందరగోళంగా ఉంది.

అప్పుడే స్టేషన్ బయట ఒక జీపు వచ్చి ఆగింది.

దాని నుంచి ఒక వ్యక్తి దిగాడు.

వయసు నలభై.

మాసిన గడ్డం.

కళ్లలో విచిత్రమైన ప్రశాంతత.

అతను నెమ్మదిగా స్టేషన్‌లోకి నడిచాడు.

నేరుగా సీఐ టేబుల్ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు.

“సార్...”

సీఐ పైకి చూశాడు.

ఆ వ్యక్తి ప్రశాంతంగా అన్నాడు—

“ఆ రేటెడ్ హౌస్‌లో హత్య చేసింది నేనే.”

స్టేషన్‌లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా అతని వైపు చూశారు.

సీఐ కుర్చీలోంచి లేచాడు.

“ఏం అన్నావు?”

ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వాడు.

“ఒకరిని కాదు సార్.”

కొద్దిసేపు ఆగి—

“మొత్తం ఇరవై రెండు మందిని చంపాను.”

స్టేషన్ మొత్తం నిశ్శబ్దమైంది.

“కావాలంటే సాక్ష్యాలు ఇస్తాను.”

అతను తన చేతులను ముందుకు చాచాడు.

“నన్ను అరెస్ట్ చేయండి.”

సీఐ అతని కళ్లలోకి చూశాడు.

అక్కడ భయం లేదు.

పశ్చాత్తాపం లేదు.

కేవలం...

ఏదో దాచిపెట్టిన మనిషి ప్రశాంతత ఉంది.

---

న్యాయస్థానం

రోజులు గడిచాయి.

విచారణ జరిగింది.

అతను చెప్పిన వివరాలు ఒక్కొక్కటిగా నిజమయ్యాయి.

బాడీలు ఎక్కడ ఉన్నాయో చెప్పాడు.

ఎలా చంపాడో చెప్పాడు.

పోలీసులకు తెలియని ఆధారాలు చూపించాడు.

చివరికి...

కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.

తీర్పు చెప్పే ముందు జడ్జి అతని వైపు చూశాడు.

“ఇన్ని హత్యలు చేయడానికి కారణం ఏమిటి?”

ఆ వ్యక్తి కళ్లలో మొదటిసారి నీళ్లు కనిపించాయి.

“నా భార్యను వాళ్లు చంపేశారు సార్.”

అతని గొంతు వణికింది.

“అందుకే వాళ్లను చంపాను.”

జడ్జి గంభీరంగా చూశాడు.

“మరి మిగతా ఇరవై ఒక్క మందిని ఎందుకు చంపావు?”

అతను తలదించుకున్నాడు.

“వాళ్లంతా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి అక్రమంగా రవాణా చేసే ముఠా.”

కోర్టులో గుసగుసలు మొదలయ్యాయి.

అతను తలెత్తి చూశాడు.

“సమాజానికి అరిష్టమైన వాళ్లను నేనే అంతం చేశాను.”

జడ్జి స్వరం కఠినంగా మారింది.

“చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు నీకెవరిచ్చారు?”

ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడు.

“ఒక మనిషి ప్రాణం తీయడం నేరం. నువ్వు నేరస్థులను చంపే జడ్జివి కాదు.”

జడ్జి తీర్పు పత్రాన్ని చూశాడు.

“చట్టం తన పని తాను చేస్తుంది. నీకు మరణశిక్ష ఖాయం.”

ఆ మాటలతో కోర్టు హాల్‌లో నిశ్శబ్దం నెలకొంది.

కానీ...

ఈ కథలో అసలు ప్రశ్న అక్కడితో మొదలైంది.

అతను నిజంగానే ఇరవై రెండు మందిని చంపాడా?

లేక...

ఎవరినో కాపాడటానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టి నింద తన మీద వేసుకున్నాడా?

---

ఆ రాత్రి

అర్ధరాత్రి.

రఘు తన గదిలో ఒంటరిగా పడుకున్నాడు.

బయట గాలి వీస్తోంది.

గదిలో గాఢమైన నిశ్శబ్దం.

రఘు కళ్లకు నిద్ర వస్తుండగానే...

టప్... టప్... టప్...

అతను ఒక్కసారిగా కళ్లు తెరిచాడు.

ఎవరో చిన్న పిల్లవాడు గదిలో నడుస్తున్నట్టుగా...

చిన్న చిన్న అడుగుల శబ్దం.

రఘు మంచం మీద కూర్చున్నాడు.

“ఎవరు?”

సమాధానం లేదు.

అతను ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు.

గది మొత్తం పరిశీలించాడు.

ఎవరూ లేరు.

బాత్‌రూమ్ తలుపు తెరిచాడు.

ఖాళీ.

హాల్‌లోకి వెళ్లాడు.

ఎవరూ లేరు.

చివరికి ఏమీ కనిపించకపోవడంతో నిట్టూర్చాడు.

“ఆ శవాన్ని చూసినప్పటి నుంచి నా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది...”

అతను నీళ్లు తాగాడు.

“ఎవరో దొంగ పిల్ల వచ్చి పాలు తాగి వెళ్లినట్టుంది.”

తిరిగి బెడ్ మీద పడుకున్నాడు.

కళ్లు మూసుకున్నాడు.

కొన్ని సెకన్లు...

నిశ్శబ్దం.

తర్వాత...

అతని బెడ్ కింద నుంచి...

టప్.

రఘు కళ్లు తెరిచాడు.

టప్... టప్...

ఆ చిన్న అడుగుల శబ్దం ఈసారి చాలా దగ్గరగా వినిపించింది.

రఘు నెమ్మదిగా మంచం కిందికి చూశాడు.

అక్కడ చీకటి తప్ప మరేమీ కనిపించలేదు.

అతను మళ్లీ పైకి చూశాడు.

అతనికి తెలియకుండా...

అతని గది మూలలో ఉన్న బ్యాగ్ నెమ్మదిగా కదిలింది.

ఆ బ్యాగ్ లోపల...

రక్తంతో తడిసిన ఆ చిన్న మట్టి విగ్రహం ఉంది.

దాని చిన్న ముఖంపై...

అదే చిరునవ్వు.

అది ఇప్పుడు రఘు ఇంటికి వచ్చింది.