Jeevitham in Telugu Women Focused by Dhanalakshmi books and stories PDF | జీవితం

Featured Books
Categories
Share

జీవితం


                     మోహన చేతివేళ్ళు ఇంకాస్త గట్టిగా బిగుసుకున్నాయి . తూలుతున్న ఒళ్ళు సాధీన పరచటానికి విశ్నప్రయత్నం చేస్తూ మెల్లగా కళ్ళెత్తి మరోసారి చూసింది శుభలేఖ వైపు .

               ఎన్ని సార్లు చూసినా , ఏడుస్తూ చూసినా అక్షరాలు మారవన్న సత్యం అప్పుడు తెలిసింది . నిండా నిండిన కన్నీళ్ళ వలన మసగ్గా కనిపిస్తుందంతా .
 
        టపాటపా జారిన రెండు కన్నీటి బొట్లు కార్పెట్ పై ఇంకిపోయాయి.

                     ఒక్కసారి గట్టిగా ఏడవాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించు పరుగులాంటి నడకతో వాష్ రూంలోనికెళ్ళింది .

                పది నిమిషాల తర్వాత సాధ్యమైనంత మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ బయటికొచ్చిన మోహన వైపు గుచ్చి గుచ్చి చూస్తున్నారు  ఆఫీస్ స్టాఫ్ అంతా .

                తల తిప్పకుండా తిన్నగా వెళ్ళి తన సీటులో కూర్చుని సిస్టం ఆన్ చేసింది,
 
                కానీ మనసంతా గందరగోళం .

           అసలా కార్డు గురించిన తలనొప్పి కన్నా చుట్టూ ఉన్న వారి చూపులేలా తప్పించుకోవాలన్న తలనొప్పే ఎక్కువ యింది .

          ఉన్నపాటుగా ఇక్కడి నుండి మాయమైపోయినా బాగుండేది .

          లంచ్ టైమ్ కావడంతో అందరూ ఖాళీగానే ఉన్నారు .

            తను తల తిప్పి చూస్తే చాలు ఓదార్చటానికీ , సానుభూతి ప్రదర్శిస్తూ జాలి కురిపించటానికి రెడీగా ఉన్నారు .

                  తల బ్రద్దలైపోతోంది .

            డు యూ వాంట్ పర్మిషన్ మోహనా ? మెల్లగా ' అడిగాడు కిరణ్,  టీం లీడర్ .
       
                 వెళ్ళిపోవాలి , ముందు ఇక్కడి నుండి బయట పడాలి కుంటూ లేచింది .

                  అంతలోనే ఏదో సందేహం .

            ఎక్కడికని వెళ్ళిపోతుంది?????

            ఎన్ని రోజులని వెళ్ళిపోతుంది ?

             ఈ రోజు కాకుంటే రేపు , రేపు కాకుంటే మరో రోజైనా తను రావాల్సింది ఇక్కడికే,ఉండాల్సింది వీళ్ళ మద్యనే.

               తప్పనిసరని తెలిసినపుడు , తప్పించుకోలేమని అర్థమైనపుడువృథా ప్రయాసతో పరుగులు తీసి అలసిపోవడమెందుకు ?
                               ఇట్స్ ఓకే సార్ , ఐ యామ్ ఆల్రైట్ చెప్పేసి మరో మాటకు తావివ్వకుండా కంప్యూటర్లో తల దూర్చేసింది .
         
          అందుకే అంత తొందరగా ఎవర్నీ నమ్మకూడదు.
                     
                      పాపం , చాలా మంచిది .
     
                          కోలుకోవడం కష్టమే.
         
           ఎంతలా వినకూడదనుకుంటుంటే అంతలా చెవుల్లోకి దూరుతున్నాయి ఆ మాటలు .

          వీళ్ళకెందుకు మద్యలో తనెలా చస్తే?ఎవరిననుకొని ఏం లాభం?

                       తన ఖర్మ అంతా .
             
               మూడు గంటల సేపు ఆఫీస్ లో ఎలా గడిపిందో??????వర్క్ ఎలా చేసిందో ?

             బస్టాప్ కి ఎలా చేరుకుందో ? ఏమో?
                       
                   ఏం జరుగుతుందో ?
                 
              అంతా అయోమయంగా , గందరగోళంగా , అసలేం అర్ధం కానట్టుంది .
           
              ఒక్కసారిగా జీవితం శూన్యమైపోయింది .

               గాడాంధకారంలో దిక్కుతోచక ఒంటరిగా మిగిలిపోయింది .
                               కాదు , కావాలనే ఒంటరిని చేసి వదిలేసాడు . అసలిదంతా నిజమేనా ? ఆశ తీరక మళ్ళీ బ్యాగ్ లో నుండి కార్డ్ తీసి చూసింది .
               
                        ఆకాష్ వెడ్స్ వీణ "
                       
               పిడికిళ్ళు బిగుసుకున్నాయి . బలం కొద్ది రెండు చేతులతో నలిపి ఉండ చుట్టి విసిరేసింది దూరంగా ,
                 
                అయినా దుఃఖం ఆగటం లేదు , కోపం తీరటం లేదు . అసలెందుకొచ్చాడు తన జీవితం లోనికి? అప్పుడెందుకు నవ్వించాడు? ఇప్పుడెందుకిలా ఏడిపిస్తున్నాడు ?
               
               ఎంతలా నమ్మించాడు?ఎన్నెన్ని ఆశలు రేపాడు ? తలచుకుంటుంటే రక్తం ఉడికిపోతోంది .
                             
                   ఏంటే డల్ గా ఉన్నావ్?బస్ దొరకలేదా ? డోర్ తీస్తూనే అడిగింది తల్లి . మొహం లోని అలసటను మాత్రమే కాకుండా మనసులో బాధను కూడా గుర్తించేసింది .
               
                     ఏమైందే మరోసారి అడిగింది మోహన నుండి ఆన్సర్రాకపోవటంతో .

              అలా అడిగిన ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగకపోతే కాఫి నో , టీ నో ఇవ్వచ్చుగా??????? హాల్ లో నుండి అరిచాడు తండ్రి .

ముఖం కడుక్కొని కాసేపు పడుకో ' లాలనగా చెప్తున్న తండ్రిని చూస్తుంటే గిర్రున తిరిగాయి  కళ్ళలో నీళ్ళు .

నిద్ర పోవాలనుంది డాడీ , గంట , రెండు గంటలో కాదు శాశ్వతo గా నిద్ర పోవాలనుంది . కానీ.............. శూన్యం లో కి చూస్తూ ఉండిపోయింది .

                     బ్రతికి ప్రయోజనం లేనపుడు , జీవిత ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన , గమ్యాన్ని చేస్తే రైలు తప్పిపోయినపుడు ఇంకా అవసరమా ?భూమికి భారంగా జీవించటం ?
             
                మౌనంగా రూంలోనికి నడిచింది . ఎదురుగా నిలువుటద్దంలో తన నిలువెత్తు రూపం .
               
            నీ కనుపాపలు భలే ఉంటాయి తెలుసా ? కొలనులో అవిరామంగా ఈదే చేపపిల్లల్లా అటూ , ఇటూ కదులుతూనే ఉంటాయి .
               
            అందం అంటే ఆత్మ సౌందరమేగా ? మోహా . అదే నిజమైతే యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ మై వరల్డ్ .
                     
                  నువ్వు ఒప్పుకోకుంటే అందరిలా వెంటపడతా అనుకుంటున్నా వేమో ? మరిచిపోతా , పూర్తిగా మరిచిపోతా నిన్ను కాదు ప్రేమ అనే రెండక్షరాల్ని మరిచిపోతా .

             ఒక్కటి మాత్రం నిజం మోహా నా జీవితంలో నాకంటూ ఒకరున్నారు అనుకుంటే అది నువ్వు మాత్రమే . ఎన్నాళ్ళయినా నీ స్థానం అలానే ఉంటుంది .

ఎంత గట్టిగా చెవులు మూసుకున్నా ఆకాష్ మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి .

          అసలేం తప్పు చేసానని ఇంత పెద్ద శిక్ష ! ఆక్రోశిస్తోంది తన మనసు .

ఎంతలా నమ్మించాడు . తనని చూడకుండా,తనతో మాట్లాడ కుండా ఒక్క రోజు కూడా బ్రతక లేనన్నాడు ఇప్పుడు జీవితాంతంబ్రతకటానికి రెడీ అవుతున్నాడు . నవ్వుకుంది విరక్తిగా .
                     
              ఆలోచనల హోరుతో అంతకంతకూ తలనొప్పి పెరిగి పోతోంది . అసలేం తప్పు చేసానని ఆకాష్ ని నిలదీయాలి , రూంలో వస్తువులన్నీ విసిరికొట్టాలి .... ... ఇంకా తారా స్థాయిని చేరుతోంది కోపం. చేతిని బిగించి గోడకేసి కొట్టింది .
         
                అదేంటో నొప్పి తెలియలేదు , బలంగా మరో మూడు సార్లు కొట్టింది నొప్పిగా అనిపించినా ఏడుపు రాలేదు .
     
                 కళ్ళు మూసినా , తెరిచినా ఆకాషే కనిపిస్తున్నాడు . మూడు సంవత్సరాలు దాటింది ఆకాష్ పరిచయమై . ఆఫీస్ చేరిన నెల రోజులకే ప్రపోజ్ చేస్తే నిర్దాక్షిణ్యంగా నిరాకరించింది.
                 
           పరిచయమైన వెంటనే ప్రేమిస్తున్నానంటే ఎవరికైనా కోపమే వస్తుంది . పోనీ నా గురించి పూర్తిగా తెలుసుకున్నాకనే నీ నిర్ణయం చెప్పు  కానీ అప్పటి వరకూ మనం ఎదురు పడితే రాజ్యాల కోసమో ? అధికారాల కోసమో ? పోట్లాడుకున్న శత్రువుల్లా కాకుండా మాములుగా ఉందాం.
                          ఎంత హుందాగా చెప్పాడు .
         
             ఓకే అనేసి ఏం జరగనట్టే ఊరుకుంది .

ఇద్దరిదీ అదే టీం కావటం వలన అప్పుడప్పుడు మాట్లాడాల్సి వచ్చింది . ఎంత జోవియల్గా ఉన్నా హద్దులు దాటని ప్రవర్తన , హెల్ప్ చేయటానికి రెఢీగా ఉండే వ్యక్తిత్వం . క్రమక్రమంగా మంచి అభిప్రాయమే ఏర్పరిచాయి . అది కేవలం కొలీగ్ గా మాత్రమే .
           
                కానీ ఆ స్థాయిని దాటి సన్నిహితుడిగా ఎప్పుడయ్యాడో?గంటలు గంటలు మాట్లాడే చనువెలా వచ్చిందో ?

          పర్సనల్ విషయాలు కూడా పంచుకునేంత ఫ్రెండ్ ఎందుకయ్యాడో ? ఆఫీస్లో అందరూ తమ గురించి ఏవేవో అనుకుంటున్నారని తెలిసినా కాదని ఎందుకు చెప్పలేదో ?

           అదే ఇప్పుడు తన కొంప ముంచింది . అందరికీ తెలిసిపోయింది .

ఇప్పుడందరి ముందు తలెత్తుకోగలదా మళ్ళీ? ప్రేమా దూరమయ్యి . జాబ్ కూడా భారంగా అయి ............
అసలిప్పుడు ఏం చేయాలి?అయినా సడెన్ గా ఆకాష్ ఎందుకిలా చేసాడు ? , మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న .
               
               ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా చెయ్యి ఫోన్ వరకూ వెళుతుంది , కానీ బలవంతంగా వెనక్కి లాగుతుంది .

       అంతా అయి పోయింది ఇప్పుడు అడిగి మాత్రం ఏం లాభం ? శుభలేఖలు వచ్చాక ఇంకేం మిగిలుందని తన జీవితానికి ? నెల రోజుల నుండి తను చెప్తునే ఉన్నాడు ఏదో ఒకటి తేల్చే యమని , అంత తొందరగా నిర్ణయాలు తీసుకోవటమెలా కుదురుతుంది ? అయినా పెళ్ళి కాని అక్క ఇంట్లో ఉండగా తనెలా అడుగుతుంది  డాడీని ? అదే సంగతి చెప్తే కన్వెన్స్ అయ్యాడనుకుంది కానీ ఇలా తన దారి తమ చూసుకుంటాడనుకోలేదు .
             
         నడి సంద్రంలో ఒంటరిగా ఉక్కిరిబిక్కిరవుతున్న భావన . చుట్టూ ఉన్ననిశ్శబ్దం శూన్యం లా అనిపించి వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే నిద్ర జారిపోయింది .
                       
             మెలకువ రాగానే మోహన ఆశ ఒక్కటే రాత్రి జరిగిందంతా కలేమో అని . అవును కలే కావచ్చు , నిజమయ్యే ఛాన్సే లేదు అనుకోగానే చాలా రిలీఫ్గా అనిపించింది .

                     టక్కున ఫోన్ అందుకుంది .

       ఉదయం లేవగానే కనిపించే మొదటి గుడ్ మార్నింగ్ మెసేజ్,రాత్రి పడుకునే ముందు వచ్చే చివరి గుడ్ నైట్ మెసేజ్ ఆకాష్ నుండే . అసలు ఆకాష్ మెసేజ్ చూస్తేనే ఉదయమైనట్టు అనిపించేంతలా అలవాటై పోయింది .

                      ఇట్స్ ఓవర్ , ఫస్ట్ ఫర్ గివ్ మీ ఎండ్ దెన్ ఫర్ గెట్ మి .

           అకస్మాత్ గా కనిపించిన ఆకాష్ మెసేజ్ పిడుగు పాటయింది . అది అబద్దమంటుంది  మనసు , నిజమంటున్నాయి కళ్ళు .

నిజానిజాలు ఆలోచించేంత ధైర్యం లేక ఒకరకమైన అచేత నావస్థలో ఉండిపోయింది .

' మెహా ! రెఢీ అవ్వవా ? ఇంకా అలాగే కూర్చున్నావు ? అక్క పిలిచేసరికి ఉలిక్కి పడి లేచింది .

బ్రష్ చెయ్,కాఫీ పెడతా చెప్పేసి వెళ్ళిపోయింది .                 

                     ' లేచి స్నానం చేసిందా ? ' అది తల్లి గొంతు అక్కని అడుగుతుంది .
               
       లేదమ్మా ! అలానే కూర్చుంది . ఏమైందంటే చెప్పదు .
       
                " ఆఫీస్లో ఎవరితోనైనా  గొడవ పడిందేమో ? రాత్రి తినలేదు కూడా.ఒక్కసారి దాని ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడగకూడదూ' తల్లి సలహా వినిపించగానే టక్కున లేచింది మోహా.
                 
            అమ్మో ! లతనడిగితే ఇంకేమైనా ఉందా ? గోరంతని కొండంతగా చెప్పటంలో దానిది ఫస్ట్ క్లాస్ .
               
               తలకొట్టుకుంటూ ప్రక్క రూంలోకి పరిగెత్తింది . అబ్బా ! కాస్త నీరసంగా ఉందని అలా కూర్చున్నాను . దానికింత చర్చ అవసరమా ? అయినా ప్రతిది భూతద్దంలో పెట్టి చూస్తారెందుకు ? ఇది అతి ప్రేమో తెలియదు , అనుమానమో అర్థం కాదు నవ్వింది బలవంతంగా .
               
         ఏం చేస్తామే?అభిమానం కూడా నీకు అనుమానంలా కనబడుతుంది .
                 
              సరే నేను స్నానానికెళ్తున్నా , కాస్త నా ఫోన్ కి చార్జింగ్ పెట్టేయ్ చెప్పి వాష్ రూంలోనికెళ్ళింది .

                   మెల్లగా తగ్గిన కోపం మళ్ళీ పెరిగిపోతోంది . ఏం జీవితం ? ప్రశాంతంగా ఏడవటానికీ , బాధ పడటానికి కూడా దిక్కు లేదు . ఆకాష్  యూ ఇడియట్, చీటెడ్ మీ....
               
                     వెళ్ళిపో , నువ్వు లేకుండా బ్రతకలేననుకుంటున్నావ్ కదూ ... బ్రతుకుతా, అందరూ వదిలేసినా బ్రతుకుతా ట్యాప్ ఫుల్ స్పీడ్ పెట్టి గట్టిగా ఏడ్చింది దుఃఖం తీరే వరకూ .
             
             ఎందుకంతలా దగ్గరయావ్ ? ప్రతి క్షణం తలుచుకునేలా చేసావ్ కదా ? ఇప్పుడు దూరమై తిట్టుకునేలా చేస్తున్నావ్ . ఏడుపు కొంచెం తగ్గింది . కానీ ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఆఫీస్ కెళ్ళాలి? వాళ్ళందరి ముందు ఎలా తలెత్తుకుని తిరగాలి ?
     
                  ఆ కామెంట్ లు , సెటైర్ల్ , గుసగుసలు , దోషిలా చూసే చూపులు తను  తట్టుకోగలదా ? అనవసరంగా రెండు సంవత్సరాలు బాండ్ కూడా రాసేసింది . హాయిగా చచ్చిపోతే ?మరుక్షణం తనకే నవ్వచ్చిందా ఆలోచనకు . చస్తే మాత్రం తన చావునలా వదిలేస్తారా ? దానికెన్ని కథలు రాసి డిస్ప్లే చేస్తారో ?

                 ఏం సమాజం ? బ్రతకాలన్న భయమే , చావాలన్నా భయమే . ' ఒకవేళ ఆకాష్ కి కూడా ఈ పెళ్ళింటే ఇష్టం లేదేమో ? బలవంతంగా చేస్తున్నారేమో?
             
            ఈ ఆలోచన ఓ క్షణం ఆనందం కల్గించినా , బలవంతం చేసినా తనకు నచ్చని పని చేయని ఆకాష్ మనస్తత్వం గుర్తొచ్చి ఆవిరైపోయింది .మిగిలి ఉన్న ఆశ కూడా .
               

              పెళ్లి సడన్ గా ఆగిపోయినా బాగుండు , కానీ తనకు నచ్చనంత మాత్రాన జరిగేవి ఆగవు కదా ? పోనీ తనెళ్ళి ఆకాష్ తో మాట్లాడితే?
           
               క్రమం లేకుండా పిచ్చిపిచ్చిగా సాగుతున్నాయి ఆలోచనలు .

         ' తల్లి డోర్ కొట్టేసరికి బయటికొచ్చింది ఆలోచనలకు విరామమిచ్చి .
                 
                ఏంటే కళ్లంత ఎర్రగా అయ్యాయి ?

షాపూ కంట్లో పడిందమ్మా ! ఆలోచించకుండానే అబద్దమాడింది . అంత నీరసంగా ఉంటే లీప్ పెట్టొచ్చు కదా ? మెల్లగా అంది ఏదో పోగొట్టుకుంటున్నట్టున్న కూతురి ముఖం చూస్తూ .

తలూపింది మోహన సరే అన్నట్టు .

నిజం చెప్పాలంటే తనకసలు ఆఫీస్ లోకి అడుగు పెట్టాలంటేనే భయంగా , చెప్పలేనంత అసహ్యంగా ఉంది , ఇంకా చెప్పాలంటే అసలు జీవితంలో మా ఆ ఆఫీస్ ని , ఆ మనుషులని చూడాలని కూడా లేదు .
                     
                 రెండు రోజులు గడిచాయి . సిక్ పేరుతో ఆఫీస్ ఎగ్గొట్టేసింది . మూడో రోజు ఇక తప్పక బయల్దేరింది  శిక్ష పడ్డ జీవిత ఖైదులా అయిష్టంగా ..
           
               బస్సు లో ఉన్నంతసేపు కూడా ఏదో భయంకర యుద్దం లోపల . ఎలా వెళ్ళాలి ఆఫీస్ లోకి ? ఏం మాట్లాడాలి వాళ్ళతో . ఇవే ఆలోచనలతో అడుగుపెట్టింది ఆఫీస్ లోనికి అందరూ ఓ లుక్కిచ్చారు అనుకున్నట్టుగానే .        
             కామ్ గా వెళ్ళి కూర్చుంది .
   
          నిశ్శబ్ధంగా , ఇబ్బందిగా ఉందా వాతావరణం . ఇక వాళ్ళ చూపులు తట్టుకునే శక్తి సన్నగిల్లి పోయింది .

ఈ నరకం లో ఉండటం అవసరమా ? రిజైన్ లెటర్ టైప్ చేసింది సిస్టం ఆన్ చేసి.
                     ఇదొక్కటేనా పరిష్కారం?సమస్య నుండి పారిపోవట మేనా ? ఎంత కాలం పరుగెడుతుంది ? ఎంత దూరం పరుగెడుతుంది ? అసలు సమస్యే తనలో ఉంటే .?
                           
                     కోపం తగ్గి వివేకం మేల్కొంది . తొందరపాటు నిర్ణయాలు తగవు . గట్టిగా కళ్ళు మూసింది కాసేపు.
                 
                   ఇటువంటప్పుడే ప్రశాంతంగా ఉండాలి . వెళ్ళిపోతే ముఖం చూపించలేనందుకే వెళ్ళిపోయిందనుకోరూ .
             
                ఇప్పుడు మాత్రం తనేం కోల్పోయింది .
             
                      ప్రేమ ,
   
                 అవును ప్రేమ అదీ ఆకాష్ ప్రేమ మాత్రమే . మరి అమ్మా , డాడీ , అక్క వాళ్ళ ప్రేమ అలాగే ఉందిగా . ఆకాష్ గుర్తొస్తే  గుండెల్ని కత్తులతో చీలుస్తున్న బాధ , ఎన్నటికీ సాధించ లేనిది కోల్పోయినంత బాధ , తనువు చాలించాలన్నంత బాధ .
                           
              కానీ తప్పదు బ్రతకాలి . ఇష్టమైనవి లేకున్నా , కష్టంగా అనిపించినా , నేనున్నానన్న  తోడున్నా , ఎవరూ లేకుండా ఒంటరైనా ఖచ్చితంగా బ్రతికే తీరాలి . ఎందుకంటే ఇది తన జీవితం ,
                   
          వదిలేస్తే మరోసారి దొరకని జీవితం .
                 
            అవును బ్రతుకుతాను , ఏడుస్తూ , జీవచ్ఛవంలా ఓ మూలన కాదు , నవ్వుతూ , ధైర్యంగా వీళ్ళందరి మధ్యనే  బ్రతుకుతా .

       లేచి నిలబడి గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది రిలీఫ్ గా .
                                  
         కమ్ బిందూ , లెట్స్ హేన్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఎప్పటిలానే బిందు చేతిని పట్టుకుని కాంటీన్ వైపు నడిచింది .
                    
                   '  మోహా 'బిందు లో ఆశ్చర్యం .
           
              నేను నేనే పదా అంటూ వెళ్తున్న మోహన వైపు మిగిలిన స్టాఫ్ అలాగే చూసారు , కానీ ఈ సారి వారి చూపులు తనని గుచ్చుకోలేదు . గత కాలపు జ్ఞాపకాలను చెరిపేయటానికి ప్రయత్నిస్తూ నడిచింది భవిష్యత్ వైపు భారమైన , బాధాతప్త హృదయంతో........