You are mine - 3 in Telugu Love Stories by Vijayalaxmi Velamala books and stories PDF | నా నువ్వే - 3

Featured Books
Categories
Share

నా నువ్వే - 3



“ఏంటే! నిజంగా ఆ లెటర్ సార్‌కి ఇస్తావా? నీకు ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చిందే?” అని ప్రియ అడుగుతుంది.

“అది కాదే! ఆ లెటర్ ఆ సైకోకి ఇచ్చేస్తే, ఆ రాక్షసుడే దాని పని చూసుకుంటాడు. అప్పుడు కానీ ఆ భవ్య తిక్క కుదరదు!” అని కీర్తి అంటుంది.

కీర్తి, ప్రియ కలిసి విరాట్‌కి ఆ లెటర్ ఎలా ఇవ్వాలా అని రకరకాల ప్లాన్స్ వేస్తారు.

“ప్రియా! నాకు ఒక ఐడియా వచ్చిందే!” అని కీర్తి చెప్పడంతో,

“ఏంటే అది?” అని ప్రియ అడుగుతుంది.

“విరాట్ సార్ క్యాబిన్ ఉంది కదా! మనం సార్ క్యాబిన్ దగ్గరికి వెళ్దాం. సార్ కరెక్ట్‌గా లోపలి నుంచి బయటికి వచ్చే టైమ్‌కి ఆ లెటర్ డోర్ దగ్గర పెట్టేసి మనం వెళ్లిపోదాం. ఎలాగో ఈ లెటర్ పెద్దగానే ఉంది కాబట్టి సార్‌కి కచ్చితంగా కనిపిస్తుంది.

ఈ లెటర్ పైన భవ్య పేరు ఉంది కాబట్టి, ఈ లెటర్ భవ్య ఇచ్చిందని సార్‌కి అర్థమైపోతుంది. ఆ భవ్య తిక్క కుదురుతుంది!” అని కీర్తి చెప్పడంతో,

“వావ్ డార్లింగ్! నీ బ్రెయిన్ ఏంటే? ఇంత బాగా పనిచేస్తుంది! ప్లాన్ సూపర్!” అని ప్రియ అంటుంది.

“ఏమనుకున్నావ్ ఈ కీర్తి గురించి? నేను జీనియస్‌ని!” అని చెప్పుకుంటూ మురిసిపోతుంది కీర్తి.

“సరే, పద! సార్ రూమ్ దగ్గరికి వెళ్దాం!” అని కీర్తి, ప్రియ ఇద్దరూ విరాట్ రూమ్ దగ్గరికి వెళ్తారు.

@@@@

విరాట్ రూమ్ దగ్గరికి వెళ్లిన కీర్తి, ప్రియలకు విరాట్ రూమ్‌లోనే ఉన్నాడని తెలుస్తుంది.

“హమ్మయ్య! సార్ రూమ్‌లోనే ఉన్నారు. పని త్వరగా అయిపోతుంది!” అని ప్రియ అంటుంది.

వాళ్లిద్దరూ వచ్చి చాలా సేపు అవ్వడంతో కీర్తికి సహనం నశించిపోతుంది.

“ఏంటే ఈ రాక్షసుడు ఇంకా రావడం లేదు? లోపల ఏం చేస్తున్నాడు?” అని ప్రియను అడుగుతుంది కీర్తి.

“వస్తారులేవే!” అని రూమ్ లోపలికి చూస్తూ అంటుంది ప్రియ.

విరాట్ కుర్చీలో నుంచి పైకి లేవడం చూసిన ప్రియ,

“సార్ వస్తున్నారు! డోర్ దగ్గర ఆ లెటర్ పెట్టు!” అని కీర్తికి చెప్తుంది.

కీర్తి డోర్ దగ్గర లెటర్ పెట్టడానికి వెళ్తుంది.

ఒక్కసారిగా గాలి గట్టిగా వీస్తుంది. లోపలి నుంచి డోర్‌కి లాక్ పెట్టి లేకపోవడంతో గాలికి డోర్ తెరుచుకుంటుంది.

డోర్ తెరుచుకోవడంతో కీర్తి లెటర్ పెట్టబోతుండగా విరాట్ ఆమెను చూస్తాడు.

“ఏంటది? ఇక్కడ ఏం చేస్తున్నావ్?” అని విరాట్ గొంతు వినిపించగానే కీర్తి ఒక్కసారిగా పైకి చూస్తుంది.

అయ్యో సార్! నా పని అయిపోయింది దేవుడా! ప్లీజ్, నువ్వే నన్ను కాపాడాలి! అని మనసులోనే దేవుడిని వేడుకుంటుంది కీర్తి.

“లోపలికి రా!” అని విరాట్ చెప్పడంతో భయంగా లోపలికి వెళ్తుంది కీర్తి.

విరాట్, కీర్తికి ఎదురుగా కూర్చుంటాడు.

“ఇక్కడేం చేస్తున్నావ్? చేతిలో ఏంటి అది?” అని విరాట్ అడగగానే,

“ల... ల... లవ్ లెటర్!” అని కీర్తి చెప్తుంది.

విరాట్ కోపంగా కీర్తి వైపు చూస్తాడు.

“అయ్యో సార్! ఈ లెటర్ నాది కాదు. మా క్లాస్ భవ్యది. మీకు ఇవ్వమని నా చేత పంపించింది!” అని కీర్తి చెప్పగానే,

“తను లెటర్ ఇవ్వమని చెప్పగానే నువ్వు తెచ్చి ఇస్తున్నావా?” అని విరాట్ అడుగుతాడు.

“హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసింది. అందుకే తెచ్చాను!” అని భయంతో అంటుంది కీర్తి.

“సరే, ఆ లెటర్ ఓపెన్ చేసి చదువు. దాంట్లో ఏముందో!” అని విరాట్ అనగానే కీర్తి గుండెల్లో రాయి పడినట్టవుతుంది.

“సార్... నేను చదవాలా? అది మీకు వచ్చిన లెటర్. నేను ఎలా చదువుతాను?” అని అమాయకంగా అడుగుతుంది కీర్తి.

“నేనే చెప్తున్నాను కదా! చదువు!” అని విరాట్ అనడంతో చేసేదేం లేక ఆ లెటర్ చదవడానికి సిద్ధపడుతుంది కీర్తి.

ఈ రాక్షసుడేమో ఈ లెటర్ నన్ను చదవమంటున్నాడు. ఆ భవ్య ఈ లెటర్‌లో ఏం రాసి చచ్చిందో ఏంటో!

ఛా... అనవసరంగా సెకండ్ సెమిస్టర్‌లో దాని పేపర్ చూసి రాశాను. ఆ రోజు ఫెయిల్ అయిపోయినా బాగుండేది. ఈరోజు ఈ బాధ తప్పేది నాకు! అని మనసులో భవ్యను తిట్టుకుంటూ లెటర్ ఓపెన్ చేస్తుంది కీర్తి.

“ఓపెన్ చేశా సార్!” అని కీర్తి చెప్పడంతో,

“అయితే చదవడం మొదలుపెట్టు!” అని విరాట్ అంటాడు.

“ఓకే సార్!” అని లెటర్ వైపు చూస్తుంది కీర్తి.

ఆ లెటర్‌లో ‘విరాట్ సార్, I love you’ అని ఉంటుంది.

అది చూసి కీర్తి కళ్లు పెద్దవి చేసి భయంతో విరాట్ వైపు చూస్తుంది.

“చదువు!” అని విరాట్ అనడంతో,

“నెమ్మదిగా విరాట్ సార్... I love you...” అని అంటుంది.

“గట్టిగా చదువు!” అని విరాట్ అరవడంతో,

“విరాట్ సార్, I love you!” అని కళ్లు మూసుకుని చెప్తుంది కీర్తి.

విరాట్ కోపంగా కీర్తి వైపు చూడడంతో,

“సార్... ఈ... ఈ లెటర్‌లో అలానే ఉంది. నేనేం చెయ్యను?” అని భయపడుతూ అంటుంది కీర్తి.

“సరే, చదవడం కంటిన్యూ చెయ్యి!” అని విరాట్ అంటాడు.

ఇది స్టార్టింగ్‌లోనే బాంబ్ పేల్చింది. ఇంకా లెటర్‌లో ఎన్ని దారుణాలు ఉన్నాయో ఏంటో! అని మనసులో అనుకుంటూ చదవడం మొదలుపెడుతుంది కీర్తి.

“విరాట్ సార్! మీరు అంటే నాకు చాలా ఇష్టం. సిక్స్ మంత్స్ నుంచి నా మనసులో మీరు ఉన్నారు. నా లవ్‌ని యాక్సెప్ట్ చెయ్యండి సార్!”

అని కీర్తి చదువుతుంటే విరాట్ ఆమె వైపు చూస్తాడు.

వణుకుతున్న కీర్తి పెదాలను చూసి, ఆమె భయపడుతోందని విరాట్‌కి అర్థమవుతుంది.

“సార్! మీ మీద ఉన్న ప్రేమను నేను కవిత రూపంలో రాశాను. ఈ కవిత మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను!” అని చదువుతున్న కీర్తి మనసులో,

కవిత నా? దీనిలో ఈ కల కూడా ఉందా? సర్లే, నాకెందుకు! ఏవో నాలుగు కవితలు రాసి ఉంటుంది. అవి చదివేస్తే నేను ఈ రాక్షసుడి నుంచి బయటపడొచ్చు! అని అనుకుంటుంది.

“నా మనసు అనే పెన్‌తో, నా ప్రేమ అనే ఈ పేపర్ పైన మీ కోసం ఈ ప్రేమలేఖ రాస్తున్నా...”

ఏంటి? మనసు అనే పెన్, ప్రేమ అనే పేపరా? ఛీ! దరిద్రంగా ఉంది! అని అనుకుంటుంది కీర్తి.

“దొండకాయ బెండకాయ...” అని చదువుతూ మధ్యలోనే ఆపేస్తుంది.

దొండకాయ్ బెండకాయ్ విరాట్ సార్ నా గుండెకాయ్! అని కళ్లతో చదివి,

ఛీ! ఏంటే ఇది? దీని కవిత అన్నావ్! నిన్న గుడి దేవుడు అని ఏదో అన్నావ్ కదా! అదే బాగుంది కాదే తింగరిదానా! అని భవ్యను తిట్టుకుంటుంది కీర్తి.

“ఏంటి ఆపేశావ్? చదువు!” అని విరాట్ అంటాడు.

“ఓకే సార్!” అని కీర్తి మళ్లీ చదవడం మొదలుపెడుతుంది.

“దొండకాయ్ బెండకాయ్ విరాట్ సార్ నా గుండెకాయ్!”

అని బయటికి చదివి విరాట్ వైపు చూస్తుంది కీర్తి.

విరాట్ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ కీర్తికి అర్థం కాకపోవడంతో,

ఈ రాక్షసుడి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ అర్థం కావట్లేదు! అని అనుకుని ఇంకో కవిత చదవడం మొదలుపెడుతుంది.

“పువ్వు లాంటి నా మనసులో తేనె లాంటి ప్రేమను దాచి ఉంచాను. తుమ్మెదలా మీ రాకకు ఎదురుచూస్తున్నాను...”

పువ్వులు, ఆకులు ఏంటే? అసలు ఈ లెటర్ నువ్వు ఈ విరాట్ సార్‌కే రాశావా? ఆ సార్ గురించి తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా రాశావే? అని మనసులో అనుకుంటుంది కీర్తి.

ఇంతలో విరాట్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి అటూ ఇటూ తిరుగుతాడు.

“చదువు!” అని అంటాడు.

“సార్! నా గుండె గుడిలో ఉన్న దేవుడు మీరు. నా ప్రేమను అంగీకరించి మీ ప్రేమను నాకు ఇస్తారని ఎదురుచూస్తున్నాను.

ఇట్లు, మీ ప్రేమకై ఎదురుచూస్తున్న మీ భవ్య!”

అని కీర్తి చదవడం పూర్తి చేస్తుంది.

*నీ ప్రేమ తగలెయ్య! ఇప్పుడు ఈ రాక్షసుడు ఏం అంటాడో ఏంటో! పాపం భవ్య, తన గొయ్యి తనే తవ్వుకుంది. తప్పులేదు లే! కాకపోతే ప్రేమించక ప్రేమించక ఈ సైకోని లవ్ చేస్తుందా?

అమ్మా, బంగారు తల్లి భవ్య! ఈ రాక్షసుడి చేతిలో బలి అవ్వడానికి రెడీగా ఉండు!* అని మనసులో అనుకుంటుంది కీర్తి.

“చదవడం అయిపోయిందా?” అని విరాట్ అడుగుతాడు.

“అయిపోయింది సార్!” అని కీర్తి చెప్తుంది.

“అయితే ఆ లెటర్‌ని ముక్కలు చేసి డస్ట్‌బిన్‌లో పడేయ్!” అని విరాట్ చెప్తాడు.

“సార్...” అని కీర్తి అనబోతుండగా,

“చెప్పింది చెయ్యి!” అని విరాట్ అరిచేసరికి కీర్తి ఆ లెటర్‌ను ముక్కలు ముక్కలుగా చేసి డస్ట్‌బిన్‌లో వేసేస్తుంది.

దొరికిందే ఛాన్స్ అనుకుని బయటికి వెళ్లిపోబోతుంటే,

“ఓయ్! ఆగు! ఎక్కడికి వెళ్తున్నావ్?” అని విరాట్ మాటలు వినిపించేసరికి ఆగిపోతుంది కీర్తి.

చూసేశాడా?

“అంటే సార్... లెటర్ చదవడం అయిపోయింది కదా! అందుకే వెళ్తున్నాను!” అని అంటుంది కీర్తి.

“నేను వెళ్ళమని చెప్పానా?” అని విరాట్ అడుగుతాడు.

కీర్తి లేదన్నట్టుగా తల ఊపుతుంది.

“మరి?”

లెటర్ తెచ్చినందుకు విరాట్ కీర్తిని తిడతాడా? ❤️




To be continued ❤️