Aprasyulu - 13 books and stories free download online pdf in Telugu

అప్రాశ్యులు - 13

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

13

విశాల వెళ్ళిన తర్వాత మూడు వారాలు గడచిపోయాయి. ప్రసాద్ కీ ఈలోపు కమల కమలాకరం నాలుగైదు సార్లు తటస్థపడ్డారు. కాని కమలతో వంటరిగా మాట్లాడడానికి అవకాశం చిక్కలేదు. కాని అతని క్రోధాన్ని ప్రేరేపించిన దేమిటంటే కమల ప్రవర్తనలో ఒక విధమైన మార్పును గుర్తించాడు. అట్లాంటి పరిస్థితులలో అంతకు ముందొక విధమైన వుదాసీనత్వం ప్రదర్శిస్తూ వుండేది. దానిని అతను ఎంతో కష్టం మీద భరిస్తూ వచ్చాడు. కాని కొద్దికాలంనుంచి నిర్లక్ష్యంతో పాటు పరిహారం కూడా ప్రదర్శిస్తూ వచ్చింది. యుద్ధరంగంలో ప్రగల్భాలు పలికి పిరికి పందలై పారిపోయిన వారి యెడల ప్రతి పక్షం ప్రదర్శించే ప్రవర్తనలా వుండేది. పూర్వం ప్రసాద్ కళ్ళలోకి తిన్నగా చూడటానికి ఆమె జంకుతూ వుండేది. ఆతీక్షణతకు తట్టుకోలేక ఆప్పుడప్పుడు ప్రసాద్ దృష్టి మరలించుకోవలసి వచ్చేది. లోలోన ఒక విధమైన భయం కూడా ఏర్పడింది. దానితో పాటు కమల యెడ మమకారం, మమత రాను రాను భరించలేనంత అభివృద్ధి చెందింది. రాత్రింబవళ్లు ఆ రూపమే అతనికళ్ళకుకట్టినట్లు కనబడుతు వుండేది. కమల కంఠస్వరం వినాలనే కాంక్ష హద్దుమీరి ప్రవర్తించేది. భరించలేని యీ బడబాగ్ని దహించి వేసే ద్రావణంలాప్రసాద్ ని ప్రచండునుగా చేసి వేసేంది. శరీరంలోని అణువు అణువు కమల నామాన్నే వుచ్చరించేది. అర్థరాత్రి హఠాత్తుగా లేచి కారు తీసుకుని బయలు దేరేవాడు. ఆ తరువాత నాలుగు ఐదురోజులుదాక కనబడే వాడు కాదు. యిలాంటి ప్రవర్తనకు చంద్రిక అలవాటుపడినా ప్రసాద్ లోని కర్కశత్వమే ఆమెను బాధ పెట్టేది.

చంద్రిక ఒకనాడు కమలతో సంగతాంతా చెప్పింది. కమల విని చాలా బాధపడింది. కారణం కొంతవరకు మాత్రమే గ్రహించగలిగింది. రెండు మూడు నిముషాలు వేదనాపూరిత వదనంతో ఆలోచిస్తూ కూర్చుంది.

“ఇంతలో ఆశ్చర్యపడ వలసినది ఏమి లేకపోయినా విచారించవలసినది చాలావుంది చంద్రికా? ఇదేమి ఈనాటి సమస్య కాదు” అంది.

చంద్రికకు కాస్త కోపం వచ్చింది. “చంద్రిక అనే వ్యక్తి నువ్వు నీయెదుట చూస్తు ఏవగింపుతో ముఖం ప్రక్కకు తిప్పుకోకుండా మాట్లాడుతున్నారంటే అదంతా మామయ్య ప్రతిభే. చంద్రికకు వేరే వ్యక్తిత్వం లేనే లేదు. కమలా ఈ విషయం నువ్వు పూర్తిగా గ్రహించినట్లయితే ఇంత చులకనగా మాట్లాడవు” అంది.

చంద్రిక కంఠ స్వరం కమలను చకితను చేసింది. ప్రసాద్ ఎడ చంద్రికకు వున్న నిశ్చలమైన కృతజ్ఞత , గుడ్డి నమ్మకం, ఆమెకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే వుంటుంది. కాని ఆమెని అప్పుడప్పుడు భయపెట్టే దేమిటంటే ఈ సంపూర్ణ సమర్థన చివరకు ఏరూపంలో పరిణమిస్తుంది? ప్రసాద్ ఆలోచనలు చంద్రికకు తెలిస్తే ఆమె కమలయెడ ఏవిధంగా ప్రవర్తిస్తుంది? కమలవద్ద నుంచి కూడ సమర్పణ ఆశిస్తుందా!

“చులకన చేయడము లేదు చంద్రిక చేసేదేమి కనబడటం లేదంటున్నాను” అంది.

“ఎందుకు లేదు కమల నువ్వంటే మామయ్యకు ఎంత అభిమానమో ఎంత గౌరవమో నాకు తెలుసు నీమాట కాదనడు” అంది.

కమల హృదయం బరువెక్కింది. క్షణకాలం మౌనం వహించి మనస్సు కుదుట పరచుకుని “లేదు చంద్రిక అధికారం నీకు రజనికి మాత్రమే వుంది. అది సంపాదించాలనే ఆశ కూడా నాకు సుతరామూ లేదు. ఇతరులు నాకు వుందని భ్రాంతి పడితే నేను సహించలేను” అంది.

రజని జ్ఞప్తికివచ్చి చంద్రిక ఆమె వద్దకు వెళ్ళింది

“అంత చెప్పి రజనీ ప్రపంచకంలో ఎవరైనా నీ తరువాతనే అని మామయ్య ఒకసారి అన్నాడు. అధికారం బాధ్యత నీ మీద వున్నది రజనీ”

“ఇతరులకి కర్తవ్య బోధన చెయ్యటం నాకు అలవాటు లేదని నీకు తెలుసు చంద్రిక. ప్రసాద్ కు కూడా అది రుచించదు. అయినా ఇది కేవలం ప్రసాద్ కు సంబంధించిన విషయంకాదని నాకనిపిస్తూంది.” అని వెంటనే మాటలు మార్చి“కర్తవ్యం అనే నెపంతో ప్రసాద్ స్వాతంత్రాన్ని అరికట్ట ప్రయత్నించడం అవివేకంకూడాను” అంది.

చంద్రికకు కోపంవచ్చి “కృతజ్ఞతను గుర్తించననే నెపంతో కర్తవ్యాన్ని త్రోసిపుచ్చుతున్నావు రజనీ. కాని చంద్రిక అలాంటిది కాదు” అని బయటకు వెళ్ళిపోయింది.

ఇంటికి తిరిగివచ్చి చంద్రిక పరిపరివిధాల ఆలోచించసాగింది. ప్రసాద్ ను బాధించే కారణం ఆమెకి యెంత వెతికినా ఆమెకి చిక్కలేదు. రజని అన్న ఒక్కమాట ఆమె హృదయంలో పలుమారులు మారుమ్రోగింది.

ఇది కేవలం ప్రసాద్ కి సంబంధించిన విషయం కాదని, నాకు కనిపిస్తూంది. అయితే ఆరెండో వ్యక్తి ఎవరూ? ఎంత ఆలోచించినా ఆమెకు అర్ధం కాలేదు. ప్రసాద్ కి అనేకమంది స్నేహితులున్నారు. అనేక ప్రదేశాలకు వెళుతూ వుంటాడు. అది ఆమెకు ఎప్పుడూ చెప్పడు. అతని జీవితంలో తనస్థానం తగు స్వల్పమైనది. కాని ఆమెకు అతనిని మించిన ఆప్తులు లేరు. ఇక వేరే వ్వకిత్వమే లేదు. ప్రసాద్ ని అడిగి తెలుసుకుంటే తప్పేముంది. అవకాశం మూడు రోజుల తరువాత మాత్రమే ఆమెకు లభించింది. ప్రసాద్ ఆ రాత్రి కాస్త శాంతంగా వున్నాడని ఆమె అనుకుంది, దగ్గరకు వెళ్ళి సూటిగా “మామయ్య మీరు కొంత కాలం నుంచి ఏదో బాధ పడుతున్నట్లున్నారు కారణం నాతో చెప్పరా?” అంది.

“ప్రత్యేకమయిన కారణం ఏమి లేదు. చంద్రికా ఇదేమి కొత్త కాదు” అన్నాడు మృదువుగా

చంద్రిక తల అడ్డం తిప్పుతూ “కాదు ఏదో వుంది నాతో చెప్పక పోతే నామీద ఒట్టే” అంది.

ప్రసాద్ కు నవ్వు వచ్చింది. కాస్త బాధకూడా కలీగింది. “జీవితంలో ఎవరి యుద్ధాన్ని వారే నడుపుకోవాలనే సూత్రం అప్పుడే మరచిపోయావా చంద్రికా?” అన్నాడు.

“మరచిపోలేదు మామయ్య కాని నాకు మీ చ్ఛాయలో తప్ప వేరే వ్యక్తిత్వం లేదు. స్థానం లేదు. అలాంటిటప్పుడు నాకు చెప్పగుండా వుండటం మీలోని ఒక భాగాన్ని అంధకారంలో వుంచడం సమం అవుతుంది” అంది.

ప్రసాద్ “అవి వివేకవంతమయిన మాటలు కావు, చంద్రిక” అని ఏదో అనబోతుంటే చంద్రిక అడ్డము వచ్చింది.

“ఉద్రేకంతో, వివేకం నాకు పని లేదు, వివేకవంతమైన నేనెందుకుచెయ్యాలి? కృతజ్ఞతతో మీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకముంది. మీకు లేనంత మాత్రాన నాకు వుండకూడదనే అధికారం మీకు లేదు. నాజీవితంలో మీకు తప్ప ఇంకెవరికీ స్థానం లేదు. నాసర్వస్వము మీదే. దీనికి మా యిష్టాయిష్టాలతో నిమిత్తం లేదు” అంది .

చంద్రిక వుద్రేకవంతమైన మాటలు ప్రసాద్ ని ఎంతో ఆశ్చర్యపరచేయి. ఆమె మాటలు పూర్తి అర్ధం ఆమె గ్రహించిందా అనే అనుమానం కలిగింది. చంద్రికను మొదటిసారి చూచినప్పుడు కమలన్న మాటలు జ్ఞాపకమచ్చేయి. “కృతజ్ఞత అనే మైకంలో పడి నీయెడ నీకున్న కర్తవ్యాన్ని మరచిపోతావనే నాకు భయంగా వుంది చంద్రిక. అది యెన్నడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కప్పి బుచ్చకూడదు. యీప్రమాదం నుంచే నిన్ను నువ్వే కాపాడుకోవాలని నాకనిపిస్తోంది” అని ప్రసాద్ ని అనుమానించి అన్న మాటలు, చంద్రిక మాటలు వాటి సత్యాన్ని నిరూపించాయి. ఆనాడు ఆ మాటలు విన్నప్పుడు తాను చంద్రికకు ద్రోహం చేస్తాననే అనుమానం కమలకి కలిగినందుకు బాధపడ్డాడు. ఈనాడు చంద్రిక సంపూర్ణ సమర్పణ హృదయంలో ములుకుల్లా గుచ్చుకుంది.

చంద్రిక “జీవితంలో స్పర్శజ్ఞానాలకీ , తర్కశాస్త్రానికి మించిన విలువలు కొన్ని ఉంటాయని కమల అంటుంది. వాటిలో నాకు ఆట్టే నమ్మకం లేకపోయినా ఈనాడు నాకెందుకో నాముఖందాచుకోవాలనిపిస్తోంది” అన్నాడు.

చంద్రిక ఇంకా ఆ వుద్రేకంతోనే వుంది. “మాటలు తప్పించకండి మామయ్య. మిమ్మల్ని బాధపెట్టే విషయ మేమిటో మీరు చెప్పాలి” అంది .

ప్రసాద్ దీర్ఘంగా నిట్టూర్పు విడచి “ఒక స్త్రీని ప్రేమించాను చంద్రికా. అహర్నిశలు ఆమె రూపమే నా నేత్రాల ముందు మెదుల్తూంది కాని ఆమె నన్ను అసహ్యించుకుంటుంది. చీడపురుగులా ఏవగించుకుంటుంది. ఇది నేనెలా సహించగలను?” అన్నాడు.

ప్రసాద్ మాటలు చంద్రికను దిగ్భ్రాంతురాలిని చేశాయి. రజని మాటలలోని సత్వం ఆమెకు తెలిసివచ్చింది.

“ఆమెఎవరో చెప్పండి! నేను వెళ్ళి బతిమిలాడుతాను. ఆమె మనస్సు మారుస్తాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయివుంటుంది. నాకు చెప్పండి” అంది.

“లేదు చంద్రికా అది నీ సాధ్యం కాదు. పేరు తెలిసి నువ్వు ఆవిధంగా ప్రయత్నించేవంటే పరిస్థితి ఇంకా విషమిస్తుంది” అన్నాడు.

చంద్రిక దానికి సమాధానం చెప్పలేదు. తల పూర్తిగా క్రిందకు దించి వేసుకుని “ఆమెతప్ప యింకెవరూ మీకు సరిపడదా?ప్రేమించలేరా ? అంది నెమ్మదిగా.

చంద్రిక మాటలమధ్య వున్ననిగూడార్ధాన్ని ప్రసాద్ గ్రహించాడు. సిగ్గుతో తలంచుకొనివున్న ఆమె కేసి తేరిపార చూచాడు.

“యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నావు చంద్రిక. ఇది నా కెంతో విచారాన్ని కలిగిస్తోంది కమల హెచ్చరికని నిరూపించకు” అన్నాడు.

“సహజమైన వుద్రేకాన్ని, అసభ్యత అనే పదానికి భయపడి అణచకోవడం ఆత్మవంచనయని మీరేకదా చెప్పేవారు, స్వవిషయం వచ్చేసరికి మీరు కూడా అందరిలాగే సంఘానికి భయపడి తిరస్కరిస్తారా? మీరుకూడా ఇంతేనా? అంది.

చంద్రిక మాటల రూపు ప్రసాద్ ని లోలోన కొంచెం భయం పుట్టించాయి. తన ప్రబోథం తిరిగి తనకే వప్పగిస్తోంది. చంద్రిక ఆనాడు రజనీకి ప్రతిబింబంలా అతని కంటికి కనబడింది. ఆ యువతి భవిష్యత్తు అతనికే భయం కలిగించింది. రజనీవంటి సౌందర్యవతి కాదు. ఆగ్నిలాంటి ఆత్మవిశ్వాసం కూడా లేదు. అయినా భయంకరమైన నిర్భయత్వం, నివురు గప్పిననిర్లక్ష్యం ఈమెలోకూడ మూర్తీభవించి వున్నాయి. ప్రచండ మయిన స్త్రీ సాహస శక్తి ముందు ఎంతటి పురుషుడైనామోకరిల్లవలసిందే,

“సంఘానికి భయపడటం లేదు. చంద్రిక ఒకరికి సహజమయినది ఇంకొకరికి అసహజంగా కనబడటం కూడా సహజమే, ఇంకొక విషయం కూడా నేను ఇప్పుడిప్పుడు తెలుసుకున్నాను. ఒక వ్యక్తి ఇంకొకరిని నిజంగా ప్రేమిస్తే తప్పనిసరిగా వారంటే కొంచెం ఆ వ్యక్తికి భయం కూడా వుంటుంది. ఇది అసందర్భముయినా ఎందుకో చెప్పాలనిపించింది ఆన్నాడు ప్రసాద్

“ఇదే విషయం రజని వొకసారి చెప్పింది. అందుకు కారణమేమంటే రెండవవ్యక్తి ప్రేమించబడుతున్నాడు. నిజంగాప్రేమించడం లేదు” అంది చంద్రిక.

రజని అన్న మాటల సత్యం తనలో తానే అతను గ్రహించగలిగాడు.ఆమె బుద్దితీక్షణతకు అతని హృదయమంతా గౌరవంతో నిండిపోయింది. రజని తనని విడచిననాడే అతని జీవితం చుక్కాని లేని నావ అయిపోయింది. ఇక మిగిలింది ఒకే ఒక ప్రశ్న, జలగర్భంలో పాషాణాన్ని నావ ఎప్పుడు వెళ్ళి కలుసుకుంటుందా?ప్రసాద్ మౌనం చంద్రికను మళ్ళీ కొంచెం వుద్రిక్తనుచేసింది.

“నా ప్రశ్నకు సమాధానం యింకా చెప్పలేదు మామయ్య.మీరు కాంక్షించే ఈ స్త్రీ స్థానాన్ని ఇంకెవరు ఆక్రమించలేరా?”అంది.

ప్రసాద్ హఠాత్తుగా లేచి వుద్రిక్తమెన కర్కశ స్వరంతో “లేదు చంద్రికా, యింకెవరు ఆక్రమించుకోలేరు” అని బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాలలోనే కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. చంద్రికకు దుఃఖం ముంచుకొచ్చింది. తన ప్రయత్నమంతా విఫలమయిపోయింది. ప్రసాద్ ని ఆ అజ్ఞాన స్త్రీ నుండి రక్షించుకోలేకపోయింది.

********

విశాల వెళ్ళిపోయిన తరువాత రజనికి కాస్త విశ్రాంతి తీరిక చిక్కాయి. కాని మనస్సులో అశాంతి కూడా చెల రేగింది. ప్రపంచంలో అందరు ఆమె ఆస్కారం అర్ధించేవారేకానిచేయూతనిచ్చే వారు లేరు. రజని ఒక ద్వీపం లాంటిది. ద్వీపం నలుప్రక్కలా కనబడే సముద్రాన్ని చూచి మనమంతా మోసపోతాము. అది ఇతర భూభాగంతో సంబంధం లేని ప్రత్యేకమయిన పూర్తి స్వాతంత్యంగల ప్రదేశమని మనమంతా భ్రమపడతాము. కాని నిజానికి అది సత్యం కాదు. సముద్రపు అట్టడుక్కి వెళ్ళి పరిక్షించి చూస్తే మనకు కనబడేది కూడా భూమే. అదే ద్వీపానికి వున్నలంకె బ్రహ్మాండమైన సముద్రం దానిని పూర్తిగా నలువైపులా కప్పి వేసి భ్రాంతిని కలిగిస్తూంది? రజనీ కూడా అలాంటిదే. అందరు అమెను చూచి అపోహడతారు. తోటి మానవుల అవసరం లేని సంపూర్ణ వ్యక్తి అని అనుకుంటారు. ఈమె నిర్భయత్వం, స్వాతంత్రత, సముద్ర తరంగాలలాగే అందరిని మోసపుస్తాయి. బాల్యం నుంచీ విశాల, రజని కలసి మెలసి పెరిగి పెద్దవారయ్యారు. విశాల విలువ ఆమెకి ఆనాడు అర్థమయింది. మొదటిసారిగా రజనికి తాను ప్రపంచకంలో ఏకాకి అనే సంగతి ఏర్పడింది. కాని ఆలోచన క్షణికంమాత్రమే మెదిలింది. మరుక్షణంలో రజని మారుప్రశ్న వేసింది. అయితే ఏకాకి కానివారెవరు? రక్త సంబంధం, స్నేహలత,ప్రేమబంధం. ఇవన్నీ తాత్కాలికమయినవే కదా? జన్మించినప్పుడు ప్రతి వ్యక్తి ఏకాకే.మరణించినప్పుడు ప్రతి వ్యక్తి ఏకాకే, యీ మధ్యలో మనల్ని పట్టుకొని పీడించేవే యీ భ్రాంతి.

రజని రామాన్ని చూచి చాలా కాలమయింది. అతను కూడా ఆమెవద్దకు రాలేదు. దాని అర్ధం ఆమె గ్రహించక పోలేదు ఏదో విషయంలో కోపగించుకుని వుంటాడు, మనస్సులో దాచుకుని బాధపడుతూ వుంటాడు. కొంత కాలంనుంచి ఆమె అతని గురించి ఆలోచిస్తుంది. అతనిని ఆమె పూర్తిగా అర్థం చేసుకుంది. జాలి, దయ, ఆదరం, అనురాగం అన్నీ కలసి ఆమె హృదయంలో మెదుల్తూ వుంటాయి. అతని హృదయంలోని అమితమయిన ప్రేమ ఆమె గ్రహించింది. అది అపరిచితమైనదని, తిరస్కారం సహించలేదని, ఆమెకు తెలుసు. దాని పర్యవసానమేమిటా అని ఆమెకు అప్పుడప్పుడుభయంకూడా వేసేది. దానికి కొంత వరకు ఆమె భాద్యురాలు. మొదట అతనిని ప్రేమించి, పీడించి అనురాగపు బీజాలను అతని హృదయంలో నాటిన వ్యక్తి ఆమెయే అతనిలో మొదట అగుపించిన ఏవగింపుని, ఆమె సవాలుగా స్వీకరించాలని పాదాక్రాంతుని చేసుకోవాలని ప్రతిష్టపెట్టింది. నిజానికి ఆ ప్రయాస అనవసరమని ఆమె గ్రహించలేక పోయింది. క్షణకాలంలోనే అతని హృదయాన్ని వశపరచుకుంది. అపురూపమైన సౌందర్యం విచిత్రమైన ఆమె ఆశయాలు అగ్నిలాంటి ఆత్మవిశ్వాసం, అతనిని పూర్తిగా తన్మయుని చేశాయి. అతనిలో లోపించిన గుణాలన్నీఅతనికి ఆమెలో దృగ్గోచరమయ్యాయి. ఆమె మీద ఒక విధమైన గుడ్డి నమ్మకంగా ఏర్పడింది. ఆమె ప్రదర్శించే ఆ చనువు, విశ్వాసము రామం అనురాగపు చిహ్నాలుగా అర్ధం చేసుకున్నాడు. తన సర్వస్వాన్ని సమర్పించి ఆమె నీడలో నిశ్చింతగా జీవితం గడపాలనే వాంఛని రామం జయించలేకపోయాడు. ఇదంతా రజని గ్రహించకపోలేదు కానీ ఆమె వారిరువురి స్వభావాలకి మధ్యనున్న అగాధాన్ని కూడా గుర్తించింది. ఆమె నుంచి అతనికి కావలసింది ఎన్నడు లభించలేదు. ఆమెకి కూడా అతని నుంచి ఆమె వాంఛించేది లభించలేదు. రజని ఎంత స్వతంత్ర మనస్తత్వం కలదైనా ఆమె ఇతరుల రక్షణ క్షణికంగా వాంచిస్తుంది. బలమైన బాహువులతో చేరదీసి అభయ హస్తం యిచ్చే వ్యక్తి అవసరం రావచ్చు. ఎంతైనా ఆమె స్త్రీ, రామం ఆపాత్ర ఎన్నడు నిర్వర్తించలేడని ఆమెకు తెలుసు. ఎంతసేపూ అతను ఆమె మీద ఆధారపడివుంటాడు. తన భారమంతా ఆమె భుజస్కంధాల మీద వేస్తాడు కాని ఆమె భారాన్ని ఏమాత్రమూమోయలేడు. అని బుద్ధికుశలతలో విశ్వాసం వుంచే సాహసం ఆమె చేయలేదు. అయితే అ యెడ ఆమె కర్తవ్యం ఏమిటి? వారం రోజులు గడచిపోయాయి. ఈనాటి సాయంకాలం రజని రామం ఇంటికి వచ్చి తలుపు తట్టింది. రెండుమూడు నిముషాలవరకు తలుపు తెరవబడలేదు. రజని మళ్ళీ తలుపు తట్టుతూ “నిద్రపోతున్నారా ? రామంబాబూ ! మేలుకొలుపు పాడమంటారా?” అంది.

వెంటనే తలుపు తెరచుకొని ఒక యిరవయి సంవత్సారాల యువతి వచ్చి కొంచెం కోపంతో “ఎవరు మీరు? ఎవరు కావాలి?”అంది. రజని క్షణకాలం నిర్ఘాంతపోయింది. కొద్ది క్షణాలవరకు ఆమెకు చేదోడువాదోడుగా వుండే సమయస్ఫూర్తిని కోల్పోయింది

సమాథానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేసింది “ఎవరు మీరు? రామం బాబుకు ఏమవుతారు?”అంది. యువతి “అవ్వవలసినవాళ్ళమే అవుతాము కాని ముందర మీరెవరో చెప్పారు కాదు” అంది.

రజని అప్పటికి తిరిగి సమయస్ఫూర్తిని సంపాదించింది,

“రామంబాబు లోపలవుంటే రాక్షసి వచ్చిందని చెప్పండి” అంది.

రాక్షసి అనే పేరు విని ఆయువతి పక పక నవ్వుతూ“రాక్షసా! మీ సౌందర్యానికి తగిన పేరు పెట్టారు. రండి లోపలికి రండి. నా పేరు మీ అంతటి చక్కనిది కాదు. అతిసాధారణమైనది రాధారాణినాకు రామం బావ అవుతాడు నిన్ననే వచ్చాము. మా మావయ్య నేనూనూ” అంది.

ఈ లోపున లోపలినుంచి ఒక అరువది యేళ్ల ముసలాయన బయలుకు వచ్చి” ఎవరితో మాట్లాడుతున్నావు రాధా”? అన్నారు

బయటకు వచ్చి రజనిని చూసి “కళ్లకు మిరుమిట్లు గొలిపే యి స్త్రీ ఎవరు రాధా”? అన్నాడు.

రజని రాధని సమాథానం యియ్యనియ్యలేదు. ఆయన రామం తండ్రి అని గ్రహించింది. దగ్గరకు వెళ్ళి వంగి నమస్కరించి నన్ను రజని అని పిలుస్తారు బాబాయి. రామం బాబుని కలుసుకుందామని వచ్చాను” అంది.

రజని అందం వినమ్రత, మందహాసం, సరళత్వం ఆవృద్దుని ముగ్దున్ని చేసాయి. హఠాత్తుగా హృదయమంతా పితృ ప్రేమతో నిండిపోయింది. అప్యాయంగా “రా అమ్మా! లోపలికి రా! మావాడు నీ గురించి నిన్ననే చెప్పాడు. నిన్ను ఎప్పుడు చూస్తానా అని ఆతురత పడుతున్నాను” అన్నారు.

ఈ రాధకి కూడ అప్పుడు రామం రజని గురించి చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయి. రజని దగ్గరకు వచ్చి “అసలు పేరు చెప్పకుండా అలా అన్నావెందుకు రజనీ ! మా బావ నిన్ను అలా పిలుస్తాడా” అన్నది.

“లేదమ్మా! అలా పిలవమని అందరినీ అర్దిస్తూ వుంటాను. కాని అంతా పెడచెవిని పెట్టెవారే ! అది నా రూపానికి వర్తించకపోవచ్చు. కాని నా స్వభావానికి సరిపడుతుంది,” అని నవ్వి” చక్కటి పేరు. కృష్ణుడిని వెదుక్కుంటూ వచ్చావా రాథా”? అంది నవ్వుతూ.

రాధ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అప్పుడు విశ్వనాథంగారు రామం తండ్రి నవ్వుతూ మాటలో కూడ చమత్కారం. కాని నువ్వు అన్నదే నిజం చిన్నతనం నుంచీ రామానిచ్చి రాధకి వివాహం చేయాలని మేమంతా నిశ్చయించుకున్నాము. ఇక్కడ వచ్చింతర్వాత రామం ఎన్ని వుత్తరాలు వ్రాసినా ఆ విషయంలో ఏమి జవాబివ్వలేదు. అందుకని మా రాధని తీసుకుని వచ్చాను. ఢిల్లీని కూడ చూసినట్టు వుంటుంది.

రజనికి రామం వొకసారిఆ విషయంలో రామం తండ్రి రాసిన వుత్తరం చూపించాడు. అది యిప్పుడు ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఓక్షణకాలం ఆమె హృదయంలో కల్లోలం చెలరేగింది. ఇన్నాళ్ళు ఏ వ్యక్తియితే ఎల్లప్పుడూ తనవాడే అనుకుంటూ వచ్చిందో అతగాడు కూడ పరాయివాడేనని ఆమె గ్రహించింది. ఒకనాడు సరదాగా మీ యింటికి వచ్చి తలుపు తట్టితే ఎవరో పరాయి స్త్రీ వచ్చి తలుపు తెరచి “రజని అనే శబ్దానికి వారి జీవితంలో స్థానం లేదు, వారి అర్ధాంగిని నేను. వారి సర్వస్వంలో నాకు సమపాళ్ళున్నాయి “అని గర్వంతో తలుపు మూసివేస్తుంది.” అని రజని వేళాకోళం చేసింది. అది యీనాడు నిజమయింది. క్షణకాలంలోనే రజని మనసులో ఆలోచనలన్నీ సాగిపోయాయి.

రజని సమాధానం చెప్పేలోగా రామం వచ్చాడు. రజనిని రాధని తండ్రిని కలసి చూసి క్షణకాలం ఆశ్చర్యంతో గుమ్మంవదే నిలబడిపోయారు. రజని, రాధా అంత త్వరగా కలుసుకుంటారనీ అనుకోలేదు. మర్నాడు రజని వద్దకు వెళ్ళి రాధ రాక గురించి, తన అభిప్రాయాల గురించి చెప్పుదామనుకున్నాడు. అనుకోకుండా కథ అంతా అడ్డం తిరిగింది.

రామాన్ని మొదట రాధ చూసి వెంటనే “ఏమిటి బావా రజనికి రాక్షసి అని పేరు పెట్టావుట! ఆ విషయం మాతో చెప్పనేలేదు. ఇంటి తలుపు తట్టి రాక్షసి వచ్చిందని రామం బాబుతో చెప్పమని అంటే నాకర్థం కాలేను”అంది.

రాధ మాటలు విని రామం ముఖం ఎర్రబడింది. రజని కేసి కోపంగా చూసాడు.

ఈ లోపల రామం తండ్రి “అలా చూస్తావేమిటి రా? ఇంటికి వచ్చిన వారిని యిలాగేనా పరామర్శంచడం” అన్నాడు.

రామం వులిక్కిపడి “ఏం లేదు నాన్నా రజనిని హఠాత్తుగా యిలా చూసి చాలా ఆశ్చర్యపోయాను.” అని లేని నవ్వు తెచ్చుకొని “మా నాన్ననీ, రాధనీ రేపు నీదగ్గర తీసికొని వచ్చిపరిచయం చేద్దామనుకున్నాను. కాని నువ్వు వచ్చావు” అన్నాడు.

రజని నవ్వి “అదంతా బూటకం, నేనే యిక్కడకు రాకపోతే వీరిని నాకు పరిచయం చేసే వారే కాదు! బాబాయినీ, రాధనికలుసుకునే అవకాశమే లభించేది కాదు” అంది.

అందరి ఎదుట రజని అలా మాట్లాడటం రామానికి ఎంతో సిగ్గనిపించింది. ముఖ్యంగా తండ్రి ఎదుట అలా మాట్లాడటం అతనికెంత మాత్రము నచ్చలేదు .

కోపాన్ని దిగమింగి “రజని చమత్కారి నాన్నా. ఆమెను మాటల్లో జయించడం హరి బ్రహ్మాదులకు కూడా సాధ్యంకాదు” అన్నాడు

“బావా అలసి వచ్చావు. కాస్త ముఖం కడుక్కొని రా, కాఫీ తాగుదువుగాని” అంది రాధ.

అలాంటి అవకాశం కోసమే రామం ఎదురు చూస్తున్నాడు, అది జారవిడవకుండ లోనికి వెళ్ళిపోయాడు.

రామం తండ్రి దీర్ఘంగా నిట్టూర్చి “త్వరలో వీళ్ళిద్దరికి వివాహం చెయ్యాలని నా అభిలాషమ్మా, రాధ తండ్రి లేనిది. మాఇంటిలోనే పెరిగింది” అన్నాడు.

రజనీ హృదయం ఒక్కసారి గతుక్కుమంది. మనస్సు మళ్ళీ కల్లోల పూరితమైంది. అలా ఆయన రెండవసారి అనటానికి కారణం లేకపోలేదు. మొదట రామం రజనిని గురించి చెప్పినప్పుడే వారిద్దరిమధ్య సంబంధమేమిటా అని ఆయన అనుమానించాడు. రాధ యేమి గ్రహించలేకపోయినా అనుభవజ్ఞానం గల ఆవృద్దుడు రామం, రజని మధ్య కేవలం స్నేహంమాత్రమే కాదని ఆయన గ్రహించాడు , రజనిని చూసిన తర్వాత ఆమె అందం, చమత్కారం ఆయన్ని భయపెట్టాయి. రజని వలలో పడినట్లయితే రామానికి విముక్తి లేదని గ్రహించాడు.రజనికి మొదట రాధా రామాలమధ్యవున్న సంబంధం వెల్లడించి ఆమెని హెచ్చరించుదామనే ఆయన వుద్దేశ్యం. రజని అది గ్రహించింది. ఆత్మ నిగ్రహం ఆమె వుగ్గుపాలతో నేర్చుకున్న విద్య. తన భావాలన్నింటినీ కప్పివుంచి సహజకంఠస్వరంతో “తప్పక అలాగే చెయ్యండి బాబాయి. రాధచక్కటిది రామం బాబుకి అన్ని విధాలా సరిఅయినది” అంది.

రాధ సిగ్గుతో తలవంచుకుంది. విశ్వనాధంగారు “చిన్నతనం నుంచే ఇది వారిద్దరికీ సమ్మతమే. ఇకముహూర్తం పెట్టడమే మిగిలింది” అన్నాడు.

విశ్వనాధంగారు మాట్లాడే మాటలు వొక్కటే చాకులా రజని హృదయంలో గుచ్చుకుంటున్నాయి. ఈసారి వారి మాటలకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదనుకొని రజని మౌనం వహించింది. కాని ఆయన వూరుకోలేదు.

“రామానికి శలవు లేదని అంటున్నాడు. అందుకని నేనొక వుపాయం ఆలోచించాను. వివాహం ఇక్కడే చేస్తే సరిపోతుంది. రాధ తల్లికి అభ్యంతరం లేదనుకుంటాను. ఇవాళే వుత్తరం వాస్తాను” అని రజని కేసి చూశాడు. మేఘావృతమైన రజని ముఖం ఆయన చూపుల తీక్షణతని సవాలుగా అంగీకరించింది.

నవ్వుతూ “చక్కటి వుపాయం త్వరలోనే కానియండి. నేను కూడా చూడటానికి వీలుపడుతుంది? అంది.

రాధ ఇప్పటివరకు మౌనం వహించింది కాని ఈసారి వూరుకోలేదు “ఎక్కడయినా ఎప్పుడయినా నువ్వు లేకుండా జరుగదు రజనీ” అంది.

రాధ మొదటి నుంచి ప్రదర్శిస్తూన్న ఆప్యాయత రజనీ హృదయాన్ని వశపర్చకొంది, రాధరూపంకూడ మనోరంజకంగా వుంది. మొదటి చూపుల్లోనేచూపరుల అనురాగాన్ని వశపర్చుకునే అమాయక నేత్రద్వయం, నవ్వితే సొట్టలుపడే బుగ్గలు, శరీర ఛాయ తెల్లటి తెలుపు కాకపోయినా నిర్భయంగా తెలిపే శరీర దారుఢ్యం లేకపోయినా, ఆ సన్నటి పల్చటి శరీరంలోంచి ఏదో వర్ణించరాని ఆకర్షణ కనబడుతుంది. రాధ రామానికి సరిఅయిన స్త్రీ అనీ, వారిద్దరి మనస్తత్వాలు సరితూగుతాయని ఆమె కొద్ది కాలంలో గ్రహించింది.

రామం లోపలినుంచి బయటకు వచ్చాడు. రాధ కాఫీ తీసుకు రావడానికి లోనికి వెళ్ళింది. విశ్వనాథంగారు రామం రజనిల విషయం అప్పుడే తేల్చుకుందామని నిశ్చయించుకున్నారు.

“ఏరా రామం అత్తయ్యకు ఉత్తరం రాస్తాను. ఇక్కడకు వచ్చెయ్యిమని చెప్పి నీకు సెలవు లేదంటున్నావు కాబట్టి వివాహం ఇక్కడే కానిచ్చయమందాము” అన్నాడు.

రజని ముందు ఆ మాటలు అనటం బొత్తిగా అతనికి యిష్టంకాదు. అవమానంతోటి, దుఃఖంతోటి అతని హృదయం దహించుకుపోయింది. పెదిమలు వణికిపోతున్నాయి. రామం దుఃఖం గట్టులు తెంచుకుంటుదేమోననీ రజని భయపడింది. రామం ముఖం పైకెత్తి రజని కళ్ళలోకి వొకసారి చూశాడు. తన తండ్రి మాటల ప్రభావం ఆమెయెడల ఎలా వుందా అని పరిశీలించాడు. ఆమె నేత్రాలలోని విశ్చలత, నిర్మలత్వము అతనిలో లేని మనస్థయిర్యాన్ని కలగ చేసాయి.

“ఇప్పుడు అదంతా ఎందుకు నాన్నా! ఇప్పుడు తొందరయేమిటి?” అన్నారు.

“తొందర ఎందుకు లేదురా! నీకంటే రాధ వయస్సుతో నిమిత్తం లేకపోవచ్చు. కాని వాళ్ళ అమ్మ బెంగ పెట్టుకుంది. నాకూ యీ బాధ్యత తీరిపోతుంది. ఇంకా నేనెన్నాళ్లు బ్రతుకుతాను” అన్నాడు.

రామం సంభాషణ కట్టి పెట్టి వేద్దామనే వుద్దేశ్యంతో “తరువాత ఆలోచించి చెపుతాను నాన్నా” అన్నాడు.

అదే సమయానికి రాధ కాఫీ తీసుకువచ్చి రామానికి, రజనికి యిచ్చింది. ఆ సంభాషణ అంతటితో ముగిసిపోయింది.

కాఫీ తాగుతూ రజని అంది “ఢిల్లీ చూద్దామనే వుద్దేశ్యంతోమీనాన్నగారు, రాధా వచ్చారు? ఏం చెయ్యదలుచుకున్నారు” అంది.

రామానికి టూరిష్టు బస్సు జ్ఞాపకానికి వచ్చింది. చింతాక్రాంత వదనంతో చిరునవ్వుతో “టూరిష్టు బస్సు మాత్రం వద్దు రజనీ, కంగారుకూడలేదు. నెమ్మది నెమ్మదిగా నొక్కక్కటి చూడవచ్చును. ఆయినా ఆ బాధ్యత నువ్వే వహించాలి” అన్నాడు.

రాధ “అవును రజనీ! బావమీద బాధ్యత పెట్టావంటే అది యింకా బరువెక్కుతుంది. పైగా ఆఫీసునుంచి వచ్చే సరికి ఆలస్యమవుతుంది. శీతాకాలం కూడాను త్వరగా చీకటి పడుతుంది” అంది.

రజని –“చీకటి పడింతర్వాతే చూడవలసిన కొన్ని వున్నాయి రాధా, రామం బాబుకి చీకటి అంటే యిష్టం” అంది.

అందరూ నవ్వారు. రజని లేచి నిలబడి “ఇక నేను వెళ్తాను చీకటి పడింది” అంది.

విశ్వనాథంగారు “మావాడికి నువ్వుకూడ చెప్పి చూడమ్మా, మేము ఒక నెల రోజులకన్నా ఎక్కువకాలం వుండలేము. ఈ లోగానే అన్ని కార్యాలు సక్రమంగా నిర్వర్తించుకోని వెళ్లాలని నా అభిలాష” అన్నాడు.

తండ్రి మాటలు రామానికి కోపం తెప్పించాయి, రజని మీద కూడ ఆ కారణంగా కోపం వచ్చింది. రజని సమాధానం చెప్పే లోగానే రామం “ఇందులో రజని చెప్పవలసిందేమి లేదు నాన్నా. మీ మాటకన్నా ఆమె మాటంటే నాకెక్కువ విలువ లేదు” అన్నాడు.

రజని రామం కళ్ళలో చూసింది. రామం ముఖం తిప్పుకొని “పద రజనీ, నిన్న బస్సు ఎక్కించి వస్తాను” అన్నాడు.

“పదండి” అంది రజని.

రాధ “తరచుగ యిక్కడకు నువ్వు వస్తూండాలి రజనీ. నాకు యింకెవరూ తోడు లేరు. బావ మాకు ఢిల్లీని చూపించే భారం కూడ నీమీదే వేసారు” అంది.

“ఆలాగే రాధా” అని విశ్వనాథంగారికి నమస్కరించి బయటికి వచ్చేసింది.

బయటకు వచ్చి యిద్దరూ నడక సాగించారు. కొన్ని క్షణాలవరకు ఎవ్వరూ మాట్లాడలేదు.

రజని “బలాడ్యులనీ, పొడుగ్గా వున్నారనీ అంత వేగంగా నడుస్తే నేనేమయిపోతాను చెప్పండి” అంది నీరసంగా.

“ఇన్నాళ్లు నేను నిన్ను అనుసరిస్తూ నీ వెంటవచ్చాను రజనీ, కాని యీ నాటినుంచి నీవు నన్ను అనుసరించాలి” అన్నాడు.

“చివరి మాట రాధతో అనవలసిన వాక్యం రామం బాబూ రజనితో కాదు” అంది.

రామం దానికి సమాథానం చెప్పలేదు. “మా నాన్నతో అలా మాట్లాడేవే” అన్నాడు.

“ఇంకేలా మాట్లాడుతాను చెప్పండి మీరు రాక మునుపు మీ నాన్నగారు మీ గురించి, రాధ గురించి అంతా చెప్పారు” అంది.

“ఇన్నాళ్లు నాకెందుకు రాధ సంగతి చెప్పలేదు! నావద్ద యిది ఎందుకు దాచారు” అని అడుగుతుందని రామం భయపడ్డాడు ఆశించాడు.

“ఆయితే మా నాన్న దగ్గర నువ్వన్న మాటలన్నీ మాటవరసకి మాత్రమే అన్నావా?” అన్నాడు.

“కాదు రామం బాబూ మనస్ఫూర్తిగా అన్నాను” అంది రామం మౌనం వహించాడు. కొంతదూరం పోయిన తర్వాత “నేను నీతో మాట్లాడాలి రజనీ” అన్నాడు.

రజని నవ్వి “ఇందాకటి నుంచి చేస్తున్నది యేమిటీ” అంది. రామం “పరిహాసం కాదు రజనీ ఇది నా జీవన్మరణాల సమస్య” అన్నాడు.

రజని “శుభమా అంటూ పెళ్ళి చేసుకోబోతూ యిలాంటి మాటలు అంటారేమిటి” అంది.

రామం “మొదటినుంచీ నన్ను ఈ వేళాకోళం చేస్తూనే వున్నావు రజనీ! ఏ విషయము నీకు సరిగ్గా మాట్లాడడానికి అవకాశం యివ్వవు” అన్నాడు.

“అయితే చెప్పండి నడిరోడ్డుమీన సావధానంగా వింటాను” అంది.

“ఇప్పుడు కాదు రేపు నిన్ను కలుసుకొని మాట్లాడుతాను” అన్నాడు.

“దానికి నా అనుమతి కావాలా చెప్పండి? అలాగే చెయ్యండి” అంది.

*****