Kshantavyulu - 9 in Telugu Moral Stories by Bhimeswara Challa books and stories PDF | క్షంతవ్యులు - 9

Featured Books
Share

క్షంతవ్యులు - 9

క్షంతవ్యులు – Part 9

చాప్టర్ 23

రానురాను నాకు గురువుగారి మీద అపనమ్మకం హెచ్చింది. అందులో ఆయన మీద కోపం కూడా వుందేమో? నామాటకంటే గురువు మాటలకు యశో ఎక్కువ విలువ ఇచ్చేది. ఎప్పుడూ ఆయన మాట జవదాటదు. అయన సేవకు వెనకాడేది కాదు. ఈమె మీద ఇంత అధికారం ఎలా వచ్చింది ఈయనకు.

గురువుగారితో నా ప్రతిఘటన యశో ప్రవర్తనలో మార్పు తెచ్చింది. పూర్వపు శ్రద్ధా, మమకారమూ నా మీద సన్నగిల్లేయి. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకున్నా ఏమీ అనేది కాదు. బ్రేక్‍ఫాస్ట్ చెయ్యక పోయినా పట్టించుకునేది కాదు. రాత్రిళ్లు ఏదైనా సరదాగా మాట్లాడుదామనో, గంగవొడ్డుకు వెల్దామనో నేనంటే, ‘‘నిద్రవస్తుంది, అలసిపోయాను,’’ అనేది. ఆ ప్రవర్తనకి కారణం నాకేమీ అంతుబట్టలేదు. నా మనస్సుకు అమితంగా బాధ కలిగేది. లఖియా కూడా మా సంగతి గ్రహించినట్లు కనబడింది. కాని ఆమె కూడా ఏమీ అనలేదు.

అప్పుడప్పుడు సరళ వచ్చేది. ఆమెతోకూడా నేను పూర్వమంత చనువుగా వుండే వాడిని కాను. ఆమె మటుకు యధాప్రకారంగానే వుండేది. వీటినన్నింటినీ చూసి నేను అప్పుడప్పుడు భయపడేవాడిని, భవిష్యత్తులో ఏం కాబోతుంది? నాకు ఎంత నమ్మకం లేకపోయినా గురువుగారి మాటలు తలపుకు వచ్చేవి. ఆ దుష్ట మాటలు ఏపాడుశక్తి చెప్పించిందీయనచేత? యశో ఏదో ప్రాయశ్చిత్తం చేస్తానంది. అది ఏమిటో నేను ఎప్పుడూ అడుగలేదు. ఆమె చెప్పనూలేదు. ఈ గురువుమీద ఆమెకున్న నమ్మకం చూస్తూంటే మనస్సు పరిపరి విధాల పోయేది. చివరకు ఏం జరుగుతుంది?

కాలం గడిచేకొద్దీ యశో నాకు దూరమవజొచ్చింది. క్రమేణా ఒకే ఇంటిలో, ఒకే గదిలో వుంటున్నా పూర్వపు చనువు మాయమైంది. నా సదుపాయాలకు లోటు అట్టేరానిచ్చేది కాదు. యశో తన హృద‌య‌పు ద్వారబంధనాలన్నీ మూసివేసింది నానుంచి. ఇప్పుడు వాటిని తెరవటానికి ప్రయత్నించేవాడిని కాని సాధ్యం కాలేదు. యశో కూడా ఏదో ఆలోచిస్తూన్నట్లు ఉండేది. అప్పుడప్పుడు కళ్ళు తుడుచుకుంటున్నట్లు కనబడేది.

“కొన్నాళ్లు మా ఇంట్లో వుండకూడదా?” ఆ రోజు సరళ వెళ్లిపోయేముందు నా దగ్గరకు వచ్చి అంది.

యశో కూడా అక్కడే వుంది. నాకేమనటానికి నోరు రాలేదు; ప్రతి సారి యశో జవాబు చెప్పేది కానీ ఈ సారి నోరుమెదపలేదు. ఏమి అనలేదంటే నేను తనని విడిచి వెళితే యశోకి అభ్యంతరం లేదన్న విషయం నాకర్ధమయింది. సరే అందామనుకుంటుంటే, లఖియా పడింది.

“అదేలా సాధ్యపడుతుంది సరళా? అసలు వారు సుందరిని విడిచి నీతో ఎలా వస్తారనుకున్నావు? ఇంత దూరం వచ్చింది ఆమె కోసమేగా? ఏమంటావు సుందరీ,” అంది లఖియా

‘‘అదే మంచిది లఖియా,’’ అంది యశో నీరసంగా నవ్వుతూ.

యశో ప్రవర్తనలో మార్పు సరళ కూడా గ్రహించి నన్ను రమని పట్టుపట్టలేదు.

ఇంకా కొన్ని దినాలు గడిచిపోయాయి. యశో నిరాదరణ కొనసాగుతూవుంది. అలా ఎన్నాళ్లు అక్కరకురాని అతిథిగా వుంటాను? ఏమైనా యశోని అడగాలని నిశ్చియించుకున్నాను.

ప్రతి రోజూ యశో పక్క వేసేది. ఒకనాటి రాత్రి నేనే వేసుకోవటం మొదలు పెట్టాను. యశో కాసేపు చూస్తూ వూరుకుంది.

‘‘నేను వేస్తాను వుండండి’’ అని వేయటం మొదలుపెట్టింది తర్వాత దగ్గరకు వచ్చి.

నేనేమీ మాట్లాడలేదు. అలాగే అక్కడ నుంచుని వున్నాను. పక్కవేసి వెళ్లిపోతూంటే యశో చెయ్యి పట్టుకున్నాను. ఆమె కాసేపు అలాగే వుండనిచ్చి ‘‘వదలండి’’ అంది, పక్కకు చూస్తూ. ముఖం నాకు కనబడకుండా వుండాలని ప్రయత్నిస్తూంది.

‘‘నీ వింత ప్రవర్తనకి కారణం చెప్పేవరకూ చేయి వదలను,’’ అన్నాను.

యశో చెంపమీద కన్నీరు కారుతూంది.

“నన్ను నిష్కారణంగా ఎందుకు ఏడిపిస్తారు? నేను ఏమి తప్పు చేశాను. మీదేమైనా రాతిగుండా? వదలండీ,’’ అంది.చెయ్యి లాక్కుంటూ.

వూహించని ఆ పరిణామంతో నిశ్చేస్టుడనయి చెయ్యి వదిలివేశాను.

యశో తన పక్కమీద పడి భోరుగా ఏడ్వటం మొదలుపెట్టింది. నాకు ఏం చెయ్యాలో తోచక ఆమెకేసి కన్నార్ప కుండా చూస్తూ ఉండి పోయాను.

చివరకు ఆమె దగ్గరకు వెళ్లి, ‘యశో’ అన్నాను. యశో ఏడుస్తూనే వుంది.

“దయ వుంచి నన్ను వదిలిపెట్టండి బాదల్ బాబూ. లేకపోతే నేనే బయటకు వెళ్లిపోతాను,’’ అంది జీరస్వరంతో.

“విదలకేం చేస్తాను,” అన్నాను అసహాయంగా.

యశో పూర్తిగా మారిపోయింది. అవసరం వస్తేగాని మాట్లాడేది కాదు. సంకోచ, సంశయములతో బాధపడేవాడిని. నేను అక్కడ వుండటం ఆమెకు ఇష్టంలేదా? ఏదో మాటవరసకని రాసిన వాక్యాన్ని పురస్కరించుకుని ఇక్కడికి వచ్చానా? కాని ఆమె అంత దు.ఖములో కూడా ‘‘బాదల్ బాబూ’’ అని సంబోధించింది. అదొక్కటే నా ఓదార్పు.

లఖియాని అడిగి చూద్దామని నిశ్చయించుకున్నాను. లఖియా ముందర ఏమీ చెప్పలేదు. అసలు సంగతి ఆమెకు కూడా తెలియదంది. తెలిసిందేమిటో ఆదే చెప్పమన్నాను.

అసలు సంగతి ఇది. నేను యశో ఒకే కుటీరంలో కలసి వుండటం వల్ల నలుగురూ నాలుగు మాటలు అంటున్నారు. గంగఒడ్డున మా వెన్నెల రాత్రి విహారాలు కూడా వీరందరి చెవులా పడ్డాయి. చివరకు గురువుగారు కూడా యశోతో చెప్పారట, ఇదంతా ఏమీ బాగుండలేదని;ఆయినా యశో ఎంతగానో నచ్చ చెప్పిందిట, నాలాంటి మంచివాడు చాలా అరుదుగా కనబడుతాడని. ఇదంతా కొంత కాలం నించి నడుస్తోందిట; గురువుగారు నేను వద్దనడం, యశో నన్ను సమర్ధించడం. ఆయినా ఆయన ససేమిరా అనేవారట; ఆఖరికి మూడు రోజుల క్రితం ఆయన తేల్చివేశారుట. నన్ను పంపకపోతే యశోకూడా వెళ్లాల్సి వస్తుందనీ, ఆశ్రమపు పరువు ప్రతిష్టలు వ్యక్తుల కంటే ముఖ్యమని. అందుచేత నన్ను నెమ్మదిగా పంపించి వేయమని చెప్పారు. లఖియా ఈ విధంగా చెప్పలేక చెప్పింది. కాని దాని సారాంశమిది. నామీద ఆయనకు ముందరనించి అయిష్టతే, అయినా ఆయన్ని కించపరచి నేనే దాన్నిపెంచాను . ఇదే స్వయంకృతాపరాధం , యశోకి మరో శాపం.

యశోని బాధపెట్టే నిగూఢ రహస్యం తెలిసిన తర్వాత తనలోని బాధ నాకు అర్ధమైంది. ఒకవైపు బాదల్ బాబూ,మరోవైపు గురువు గారు. వీరిలో ఎవరిని త్యజించాలి? గురువుగారితో తనకు మనశ్శాంతమూ, సాఫీగా గడిచిపోయే భవిష్యత్తూ వున్నాయి. నాతో ఉంటే కష్టాలు, రక్షణ లేని భవిష్యత్తూ ప్రాప్తిస్తాయి. నా బరువంతా తనమీద పడుతుంది. వీటిలో దేనిని త్యజించాలి. అదీ సమస్య..నా రాకకు మునుపు ఆమె ఎంతో సరదాగా గడిపిందనే దానికి ఆమె ఉత్తరమే సాక్షి.

అంటే నేను వచ్చి అదంతా పటాపంచలు చేశాను. హృద‌యంలో అణగారిపోయిన కోరికలు చిగిర్చాయి. ఆగిపోతూన్న నిప్పు తుణకలను దగ్గరచేర్చి మంటచేశాను. దాని ఫలితమే ఇది. ఆమెకి ఇక్కడి జీవితం నచ్చిందనటానికి సందేహంలేదు. ఆ ఆశ్రమంలోనే జీవితాంతం వుండిపోదామని ఆమె అనుకున్నదనే విషయం నాకు తెలుసు. ఇవన్నీ ఈనాడు తారుమారవుతాయా?

అయితే నేను ఏం చెయ్యాలి? చాలా సేపు ఆలోచించాను. నా సంగతి మాత్రమే ఆలోచిస్తే యశో నాతో వుండటం చాలా ముఖ్యం. మళ్లీ నా భారాన్ని నేను వహించలేను. కానీ యశో సంగతి వేరు. నాతో వుండటం వల్ల ఆమెకు కష్టాలు, కన్నీరు తప్పవు. ఆమె సుఖపడటానికి అవకాశాలు ఏమీలేవు. నా స్వభావమే అంత, యశో చెప్పినట్లు నేను అందరివద్ద అన్నీ ఆశిస్తాను. స్వీకరిస్తాను. ఉపయోగించుకుంటాను. తిరిగి ఏమీ ఇవ్వను. ఇంత కృతజ్ఞుడితో ఈమె ఏమి సుఖపడుతుంది?

అసలు యశో ఏమనుకుంటూంది? నన్ను పొమ్మని చెప్పలేక బాధపడుతూందా? నా అంతట నేనే వెళ్లిపోతానని చెప్తాను. ఆమెకు ఆమాత్రం సహాయం నేను చేయలేనా? మూడు సంవత్సరాల క్రితం నా మటుకు నేను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెని వదిలిపెట్టి పోయాను. తరువాత ఆమె విలువ గ్రహించాను. ఆమెను వెదుక్కుంటూ చివరకు ఇక్కడికి చేరుకున్నాను. ఆమెనించి ప్రేమా, వాత్సల్యం, అనురాగం అన్నీ పొందాను. ఈసారి ఇవన్నీ వదిలి నా ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లిపోవాలి అనుకున్నా... తనకు యశోకి మధ్య ఈ గురువుగారోకడు తయారయ్యాడు? అసలు తను నిజమైన సన్యాసేనా?

ఆ రోజు రాత్రి.

“యశో నాకు లఖియా అంతా చెప్పంది”అన్నాను తన దగ్గరకు చేరి, ఉపోద్ఘాతం ఏమీ లేకుండా.

యశో ఒక్క నిమిషం ఆలోచనలో పడింది.

“అయితే ఏం చేస్తారు?” అంది కాసేపు వుండి.

దీంతో నాకు ఏం చెప్పాలో తెలియలేదు.

“నేను వెళ్లి పోతాను యశో,’’ అన్నాను తలవని తలంపుగా.

అసలు అంతవరకూ నేనొక నిశ్చయానికి రాలేదు. కాని నోట ఆ మాటలు వచ్చేశాయి.

యశో కాసేపు మాట్లాడలేదు.

‘‘అదే మంచింది’’ అంది ఆఖరికి, కళ్లు మూసుకుని.

దగ్గరలో పిడుగు పడినట్లైంది. అదే మంచిది అంటే అర్థమేమిటి? ఇంతకు ముందు ఒకసారి సరళ నన్ను తనతో రమ్మన్నప్పుడు లఖియాతో యశో ఇదేమాట అంది. ఆ రెండు పదాల్లో మా ఇద్దరి భవిష్యత్తూ ఇమిడించిందా తను ? అంతకుముందే నన్ను వదిలేయటానికి నిశ్చయించి వుంటుంది. లేకపోతే ఎలా అనగలదు అలాంటి మాటలు. ఇక ఏమనాలి? మనస్సంతా ఎంతో బరువైపోయింది.

‘‘రేపే వెళ్లిపోతాను యశో,’’ అన్నాను.

‘‘ఇంకా కొన్నాళ్లు వుండకూడదా?” అంది ఆద్రస్వరంతో.

‘‘వద్దు యశో, ’’అన్నాను.

‘‘సరే అయితే, అదే మంచిది,’’ అని అవతలవైపుకు తిరిగిపోయింది.

యశో అటుపక్కకు తిరిగి తనలోతాను నవ్వుకుంటూందనే ఘోర అనుమానం కలిగింది. ఎంత మారిపోయింది. వినడమే తడవుగా తోసిపుచ్చింది నన్ను? వెళ్లిపోవటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఇలాంటి వీడ్కోలుకి నా హృద‌యం సిద్ధంగా లేదు అనుకున్నాను. హృద‌యమంతా కల్లోల పూరితమైపోయింది..

మంచం మీదకు వెళ్లి పడుకున్నాను. మానసికంగా అలసి సొలసి, క్రమేణా నిద్రపోయాను.

ఆ రాత్రి ఏ ఝామునో….

“బాదల్ బాబూ”, అని యశో లేపితే కళ్లు తెరిచాను.

నా ఎదురుగా ‘పసుపు పచ్చటి జార్జట్టు’ చీర కట్టుకుని ఉండి.

“లేవండి, బండి సిద్ధమైంది ప్రయాణానికి,” అంది.

అప్పటికి నాకు పూర్తి మెలుకువ వచ్చింది.

“ఏమిటీ యశో నన్ను రాత్రికి రాత్రే రవాణా చేస్తున్నావా ?”దు.ఖముతో నా గొంతుక బొంగురుపోయింది.

‘‘ఎంత చెడ్డదాన్నైనా నేను అలాంటి దానిని కాను బాదల్ బాబూ. పదండి నేనూ మీతో వస్తున్నాను,’’ అంది నవ్వుతూ.

మొదట నాకేమీ అర్థం కాలేదు. యశో శాశ్వతంగా ఈ ఆశ్రమం వదలి నాతో వచ్చేస్తుందా! ఇంతలో ఈ మార్పెలావచ్చింది. నా చెవులను నేనే నమ్మలేని స్థిలో వున్న నన్ను చెయ్యి పట్టుకుని బయటికి నడిపించింది.

‘‘బాబుగారి పక్కచుట్టి బండిలో పెట్టు, ’’ అంది యశో బయట ఉన్న రణధీర్ని ఉద్దేశించి.

అప్పుడే లఖియా చీకటిలోంచి రోడ్డుమీద వున్నఎడ్ల బండి లాంతరు వెలుతురు లోకి వచ్చింది. నాకు ఆమెను చూడగానే ఎందుకో మనస్సులో చాలా బాధ కలిగింది.

‘‘నేను వెళ్లిపోతున్నాను లఖియా, యశోని నీవద్దనుంచి తీసుకు పోతున్నాను,” అన్నాను తన దగ్గరకు వెళ్లి.

చీకటి ఆ గుడ్డి దీపం వెలుగులో లఖియా ముఖం చాలా అస్పష్టంగా వుంది. ఆమె కంటతడి వుందా? కాని ఆమె జవాబును బట్టి వుందని కాస్త ఊహించుకున్నాను.

“రామంబాబూ. మీ సొత్తును మీరు తీసుకెళ్తున్నారు. ఇక నుంచి మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అందర్నీ కాపాడే ఆ భగవంతుడు మీ ఇద్దర్నీ కాపాడుతాడు,” అంది.

“నువ్వు మాకొక మాటివ్వాలి. జీవితంలో నీకు ఏ విధమైన ఇబ్బంది కలిగిన మాకు కబురుచెయ్యి. నీకు ధనం ఇస్తామని చెప్పము. అందుకు మేము అర్హులం కామేమో? ఎల్లప్పుడూ మా హృదయ కవాటాలు నీకు తెరిచి వుంటాయి. లఖియా, నువ్వు ఎల్లప్పుడూ సుఖపడాలనే నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను,” అన్నాను తన చెయ్యిని నాచేతిలోకి తీసుకుని.

‘‘అలాగే చేస్తాను రామంబాబూ. అవసరం వస్తే మీ వద్దకు వస్తాను. మీ ఇద్దరికీ నామీద వున్న అభిమానం, దయా నాకు తెలుసు అందుకు నేను తగిన దానిని కావాలనే నా కోరిక,’’ అంది లఖియా.

‘‘అదే పదివేలు మాకు,” అన్నాను.

‘‘రామంబాబూ. యశోని మీ చేతిలో పెట్టే భారం కూడా నేనే వహిస్తాను. సుందరీ, వీరిని గురించీ, నా కర్తవ్యం గురించీ నీకు నేను చెప్పదగిన దానను కాను. కాని ఇది చెప్తాను. వీరిని కాపాడుకోవటం కన్నా నీకిక వేరే కర్తవ్యం లేదు,’’ అంది నా దక్షిణహస్తాన్ని యశో చేతిలో పెట్టి.

మరోక్షణంలో వారిరువురు గాఢాలింగనములో ఇమిడిపోయారు.

‘‘ఈనాడు నాకు ఇది లభించటానికి కూడా నువ్వే కదా కారణం లఖియా, లేకపోతే వీరిని పారవేసుకునే దానిని కదా. ఈ రాత్రి నువ్వు నాకీ మార్గం చూపించకపోతే నేనేమయిపోయేదానినో? ఈ విషయం నేన్నటికీ మరువను. వీరన్నట్టు మా హృద‌యపు కవాటాలు నీ కోసం ఎప్పుడూ తెరిచే వుంటాయి,’’ అంది యశో.

అయితే యశో నాకు లభించటానికి కారణం కూడా లఖియాయే అన్నమాట. ఈమె రుణం నేనెలా తీర్చుకునేది. ఈ పవిత్రతని అవిపత్రం చేయకుండా నేనేమి సమర్పించగలను?

లఖియా నా మనస్సులో భావాల్ని గ్రహించింది.

‘‘వద్దు రామం బాబూ.. మీ హృద‌యంలోని భావాలు వుద్దేశాలు నాకు తెలుసు.....బయటికి వెల్లడించ నవసరంలేదు. శేష జీవితంలో మనము కలుసుకుంటామో లేదో నేను సరిగా చెప్పలేను. కాని యశోని, మిమ్మల్ని నా స్పృతిపథంలో భద్రంగా దాచుకుంటాను. కష్టసమయాల్లో మీ జ్ఞప్తి నాకొక ఓదార్పు. ఇక నేనేమి ఆశించను, ’’ అంది.

లఖియా చాలా శాంత స్వభావిని, మితభాషి. అవేశానికి ఎప్పుడూ లోనుకాదు. సర్వవేళలందూ ఆమె ముఖం మీద తేజోవర్ణమైన కాంతి వెలుగుతూంటుంది. అలాంటి లఖియా ఎంతో ఆవేశంతో ఆ చివరి వాక్యాలు పలికింది, “కష్టసమయాల్లో మీ జ్ఞప్తి నాకొక ఓదార్పు. ఇక నేనేమి ఆశించను.”

యశో కళ్లవెంట నీరు కారుతూంది.

ఎడబాట్లు ఎప్పుడూ దుఃఖాన్ని కలుగజేస్తాయి. సన్నిహితులనూ, ప్రేమపాత్రులను వదలాల్సి వచ్చినప్పుడు ఇది మరీ ప్రబలంగా వుంటుంది. యశో గబగబా కళ్లు తుడుచుకుంది,

‘‘పదండి రామంబాబూ, అలస్యమవుతూంది,’’ అంది

లఖియాకేసి మరొక్కసారి చూశాను. చిరునవ్వుతో నా చెయ్యి పట్టుకుని బండివద్దకు తీసుకువచ్చి బండి ఎక్కించింది. యశో అప్పుడు లఖియాకి పాదాభివందనం చేసింది. మరొక్కసారి ఇరువురూ కౌగిలిలో ఇమిడిపోయారు. లఖియా యశోని కూడా బండి ఎక్కించింది.

ఇక పద రణధీర్,’ అంది లఖియా, వీడ్కోలుగా చేయి ఊపుతూ.

ప్రతివీడ్కోలుగా యశో చేయి ఊపగా, నేను చేతులు జోడించి నమస్కరించాను.

రణధీర్ కొరడా దెబ్బ తిని ఎద్దులు పరుగెత్తాయి.

లఖియా చీకటిలో లీనమై పోయింది.

చాప్టర్ 24

ఆ నిశి రేయిలో యశో ‘పసుపు పచ్చటి చీర’ ప్రక్రుతిలో కలిసిపోయింది కాని దాని ప్రాముఖ్యత నాకు అప్పుడే అర్ధమయింది;

“మీకు జవాబు రాస్తూ, ఇప్పుడు నేను కట్టుకున్న చీర చాలా విలువైంది. ఇది ఎప్పుడూ ఇక్కడకు వచ్చినతర్వాత కట్టుకోలేదు. ఏమిటా ‘ఇది’ అని ఆలోచిస్తున్నారా. గుర్తు తెచ్చుకోండి, మీరే చెప్పారే ఆనాడు; పసుపు పచ్చటి జార్జట్టు చీర కట్టుకుంటే నేను ముచ్చటగా ఉంటానని, అదే చీర ఇప్పుడు కట్టుకున్నాను,” యశో రాసిన ఆ అక్షరాలు నాకు కళ్ళకు కట్టినట్టు కనబడ్డాయి.

నేను ఆ చీరకొంగుని సున్నితంగా నా మెడకు చుట్టుకుని యశో కేసి ఆప్యాయంగా చూస్తూ నా ముని వేళ్లతో దాని పల్లు స్పర్శని అనుభవిస్తూ కూచున్నాను.

“మీకు ఇది గుర్తు రావడం నా సౌభాగ్యం,” అంది యశో.

‘‘మనము ఇక్కడనుంచీ పారిపోతున్నామాయశో?” అన్నాను.

‘‘ఇది పారిపోవడం కాదు బాదల్ బాబూ. మన జీవితంలో ఒక అధ్యాయం ముగిస్తునాం. అబ్బ. విపరీతమైన నిద్రవస్తూంది. పడుకుంటాను,’’ అని, బండిలో గడ్డిమీద తలవాల్చి గాఢనిద్ర లోకి ఒరిగిపోయింది .

కొద్దిసేపు పోయిన తర్వాత గడ్డిలో ఏదో చప్పుడైనట్టుంది. నాలో భయంకరమైన అనుమానం ఒకటి ప్రవేశించింది. యశో గడ్డి మీద పడుకుంది. ఈ గడ్డిలో ఏదైనా పాడుకీటకముంటే ఏం కాను? గడ్డిలో పాములుంటాయి అంటారు. అలాంటిదేదయినా వుందా.... యశో అలా నిద్రపోతూండగా నాకీ ఆలోచనకలిగి వెంటనే ఆ గడ్డంతా చెయ్యి పెట్టి తడమడం మొదలుపెట్టాను. కటికాంధకారం. చేతికి ఏదో కాస్త మెత్తగా తగిలినట్లుంది. శరీరం ఒక్కసారి వణికింది. బయటికి విసిరేశాను. అది ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు. బహుశా అది నా భ్రమే అయి వుంటుంది. పాము అయితే కుట్టకుండా అంతసేపు అలా ఎందుకు వుంటుంది? ఇంకా భయం పోలేదు. యశో తల నెమ్మదిగా ఎత్తి నా ఒడిలో పెట్టుకున్నాను. ఆ చీకటిలో తెల్లటి ఆమె ముఖం వజ్రంలా తళ తళ మెరుస్తూంది. ఎంత అందంగా ప్రశాంతంగా వుంది.

బయట అంతా కటిక చీకటి. భయంకరమైన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, ఎడ్ల మెడలోంచి గంటలు చప్పుడు చేస్తున్నాయి. వుండి వుండి దూరం నుంచీ జంబూకపు కూతలు వినపడుతున్నాయి. ఆకాశం నిర్మలంగా వుంది. గగనాన్ని తూట్లుపొడుస్తూ నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. చీకటిని చీల్చుకుంటూ వుల్కలు పచారులు చేస్తున్నాయి. చందమామకు అది సెలవు దినం కామోసు. ఎక్కడా అలికిడిలేదు.

మనస్సంతా కల్లోలంగా వుంది. గతించిన అనేక స్మృతులు మనో నేత్రాలముందు మెదలసాగాయి. ఆ ఆశ్రమానికి సరళతో కలిసి వచ్చాము. కారులో రాజేంద్ర సారధ్యం వహించాడు. ఈసారి నిద్రలో వున్న యశోని తీసుకుని నిశిరాత్రి రెండెడ్ల బండిలో ప్రయాణం చేస్తున్నాను. రణధీర్ కునికిపాట్లు పడుతూ బండిలో ఊగిసలాడుతున్నాడు. రాకకీ, పోకకీ ఎంత వ్యత్యాసముంది. ఇంతకి ఎక్కడికి వెడుతున్నట్లు? యశో అదేమీ చెప్పనేలేదు. రణధీర్ని అడగడం ఇష్టం లేకపోయింది. యశో పక్కన వున్నంతకాలం ఎక్కడికయితేనేమిటి?

హఠాత్తుగా సుశీ గుర్తుకు వచ్చింది. ఆమె జీవించి వుంటే నాకివన్నీ తప్పేవికాదా? అప్పుడు యశో ఏమవును? సరళ, లఖియాల మాటేమిటి? మానవ జీవితం ఎంత గమ్మత్తైనది. ఒకసంఘటన ఎన్నో సంఘటనలకు దారితీస్తుంది కదా? అసలు మొదలే యుండకపోతే తరువాడ ఏమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం బహుశా విధాత కూడా ఇవ్వలేడు. మానవ జీవితం క్షణభంగురం. కాని మనము అనుకునేటంత అర్ధరహితం కాదేమో అనిపించింది.

యశో నా కోసం సర్వం త్యజించింది. కాని తనకి నేను ఇవ్వగలిగింది శూన్యం. నా వద్ద వున్నదేదో అది సుశీ తీసుకుపోయింది. నా వద్ద వున్న మిగులు తగులు ఏదైనా ఈమెకే సమర్పించుకుంటాను. ఈ వ్యర్థ జీవితాన్ని ఈమె చేతిలోనే పెడతాను.

కొంతసేపటికి, అలా కూర్చునే నిద్రపోయాను. మెలుకువ వచ్చేసరికి తెల్లవారుతూంది. ఇంకా యశో నిద్రపోతూనే వుంది. ఆమె తల నా ఒడిలో అలాగే వుంది, మరేమిటో గాని, అయినా తిమ్మిరనిపించ లేదు. ఉదయభానుని లేత కిరణాలు ఆమె ముఖానికొక వింతశోభ నిస్తున్నాయి. ఆ ముగ్ధ సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తూన్నాను. నుదుటపైన ముంగురులు సరిచేశాను. యశో కళ్లు తెరిచింది.

‘‘అరే, రాత్రంతా ఇలాగే కూర్చున్నారా? మీరు కూడా పడుకోలేకపోయారా?’’ అంది గబుక్కున లేచి కూర్చుని.

“ఎక్కడ పడుకోమంటావు అమ్మీ?’’ అన్నాను.

యశో ముఖం సిగ్గుతో ఎర్రబడింది.

‘‘నన్ను లేపవల్సింది. నేను కూర్చుండేదాన్ని,” అంది.

“అది సరే, ఈ ఎడ్లకి ఏమైనా గమ్యస్థానం వుందా? లేక స్వేచ్ఛా విహారమా,” అన్నాను.

యశో నేను వేసిన చలోక్తికి నవ్వలేదు.

‘‘ముందర ముస్సోరీ వెళ్లాలి. బ్యాంకులోంచి డబ్బు తీసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడకు వెళ్లాలో ఆలోచిద్దాం,” అంది.

ఆ మాట వినగానే నా గుండెల్లో రాయిపడింది. సరళను మళ్లీ కలవాల్సి వస్తుంది ఈ పరిస్థితిలో, కానీ తప్పలేదు. డబ్బులేకుండా ఎలా గడుస్తుంది. నా దగ్గర పట్టుమని మూడు పచ్చనోట్లైనా లేవే?

“మనం ఢిల్లీ వెళదాం . అక్కడ నేనేదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. ఏదో ఒకటి దొరకకపోదు. పెద్ద పట్టణం. మన గురించి పట్టించుకునేవారు కూడా వుండరు,’’ అన్నాను.

యశో ఎంతో కాలం తర్వాత స్వచ్ఛంగా నవ్వింది.

‘‘మీరు ఉద్యోగం చేస్తారా? మా భలేగావుంది? ఆఫీసుకు రోజూ మీతో పాటు నన్నూ తీసుకుపోతుంటారా? లేకపోతే మీకు గడవదేమరి. ఎవరూ మిమ్మల్నిఉద్యోగంలో ఒక వారం కంటే ఎక్కువ కాలం వుంచుకోరు,” అంది నవ్వుతూ.

నా మనస్సు కాస్త చివుక్కుమంది. నేను అంత పనికిరానివాణ్ణా? అయినా యశో చెప్పిందే నిజం. ఉద్యోగం నా స్వభావానికి గిట్టదని నాకు తెలుసు. ఇదేమాట సుశీ కూడాఅనేది. అయితే ఇక మిగిలిందేమిటి? యశో చుట్టూ ఒక గ్రహంలా తిరగటమేనా?

‘‘కానీ నేను ఉద్యోగం చెయ్యకుండా మనం ఎన్నాళ్లు బతకగలం? అమ్మీ నీ దగ్గరవున్న ధనం అక్షయం కాదుకదా? నా ఆస్తి మాటకొస్తే, కూర్చుని తింటూంటే కొండలైనా కరుగుతాయిగా? ఆ తర్వాత నువ్వు డబ్బు సంపాదించి పోషిస్తావా నన్ను?’’ అన్నాను.

“వాటిని గురించి మీరనవసరంగా బాధపడకండి. ఆ బాధ్యత నాది. అవన్నీ నేను చూసుకుంటాను. మనవి రెండు జీవాలు. తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు కంటే ఇంకేమి కావాలి? ఒక వేళ అన్నీఅయిపోతే నా నగలున్నాయి. నాకు తెలుసు మీరేమంటారో; స్త్రీ నగలను వాడనంటారు. మీరు నాకు ఇప్పుడు మాట ఇవ్వాలి మీ డబ్బు, నా డబ్బు అనే విభేదం చూపనని. అంతా ఒక్కటే. ఒకవేళ అంతా అయిపోతే మీరు ఉద్యోగం చేద్దురుగాని, అంతేగాని దండిగా సంపాయించి తర్వాత ఎవరికివ్వాలి చెప్పండి,’’ అంది.

నేనేమీ మాట్లాడలేదు. జరగాల్సింది జరుగుతుంది. అయినా ఎప్పుడూ నేను అనుకున్నట్టు ఏదీ జరగదు. మొదటినుంచీ యిదే తంతు. నా చేతిలో లేని దానిని గురించి నేనెందుకు ఆలోచించాలి? యశో ఈనాడు నన్ను వెంటబెట్టుకుని అస్పష్టమైన భవిష్యత్తులో అడుగుపెడుతూంది. సరే చూద్దాం. ఏమవుతుందో?

‘‘రణధీర్ కాస్త బండి ఆపు బాబుగారికి కాఫీ కాచిఇవ్వాలి,’’ అంది యశో.

రణధీర్ బండిని ఒక పెద్ద చెట్టు కింద ఆపాడు. యశో బండిలోంచి కావాల్సిన సరంజామా అంతా తీసింది. ఈలోగా రణధీర్ ఎండిన కర్రముక్కల్ని ఏరి తీసుకొచ్చాడు.

‘‘అయితే మనము ముస్సోరీకి తిన్నగా ఈ బండిమీదే వెళ్తున్నామా యశో?’’ కాఫీ కాస్తూంటే అడిగాను.

‘‘భలేప్రశ్న వేశారు. డెబ్బై మైళ్లు రెండెడ్ల బండిమీద వెళ్తున్నామనుకున్నారా? ఇక్కడ దగ్గరలోనే ఒక పెద్ద పల్లెవుంది. ఏ పల్లె రణధీర్? ’’ అంది నవ్వుతూ.

‘‘అయిదారు మైళ్లకంటె ఎక్కువ వుండదు చిన్నక్కా. భోజనం వేళకి ముందరే చేరుతాం,’’ అన్నాడు.

‘‘మంచిది, అయితే. మీరు అక్కడకాస్త ఎంగిలి పడవచ్చు,’’ అంది.

అంటే దాని అర్థం ఆ పూట యశో పస్తుంటున్నదన్నమాట. అలాంటి విషయాల్లో ఆమెతో వాదించటం అనవసరం. తమ్ముడికి, నాకు తను కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చింది, అవి తిని కాఫీ తాగి మళ్లీ ఎడ్లబండెక్కాము.

సరళను మళ్లీ కలుసుకోవాల్సి వస్తుందన్న ఆలోచనే నన్ను కలవరపరచసాగింది.

‘‘అయితే మనం ముస్సోరీలో ఎన్నాళ్లు వుండాల్సి వస్తుంది యశో,” అడిగాను.

“రెండు, మూడు రోజుల కంటె ఎక్కువ వుండనక్కరలేదనుకుంటా,’’ అంది.

“ఇంతకీ మనము ముస్సోరీలో ఎక్కడ వుందాము, సరళ ఇంట్లోనా?” అన్నాను

“అక్కడ కాకపోతే ఇంకెక్కడుంటాం? అయినా, వాళ్ళింటికి వెళ్లకపోతే సరళ ఇంకెప్పుడూ మన ముఖం కూడా చూడదు. రాజేంద్రకు కూడా చాలా కోపం వస్తుంది. అయినా వుండేది రెండు మూడు రోజులేకదా? ఆ తర్వాత ఏంచేయాలి అని నేను ఆలోచిస్తున్నాను. జీవితమంతా గూడులేని పక్షుల్లా తిరుగుతూ వుండలేం కాదా,’’ అంది.

వింటూ వూరుకున్నాను.

‘‘హే భగవాన్. సమస్యలేని వేళ నీ సృష్ఠిలోనే లేదా? అబ్బా, ఈ స్థితిలో ఎంత కాలం గడపాలో? ఎప్పటికయినా గమ్యస్థానం చేరుస్తావా!’’ మళ్లీ తనే అంది పరధ్యానంగా.

ఆ మాటలు విన్నాక నాకు ఎంతోబాధకలిగింది. ఇరువైమూడు వసంతాల అందమైన యువతి, అవివాహిత, అనాల్సిన మాటలా ఇవి? జీవితంలో ఎంత విరక్తి కలగిందీమెకు? మూడున్నర సంవత్సరాల క్రితం నేను మొదటిసారి ఈమెను కలుసుకున్నప్పుడు తనకు బరువూ, బాధ్యతా, బాధా అంటే తెలియవు. ఎప్పుడూ చిలిపిగా వేళాకోళం చేస్తూండేది. అరక్షణంలో మూడుసార్లు నవ్వేది. ఆమెకిప్పుడు చిరునవ్వే కరువైపోయింది. మందహాసమే మరుగైపోయింది. నేను ఎంతో శోచనీయమైన పరిస్థితిలో వున్నానని, నా కోసం సర్వస్వం త్యజించి, నాకు సర్వస్వాన్ని సమర్పించిన ఈమెకు వుండటానికి ఇల్లు అయినా చూపించలేక పోతూన్నాను. నాకు ఒక ఇల్లు వుంది, కానీ ఏం లాభం?

ఇంకా నేనేమీ మాట్లాడలేదు. రణధీర్ హుషారుగా బండితోలుతున్నాడు. యాజమానిలోని ఉత్సాహం ఎడ్లలో లేదు. కొరడా పడితె పరుగెడుతున్నాయి, లేకపోతే నీరసించి పోతున్నాయి.

‘‘ఇప్పుడు మనం తీర్థయాత్రలకి వెళితే బాగుంటుందనిపిస్తోంది. అంత దగ్గరున్నా రిషీకేశ్ నేనెప్పుడూ వెళ్లలేదు. ముందక్కడకెళ్లి, తరవాత హరిద్వార్, బృందావనం, ప్రయాగ వగైరా తిరిగి ఆఖరికి కాశీలో ఒక ఇల్లు కొనుక్కుని స్థిరపడదాం. ఏమంటారు?” అంది తను, మౌనాన్ని భంగం చేస్తూ.

‘‘సరే అమ్మీ, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. ఎక్కడికిపోయినా నన్ను నీతో తీసుకునిపో అంతే, ’’ అన్నాను.

మళ్లీ నిశ్వబ్దంలో మునిగిపోయాను. యశో బండిలోంచి బయటకు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచించి, ఒక గాఢ నిట్టూర్పు విడిచింది

‘‘నిన్న రాత్రి మీరు పడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా?’’ అని అడిగింది నాకేసి తలతిప్పి.

‘‘లేదు యశో. తెలుసుకుని మాత్రం చేసేదేముంది; కానీ నా భవిష్యత్తూ, నా సర్వస్వమూ ఒక తక్కెడలో వూగిసలాడాయని మాత్రం తెలుసు,’’ అన్నాను.

‘‘అయినా చెప్తాను. చెప్తే నా మనస్సు కాస్త తేటపడుతుంది. మీరు పడుకున్న తర్వాత నేను చాలాసేపు మేల్కొనే వున్నాను. మనస్సంతా వేదానాపూరితమై పోయింది. మరునాడు మీరు వెళ్లిపోతారని మాటి మాటికి జ్ఞ‌ప్తికి వచ్చింది. అలాంటి స్థితిలో వుండగా బయట నుంచి లఖియా పిలుపు వినబడింది. ఆ సమయంలో లఖియా నా పాలిటి దేవతలా వచ్చిందనిపించింది. బయటికి వెళ్లి తనతో అంతా చెప్పి, ‘మళ్లీ బాహ్యప్రపంచంలోకి వెళ్లడమంటే భయం వేస్తోందని ఇక్కడే నాకు నిశ్చింతగా వుందని’ అని, ‘నన్నేమి చేయమంటావు’ అని అడిగేను,’’ ఆపి, ఆమె మాటలు నన్ను బాధపెట్టేయేమో నన్నట్లు యశో నాకేసి చూసింది.

అప్పుడు, తను నన్ను ఆదరించిందన్న ఆనందంలో ఉన్న నన్ను ఆమె పాతసంశయాలు ఇబ్బందిపెట్టలేదు. అది గ్రహించి, యశో కధ కొనసాగించింది.

‘‘లఖియా అప్పుడు అంది, సుందరీ, ఇలాంటి పరిస్థితుల్లో ఫలితాలనీ, పరిస్థితులను పరిగణించకూడదు. ఎవరికి తెలుసు ఏ వస్తువు ఎంత విలువెంతో? కర్తవ్య పాలన తప్ప, ఇతర ప్రశంసా లేక స్వీయసుఖము సమస్తమూకాదు. ఇంకొకటి, ప్రపంచంలో నాఅనదగ్గవారు బహు కొద్దిమంది వున్నారు. సుందరీ నువ్వు ఎవరినైతే వదలుకోవటానికి సిద్ధపడుతున్నావో వారే నీకు కావలసినవారు, అని చెప్పి, ఎంతో చక్కగా, సున్నితంగా ప్రభోధం చేసింది. వెంటనే నిశ్చయించుకున్నాను. ఆ తర్వాత అక్కడ వుండ మనస్కరించలేదు. లఖియా నేను కలిసి సామానంతా సర్దాము. తలుచుకుంటూంటే భయం వేస్తుంది. లఖియా నాకు మార్గం చూపించకపోతే నేనే మిమ్మల్ని పోగొట్టుకునే దానిని కదా!’’ అని మనస్సులో మళ్లీ ఓసారి లఖియాకి నమస్కరించుకుంది.

“ఎక్కడకు పోతాను నేను అమ్మీ . తిరిగి మళ్లీ నీ వద్దకే వచ్చుండేవాడిని,’’ అన్నాను.

‘‘అయినా నేను మిమ్మల్ని విసర్జించడమయ్యుండేది కదా? అదెంత మహాపాతకం,?’’ అంది.

‘‘అయితే ప్రాయశ్చిత్తం చేసుకుంటావా?‘‘అన్నాను.

‘‘మీరు ఙ్ఞాపకం చేశారు. ఏమో చేసుకోవాలేమో. కాశీలో మళ్లీ చెయ్యండి,’’ యశో నవ్వింది.

‘‘అయితే ఈ సారి సలహా ఇవ్వడానికి గురువుగారు లేరుకదా?’’ అన్నాను నవ్వుతూ.

గురువుగారి పేరు విని యశో కాస్త సిగ్గుపడింది.

‘‘ఇప్పటినుంచి మీరున్నారు కదా. ఆయన బదులు అన్నీ మీరే,’’ అంది ప్రయత్నపూర్వకంగా నవ్వుతెచ్చుకుని.

రణధీర్ బండి ఆపాడు. మేము బస్సు ఎక్కాల్సిన బస్‍స్టాప్ వచ్చేసింది. బస్సుఎక్కి కూర్చున్నాము. బస్సులోంచి చేయిచాపి కొన్ని పదిరూపాయల నోట్లని యశో, రణధీర్ చేతిలో పెట్టింది.

‘‘ఇదేమిటి చిన్నక్కా?’’అన్నాడు రణధీర్, అతని ముఖమే చెప్తూంది దుఃఖం బలవంతాన్న ఆపుకుంటున్నాడని.

‘‘చిన్నక్క అభిలాష ఇది....అంతకంటే ఇంకేమీ కాదు. నన్ను మరచిపోవు కదూ,” యశో రణధీర్ గుప్పిటమూసి అంది.

ఇంక వాడి నిబ్బరం పటాపంచలైంది. కళ్లవెంట ఏకధారగా నీళ్లు కారసాగాయి.

‘‘ఛా నీ చిన్నక్క అత్తవారింటికి వెళ్తుంటే ఏడుస్తావేంటి. అయినా నీకు నేనొక్కత్తినే కాదు. నాకంటే ఇంకా నిన్ను ప్రేమించే పెద్దక్క వుంది. పెద్దక్కని సదా కనిపెట్టి వుండు,’’ అంది యశో,

‘‘నన్ను ఆశీర్వదించు చిన్నక్కా,’’ అన్నాడు అప్పటికి వాడి దుఃఖం ఆపుగుని కళ్ళుతుడుచుకుంటూ

‘‘ఎప్పుడూ స‌హృద‌యుడై సుఖంగా వుండు రణధీర్, భగవంతుడు ఎప్పుడూ నిన్ను కాపాడుతూంటాడు,’’ అంది యశో, చెమర్చిన కళ్లతో.

‘‘చిన్నక్కను మీరు తీసుకుపోతున్నారు. బాబూగారూ నా లోటుకూడా మీరే తీర్చండి,’’ అన్నాడు, వాడు నా చేయి పట్టుకుని.

‘‘నీ చిన్నక్క గురించి నీవేమీ దిగులు పడకు రణధీర్. ఆమె ఎక్కడున్నా సుఖంగా వుంటుంది,’’ అన్నాను నా చేయి బిగిస్తూ.

లఖియా నన్ను యశో చేతిలో పెట్టింది. రణధీర్ యశోని నా చేతిలో పెట్టాడు.

‘‘మీరు కూడా ఆశీర్వదించండి బాబుగారూ,’’ అన్నాడు.

‘‘నీ అక్కలిద్దరి ఆశీర్వాదబలం దైవం ఎల్లప్పుడు నీకు సమకూర్చు గాక, ’’ అన్నాను.

బస్సు కదిలింది.

‘‘వెళ్లివస్తాను తమ్ముడూ’’ అంది యశో.

అ జన ఘోషలో బహుశా ఆమె మాటలు వాడికి వినబడి వుండవు. కొంతదూరం పోయిన తర్వాత వెనుదిరిగి చూస్తే కళ్లు తుడుచుకుంటూ ఎడ్లబండి వైపు వెళ్తున్నాడు యశో తమ్ముడు.

జీవితంలో మనకు ఎంతో మంది తారసిల్లుతూ వుంటారు. కొద్దిమందితోనే మనం జీవిత బాటలో కలిసి ప్రయాణం చేస్తాము. కొంతమంది చాలాకాలం, చాలామందైతే స్వల్పకాలమే మనతో కలిసి వుంటారు. తర్వాత దారులు వేరవుతాయి. కాని మానవ ప్రాణం మాత్రం ఈ ప్రపంచంను విడనాడటానికి ఎంతో బాధపడుతుంది. విధిని ఎదిరిస్తూ, ఇంకా ఇక్కడే ఉండడానికి జీవి చివరి శ్వాస వరకూ ప్రాకులాడుతుంది. కాని మరణం తప్పదు, జాతస్య ధ్రువో మృత్యు. బాంధవ్యాలుకూడా జనన మరణాల్లాంటివే. ఈ పరమసత్యం తెలుసుకున్నవాడు బాధారాహితుడవుతాడు, లేనివాడు బాధాగ్రస్తుడవుతాడు. అదే తేడా!