Somayya Mawa in Telugu Social Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | సోమయ్య మావ

సోమయ్య మావ

మా వూరి మొదట్లో బస్సు ఆగింది. అందరం బస్సు దిగాం.
నేను, కవిత, పిల్లలు- అవినాష్, శిరీష.. అక్కడి నుండి కుడి వైపు అరకిలో మీటరు. ఊరి బాట వెంబడి నడిస్తే మా ఊరు వస్తుంది.
మా చిన్నప్పుడు బాటకు రెండు వైపులా పచ్చగా పొలాలు ఉండేవి. బాట వెంబడి నడుస్తుంటే పచ్చటి వరి
మొలకల వైపు నుండి వీచే ప్రాణ వాయువు చల్లగా సేద తీర్చేది. ఇప్పుడు ఊరు పెరిగింది. పచ్చదనం మాయమైంది.
ఎదురు పడ్డ ప్రతి వారూ ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆ స్నేహం లో, ఆత్మీయత లో కమ్మదనం మా నలుగురి నీ ప్రేమ తో కట్టి పడేసింది.
అమ్మ పలకరింపు లో ఆత్మీయత, మామయ్య చూపుల్లో ఆదరణ నన్ను పూర్తిగా 'రీ ఛార్జ్ ' చేశాయి. పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నమ్మ ను చుట్టేసి వూపిరి సలుపు
కోనివ్వటం లేదు . ఏడాది తర్వాత కలిసిన కూతుర్ని ప్రేమ గా దగ్గరకు తీసుకున్నాడు మామయ్య. తండ్రి ప్రేమ లో తలమునకలైంది కవిత.
నాది ఎమ్.టెక్ లో food processing and engineering.
ఓ మల్టీ నేషనల్ ఫుడ్ కంపెనీ లో R & D chief.. దేశం ఆర్థిక రాజధాని ముంబై లో ఖరీదైన , విలాసవంతమైన జీవితం.
చీకు, చింతా లేకుండా,. నల్లేరు మీద బండి లా రోజులు దొర్లి పోతున్నాయి. ...అయినా ఏదో వెలితి ! అంతే సులభంగా సమాధానాలు దొరకని ప్రశ్నలు అప్పుడప్పుడూ సూదుల్లా
గుచ్చుతుంటాయి.
వసారా లోకి వచ్చాను. ఆ పెంకుటింటి వసారా కు
మెట్లకు రెండు వైపులా చెరి మూడు గుంజల తో అరుగులు.
మా నాన్న తగిన భూ వసతి ఉన్న మధ్య తరగతి రైతు.
డిగ్రీ వరకు చదివాడు. వ్యవసాయం వ్రృత్తి. విలేజ్ పోస్ట్ మాస్టర్ గిరి ఆయన ఇష్టపడి తీసుకున్న బాధ్యత. సంఘ
హితమే తన హితమన్న ఆదర్శాన్ని అక్షరాల పాటించిన వాడు . ఆ వారసత్వమే నాకూ సంక్రమించింది. నాన్న చనిపోయిన రోజు చివరి చూపు కోసం తీర్థప్రజ లా వచ్చిన జనాన్ని చూసి తెల్లబోయాను. అప్పుడు పూర్తి గా తెలిసింది
మా నాన్న అందరికీ ఎంత ఆప్తుడో !
వసారా దంతెకు వేలాడదీసిన వారి కంకులకు కిచకిచ మంటూ పోటీపడుతున్న పిచ్చుకల అల్లరి తో ఈ లోకం లోకి వచ్చాను. మళ్ళీ క్షణాల్లో నే గతం లోకి జారిపోయాను.

వసారా కు కుడివైపు అరుగే. నాన్న పోస్టాఫీసు. కుర్చీ, బల్ల, పెద్ద భోషాణం , చిన్న పెట్టె ---- ఇదే ఆఫీస్ సామగ్రి.
ఉదయం తొమ్మిదింటికి తెరచిన పోస్టాఫీసు పన్నెండింటి వరకు సాగేది. రెండు అరుగుల మీద జనం చేరేవారు. పెద్ద వాళ్ళు పీల్చే చుట్టల వాసన తో ఆ వసారా గుప్పు మనేది.
పిచ్చా పాటి కబుర్ల తో కొందరు, ఊరి సమస్య ల తో కొందరు, రాజకీయాల తో మరికొందరు...... మూడు గంటల సేపు కోలాహలం.కలకలం ! అక్కడ కూర్చున్న దాదాపు అందరికీ
వారి వాదోపవాదాలకు ముక్తాయింపు గా నాన్న సలహా,
అభిప్రాయం -- ఏదో ఒకటి కావాలి." పంతులు గారు ! మీరు
చెప్పండి. '" అంటూ నాన్నను చూసేవారు. చేసే పని ఆపకుండా, ఎవరినీ నొప్పించని రీతిలో నాన్న మాట్లాడే వాడు. ఈ సౌమ్యత, సంస్కారం వల్లే ఊరి వాళ్ళకు నాన్న
ఆత్మబంధువు అయ్యాడు.
దసరా సెలవులు వస్తే చాలు నా మకాం అరుగు మీదనే.
నాన్న పిలుపు కోసం ఊపిరి బిగబట్టి చూసేవాడిని. ఆ రోజు ఉత్తరాలను 'బొత్తి' గా పేర్చి , సూర్యం అని పిలిచే వాడు.
ఒక్క గెంతు లో ఆయన ముందు నిలుచునే వాడిని.ప్రతి
ఉత్తరం పై డేట్ స్టాంప్ కొట్టడం నాకు బలే సరదా ! నాన్న పోయాక పోస్టాఫీసు చేతులు మారింది. అన్నయ్య స్కూల్ టీచర్.... లేకుంటే ఆ బాధ్యత తను తీసుకునే వాడు.
కుడివైపు గుంజను ఆనుకుని కూర్చున్నాను. ఇప్పుడా
కోలాహలం లేదు....కలకలం లేదు. నాన్న చిరునవ్వు లు లేవు. అంతటా నిశ్శబ్దం. చెదిరిన కల. గుండె బరువు తో అడుగు లో అడుగు వేసుకుంటూ ఇంట్లో కి వెళ్ళాను.
అమ్మ చేతి భోజనం..నవారు మంచం పై నిద్ర . పైగా ప్రయాణపు బడలిక--- నేను లేచేసరికి గోధూళి వేళ కూడా దాటింది. ఉలిక్కిపడి లేచాను. చకచకా తయారై , వేడి వేడి
కాఫీ ఆరగించి రచ్చబండ చేరుకున్నాను. నన్ను చూడగానే నా మిత్ర బృందం లో సభ్యులు చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. ప్రతి సంక్రాంతికి మా ఊరు రావటం, పది రోజుల పాటు సరదాగా గడపటం నాకు ఆనవాయితీ. ఇందు కోసం నా శెలవులు పొదుపు గా వాడుకుంటాను.
రచ్చబండ మీద అందరూ నా చుట్టూ చేరారు. చిన్న నాటి చెలిమి లోని ఆత్మీయత నన్ను పొగమంచు లా ఉక్కిరిబిక్కిరి చేసింది. పలుకరింపులు, హాస్యాల చిరుజల్లులు, విసుర్లు, రచ్చబండ హోరెత్తి పోయింది. అక్కడే
కూర్చున్న పెద్ద తరం వారు మమ్మల్ని వినోదం గా చూడసాగారు.
రచ్చబండ మీద కూర్చోగానే నాకు మొదట గుర్తు వచ్చేది
" సోమయ్య మావ " మా తరువాతి తరం వారికి " !
సోమయ్య తాత" !
నా చిన్నప్పుడు సాయంకాలం కాగానే మాలో పదేళ్ల లోపు వారందరు రచ్చబండ పైకి చేరే వాళ్ళం. బుద్ధి గా వరుసల్లో పద్మాసనం వేసుకుని కూర్చునే వాళ్ళం. సోమయ్య మావ నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేవాడు.

నాలుగు పదులు దాటుతున్నా, పిసరంతైనా సడలని ఉక్కు లాంటి శరీరం. ఎప్పుడూ తృప్తి గా ఉత్సాహంగా ఉండే వాడు. తలపై పాగ, మల్లు బనీను, మోకాళ్ళ పైకి ధోవతి, కోర్ మీసం, చురుకైన చూపులు, పెదవులపై చిరునవ్వు లు మెరుపులు----- మనసున్న రైతు సోదరుడు.
సోమయ్య మావ మా ఊరికి పరోపకారి పాపన్న.ఎప్పుడు
ఏం అసందర్భం జరిగినా, అపశ్రుతి వినిపించినా, అందరి
కన్నా ముందు తాను హాజరయ్యే వాడు. చేతనైన సాయం చేసే వాడు . ఆయన లో ఏ రైతు లో లేని మరో ప్రత్యేకత వుంది. అపారమైన వినికిడి జ్ఞానం , అసాధారణ మైన ధారణా శక్తి, జ్ఞాపక శక్తి--- త్రివేణీ సంగమం లాంటి ఈ మూడు గుణాలు ఆయనను విశిష్ట వ్యక్తి గా మలిచాయి.
ఎలాగో మన ప్రాచీన పురాణాల పై పట్టు సాధించాడు.మంచి
వాచకం, స్వరం, కధనకౌశలం ఏ పూర్వ జన్మ సుకృతి వల్లో
అలవడినాయి.
రచ్చబండ పై చేరిన మా ముందు నిలుచుని, మహా భారత, రామాయణాలు రసవత్తరంగా వినిపించేవాడు. చక్కటి, చిక్కటి తెలుగు లో సాగే ఆయన కథనం లో మెరుపుల్లా అప్పుడప్పుడు గ్రామీణ భాష తళుకు మనేది.
కథను నడిపించే తీరులో నాటికి శైలి , పాత్ర కు తగ్గట్లు స్వరం లో మార్పు---- మా ముందు మాయాబజార్, సంపూర్ణ రామాయణం సజీవంగా కనిపించేవి. ఆయన సంకల్పానికి పెద్దల ఆశీస్సులు, సహకారం తోడు కావటం మరో ప్లస్ పాయింట్ ! మంచి మంచి కథలతో, వినోదం పంచుతూ, మాలో దయ సానుభూతి, పరోపకారం, సత్యం,సహనం
లాంటివి పెంచటం ఆయన సంకల్పం.
నిరుడు సంక్రాంతికి సోమయ్య మావ పుట్టెడు దుఃఖంతో కుమిలి పోవటం చూశాను. ఒక్క గానొక్క కొడుకు చనిపోవటం మావకు కోలుకోలేని దెబ్బ.ఆయన ఖర్మ కాలి
వాడు తాగుబోతు, తిరుగుబోతు అయినాడు. ఎంత మొత్తుకున్నా వాడు మారలేదు. లివర్ పాడై మంచానికి అంటుకు పోయాడు. వాడిని ఎలాగైనా బ్రతికించుకోవాలని
స్థాయికి మించి వేలు ఖర్చు చేశాడు . అప్పు కొండలా పెరిగింది. వాడు మాత్రం దక్కలేదు. ఏడు పదుల వయసులో జరాభారం, ఋణభారం తో మావ వంగి పోయాడు. బొట్టు చెదిరిన కోడలు, గట్టిగా రెండు పదులైనా నిండని మనవడు మిగిలారు .తను దాటుకుంటే వాళ్ళకు దిక్కెవరు అన్న బాధ మావ మాటల్లో ధ్వనించింది.
ఆయన పరిస్థితి చూసి గుండె కలుక్కు మంది. పై ఖర్చుకు
వుంటుందని పదివేలు ఇవ్వ బోయాను.ఆత్మాభిమానం తో మావ నా సాయం అంగీకరించలేదు.
నర్సిరెడ్డి కి ఇదే అవకాశం అనిపించింది. మావ రెండెకరాలు కూడా కలుపుకుంటే బంగారం పండే ఆరెకరాల కయ్య సొంత మవుతుంది. మావ అప్పు తీర్చలేడని తెలిసి ఒత్తిడి చేసాడు.
పొలం వదులు కోలేక మావ వాడింటికి వెళ్ళి కాళ్ళావేళ్ళా పడ్డాడు. మనవడు, కోడలు దిక్కు లేని వారవుతారని దీనంగా వేడుకున్నాడు.ఆ బండి కరగలేదు. పైగా వయసులో వున్న ఆయన కోడలి గురించి వంకరగా మాట్లాడాడు. మావ
నిస్సహాయ త వాడికి అలుసుగా అనిపించింది. వాడి నోటి
పొగరుతో మావ ఉగ్రుడై పోయాడు. శివతాండవం చేశాడు.
వాడిది అస్సలు ఊహించలేదు. బెంబేలెత్తి పోయాడు.
ఇంట్లో, ఇంటి బయట పరువు పోయింది.అవమానంతో వెధవ ఇంతవరకు వీధి మొహం చూడలేదు.
నర్సిరెడ్డి ఇంటి ముందు వీరంగం చేసి మావ అదే వెర్రి ఆవేశం తో రచ్చబండ చేరాడు. క్షణాల్లో జరిగిన ఘోరం ఊరికంతా తెలిసిపోయింది. అందరం రచ్చబండ చుట్టూ చేరాం. సర్ది చెప్ప బోయాం.వినిపించుకునే స్థితిలో లేడు.
ఏదేదో అంటాడు, చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. పూర్తిగా "హిస్టీరిక్ అయిపోయాడు. మనవడు, కోడలు బ్రతిమిలాడినా
లాభం లేకపోయింది. తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ,
తత్త్వాలు పాడుకుంటూ చాలా సేపు గడిపాడు.ఆయన మనవడు, కోడలు, మాలో కొందరు ఆయనకు కాపలాగా ఉన్నాం. ఆయన నెమ్మదిగా నిద్ర లో కి జారుకున్నాక మాకూ
మైకం కమ్మింది. తెల్లారి లేచి చూస్తే మనిషి లో చలనం లేదు
నిద్ర లోనే ప్రాణం పోయింది. పుణ్యాత్ముడు.!" భారంగా నిట్టూర్చాడు శ్రీహరి. కాసేపు మా మధ్య మాటలు కరువైనాయి.

" రోజూ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి.ఒకరో, ఇద్దరో రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు కూడా.వారి చావులు సర్వసాధారణం అయిపోయాయి.మావది మామూలు చావు కాదు. ఆత్మహత్య కాదు.హత్య.. మావి భద్రత,భరోసా లేని జీవితాలు. గిట్టుబాటు ధర నిర్ణయించక
ప్రభుత్వాలు, వరదలు- కరువు -కాటకాలతో ప్రకృతి, మార్కెట్ పై పెత్తనం చెలాయించే దళారులు, మిల్లు యజమానులు, నకిలీ విత్తనాలు, మండే ధరలతో ఎరువులు ------- ఇలా అన్ని దారులు మూసుకుపోతే, రైతుకు చావు
తప్ప వేరే దిక్కేది ? చనిపోయాక కంటితుడుపు పరిహారాలతో ఒరిగేదేమీ లేదు. మాపై సానుభూతి జల్లులు
కురిపించి, ఆశల పల్లకి ఎక్కించి,. ఇంట్లో తంతు ముగిశాక
మొహం చాటేయటం నేతలకు పరిపాటే." ప్రకాష్ మాటల్లో రైతుల ఆక్రందన వినిపించింది
ఏదో సినిమాలో ఓ యువ హీరో చెప్పి నట్లు రైతు కు కావాల్సింది సానుభూతి కాదు.----సాయం.
టైమ్లీ హెల్ప్. ! మంచి మాటల తో వెన్ను తట్టి ముందుకు నడిపించే నాయకత్వం... మార్కెట్లో మారుతున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోలేక, ఏ పంట ఏ సీజన్ లో వేయాలో తెలీక,మూస పోసినట్టు పాత పద్ధతులే పాటిస్తూ,పంటనే నమ్ముకుని పాడిని వదిలేసి రైతు కుంగిపోతున్నాడు. ఇప్పటి పరిస్థితుల్లో రైతు ను ఆదుకునేవాడు సాటి రైతే. సహకార సంస్థ లను నిర్లక్ష్యం చేసి ప్రభుత్వాలు రైతు వెన్ను విరుస్తున్నాయి. చేతికి మరో చెయ్యే ఆసరా ! చేయి చేయి కలుపుకుంటూ పోతే మానవహారం ఏర్పడి నట్లు రైతులందరం కలిస్తే సమస్యలను అవలీలగా దాటవచ్చు. కాని మా అలోచనలు మాటలకే పరిమితమై పోతున్నాయి. మాలో ఎవరూ ముందుకు రాలేక పోతున్నాం. మాకు ఏ విషయంలోనూ పూర్తి అవగాహన లేదు. ధైర్యం చేసి ఏమీ ఆనలేక పోతున్నాం...." గిరీష్ మాటల్లో నిరాశ, నిస్పృహ .అంతే చలి లోనూ వాతావరణం వేడెక్కింది. భారంగా అందరం కదిలాం.
నాలుగు అడుగులు వేసిన శ్రీహరి మళ్ళీ నా దగ్గర కొచ్చాడు.
నేను వాడిని ప్రశ్నార్థకంగా చూశాను.
ఏదో చెప్పాలని వాడి ఆరాటం. మరెందుకో తటాపటాయిస్తున్నాడు.' చెప్పరా' అన్నాను.వాడేం చెప్పలేదు.' మళ్ళీ చెబుతానులే' అంటూ వెళ్లి పోయాడు. వాడు చెప్ప దలచుకున్న దేమిటో నాకు అర్థమైంది.

ఇంటికి వెళ్ళాక మావయ్య ను అడిగాను.
" సోమయ్య మావ చనిపోయినట్లు నాకెందుకు చెప్పలేదు ?"
" ఇంటికి రాగానే చావు కబురు చెప్పటం ఎందుకని ఆగానురా ! అయినా ఆయన చావు ఘోరమైంది. నర్సిరెడ్డి మాటలే ఆయన ఉసురు తీశాయి. పది రోజుల క్రితం రచ్చబండ మీద అందరూ సమావేశం అయ్యాం. నర్సిరెడ్డి కబంధ హస్తాల నుండి ఆయన పొలాన్ని విడిపించాలి .
నేనొక ఉపాయం చెప్పాను. అందరం తలా కాస్తా వేసుకొని
తాకట్టు లోని పొలాన్ని విడిపించాలి. తాకట్టు కు పోను మిగిలిన సొమ్మును సోమయ్య కుటుంబానికి అంది జేయాలి.
అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు . ఊర్లో చందాలు పోగెయ్యటం , దానికి సంబంధించిన లెక్కా-పక్కా , నర్సిరెడ్డి తో రాయబారం --- అన్నీ నాకే అప్పజెప్పారు . ఈ బడిపంతులు మీద ఇంత భారం మోపారంటే అది వాళ్ళ మంచితనం. నా మీద వారికున్న నమ్మకం. చందా వసూలు ఓ యజ్నం లా సాగింది. అనుకున్న దానికంటే పదింతలు వ‌సూలైంది. సోమయ్య ను ఈ ఊరి వారు మరిచిపోరు. మరిచి పోలేరు. కనుమ మర్నాడే రచ్చబండ మీద అందరం సమావేశం అవుతాం. బాకీ కి పోను మిగిలిన సొమ్మును
బ్యాంకు లో సోమయ్య కోడలి పేర జిమ్ చేశాం. ఆ రోజు ఆవిడ కు అందరి సమక్షంలో పొలం దస్తావేజు , పాస్ బుక్ అందజేస్తాం. "
మామయ్య మాటలతో నా మనసు కాస్త స్థిమిత పడింది.
ఆ రోజు రాత్రి నాకు నిద్ర కరువైంది. కళ్ళు మూసినా, తెరిచినా
సోమయ్య మావే కనిపిస్తున్నాడు . గిరీష్ మాటల్లో ధ్వనించిన
నిరాశ, నిస్పృహ లు నాలో ఆత్మవిమర్శ కు కారణం అయినాయి. ఏవేవో ఆలోచనలు, వాటి వెంటే నీడలా కొన్ని
సందేహాలు---పడక కుదరక కునుకు రాక అటూఇటూ పొర్లు
తున్నాను.
" నిద్ర పట్టడం లేదా ?" మెల్లని స్వరం లో పలుకరించిన కవిత
నా పక్కన మంచం మీద కూర్చుని ప్రేమగా తల నిమిరింది.
లేచి కూర్చున్నాను.
" సోమయ్య మావ జాలి కథ అత్తయ్య చెప్పింది.న్యాయంగా ఆయనకు రావాల్సిన పరిస్థితి కాదిది."
ఆ వూళ్ళోనే పుట్టి పెరిగిన కవిత కు సోమయ్య మావ గురించి పూర్తి అవగాహన ఉంది."
" మావయ్య కృషి తో ఆయన కుటుంబం గట్టున పడబోతోంది." నా మాటలకు కవిత మొహంలో ప్రసన్నత.
పెదవులపై చిరునవ్వు. పుచ్చపువ్వు లాంటి వెన్నెల లో మెరిసే శాంతి గోదావరి లా కనిపించింది కవిత.
" నిన్ను ఎంత గానో వేధిస్తున్న ప్రశ్న లకు సమాధానాలు దొరికాయా "? కవిత పెదవులపై చిరునవ్వు. నేను అర్థం కానట్లు చూశాను.

" నేను దాదాపు ఆరు గంటల నుంచి నిన్ను గమనిస్తున్నాను.
మునుపటి లా ఉత్సాహంగా లేవు. పరధ్యానం, పరాకు !
నిమిషం వ్యవధి దొరికినా చాలు. సోఫా లో జారగిలబడి
ఆలోచన ల్లో కూరుకు పోతున్నావు. నేనో విషయం చెప్పనా ? నా పరిస్దితి దాదాపు ఇంతే. ఆ మహానగరంలో ఉరుకుల పరుగుల జీవితంతో విసిగి పోయాం . అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకు అంతగా అనిపించక పోవచ్చు. వారెలాగో అడ్జస్ట్ అయిపోతారు. మన పరిస్థితి వేరు. పుట్టి పెరిగింది ప్రశాంత మైన పల్లెటూర్లో. మట్టి వాసనే తగలని జనారణ్యంలో ఎంత కాలం ఉండగలం ? " అర్థోక్తి తో ఆగింది.
" తప్పదు--బ్రతుకు దెరువు కోసం వచ్చాం.దీన్ని వదులుకొని ఎక్కడికి వెళ్ళగలం ? ఒక స్థాయి జీవితం, సౌకర్యాలు, పిల్లల చదువులు."
" నన్ను టెస్ట్ చేయాలని ఈ ప్రశ్న వేస్తున్నావా లేక ........
సందేహం గా చూసింది.
" అలాంటిదేమీ లేదు --- సిన్సియర్ గానే అడుగు తున్నాను."
" ఓకే. అక్కడే కంటిన్యూ చేద్దామా ? ఇకపై ఏం ఆలోచన
లేకుండా ప్రశాంతంగా వుండగలవా ? "
ఆ ప్రశ్న కు నా సమాధానం లేదు.
" అందుకే చెబుతున్నా ను. మన వూరికి వస్తాం. మన
వారికి ఆసరాగా నిలుస్తాం. నీకు మంచి చదువు ఉంది.ఆలోచనలు ఉన్నాయి. ఫుడ్ టెక్నాలజీ లో ఎక్స్ పోర్ట్ వి. సేంద్రియ వ్యవసాయం పై చక్కటి అవగాహన ఉంది. మా
నాన్న అయిదెకరాలు, మామయ్య పదెకరాలు చాలు. ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది.
నా పై నాకు నమ్మకం ఉంది. ఇద్దరం కలిస్తే అనుకున్నది సాధించగలం . పిల్లల బాధ్యత పూర్తిగా నాది....నేను వెంటనే అవుననలేదు.
ఆ మహానగరంలో పదేళ్ళు మనకోసం బ్రతికాం. రేపటి నుంచి పదిమంది కోసం బ్రతుకు దాం. ! " చివరి మాట నాపై
తారకమంత్రం లా పనిచేసింది. కదలిక వచ్చింది. కవిత
భుజం పై చేయి వేసి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాను.
మా మాటలు అమ్మ చెవులను సోకాయేమో ఆమె లో చిరు కదలిక గమనించాను .
కనుమ వెళ్ళిన మర్నాడు రచ్చబండ చుట్టూ అందరం సమావేశమయ్యాము . రచ్చబండ పైన కుర్చీలలో ఊరి పెద్దలు, మామయ్య. మామయ్య లేచి నిలుచుని గొంతు సవరించుకున్నాడు.
" సోమయ్య మనకందరికీ ఆప్తుడు. ఆయన అకాల మరణం ఆయన కుటుంబానికే కాదు , మనకూ బాధాకరమైన విషయం. అలాంటి ఆత్మీయుడి కుటుంబాన్ని ఆదుకోవటం మన అందరి విధి. అందరూ నిర్ణయించి నట్లే
చందాలు వసూలు చేశాం. ఎవరూ ఊహించని రీతిలో పెద్ద మొత్తం వసూలు అయింది. ఆయన పై మనందరికీ ఎంత అభిమానం ఉందో ఈ సంఘటన తో ఋజువైంది. ముందు ముందు ఎవరికి ఏ కష్టం వచ్చినా ్్లా్్్్లకలిసికట్టుగా అడుగు ముందుకు వేస్తే ఊరు పచ్చగా ఉంటుంది.
కేవలం సర్కారు సాయం కోసం ఎదురు చూడటం మన సమస్యల కు పరిష్కారం కాదు. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా యువతరం. ఇప్పుడు మనం సర్పంచ్ గారి చేతుల మీదుగా పార్వతమ్మ గారు పాస్ బుక్ అందుకుంటారు. నర్సిరెడ్డి గారి బాకీ తీర్చాం.
భూమి దస్తావేజు కూడా వారి చేతుల మీదుగా నే ఆమె అందుకుంటారు."

సోమయ్య మావ కోడలు పార్వతమ్మ రచ్చబండ మీద
కు వచ్చింది. సర్పంచ్ బ్యాంకు పాస్ బుక్, దస్తావేజు ఆమె చేతిలో పెట్టాడు.ఆమె సర్పంచ్ కు నమస్కరించింది ... మావైపు తిరిగి చేతులెత్తి మా అందరికీ నమస్కరించింది.
అప్పుడే ఓ అద్భుతం జరిగింద. ! నర్సిరెడ్డి రచ్చబండ పైకి వచ్చాడు. తన చేతిలోని నోట్ల కట్టను పార్వతమ్మ కు ఇచ్చి ఆమెకు, ఊరి పెద్దలకు , గ్రామ పెద్ద కు నమస్కరించి కళ్ళు తుడుచుకుంటూ వెళ్లి పోయాడు. క్షణం నిశ్శబ్దం. మరు క్షణం గ్రామ సభ చప్పట్ల తో, కుర్ర కారు ఈలల తో దద్ద లిల్లి పోయింది.

మా ఊరి చరిత్ర లో ఇదో మరపురాని రోజు ! నిలుచున్న
వారిలో ముందు వైపు ఉన్న కవిత నన్ను చూసింది. ఆ చూపులో భావం అర్థమైంది. రచ్చబండ పైకి వెళ్ళాను.
మావయ్య కుతూహలం గా చూశాడు.
" సభకు , సభలో పెద్దలకు నమస్కారం ! నా మనసులో మాట చెప్పటానికి ఇంతకు మించిన సందర్భం దొరకదు . నేను ఊర్లోనే ఉండిపోవాలనుకున్నాను. నా జాబ్ కు రిజైన్ చేస్తున్నాను . వ్యవసాయం చేస్తాను . " క్షణం ఆపాను . మళ్ళీ చప్పట్ల జడి. నా మిత్ర బ్రృందం కేరింతలు, ఈలలు.
" నేనూ రైతు బిడ్డ ను. మట్టి వాసన తెలుసు. మట్టి నే
నమ్ముకున్న మా నాన్న ఆదర్శం నాకు వేదం. ఆయన పడ్డ కష్టం- నష్టం కళ్ళార చూశాను . సాధక బాధకాలు చూశాను.. ఫుడ్ టెక్నాలజీ లో ఎం.టెక్ చేశాను . సేంద్రియ వ్యవసాయం లో మెళకువలు తెలుసు . లోటుపాట్లు తెలుసు. నేను
కేవలం నా కోసం ఈ నిర్ణయం తీసుకోలేదు. నిన్న గిరీష్ ఒక్కమాట అన్నాడు. ప్రభుత్వాలు సహకార సంస్థ లను నిర్లక్ష్యం చేసి రైతు వెన్ను విరుస్తున్నాయని ...... ఇప్పుడున్న
పరిస్థితుల్లో సహకార సంస్థ లే మన సమస్యల కు సరైన సమాధానాలు. అందరం కలిసి ఒక రిజీస్టర్డ్ సొసైటీ ఏర్పరచుకుందాం. కేవలం రైతులే కాదు. మనమందరం సభ్యులం. కామన్ ఫండ్ తో మన అవసరాలు తీర్చుకుందాం.
టెక్నాలజీ ఉపయోగించుకుందాం . ప్రజలకు ఏది ఎప్పుడు అవసరమో ఆ పంటలే పండిద్దాం. మార్కెట్ వ్యవస్థ ను మనమే స్రృష్టించుకుందాం. వినియోగదారుల తో నేరుగా కనెక్ట్ అవుదాం. బ్యాంకు ఋణాల కోసం ఒంటరి పోరు, పడిగాపులు ఇక పై ఉండవు. పురుగు మందు డబ్బా, ఊరి బయట వేపచెట్టు అవసరం కూడా ఉండదు. సోమయ్య మావ సాక్షి గా మన సహకార సంస్థ కు నా సహకారం లక్ష . " మళ్ళీ సభకు
నమస్కరించాను. ముచ్చటగా మూడోసారి కరతాళ ధ్వనులు.
మావయ్య మొహం పద్మంలా విప్పారింది. ఊరి పెద్ద ల
చూపుల్లో క్రృతజ్నతా భావం , అమ్మ కళ్ళలో అనురాగపు
జ్యోతులు. కవిత ' థమ్సప్ ' అని సంకేతమిచ్చింది. శిరీష, అవినాష్ కేరింతలు. శ్రీహరి ని చూశాను. త్రృప్తి గా నవ్వాడు. వాడు అడగాలన్న ప్రశ్న కు సమాధానం లభించింది
" ఒక్క మాట ! " లేవబోతున్న వారు క్షణం ఆగారు.
" మన ప్రయత్నాలకు, క్రృషి కి సోమయ్య మావ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ". చేతులు జోడించి పైకి చూశాను.
నీలి సంద్రం లాంటి ఆకాశం లో విరాట్ మూర్తి లా చిరునవ్వు లతో సోమయ్య మావ మెరిశాడు.

******"** లక్కవరం.. శ్రీనివాసరావు ( ల.శ్రీ )

Rate & Review

hemanth

hemanth 10 months ago

LRKS.Srinivasa Rao

LRKS.Srinivasa Rao Matrubharti Verified 10 months ago

Responsibility of youngsters to support and save agriculture and it's dependents ,leading to the strengthening of the nation.