Those three - 14 books and stories free download online pdf in Telugu

ఆ ముగ్గురు - 14 - లక్కవరం శ్రీనివాసరావు

కాలేజి ఓపెన్ ఆడిటోరియం లో ఫ్రెషర్స్ డే జరుగుతున్నది.
ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ, కొంతమంది సీనియర్స్, ధైర్యం కూడగట్టుకుని కొంతమంది జూనియర్స్ మాట్లాడారు . ఇదిలా ఒక్కసారి గా అభిప్రాయాలు, అభిరుచులు పంచుకోవటంతో కొత్తవారిలో కాస్త బెరుకు తగ్గింది . సంకోచం లేకుండా సీనియర్స్ తో కలిసిపోయారు .
చివరి ఐటమ్ డిన్నర్. చేతిలో ప్లేట్స్ తో గ్రూపు లుగా నిలబడి మాట్లాడుకుంటూ తింటున్నారు . ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ మూలకు చేరారు . వారికి కావలసినవి కాలేజీ అటెండెర్స్ సర్వ్ చేస్తున్నారు . వారిలో ఒకరు ఆదిత్య దృష్టి ని ఆకర్షించారు . క్షణం ఒక్కచోట నిలబడకుండా సుడిగాలిలా తిరుగుతున్నాడు . కాసేపు స్టాఫ్ దగ్గర ఉంటాడు . కాసేపు స్టూడెంట్ గ్రూపు ల మధ్య తిరుగుతూ సర్వ్ చేస్తున్నాడు . మాటల చురకలతో, టైమ్లీ జోక్స్ తో అందరినీ నవ్విస్తూ చాలా డైనమిక్ గా కనిపించాడు .
మెహర్ ఒంటరిగా ఓ మూల నిలుచుని తింటోంది . ప్లేటుతో ఆమె దగ్గరకు వచ్చాడు ఆదిత్య .
" ఎవరితను మెహర్ గారూ ? చాలా డైనమిక్ గా కనిపిస్తున్నాడు . ఆదిత్య చూపిన వ్యక్తి ని చూసి మెహర్ నవ్వింది .
"అతడా ? యాదగిరి . హాస్టల్ బాయ్. చాలా హుషారు. పని చేయటంలో చాలా చురుకు . పని దొంగ కాదు . పైగా మాటకారి . మాటల గారడీ తో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలడు .
యాదగిరి మెహర్ దగ్గరకు వచ్చాడు .
" మేడం ! ఏం కావాలి ? సార్ ! మీకు ?"
" మాకు నువ్వే కావాలి ."
ఆదిత్య ను అర్థం కానట్లు చూశాడు యాదగిరి.
" నీతో కాసేపు గలగల మాట్లాడాలి ."
ఆదిత్య మాటలకు నవ్వాడు యాదగిరి.
" నేనొక వాగుడు కాయనని మేడం చెప్పారా సార్ ."
ఆదిత్య చిరునవ్వు నవ్వాడు .
" మేడం చెప్పక ముందే నువ్వో సరదా మనిషి వని నిన్ను చూస్తేనే అర్థమైంది. నిన్ను చూస్తే నే అర్థమైంది. "
" సార్ ! వీలు చూసుకుని అతి త్వరలో మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తాను . " తనూ నవ్వాడు యాదగిరి .
" మీరొచ్చి పది రోజులైనా కాలేదు . స్టూడెంట్స్ సర్కిల్ లోహాట్ టాపిక్ అయ్యారు . " అంది మెహర్ బాదుషా కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ .
" క్లాస్ రూమ్స్ లైవ్లీ గా ఉంటే స్టూడెంట్స్ మన మాట వింటారు . వారు కోరుకున్నట్లే నా బిహేవియర్ ఉండేసరికి
వారికి నేను దగ్గర అయ్యాను . మా మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ ఫ్రిడ్జ్ నేను చెప్పేది ఏదైనా వారు వినేలా చేయగలిగింది . "
ఆదిత్య ను మెచ్చుకుంటున్నట్లుగా చూసింది మెహర్ .
" నిజంగా ఒక టీచర్ కు ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం ఇది . మాలో మీకున్నంత స్పార్క్ లేదు . అందుకే మా క్లాసులు రొటీన్ గా సాగిపోతుంటాయి . "
" మిగతా స్టాఫ్ విషయం నా కంతగా తెలీదు . కాని మీ గురించి స్టూడెంట్స్ చాలా పాజిటివ్ గా మాట్లాడుతుంటారు . ముఖ్యంగా మీరు పొయట్రీ చెప్పే పద్ధతి వారికి బాగా నచ్చింది . చాలా ఎమోషనల్ గా ప్రతి భావాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారట . "
మెహర్ బిడియంగా నవ్వింది . తన గురించి తనకు నచ్చిన వ్యక్తి గొప్పగా చెప్పటం ఆమె కెంతో థ్రిల్లింగ్ గా ఉంది .
" ధ్యాంక్స్ . మీకు ...మన స్టూడెంట్స్ కు కూడా "
" ఒక టీచర్ కు ఇంతకన్నా గొప్ప అవార్డు ఏముంటుంది ?
విద్యార్థుల మనసుల్లో స్థానం సంపాదించుకోవటం ఓ వరం .
ఈ తృప్తి మీరే ప్రొఫెషన్ లోను ఈ స్థాయిలో ఉండదు . అందుకే ప్రాజెక్టు హెడ్ పోస్ట్ వదులుకొని జీతం తక్కువైనా ఈ కాలేజీ లో చేరాను . " ఆశ్చర్యం గా చూసింది మెహర్ .
" అందరూ పైసా కోసం ఎగబడుతుంటే మీరేమిటి జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలంటున్నారు "
" ఎవరి పిచ్చి వారికానందం . ఎవరేం చేసినా ఆనందం కోసమే గా ? నేను కోరుకున్న నిజమైన ఆనందం చూడగలిగాను ." మళ్ళీ ఆదిత్య పెదవులపై సమ్మోహన మందహాసం . అతడి సహజమైన చిరునవ్వు మెహర్ కు చాలా ఇష్టం . ఏదైనా వివరించిన తర్వాత ముక్తాయింపు గా ఆదిత్య చిరునవ్వు నవ్వుతాడు .
చిరునవ్వు తో కట్టిపడేసే మగాడికి ఏ యువతైనా ఇట్టే పడిపోతుంది .
ఆ భావన ఆకర్షణ కావచ్చు . ఆరాధన కావచ్చు . మెహర్ ది మాత్రం ఆరాధనే . ఆకర్షణ కు లోనయ్యే కుటుంబ నేపధ్యం కాదు మెహర్ ది . తండ్రి లేడు . తల్లి సాదాసీదా గృహిణి .
కట్టుబాట్ల తో గుట్టుగా బ్రతుకు వెళ్ళదీసే అతి సాధారణ ముస్లిం కుటుంబం మెహర్ ది . కలలపై తేలిపోయే పరిస్థితి కాదు తనది . ఆదిత్య మొదటి పరిచయం లోనే ఆమె దీర్ఘకాలిక సమస్య కు చక్కటి పరిష్కారం చూపగలిగాడు .
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ .

కొనసాగించండి ..........15