JAASMI - 2 in Telugu Fiction Stories by BVD Prasadarao books and stories PDF | జాస్మి (JASHMI) - 2

జాస్మి (JASHMI) - 2

జాస్మి


- బివిడి ప్రసాదరావు


EPISODE 2

 


"ఏంటా చూపు. తగ్గు. బయటికి పోయి గగ్గోలు పెట్టినా ఐ డోన్ట్ కేర్. నా ఇంటర్య్యూలో సెలక్ట్ కాలేదని తేల్చేస్తాను. పైగా నన్ను దబాయిస్తున్నావని నీ మీద తిరగబడతాను." చెప్పాడు ఆఫీసర్ చాలా మామూలుగా.
జాస్మి తెములుకుంది.
"వద్దు సార్. అంత వరకు నేను వెళ్లను. అశుద్ధం మీద రాయి వేసేంతటి అవివేకిని కాను నేను." అంది.
లేచింది.
తన సర్టిఫికేట్స్ ని జిప్ ఫైల్ లో సర్దుకుంది. జిప్ వేసి ఆ ఫైల్ ని తన ఎడమ చేతిలోకి తీసుకుంది.
ఆమె చేతలని గమనిస్తున్నాడు ఆఫీసర్.
జాస్మి ఒక్కమారుగా ఆఫీసర్ దరి చేరి, తన కుడి చేతిని విసురుగా పైకి లేపి, తన కుడి అర చేతితో ఆఫీసర్ ఎడమ బుగ్గ మీద బలంగా కొట్టింది.
"ఇప్పుడు నువ్వు బయటికి రా. నిన్ను కొట్టానని బయట పెట్టు. నువ్వు నా చేయి పట్టుకున్నావని గగ్గోలు చేస్తా. సయ్యేనా." అంది జాస్మి చాలా తీక్షణంగా.
ఆ ఆఫీసర్ హడలి పోతున్నాడు.
"జాగ్రత్త." అంది జాస్మి. ఆ కేబిన్ నుండి బయటికి నడిచింది చాలా నేచురల్ గా.
ఆ ఆఫీసర్ తేరుకోలేక పోతున్నాడు.


***


B

 

"ఏమైంది." శకుంతల విస్మయంగా కూతురునే చూస్తుంది.
దుర్గ మాట్లాడ లేదు. ఏడుస్తుంది.
"అయ్యో. ఏమైందిరా." దుర్గ పక్కకు చేరింది శకుంతల. అనునయంగా కూతురు తల నిమురుతుంది.
తల్లి తరచి తరచి అడగ్గా -
"రేపు పేరెంట్స్ మీటింగ్. ఈ సారి నీతో పాటు నాన్న రాకపోతే నా మీద చర్యలు తీసుకుంటారట." చెప్పగలిగింది దుర్గ.
శకుంతల గుబులవుతుంది.
"ఎప్పుడు అడిగినా ఏదో చెప్తావు. ఎప్పుడూ నువ్వు మాత్రమే స్కూలుకు వస్తావు. ఇంతకీ నాన్న ఏరి. ఎప్పుడూ రారేమిటి." అడిగేసింది దుర్గ.
శకుంతల తేరుకోలేకపోతుంది.
దుర్గ ఆగడం లేదు. ప్రశ్నిస్తూనే ఉంది.
"నాన్న సంగతి వదిలేసి. స్కూలులో నీకు ఏ పనిస్మెంట్ లేకుంటా నేను చేస్తాగా." టక్కున మాట్లాడింది శకుంతల.
దుర్గ తల్లినే చూస్తుంది.
"నాన్న మూలంగా నీ చదువుకు ఏ ఆటంకం ఉండదు. చక్కగా నువ్వు స్కూలుకు వెళ్ల వచ్చు. నేను అలా చేసి పెడతాగా." చెప్పుతుంది శకుంతల.
"అంతే కానీ. నాన్నను పిలవ్వు. నాన్నను చూపవు." గట్టిగా అంది దుర్గ.
"అరవకు. నీకు అన్నీ తెలుస్తాయి. లే. మొహం కడుక్కో. యూనిఫాం మార్చుకో. స్నేక్స్ చేశాను. పెడతాను." సాధ్యమైనంత వరకు మెల్లి మెల్లిగా మాట్లాడుతుంది శకుంతల.
దుర్గ విసురుగా లేచింది. బాత్రూం వైపు వెళ్లింది.
శకుంతల లేచింది. కిచిన్ వైపు కదిలింది.


***


3

 

పీక్ టైం గడిచి గంటకి పైగా కావస్తుంది.
రోడ్డు మీది రద్దీ బాగా తగ్గింది.
ఆ దారిన కారును డ్రైవ్ చేస్తూ జాస్మి సోలోగా ఉంది.
కారులో వినిపిస్తున్న స్టీరియో సాంగ్ ని వింటూ చిన్నగా కూనిరాగాలు తీస్తుంది.
కారు సరళంగా ముందుకు పోతుంది.
పాట వింటున్నా.. జాస్మి చూపులు మాత్రం కారు వేగంలానే చుట్టు పక్కలు తచ్చాడుతున్నాయి.
కొంత సేపటికి జాస్మి చూపులు రోడ్డుకు ఒక పక్కన ఆగాయి.
కారును స్లో చేస్తుంది.
ఆమె చూపులు మాత్రం ఇంకా అటు వైపునే నిలబడ్డాయి.
జాస్మి కారును ఇటు వైపున పక్కగా నిలిపింది.
ఇంకా అటే చూస్తుంది.
అక్కడ ఉన్న ఒక లైట్ పోల్ పక్కన ఒక అమ్మాయి కుదించుకుపోతున్నట్టు ఒంగి నిల్చుని ఉంది.
ఆమెను చూస్తూనే అటు ఇటుగా తిరుగుతున్న వారు తమకు పట్టనట్టు జరిగి పోతున్నారు.
ఆ అమ్మాయినే చూస్తుంది జాస్మి.
ఒక యువకుడు అప్పుడే ఆ అమ్మాయి చెంత నిలిచాడు.
అతడు ఏదో అడుగుతున్నాడు.
ఆ అమ్మాయి ఏమీ చెప్పేట్టు లేదు.
ఆ అమ్మాయి మరింతగా ఒంగి పోతుంది.
ఆ యువకుడు అక్కడ నుండి కదిలి పోయాడు. తన దారిన తాను పోతున్నాడు.
జాస్మి ఇంకా ఆ అమ్మాయినే చూస్తుంది.
ఆ అమ్మాయి ఏడుస్తున్నట్టుగా జాస్మి గమనించగలిగింది.
కారు దిగింది.
అటు నడిచింది.
ఆ అమ్మాయిని చేరింది.
"ఏమైంది." అడిగింది.
ఆ అమ్మాయి చిన్నగా తలెత్తింది.
జాస్మిని చూస్తూనే కొద్ది కొద్దిగా నిటారవుతుంది. కానీ తను ఉంచిన చోట నుండి తన అర చేతుల్ని జరపడం లేదు.
జాస్మి ఆ అమ్మాయి అర చేతుల వంక చూస్తుంది.
అక్కడ రక్తం..
"ఓ మై గాడ్." అరిచినట్టు అంది జాస్మి.
ఆ అమ్మాయి కంగారైంది.
జాస్మి తన చున్నీని గమ్మున తీసి, ఆ అమ్మాయి నడుము చుట్టూ చుట్టింది. ఒక చేతితో ఆ చున్నీని పట్టుకుంటూనే, మరో చేతిని ఆ అమ్మాయి భుజాలు చుట్టూ చుట్టి, ఆ అమ్మాయిని నడిపించుకుంటూ తన కారు వైపు కదిలింది.
జాస్మి ఆ అమ్మాయిని కారులో ఫ్రంట్ న కూర్చుండ పెట్టింది.
తను డ్రయివింగ్ సీటులోకి ఎక్కింది. వాటర్ బాటిల్ తీసి ఆ అమ్మాయికి అందించింది.
"కూల్. రిలాక్స్." చెప్పింది జాస్మి.
ఆ అమ్మాయి బాటిల్ కప్ తీసుకొని కొద్దిగా నీళ్లు తాగింది. తిరిగి కప్పు పెట్టి బాటిల్ ని జాస్మికి అందించింది.
"పీరియెడ్సా." అడిగింది జాస్మి.
ఆ అమ్మాయి 'అవును' అన్నట్టు తలాడించింది.
"నెలసరి టైం ఐతే, బయటికి వచ్చేటప్పుడు శానిటరీ నాప్కిన్ ఒకటి బేగ్ లో పెట్టుకోవాలిగా." అంది జాస్మి.
మొహమాటంగా కదిలింది ఆ అమ్మాయి.
"నావి ఇరెగ్యులర్ పీరియెడ్స్ మేడమ్. తలవని తలంపుగా దార్లో జరిగిపోయింది." చెప్పింది.
"అలాంటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. నీ లాంటి వాళ్లు తప్పనిసరిగా నాప్కిన్ ని బేగ్ లో అట్టి పెట్టుకోవాలి." చెప్పింది జాస్మి.
ఆ అమ్మాయి ఏమీ అనలేదు. తల దించుకుంది.
"నీ ఇల్లు ఎక్కడ." అడిగింది జాస్మి.
ఆ అమ్మాయి చెప్పలేక పోతుంది.
"పర్వాలేదు. చెప్పు. ఇలా వెళ్ల లేవు. వెళ్ల కూడదు కూడా." అంది జాస్మి.
ఆ అమ్మాయి చెప్పింది.
జాస్మి కారు స్టార్ట్ చేసింది.
అటు వైపు కదలింది.


***


C

 

దుర్గ చదువుతున్న స్కూలు -


***


(కొనసాగుతుంది..)


***

Share