JAASMI - 4 in Telugu Fiction Stories by BVD Prasadarao books and stories PDF | జాస్మి (JASHMI) - 4

జాస్మి (JASHMI) - 4

జాస్మి


- బివిడి ప్రసాదరావు


EPISODE 4

 

"సర్లేండి. కాలమే అన్నింటినీ సరి చేసి పెడుతుంది. వస్తున్న పత్రికలనే తెచ్చి పెడతాను. వాటిని చదువుతూ కాలాన్ని ఎంజాయ్ చేయండి." చెప్పింది జాస్మి.
"దిన పత్రికలు వదిలేసి, అటు పై ఎన్ని వార, పక్ష, మాస పత్రికలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నవాటిని వేళ్ల మీదనే లెక్కించేయవచ్చు. అవి పగలు సమయాన్ని ఎంత మేరకు సద్వినియోగ పరుస్తాయి. మిగతా పగలు ఈజోరమనడమేనా." అన్నాడు ఆయన నిరుత్సాహంగా.
"అన్నట్టు ఈ మధ్య ఆన్లైన్ పత్రికలు వస్తున్నాయి. వాటినీ చదువుతుండండి. కాలం ఇట్టే కాక పోయినా చాలా మేరకు మీరు చక్కగా గడిపేయ వచ్చు." అంటూనే,,
"ఏదీ మీ స్మార్ట్ ఫోన్ ఇలా ఇవ్వండి. ఆయా యాప్ లు, ఆయా లింక్ ల బుక్ మార్కులు పెట్టి మీకు సాయ పడతాను." చెప్పింది జాస్మి.
ఆయన తన ఫోన్ ను జాస్మికి ఇచ్చాడు.
జాస్మి కొద్ది సమయంలోనే ఆయా వాటిని ఆ ఫోన్ లో సమకూర్చి వాటిని వాడే విధం చెప్పింది.
"కాలక్షేపం మాట అటు వదిలితే, సాహిత్యం మెదడుకు దివ్యంగా సహకరిస్తుంది. తద్వారా చురుకుతనం పదునెక్కుతుంది." అని కూడా చెప్పింది.
ఆయన చాలా మేరకు సంతృప్తయ్యాడు.


***


E

 

"అదేం ప్రశ్న." అన్నాడు సూర్యం విసురుగా.
"లేకపోతే. ఇన్నాళ్లూ మమ్మల్ని నిర్దయగా వదిలేసి ఒక దానితో పోయావుగా. ఛ. ఏం మొహం పెట్టుకు వచ్చావ్." గడగడా మాట్లాడుతుంది శకుంతల.
ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
"తగ్గు తగ్గు. నేను వచ్చింది ఒక కారణంతో. మాట్లాడనీ." చెప్పాడు సూర్యం.
శకుంతల ఊగిపోతుంది.
"ఈ మధ్య నీ అమ్మ, అయ్యా చనిపోయారుగా." అంటూ ఆగాడు సూర్యం.
చికాకయ్యింది శకుంతల.
"ఏంటలా చూస్తున్నావ్. నాకు తెలుసులే. వాళ్లు పోవడం మంచిదేలే" అన్నాడు సూర్యం.
"ఏం మాట్లాడుతున్నావు." అడగ్గలిగింది శకుంతల.
"మరే. నీ తల్లిదండ్రులు బస్సు ప్రమాదంలో చనిపోవడం తెలిసేక కూడా నువ్వు ఊరుకున్నా, నేను ఆగేది లేదు." చెప్పాడు సూర్యం.
శకుంతల తల డలైపోతుంది.
"పద. వాళ్లకి నువ్వేగా బిడ్డవి. వాళ్ల ఇల్లు, వాళ్ల సొమ్ములు వగైరాలు ఎవరూ కొట్టేయకుండా అడ్డుకుందాం. దానిని ఇద్దరం సమానంగా పంచుకుందాం. తర్వాత మనం ఎవరి దారిన వారం పోదాం." చెప్పాడు సూర్యం చాలా ఈజీగా.
శకుంతలలో చర్రున చిర్ర ఎగేసుకు వచ్చేసింది.
"ఏంటి నీ పిచ్చి ఆలోచనలు. నువ్వు ఇలా తయారయ్యావేమిటి." అడిగింది.
"మరి. నీది ఎవరికో పోవడం ఎందుకు. నీ తల్లిదండ్రులది నీదేగా." అన్నాడు సూర్యం.
వెంటనే ఏమీ మాట్లాడలేక పోయింది శకుంతల.
సూర్యం ఆమెనే చూస్తూ ఏమేమో చెప్పుతున్నాడు గోలగోలగా.
అప్పుడే శకుంతల పొరుగింటామె అక్కడికి వచ్చింది. "ఏంటి శకుంతలా. ఇంట్లో రభస." అంటూ.


***


6

 

"సార్ రమ్మన్నారు." చెప్పాడు బోయ్.
రూంలోకి వెళ్లింది జాస్మి.
ఆ రూం ఓ టివి చానల్ నిర్వాహకుడు ముకుందరావుది.
"నమస్కారం సార్." చేతులు జోడించి అంది జాస్మి.
ముకుందరావు హుందాగా చూస్తున్నాడు జాస్మిని.
"నమస్కారం. రా అమ్మా. కూర్చో." అన్నాడు.
జాస్మి ఆయన ఎదురుగా కూర్చుంది.
ముకుందరావు ఇంకా జాస్మినే చూస్తున్నాడు.
"సార్. మీతో నా అభిప్రాయాలను పంచుకోవాలని వచ్చాను." చెప్పింది జాస్మి.
"చెప్పమ్మా." అన్నాడు ముకుందరావు.
"మీ చానల్ లో వస్తున్న 'నవ్వుకో' కార్యక్రమం గురించి నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి." అంది జాస్మి.
"ప్రతి వ్యక్తిగత అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేమమ్మా. ఎక్కువ మంది మన్ననల్లే మా ప్రాతిపదిక." చెప్పాడు ముకుందరావు.
"కావచ్చు సార్. కానీ విన వచ్చుగా. నన్ను విన్నవించుకోనీయండి." చెప్పింది జాస్మి.
"సరే. చెప్పమ్మా." ముకుందరావు అన్నాడు.
కుర్చీలో వెనుక్కు జరిగాడు.
"ఆ ప్రొగ్రాంలోని స్కిట్స్ లో హాస్యం కంటే అపహాస్యమే ఎక్కువగా వినిపిస్తుంది సార్ ఈ మధ్యన." చెప్పింది జాస్మి.
"వివరంగా చెప్పాలి." అన్నాడు ముకుందరావు.
"అదే సార్. ఈ మధ్య వ్యక్తిగత సెటైర్స్ ఎక్కువ అవుతున్నాయి. అర ఒకటి వెటకారాపు పంచ్ లు పర్వాలేదు కానీ, అవే మూలంగా సాగితే వెగట రేగుతుంది సార్." చెప్పుతుంది జాస్మి.
ముకుందరావు వింటున్నాడు.
"పంచ్ లు సహజంగా ఉంటే వినుసొంపుగా ఉంటుంది కానీ మెత్తేలా ఉంటే ఎలా సార్. పంచ్ పడ్డ వ్యక్తి దానిని స్పోర్టీవ్ గా తీసుకుంటున్నాడని పంచ్ వేసే వ్యక్తి మరీ బరి తెగిస్తే ఎలా సార్. అటు వంటివి మీ లాంటి చానల్ వారు ప్రోత్సాహించడం, ప్రసారం చేయడం ఎంత వరకు సబబు సార్." చెప్పడం ఆపింది జాస్మి.
ముకుందరావు ఏమీ మాట్లాడలేదు. జాస్మినే చూస్తున్నాడు.
"సార్. పాత్రల స్వభావాల్ని ప్రాతిపదికగా పంచ్ లు పడితే బాగుండవచ్చు కానీ, వ్యక్తుల ఇమేజ్ ల్ని బట్టి పంచ్ లు వేస్తే హర్షణీయం కాదు సార్. ఇవి ఇంకా కొనసాగితే 'కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది' అన్నది తప్పక కాన రావచ్చు సార్. ఆలోచించండి." అంది జాస్మి.
కుర్చీలో కాస్తా కదలి, "చెప్పడం ఐపోయిందమ్మా." అడిగాడు ముకుందరావు.
"సార్. నా అభిప్రాయం చెప్పగలిగాను." చెప్పింది జాస్మి.
"నీ అభిప్రాయం నచ్చిందమ్మా. నా వైపు ప్రయత్నం చేస్తాను. ముందు ముందు మార్పులు గమనించమ్మా. సదా నిన్ను ఇట్టి అభిప్రాయాలతో స్వాగతిస్తుంటానమ్మా. ధన్యవాదాలు." చెప్పాడు ముకుందరావు.
జాస్మి ఆయనకు 'నమస్కరించి' అక్కడ నుండి కదిలింది.


***


F

 


అక్కడ సూర్యంని చూస్తూనే, "ఇతడు.. నీ మొగుడు కదూ." అంది పొరుగింటామె వింతగా.
"అవును వదినా. ఇన్నాళ్లకు ఊడు పడి, నా మీద ఉరుకుతున్నాడు." చెప్పింది శకుంతల.
"ఏమయ్యా. ఏమిటి నీ దాష్టికం. శకుంతల తగ్గించింది కానీ, ఆ రోజే నీ మీద కంప్లెంట్ ఇచ్చేవాళ్లం. ఇంత మంచి దాని ఉసురు ఇంకా నీకు తగలలేదా. నీచుడా." అంది పొరుగింటామె విసురుగా.
"మధ్య మీకెందుకు." అన్నాడు సూర్యం.
"మా అమ్మా నాన్నా చనిపోయారట వదినా.." చెప్పుతుంది శకుంతల.
"అవును కదా. ఆ కబురు తెలిసినా, దుర్గకై మనసును చంపుకున్నావు. నీలో నువ్వే కుమిలిపోయావు. దానికై ఇతడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు." అంది పొరుగింటామె.
"వాళ్ల ఆస్తిని కొట్టేయడానికి." చెప్పింది శకుంతల టక్కున.
"ఇదేం చోద్యం." అంది పొరుగింటామె.
"ఇందులో చోద్యమేమిటి. శకుంతలకు దక్కవలసిన ఆస్తిని అక్కడ వాళ్లు దొబ్బేస్తుంటే చూస్తూ వదిలేయడమేమిటి. వెళ్లి వాళ్లని నిలదీసి శకుంతలది శకుంతలకి ముట్టేలా చూడాలనే వచ్చాను." చెప్పాడు సూర్యం.
"లేదొదినా. నాకు అలా రావలసిన దాంట్లో సగం వాటా కోసం వచ్చాడు. రభస మొదలెట్టాడు." చెప్పింది శకుంతల.
"అవునా. బాగుందయ్యా నీ వాటం. అందుకా నీకు ఇప్పుడు శకుంతల యాదకొచ్చింది." అంటుంది పొరుగింటామె చిరాగ్గా.


***


(కొనసాగుతుంది..)


***

Share