The shadow is true - 11 books and stories free download online pdf in Telugu

నీడ నిజం - 11

అఘోరి విక్రం లోగిలి లో అడుగు పెట్టగానే అప్రయత్నం గా ఉలిక్కిపడ్డాడు. ఆ ఉలికిపాటుకు కారణం అతడికి స్పష్టం గా స్ఫురించలేదు. కానీ, ఏదో అర్థం కాని అపశ్రుతి మనసు లో మెదిలింది . వెంటనే ఆ అనుభవం దంపతులకు వివరించాడు. జాగ్రత్త గా ఉండమని సూచన చేసాడు.

విక్రం ఆ సూచన అంతగా పట్టించుకోలేదు. ఆడది కనుక కోమల కొంత జంకింది . ఏం జరుగుతుందో అన్న భయం ఆమె లో కాస్త అలజడి రేపింది .

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఓ ఎండవేళ , ఇంట్లో, చుట్టుపక్కల ఎవరూ లేని సమయాన ఓ ఆగంతకుడు విక్రం ఇంటి ముందు ‘ భిక్షాందేహి అంటూ నిలుచున్నాడు. అతడు ఔత్సాహిక క్షుద్రోపాసకుడు –పన్నాలాల్. ఆ పిలుపు విన్న కోమల భిక్ష వేసి వెళ్లి పోయింది. ఆ యువకుడు వెంటనే కదలలేదు .ఒక్క క్షణం చుట్టూ అనుమానం గా చూసాడు . కనుచూపు మేర లో ఎవ్వరూ లేరు . మెరుపు లా అతడు జోలె లో నుంచి ఓ పిడత తీసి కోమల్ తొక్కిన మట్టిని సేకరించాడు . క్షణం లో మాయమయ్యాడు.

విక్రం తమ్ముళ్ళకు , వారు చేసే పాపానికి పరిస్థితులు కూడా సమయానుకూలం గా అమరి పోయాయి. వారి చర్యలు గమనించి అదుపు చేసేందుకు తల్లి ఊర్లో లేదు. రాహుల్ తో పక్క ఊర్లో కి వెళ్ళింది. అన్నగారు మాట పట్టింపు తో ఇంటికి దూరమయ్యారు. అవసరం కలిగితే తప్ప తమ్ముళ్ళను కలవటం లేదు. ఇప్పుడు తమ్ముళ్ళు సర్వస్వతంత్రులు .

పన్నాలాల్ అనాధ. గాలికి, ధూళికి పెరిగాడు. ఏ బంధం అనుబంధం లేని కారణం గా మొరటుగా మొండి గా మారాడు. సమాజం తనను ఆదరించలేదన్న కసి తో, కోపం తో క్షుద్రవిద్యలు నేర్చుకుని మరీ కిరాతకుడ య్యాడు . అనుకున్నది ఎలాగైనా సాధించాలన్న పట్టుదల అతడిని పిచ్చివాడిని చేస్తుంది.వెనక, ముందు ఆలోచించుకోనివ్వదు . కానీ, అతడికి అసాధారణమైన ధారణ శక్తి ఉంది . మనసు లగ్నం చేసి ఏ విద్యనైనా ఇట్టే నేర్చుకోగలడు . అతడి సంస్కారం మరోలా , సాత్త్విక ప్రవృత్తికి అనుకూలం గా ఉంటే గొప్ప సాధకుడు అయ్యేవాడు .

ఇంత కాలం చిల్లర మల్లర పనులతో, చిన్న చిన్న క్షుద్ర విద్య ప్రయోగాల తో పొట్ట బోసుకుంటూ వచ్చాడు . ఇన్నాళ్ళకు జాక్పాట్ లాంటి అవకాశం వెదుక్కుంటూ వచ్చింది . ఈ “ చేతబడి” విజయవంతమై కోమల మరణిస్తే ఇన్నాళ్ళ తన దరిద్రం వదిలి పోతుంది . అందుకే పన్నాలాల్ సర్వ శక్తులు వినియోగిస్తున్నాడు .

కోమలా దేవి సౌందర్యం, సౌజన్యం పన్నాలాల్ ను ముగ్ధుణ్ణి చేశాయి . క్షణ కాలం ఇలాంటి అపరంజి బొమ్మ పైన “ చేతబడి” అనిపించింది. కానీ, తన వృత్తి క్షుద్రం .

ప్రవృత్తి అమానుషం . కనుక సున్నితమైన ఆలోచనల తో మానసిక దౌర్బల్యం దగ్గరకు రానీయ కూడదనకున్నాడు .


విక్రం తమ్ముళ్ళ లో పెద్దవాడు అజయ్, చిన్నవాడు విజయ్ . ఇద్దరూ కవలలు . తేడా గంట మాత్రమె . చిన్నప్పటినుంచీ జంట గా ఒకే ప్రాణం గా పెరిగారు ., మెలిగారు.అందుకే జరగబోయే దారుణం లో కూడా చెయ్యి, చెయ్యి కలిపారు . కానీ, ఇద్దరిలో ఇక తేడా ఉంది . అజయ్ ఆవేశ పరుడు .ఏ కారణం చేతనైనా ఆవేశం వరదలా పొంగి తే అతడిని ఆపటం బ్రహ్మ తరమైనా కాదు . పూర్తిగా స్పృహ కోల్పోతాడు .

ఇందుకు పూర్తిగా భిన్నమైనది విజయ్ ప్రవృత్తి . అతడి లో ఆవేశం పాలు చాలా తక్కువ . సవ్యం గా పరిస్థితి కి అనుకూలం గా ఆలోచించని దే అడుగు ముందుకు వేయడు. సమస్య ఎదురైనప్పుడు సత్యాసత్యాలు , సాధ్యాసాధ్యాలు ఆలోచించటం అతడి నైజం . అజయ్ తొందరపాటుకు విజయ్ ఒక రకం గా స్పీడ్ బ్రేకర్ .

కోమలా దేవి తో అన్నగారి వివాహం ఆవేశపరుడైన అజయ్ ను ఎంత కలవరపరచిందో ఆలోచనాపరుడు విజయ్ ను కూడా అదే స్థాయి లో కదిలించివేసింది . కానీ, విజయ్ విక్రం దృష్టి లో సమస్యను విశ్లేషించే ప్రయత్నం చేసాడు .

“ పెద్దన్న సమస్య ను కేవలం రాహుల్ దృష్టి లో నే ఆలోచించలేదు. , తన దృష్టి తో కూడా ఆలోచించే కోమలను వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు . అన్నయ్య ‘ ఊ అంటే చాలు పిల్లనివ్వడానికి ఎంతోమంది శ్రీమంతులు సిద్ధం గా ఉన్నారు . కానీ, ఈ ఇంటికి సిరి సంపదల తో వచ్చే కోడలు తన తో పాటు అహం, స్వార్థం, సంకుచిత మనస్తత్వం లాంటి అవలక్షణాలు తీసికొని వస్తే , ఇంటిని నరకం చేస్తే --- ఈ అనుమానం ఆయన లో బలంగా ఉంది . ఇందుకు పూర్తిగా భిన్నమైనది కోమలా దేవి పరిస్థితి . అన్నయ్య తో ఆమె వివాహం కలలో కూడా ఊహించని సంగటన . ఆమె దృష్టి లో ఒక అరుదైన వరం . కృతజ్ఞతా భారం ఆమెను పూర్తిగా వివశురాలిని చేసింది . అన్నయ్యకు “ త్వమేవ శరణం “ అనడమే ఆమె చేయవలసింది . అలా ఆభంగిమ లో అన్నయ్య పాదాలపై వాలిపోవడానికి ఆమె క్షణం కూడా ఆలస్యం చేయ లేదు . పైగా ‘ త్యాగం అన్న మరో ఎత్తుగడ తో గ్రామస్తుల దృష్టి లో అనూహ్యం గా ఎదిగి పోయాడు . కోమల వివాహం తో వచ్చిన కొద్దిపాటి నింద కూడా ఈ చర్య తో దూదిపింజేలా ఎగిరి పోయింది .ఇంతటి మంత్రాంగం , సమయస్పూర్తి తెలుసు గనుకే అన్నయ్య పరగ మాకు మకుటం లేని మహారాజు గా ఏలుతున్నాడు . “ ఇలా సాగాయి విజయ్ ఆలోచనలు .

చేతబడికి ప్రయత్నాలు ముమ్మరం గా సాగుతున్నాయి . వయసు లో చిన్నవాడని మొదట కాస్త సందేహించినా పన్నాలాల్ లో అసాధారణ ప్రజ్ఞ ఉందని ముగ్గురికి అర్థమైంది . తమ ప్రయత్నం విజయవంతమవుతుందని నమ్మకం కుదిరింది . పన్నాలాల్ క్రమం తప్పకుండా దీక్ష తో క్షుద్రపూజ నిర్వహించసాగాడు .ఆ ప్రభావం కొద్ది కొద్దిగా కోమల పై కనబడసాగింది . ఆమె మనసు లో అర్థం కాని కలవరం . శరీరం లో తపన మొదలైయ్యాయి . ఈ మార్పుకు విక్రం కలవర పడ్డాడు .

‘తంతు చివరి దశ లో ఉండగా అజయ్, విజయ్ ఊరికి తిరిగి వచ్చేశారు . ఎవరికీ ఏ అనుమానం రాకుండా మామూలు గా మెలగ సాగారు . ఇలాంటి పరిస్థితి లో ఓ ఊహించని సంగటన జరిగింది .


విక్రం సింహ ఒక రోజు సాయంత్రం చీకటి పడ్డాక ( గుడ్డి వెలుతురు లో ) పొలం గట్టు వెంబడి వస్తున్నాడు . ఏవేవో ఆలోచనలతో మనసు బాగా కలత గా ఉంది . మాట పట్టింపు తో ,తమ్ముళ్ళ కు దూరమైనాడే గాని వారు చేదోడు వాదోడుగా లేని జీవితం అతడికి ఎంతో వెలితి గా ఉంది . ఆ మాటే ఒకరోజు భార్య తో అన్నాడు . అందుకు కారణం తానేనని కోమల బాధ పడింది . అది చూసి విక్రం నొచ్చుకున్నాడు . ఇద్దరూ సున్నిత హృదయులే .

ఆలోచనల తో యధాలాపం గా నడిచి వస్తున్న విక్రం చూసుకోకుండా చీకటి లో ఒక పామును తోక్కేసాడు . అది త్రాచు --- నల్లగా కాలసర్పం లా ఉంది . వెంటనే బుస కొట్టి మెరుపు వేగం తో అతడి కాలుపై కాటు వేసింది . అంతే

కాలు పట్టుకుని కుప్పలా కూలి పోయాడు . అరుద్దామన్నా నోరు పెగల లేదు . నవనాడులు కుదించుకు పోయాయి . క్షణాల వ్యవధి లో ప్రాణం పోయింది .

చీకటి మరి కాస్త చిక్క బడింది . ఆ దరి లో ఎవరూ రాలేదు . విక్రం అచేతనంగా అలాగే పడి ఉన్నాడు .

ఎంతకీ భర్త ఇంటికి రాక పోవటం తో కోమల కంగారుపడింది . మనసు కీడు శంకించింది . ఆలోచనలు పరిపరివిధాల పోయాయి . పైగా ఒంటరి తనం ఆమెను మరీ కృంగదీసింది . విషయం పనివారికి తెలిసింది . అందరూ కంగారు గా తలో దిక్కుకు వెళ్లారు . కొద్ది సేపట్లోనే జరిగిన ఘోరం తెలిసిపోయింది . క్షణాల్లో వార్త కారు చిచ్చులా ఊరిని కమ్ముకుంది . పిడుగులాంటి ఈ వార్త తో అజయ్, విజయ్ దిమ్మెర పోయారు . ఇది వారు కలలో కూడా ఊహించని పరిణామం . అన్నగారి శవం చూసి వారు తట్టుకోలేక పోయారు . గుండె చేరువై పసిపిల్లల్ల్లా ఏడ్చారు . వారికీ భవిష్యత్తు , బ్రతుకు శూన్యం గా తోచాయి .

ఊరు ఊరంతా వరద లా కదిలింది . విజయ్ తల్లిని, రాహుల్ ను స్వయం గ తీసుకు వచ్చాడు .

శవం లా మిగిలిన పెద్ద కొడుకు ను చూసి తల్లి మూర్చ పోయింది . రాహుల్ బిక్క మొగం వేసాడు . ఆపుకోలేని కన్నీళ్లు –అర్థం కాని అయోమయ పరిస్థితి . అదురుతున్న గుండె తో తండ్రి శవం పక్కన కూర్చున్నాడు . విజయ్ అ పసివాడిని అక్కున్ చేర్చుకున్నాడు . తేరుకున్న తల్లిని ఎవరూ పట్టలేకపోయారు . ఆమె కడుపు కోత , ఆవేదన ఏ భాషకు అందనివి . కోమలా దేవి కట్టెలా బిగుసుకు పోయింది . ఆమె శరీరం , మెదడు, మొద్దు బారి పోయాయి . కంటి నుండి చుక్క కన్నీరు రాలేదు . చూపుల్లో జీవం లేదు . శరీరం లో కదలిక లేదు . ఒక్క మాట లో చెప్పాలంటే ఆమెకు విక్రం కు పెద్ద తేడా లేదు. ప్రాణమున్న శిలలా అచేతనం గా ఉంది పోయింది .

విక్రం తల్లి కర్ర లా బిగుసుకు పోయిన కోడలి పరిస్థితి గమనించింది . ఆమెను కదలించక పొతే కొడుకు లాగే ఆమె కూడా దూరమవుతుంది . రాహుల్ దిక్కు లేని వాడవుతాడు . మరెలా ఆమెను కదలించాలి? ఏ ఓదార్పులు , ఊరడింపులు అ శిల ను కదిలించ లేవు .

విక్రం తల్లి కి మెరుపు లా ఓ ఆలోచన మెదిలింది . రాహుల్ ను కోమల ఒడిలో కూర్చోబెట్టింది . రాహుల్ స్పర్శ తో కోమల ఉలిక్కిపడింది . ఆమె లో చైతన్యం విద్యుత్తులా ప్రవహించింది . అ పసివాడిని చూడగానే ఆమెకు తన బాధ్యత గుర్తుకొచ్చింది ,. అంతే – రాహుల్ ను వాటేసుకుని వలవల ఏడ్చింది .

ఈ దృశ్యం చూస్తున్న ఓ విద్యాదికుడికి ‘ Home they brought warrior dead ‘ పద్యం గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి .

*************************************************

కొనసాగించండి 12 లో