The shadow is true - 18 books and stories free download online pdf in Telugu

నీడ నిజం - 18

రాహుల్ బాబు ---ముప్పై అయిదు వసంతాల నిండు వ్యక్తిత్వం. ఆకర్షణీయమైన రూపం . కళ్ళ మెరుపుల్లో తళుకుమనే సౌజన్యం .సంస్కారం. గంభీరం గా కనిపించినా ఎదలో సున్నితంగా ప్రతిధ్వనించే ‘ చక్రవాక రాగం. ఓ చక్కని అనుభూతి, ఓ చక్కని అనుభవం వెరసి రాహుల్ బాబు .

రాహుల్ కు మనసు తెలుసుకొని నీడలా మెలిగే అర్ధాంగి. పదేళ్ళ లోపు కూతురు ఉన్నారు కూతురి పేరు -కోమలాదేవి !

కోమలా దేవి మమతల యశోదా మయిలా రాహుల్ కు మాతృప్రేమ లో మాధుర్యం గోరుముద్దల్లా అందించింది . ఆ అనురాగం పూర్తిగా ఆస్వాదించక ముందే అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని కోమలా దేవి నాటకీయం గా లోకం నుండే తప్పుకుంది . ఆ వెలితి ఎవరూ పూడ్చలేనిది .

రాహుల్ కూతుర్ని కోమలాదేవి ప్రతి రూపం గా పెంచుకుంటున్నాడు. కూతుర్ని అమ్మా అని పిలుస్తూ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లి పోయిన తల్లిగాని తల్లిని అనుక్షణం తలచుకుంటున్నాడు .

విక్రం జ్ఞాపకాల నీడల్లో సేదతీరుతూ జరాభారం మోస్తున్న నాన్నమ్మకు పంచ ప్రాణాలు . ఆ నాన్నమ్మకు రాహుల్ తోడిదే లోకం . ఊరును దాదాపు మర్చిపోయింద నే చెప్పాలి.

కొడుకుల్ని అంతగా పట్టించుకోదు . కనిపిస్తే పేగు కదిలి కాసేపు

మాటలా డుతుంది . అంతే ---- అంతకు మించి వారి గురించి ఆలోచించదు . అదో లోకం ! అదో ధ్యాస. ...తన మాట వినకుండా సహగమనం చేసిన కోడలు కోమల పై విరక్తి ! మనవడు చూడకుండా అతడి భార్య ముందు ఆ అసంతృప్తి వెళ్లగక్కు తుంది . రాహుల్ ముందు మాత్రం కోమల ఊసైనా ఎత్తదు .

అవశేషం లాంటి గతానికి , భారం గా గడిచే వర్తమానానికి నడుమ సాలెపురుగు లా జ్ఞాపకాల గూడులో కాలం దొర్లిస్తున్న అభాగ్యురాలు !

విక్రం ఇంట్లో ఆతిధ్యం స్వీకరించాక మరి కొన్నాళ్ళు తీర్థయాత్రలు సాగించి చివరకు

ఆఘోరి హిమాలయాలు చేరాడు . గురువుగారిని దర్శించాడు . గురువు అతడికి చేదు నిజం-విక్రం, కోమల అకాల మరణ వార్త వినిపించాడు . ఆ వార్త విని అఘోరి స్థాణు వైనాడు . కొంతకాలం ఆ సంఘటన అతడి గుండెను ముల్లులా పొడిచేది . కోమల సౌందర్యం, సౌజన్యం ,సంస్కారం, ఆతిధ్యం అతడు మరువలేక పోయాడు .

కానీ, కాలక్రమేణ నిరంతర సాధన లో , గురుశుశ్రూష లో , సాధు జన సాంగత్యం లో ఆ సంఘటన దాదాపు మరచాడనే చెప్పాలి . మరుగున పడిన ఆ సంఘటన అఘోరిని కదిలించింది . గురువుగారిని మహా నిష్క్రమణ సందర్భంలో ; కోమలా దేవి పునర్జన్మ అతడిని ఓ కర్తవ్యం దిశ గా నడిపించింది . తిరుమల గిరిలో మొదటిసారి కలిసి విద్యా తండ్రికి భవిష్యవాణి వినిపించింది ఆ కర్తవ్యం లో భాగం గానే . రెండవ సారి విద్యా ను కలిసి నప్పుడు అ భవిష్యవాణి ని గుర్తు చేశాడు . ఆమె కిప్పుడు పునర్జన్మ జ్ఞానం ఉంది . కోమల తనే నన్న స్పృహ ఉంది .

మరోసారి ఆమెను కలిసి తన లక్ష్యం ఏమిటో ,పునర్జన్మ పరమార్థం ఏమిటో స్పష్టం గా తెలియ చేయాలి . కోమలకు జరిగిన అన్యాయం, సంప్రదాయం ముసుగులో సాగిన ఘోరం వెలుగు చూడాలి . దోషులు కఠినంగా శిక్షింప బడాలి . సత్యాసత్యాల నడుమ ఉన్న ఉల్లిపొర లాంటి బేధం లోకం గుర్తించాలి . పూర్వాపరాలను, మంచి-చెడులను సమదృష్టి తో సమీక్షించి చెరిగిపోని చారిత్రిక సత్యాలను నిగ్గుదేల్చాలి. విధి విధానాలకు , ఆలోచనా రీతులకు, నమ్మకాలకు అతీతం గా సత్యదర్శనం చేయగలగాలి. అఘోరి అందుకు ఉద్యమించాడు .

విద్యాదరి, సాగర్ ప్రశాంతం గా ఇల్లు చేరారు . వారికీ ఇంట్లో మంచి స్వాగతమే అందింది. . పూర్ణతిలకం కొడుకును కోడలిని

సా దరంగానే పలకరించింది .

సాగర్ ఉల్లాసంగా ఉన్నాడు . విద్యా సమస్య పరిష్కారమైంది . ఇప్పుడామె చాలా ప్రశాంతం గా ఉంది . ఇక తన జీవితం సాఫీగా సాగిపోతోంది . ఆమె ఒడిలో కమ్మని కౌ గిలి లో ఇన్నాళ్ళ శ్రమ, చిరాకు మరిచి పోవాలని ఆమె తహ తహ !

అతడికి ఆమె మనసు తో, వ్యక్తిత్వం తో ముడిపడి ఉన్న కోమలతో ఎలాంటి సంభంధం లేదు . అతడు ఆమె లో విద్యాధరిని మాత్రమే చూడగలడు .

ఆమెలో మరో మనిషిని చూసి భరించలేడు . ఆ విషయం రాజస్థాన్ లో నే స్పష్టమైంది . విద్యా వ్యక్తిత్వం క్రమక్రమంగా కనుమరుగై ఆమెలో కోమల కనిపించినప్పుడు అతడు కలవరపడ్డాడు .

సాగర్ కోరినట్లు విద్యా అతడికి తియ్యటి అనుభవం చవి చూపించింది . ఆ ఆనందం తనూ పొందింది . కొడుకు, కోడలు అన్యోన్యంగా మెలగటం చూసి పూర్ణ తిలకం తృప్తిగా నిట్టూర్చింది .

జస్వంత సింహ ఓ జర్నలిస్ట్ .దక్షిణ భారతం లో పుట్టి , దేశమంతటా వ్యాపించి, పత్రికారంగం లో ఉన్నతమైన విలువల్ని , సంప్రదాయాలను స్థాపించిన ఓ ఆంగ్ల ది న పత్రిక కరస్పాండెంట్ . ఆ పత్రిక కు రాజస్తాన్ ప్రాంత వార్తావిశేషాలు కవర్ చేస్తాడు . కమిటెడ్ జర్నలిస్ట్ . ప్రొఫెషనల్ ఎథిక్స్ సిన్సియర్ గా ఫాలో అవుతాడు .

కొన్ని అనుకోని సంఘటనలు ఒక్కొక్కసారి అనూహ్యం గా చరిత్రను సృష్టిస్తాయి .

ఒకసారి జస్వంత్ సింహ విద్యా వాళ్ళు దిగిన లాడ్జ్ రూమ్ లోనే దిగాడు . ఏదో వార్త కవర్ చేస్తూ, సాయంకాలం వరకు బయటే ఉన్నాడు . రూమ్ కు వచ్చి షవర్ బాత్ చేసి రిలాక్స్ అయ్యాడు . అతడి కో అలవాటుంది . తన ప్రొఫెషనల్ బిలాన్గింగ్స్ టాప్ మోస్ట్ సెక్షన్ ఆఫ్ వార్డ్ రోబ్ లో పెట్టే అలవాటుంది .

తన confidential రిపోర్ట్స్ ఒకరి కంట పడకుండా అలా జాగ్రత్త తీసుకోవటం అతడి అలవాటు . ఆ రోజు అలాంటి ప్రయత్నం లో ఉన్నప్పుడు విద్యాధరి సాగర్ చేసిన హడావుడిలో మరిచిపోయిన డైరీ జస్వంత్ చూసాడు . ఆశ్చర్యం గా డైరీ చేతికి తీసుకున్నాడు .

డైరీ తెరిచే లోపలే అందులోంచి ఓ బంచ్ లా ఉన్న ఫోటోలు నేల మీద పడ్డాయి .

ఆసక్తిగా బంచ్ చేతికి తీసుకున్నాడు . ఓ అందమైన జంట అనేక పిక్నిక్ స్పాట్స్ లో వివిధ భంగిమల్లో తీసుకున్న ఛాయా చిత్రాలవి . జంట చూడముచ్చట గా ఉంది . ముఖ్యం గా ఆ అమ్మాయి ముఖం లో వింత శోభ . ఆ నీలి కళ్ళల్లో అద్భుతమైన కాంతి . జస్వంత్ ఆమెను అలాగే చూస్తుండి పోయాడు .

ఒకరి డైరీ చదవటం సభ్యత కాక పోయినా ఆసక్తిగా పేజీలు తిరగవేశాడు .

అందులో ఆంగ్లం, తెలుగు కలగాపులగంగా ఉన్నాయి . కానీ-ఆంగ్లం పాలే ఎక్కువ . ఆ భాషా గమనం, పదప్రయోగం, భావ వ్యక్తీకరణ చాలా విలక్షణంగా ఉన్నాయి . ఒక జర్నలిస్ట్ గా , ఆంగ్ల భాషా ప్రేమికుడిగా జస్వంత్ ఆ డైరీ విడవలేక పోయాడు . సిటౌట్ లో కూర్చుని అలాగే చదువుతూండిపోయాడు . తెలుగు మధ్య మధ్య లో కాస్త ఇబ్బంది పెట్టినా బండి సాఫీ గానే సాగింది . డైరీ లోని విషయాలు అర్థమవుతునాయి .

ము త్యాల సరాల్లాంటి అక్షరాల వెంబడి చూపులు పరిగెడుతుంటే ఆ డైరీ సాంతం చదివాడు. అందులో లీనమై పోయాడు. టైం కాన్షస్ పూర్తిగా లోపించింది. పేజీలు మారే కొద్దీ అతడిలో భావోద్వేగం , చిత్రమైన అనుభూతి హిమాలయం లా పెరగ సాగాయి .

జస్వంత్ లో ప్రొఫెషనల్ ఉన్నాడు . భావుకుడు ఉన్నాడు . అన్నింటిని మించి హ్యూమనిస్ట్ ఉన్నాడు . అతడి వ్యక్తిత్వం లోని విభిన్న కోణాలు ఆ డైరీ లో సంఘటనల పట్ల పూర్తిస్థాయి లో ప్రభావితమైనాయి .

ఆ డైరీలో చివరి పేజీలో వ్యక్తమైన భావాలు , అనుభవాలు అతడిలో విస్మయం, సంభ్రమం లాంటి భావాలను ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల స్థాయిలో సృష్టించ గలిగాయి .

ఏమిటిది ? కలా? నిజమా? .... కధ కన్నా చిత్రం గా కనిపించే వాస్తవం. రెండు జన్మల విడరాని బంధం . ఒక అనుభవం గల జర్నలిస్ట్ గా ఆ సంఘటనల వాడి, వేడి అత డు అంచనా వేయగలడు .

ఈ సంఘటన వెలుగు చూస్తే అంతర్జాతీయ స్థాయి లో కలకలం సృష్టించగలదు .

మనస్తత్వ నిపుణులకు మరోసారి పారాసైకాలజి పేరు తో చర్చ చేసే అద్భుత అవకాశం లభిస్తుంది. సంప్రదాయ, చాందసవాదులు ఈ సంఘటన ఆధారం గా

తమ సిద్ధాంత రాద్ధాంతాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. ముఖ్యంగా నారీ లోకం నుండి అనూహ్యమైన రీతిలో స్పందన రావచ్చు. ‘ స్త్రీ శక్తి సంఘటితమై , ఈ విద్యాధరికి అండగా ని లిచి అజయ్ సింహ లాంటి ఉన్మాదులను ఎదిరించమని ప్రేరేపించవచ్చు . కొందరు తమ పేరు, ప్రాపకం కోసం రాజకీయ రంగు పులిమినా ఆశ్చర్య పడ నక్కర లేదు .

విద్యాదరి దృష్టి లో ఆలోచిస్తే ఆమె మనుగడకే ప్రమాదం. అజయ్ సింహ మరోసారి పడగ విప్పి కాటేస్తే !..... అంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా ?

ముందు తానో మనిషిలా , సంస్కారవంతం గా ఆలోచించాలి. ఇదొక డైరీ . ఇందులో భావాలు, అనుభవాలు ఈ డైరీ సొంత దారు కే పరిమితం . వీటిని వెలుగు లోకి తేవటం సంస్కారం కాదు. ఇప్పుడు తను రెండు పనులు చేయగలడు . చేయాలి. అందులో అడ్రస్ ప్రకారం ఆ డైరీని విద్యాదరికి పంపటం ....లేదా... మనకెందుకులే అని ఆ డైరీని దొరికిన చోటే వదిలివేయడం .

జస్వంత్ కు రెండూ చేయాలనిపించలేదు . ఈ డైరీ ఆధారం గా కొంత వర్కౌట్ చేసి

నిజానిజాలు వెలుగులోకి తేవాలని పించింది . ఏ స్థాయిలో ఇందులో విశేషాలు పత్రికలో ప్రచురించాలో కాలమే నిర్ణయిస్తుంది . జస్వంత లో ఉన్న ఇన్వెస్టిగేటివ్

జర్నలిస్ట్ అతడిని బాగా ప్రోత్సహించాడు . ఇది చాలా అరుదైన అవకాశం. తన వృత్తికే ఓ ఛాలెంజ్ . పైగా ఓ రాజస్థానీ యుడి గా సహగమన పూర్వాపరాలు

చర్చించి ఈ వాస్తవ సంఘటనల ఆధారం గా కొన్ని సత్యాలు , ప్రపంచం ముందు ఉంచటం తన ధర్మం . ఏ కోణం లో చూసినా తనీ విషయం లో చొరవచేయటం

తప్పులేదనిపించింది.‌

***"***"***********************