Ventaade Needalu - 1 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెంటాడే నీడలు - 1

Featured Books
Categories
Share

వెంటాడే నీడలు - 1

ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా.

ఆ మర్నాడు తన పద్దెనిమిదో పుట్టినరోజు అనగా తన తల్లి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది సారిక తనకేమాత్రం ఆ విషయమై స్పృహ లేకుండా. ఆ తరువాత కొన్నిరోజులకే తమ ఇంట్లో ఎంతో నమ్మకం గా పనిచేసే ఓబులేసు మీద మర్డర్ అటెంప్ట్ చేసినప్పుడు కూడ ఆలా చేసినట్టు తనకి తెలీదు. అలాగే తను అప్పుడప్పుడు ఒంటె తలతో నగ్నంగా వున్న మగ మనిషి బొమ్మ ఎందుకు గీస్తూ ఉంటుందో తనకి తెలియదు. సారిక మొదటినుండీ అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూవున్నా ఇలా రెండుసార్లు మర్డర్ అటెంప్ట్ చేసేవరకూ ఆమె ప్రవర్తనని సీరియస్ గా తీసుకోలేదు ఆమె పేరెంట్స్. సైకియాట్రిస్ట్ సమీర కి తన అబ్నార్మల్ బిహేవియర్ గురించి చెప్పాక, తను అకేషనల్ గా సారిక ని స్టడీ చేస్తానని, తమ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో సారిక ని జాయిన్ చేసే ముందు కొంతకాలం వెయిట్ చేసి చూద్దామని చెప్తుంది. సారిక తన తండ్రి ని కూడా తనకి తెలీకుండానే మర్డర్ చెయ్యడానికి ట్రై చేసిన తరువాత, ఇంక ఆగలేక తనని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో ట్రీట్మెంట్ కి జాయిన్ చేస్తారు. సారిక అటువంటి ప్రవర్తనకి కారణం ఏమిటి, అది క్యూర్ అయిందా లేదా అన్నదే ఈ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్ ‘వెంటాడే నీడలు"

&&&

మాతృభారతి  పాఠకులకి నమస్కారం,

ఇది మాతృభారతి లో నేను వరుసగా రాస్తున్న ఆరవ నవల. ముందు ఐదు నవలల లాగే ఈ నవల ని కూడా 'ఎన్నా (హర్ లైఫ్ ....... హర్ లవ్ ....... హర్ స్ట్రగుల్)’ పేరుతొ మొదట ఇంగ్లీష్ లో రాసి పబ్లిష్ చేశాను. కాకపోతే కాన్సెప్ట్ అదే అయినా ఈ నవల ఆ ‘ఎన్నా’ నవల కి మక్కి మక్కీ అనువాదం మాత్రం కాదు. నేనింతకు ముందు రాసిన ‘వెన్నెల పూలు’ నవలలో బ్లాక్ యాంట్ మెంటల్ కేర్, సైకియాట్రిస్ట్స్ సమీరా, నిరంజన్ , తక్కినవాళ్లు కొంతమంది ఈ నవల్లో కూడా కంటిన్యూ అవతారు. కథాపరంగా ఈ నవల్లో కూడా కొంచెం శృగారం ఎక్కువగానే చూపించాల్సి వచ్చింది. అది నచ్చకపోతే క్షమించాలి. ఇంతకుముందు పబ్లిష్ చేసిన సిరీస్ కి దీనికి తేడా, వాటిల్లోలా ఇందులో లాస్ట్ పేజ్ సస్పెన్స్ వుండదు. థ్రిల్లింగ్ గా మాత్రం వుంటుంది. ఇంతకు ముందు నా నవలల లాగే ఈ నవలని కూడా ఆదరిస్తారని ఆశిస్తాను.

కృతజ్ఞతలతో,

రచయిత

కొట్ర శివ రామ కృష్ణ

&&&

డిస్క్లైమర్

ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత యొక్క రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. అలాగే ఏ సంఘటన తోటి ప్రేరణ పొంది రాయబడినటువంటిది కాదు. ఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం.  ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, పాత్రల యొక్క పేర్లు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు

&&&

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

“నీకు ఇబ్బంది అయినా అక్కడే వుండమని చెప్పాను. కొన్ని రోజులు ఓర్చుకోమని చెప్పాను. అయినా ఇక్కడికే వచ్చేసావు.” సాముదమ్మ చాలా కోపంగా వుంది మనవరాలిమీద. "ఈ వూళ్ళో ఏముంది నీకు, నేను వీడు తప్ప. మాలాగే నువ్వూ తయారవ్వాలనుకుంటున్నావా?"

  "ఎన్ని రోజులని ఓర్చుకోను, ఎంతకాలమని సహించను? నా బాగు ఓగు చూసి ఎదో నాకు భవిష్యత్తు చూపిస్తారని నువ్వనుకున్నావ్. కానీ వాళ్ళు నా చేత నానా చాకిరి చేయించుకుని మాటలచేత, చేతలచేత హింసిస్తున్నారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు గా పడుతున్నాను. ఇంకెంతకాలం పడను? అందుకనే ఉండలేక వచ్చేసాను." మల్లిక కోపంగా అంది.

"ఆ పెళ్లయి ఐదేళ్లు అవుతూంది. వాళ్ళకి ఒక కొడుకు పుట్టి నాలుగు సంవత్సరాల వాడయ్యాడు. కొడుకు పుట్టడానికి ముందు, తరువాత కూడా వాళ్ళు మల్లికని ఒకలాగే చూసారు. తనని జాగ్రత్తగా చూసుకోవడం మాట తరువాత, తన చేత చాకిరీ అంతా చేయించుకుని బాధపెడుతున్నారు. ఇంకా తనక్కడ ఉండలేదని నువ్వనడం బాగా లేదు." సింహరాజు అన్నాడు.  

"మీ నాన్న నాకు మాట ఇచ్చాడు నీకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటానని. నీకు మంచి సంభందం చూసి పెళ్లి కూడా చేస్తానని. అలాగని మాట ఇచ్చాకే నేను ఆ పెళ్ళికి ఒప్పుకున్నాను." సాముదమ్మ లో కోపం అలాగే వుంది కానీ ఇప్పుడది తన కొడుకుమీద. "కానీ వాడిలా చేస్తాడనుకోలేదు. పూర్తిగా రెండోపెళ్ళాం మోజులో పడిపోయాడు."   

"నాకు ఇంక అక్కడికి వెళ్లే ఉద్దేశం లేదు. నా జీవితానికి వచ్చిన భయం నాకు లేదు. ఈ వూళ్ళో మీతోనే వుంటాను. ఇక్కడ ఉండడం మీకు నచ్చకపోతే మీకు చెప్పకుండా వేరే ఎక్కడికో వెళ్ళిపోతాను." కోపంగా అని అక్కడనుండి వెళ్ళిపోయింది మల్లిక.

హుస్సురని నిట్టూర్చి సింహరాజు మొహంలోకి చూస్తూ అంది సాముదమ్మ. "ఇంక నేను చెయ్యగలిగినది ఏమీ లేదు. ఇప్పుడు దాన్ని నువ్వు నీతోనే తిప్పుకుని, నీకు వచ్చిన బాణామతి, చేతబడి లాంటివన్నీ దానికీ నేర్పు. నీకు తెలిసిన ఆ చెడ్డ దేవతలని, దేవుళ్ళని దానికీ పరిచయం చెయ్యి. మనం ఈ దిక్కుమాలిన వూళ్ళో దానికే కదా ప్రసిద్ధి చెందాం."   

"మల్లిక జీవితం బాగా వుండాలని నేనూ అనుకున్నాను. అలాగే జరిగితే చాలా సంతోషించే వాడిని. కానీ తను అక్కడవుండి కష్టపడడం నాకూ ఇష్టం లేదు." సింహరాజు అన్నాడు.

"కానీ ఈ వూళ్ళో దానికేం వుంటుందిరా? తండ్రి అంత వున్నత స్థితిలో వుండి అదెందుకు మనలాంటి దిక్కుమాలిన బతుకుబతకాలి? తన సొంత కూతురు బాగువోగు చూసుకుంటే వాడికి పోయినదేమిటి?" ఆవేదనగా అడిగింది సాముదమ్మ.

"సామమ్మా ఒక విషయం చెప్పు. రెండో పెళ్లి చేసుకున్నవాడెవడైనా తన మొదటి పెళ్ళాం పిల్లల్ని సరిగ్గా చూసుకున్నాడా? ఎక్కడన్నా ఏ ఆడదన్నాతన సవతి పిల్లల్ని ప్రేమగా చూసుకుందా? అందులోనూ వాళ్ళు అంత ధనవంతులు. నువ్వు జరగడానికి అవకాశం లేనిది జరుగుతుందని వూహించావు. అది నీ తప్పే." సింహరాజు అన్నాడు.

"నువ్వు చెప్పింది నిజమేరా. నేనే తప్పుగా ఆలోచించాను." మరోసారి హుస్సురని నిట్టూర్చింది సాముదమ్మ. "అసలు ఆ పెళ్ళికి నేను ఒప్పుకోకుండా వుండాల్సింది."

"పిచ్చి సామమ్మా. నువ్వు ఒప్పుకోకపోయినా వాళ్ళు పెళ్ళిచేసుకుని వుండేవాళ్ళు. నిజం చెప్పాలంటే సావిత్రి బతికే వున్నా వాళ్ళు పెళ్లిచేసుకునివుండేవారు. నీ కొడుకు ఆ ధనవంతురాలు మోజులో పడిపోయాడు. వాళ్ళకి బాగా డబ్బు ఉండడమే కాదు, చూసావా అదెంత అందంగా వుందో?"

"నువ్వు చెప్పిందీ నిజమేరా. నాకన్నా నీకే విషయాలు బాగా అర్ధం అవుతున్నాయి." కష్టపడుతూ లేచి నించుంది సాముదమ్మ. "వంటపని చూస్తాను. దానికీ ఎదో ఇంత పెట్టాలి కదా."

"నేనొకసారి మా ఇంటికి పోయివస్తాను." సింహరాజు కూడా లేచాడు.

"ఎందుకా ఇంటికిపోవడం? అక్కడ ఏమున్నాయి ఆ దిక్కుమాలిన చెడ్డ దేవుళ్ళ, దేవతల ఫోటోలు తప్ప. ఇక్కడే ఏడవొచ్చు కదా." చిరాగ్గా అంది సాముదమ్మ.

"ఏదేమైనా అది నా ఇల్లు. అక్కడికి ఒక్కసారన్నా పోకుండా నేనుండలేను." అక్కడనుండి వెళుతూ అన్నాడు సింహరాజు.

"నాకు తెలుసురా నువ్వక్కడికి ఎందుకుపోతావో. ఏ ప్రయోజనం లేకపోయినా ఆ పనికిమాలిన దేవుళ్ళని, దేవతలని మాత్రం పూజించడం మానవు."

వెనకాతలనుండి సాముదమ్మ అనడం వినిపించింది సింహరాజుకి. కానీ పట్టించుకోలేదు. సాముదమ్మ అలా మాట్లాడ్డం అది మొదటిసారి కాదు.                    

&&&

తన ఇంట్లో ఆ విగ్రహం ముందు నిలబడివున్నాడు సింహరాజు. ఆ విగ్రహం నాలుగడుగుల పొడుగు ఉంటుంది, రాతితో చెక్కబడి పూర్తినగ్నంగా, ఒంటె తలతో, మగ మనిషి విగ్రహం. తన ఇంట్లో ఇంకా కొన్ని ఇలాంటి చెడ్డ దేవతల విగ్రహాలు వున్నాయి.  కానీ అవంటే తనకి ఆసక్తి లేదు. తనకి మొదటినుండి ఈ దేవుడిమీదే ఆసక్తి. తనకి తెలిసినట్టుగా రోజూ పూజ చేస్తూనే వున్నాడు. కానీ తనని అనుగ్రహించడం లేదు. ఇంక  ఈ దేవుణ్ణి మానేసి వేరే దేవుణ్ణి ఆరాదిద్దమా అని కూడా ఆలోచిస్తూవున్నాడు.

"కన్నెపిల్లల్ని ఇష్టపడే కబుసా నిన్ననుగ్రహిస్తాడని ఎలా అనుకుంటున్నావు?"

వెనకనుండి మల్లిక గొంతువిని, వెనక్కి తిరిగి ఆమె మొహం లోకి చూసి నవ్వాడు సింహరాజు. "నువ్వెందుకు ఇక్కడికి వచ్చావ్? నువ్విక్కడికి రావడం నీ మామ్మకి నచ్చదు."

"నా మామ్మకి నచ్చని చాలా పనులు చేస్తూనే వున్నాను. అందులో ఇదొకటి." నిట్టూరుస్తూ సింహరాజు దగ్గరికి వచ్చింది మల్లిక. "ఇంతకీ నేను నీ దగ్గరికి రావడం నీకిష్టమా కాదా చెప్పు?" 

"ఇష్టం లేదని నేనెప్పుడన్నా చెప్పనా? నిన్నెంతో అభిమానించేవాళ్ళల్లో నేనొకణ్ణి. ఆ విషయం నీకూ తెలుసును." కోపంగా అన్నాడు సింహరాజు.

"నన్ను బాగా అభిమానించేవాళ్ళు. ఎంతమంది వున్నారు? నువ్వూ, నా మామ్మ తప్ప." నిట్టూరుస్తూ అంది మల్లిక.

"ఇంతకీ మీ నాన్న నిన్ను అసలు పట్టించుకోవడం లేదా? నువ్వంటే అసలు అభిమానం చూపించడం లేదా?" కళ్ళు చిట్లించాడు సింహరాజు.

"వాడికన్నా నా సవతి తల్లే నయం. నన్ను తిట్టడానికయినా నాతో మాట్లాడుతుంది. అసలు నేనొక దాన్ని ప్రపంచంలో వున్నట్టుగానయినా ప్రవర్తించడు. వాడి కళ్లెదుటే నేను నించున్నా అసలు నేను అక్కడ లేనట్టుగానే ఉంటాడు. అలాంటివాడితో నా బాధలు చెప్పుకోలేదంటుంది నా మామ్మ." కోపంగా అంది మల్లిక.

"నీ అమ్మ తెచ్చిన డబ్బుతో చదువుకున్నాడు. తన జబ్బు నయంచేసుకోవడానికి కూడా వాడకుండా, నీ నాన్న చదువుకే ఉపయోగించింది ఆ డబ్బు నీ అమ్మ. ఆ కృతజ్ఞత ఎక్కడా లేదు వాడికి. నీ అమ్మే ఆ డబ్బంతా వాడికి ఇచ్చి ఉండకపోతే, ఈ వూళ్ళో నా లాగే ఉండేవాడు." సింహరాజు కి కూడా కోపం వచ్చింది.

"సర్లే ఇప్పుడు వాళ్ళ ఊసెందుకు. వాళ్ళందర్నీ మర్చిపోయి ఆనందంగా ఉండాలని ఇక్కడికి వచ్చాను. వాళ్ళ గురించి అలోచించి మనసు పాడు చేసుకోవాలని నాకు లేదు." మరోసారి నిట్టూర్చింది మల్లిక.

"ఆ టౌన్ లో వాళ్ళ దగ్గర నీ జీవితం బాగుపడుతుందని, నేను నీ మామ్మ అనుకున్నాం. మాలా చదువు సంధ్యా లేకుండా కాకుండా, నువ్వూ కొంత చదువుకోవడం అవుతుందేమో అని కూడా అనుకున్నాం. చివరికి నీ పరిస్థితి మాలాగే అయింది."

"పాసవకపోయినా పక్కూరికి వెళ్లి పదవతరగతి వరకూ చదువుకున్నావు కదా. అది నాకు చెప్దువు కాని." మల్లిక నవ్వింది.                  

దానికి సింహరాజు నిట్టూర్చి మౌనంగా వుండిపోయాడు. మల్లిక సింహరాజు ని తప్పించుకుని ఒంటె తల వున్న విగ్రహం ముందుకు వెళ్లి నిలబడింది.

"కబుసా.............." ఆ విగ్రహం మొహం లోకి చూస్తూ అంది. "...........అన్ని దేవుళ్ళలోకన్నా ఈ కబుసా అంటే నీకు చాలా ఇష్టం కదా. నువ్వెప్పుడూ కబుసా నే ఆరాధిస్తావ్." 

"అవును" చిన్నగా నవ్వి మల్లిక దగ్గరికి వచ్చి తన ఎడమపక్క నిలబడ్డాడు. "కబుసా అమ్మాయిల్ని ఎక్కువగా ఇష్టపడుతూవున్నా, మగవాళ్ళని కూడా కరుణిస్తూనూ ఉంటాడు. కొంత కష్టపడితే, తక్కిన దేవుళ్ళకన్నా కాస్త త్వరగానే లభ్యమవుతాడు. అందుకనే నేను కబుసా నే పూజిస్తాను."

"నాకు తెలిసినప్పటినుండీ నువ్వు కబుసా నే పూజిస్తున్నావ్. అయినా నీకు తన అనుగ్రహం దక్కలేదు. భవిష్యత్తులో ఏమిటి గ్యారంటీ?" ఇంకా కబుసా మొహంలోకే చూస్తూ అంది. "నువ్వు ఈ కబుసా ని మర్చిపోయి తక్కిన దేవుళ్ళనెవరినయినా పూజించడం మంచిది."

"నాది కబుసా తో జన్మ, జన్మల అనుభందం అనిపిస్తుంది. అందుకనే ఇంకా కరుణించకపోయినా కబుసాని తప్ప ఎవరినీ పూజించాలని అనిపించదు. నాకు చాలా నమ్మకం. ఎదో ఒక రోజు ఈ కబుసా కరుణ నాకు పూర్తిగా లభిస్తుందని నా నమ్మకం.”  కాస్త ఆగి అన్నాడు మళ్ళీ. "నువ్వు కబుసా మీద చూపిస్తున్న ఆసక్తి నేను గమనించడం లేదు అనుకోకు. ఎప్పటికయినా కబుసా ఎన్నుకున్న కన్నెపిల్లని అవుతానని నీ అభిప్రాయం. కబుసా అనుగ్రహిస్తే వచ్చే శక్తులమీద నీకూ ఆసక్తిగా వుంది."              

ఏదో  మాట్లాడబోతూ "ఆ.........." అంటూ అరిచింది మల్లిక. ముందుకు తూలిపడబోయి నిలదొక్కుకుంది.

"ఏం జరిగింది నీకు? ఎందుకలా అయింది?" మల్లిక ని రెండుచేతులతో పట్టుకుని ఆందోళనగా అడిగాడు సింహరాజు.

"నాకూ అర్ధం కావడం లేదు." సింహరాజు మొహంలోకి చూస్తూ అంది మల్లిక. "అకస్మాత్తుగా కబుసా కళ్ళల్లో ఎదో మెరుపుని చూసాను. అది నా భ్రమా  లేక నిజమా అని ఆలోచిస్తూవుంటే నన్ను కబుసా వైపు ఎవరో లాగినట్టుగా అయింది."

షాక్ తిన్నట్టుగా మల్లిక ని వదిలేసాడు సింహరాజు. "నువ్వు నిజమే చెప్తున్నావా?"

"అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేమిటి?" చిరాగ్గా అంది మల్లిక.

దానికి ఏం మాట్లాడకుండా, అదే షాక్ తో, మల్లిక మొహం లోకి అలాగే చూస్తూ వున్నాడు సింహరాజు.

"నువ్వెందుకు అలా అయిపోయావ్?" సింహరాజు ని రెండుచేతులతో పట్టుకుని కుదుపుతూ అడిగింది మల్లిక.

"కబుసా ఎవరినన్నా ఇష్టపడుతూ వున్నప్పుడు వాళ్ళు అతని కళ్ళల్లో మెరుపుని చూస్తారు. వాళ్ళని తనవైపు కబుసా ఆకర్షించుకున్నప్పుడు, వాళ్ళకి తమని లాగినట్టుగా అనిపిస్తుంది." షాక్ లోనుండి బయటకి వచ్చి అన్నాడు. "ఈ విషయం గురించి నీకు తెలియదా?"

"అంటే ఈ కబుసా నన్ను ఇష్టపడుతున్నాడంటావా?" మరోసారి కబుసా మొహం లోకి చిరునవ్వుతో చూస్తూ అడిగింది మల్లిక. "నువ్వు చెప్పిన విషయం అయితే నేనిప్పటివరకూ వినలేదు."

"అందులో సందేహం ఏమీ లేదు. నువ్వు పూజించడం మొదలు పెట్టాలె కానీ, చాలా త్వరగా తను నిన్ను కరుణిస్తాడు. ఒకసారి కబుసా మన్ని కరుణించాక, మనకి అతని అనుగ్రహం దొరికాక మనం చెయ్యలేనిదంటూ ఏమీ ఉండదు. ఇన్ని రోజులుగా నేను కబుసాని పూజిస్తూవున్నానాకు నీలాంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు. నాకు నిన్ను చూస్తూ ఉంటే అసూయగా వుంది." ఒక అసూయ ఫీలింగ్ ని మొహం లో నటిస్తూ  అన్నాడు సింహరాజు.

"అయితే నేను కబుసా ని పూజిస్తాను. ఆ దేవుడి కరుణ నాక్కావాలి." మరోసారి సింహరాజు వైపు తిరిగి, అతని మొహం లోకి చూస్తూ అంది.

"మంచి ఆలోచనే. కానీ నీ మామ్మకి తెలిస్తే నా తోలు తీసేస్తుంది. ఈ చెడ్డ దేవుళ్ళని నేను పూజించడమే ఇష్టం లేదు. ఇంక నిన్నూ ఇందులోకి లాగాను అంటే ఊరుకుంటుందా?" భయంగా అన్నాడు.

నవ్వింది మల్లిక. "నిజమే కానీ, నా మామ్మ కి తెలియకుండా చేయలేమా? ఇంక ఈ వూళ్ళో నాకు వేరే పనేముంటుంది, నా మామ్మ చేసేవే చెయ్యడం తప్ప. ఆ కబుసా కరుణని సంపాందించుకుంటే, చాలా శక్తులొస్తాయి ఏదైనా చెయ్యొచ్చు అంటున్నావు కదా. ఏ శక్తీ లేకపోతె వూరుకుందామనుకున్నాను కానీ, శక్తులొస్తే చేద్దామనుకుంటున్నవి చాలానే వున్నాయి. ముందుగా మనందరి దరిద్రం వదిలేలా చేస్తాను."

"నీ మామ్మ కి తెలిస్తే పెద్ద రాద్ధాంతమే అవుతుంది. కబుసా గురించి తనకీ బాగానే తెలుసు. ఒకప్పుడు ఆ కుటుంబం వీటిల్లో ఉండేది. నువ్వు కబుసాని పూజిస్తున్నావంటే ఊరుకోదు." అయిష్టంగా అన్నాడు సింహరాజు             

"నేను అక్కడ నానా బాధలు పడుతున్నావూరుకోగలదు.  నా నాన్న మా అమ్మ వల్ల బాగుపడి నన్ను పట్టించుకోకపోయినా వూరుకోగలదు. కానీ నాకు ఇష్టమైన పని చేస్తే మాత్రం వూరుకోలేదా?" చిరాగ్గా అంది మల్లిక. "నా మామ్మ కి విషయం తెలిసిన రోజున నేను చూసుకుంటాను కానీ, కబుసాని నేను పూజిస్తాను."

"సరే అయితే. తప్పకుండా అలాగే." ఎందుకో తన భయం పోయినట్టుగా ముఖం ప్రశాంతం గా అయి చిరునవ్వు నవ్వాడు సింహరాజు.

"మరయితే ఇంకెదుకు ఆలస్యం? ఇప్పటినుండే నేను కబుసాని పూజించడం ప్రారంభిస్తాను." ఉద్యుక్తురాలు అవుతూ అంది మల్లిక.

"ఇప్పటికే బాగా చీకటిపడింది. ఇప్పటికి నువ్వు ఇంటికి వెళ్లిపోవడం మంచిది. మనం ఇది రేపటినుండి ప్రారంభిద్దాం. అయినా నువ్వు కబుసా ని పూజించడానికి ముందుగా ఆ దేవుడి గురించి చెప్పాల్సినది కూడా చాలా వుంది."

"సరే అయితే." తలూపింది మల్లికా. "మరి రేపు నేను ఏ సమయానికి ఇక్కడికి రాను?"

"ఉదయం వంట చేసాక పొలంలోకి పనిలోకి వెళ్ళిపోతుంది నీ మామ్మ. అప్పుడు రా. నీకు కబుసా గురించి పూర్తిగా చెప్పి, తనని ఎలా పూజించాలో చెప్తాను."

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)