శీర్షిక: పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపే ఎందుకు తిరుగుతుంది? దాని వెనుక ఉన్న ఒక అందమైన, నిస్వార్థమైన ప్రేమ కథ... నా ఊహల్లోంచి వచ్చిన చిన్న ప్రయత్నం."
కథ : నిస్వార్థ ప్రేమానురాగం – పొద్దుతిరుగుడు జన్మరహస్యం
ఒకానొక పూర్వకాలంలో, ప్రకృతి ఒడిలో పరవశిస్తూ ఉన్న ఒక సుందరమైన నందనవనం ఉండేది. ఆ తోటలో ఎన్నో రకాల రంగురంగుల పూల మొక్కలు, గుబాళించే సువాసనలు వెదజల్లే పుష్పాలు ఉండేవి. ఒక్కొక్క పువ్వు కు ఒక్కొక్క ప్రత్యేకం ఉండేది. ప్రతి పువ్వు లోన ఏదో ఆకర్షణ ఉండేది. అలాంటి పువ్వుల మధ్యలో ఈ పువ్వు ఎంతో ప్రత్యేకమైన, అందమైన పుష్పం నివసిస్తూ ఉండేది. ఆ పువ్వుకు ఒక వింతైన అలవాటు, అంతకుమించిన అమాయకమైన మనసు ఉండేవి.
తోటలోని మిగిలిన పూలన్నీ తమ అందాన్ని చూసుకుని మురిసిపోతుంటే, ఈ పువ్వు మాత్రం ప్రతిరోజూ ఉదయాన్నే ఆకాశంలో ఉదయించే సూర్యభగవానుడిని చూస్తూ పరవశించిపోయేది.సూర్యుడు తూర్పున ఉదయించిన క్షణం నుండి సాయంత్రం పశ్చిమాన అస్తమించే వరకు, ఆ పువ్వు తన కనురెప్పలను కూడా తిప్పకుండా కేవలం ఆ భానుడి వైపే చూస్తూ ఉండేది. ఎంతగా అంటే... ఆ సూర్యుడి తీవ్రమైన వేడికి తన రేకులు కాలిపోతున్నా, శరీరం మాడిపోతున్నా తను అస్సలు లెక్కచేసేది కాదు. "అతడి వేడి నన్ను దహించివేసినా పర్వాలేదు, కానీ అతడిని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను" అనేంత పిచ్చిగా, నిస్వార్థంగా ఆ సూర్యుడిని ప్రేమించింది.
తోటలోని తోటి పూలన్నీ ఆమెను చూసి వింతగా నవ్వుకునేవి. "ఓ పిచ్చి పుష్పమా! అంత ఎత్తున ఉన్న ఆకాశ సూర్యుడితో నీకేం పని? నీ అందం, సుకుమారం ఆ వేడికి కరిగిపోతాయి జాగ్రత్త!" అని హెచ్చరించేవి. "ఇది ఒక పిచ్చి పువ్వు, అందుకోలేని వాటి కోసం ఆరాటపడుతుంది" అని ఆ పువ్వును చూసి తోటి పువ్వులన్నీ హేళన చేస్తూ నవ్వుకునేవి.కానీ ఆ పువ్వు ఎవరి మాటలను పట్టించుకోలేదు.
ఆ భానుడి వెలుగే తన సర్వస్వం అనుకుంది. ఆరాధనలో ఉన్న ఆనందం, లోకంలోని ఏ భోగాలలోనూ లేదని ఆమె నమ్మింది. "ఏదో ఒకరోజు ఆ భానుడు నన్ను కరుణిస్తాడు... ఒకవేళ కరుణించకపోయినా పర్వాలేదు, అతడిని చూస్తూనే నా జీవితాన్ని గడిపేస్తాను" అని తన మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి.
చివరికి ఆ పువ్వు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ శుభదినం రానే వచ్చింది!ఆ పువ్వు చూపిస్తున్న అచంచలమైన ఓపికను, ఎనలేని ప్రేమను ఆకాశం నుండి సూర్యుడు ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నాడు.
ఒకరోజు ఆ పువ్వు పడుతున్న తపనను చూడలేక, సూర్యుడు స్వయంగా భూమి పైకి దిగివచ్చి ఆ తోటలో నిలిచాడు. తేజోమయమైన సూర్యుడిని అంత దగ్గరగా చూసి ఆ పువ్వు ఆనందంతో ఉప్పొంగిపోయింది.అప్పుడు సూర్యుడు ఎంతో శాంతంగా, "ఓ ప్రియమైన పుష్పమా! నేనంటే నీకెందుకు అంత ఇష్టం? నా వేడి వల్ల నీవు మాడిపోతావని, నీ అందం నశిస్తుందని తెలిసి కూడా ఎందుకు ఎల్లప్పుడూ నా వైపే చూస్తూ ఉంటావు?" అని ప్రశ్నించాడు.
దానికి ఆ పువ్వు ఏమాత్రం తడుముకోకుండా, కళ్ళల్లో అమితమైన భక్తితో, "స్వామీ! నిన్ను చూస్తూ కాలిపోవడానికైనా నేను సిద్ధమే కానీ, నిన్ను చూడకుండా మాత్రం జీవించలేను. నిన్ను చూసే భాగ్యం కోసం, నీ వెలుగులో లీనమవ్వడం కోసం నేను వాడిపోయి, నేల రాలిపోయినా నాకు ఎలాంటి బాధా లేదు. నా ప్రాణం కన్నా నీ దర్శనమే నాకు ముఖ్యం. నీవు లేని ఈ విశ్వం నాకు చీకటిమయం" అని తన మనసులోని నిస్వార్థమైన ప్రేమను చాటుకుంది.
ఆ చిన్న పువ్వు పలికిన అమృత వాక్యాలకు, ఆమె హృదయంలోని పవిత్రమైన నిస్వార్థ ప్రేమకు సూర్యుడు ఎంతో మురిసిపోయాడు. ఆమె భక్తికి మెచ్చి, "నీ నిస్వార్థ ప్రేమ నన్ను కదిలించింది. నీ మనసు ఎంతో గొప్పది, నీకేం కావాలో కోరుకో... నీ కోరికను నేను తప్పక తీరుస్తాను" అని అభయమిచ్చాడు.
అప్పుడు ఆ పువ్వు, "నాకు సంపదలు వద్దు, వేరే ఏ వరాలు వద్దు స్వామీ. నిన్ను చూడని రోజంటూ నా జీవితంలో రాకూడదు. నా చివరి శ్వాస వరకు నిన్ను చూస్తూనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. నీ నీడలోనే నా జీవితం ముగిసిపోవాలి" అని వేడుకుంది.సూర్యుడు మందహాసం చేస్తూ, "సరే! ఇకపై ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఆకాశంలో ఎటు వైపు ప్రయాణిస్తే, నువ్వు కూడా అటు వైపే తిరిగి నన్ను చూసే శక్తిని నీకు ఇస్తున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత, రాత్రి వేళల్లో మళ్ళీ నేను తిరిగి వచ్చేవరకు నువ్వు నా ధ్యానంలో ముకుళించుకుపోతావు" అని అద్భుతమైన వరమిచ్చాడు. ఆ రోజే సూర్యుడు దానికి ‘పొద్దుతిరుగుడు’ అని నామకరణం చేసి వెళ్ళిపోయాడు. నాటి నుండి నేటి వరకు ఆ పువ్వు తన పేరును, సూర్యుడు ఇచ్చిన వరాన్ని తలుచుకుంటూ ప్రతిరోజూ ఆనందంతో మురిసిపోతూనే ఉంది. ఈనాటికీ పొద్దుతిరుగుడు తోటలు ఆ సూర్య దేవుని నిస్వార్థ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి.