Yevaru..? - 16 in Telugu Crime Stories by Suresh Josyabhatla books and stories PDF | ఎవరు....? - 16

Featured Books
  • पत्थर तले

                    &nbs...

  • Dangerous Love - 13

    डेविड: सोचो, इस समय तुम्हारी माँ घर पर अकेली होगी। अगर इस सम...

  • रूह का आखिरी सफर

    प्लेटफार्म नंबर चार पर जैसे मौत का सन्नाटा पसरा हुआ था। दिसं...

  • do dilo ka intezar

    दो दिलों का इंतज़ारएक छोटे से गाँव में मोहित नाम का एक लड़का...

  • जिंदगी की दूसरे किनारा - 36

    जिंदगी की दूसरा किनारा पार्ट 36और वहीं दूसरी तरफ मेघना के दु...

Categories
Share

ఎవరు....? - 16

Part - 16 

సమయం : సాయంత్రం 6:45 గంటలు
విజయవాడకు వస్తున్న SIT వాహనం

కారు విజయవాడ నగరంలోకి ప్రవేశించి కమిష్నరేట్ ఆఫీసు వైపుకి వెళుతోంది.

సాగర్ వర్మ వాట్సాప్ లొ వంశి పంపిన PDF ఫైల్‌ను మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాడు.

ఫోటో క్రింద ఉన్న పేర్లు అతని మనసులో తిరుగుతున్నాయి.
Dr. Madhav (డా. మాధవ్) 
Dr. Raghava Rao (డా. రాఘవ రావు)
Dr. Anirudh Sen (డా. అనిరుద్ సేన్)

సాగర్ చూపు మూడో వ్యక్తి పేరుమీదే ఆగిపోయింది.

సాగర్ వర్మ : "డా. అనిరుద్ సేన్...?"

అతను మెల్లగా మళ్ళీ చదివాడు.
అప్పుడే...
జాన్ బాబు ముందుకు వంగి అడిగాడు.

ఎస్.ఐ జాన్ బాబు : ఏమైనా దొరికిందా సార్...?

సాగర్ ఫోన్ అతనివైపు తిప్పాడు.
జాన్ బాబు కూడా ఆ ఫోటో చూశాడు.
కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు.

ఎస్.ఐ జాన్ బాబు : సార్...ఈ పేరు...ఎక్కడో విన్నట్టుంది.

సాగర్ అతని వైపు చూశాడు.

సాగర్ వర్మ : ఎక్కడ...?

జాన్ బాబు కాసేపు ఆలోచించాడు.
హఠాత్తుగా అతని ముఖంలో గుర్తొచ్చిన భావం కనిపించింది.

ఎస్.ఐ జాన్ బాబు : సార్...డాక్టర్ సమర్జిత్ సేన్...ఆయన గురించి పూర్తి వివరాలు సేకరించమని చెప్పారుగా. అలా సేకరించిన వివరాలలొనె ఈ అనిరుధ్ సేన్ అనే పేరు మొదటిసారి చదివాను.

సాగర్ ఒక్కసారిగా నిటారుగా కూర్చున్నాడు.

సాగర్ వర్మ : అవునా ఆయనకి ఈయనకి ఏంటి సంబంధం.?

ఎస్. ఐ జాన్ బాబు : ఆయన సమర్జిత్ గారికి సొంత బాబాయి సార్. అంతె కాకుండా వాళ్ళిద్దరి మద్యన కుటుంబ సంబంధం కంటే వృత్తి సంబంధం ఎక్కువగా ఉంది. ఆయన సమర్జిత్ గారికి గురువులా ఉండేవారట.

ఎస్.ఐ సుందర్ : వృత్తిపరంగానా..? ఎలా సమర్జిత్ సేన్ వచ్చి ఫారన్సిక్ లొ టాక్సికాలజి అనాలిస్ట్. ఈ వివరాలు బట్టి చూస్తె అనిరుద్ సేన్ ఒక వైద్యుడు. ఇద్దిరికి వృత్తిపరమైన సంబంధం ఎలా కుదిరింది.?

ఎస్. ఐ జాన్ బాబు : సమర్జిత్ సేన్ MBBS, MD (Forensic) చదివింది కాలేజీల్లోనే. కానీ గిరిజన సాంప్రదాయ మందులు, మూలికలు, అంతెకాకుండా నేచురల్ టాక్సికాలజిలొ ప్రాక్టికల్ రీసర్చ్ ఇవన్నీ మాత్రం అనిరుధ్ సేన్ దగ్గరే చేశాడట. అందుకే ఆయనను గురువుగా భావిస్తాడని సమాచారం వచ్చింది.

సాగర్ మళ్ళీ ఫోటో వైపు చూశాడు.
డా. రాఘవ రావు...
డా. మాధవ్...
డా. అనిరుధ్ సేన్...
ఈ ముగ్గురి మధ్య సంబంధం...
ఇప్పుడిప్పుడే కొత్త రూపం దాల్చుతోంది.

అదే సమయంలొ...
విజయవాడ కమీష్నరేట్ ఆఫిస్

ఏ.సీ.పి అజయ్ ఇంకా కంప్యూటర్ ముందే కూర్చున్నాడు.
ప్రవీణ్ పంపిన రిపోర్ట్స్ను మళ్ళీ చదువుతున్నాడు.
కొద్దిసేపటి తరువాత...
అతను ఇంటర్‌కామ్ తీసి ఎవరికొ కాల్ చేశాడు.

ఏ.సి.పి అజయ్ : ప్రవీణ్... ఒకసారి నా క్యాబిన్‌కి రా.

రెండు నిమిషాల తరువాత...
ఎస్.ఐ ప్రవీణ్ లోపలికి వచ్చాడు.

ఎస్.ఐ ప్రవీణ్ : చెప్పండి సార్

అజయ్ కంప్యూటర్ స్క్రీన్ వైపు చూపించాడు.

ఏ.సి.పి అజయ్ : ఈ డాక్టర్ అనిరుధ్ సేన్ ఎవరు..? ఆయన గురించి ఏమైనా వివరాలు ఉన్నాయా..?

ఎస్.ఐ ప్రవీణ్ : ఉన్నాయి...

అని తన చేతిలో ఉన్న ఫైల్ తెరిచాడు.

ఎస్.ఐ ప్రవీణ్ : డా.అనిరుధ్ సేన్. ప్రస్తుతం ఆయన వయసు సుమారు 80 సంవత్సరాలు. 
ప్రాథమికంగా MBBS పూర్తి చేశారు.
తరువాత ఫార్మకాలజీ (Pharmacology)లో MD చేశారు.
ఆ తర్వాత ఔషధ మొక్కలు (Medicinal Plants) మరియు ఎత్నోఫార్మకాలజీ (Ethnopharmacology) పై డాక్టరల్ రీసెర్చ అంటె పీ.హెచ్.డి చేశారు.

ఏ.సీ.పి అజయ్ : ఈ ఎత్నోఫార్మకాలజీ (Ethnopharmacology) అంటె ఏంటి..?

ఎస్.ఐ ప్రవీణ్ : "గిరిజన సాంప్రదాయ ఔషధ శాస్త్రం". అంటే గిరిజనులు, స్థానిక ప్రజలు తరతరాలుగా ఉపయోగిస్తున్న ఔషధ మూలికలు, వాటి వైద్య గుణాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసే విభాగం.

అజయ్ స్వల్పంగా తల ఊపాడు.

ఎస్.ఐ ప్రవీణ్ : ఆయన చాలా సంవత్సరాలు భారత ప్రభుత్వ ట్రైబల్ హెల్త్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ (Tribal Health Research Programmes) లో మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్ (Medical Research Scientist)గా పనిచేశారు.

అజయ్ శ్రద్ధగా వింటున్నాడు.

ఎస్.ఐ ప్రవీణ్ : అంతెకాకుండా గిరిజన ప్రాంతాల్లో ఉపయోగించే అరుదైన ఔషధ మొక్కలు, సహజ విషపదార్థాలు, వాటి రసాయనిక లక్షణాలు, కొత్త ఔషధాల అభివృద్ధి... ఇవే ఆయన ప్రధాన పరిశోధనా రంగాలు.
దేశవ్యాప్తంగా ఎన్నో ట్రైబల్ మెడికల్ సర్వె ప్రోగ్రామ్స్ (Tribal Medical Survey Programmes)కి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ (Principal Investigator) మరియు టెక్నికల్ కన్సల్టెంట్ (Technical Consultant) గా కూడా వ్యవహరించారు.

అజయ్ కుర్చీలో కొద్దిగా ముందుకు వంగాడు.

ఏ.సి.పి అజయ్ : మరి... మాధవ్, రాఘవ రావులతో సంబంధం...?

ఎస్.ఐ ప్రవీణ్ : 1995లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక ట్రైబల్ మెడికల్ సర్వె ప్రోగ్రామ్స్ (Tribal Medical Survey Programmes)లో ముగ్గురూ మొదటిసారి కలిసి పనిచేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాల పాటు అంటె 2015 వరకు దేశంలోని వివిధ గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, పరిశోధనా కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నట్టు అధికారిక వివరాలు ఉన్నాయి.

అజయ్ నిశ్శబ్దంగా వింటున్నాడు.

ఎస్.ఐ ప్రవీణ్ : ఇంకో విషయం ..

ఏ.సి.పి అజయ్ : ఏంటి...?

ఎస్.ఐ ప్రవీణ్ : ఈ డా. అనిరుద్ సేన్ ఎవరొ కాదు. మన కేసుకి సహాయం చేసిన డాక్టర్ సమర్జిత్ సేన్ గారికి సొంత బాబాయి. అంతె కాదు సార్ వృత్తిపరంగా అయనికి డా. అనిరుద్ సేన్ గురువు.

ఏ.సి.పి అజయ్ : వృత్తిపరంగానా...?

ఎస్.ఐ ప్రవీణ్ : అవును.  డా. సమర్జిత్ గారు MD పూర్తయ్యాక కొంతకాలం పాటు ఆయన బాబాయి అయినటువంటి డా. అనిరుధ్ సేన్ ఆధ్వర్యంలో నేచురల్ టాక్సికాలజి (Natural Toxicology) అంటె సహజ విషపదార్ధాలపై పరిశోధనలు మరియు ఔషధపు మొక్కలుపై ట్రైబల్ మెడిసన్ రీసర్చ్ ప్రాజెక్ట్స్ (Tribal Medicine Research Projects)లో పనిచేసినట్టు సమాచారం దొరికింది.

అజయ్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి.

ఏ.సి.పి అజయ్ : ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు...?

ప్రవీణ్ ఫైల్ మూసేశాడు.

ఎస్.ఐ ప్రవీణ్ : అదే ఇప్పుడు అసలు సమస్య. 2015 వరకు ఆయన ప్రభుత్వ, వైద్య పరిశోధనా కార్యక్రమాల్లో చురుకుగా ఉన్నారు. కానీ...

ఏ.సి.పి అజయ్ : ఆ.. కాని..?

ఎస్.ఐ ప్రవీణ్ :  2015 తర్వాత ఆయన పేరు ఎక్కడా కనిపించడం లేదు.
"రిటైర్మెంట్ రికార్డు లేదు."
"కొత్త పరిశోధనలు లేవు."
"సెమినార్లు లేవు."
"ప్రభుత్వ ప్రాజెక్టులు లేవు."
"అధికారికంగా మిస్సింగ్ కేసు కూడా లేదు."
ఒక్క మాటలో చెప్పాలంటే. 2015 తర్వాత డాక్టర్ అనిరుధ్ సేన్ ఆచూకీ ప్రభుత్వ రికార్డుల్లో పూర్తిగా మాయమైంది.

సమయం : సాయంత్రం 7:15 గంటలు
విజయవాడ పోలీస్ కమిషనరేట్

సాగర్ వర్మ మిగతా అధికారులు ఉన్న వాహనం నెమ్మదిగా కమిషనరేట్ ఆవరణలోకి ప్రవేశించింది.

కారు ఆగగానే...
సాగర్ వర్మ, ఎస్‌.ఐ సుందర్, ఎస్‌.ఐ జాన్‌బాబు ముగ్గురూ దిగారు.

పొనికెగూడెం నుంచి తిరిగి వచ్చిన అలసట వాళ్ల ముఖాల్లో కనిపిస్తున్నా...
సాగర్ కళ్లలో మాత్రం కొత్త ఆలోచనలు తిరుగుతున్నాయి.

ముగ్గురూ నేరుగా భవనం లోపలికి నడిచారు.

కమిషనరేట్ లోపల ఎప్పటిలాగే హడావిడిగా ఉంది.
ఒకవైపు ఫిర్యాదుదారులు... మరోవైపు కానిస్టేబుళ్ళ రాకపోకలు... వైర్‌లెస్ సెట్ల శబ్దాలు...

సాగర్ వర్మ నేరుగా లోపలికి నడుస్తుండగా...
కారిడార్‌లో ఎదురుగా...
ఏ.సి.పి అజయ్, ఎస్.ఐ ప్రవీణ్ ఫైళ్లతో వస్తూ కనిపించారు.

ఏ.సి.పి అజయ్ : సార్... ఇప్పుడే వచ్చారా...?

సాగర్ వర్మ : అవును...

ఏ.సి.పి అజయ్ : పొనికెగూడెంలొ మనకి ఏమైనా ఉపయోగపడే విషయం దొరికిందా...?

సాగర్ స్వల్పంగా నవ్వాడు.

సాగర్ వర్మ : కొన్ని విషయాలు దొరికాయి... కానీ అవి నిర్ధారించుకోవడానికి ఇంకొంత సమయం పడుతుంది.

అజయ్ తల ఊపాడు.

అదె సమయంలొ అజయ్ చేతిలో ఉన్న ఫైల్ సాగర్ దృష్టిని ఆకర్షించింది.

సాగర్ వర్మ : ఏంటి ఆ ఫైల్..? ఏదైనా కొత్త విషయం దొరికిందా...?

ఏ.సి.పి అజయ్ : ఇది డా. మాధవ్ గారి సంబంధించిన ఫైల్ సార్. ఇంక కొత్త విషయం అంటె డా. మాధవ్ మరియు డా. రాఘవ రావు కాకుండా మరొ కొత్త వ్యక్తి పేరు కూడా పైకి వచ్చింది.

సాగర్ వర్మ : డాక్టర్ అనిరుధ్ సేన్...?

అజయ్ ఆశ్చర్యపోయాడు.

ఏ.సి.పి అజయ్ : మీకు కూడా తెలిసిందా సార్...?

సాగర్ వర్మ : ఇందాకలె తెలిసింది.

అజయ్ తల ఊపాడు.

సాగర్ వర్మ : ఇంకేం వివరాలు తెలుసుకున్నారు...?

ఏ.సి.పి అజయ్ : మన ప్రవీణ్ సేకరించిన వివరాల ప్రకారం...
1995 నుంచి చాలా సంవత్సరాలు ముగ్గురూ కలిసి గిరిజన ప్రాంతాల్లో వైద్య పరిశోధనలు చేశారు.
కాని అనిరుధ్ సేన్ ప్రస్తుతం ఎక్కడున్నారో మాత్రం అధికారిక రికార్డుల్లో కనిపించడం లేదు.

సాగర్ కాసేపు ఆలోచించాడు.

సాగర్ వర్మ : ఆయన కనిపించడం లేదంటే... ఆయన చనిపోయారని కూడా మనం అనుకోకూడదు. అలాగని బతికే ఉన్నారని కూడా అనుకోకూడదు. వాస్తవం ఏంటో ఆధారాలతోనే తేల్చాలి.

ఏ.సి.పి అజయ్ : అవును సార్

సాగర్ వర్మ : సరె... ఆయన గురించి పూర్తి వివరాలు సేకరించండి. కుటుంబ సభ్యులు... పాత సహచరులు... ప్రభుత్వ రికార్డులు...
ఏదీ వదలొద్దు. 

ఏ.సి.పి అజయ్ : అదె పనిమీద ఉన్నాం సర్

సాగర్ వర్మ : గుడ్.. రేపు ఉదయం 9:00 గంటలకి అందరు ఒకసారి మీట్ అవుదాం. ఇప్పటివరకు మనందరికి దర్యాప్తులో దొరికిన ప్రతిదీ ఒకసారి కలిసి పరిశీలిద్దాం.

ఏ.సి.పి అజయ్ : సరే సర్.

సాగర్ వర్మ : ఇంతకి రాఘవరావు గారి నంబర్ని డా. మాధవ్ ఇంటి చుట్టుప్రక్కల ఎవరు వాడుతున్నారొ కనుక్కున్నారా..? 

ఏ.సి.పి అజయ్ : ఇంకా స్పష్టంగా తెలియలేదు సార్. ఇంకోసారి అయన వద్దకు వెళ్ళాల్సి ఉంటుంది.

సాగర్ వర్మ : జాగ్రత్త అసలె ఆయనకి ఆ చుట్టుప్రక్కలంతా చాలా మంచి పేరు ఉంది. పూర్తి క్లారిటి లేకుండా ఏ నీర్ణయం తీసుకోకండి. ఎటువంటి అనుమానం రాకూడదు.  

ఏ.సి.పి అజయ్ : సరె సార్.

ఇద్దరూ అక్కడి నుంచి తమ తమ దారిలో వెళ్లిపోయారు.

కొద్ది నిమిషాల తరువాత...
సాగర్ తన క్యాబిన్‌లోకి వచ్చాడు. తనతొ పాటు సుందర్ మరియు జాన్ బాబు కూడా లోపలికి వచ్చారు.

సాగర్ తన కుర్చిలొ తాను కూర్చుంటె . వీళ్ళద్దరూ తనకి ఎదురుగా కూర్చున్నారు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
తర్వాత...

సాగర్ వర్మ : సుందర్ గారు ఇందాకల కారులొ మీకు చెప్పినట్టు ఈ రాత్రికె మన వాళ్ళు ముగ్గురుని ఏర్పాటు చేసి ఇద్దరిని దేవేంద్ర రెడ్డి అనుచరులు శివ మరియు వివేకల ఇంటి దగ్గర నిఘా పెట్టించండి. ఇంకొకరిని సూర్యనారాయణ పీ.ఏ రవికుమార్ ఇంటి దగ్గర పెట్టండి. రేపు ఉదయం మీటింగ్ లొ నాకు వాళ్ళు రాత్రంతా సేకరించిన వివరాలు చెప్పండి. ప్రతి రోజు వాళ్ళు సేకరించిన సమాచారాన్నీ మొత్తం ఉదయం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి చెప్పాలి.

ఎస్. ఐ సుందర్ : అలాగె సార్ ఇప్పుడె మాట్లాడి ఏర్పాటు చేస్తాను.

సాగర్ వర్మ : జాగ్రత్త వాళ్ళు పోలీసులనె ఐడెండిటి బయట పడకుండా చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. అందుకె బాగా సామర్ధ్యం ఉన్నవాళ్ళని పంపించండి. ఎదైన అత్యవసరమైతె తప్ప చిన్న వాటికి నాకు కాల్ చేయకూడదు. ఏమైన ఉంటె మీరు చూసికోండి. తరువాత ఉదయం మరియు సాయంత్రం మీటింగ్ అప్పుడు డిస్కస్ చేద్దాం.

ఎస్. ఐ సుందర్ : సరె సార్.

సాగర్ వర్మ : ఇంక మీరు జాన్ గారు. మీకు కూడా ఇందాకల చెప్పినట్టు
దేవేంద్ర రెడ్డి మరియు సూర్యనారాయణలకు సంబంధించిన గత పది సంవత్సరాల ఆర్థిక లావాదేవీలు...
బినామీ కంపెనీలు...
విదేశీ లావాదేవీలు...
ప్రైవేట్ ఒప్పందాలు...
అన్నీ పూర్తిగా బయటికి తీయండి.
ప్రభుత్వ రికార్డుల్లో లేకపోయినా...
వాటి జాడ ఎక్కడో ఒకచోట తప్పకుండా ఉంటుంది.

ఎస్.ఐ జాన్ బాబు : అలాగె సార్ 

సాగర్ వర్మ : మీకు రెండు రోజులు సమయం ఇస్తున్నా. నేను అడిగిన రిపోర్ట్స్ ఎలాగైన సంపాదించండి.

ఎస్.ఐ జాన్ బాబు : తప్పకుండా సార్ రెండు రోజుల్లొ ఆ డేటా మొత్తం మీ టేబుల్ మీద ఉంటుంది.

సాగర్ వర్మ : ఒకె ఇప్పటికె రాత్రి 8:30 అయ్యింది. మీరిద్దరు ప్రయాణ వల్ల అలిసిపోయారు. ఇళ్ళకు వెళ్ళి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి తరువాత మనకి విశ్రాంతి దొరికె సమయం దొరక్కపోవచ్చు.. రేపు ఉదయం మీటింగ్ లో కలుద్దాం.. 

ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

తరువాత సాగర్ వర్మ టేబుల్ మీద ఉన్న ఫైళ్లన్నీ పక్కకు జరిపాడు.
తెల్లటి కాగితం తీసుకున్నాడు.
పెన్నుతో...
ఒక్కొక్క పేరును రాశాడు.

డా. మాధవ్
డా. రాఘవరావు
డా. అనిరుధ్ సేన్

కొన్ని క్షణాలు...
ఆ మూడు పేర్లనే చూస్తూ ఉన్నాడు.
తర్వాత...
ఆ మూడు పేర్లను ఒకే గీతతో కలిపాడు.

ఆ గీత మధ్యలో...
ఒక పెద్ద ప్రశ్నార్థకం (?) గుర్తు వేశాడు.

అప్పుడే...
"టక్... టక్..."
అని తలుపు తట్టిన శబ్దం వినిపించింది.

సాగర్ వర్మ : కమ్ ఇన్..

ఒక కానిస్టేబుల్ లోపలికి వచ్చాడు.

కానిస్టేబుల్ : సార్... బయట ఒక వ్యక్తి మిమ్మల్ని కలవాలని వచ్చాడు.

సాగర్ వర్మ : ఎవరు...?

కానిస్టేబుల్ : పేరు చెప్పలేదు సార్. కానీ. డాక్టర్ రాఘవరావు గురించి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏదొ ఉందంటున్నాడు.

సాగర్ వెంటనే తలెత్తి చూశాడు.

అదే సమయం...
కమీషనరేట్ ఆఫీసులొ...

ఏ.సి.పి అజయ్ తన క్యాబిన్‌లో టేబుల్ మీద పరచి ఉన్న ఫైళ్లను చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.

అప్పుడే...
"టక్... టక్.."
అని తలుపు తట్టిన శబ్దం వినిపించింది.

ఏ.సి.పి అజయ్ : కమ్ ఇన్...

ఒక కానిస్టేబుల్ లోపలికి వచ్చి సెల్యూట్ చేశాడు.

కానిస్టేబుల్ : సార్... మీరు రమ్మన్న వ్యక్తిని తీసుకొచ్చాను.

అజయ్ మెల్లగా తలెత్తి చూశాడు.

ఏ.సి.పి అజయ్ : సరె లోపలికి తీసుకురా..

కానిస్టేబుల్ బయటకు వెళ్లాడు.
కొన్ని క్షణాల తర్వాత...
అరవై ఏళ్లకు పైబడిన ఒక వ్యక్తి నెమ్మదిగా క్యాబిన్‌లోకి అడుగుపెట్టాడు.

అతని ముఖంలో భయం కనిపిస్తోంది.

అజయ్ అతనిని చూసి...

ఏ.సి.పి అజయ్ : రండి... కూర్చోండి...

అని మాత్రమే అన్నాడు.

ఆ వ్యక్తి కూర్చున్నాడు.

అజయ్ టేబుల్ డ్రాయర్ తెరిచి. ఒక పాత ఫోటో బయటకు తీసి. అతని ముందుకు నెమ్మదిగా జరిపాడు.

ఆ వ్యక్తి ఆ ఫోటో వైపు చూసిన మరుక్షణమే...
అతని ముఖం రంగు మారిపోయింది.

అజయ్ అది గమనిస్తూ...
ఏమీ మాట్లాడకుండా అతని కళ్లలోకే చూస్తూ ఉన్నాడు...