అందరూ హాల్లో డిస్కషన్ పెట్టారు, జయ కూడా వచ్చాడు.
నాకు తర్వాత వారం పెళ్లి చేసేద్దామని అందరూ మాట్లాడుకుంటున్నారు, “ “ఏంటి విక్రమ్ నీకు ఓకే నా” అడిగాడు తాతయ్యా.”
నేను లేచి “ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు” అంటూ గట్టిగా అరిచాను.
తాత మళ్లీ లేచి మీదకి వచ్చాడు, మళ్లీ పీకుతాడేమో అనుకున్నా…
వచ్చి నన్ను హత్తుకొని ఏడుస్తున్నాడు, ఒకపక్క అమ్మ ఏడుస్తోంది, నాన్న నా ముందు ఏడవలేక పక్కకు తిరిగాడు, అసలు నేను ఉన్నంతవరకు వీళ్ళందర్నీ ఎంత హ్యాపీగా చూసుకుందాం అనుకున్నా, ఇప్పుడు చూడు ఏడిపించి చస్తున్నా.
వీళ్ళతో పాటు జయ కూడా ఉన్నాడు, ఎందుకో తెలియదు మౌనంగా ఉన్నాడు, బహుశా వాడికి ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాలేదేమో.
“సరే చేసుకుంటా” అని ఒప్పేసుకున్నా, ఎలాగూ గౌతమి వాళ్ళ నాన్నతో మాట్లాడతా అని చెప్పింది అనే ధైర్యం తో…
కట్ చేస్తే… నెక్స్ట్ వారం పెళ్లి, తన అభిప్రాయం అడిగితే గౌతమి ఒప్పుకుందట, తను నా మీద నమ్మకం పెట్టుకొని ఉంటుందేమో, ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి..
తెలిసిన వాళ్లందరికీ కబురు పంపించారు, ఆఫీసులో తెలిసిన వాళ్ళని పిలిచా, అందరితో పాటు చాందినీ ని కూడా రమ్మన్నాను.
తను నా వంక చూడకుండా వస్తా అంది..
ఆరోజు బుధవారం వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్ళి మంత్రాలు వినిపిస్తున్నాయి, అదే నా పెళ్ళి మంత్రాలు..
జయ వచ్చి నా రూమ్ లో కూర్చున్నాడు, దిగులుగా ఉన్నాడు.
చూడు జయ జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు, అదే నేనూ నీలా సింగిల్ గా ఉండి ఉంటే హ్యాపీగా పెళ్ళి చేసుకునేవాడిని, అయినా జీవితం ప్రతి ఒక్కరికి మారే అవకాశం ఇస్తుంది, అది ఇదే అనుకుంటున్నా….
ఈ మోటివేషన్ స్పీచ్ నాకెందు ఇస్తున్నావ్ అన్నాడు జయ..
నువ్వు నాలా కాకూడదనీ..
ఇంతలో గౌతమి రూములోకి వచ్చింది..
ఐ యాం సారీ గౌతమి వాళ్లని ఆపలేకపోయా.., నువ్వు మీ నాన్నతో చెప్తావు అనుకున్నా..
అవునా… ఇంత జరుగుతున్నా బుద్ధి రాలేదా.. అంటూ నేరుగా నా దగ్గరికి వచ్చి చెయ్యి లేపింది..
నన్ను కొడుతుందేమో అనుకున్నా, కానీ జయా చెంప మీద ఒక్క పీకు పీకింది..
“ ఎందుకు? వాడిని కొడుతున్నావ్..”
కొట్టాల చంపాలా ప్రేమించిన అమ్మాయికి ఇక్కడ పెళ్లి జరుగుతుంటే వచ్చి పెళ్ళికొడుకు రూమ్లో కూర్చున్నాడు చూడు..
నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది, అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది, గౌతమి ప్రేమించింది వీడినా, “హే నువ్వు ప్రేమించింది చందు అని చెప్పావ్..”
ఆ అది వీడే…, జయచంద్ర మా సీనియర్, ఎదవ నన్ను ప్రేమించిన విషయం ఎవరితోను చెప్పుకోడు, నేను ముద్దుగా చందు అని పిలుస్తుంటా.
అయితే మాత్రం కొట్టేస్తావా అంటూ జయ దగ్గరికి వెళ్ళి వాడ్ని కౌగిలించుకుంటున్నట్టు చెయ్యి పైకి లేపా, పిడికిలి బిగించి ముక్కు మీద గుద్దేసా.. దెబ్బకు కింద పడిపోయాడు.
ఒరేయ్ చెత్త నాయాల ఇన్ని రోజులు నా పక్కన ఉండి ఒక్కసారి అన్న ఈ విషయం చెప్పాలనిపించలేదా రా..
పడిపోయిన జయ ని తన ఒళ్ళోకి తీసుకొంది గౌతమి..”ఏంటి విక్రమ్ అలా కొట్టావ్..”.
ఆ నువ్వు కొట్టలేదా మరి.., ఎవరైనా పేర్లు అడిగినప్పుడు నిజమైన పేర్లు చెప్పాలి ఇలా ముద్దు పేర్లు, మీ కుక్కలకు పెట్టే పేర్లు ఇవి కాదు..
సారీ విక్రమ్..
నాకు ఇప్పుడు అర్థమైంది ఆ రోజు మా తాతయ్య అమ్మానాన్నలు పెళ్లి విషయం మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా కూర్చున్నావో, ఈ విషయం ఆరోజే తెలుసు కానీ చెప్పలేదు నన్ను ఒక ఎర్రి…. పప్పను చేసావ్ కద మావ
సారీ మావ, నీతో చెబుదామనే అనుకున్నా కానీ మీ తాత పెళ్ళి పనుల మీద తిప్పుతూనే ఉన్నాడు.
బ్రేకప్ అయిన తర్వాత గౌతమీ తో మాట్లాడడానికి నీకు ఎందుకంత నొప్పి.
తను నన్ను అందరిముందు తిట్టింది రా..
తను తిట్టింది నీ మంచికే అని ఇన్ని రోజులైన అర్థం చేసుకోలేక పోయావు చూడు నీకో నమస్కారం రా బాబు, నేను నా లవ్ కోసం పోయి పోయి నిన్ను సలహాలు అడిగాను చూడు.(అంటూ తల పట్టుకొని కూర్చున్నా)
“రేయ్ జయ ఒక మాట చెప్పు మా ఇద్దరిది ఒకే ఊరు అని నీకు తెలుసా.”
మనం ఆఫీస్ లో జాయిన్ అయిన రోజే తెలుసు.
ఓహో.. అందుకేనా మా ఊరి పేరు చెప్పగానే అంత రియాక్షన్ ఇచ్చావు.., మేము నీలాగే సింగల్ గా ఉండాలని మాకు లెక్చర్లు ఇచ్చావ్, అప్పుడే చెప్పుంటే ఇంతదాకా వచ్చేది కాదు..
అదీ.. తనే డైరెక్ట్ గా వచ్చి నాతో మాట్లాడుతుందని అనుకున్నా.. విక్రమ్.
ఈగో.., ఈ ఎదవ ఈగో లు మనకు అవసరమా జయ, “ ఇదిగో ఇప్పుడు తనే వచ్చింది చూడు ఆఖరి సారి మాట్లాడుకో “.
లేదు మావ తను నాకు కావాలి రా..
బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావ్ రా, ఇంకా ఏదో చేసావ్ రా అప్పుడు…, ఆ… “సింగిల్ బాయ్స్ ఆటిట్యూడ్ స్టేటస్ ” పెట్టావ్ అంటూ మళ్ళీ కొట్టడానికి వెళ్ళా, గౌతమి ఆపేసింది.
అది తనని మర్చిపోదామని అవన్నీ ట్రై చేసా, కానీ వర్కౌట్ కాలేదు.
మరి ఆఫీస్ లో అమ్మాయిని సెట్ చెయ్యమన్నావ్, అదేంటి..
ఏంటి నువ్వు అమ్మాయిల కోసం ఎగబడ్డావా అంటూ వాడి చెవి పట్టుకుంది గౌతమి..
“నువ్వు మీ నాన్నతో మాట్లాడతా అన్నావుగా గౌతమి..”
ఏంటి మాట్లాడేది మా నాన్న ఒకే మాట “రా బండెక్కు” అన్నాడు అంతే..
“ సరే ఇప్పుడు ఏం చేద్దాం అని వాళ్ళిద్దరినీ అడిగాను..”
నువ్వు ఏదోటి చేసి మా పెళ్ళి చేయి విక్రమ్ అంది గౌతమి.
నేనెందుకు చేయాలి ఇదిగో ఉన్నాడు కదా ప్రబుద్ధుడు, అంతా అయిపోయాక చెప్పేవాడు, ఈ నా మిత్రుడు.
అలా కాదు మావ అయ్యిందేదో అయ్యింది, నువ్వు తప్ప దీన్ని ఎవరు చెయ్యలేరు..
అబ్బా.. బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావ్ గా, సరే అయితే నేను మాట్లాడతా, ఇప్పుడు నేను కృష్ణుడిని మీ ఇద్దరూ అర్జునుడు, సుభద్ర.
“ఈ పెళ్లి ఆగిపోతే బాగుండు అనే ఆలోచన నాకు ముందే ఉంది…”
పక్కనే ట్రింకెట్ లో ఉన్న తాళి ని జయ చేతికి ఇచ్చి “కట్టేయ్ రా” అని చెప్పా…
ఏంటి విక్రమ్ నువ్వు అనేది, “మా నాన్నని ఒప్పించకుండానే వెళ్ళి చేసుకుంటే చంపేస్తాడు” అంది గౌతమి.
అయితే చచ్చిపో, ప్రేమ కోసం ఇద్దరు చచ్చిపోండి..
ఏంటి విక్రమ్ అలా మాట్లాడతావు…
మరేంటి గౌతమి, మీరు నాకు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా…., అదీ కాకుండా మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు.
“మా ఇంట్లో కూడా నన్ను తంతారు” అన్నాడు జయ.
అయితే ఓ పనిచేయ్, మూసుకుని తాళి కట్టు, తర్వాత తన్నించుకో..
ఇద్దరు మౌనంగా ఉన్నారు..
లేదంటే చెప్పండి నేను వెళ్లి పెళ్ళి మండపంలో కూర్చుంటా, ఇంకో ఐదు నిమిషాల తర్వాత మీ నాన్న నిన్ను బలవంతంగా తెచ్చి నా పక్కన కూర్చో పెడతాడు, అప్పుడు నాకు ఇంకో ఆప్షన్ ఉండదు ఇదే తాళి తీసి మెడలో కట్టేస్తా. నాకేం మొహమాటం లేదు….
“ఈ మెంటలోడితో ఎందుకు లే” అనుకున్నాడో ఏమో.., దెబ్బకు తాళి కట్టేశాడు..
వాళ్ళిద్దరినీ నాతో పాటు పెళ్ళి మండపానికి తీసుకెళ్లా.
నేను గౌతమి పక్కన నడుస్తున్నాం, జయ నాకంటే కొంచెం వెనకాల నడుస్తున్నాడు భయంతో..
గౌతమి మెడలో తాళి చూసిన జనం దగ్గరకు వస్తున్నారు..
మల్లి మావయ్య మాట్లాడుతూ, ఏంటి బాబు మీ కోసం ఇన్ని పెళ్ళి ఏర్పాట్లు చేస్తే మీరు ఇలా లోపలే తాళి కట్టుకుని వచ్చేసారు అని అడిగాడు నన్ను.
"ఓరి నీ దుంపలు తెగ… నా జీవితంలోని ప్రతి సీన్‌ను ఇలానే అర్థం చేసుకుంటారా?" అని మనసులో అనుకుని, అటు పక్క నిలబడి ఉన్న జయ ని గౌతమి పక్కకు తోసా.
జయ కాళ్లు మెల్లగా వణుకుతున్నాయి… నాకు నవ్వు వస్తోంది, కానీ సమయం కాదు.
ఇప్పుడు విషయం అర్థం అయినట్టుంది, మల్లి మావయ్య ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టాడు—
“ఏంట్రా విక్రమ్! పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు కాబోయే భార్యను వేరేవాడు పెళ్ళి చేసుకుంటుంటే నువ్వు ఏం చేస్తున్నావ్?”.
‘ఏంటి బాబు’ అనడం నుండి ‘ఏంట్రా’ అనే వరకు వెళ్లిపోయాడు మల్లి మామ, వీళ్లు చూస్తే ఒకపక్క ఏం మాట్లాడకుండా ఉత్త పుణ్యానికి నిలబడ్డారు.
"అది కాదు మావయ్య… నేను చెప్పేది విను”.
"నువ్వు ఆగు!" అంటూ మావయ్య మా తాత వైపు తిరిగాడు.
"ఏంది మామ… నిన్ను నమ్మి నీ మనవడితో పెళ్లి చేయిస్తావని తీసుకొస్తే ఇదా మీరు చేసేది?" అని కోపంగా అన్నాడు.
తాత ఏం మాట్లాడకుండా తల వంచుకున్నాడు.
నేను ముందుకెళ్లి, "మామ… దీనికి తాతకి సంబంధం లేదు”.
“నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు విక్రమ్, ఈ నాటకాలు నా దగ్గర వద్దు” అన్నాడు మామ.
“రేయ్..….”
నన్ను రేయ్ అంటావా..
సారీ మావయ్య మీకెలా చెప్పాలి.., “సరే ఒక మాట చెప్పు, మనమంతా శ్రీకృష్ణుని దేవుడిగా కొలుస్తాం గా?”.
అవును.. కానీ దానికి దీనికి ఏంటి సంబంధం?".
మనం దైవం లా కొలిచే కృష్ణుడే వాళ్ళ సొంత కుటుంబాన్ని యామర్చి సుభద్రకి అర్జునుడికి పెళ్లి జరిపించాడు, ఒకవేళ అదే సుభద్ర పెళ్లి వేరే ఎవరితోనో జరిగితే అంత హ్యాపీగా ఉండేదా..
మావయ్య కాస్త నిశ్శబ్దంగా ఉన్నాడు, మే బి కన్ఫ్యూస్ అయ్యాడనుకుంటా..
ఇదే సమయం అనుకుని నేను కొనసాగించాను—
ఇకపోతే ఇప్పట్లో పెళ్లి చేసుకోవడానికి అర్హత అంటావా.
“ఈ కాలంలో ఇద్దరు కలిసి ఉండాలంటే… వాళ్ళిద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉండాలి.
ఆ అమ్మాయిని జీవితాంతం పోషించే శక్తి ఉండాలి.
ఎవరో ఒకరికైనా సర్దుకుపోయే మనసు ఉండాలి.
అన్నింటికంటే ముందు… వాళ్లు ఒకరినొకరు నిజంగా ఇష్టపడాలి.”
ఇప్పుడు జరిగే విషయాలు చెప్తా విను, శారీరక సుఖాల కోసం ప్రేమ అనే ముసుగులో బ్రతికేవాళ్ళు కొంతమంది, వాళ్ళ అవసరాల కోసం ప్రేమించి వాడుకొని వదిలేసే వాళ్ళు ఇంకొంతమంది, ఇంకా కొందరైతే ఎందుకు ప్రేమిస్తారో తెలియదు, ఎందుకు వదిలేస్తారో తెలియదు.. అని వెనక్కి తిరిగి చూసా.
కళ్ళెదురుగా చాందిని ….,ఈ మాటలు వినిందేమో, అక్కడినుంచి వెళ్ళిపోయింది…
అలాంటిది మేము శుభ్రంగా పెళ్ళి చేసుకొని లైఫ్ లాంగ్ కలిసుంటాం అని వాళ్ళు చెప్తుంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు మావయ్యా..
అసలు జయ ఎలాంటివాడో తెలుసా, మాకు ఉన్న జస్ట్ మూడేళ్ల స్నేహం లో వాడు నన్ను ఎలా చూసుకున్నాడో తెలుసా, అలాంటిది తను ప్రేమించిన అమ్మాయిని ఎలా చూసుకుంటాడో మీరే ఆలోచించుకోండి..
“ మీ అమ్మాయి ఇష్టాన్ని మీరు పట్టించుకోరా?”. అని సూటిగా అడిగా..
అక్కడ రెండు నిమిషాలు మౌనం, ఎవరు ఏం మాట్లాడట్లేదు.
మా నాన్న కలుగజేసుకొని , అవునురా మల్లి… విక్రమ్ చెప్పింది నిజం, జయ కూడా నా కొడుకు లాంటివాడు, నేను అతనిని నమ్ముతున్నా, ఇక నీ ఇష్టం..
మల్లీ మామ కాసేపు ఆలోచనలో పడ్డాడు..
“మీరందరూ ఇంతగా చెప్తున్నారంటే నా కూతురు సంతోషంగా ఉంటుందని నమ్ముతున్నా అన్నాడు.”.
నేను షాక్ అయ్యా.., ఆయన ఒప్పుకుంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.
జయ నన్ను గట్టిగా హత్తుకున్నాడు, వాడి కంటి నుంచి నా వీపుపై పడుతున్న ప్రతి కన్నీటి చుక్క… వాడి హృదయం ఎంత సంతోషంగా ఉందో చెబుతున్నాయి.
గౌతమి నా వంక చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పింది…
ఆల్రెడీ తాళి కట్టేశాడు కాబట్టి, అలా శాస్త్రోక్తంగా కొన్ని మంత్రాలు చదివి పెళ్ళి పూర్తి చేశారు.
తాత ఇంటికి వెళ్తూ నా భుజం తట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
11 అవుతుంది, మేమందరం కుర్చీలను రౌండ్ గా వేసుకుని సరదాగా మాట్లాడుకుంటున్నాం.
చాందిని అటువైపు కొంచెం దూరంలో మౌనంగా కూర్చుంది.
దేవుడి ఎక్సాంపుల్ బానే చెప్పావ్, అన్నాడు జయ
మన పురాణాలు ఉన్నదే నిజ జీవితం లో సమస్య వచ్చినప్పుడు అప్లై చెయ్యడానికి..
నాకు జయ కి పెళ్లి చేశావు, ఇప్పుడు ఈ కృష్ణుడు ఏం చేస్తాడు అని అడిగింది గౌతమి.
“రుక్మిణి ఒప్పుకోకపోతే… కృష్ణుడు ఏం చేయగలడు? చెప్పు’.
అయినా నేను ఒక్క అమ్మాయిని ప్రేమించాను, ఒక్క అమ్మాయినే ప్రేమిస్తాను.
అదేంట్రా ఇందాక సెకండ్ ఛాన్స్ అని నాకు డైలాగ్స్ చెప్పావ్.., ఇప్పుడు చూస్తే ఇలా..
“ చూడు జయా…మన జీవితపు చివర్లో నిజమైన ప్రేమను ఫీల్ అవ్వాలంటే, మనం లైఫ్ లాంగ్ ఒకే అమ్మాయిని ప్రేమించాలి.
నా కథ హ్యాపీగా ఎండ్ అయినా లేదా బాధతో ఎండ్ అయినా… అది తన వల్లే జరగాలి.
ఎందుకంటే…… అది నాక్కూడా తెలీదు .”
సరే… మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను —
నాకు ఇప్పుడు ఉన్నది రెండే లక్ష్యాలు.
మొదట, నా కుటుంబాన్ని బాగా చూసుకోవడం…
రెండోది… నేను ఆలోచించడం ఆపేస్తాను.”
“ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు!” అని జయ అనుమానంగా అడిగాడు, నేనేం చెప్తానా అని వాళ్ళందరూ ఆత్రుతగా నా వంక చూస్తున్నారు..
నేను వాళ్ళ వంక చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, “ అదే ఓవర్ థింకింగ్ మానేస్తా అంటున్నా”…
“సరే… మీరు మాట్లాడుకోండి. నాకు కొంచెం పని ఉంది” అంటూ అక్కడి నుంచి బయలుదేరా..