Occult in Telugu Anything by Writer raguvaran books and stories PDF | క్షుద్ర

Featured Books
  • Her Silent Secret - 15

    शहर में उस रहस्यमय साइको किलर का नाम पिछले चार सालों से लोगो...

  • पुराने मित्र

    पुराने मित्र लेखक: विजय शर्मा एरी (Vijay Sharma Erry)समय बीत...

  • पिंकू की परी - 3

    अम्मा की तोरई और स्पेसशिप का गियर'सूं-सूं... खटर-पटर...&...

  • सावन

    सावन की दोपहर लगभग आधी खत्म हो चुकी थी और ढलते सूरज की सुन्ह...

  • पवित्र प्रेम या अभिशाप Season 2 - 22

    शाम का समय था। चौहान हवेली का मुख्य दरवाज़ा खुला।शादी से लौट...

Categories
Share

క్షుద్ర

క్షుద్ర

అధ్యాయం 1 — అగ్నిలో మొదలైన మేల్కొలుపు

అగ్నిపర్వతం గుండెలో...

అక్కడ పగలు లేదు.

రాత్రి లేదు.

చీకటి లేదు.

ఎటు చూసినా భగభగ మండుతున్న లావా మాత్రమే.

భూమి అంతర్భాగంలో ఉప్పొంగుతున్న అగ్ని ఎర్రటి సముద్రంలా కదులుతోంది. వేడి తట్టుకోలేక రాళ్లు పగిలిపోతున్నాయి. ఆ వేడికి గాలి కూడా వణుకుతున్నట్టుగా అనిపిస్తోంది.

కానీ ఆ అగ్ని మధ్యలో...

ఒక మనిషి కూర్చున్నాడు.

పద్మాసనంలో.

కళ్లను మూసుకుని.

చుట్టూ ఉన్న లావా అతని శరీరాన్ని తాకుతూ ప్రవహిస్తోంది. తల మీద పడుతోంది. భుజాల మీదుగా జారుతోంది. ఛాతీని తడుపుతోంది.

అయినా అతని శరీరానికి ఏమీ కావడం లేదు.

కాలిపోవడం లేదు.

భయపడటం లేదు.

అతని పెదవుల నుంచి ఒక్క మంత్రమే నిరంతరం బయటకు వస్తోంది.

“ఓం వారాహి మాత...”

కొద్దిసేపటి తర్వాత...

అతని శ్వాస మారింది.

మంత్రోచ్ఛారణ మరింత గంభీరంగా మారింది.

“ఓం వారాహి మాత...”

అతని శరీరంపై ఉన్న రుద్రాక్షలు ఒక్కొక్కటిగా వెలుగులు విరజిమ్మాయి.

చేతులపై...

మణికట్టులపై...

కాళ్లకు...

నడుముకు...

మెడ చుట్టూ...

ప్రతి రుద్రాక్షలోనూ ఏదో తెలియని శక్తి ప్రవహిస్తున్నట్టుగా నీలం, ఎరుపు రంగుల కాంతి మెరుస్తోంది.

అతను మెల్లగా కళ్లను తెరవడానికి ప్రయత్నించాడు.

కళ్లు కొద్దిగా తెరుచుకున్నాయి.

అంతే.

ఏదో అదృశ్యమైన శక్తి అతన్ని ఆపినట్టుగా మళ్లీ కళ్లను మూసుకున్నాడు.

అతని ముఖంలో అసహనం కనిపించింది.

“ఇంకా...”

కొద్దిసేపు నిశ్శబ్దం.

“ఇంకా ఏదో కావాలి...”

అతని పెదవులు కదిలాయి.

“ఏంటి అది?”

సమాధానం లేదు.

అతను మళ్లీ కళ్లను మూసుకున్నాడు.

“ఓం వారాహి మాత...”

ఆ మంత్రం అగ్నిపర్వతం గోడలను తాకి ప్రతిధ్వనించింది.

ఆ ప్రతిధ్వని...

ఎక్కడికో చాలా దూరం ప్రయాణించింది.

---

అదే రాత్రి...

నగరంలోని ఒక అపార్ట్‌మెంట్.

బయట ప్రపంచం మొత్తం నిద్రలో ఉంది.

వీధుల్లో అప్పుడప్పుడు దూరంగా వెళ్తున్న వాహనాల శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు.

ఒక ఫ్లాట్‌లో...

శ్యామ్ తన భార్య భారతితో కలిసి నిద్రపోతున్నాడు.

వాళ్ల పక్కనే ఇద్దరు పిల్లలు.

పదకొండేళ్ల కిరణ్.

అతని చెల్లెలు కారుణ్య.

అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.

గది కిటికీ దగ్గర ఉన్న కర్టెన్ మెల్లగా కదిలింది.

మొదట...

చాలా మెల్లగా.

తర్వాత...

గాలి వేగం పెరిగింది.

కర్టెన్లు ఒక్కసారిగా పైకి ఎగిరాయి.

గది మొత్తం చీకటిలో మునిగిపోయింది.

అదే సమయంలో...

కిటికీ బయట నుంచి...

రెండు నీలిరంగు కళ్లు మెల్లగా గదిలోకి చూశాయి.

ఆ కళ్లలో మనిషి చూపు లేదు.

ఏదో వెతుకుతున్న చూపు.

ఏదో ఎదురుచూస్తున్న చూపు.

ఒక్కసారిగా...

కారుణ్య కళ్లు తెరిచింది.

ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు.

ఆమె పక్కనే పడుకున్న కిరణ్ వైపు తిరిగింది.

తర్వాత...

ఒక్కసారిగా అతని గొంతును రెండు చేతులతో పట్టుకుంది.

గట్టిగా నొక్కింది.

కిరణ్ ఉలిక్కిపడ్డాడు.

“అమ్మా...!”

అతని గొంతులో నుంచి సరిగ్గా శబ్దం కూడా రావడం లేదు.

చేతులతో మంచాన్ని కొడుతూ తన్నుకుంటున్నాడు.

భారతి ఒక్కసారిగా నిద్రలేచింది.

“కారుణ్యా! ఏం చేస్తున్నావే?!”

ఆమె వెంటనే కారుణ్యను కిరణ్ మీద నుంచి లాగేసింది.

ఆ శబ్దానికి శ్యామ్ కూడా లేచాడు.

“ఏమైంది?! పిల్లలకు ఏమైంది?”

అతను కిరణ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నాడు.

కిరణ్ గట్టిగా దగ్గుతున్నాడు.

భారతి కారుణ్య వైపు చూసింది.

“కారుణ్యా... నీకేమైంది తల్లీ? ఏదైనా కల వచ్చిందా?”

కారుణ్య నెమ్మదిగా తల ఎత్తింది.

ఆమె కళ్లలో ఏదో వింత మెరుపు.

“కల కాదు నాన్నా...”

శ్యామ్ ఆమె దగ్గరకు వంగాడు.

“మరి?”

కారుణ్య ముఖంలో ఒక్కసారిగా క్రూరమైన చిరునవ్వు మెరిసింది.

“నిజం తెలుసుకున్నాను.”

శ్యామ్ ఏమీ అర్థం కాక ఆమెను చూస్తుండగానే...

కారుణ్య తన తలను గోడవైపు బలంగా కొట్టుకుంది.

ధబ్!

“కారుణ్యా!”

భారతి కేక వేసింది.

కారుణ్య ఆగలేదు.

మరోసారి తల కొట్టుకోవడానికి ప్రయత్నించింది.

శ్యామ్ ఆమెను పట్టుకోవడానికి ముందుకు వెళ్లాడు.

కానీ ఆమె అతని చేతుల నుంచి తప్పించుకుని మళ్లీ తలను గోడకు కొట్టబోయింది.

ఈసారి భారతి ఆమెను బలంగా కిందకు లాగింది.

“ఏం జరుగుతోంది?!”

భారతి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.

“దీనికి... ఏదో అయింది.”

ఆమె గొంతు వణికింది.

“దయ్యం పట్టిందా?”

శ్యామ్ ముఖంలో భయం మొదటిసారి కనిపించింది.

“ఏం మాట్లాడుతున్నావు?”

అంతలో కారుణ్య ఒక్కసారిగా శరీరమంతా బిగుసుకుపోయింది.

ఆమె కళ్లు పైకి తిరిగాయి.

తర్వాత...

ఆమె శరీరం కుప్పకూలిపోయింది.

భారతి ఊపిరి పీల్చుకునేలోపే...

గదిలో ఏదో అదృశ్యమైన గాలి అలజడి సృష్టించింది.

ఆ తర్వాత...

అది కిరణ్ వైపు దూసుకెళ్లింది.

కిరణ్ శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోయింది.

అతని కళ్లు తెరుచుకున్నాయి.

కానీ...

ఆ కళ్లు కిరణ్‌వి కావు.

“మిమ్మల్ని...”

అతని గొంతు మారిపోయింది.

“బతకనివ్వను!”

శ్యామ్ వెనక్కి అడుగు వేశాడు.

“కిరణ్...?”

కిరణ్ ఒక్కసారిగా శ్యామ్ మీదకు దూకాడు.

“నా జీవితం నాశనం కావడానికి నువ్వే కారణం!”

అతను శ్యామ్ గొంతు పట్టుకున్నాడు.

“దుర్మార్గుడా!”

శ్యామ్ ఊపిరాడక తంటాలు పడుతున్నాడు.

భారతి భయంతో పక్కనే ఉన్న కత్తిని అందుకుంది.

“కిరణ్!”

ఆమె కత్తితో ముందుకు రావడానికి ప్రయత్నించింది.

కిరణ్ ఒక్కసారి ఆమె వైపు చూశాడు.

అంతే.

పక్కనే ఉన్న టేబుల్ ఒక్కసారిగా గాల్లోకి లేచింది.

ధామ్!

అది భారతి తలకు బలంగా తగిలింది.

భారతి నేలపై పడిపోయింది.

ఆమె తల నుంచి రక్తం కారడం మొదలైంది.

శ్యామ్‌కు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు.

తన కొడుకు పదకొండేళ్ల వయసు.

కానీ తన ముందున్నది...

ఆ వయసుకు సాధ్యం కాని శక్తితో అరుస్తోంది.

శ్యామ్ ఒక్కసారిగా కిరణ్ చెంపపై కొట్టాడు.

“కిరణ్!”

మరోసారి.

“నా కొడుకును నాకు తిరిగి ఇవ్వు!”

ఎట్టకేలకు అతన్ని మంచానికి కట్టేశాడు.

కానీ కిరణ్ మంచాన్నే విరగ్గొట్టేంత శక్తితో కొట్టుకుంటున్నాడు.

“విడుదల చేయ్!”

అతని అరుపులు గదిని దాటిపోయాయి.

చుట్టుపక్కల వాళ్లు తలుపులు తెరిచి బయటకు వచ్చారు.

“ఏమైంది?”

“ఎవరైనా చచ్చారా?”

“లోపల నుంచి పిల్లాడి అరుపులు వస్తున్నాయి!”

కొంతమంది పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు.

అందరూ లోపలికి వచ్చిన క్షణం...

కిరణ్ ఒక్కసారిగా కళ్లను పైకి తిప్పాడు.

అతని శరీరం వదులైంది.

అతను కింద పడిపోయాడు.

---

కొద్దిసేపటికే...

శ్యామ్, భారతి ఇద్దరు పిల్లలను తీసుకుని ఆసుపత్రి వైపు పరుగులు తీశారు.

భారతి తల నుంచి రక్తం కారుతూనే ఉంది.

కారు వేగంగా దూసుకుపోతోంది.

చుట్టూ చీకటి.

రోడ్డు దాదాపు ఖాళీ.

కారు ఒక పాత స్మశానం పక్కగా వెళ్తుండగా...

ఒక్కసారిగా...

ఒక మర్రిచెట్టు కొమ్మ రోడ్డుపైకి వంగి కారు ముందు అడ్డంగా పడింది.

శ్యామ్ బ్రేక్ వేశాడు.

కారు ఒక్కసారిగా ఆగిపోయింది.

కొన్ని క్షణాలు...

ఎవరూ మాట్లాడలేదు.

ఆ చీకటిలో...

ఆ మర్రిచెట్టు కొమ్మలు గాలికి ఊగుతున్నాయి.

వాటి మధ్య నుంచి...

ఎక్కడో ఒక చోట...

రెండు నీలిరంగు కళ్లు మెరిశాయి.

---

కొన్ని రోజుల తర్వాత...

అదే అపార్ట్‌మెంట్.

రాత్రి.

అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది.

ఒకప్పుడు పిల్లల నవ్వులతో, కుటుంబాల మాటలతో నిండిపోయిన ఆ ఫ్లాట్‌లో ఇప్పుడు...

అరుపులు వినిపిస్తున్నాయి.

ఏడుపులు వినిపిస్తున్నాయి.

ఎవరో గోడల మధ్య నడుస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి.

చుట్టుపక్కల వాళ్లు భయంతో తలుపులు బిగించి పడుకుంటున్నారు.

దుప్పట్లు ముఖం మీద వేసుకున్నారు.

రాత్రి పైకప్పుపై...

ఒక తెల్లటి ఆకారం అటూ ఇటూ తిరుగుతోంది.

దాన్ని చూసిన కొందరు మరుసటి రోజే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయారు.

ఒక్కొక్క కుటుంబం...

ఒక్కొక్కటిగా...

అపార్ట్‌మెంట్‌ను వదిలి వెళ్లిపోయింది.

అన్నింటినీ చూస్తూ...

ఫ్లాట్ ఓనర్ రామారావు మాత్రం తన తలను చేతుల్లో పెట్టుకున్నాడు.

“అంతా నా తప్పే...”

అతని గొంతులో భయం.

“అంతా నా తప్పే.”

బాటిల్ తెరిచి మందు తాగాడు.

“ఇవన్నీ నా తలకు ఎందుకు చుట్టుకున్నానో...”

ఆ రాత్రి ఎలాగైనా ప్రశాంతంగా పడుకోవాలని తన గదిలోకి వెళ్లాడు.

మంచం మీద కూర్చున్నాడు.

గది నిశ్శబ్దంగా ఉంది.

అతను కళ్లను మూసుకున్నాడు.

అప్పుడే...

క్లింగ్!

టేబుల్ మీద ఉన్న చెంచా కదిలింది.

తర్వాత కత్తి.

మరొక చెంచా.

అవి ఒక్కసారిగా గాల్లోకి లేచాయి.

రామారావు కళ్ల ముందే...

అతని శరీరంలోకి దూసుకెళ్లినట్టుగా అనిపించింది.

“ఆఆఆఆ!”

అతను గట్టిగా అరిచాడు.

కళ్లు తెరిచాడు.

అన్నీ మామూలుగానే ఉన్నాయి.

కత్తి టేబుల్ మీదే ఉంది.

చెంచాలు కూడా అక్కడే ఉన్నాయి.

రామారావు గుండె వేగంగా కొట్టుకుంటోంది.

“నాకు పిచ్చెక్కుతోంది...”

అతను మంచం మీద పడుకున్నాడు.

రెండు నిమిషాలు...

నిశ్శబ్దం.

ఒక్కసారిగా...

మంచం కదిలింది.

తలకిందులైంది.

దుప్పటి అతని మెడకు చుట్టుకుంది.

రామారావు ఊపిరి ఆడక చేతులతో దాన్ని లాగడానికి ప్రయత్నించాడు.

గిలగిలా కొట్టుకున్నాడు.

కళ్లు మూసుకున్నాడు.

తర్వాత...

ఒక్కసారిగా అన్నీ ఆగిపోయాయి.

కళ్లు తెరిచాడు.

మంచం మామూలుగానే ఉంది.

గది కూడా మామూలుగానే ఉంది.

కానీ అతని శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది.

“ఇక్కడ ఇంకో నిమిషం ఉంటే చచ్చిపోతాను.”

సిగరెట్ తీసుకుని బయటికి వచ్చాడు.

తలుపు దాటుతుండగా...

ఎవరో తన ముందు నుంచి నడిచి వెళ్లినట్టుగా అనిపించింది.

రామారావు చేతిలోని సిగరెట్ కింద పడిపోయింది.

“దేవుడా...”

అతను వణికిపోయాడు.

“ఈరోజు నాకు చావు మూడినట్టుంది.”

అతను పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు.

“ఆ బ్రహ్మంగారు ఎక్కడికి వెళ్లి సచ్చారో! అనవసరంగా వీళ్ల జోలికి వచ్చాను. శ్యామ్ గాడు చచ్చాడో బతికాడో తెలియదు. అంతా నా తలకు చుట్టుకుంది!”

రోడ్డుపైకి వచ్చాడు.

అప్పుడే...

చుట్టూ ఉన్న వీధి లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి.

టక్...

టక్...

చివరి లైట్ కూడా ఆరిపోయింది.

నిశ్శబ్దం.

దూరంగా చిన్న చిన్న పురుగుల శబ్దాలు మాత్రమే.

రామారావు ఆగిపోయాడు.

అతని వెనుక...

ఏదో ఉందన్న భావన.

అతను నెమ్మదిగా తిరిగాడు.

ఏమీ లేదు.

ముందుకు చూశాడు.

అదే క్షణంలో...

ధామ్!

ఏదో వాహనం ఢీకొట్టినట్టుగా అతను నేలపై పడిపోయాడు.

కొద్దిదూరంలో ఒక బైక్ పడి ఉంది.

దాని దగ్గర...

ఒక అమ్మాయి.

రామారావు నెమ్మదిగా లేచి ఆమె వైపు నడిచాడు.

“ఇది... నిజం కాదు.”

ఆమె ముఖం కనిపించిన క్షణం...

అతని కళ్లు భయంతో పెద్దవయ్యాయి.

ఆ అమ్మాయి అతన్ని చూస్తూ...

క్రూరంగా నవ్వింది.

ఆమె ముఖం నెమ్మదిగా నీలిరంగులోకి మారింది.

ఆమె శరీరం నుంచి ఒక నీలిరంగు శక్తి తరంగంలా బయటకు వచ్చింది.

రామారావు వెనక్కి వెళ్లేలోపే...

ఆ శక్తి అతని శరీరంలోకి దూసుకెళ్లింది.

“ఏరా మగాడా...”

ఆమె గొంతు అతని లోపల నుంచి వినిపించింది.

“నిజంగా నన్ను తాకాలని ఆలోచన నీకు వచ్చింది కదా?”

రామారావు రెండు చెవులు పట్టుకున్నాడు.

“వద్దు!”

“ఇప్పుడు నీ మగతనం లేకపోతే... నన్ను తాకి ఏం పీకుతావు?”

“ఆఆఆఆ!”

అతను నేలపై పడిపోయాడు.

కొన్ని క్షణాలు...

అతని శరీరం విచిత్రంగా కొట్టుకుంది.

తర్వాత...

నిశ్శబ్దం.

స్క్రీన్ మెల్లగా బ్లర్ అవుతుంది.

ఆ బ్లర్ మధ్య...

ఎర్రటి రంగు.

రక్తంలా.

కట్.

---

మరుసటి ఉదయం...

రోడ్డు చుట్టూ జనాలు గుమిగూడారు.

రామారావు శరీరం అక్కడే ఉంది.

“దయ్యం చంపిందట!”

“నిజంగానే దయ్యం వచ్చిందా?”

“వాడిని ఎవరో కోసి చంపారా?”

“లేదురా... వాడే తనను తాను పిసికి చచ్చాడేమో!”

పోలీసులు వచ్చారు.

విచారణ మొదలైంది.

ఎంతో మందిని ప్రశ్నించారు.

ఎన్ని కోణాల్లో పరిశీలించినా...

రామారావు ఎలా చనిపోయాడో స్పష్టంగా తేలలేదు.

చివరికి...

విచారణ శ్యామ్ దగ్గరకు వెళ్లింది.

కానీ శ్యామ్ అప్పటికే ఇండియాలో లేడు.

ఆరు సముద్రాలు దాటి...

ఎక్కడికో వెళ్లిపోయాడు.

కేసులో ఆధారం లేకపోవడంతో...

ఫైల్ మూసివేయబడింది.

అన్‌సాల్వ్డ్ కేస్.

కానీ...

ఆ రాత్రి మొదలైనది అక్కడితో ఆగిపోలేదు.

---

రెండు వారాల తర్వాత...

“ప్రేమ...”

రామ్ చేతిలో ఒక పువ్వు.

“అది కూడా ఒక మత్తే!”

అతని ముందు రోజా నిలబడి ఉంది.

రామ్ చాలా ఆశగా ఆమెను చూస్తున్నాడు.

కానీ రోజా ముఖంలో మాత్రం విసుగు.

“రామ్... నువ్వు ఒక వేస్ట్ ఫెలో.”

రామ్ ముఖం మారిపోయింది.

“అంత మాట అనాల్సిన అవసరం ఉందా?”

“నీతో తిరిగితే కనీసం నా మేకప్ ఖర్చులే సరిపోవడం లేదు.”

“అది...”

“యూ ఆర్ వెరీ అన్‌లక్కీ పర్సన్.”

అంటూ ఆమె వెనక్కి తిరిగింది.

అక్కడ ఒక ఖరీదైన బైక్ మీద కిషోర్ కూర్చున్నాడు.

రోజా అతని దగ్గరకు వెళ్లింది.

“ఇతను చూడు. నీకంటే డబ్బున్నవాడు. అందగాడు. పవర్‌ఫుల్.”

ఆమె బైక్ ఎక్కింది.

“నువ్వు కూడా నీ స్థాయికి సరిపోయే అమ్మాయిని చూసుకో.”

బైక్ వెళ్లిపోయింది.

రామ్ చేతిలోని పువ్వు అలాగే ఉంది.

కొద్దిసేపు దాన్ని చూస్తూ నిలబడ్డాడు.

“రోజా... పెట్టావు కదా.”

తర్వాత ఆ పువ్వును తన చెవిలో పెట్టుకున్నాడు.

“వీళ్లంతా ఇలాగే చేస్తే నా పరిస్థితి ఏంటి?”

అతని ముఖంలో ఒక్కసారిగా ఆలోచన.

“అసలు నాకు ఎలాంటి అమ్మాయి కావాలి?”

జాబ్ మీద ఫోకస్ పెట్టాలని ప్రయత్నించాడు.

కాలేదు.

మళ్లీ ఫోన్ తీసుకున్నాడు.

గూగుల్.

ఇన్‌స్టాగ్రామ్.

ఫేస్‌బుక్.

“గర్ల్‌ఫ్రెండ్ కావాలి.”

ఒక గంట.

రెండు గంటలు.

ఎవరూ నచ్చలేదు.

చివరికి ఇంట్లోనే పాప్‌కార్న్ తింటూ టీవీ ముందు కూర్చున్నాడు.

అప్పుడు ఒక సినిమా సీన్ అతని దృష్టిని ఆకర్షించింది.

హీరో చెప్పిన మాటలు విన్న రామ్ కళ్లలో వెలుగు వచ్చింది.

“అవును!”

అతను లేచాడు.

“నాకు ఇలాంటి అమ్మాయే కావాలి.”

అతని ఆలోచనలో ఒక విచిత్రమైన కోణం.

“ఆమెకు సొంత శరీరం లేకపోతే ఏంటి?”

“నన్ను బాగా చూసుకుంటుంది.”

“నా మాట వింటుంది.”

“నన్ను రక్షిస్తుంది.”

అతను పాప్‌కార్న్ పక్కన పెట్టాడు.

ఫోన్ తీసుకున్నాడు.

గూగుల్‌లో టైప్ చేశాడు:

“దయ్యాలను పట్టుకునే వాళ్లు.”

కొన్ని ఫలితాలు వచ్చాయి.

ఒక పేరు అతని దృష్టిని ఆకర్షించింది.

దామోదర్ — ది మంత్ర.

అడ్రస్ తీసుకున్నాడు.

బైక్ స్టార్ట్ చేశాడు.

---

ఆ అడ్రస్‌కి చేరుకున్నప్పుడు రామ్ ఒక్కసారిగా ఆగిపోయాడు.

“ఏంటిది?”

అతని ముందు ఉన్న భవనం సాధారణంగా లేదు.

డోర్ దగ్గర ఒక డిజిటల్ డిస్ప్లే.

అతను తలుపు తట్టాడు.

టిక్... టిక్...

శబ్దం పెద్దగా రాలేదు.

“హలో!”

అతను గట్టిగా అరిచాడు.

డోర్ మీదున్న డిస్ప్లే ఒక్కసారిగా ఒక కోపంగా ఉన్న ఎమోజీని చూపించింది.

“ఎవడ్రా నువ్వు?”

రామ్ ఉలిక్కిపడ్డాడు.

“ఎవరు మాట్లాడుతున్నారు?”

“మేనర్స్ కూడా లేకుండా గేదెలా అరుస్తున్నావ్!”

రామ్ డోర్ వైపు పెద్ద కళ్లతో చూశాడు.

“దయ్యమా?”

కొద్దిసేపటికి అతనికి అర్థమైంది.

“అరే... ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్!”

అతను ఆశ్చర్యపోయాడు.

“మంత్రగాడనుకుంటే సైంటిస్ట్‌లా ఉన్నాడే!”

“హలో మేడం... మీ యజమాని గారు ఉన్నారా?”

“నేను మేడం కాదు.”

డిస్ప్లే మీద ముఖం మరింత కోపంగా మారింది.

“నా పేరు రేమో.”

రామ్ నోరు తెరిచాడు.

“రేమో?”

“అవును. రేమో.”

“సరే రేమో... మీ మంత్రగారు—”

“దామోదర్.”

“అదే... ఆయన ఉన్నారా?”

“ఉన్నారు. కానీ నీతో మాట్లాడాలని నాకు అస్సలు ఆసక్తి లేదు.”

రామ్ నవ్వాడు.

“నాకు ఒక గర్ల్‌ఫ్రెండ్ కావాలి.”

“అది నా సమస్య కాదు.”

“మనిషి గర్ల్‌ఫ్రెండ్ వద్దు.”

“మరి?”

రామ్ చుట్టూ చూసి నెమ్మదిగా అన్నాడు.

“నాకు దయ్యం కావాలి.”

రేమో కొన్ని క్షణాలు మౌనంగా ఉంది.

“ఏంటి?”

“దయ్యం.”

“దాన్ని గర్ల్‌ఫ్రెండ్‌గా మార్చుకుంటా.”

“నువ్వు...”

డిస్ప్లే మీద ఎర్రటి కళ్ల ఎమోజీ ప్రత్యక్షమైంది.

“ఇంత తిక్కలోడివి ఎక్కడ దొరికావురా?”

అంతలో డోర్ తెరుచుకుంది.

“లోపలికి రా.”

---

లోపల అడుగు పెట్టిన రామ్ ఆశ్చర్యపోయాడు.

గదంతా వింత పరికరాలు.

ట్రాకర్లు.

గోడలపై నక్షత్రాల నమూనాలు.

ఎక్కడికక్కడ వైర్లు.

ఏవేవో విచిత్రమైన క్యాప్చర్లు.

“ఇవన్నీ చూసి...”

రామ్ మనసులో అనుకున్నాడు.

వీడు నిజంగా దయ్యాలు పట్టుకునేవాడేనా? లేక దయ్యాల సినిమాకి డూప్లికేటా?

అప్పుడే పై నుంచి ఒక గొంతు.

“నా సిస్టమ్‌తో అంతలా మాట్లాడింది నువ్వేనా?”

రామ్ పైకి చూశాడు.

అక్కడ...

దామోదర్.

గాలిలో వేలాడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు.

“అయ్యో!”

రామ్ వెనక్కి వెళ్లాడు.

“మీరు ఎవరు? తలకిందులుగా గబ్బిలంలా వేలాడుతున్నారు!”

దామోదర్ నవ్వాడు.

“ఒక్కసారి కళ్లు బాగా తెరిచి చూడు.”

రామ్ జాగ్రత్తగా చూశాడు.

అతను తలకిందులుగా లేడు.

గాలిలో తేలుతున్న ఒక విచిత్రమైన ప్లాట్‌ఫామ్ మీద నిలబడి ఉన్నాడు.

“అయ్యో!”

రామ్ గుండె పట్టుకున్నాడు.

“నేను చచ్చిపోతాననుకున్నా!”

“కిందికి దిగాలా?”

“దిగించండి!”

ఆ చిన్న ప్లాట్‌ఫామ్ మెల్లగా కిందికి వచ్చింది.

రామ్ ఊపిరి పీల్చుకున్నాడు.

“నాకు చాలా ఆశలు ఉన్నాయి సార్.”

“ఏ ఆశలు?”

“బతకాలి. లవ్‌లో పాస్ అవ్వాలి. గర్ల్‌ఫ్రెండ్‌తో తిరగాలి.”

దామోదర్ తల పట్టుకున్నాడు.

“ఆపు.”

“నేను దయ్యాన్ని గర్ల్‌ఫ్రెండ్‌గా మార్చుకోవాలి.”

దామోదర్ అతన్ని కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయాడు.

“దయ్యాన్ని పట్టుకోవడం ఓకే.”

“కానీ దాన్ని గర్ల్‌ఫ్రెండ్‌గా మార్చుకోవడం ఏంటి?”

“నువ్వు దయ్యాలకు కూడా దెబ్బ వేసే బ్యాచ్‌లో ఉన్నావా?”

“అది కాదు సార్.”

“నాకు దయ్యం కావాలి.”

“ఎక్కడ ఉంటుందో తెలుసా?”

“సినిమాల్లో చెట్ల మీద.”

“అవును.”

“స్మశానాల్లో.”

“అవును.”

“పాత బంగళాల్లో.”

దామోదర్ నిట్టూర్చాడు.

“అవి సినిమాలు.”

“నిజమైనవి ఎక్కడ ఉంటాయో చెప్పండి.”

దామోదర్ చివరికి ఒక పరికరాన్ని తీసుకొచ్చాడు.

పొడవుగా ఉన్న గాజు డబ్బాలా కనిపిస్తోంది.

“దీని పేరు స్ట్రక్చర్.”

“ఇందులో మూడు ప్రధాన సిగ్నల్స్ ఉంటాయి.”

“ఒకటి—దయ్యం దగ్గర్లో ఉందా లేదా.”

“రెండోది—దాన్ని బంధించావా లేదా.”

“మూడోది—ఆ ఎనర్జీ స్వభావం.”

రామ్ మధ్యలోనే ఆపేశాడు.

“ఒకవేళ మగ దయ్యం అయితే?”

దామోదర్ కళ్లు మూసుకున్నాడు.

“అది కూడా చెబుతుంది.”

“ఎలా?”

“రంగు మారుతుంది.”

“మగ దయ్యం ఒక రంగు.”

“ఆడ దయ్యం మరో రంగు.”

“మిగతా ఎనర్జీలకు వేరే రంగులు.”

రామ్ వెంటనే డబ్బులు తీసాడు.

“ఎంత?”

“ఇరవై ఐదు వేల.”

“మిషన్‌కా?”

“దాన్ని ఉపయోగించడానికి.”

రామ్ వెంటనే బేరమాడాడు.

“ఫస్ట్ యూజ్ తర్వాత డబ్బులు ఇస్తా.”

“ఇప్పుడు ఐదు వేలు అడ్వాన్స్.”

“సక్సెస్ అయితే మిగతా డబ్బులు.”

“ఫెయిల్ అయితే?”

“నీకు డబ్బులు ఇవ్వను.”

దామోదర్ నవ్వాడు.

“నీ ఇష్టం.”

అతను పరికరాన్ని రామ్ చేతిలో పెట్టాడు.

“కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో.”

“ఏంటి?”

“దయ్యాన్ని పట్టుకోవడం సులభం కాదు.”

“నీకు అది తెలియదు.”

“అది నీకు నచ్చకపోవచ్చు.”

రామ్ చిరునవ్వు నవ్వాడు.

“నాకు నచ్చాలి.”

ఐదు వేల రూపాయలు ఇచ్చి పరికరాన్ని జేబులో పెట్టుకున్నాడు.

“నా గర్ల్‌ఫ్రెండ్ కోసం వస్తున్నాను.”

అని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.

దామోదర్ అతని వెనుక చూస్తూ నెమ్మదిగా అన్నాడు—

“నీకు గర్ల్‌ఫ్రెండ్ కాదు రా...”

అతని ముఖంలో వింతమైన భావం.

“నీ జీవితాన్నే మార్చే దయ్యం దొరకబోతోంది.”

---

తర్వాతి మూడు రోజులు...

రామ్‌కు పగలు లేదు.

రాత్రి లేదు.

బైక్ మీద స్మశానాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

చెవుల్లో దయ్యాల పాటలు.

“రావమ్మా మహాలక్ష్మి...”

చుట్టుపక్కల వాళ్లు అతన్ని విచిత్రంగా చూస్తున్నారు.

“వీడెవడ్రా?”

“దయ్యాల కోసం తిరుగుతున్నాడట.”

మూడో రోజు రాత్రి పది దాటింది.

రామ్‌కు మాత్రం మొదటిసారి భయం వేసింది.

“అయ్యబాబోయ్...”

అతను బైక్ వెనక్కి తిప్పబోయాడు.

“కొంచెం ఓవర్ అయిందేమో.”

“దయ్యం దొరికితే దానితో తిరగాలి.”

“దానికి ఫీవర్ వస్తే?”

“పెళ్లి... పిల్లలు... నా భవిష్యత్తు...”

అతను బైక్ స్టార్ట్ చేశాడు.

అప్పుడే...

జేబులో ఉన్న పరికరం మోగింది.

బీప్... బీప్...