pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 40

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 40

గార్డెన్ హౌస్‌లో ఇక ఉండకూడదని గీతిక నిర్ణయించుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి తన వస్తువులను సర్దుకుని, ఒకసారి గార్డెన్ హౌస్ వైపు చూసి  వస్తున్న  కంటతడిని కటిన హృదయంతో ఆరనిస్తూ  ఎన్నో ఆలోచనలతో అడుగు ముందుకు వేయబోయింది.
అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణ వెళ్లిపోవడానికి సిద్ధమైన కూతురిని చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు.
ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతూ, గలగలా మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలకే నవ్వులతో ఇల్లంతా సందడి చేసే తన బుజ్జి... ఈరోజు తనను కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. తన ఉనికే ఆమెకు ఇష్టం లేనట్టుగా ముఖం తిప్పుకుని నిలబడింది.
ఆమెను అలా చూసిన నారాయణ మనసు చివుక్కుమంది.
'పాపం! తను నాన్న అన్న ఆ కఠినమైన మాటల్ని ఇంకా మరిచిపోలేదేమో! అయినా ఎలా మరిచిపోతుంది? అవి ఏవో మామూలు మాటలు కావు కదా! తనను ఎంతగానో ప్రేమించే తండ్రే తనను అనుమానిస్తూ మాట్లాడితే, ఆ బాధ ఎంత లోతుగా ఉంటుందో! మనసును ముక్కలు చేసే మాటలు అవి. ఎంత చిన్నపిల్లలా కనిపించినా, కొన్ని విషయాల్లో నా కూతురు చాలా మొండిది. ఒకసారి మనసు నొచ్చుకుంటే అంత త్వరగా మామూలు మనిషి కాదు. నేనంటే తనకి చాలా కోపం వచ్చినట్టుంది .. కానీ నా బుజ్జిని ఇలా కోపంగా చూడడం ఇదే మొదటి సారి . తన కోపంలో బాధ కూడా ఉన్నది నిజమే నేను కాదనను . తను ఇలా ఉంటే నేను తట్టుకోలేను. తప్పు నాదే కదా ఏదో ఒకటి చేసి తన తన కోపాన్ని తగ్గించాలి .అని మనసులోనే అనుకుంటూ, తనలోని బాధను బయటపడనివ్వకుండా పెదవులపై చిరునవ్వును తెచ్చుకున్నాడు.
తన కూతురి మనసులోని కోపాన్ని తొలగించడానికి చిన్న ప్రయత్నం చేస్తూ...
"బుజ్జీ!" అని ఆప్యాయంగా పిలిచాడు.
ఆ పిలుపు గీతిక చెవులకు చేరినా, మనసు మాత్రం స్పందించలేదు.
తండ్రి వైపు తిరిగి చూడకుండానే వెనక్కి తిరిగి నిలబడింది.
నారాయణరావు ముఖంపై చిరునవ్వు అలాగే ఉన్నా, కూతురు తనను పట్టించుకోకపోవడం లోలోపల బాధ కలిగించింది.అయినా ఆమెను తప్పుపట్టలేకపోయాడు.ఎందుకంటే, ఆ మౌనం వెనుక తన మాటలు కలిగించిన గాయం ఉందని అతనికి తెలుసు."బుజ్జీ! నువ్వెందుకు నాతో మాట్లాడటం లేదో నాకు తెలుసురా!" అంటూ మెల్లగా కూతురి వైపు తిరుగుతాడు..
"ఆ రోజు నువ్వు నిజం చెబుతానని ఎంత ప్రయత్నించినా, నీ మాట పూర్తిగా వినకుండానే ఆవేశంతో మాట్లాడేశాను. నీ మనసు ఎంత బాధపడుతుందో ఆ క్షణంలో ఆలోచించలేకపోయాను. నాన్నగా నేను అలా మాట్లాడి ఉండకూడదు."
అతని మాటలు వింటున్న గీతిక ముఖంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. కానీ ఆమె మనసులో మాత్రం పాత సంఘటన తాలూకు బాధ మళ్లీ కదిలింది.
'ఇప్పుడు మాత్రం నా మాటలు వినాలని అనిపిస్తోందా నాన్నా? ఆరోజు నేను చెప్పాలనుకున్న నిజాన్ని వినడానికి మీకు మనసు రాలేదు. నన్ను నమ్మాల్సిన మీరే నన్ను అనుమానించారు. నేను ఎంత బాధపడ్డానో మీకు తెలియదు. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నన్ను మాటలతో గాయపరిచారు. ఇప్పుడు మాత్రం ఏమీ జరగనట్టుగా బుజ్జి అంటున్నారు!' అనుకుంది గీతిక.
కోపంతో తన మునివేళ్లను నేలకు తాకిస్తూ, ముఖం తిప్పుకుని అలాగే నిలబడింది.
కూతురు తన మాటలకు కనీసం స్పందించకపోవడంతో నారాయణ నిట్టూర్చాడు.
"బుజ్జీ! నువ్విలా మౌనంగా ఉంటే నేను అస్సలు చూడలేనురా! నువ్వెప్పుడూ గలగలా మాట్లాడుతూ, నవ్వుతూ ఉంటేనే నాకు ఇష్టం. నీ నవ్వు చూస్తేనే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది నువ్వు నాతో మాట్లాడకుండా ఇలా ఉంటే నేనెలా ఉండాలి చెప్పు?"అంటూ ప్రాధేయ పడుతున్నట్టు చూస్తాడు.
అయినా గీతికలో ఎలాంటి చలనము లేదు మాటలు రాలేదు
అది గమనించిన నారాయణ బయటకు మాత్రం బాధను కనిపించనివ్వకుండా, చిన్నగా నవ్వాడు.
"ఓహో! అంత కోపమా నా బుజ్జికి? సరే, నువ్వు నాతో మాట్లాడకపోతే ఎలా మాట్లాడించాలో నాకు తెలుసులే!"అంటూ ఉండగా నారాయణ మనసులో మరో ఆలోచన మెదిలింది.
'నా కూతురు కదా! చిన్నప్పటి నుంచి తన అలకలు తీర్చింది నేనే. తన కోపాన్ని పోగొట్టడానికి ఎన్ని వేషాలు వేసేవాడినో! అప్పుడు నా చిన్నారి నవ్వకుండా ఉండగలిగేదా? మరి ఇప్పుడు మాత్రం ఇంత పెద్దదైపోయిందా? నాన్నను కూడా పట్టించుకోనంతగా కోపం పెంచుకుందా? సరే బుజ్జీ... నీ అలక తీర్చడానికి నీ నాన్న ఇంకోసారి చిన్నపిల్లాడిగా మారక తప్పదేమో!' అనుకుంటూ, ఆమెకు కనిపించకుండా చిన్నగా నవ్వుకున్నాడు.ఆ వెంటనే ఏదో జరిగినట్టు ఒక్కసారిగా తూలి కింద పడినట్లు నటిస్తూ..."అమ్మా!" అని గట్టిగా అరిచాడు.
ఆ ఒక్క పిలుపుతో నాన్నపై ఎంత కోపం ఉన్నా, ఆయనకు ఏదైనా జరిగితే తట్టుకోలేని గీతిక గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడింది."నాన్నా!" అంటూ వెంటనే వెనక్కి తిరిగింది.
తండ్రి వైపు ఆందోళనగా చూస్తూ రెండు అడుగులు ముందుకు వేసింది.
ఆమె కళ్లలోని ఆత్రుతను చూసిన నారాయణ మనసు ఒక్కసారిగా ప్రేమతో నిండిపోయి గీతికనే చూస్తున్నాయి 
తనపై ఎంత కోపం ఉన్నా, తనకు ఏదైనా జరిగిందంటే తట్టుకోలేని కూతురి మనసును చూసి అతని పెదవులపై చిరునవ్వు విరిసింది.
గీతిక మాత్రం తండ్రిని పరిశీలనగా చూస్తూ..."ఏమైంది నాన్నా? ఎక్కడైనా దెబ్బ తగిలిందా?" అని ఆందోళనగా అడిగింది. అప్పుడు అడిగిన ప్రశ్నలో  కోపం లేదు. అలక లేదు. తన తండ్రికి ఏమైందోనన్న భయం మాత్రమే  ఉంది.
అది గమనించిన నారాయణ మెల్లగా పైకి లేచి, తన బట్టలకు అంటిన దుమ్మును దులుపుకుంటూ ఆమె వైపు  ప్రేమగా చూశాడు."

"ఏం కాలేదు బుజ్జీ!" అన్నాడు నవ్వుతూ.
గీతిక ఒక్క క్షణం ఆయన ముఖంలోకి చూసింది.ఆయన నవ్వును చూసి తాను మోసపోయానని అర్థం చేసుకోవడానికి ఆమెకు ఎంతో సమయం పట్టలేదు.
"నాన్నా!" అంటూ కోపంగా చూసింది.
ఆ పిలుపు విని ఎన్నాళ్ళయిందో అనుకుంటూ మెల్లగా "ఏంటమ్మా?" అంటూ ఏమీ తెలియనట్టు అమాయకంగా ముఖం పెట్టాడు నారాయణ."

మీరు కావాలనే అలా చేశారు కదా!"అంటూ అలుగుతుంది.

"అబ్బే! నేనెందుకు చేస్తాను బుజ్జీ? నిజంగానే కాలు జారింది!"అంటూ నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నించాడు.

గీతిక ఆయన వైపు కోపంగా చూసినా, ఆ చూపులో అప్పటివరకు ఉన్న కఠినత్వం కొద్దిగా తగ్గిoది.
అది గమనించిన నారాయణరావు మనసులోనే అనుకున్నాడు.
'హమ్మయ్య! నా బుజ్జి మళ్లీ నాతో మాట్లాడింది. కోపంలో ఉన్నా నా మీద ప్రేమ తగ్గలేదు. కానీ ఆ ప్రేమ ఉందని ఆమె మనసుకు తగిలిన గాయాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. నేను అన్న మాటలు తనను ఎంతగా బాధపెట్టాయో అర్థం చేసుకోవాలి. తనను ఓదార్చడమే కాదు, మళ్లీ నా మీద నమ్మకం కలిగేలా కూడా చేయాలి.'కూతురి ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ మెల్లగా అన్నాడు.
"బుజ్జీ... నువ్వు నన్ను ఎంత కోప్పడినా భరిస్తాను. నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకమ్మా. నీకు బాధ కలిగించిన మాటలు నేను అన్నానని నాకు తెలుసు. కానీ నువ్వు నా మాట వినకపోయినా, నీ మనసులోని బాధ చెప్పకపోయినా, నిన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాదే."
ఆ మాటలకు గీతిక కళ్లలో ఒక్క క్షణం తడి మెరిసింది.అయితే, వెంటనే ముఖం తిప్పుకుంది.
నారాయణ ఆమెను చూస్తూ నిలబడిపోయాడు.
తన కూతురితో నాన్న అని పిలిపించుకోవడం కోసం చిన్న నాటకం ఆమెను తనవైపు తిప్పింది. కానీ ఆమె హృదయంలోని గాయాన్ని పూర్తిగా మాన్పించలేదని అతనికి అర్థమైంది.
తండ్రికి కూతురి మౌనం భరించలేనిది. కూతురికి తండ్రి అన్న మాటలను మరిచిపోవడం అంతకంటే కష్టమైనది. ప్రేమ ఇద్దరిలోనూ ఉంది... కానీ ఆ ప్రేమ మధ్యలో నిలిచింది ఒక్క అనుమానం మాత్రమే!
 "బుజ్జి! ఈ . నాన్నను క్షమించవా తల్లీ! నిన్ను అపార్థం చేసుకుని నీ మనసును ఎంతలా గాయపరిచానో ఇప్పుడు అర్థమవుతోంది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు గుర్తుకురాని క్షణం లేదు!"
"అందుకేనా నాన్నా... ఇన్నాళ్లకు గుర్తొచ్చాను? మీతో మాట్లాడాలని, మీ దగ్గరికి రావాలని ఎన్నిసార్లు ఏడ్చానో తెలుసా? కానీ అమ్మ అనుమానాల మధ్య నలిగిపోయి, నా బాధను చెప్పుకోలేక నరకం అనుభవించాను. చివరికి ఈ బతుకే వద్దనిపించిన క్షణాలు కూడా ఉన్నాయి !"
"బుజ్జి!" అంటూ నారాయణ ఆమె నోటికి చేయి అడ్డుపెట్టి కన్నీళ్లు పెట్టుకుoటూ "అలా అనకమ్మ! నువ్వు లేని బతుకు మీ నాన్నకు కూడా వద్దు. అటు మీ అమ్మను ఎదిరించలేక, ఇటు నిన్ను వదులుకోలేక మధ్యలో నలిగిపోయాను. కానీ నిన్ను ఇంతలా బాధపెట్టానని అనుకోలేదు 
మీ బాధ మీకు ఉంది నాన్నా... కానీ నా బాధను ఎవరు అర్థం చేసుకున్నారు? నన్ను కాపాడాల్సిన మీరే నన్ను అపార్థం చేసుకున్నప్పుడు నా మనసు ఎంతలా ముక్కలైందో మీకు తెలియదు!"
కూతురి మాటలకు తట్టుకోలేక నారాయణ గుండెపై చేయి వేసుకుని కూలబడ్డాడు.
"చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచిన నిన్ను ఇలా ఒంటరిగా వదిలేయాలని నేనెప్పుడూ అనుకోలేదు బుజ్జి! నువ్వు లేని ఇల్లు నాకు ఇల్లులా అనిపించడం లేదు. నన్ను క్షమించానని ఒక్కసారి చెప్పవా తల్లీ?"అంటూ దుక్కించాడు.
నాన్న కన్నీళ్లు చూడలేక గీతిక దగ్గరకు వచ్చి కళ్లను తుడిచింది.
"నాన్నా... మీరు నన్ను అలా అడగకండి. మిమ్మల్ని క్షమించలేని కూతురిని కాదు నేను. కానీ నా మనసుకు తగిలిన గాయాలను మర్చిపోలేకపోతున్నాను!"
"అయితే నన్ను వదిలి వెళ్లిపోతావా బుజ్జి?"
 "వెళ్లక తప్పడం లేదు నాన్నా! బంధాలను తెంచుకోవాలని కాదు... ఆ బంధాల మధ్య నా మనసును కోల్పోవడం ఇష్టం లేక. మీరు చదివించిన చదువును తిరిగి ఇవ్వలేను. మీరు నాపై చూపించిన ప్రేమను మర్చిపోలేను. కానీ ఆ ప్రేమను గుర్తుచేసుకుంటూ ప్రతిరోజూ బాధపడుతూ బతకలేను!"అంటూ ఇంటి తాళాలను నారాయణ చేతిలో పెట్టింది.
"బుజ్జి... కనీసం నాన్న కోసం అయినా ఆగవా?"అంటూ తాళాలు చేతిలో పట్టుకుని చూస్తాడు.
గీతిక కళ్లలో నీళ్లు తిరిగాయి. తండ్రిని కౌగిలించుకుని చిన్నపిల్లలా ఏడవాలని మనసు ఆరాటపడింది. కానీ గుండెల్లోని గాయం ఆమెను ఆపేసింది. వస్తున్న దుఃఖాన్ని తమాయించుకుంటూ"నన్ను నన్నుగా బతకనివ్వండి నాన్నా... ఇక నా మనసుకు మరిన్ని గాయాలు తట్టుకునే శక్తి లేదు!"అంటూ బ్యాగు తీసుకుని రెండు అడుగులు ముందుకు వేసింది.
చేతిలో తాళాలు... కళ్లలో కన్నీళ్లు... గుండెల్లో కూతురిపై అంతులేని ప్రేమ! నారాయణ నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు తండ్రి ప్రేమను కాదనలేక... తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేక... గీతిక .అడుగులు ముందుకు పడుతున్నాయి..
ఆమె వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ నారాయణ గుండె తల్లడిల్లిపోయింది. ఇన్నాళ్లూ గారాబంగా పెంచుకున్న కూతురు తన కళ్ల ముందే దూరమైపోతుంటే, ఇక మౌనంగా ఉండలేకపోయాడు.
"ఆగు!" 
అన్న నారాయణ గొంతులో ఈసారి దీనత్వం లేదు... గడుసుదనం ఉట్టిపడింది.