pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 43

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 43

ప్రభ  ధనుష్ మనుషులను కొట్టిన తర్వాత సారంగ దంపతులు ఎందుకు చనిపోయారో చెబుతారు.

"సారంగ్ చదువుకున్న అబ్బాయి సార్. కానీ వాడి పరిస్థితులు వాడిని ముందుకు వెళ్లనివ్వలేదు. డిగ్రీ పూర్తిచేసి, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాడికి కష్టాలు తప్పలేదు. ఉద్యోగం దొరకక, చదువుకు తగ్గ పని చేయలేక చాలా ఇబ్బందులు పడ్డాడు.
దీనికంతటికీ కారణం వాళ్ల అమ్మ ఆరోగ్యం బాగుండకపోవడమే. ఆమెను కాపాడుకోవడానికి వాడు చేయని ప్రయత్నం లేదు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించాడు. అయినా చివరికి తన తల్లిని కాపాడుకోలేకపోయాడు.
అమ్మ చనిపోయిన తర్వాత కూడా వాడి కష్టాలు తీరలేదు. తండ్రిని వదిలి ఎక్కడికీ వెళ్లలేక, అక్కడే ఉండిపోయాడు. చివరికి భుజంగం వాళ్ల దగ్గర అకౌంట్స్ పని చేయడానికి ఒప్పుకున్నాడు.వాళ్ల గోదాముల్లో సరుకుల లెక్కలు చూసేవాడు. అక్కడ ఏం జరిగినా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకునేవాడు.
అతనికి చిన్న వయసులోనే కంటి చూపు బాగా తగ్గిపోయింది. కళ్లద్దాలు తీస్తే దగ్గరలో ఉన్నవాళ్లను కూడా సరిగ్గా గుర్తుపట్టలేకపోయేవాడు.ఒకరోజు వాడు పని పూర్తి చేసుకుని కళ్లద్దాలు పక్కన పెట్టి కూర్చున్నాడు. కళ్ల మంటతో కాసేపు కళ్లు మూసుకుని ఏదో ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకుంటున్నాడు.అప్పుడే ధనుష్ అక్కడికి వచ్చాడు.వాడు వచ్చిన విషయమే సారంగ్‌కు తెలియలేదు. కనీసం పైకి లేచి పలకరించలేదు.
అంతే ! అతనికి కోపం వచ్చేసింది.
'నీకెంత పొగరుంటే నా ముందే కూర్చుంటావు?' అంటూ రెండు చెంపలు వాయించాడు.
సారంగ్ తన సమస్య చెప్పుకోవాలని ప్రయత్నించినా వినిపించుకోలేదు. పైగా అవమానించాడు.
ఆ అవమానాన్ని భరించలేక సారంగ్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.
ఒకరోజు ఎవరికీ తెలియకుండా తన భార్యతో కలిసి ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ వాళ్లు టౌన్‌కు చేరుకునేలోపే వాళ్లను వెంబడించి యాక్సిడెంట్ చేయించాడు.ఆ ప్రమాదంలో సారంగ్ భార్య అక్కడికక్కడే చనిపోయింది. సారంగ్ మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.అటుగా వెళ్తున్నవాళ్లు అతన్ని చూసి 108కు ఫోన్ చేయడంతో హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.సారంగ్ బతికే ఉన్నాడని తెలిసిన ధనుష్‌ కు కోపం కట్టలు తెంచుకుంది.
'నేను చెప్పిన పని కూడా సరిగ్గా చేయలేరా?' అంటూ తన మనుషులపై విరుచుకుపడ్డాడు.
తర్వాత హాస్పిటల్‌లో పనిచేసే ఓ నర్సును బెదిరించి, సారంగ్‌కు పెట్టిన ఆక్సిజన్ తీసేయమని చెప్పాడు.ఆమె కూడా అతను చెప్పినట్టే చేసింది.
కానీ ఈ విషయం బయటపడితే తనకే ప్రమాదమని భయపడింది. అందుకే ఆమెను కూడా వదలకుండా లోయలోకి తోసేయమని ధనుష్ ఆదేశించాడు.
సార్! ఇక్కడ ఎవ్వరూ వాళ్లంతట వాళ్లు చనిపోలేదు. వాళ్లను చనిపోయేలా చేసింది ఆ ధనుస్!" అని చెప్పాడు.
ఆ మాటలు విన్న ప్రభ కళ్లలో ఆగ్రహం ఎర్రటి నిప్పులా ఎగిసిపడింది.
ఒక తండ్రికి కొడుకును దూరం చేయడం... ఓ భార్యను భర్తకు దూరం చేయడం... ఓ కుటుంబాన్ని నిలువునా కూల్చేయడం... ఇదంతా కేవలం తన అహంకారం కోసం!అలాంటి మనిషి ఇంకా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్న ఆలోచనే ప్రభకు అసహ్యం కలిగించింది.
"మీకు మానవత్వం అనేది లేదా? ఎవరో డబ్బులిస్తే చాలు, వాళ్లు చెప్పిన పనులన్నీ చేసేస్తారా? తప్పు అని తెలిసినా మీ చేతులు ఎలా కదులుతున్నాయి? రేపు మీ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు? మీ భార్యను, మీ పిల్లలను కూడా ఎవరో ఇలా అన్యాయంగా చంపేస్తే ఊరుకుంటారా?" అని గర్జించాడు.
వాళ్లు తలలు దించుకున్నారు.
"సార్! మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేశాం. మమ్మల్ని వదిలేయండి. మాకు భార్యలు, పిల్లలు ఉన్నారు. వాళ్లను పోషించుకోవడానికి ఏదో ఒక పని చేయక తప్పదు!" అని బతిమాలుకున్నారు.వాళ్ల మాటలకు ప్రభ ముఖంలో క్షణకాలం అసహనం కనిపించింది.
"కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పని చేయడం తప్పు కాదు. కానీ మీ కుటుంబం బాగుండాలని, ఇంకొకరి కుటుంబాన్ని నాశనం చేయడం మాత్రం క్షమించరాని నేరం! మీకు బతకడానికి దారి కావాలి. అందుకోసం మరొకరి ప్రాణాలు తీసే హక్కు మీకెవరిచ్చారు?" అని నిలదీశాడు.
వాళ్లు మౌనంగా నిలబడిపోయారు.
ప్రభ ఒక్కొక్కరి ముఖంలోకి చూస్తూ నెమ్మదిగా ముందుకు అడుగులు వేశాడు.
"ఒక విషయం గుర్తుపెట్టుకోండి! నీటిలో ఉండే చిన్న చేపలను వేటాడటం చాలా సులభం. కానీ ఆ నీటినంతా తన గుప్పిట్లో పెట్టుకున్న తిమింగలాన్ని ఎదుర్కోవాలంటేనే అసలైన ధైర్యం కావాలి!" ఈసారి అతని గొంతులో ఆవేశం పెరిగింది.
"మీరు చిన్న చేపలు! మిమ్మల్ని పట్టుకుని శిక్షించడం పెద్ద విషయం కాదు. కానీ మీ వెనుక ఉండి, మీ చేతులతో పాపాలు చేయిస్తూ, తాను మాత్రం తప్పించుకోవాలనుకుంటున్న ఆ తిమింగలాన్ని వేటాడటమే నా లక్ష్యం!"అంటూ పిడికిలి బిగించాడు ప్రభ.
"ధనుష్ అనుకుంటున్నాడేమో... డబ్బుతో ప్రాణాలను కొనవచ్చని, అధికారంతో నేరాలను కప్పిపుచ్చవచ్చని! కానీ అతనికి తెలియదు... ప్రతి అన్యాయానికి ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ఎదురుగా నిలబడేది ప్రభ!"అతని కళ్లలో ప్రతీకార జ్వాలలు ఎగిసిపడ్డాయి.
సారంగ్‌కు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు... అతని భార్య మరణానికి కారణమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడే వరకు... ఈ పోరాటం ఆగదు! అన్న ఒకే ఒక్క సంకల్పం బలంగా నాటుకుపోయింది. ‘ధనుష్! నువ్వు ఎంతటి వాడివైనా సరే... నీ ఆటలకు ఇక తెరపడాల్సిందే!’అనుకుని బాధపడుతూ అంత్యక్రియలు పూర్తి చేసి పప్పు తో వెళతాడు
పప్పు చామంతిని చూడాలని రూమ్‌ నుంచి బయటకు వెళ్లడంతో, ప్రభ ఒకరోజు సెలవు తీసుకుని చరిత కొడుకును చూడాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని తల్లితో చెప్పగా, గౌరీ కూడా సరేనని అంగీకరించింది. దీంతో తల్లీకొడుకులిద్దరూ కలిసి బయలుదేరారు.
తీరా అక్కడికి చేరుకునేసరికి అశ్విన్ ఎదురుపడ్డాడు.
“ఏంటి అశ్విన్! ఎలా ఉన్నావ్?” అంటూ ప్రభ పలకరించాడు.
“బాగున్నాను. మీరెక్కడికి వచ్చారు?” అని అడిగాడు అశ్విన్.
“చరిత అక్క కొడుకును చూడాలని వచ్చాం.”
“ఓహ్! వాళ్లయితే బాబుని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లారు.”
అశ్విన్ చెప్పిన మాటలకు ప్రభ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ముందుకు వెళ్లాలా? వెనక్కి తిరిగి వెళ్లిపోవాలా? అన్నది అర్థం కాలేదు. ఇంతలో అశ్విన్‌కు ఏదో అత్యవసరమైన పని గుర్తొచ్చినట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ప్రభ ఒక్క నిమిషం బైక్ ఆపి తల్లి వైపు చూశాడు.
“ఏరా, చరిత ఇంటికి వెళ్దాం. వాళ్లు వచ్చేలోపు అక్కడే ఉందాం,” అంది గౌరీ.
తల్లి మాటతో ప్రభ బైక్‌ను చరిత ఇంటివైపు పోనిచ్చాడు.
ప్రభను చూసిన చరిత తండ్రి చిరునవ్వుతో పలకరించి లోపలికి ఆహ్వానించాడు. గౌరీ, ప్రభ ఇద్దరూ వెళ్లి కూర్చున్నారు. . కాసేపటికి బోర్ కొడుతున్నట్టుగా అనిపించడంతో, తల్లిని అక్కడే ఉండమని చెప్పి ప్రభ బయటకు వెళ్లాడు.
స్కూల్‌ నుంచి వచ్చిన పిల్లలు వీధిలో రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. వాళ్ల ఆటలను కాసేపు నిలబడి ఆసక్తిగా గమనించాడు ప్రభ.
అక్కడున్న పిల్లలు రెండు జట్లుగా విడిపోయి ఆడుకుంటున్నారు. ఒక జట్టులోని పిల్లలు ప్రభను చూసి చిరునవ్వులు చిందిస్తే, మరో జట్టులోని పిల్లలు మాత్రం పెదవి విరిచారు. అయినా ప్రభ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్లవైపు అడుగులు వేశాడు.
“హలో, లిటిల్ స్పోర్ట్స్‌మెన్!” అంటూ పలకరించాడు.
“హలో అన్నయ్యా!” అంటూ కొందరు ఉత్సాహంగా బదులిచ్చారు. మరికొందరు మాత్రం దూరంగానే నిలబడ్డారు.
“అన్నయ్యా, నీకు ఈ ఆటలు ఆడడం వచ్చా?” అని ఒక పిల్లాడు ఏకవచనంతో ప్రశ్నించాడు.
అందరికీ ప్రభ సమాధానం ఒక్కటే... చిరునవ్వు!
“హే! ఈ అన్నయ్యకు ఈ ఆటల గురించి ఏమీ తెలియదనుకుంటా. ఎందుకంటే, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ లాంటి ఆటలనే టీవీలో చూస్తారు కదా! ఈ ఆటల గురించి ఏం తెలుస్తుంది?” అన్నాడు ఒక పిల్లాడు.
“అవున్రా! ఒకవైపు లగోరి, మరోవైపు తొక్కుడుబిళ్ల, ఇంకోవైపు చదరంగం... ఇలా అన్నిరకాల ఆటలు ఆడుతున్నారు. అసలు ఇప్పుడు ఈ సంప్రదాయ ఆటలన్నీ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు?” అని అడిగాడు ప్రభ.
బక్కపలచగా ఉన్న ఓ అబ్బాయి ముందుకు వచ్చి నవ్వుతూ, “ఈ మాత్రం తెలీదా భయ్యా! మన ప్రధానమంత్రి నిర్వహిస్తున్న ‘శిక్షా సప్తాహ్‌’ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో దాదాపు వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం ఉంటుంది,” అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు.
“ఒరేయ్! అంత వేగంగా చెబితే ఆయాసంతో కింద పడిపోతావ్. కాస్త మెల్లగా చెప్పరా!” అన్నాడు మరో పిల్లాడు.
“రేయ్! ఈ వీరా అంటే ఏం అనుకున్నావ్? చాలా స్ట్రాంగ్!” అంటూ తనకున్నట్టే లేని కండరాలను బిగించి చూపించాడు. అంతే! పిల్లలందరూ ఒక్కసారిగా నవ్వేశారు.
“సరే, సరే! ప్రభుత్వం మంచి పనే చేసినట్టుంది. ఎప్పుడు చూసినా పిల్లలు, పెద్దలు వీడియో గేమ్స్‌, సీరియల్స్‌తో బిజీగా గడుపుతున్నారు. టీవీలు, సెల్‌ఫోన్ల ముందు నుంచి కదలడమే లేదు. ఒకప్పుడు సాయంత్రం అయ్యిందంటే రచ్చబండ దగ్గర పెద్దలంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆటలు ఆడేవారు. కానీ ఇప్పుడు ఆ దృశ్యాలే కనిపించడం లేదు,” అన్నాడు ప్రభ.
“అవును అన్నయ్యా! ఇప్పుడు రచ్చబండ దగ్గర అలాంటి ఆటలు ఆడేవాళ్లే కనిపించడం లేదు,” అని ఓ పాప అనడంతో పిల్లలంతా ప్రభవైపు చూశారు.
‘ఓహో! ఈ అన్నయ్యకు సంప్రదాయ ఆటల గురించి బాగానే తెలుసన్నమాట!’ అన్నట్టుగా వాళ్ల చూపుల్లో ఆసక్తి కనిపించింది.
“మేము చిన్నప్పుడు పాచికల ఆట ఆడేందుకు పెద్దవాళ్లు చెట్ల కింద ఉన్న అరుగుల మీద కూర్చునేవారు. కానీ ఇప్పుడు ఆ అరుగులు, వేపచెట్లు, రావిచెట్లు కూడా కనుమరుగవుతున్నాయి. కాలంతోపాటు మన అలవాట్లు కూడా మారిపోతున్నాయి,” అంటూ నిట్టూర్చాడు ప్రభ.
ఆ వెంటనే పిల్లలవైపు తిరిగి, “సరే పిల్లలూ! మీతోపాటు నేను కూడా ఆడనా?” అని అడిగాడు.
పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
“ఒరేయ్! ఆయన పెద్దోడ్రా! మన జట్టులో చేర్చుకుంటే ఆ జట్టే గెలుస్తుంది. అందుకే ఆయన్ని మధ్యవర్తిగా పెడదాం,” అని ఒక పిల్లాడు గుసగుసలాడాడు.
ఆ మాటలు ప్రభ చెవిన పడినా అతనికి కోపం రాలేదు. ఎందుకంటే, తాను కూడా ఒకప్పుడు ఆ వయసు దాటివచ్చినవాడే కదా!
“సరే, ఒక పని చేద్దాం. నేను రెండు జట్లకు మధ్యవర్తిగా ఉంటాను. మీరు ఆడండి. ఎవరు బాగా ఆడితే వాళ్లకే ఎక్కువ మార్కులు వేస్తాను,” అన్నాడు ప్రభ.
వెంటనే ఓ బక్కపలచని పిల్లాడు ముందుకొచ్చి వేలు చూపిస్తూ, “అయితే పక్షపాతం చూపించకూడదు!” అని హెచ్చరించాడు.
“అలాగే బాబూ! ఎలాంటి పక్షపాతం ఉండదు. ఎవరు బాగా ఆడితే వాళ్లే విజేతలు,” అంటూ నవ్వేశాడు ప్రభ.
ఇక ఆట మొదలైంది.
పిల్లలు ఉత్సాహంగా ఆడుతుంటే, ప్రభ కూడా వాళ్లను ప్రోత్సహిస్తూ రెండు జట్లూ సమానంగా ఆడేలా చూసుకున్నాడు. అప్పటివరకు ఏదో ఒకలా కాలక్షేపం చేయాలనుకున్న అతనికి, పిల్లల మధ్య గడుపుతుంటే తెలియని ఆనందం కలిగింది.
చిన్నచిన్న విషయాలకే వాళ్లు పడే కేరింతలు, గెలిచినప్పుడు చూపించే ఉత్సాహం, ఓడిపోయినప్పుడు చేసే అలకలు... అన్నీ ప్రభను తన బాల్యంలోకి తీసుకెళ్లాయి. అప్పటికే చీకటి పడుతుండడంతో ప్రభ ఆటను ఆపించాడు.
“సరే పిల్లలూ! ఇక ఆట చాలించండి. రేపు స్కూల్లో కూడా ఆడుకోవాలి కదా! వెళ్లి హోంవర్క్‌ రాసుకోండి. లేదంటే మీ అమ్మలు తిడతారు,” అన్నాడు.
వెంటనే రెండు జట్ల కెప్టెన్లు ఒకరికొకరు షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నారు.“రేపు చూసుకుందాం!” అంటూ సవాలు విసురుకున్నారు.
పిల్లలంతా ప్రభ చుట్టూ చేరారు.
“అన్నయ్యా! నీకు ఏ ఆటలూ తెలియవనుకున్నాం. కానీ ఎంత బాగా ఆడించావ్!” అన్నాడు ఓ పిల్లాడు.
“అన్నయ్యా! ఇలాంటి సంప్రదాయ ఆటలు ఇంకా ఏమేమి ఉన్నాయి?” అని మరొకడు అడిగాడు.
“చాలా ఉన్నాయి బాబూ! గుజ్జనగూళ్లు, కోతికొమ్మచ్చి, గిల్లీదండా, బొంగరాలు... ఇలా ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లలు తొక్కుడుబిళ్ల కూడా ఆడేవారు. నాకు మాత్రం గిల్లీదండా, బొంగరాల ఆటంటే చాలా ఇష్టం,” అన్నాడు ప్రభ.
“బొంగరమా? అదెలా ఆడతారు అన్నయ్యా?” అని ఓ పిల్లాడు ఆసక్తిగా అడిగాడు.
“బొంగరానికి తాడు చుట్టి నేలమీదకు విసిరితే అది గిరగిరా తిరుగుతుంది. అంతేకాదు, నేలమీద తిరుగుతున్న బొంగరాన్ని నేర్పుగా చేతిలోకి కూడా తీసుకోవచ్చు,” అంటూ వివరించాడు ప్రభ.
“అవునవును! నిన్న మా అమ్మమ్మ ‘చినరాయుడు’ సినిమా చూస్తుంటే, అందులో హీరో బొంగరంతో ఓ ఆట ఆడాడని చెప్పింది,” అంటూ ఓ పిల్లాడు తనకు తెలిసిన విషయాన్ని చెప్పాడు.
“ఓహో! నువ్వు బాగానే పరిశీలిస్తావురా!” అంటూ ఆ పిల్లాడి తలమీద చిన్నగా మొట్టికాయ వేశాడు ప్రభ.
ఆకాశం వైపు చూసేసరికి చీకటి మరింతగా అలుముకుంది.
“ఒరేయ్! చీకటి పడుతోంది. ఇక ఇంటికి వెళ్లండి,” అని చెప్పడంతో,
“బాయ్ అన్నయ్యా!” అంటూ పిల్లలంతా తమ ఇళ్లవైపు పరుగులు తీశారు.
వాళ్లను చూస్తూ అక్కడే నిలబడిపోయాడు ప్రభ.
‘అందుకే కాబోలు పిల్లలను దేవుడితో సమానంగా భావిస్తారు. ఎంత స్వచ్ఛమైన మనసులు! కల్మషం లేని నవ్వులు! గెలుపోటములను క్షణాల్లో మర్చిపోయి మళ్లీ కలిసిపోయే తత్వం! నిజమే... బాల్యం బంగారం లాంటిది. ఒక్కసారి చేజారితే తిరిగి రానిది. ఎన్ని సంపదలు సంపాదించినా, ఆ బాల్యాన్ని మాత్రం మళ్లీ కొనుక్కోలేం!’అనుకుంటూ అక్కడి నుంచి ఇంటివైపు నడక సాగించాడు ప్రభ.
వీధి దీపాలు వెలగడంతో చరిత వాళ్లు ఈపాటికి వచ్చి ఉంటారని అనుకున్నాడు. ఆ దీపాల వెలుగులో ముందుకు సాగుతున్న ప్రభకు ఓ దృశ్యం కనిపించింది. ఒక అమ్మాయి లంగా, బ్లౌజు ధరించి నడుముపై చేయి వేసుకుని నిలబడి ఉంది. మరో అమ్మాయి మాత్రం కుంటుకుంటూ అడుగులు వేస్తూ, నేలపై గీసిన గళ్లలో బిళ్లను తొక్కేందుకు ప్రయత్నిస్తోంది.
ఆటలో భాగంగా బిళ్లను తొక్కలేకపోయిన అమ్మాయి, తాను తొక్కానంటూ అబద్ధం చెప్పడానికి ప్రయత్నించింది.
“నువ్వు కచ్చితంగా మోసం చేస్తావని నాకు తెలుసు. నువ్వు బిళ్లను తొక్కనే లేదు!” అంటూ మరో అమ్మాయి వాదించింది.
వాళ్ల మాటలు వింటూ అటువైపు వస్తున్న ప్రభ దగ్గరికి వెళ్లాడు.
“పాపా! నువ్వు బిళ్ల తొక్కలేదు. నేను చూశాను. ఎందుకు అబద్ధం చెబుతున్నావ్?” అని ప్రశ్నించాడు.
అతని మాటలతో ఆ అమ్మాయి ఒక్కసారిగా బిక్కమొహం వేసింది. తాను తొక్కలేదని ఎవరో పెద్దమనిషి కూడా చెబుతుండడంతో ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని గ్రహించింది.చివరికి తన ఓటమిని అంగీకరించింది.
అప్పుడే ప్రభ చూపు రెండో అమ్మాయిపై పడింది.
గులాబీ రంగు పావడా, బంగారు రంగు రవిక ధరించి, రింగురింగుల జుట్టుతో ఆ అమ్మాయి చూడముచ్చటగా ఉంది. ఆటలాడి ముఖమంతా చెమట పట్టి, ముద్దుగా కనిపిస్తోంది.
బిళ్లను గళ్లలో వేసి, చిరునవ్వుతో ఒక్కో గడిని దాటుతూ పైకి ఎగురుతున్న ఆమెను చూసిన ప్రభకు ఒక్కసారిగా ధృతి గుర్తుకొచ్చింది.
‘అచ్చం ధృతిలాగే ఉంది!’ అనుకుంటూ తెలియకుండానే ముందుకు అడుగులు వేశాడు.
“ధృతి... ధృతి!” అంటూ పిలిచాడు.
“అయ్యో! ధృతి ఏంటి ధృతి? తన పేరు కృతి!” అంది.అతని పిలుపు విన్న మొదటి అమ్మాయి తల కొట్టుకుంటూ,
ప్రభ మళ్లీ, “ధృతి!” అని పిలవడంతో ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అతనివైపు చూసింది.
“అయ్యో బాబోయ్! కృతి ఆట ఆడేటప్పుడు చాలా నెమ్మదిగా ఆడుతుంది. అలాంటిది నువ్వు మాట్లాడితే ఆటే ఆపేస్తుంది. కాసేపు ఆగు అన్నయ్యా!” అంది మొదటి అమ్మాయి.
ప్రభ ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు.
‘ధృతి కాదు... కృతినా?’
అయినా ఆ చిన్నారి రూపం అతనికి ధృతినే గుర్తుచేస్తోంది.
‘ధృతి! నువ్వు, జానకి అక్క ఎక్కడున్నారు? మిమ్మల్ని చూసి ఎన్నాళ్లయిందో! కనీసం మీ ఫోన్‌ నంబర్‌ కూడా నా దగ్గర లేదు. ఎక్కడెక్కడో వెతికాను. తెలిసినవాళ్లను కూడా అడిగాను. అయినా మీ జాడ తెలియలేదు. మీ అంతట మీరైనా కనిపిస్తే బాగుండేది... లేదా ఒక్క ఫోన్‌ కాల్‌ అయినా చేసి ఉంటే, మీ గురించి తెలుసుకునేవాడిని!’ అంటూ అతని మనసు బాధతో మూగబోయింది.
‘జానకి అక్క... పేరు సీతామాత పేరు కాకపోయినా, ఆ తల్లిలాగే ఎన్నో కష్టాలు పడింది. తన జీవితంలో కష్టాలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏమో! ఒకవేళ మీరిద్దరూ నాకు ఎక్కడైనా కనిపిస్తే, తప్పకుండా మా ఇంటికి తీసుకెళ్తాను. ధృతిని బాగా చదివిస్తాను. అమ్మ కూడా ఉంటుంది కాబట్టి, తనకు తోడుగా ఉంటుందనిపిస్తోంది.’ అలా ఆలోచిస్తూ మరోసారి వెనక్కి తిరిగి చూశాడు ప్రభ. కానీ అప్పటికే పిల్లలంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
చేతికి ఉన్న వాచీని చూసుకున్నాడు. సమయం ఎనిమిది గంటలు దాటుతోంది. ‘అక్క వాళ్లు ఈపాటికి వచ్చి ఉంటారేమో!’ అనుకుంటూ వడివడిగా చరిత ఇంటివైపు నడిచాడు.