చారితో కలిసి భరణి కోసం వెతుకుతూ ప్రభ, చారి సిటీ దాటి ముందుకు సాగారు. కొంతదూరం వెళ్లాక తారు రోడ్డు ముగిసి, కచ్చా రోడ్డు మొదలైంది. బండి ముందుకు కదులుతున్న కొద్దీ దుమ్ము మేఘాల్లా పైకి లేస్తోంది. దూరం నుంచి చూస్తే అసలు రోడ్డు ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్లు, పొదలు చిన్న అడవిని తలపిస్తున్నాయి.
ఆ మార్గంలో వాహనాల రాకపోకలు కూడా పెద్దగా కనిపించడం లేదు.
'బహుశా ఇది వాళ్లు నడిపే హోటల్ అయి ఉండొచ్చు. పేరుకు హోటల్ అయినా, వ్యక్తిగతంగా వాళ్లకు ఇదొక బంగ్లాలా ఉండి ఉంటుందేమో!' అని అనుకుంటూ ప్రభ బండి నడుపుతున్నాడు.
అంతలో ఎదురుగా వస్తున్న ఓ జీపు కనిపించింది. అద్దం లో నుంచి ఒక వ్యక్తి దిగి, ప్రభ నడుపుతున్న బండిని పరిశీలనగా చూశాడు.
“ఎవరయ్యా మీరు? ఇది భరణి బండిలా ఉంది. ఇంతకీ వాడెక్కడ?” అని ప్రశ్నించాడతను.
“అవునండి, ఇది భరణి బండే. అయితే అతనెక్కడున్నాడో మాకు తెలియదు. మేము కూడా అతని కోసమే వెతుక్కుంటూ వస్తున్నాం. ఇక్కడ ఏదైనా హోటల్ ఉందా?” అని అడిగాడు ప్రభ.
“హోటల్‌లో ఎవరూ కనిపించలేదా? వాడు వాళ్ల నాన్న ఎంత చెప్పినా వినడు. ‘నీ వ్యాపారం నువ్వు చూసుకో’ అని చెబితే వినకుండా, ఊళ్లోవాళ్ల సరుకులు తీసుకెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు!” అన్నాడతను.
తర్వాత ప్రభ వైపు పరిశీలనగా చూస్తూ, “ఇంతకీ నీది ఎం.ఆర్. పల్లి కాదనుకుంటా! చూస్తుంటే ఏదో ఉద్యోగం చేసే మనిషిలా కనిపిస్తున్నావు. మనిషి ఒడ్డూ పొడవూ బాగానే ఉన్నాయి. భరణికి ఏమవుతావు?” అని అడిగాడు.
“సార్, నేను ఒక పని మీద వచ్చాను. అయితే అక్కడి పరిస్థితి తెలిసి, అతనికి సాయం చేయాలని అనిపించింది. అందుకే ఏదైనా ప్రయత్నిద్దామని వచ్చాను” అని సమాధానమిచ్చాడు ప్రభ.
“సరే, నీ ప్రయత్నం నువ్వు చేయి. అవసరమైతే నాకు ఫోన్ చేయి. ఈ విషయం నాకు కూడా గంట క్రితమే తెలిసింది. కనీసం ఫోన్ కూడా కలవడం లేదట. మూడు రోజులైందని చెబుతున్నారు. అసలు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియడం లేదు. ఎంత మొండివాళ్లో! చెప్పిన మాట వినరు!” అంటూ తనకు ఆఫీసులో అత్యవసరమైన పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడతను.
అతను వెళ్లిన తర్వాత చారి ప్రభ వైపు చూస్తూ, “అన్నా! ఆ హోటల్ వైపు వెళ్లడం అనవసరమేమో!” అన్నాడు.
“అలా అనుకోకు రా! కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదైనా ఆధారం దొరకవచ్చు” అన్నాడు ప్రభ.
ప్రభ మాటలకు చారి అతని ముఖంలోకి చూశాడు.
“చారి! నీకు అంత భయంగా అనిపిస్తే ఈ బండి తీసుకుని వెనక్కి వెళ్లిపో” అన్నాడు ప్రభ.
“వద్దులే అన్నా! ఈ బండితో ఎక్కడ కనిపించినా నా మీద లేనిపోని అనుమానాలు వస్తాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. అందుకే నీతోనే వస్తాను” అన్నాడు చారి.
“సరే, నువ్వేం భయపడకు. బండి ఎక్కు” అన్నాడు ప్రభ.
ఇద్దరూ బండిపై బయలుదేరి, హోటల్‌కు కొంత దూరంలో దాన్ని నిలిపి, అక్కడి పరిస్థితులను గమనించసాగారు.
అంతలో మరో మార్గం నుంచి ఒక కారు రావడం కనిపించింది.
“అన్నా! అదిగో, ఆ కారు వస్తోంది. అందులో సరుకుల యజమాని వస్తున్నట్టున్నాడు. వీడు వాళ్ల అన్నయ్యకంటే చాలా మోసగాడు. వాళ్ల అన్నయ్య కొంత సరుకు తగ్గించమని అడిగితే ఒప్పందం చేసుకుంటాడు. కానీ వీడు మాత్రం చాలా ఖతర్నాక్!” అని చారి వివరించాడు.
“అయితే భరణి వీడితోనే ఒప్పందం కుదుర్చుకున్నాడంటావా?” అని ప్రశ్నించాడు ప్రభ.
“ఏమో అన్నా! అయి ఉండొచ్చు. నాకైతే కచ్చితంగా తెలియదు. నేను ఊళ్లో లేను కదా!” అన్నాడు చారి.
కారు హోటల్ ముందు ఆగగానే అందులో నుంచి ఓ వ్యక్తి దిగాడు. అతను నేరుగా పై అంతస్తులోకి వెళ్లడం ఇద్దరూ గమనించారు.
అతనిని కలవాలంటే ఏం చేయాలా అని ఆలోచించిన ప్రభకు ఓ ఉపాయం తట్టింది.
'కొత్త బిజినెస్ కస్టమర్‌గా పరిచయం చేసుకుంటే ఎలా ఉంటుంది?' అని అనుకున్నాడు.
వెంటనే హోటల్‌లోకి వెళ్లి ఓ చోట కూర్చుని టీ తాగుతూ, అతని కదలికలను గమనించాడు. ఆ తర్వాత పై అంతస్తుకు వెళ్లబోతుండగా అక్కడ నిలుచున్న వ్యక్తులు అతన్ని అడ్డుకున్నారు.
“ఎవరు నువ్వు?” అని ప్రశ్నించారు.
“నేను సార్‌తో ఒక డీల్ మాట్లాడడానికి వచ్చాను” అన్నాడు ప్రభ.
వాళ్లు అతన్ని లోపలికి అనుమతించకపోవడంతో వెనక్కి తిరిగి, రెండు మెట్లు దిగాడు. ఇంతలోనే వాళ్లు మళ్లీ పిలిచారు.
'ఇదే మంచి అవకాశం!' అనుకుంటూ ప్రభ తిరిగి వాళ్ల దగ్గరకు వెళ్లాడు.
“ఎవరు నువ్వు? కొత్త కస్టమరా? లేక ఇంకేదైనా పని మీద వచ్చావా?” అని ప్రశ్నించాడొక వ్యక్తి.
“నేను కొత్త కస్టమర్‌ని సార్. మా దగ్గర మంచి డిజైన్లతో కూడిన సరుకు ఉంది. మీరు మంచి ధరకు కొనుగోలు చేస్తారని విని ఇక్కడికి వచ్చాను” అని చెప్పాడు ప్రభ.
“అదంతా సరే! ఫోన్‌లో సంప్రదించకుండా నేరుగా ఇక్కడికి ఎందుకొచ్చావు? నీకు చెప్పినవాళ్లను అడిగితే నా ఫోన్ నంబర్ ఇచ్చేవాళ్లు కదా! ఇంతకీ ఈ హోటల్ ఇక్కడ ఉందని నీకు ఎవరు చెప్పారు?” అంటూ వరుసగా ప్రశ్నలు సంధించాడు అతను.
“సార్, నెల రోజుల క్రితం భరణి అనే వ్యక్తిని అడిగితే మీ గురించి చెప్పాడు. అందుకే వచ్చాను” అన్నాడు ప్రభ.
భరణి పేరు వినగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
అతని ముఖంలో మారిన భావాలను గమనించిన ప్రభ మౌనంగా నిలబడ్డాడు.
“భరణి చెప్పాడా?” అంటూ ప్రతి అక్షరాన్ని ఒత్తి పలికాడతను.
“అవును సార్! వారం రోజుల క్రితం చెప్పాడు. అయితే ఇప్పుడు అతనికి ఫోన్ కలవడం లేదు. ఒకవేళ నా ఫోన్ కలవకపోతే, మీరు ఇక్కడే ఉంటారని చెప్పాడు. అందుకే ఈ హోటల్‌కు వచ్చాను. మరి, డీల్ మాట్లాడదామా?” అన్నాడు ప్రభ.
“ఇక్కడ కాదు. పై అంతస్తులోకి రా!” అంటూ ముందుకు నడిచాడతను.
అతని చూపుల్లో అనుమానం కనిపించడంతో ప్రభ చారిని కిందే ఉండమని చెప్పి, అతని వెనుకే పై అంతస్తుకు వెళ్లాడు.
'ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ నా మీద అనుమానంగానే చూస్తున్నాడు. ఎందుకలా? భరణి పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు. ఏదో మతలబు ఉండే ఉంటుంది!' అని మనసులో అనుకుంటూ అతన్ని అనుసరించాడు ప్రభ.
పై అంతస్తులోకి అడుగుపెట్టగానే ఆ ప్రదేశం ఇంద్రభవనంలా కనిపించింది.
'ఇంత విలాసవంతమైన జీవితం అనుభవించడానికి కారణం ఇతరులను మోసం చేసి సంపాదించిన డబ్బే కాబోలు!' అనుకున్నాడు ప్రభ.
భరణి కోసం వెతుకుతూ ప్రభ, చారి హోటల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడి వ్యక్తి భరణితో ఒప్పందం చేసుకున్నవాడే అయి ఉంటాడని చారి అనుమానం వ్యక్తం చేయడంతో, డీల్ మాట్లాడాలనే నెపంతో ప్రభ పై అంతస్తుకు వెళ్లాడు. వెళ్లే దారిలో కనిపించిన ఓ ఉద్యోగికి పోలీసులకు సమాచారం అందించమని సందేశం పంపాడు.
అతను గదిలోకి అడుగుపెట్టగానే అవతలి వ్యక్తి నవ్వాడు.
“ఏంటి సార్! అలా నవ్వుతున్నారు?” అని అడిగాడు ప్రభ.
“నవ్వక ఏం చేయాలి? చీరలు, సారెలు, డీల్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చావు చూడు! అందుకే నవ్వొస్తోంది!” అన్నాడతను.
“ఎంత అమాయకంగా నటిస్తున్నావురా!” అని వెటకారంగా అన్నాడు.
“సార్, నేను చెప్పేది నిజమే. మీకు చీరల వ్యాపారం ఉందని తెలిసి, డీల్ మాట్లాడడానికి వచ్చాను” అన్నాడు ప్రభ.
“ఇక్కడ డీల్ మాట్లాడేది నేనే అని నీకెలా తెలుసు?” అని నిలదీశాడు అతను.
“అది... సార్...” అంటూ ప్రభ మాట పూర్తిచేయకముందే,
“ఎవర్రా చెప్పింది? సరిగ్గా చెప్పు!” అని గట్టిగా అరిచాడు.
“భరణి చెప్పాడు సార్!” అన్నాడు ప్రభ.
భరణి పేరు వినగానే అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
“ఏంటి సార్! నేను చెప్పింది నిజమే. భరణి నాకు మీ గురించి చెప్పాడు. అందుకే ఈ హోటల్‌కు వచ్చాను” అన్నాడు ప్రభ.
“ఎంత అమాయకంగా నటిస్తున్నావురా!” అంటూ పళ్లు బిగించి కోపంగా చూశాడు అతను.
అతని పరిస్థితిని గమనించిన ప్రభ నవ్వాడు.
“ఏంట్రా! డ్రామా ఆడుతూ ఇక్కడికి వచ్చిందే కాకుండా, నన్నే వెటకారం చేస్తావా?” అంటూ గట్టిగా అరిచాడు అతను.
“వెటకారం ఏంటి సార్? భరణి పేరు చెప్పగానే మీరు ఉలిక్కిపడ్డారు. మీ ముఖకవళికలే మీలోని భయాన్ని బయటపెట్టాయి. భరణితో ఒప్పందం చేసుకున్నది మీరేనని నాకు అర్థమైంది” అన్నాడు ప్రభ.
“నువ్వు కూడా భరణి పేరు చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కుర్చీలో కూర్చున్నప్పటి నుంచీ నువ్వు నన్ను చూసిన చూపు అనుమానంగానే అనిపించింది. కింద జనాలు ఉన్నారు కాబట్టి అక్కడే ఏమీ చేయకుండా వదిలేశాను” అన్నాడు అతను.
“ఓహో! కింద నన్ను చంపేస్తే జనాల దృష్టిలో మీరు చెడ్డవాళ్లవుతారని భయమా? అలా భయపడేవాడు రౌడీ ఎలా అవుతాడు? మోసగాడు అవుతాడు కానీ!” అంటూ అతని వైపు వేలు చూపించాడు ప్రభ.
ప్రభ మాటలకు అతని కోపం మరింత పెరిగింది.
“భరణి కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా? అతను మోసం చేశాడనే నిందతో వాళ్లు తలెత్తుకోలేని స్థితికి వచ్చారు. తమ ఆస్తులన్నీ అమ్మి, జనాలకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలీచాలని ఆస్తులతో వాళ్ల కుటుంబం నెట్టుకొస్తోంది. ఆ స్థితికి కారణం నువ్వేనని నా అనుమానం!” అన్నాడు ప్రభ.
“అదెలా చెబుతావు?” అని ప్రశ్నించాడతను.
“నీ మాటలే నీ గురించి చెబుతున్నాయి” అన్నాడు ప్రభ.
“అయితే ఏంటి?” అని నిర్లక్ష్యంగా అడిగాడు.
“ఏం లేదు. భరణికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి, అతను ఎక్కడున్నాడో చెబితే నేను వెళ్లిపోతాను” అన్నాడు ప్రభ.
“భరణి లేడు! వాడికి డబ్బులు లేవు! ముందు వీణ్ణి పై నుంచి కిందికి తోసేయండ్రా!” అని తన మనుషులకు ఆదేశించాడు.
అంతే! క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రభ పక్కనే ఉన్న ఓ వ్యక్తి కాలు పట్టుకుని పైకెత్తి నేలపైకి విసిరేశాడు. మరో వ్యక్తి అతని మీదకు దూసుకొచ్చాడు. ప్రభ అతన్ని కూడా ఎదుర్కొని గోడవైపు విసిరేయడంతో అతని తలకు గాయమైంది.
ఇక మిగిలింది ఆ వ్యక్తి ఒక్కడే!
అతన్ని కొట్టి నిజం చెప్పించడం కంటే, పోలీసులకు అప్పగించి భరణి ఆచూకీ తెలుసుకోవడమే మంచిదని ప్రభ భావించాడు.
అంతలో ఆ వ్యక్తి పొడవైన ఇనుపరాడ్‌ను తీసుకుని ప్రభపైకి విసిరాడు. అది గురి తప్పి, ప్రభ రెండు కాళ్ల మధ్య నుంచి దూసుకెళ్లింది.
ప్రభకు విపరీతమైన కోపం వచ్చినా సంయమనం పాటించాడు.
'వీణ్ణి కొట్టినా, చంపినా ప్రయోజనం లేదు. వీడి నుంచి నిజం రాబట్టాలంటే పోలీసులే రావాలి!' అని నిర్ణయించుకున్నాడు.
ఆ వ్యక్తి మరోసారి ఇనుపరాడ్‌ను తీసుకోవడానికి ముందుకు వెళ్లాడు. అదే అదనుగా భావించిన ప్రభ వెనుక నుంచి వెళ్లి ఆ రాడ్‌ను లాక్కొని అతని కాలికి గుచ్చాడు.
“అమ్మా!” అంటూ విలవిల్లాడిన అతను ఆవేశంతో తన తలను ప్రభకు ఢీకొట్టాడు.
ఒక్కసారిగా ప్రభకు కళ్లు తిరిగినట్టయింది. అయినప్పటికీ తేరుకుని అతనికి ఎదురుదెబ్బలు ఇచ్చాడు.
ఇంతలో ప్రభ దారిలో కలిసిన ఉద్యోగి పోలీసులతో అక్కడికి చేరుకున్నాడు. పోలీసులు గదిని చుట్టుముట్టి, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వారితోపాటు ఆ ఉద్యోగి కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
ప్రభ పై అంతస్తు నుంచి కిందికి దిగుతుండగా చారి ఎదురొచ్చాడు.
“అన్నా! నువ్వేమో అనుకున్నాను. కానీ నువ్వు మామూలు మనిషివి కాదు!” అన్నాడు ఆశ్చర్యంగా.
ప్రభ చిరునవ్వు నవ్వి, “పద! ముందు భరణి ఆచూకీ తెలుసుకోవాలి” అంటూ బండి దగ్గరకు నడిచాడు.
---
భరణి కోసం అన్వేషణ
అక్కడి నుంచి ఎం.ఆర్. పల్లికి బయలుదేరాలని ప్రభ, చారి నిర్ణయించుకున్నారు. బండి మీద వెళ్తూ భరణి ఎక్కడ ఉండవచ్చో ఆలోచించసాగారు.
ముందుగా తారు రోడ్డు ఉన్న మార్గంలోకి వెళ్లారు. అక్కడ చెట్లు, పొదలు పెద్దగా లేకపోవడంతో భరణిని ఆ ప్రాంతంలో దాచడం సాధ్యం కాదని ప్రభకు అనిపించింది.
ఆ తర్వాత మరో దారిలోకి మళ్లారు. కొంతదూరం వెళ్లాక హైవే కనిపించింది.
చుట్టూ పరిశీలనగా చూస్తూ ప్రభ ఆలోచనలో పడ్డాడు.
“చారి! ఒకవేళ భరణి చనిపోయి ఉంటే అతని మృతదేహం ఎక్కడో ఒకచోట కనిపించాలి. లేదా వాహనం ఢీకొట్టి ఉంటే ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లైనా ఉండాలి. కానీ ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. జనాలు మామూలుగానే తిరుగుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినట్టు కనిపించడం లేదు” అన్నాడు.
“మరి, అన్నా! అటువైపు కాకుండా ఇటువైపు కాకుండా భరణి ఏమైపోయినట్టు? బహుశా వాడిని చంపేశారేమో!” అని అనుమానం వ్యక్తం చేశాడు చారి.
“ఏమో! వాడిని పోలీసులు తీసుకెళ్లారు కదా! నిజం కక్కిస్తే అసలు విషయం బయటపడుతుంది” అన్నాడు ప్రభ.
“నిజం చెప్పకపోతే కరెంట్ షాక్ ఇచ్చైనా చెప్పిస్తారు” అన్నాడు చారి.
“అది సరే! ఒకసారి మనం హోటల్‌కు వచ్చిన దారిలోకి వెళ్దామా? అక్కడ దట్టంగా చెట్లు, పొదలు ఉన్నాయి. ఏదైనా ఆధారం దొరకవచ్చు” అన్నాడు ప్రభ.
“సరే అన్నా! పద!” అంటూ చారి అంగీకరించాడు.
ఇద్దరూ తిరిగి కచ్చా రోడ్డు మీదుగా ప్రయాణిస్తూ, దారికి ఇరువైపులా ఉన్న చెట్ల మధ్య, పొదల్లోనూ జాగ్రత్తగా వెతకసాగారు.
“అన్నా! భరణి ఇక్కడే ఉంటాడని నీకెందుకంత నమ్మకం?” అని అడిగాడు చారి.
“చూడు చారి! తారు రోడ్డు మీద వాహనాలు నిరంతరం వస్తూ పోతూ ఉంటాయి. అక్కడ భరణిని దాచాలన్నా, ఏదైనా చేయాలన్నా కష్టమే. ఒకవేళ హైవే మీద పడేసి ఉంటే ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించేవి. కానీ అక్కడ అలాంటివేమీ లేవు. అందుకే ఈ మార్గంలో వెతికితే ఏదైనా ఆధారం దొరకవచ్చని అనిపించింది” అని వివరించాడు ప్రభ.
“ఒకవేళ భరణి ఇక్కడ లేకుండా ఎక్కడికైనా వెళ్లిపోయి ఉంటే?” అని అడిగాడు చారి.
“అతన్ని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా! అతని ద్వారా నిజం బయటపడుతుంది. భరణి నిర్దోషి అని నిరూపించగలిగితే, అతని మీద పడిన నింద తొలగిపోతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం” అన్నాడు ప్రభ.
ఇద్దరూ అటూ ఇటూ వెతుకుతూ ముందుకు సాగారు.
అంతలో ఓ పొదల మధ్య నుంచి మూలుగుతున్నట్టుగా శబ్దం వినిపించింది.
“అన్నా! ఏదో శబ్దం వస్తోంది. అది జంతువుదా? మనిషిదా?” అంటూ చారి ఓ చెట్టు దగ్గరున్న పొదల వైపు వెళ్లాడు.
అక్కడి నుంచి దుర్వాసన రావడంతో ముక్కు మూసుకుని జాగ్రత్తగా పరిశీలించాడు. ఓ పిల్లి చనిపోయి కుళ్లిపోయి ఉండడం కనిపించింది.
“ఛీ! ఇదేంటి? పిల్లి చనిపోయి కుళ్లిపోయింది!” అంటూ వెనక్కి తిరగబోయాడు.
అంతలో మరోవైపు పొదల మధ్య నుంచి ఓ వ్యక్తి చేతి వేళ్లు కనిపించాయి.
చారి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
“అన్నా! ఇటు రా! ఇక్కడ ఏదో ఉంది!” అని గట్టిగా అరిచాడు.
“చారి! నువ్వు అక్కడే ఉండు. నేను వచ్చి చూస్తాను” అంటూ ప్రభ వేగంగా అతని దగ్గరకు వెళ్లాడు.
పొదలను పక్కకు జరిపి చూడగా, ఒళ్లంతా రక్తంతో నిండిపోయి, స్పృహలేని స్థితిలో ఓ వ్యక్తి కనిపించాడు.
“చారి! ఇతను భరణి అయి ఉంటాడా?” అని అడిగాడు ప్రభ.
దగ్గరకు వచ్చిన చారి అతని ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు.
“అవును అన్నా! ఇతనే భరణి!” అన్నాడు ఆందోళనగా.
“ఒక్కసారి ముక్కు దగ్గర చేయి పెట్టి చూడు. ఊపిరి వస్తోందో లేదో!” అన్నాడు చారి.
ప్రభ వెంటనే భరణి ముక్కు దగ్గర చేయి పెట్టి చూశాడు.
“ఊపిరి తీసుకుంటున్నాడు రా! ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. వెంటనే బయటకు తీసుకెళ్దాం!” అన్నాడు.
ఇద్దరూ కలిసి భరణిని పొదల నుంచి బయటకు తీసుకొచ్చారు. అతని శరీరమంతా గాయాలున్నాయి. అక్కడక్కడ ముళ్లు గుచ్చుకున్న ఆనవాళ్లు కూడా కనిపించాయి.
ముళ్లను వీలైనంత జాగ్రత్తగా తొలగించి, అతన్ని ఇద్దరూ కలిసి బండి మీద ఎక్కించారు.
ఆలస్యం చేయకుండా ఎం.ఆర్. పల్లిలోని మైథిలి ఆయుర్వేద వైద్యశాలకు తీసుకెళ్లారు.
---
నిజం బయటపడింది!
భరణిని వైద్యశాలకు చేర్చిన తర్వాత ప్రభ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ హోటల్‌లో కనిపించిన ఉద్యోగి మాత్రం కనిపించలేదు.
అప్పటికే పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
“ఇప్పటికైనా నిజం చెప్పి, బాధితులకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. లేకపోతే కేసు కోర్టు వరకు వెళ్తుంది” అని ఎస్సై హెచ్చరించాడు.
పోలీసుల విచారణలో నిందితుడు జరిగిన విషయాలను వివరించడం ప్రారంభించాడు.
“భరణితో ఒప్పందం కుదుర్చుకున్నాక, అతను తీసుకొచ్చే సరుకును బట్టి ధర నిర్ణయిస్తానని చెప్పాను. తక్కువ సరుకు తీసుకొస్తే తక్కువ ధర, ఎక్కువ సరుకు తీసుకొస్తే కొంచెం ఎక్కువ ధర ఇస్తానని నమ్మించాను. భరణి తన ఊరిలో కొంతమంది దగ్గర సరుకు సేకరించి తీసుకొచ్చాడు.
అయితే భరణితోపాటు వచ్చిన గిరి కూడా కొన్ని దొంగ సరుకులు తీసుకొచ్చాడు. ఆ విషయం భరణికి తెలియదు.
డబ్బులు వారం రోజుల్లో ఇస్తానని చెప్పడంతో భరణి గిరితో కలిసి తిరిగి వచ్చాడు. కానీ గిరి అంతకుముందే నా దగ్గరకు వచ్చాడు. అతనికి అదనంగా డబ్బులు ఇస్తానని ఆశ చూపించి, వేరే చోటికి వెళ్లిపొమ్మని చెప్పాను. అదే రోజు రాత్రి ఊరికి వెళ్లి, భరణి డబ్బులతో పారిపోయాడని అందరికీ చెప్పమని సూచించాను. అందుకు కొంత డబ్బు కూడా ఇచ్చాను.
నేను చెప్పినట్టే గిరి ఊరికి వెళ్లి ప్రచారం చేయడంతో భరణిపై అందరికీ అనుమానం వచ్చింది. భరణి ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు అతని మాటలు విని నాకు అనుమానం కలిగింది. అతను నిజం తెలుసుకుని నాపై గొడవకు దిగుతాడేమోనని భయపడ్డాను. అందుకే ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయాను.
ఆ తర్వాత నా మనుషులు భరణిని కొట్టారు. అతను బతికున్నాడో, చనిపోయాడో నాకు తెలియదు.
గిరి కూడా నా గురించి నిజం బయటపెడతాడేమోనని భయపడి, నా మనుషులను పంపించాను. వాళ్లు గిరిని కత్తితో పొడిచి వచ్చారు. భరణికి ఏమైందో మాత్రం నాకు తెలియదు” అని చెప్పాడు.
అతని మాటలు విన్న ప్రభకు కోపం కట్టలు తెంచుకుంది.
“ఏరా! డబ్బు కోసం నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి కూడా వెనుకాడవా? నీకెంత ధైర్యం? ముందు జనాల డబ్బు ఎక్కడ దాచావో చెప్పు!” అని గద్దించాడు.
“నా మొబైల్ బ్యాంకింగ్‌లో డబ్బులు సురక్షితంగా ఉన్నాయి. ఇప్పుడే బదిలీ చేస్తాను” అంటూ తన ఫోన్ తీసుకున్నాడు నిందితుడు.
వెంటనే గంగాధర్ ఖాతాకు డబ్బులు బదిలీ చేశాడు.
పోలీసులు అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
“ఒరేయ్! నీలాంటి వాళ్ల వల్లే అమాయకులు నష్టపోతున్నారు. నువ్వు చేసిన తప్పులకు చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే!” అని ఎస్సై హెచ్చరించాడు.
ఆ తర్వాత గంగాధర్‌ను ఉద్దేశించి, “గంగాధర్ గారూ! మీరు నిశ్చింతగా వెళ్లొచ్చు. మీ అబ్బాయి తప్పు చేయకపోయినా అతనిపై ఎన్ని నిందలు పడ్డాయో చూశారు కదా! దాడికి కూడా గురయ్యాడు. వెళ్లి మీ డబ్బులు తీసుకోండి. అలాగే మీ అబ్బాయికి చెప్పండి—తన సొంత వ్యాపారాన్ని చూసుకోమని. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి ఇబ్బందులు తెచ్చుకోవద్దని చెప్పండి” అన్నాడు ఎస్సై.
“అలాగే సార్! తప్పకుండా చెబుతాను” అన్నాడు గంగాధర్.
తర్వాత ప్రభ వైపు తిరిగి, “బాబూ! ముందు భరణిని చూద్దాం. ఆ తర్వాత ఎవరికెంత డబ్బు ఇవ్వాలో నిర్ణయించుకుందాం” అన్నాడు.
“సార్! మీ అబ్బాయి ఇంకా కళ్లు కూడా తెరవడం లేదు. సాయంత్రం వరకు వేచి చూద్దాం. అప్పటికి మెలకువ వస్తే, అతని ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డబ్బుల గురించి ఆలోచించవచ్చు. డబ్బులు ఎలాగూ తిరిగి వచ్చాయి కదా! ఇప్పుడు ఆందోళన పడకండి” అని సర్దిచెప్పాడు ప్రభ.
అక్కడికి వచ్చిన కొందరు పెద్దలు కూడా గంగాధర్‌కు నచ్చజెప్పారు.
“అవును గంగాధర్ గారూ! ఈ పరిస్థితిలో డబ్బుల గురించి ఆలోచించడం కంటే మీ అబ్బాయి ఆరోగ్యం ముఖ్యం. ముందు అతను కోలుకోవాలి. అలాగే మీ కూతురిని భరణికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే, వారి కుటుంబ పరిస్థితులను కూడా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి” అని సూచించారు.
గంగాధర్ మౌనంగా తల ఊపుతూ తన కొడుకు గురించే ఆలోచించసాగాడు.
---
మైథిలి వైద్యశాలలో...
ప్రభ, గంగాధర్‌లు భరణిని మైథిలి వైద్యశాలకు తీసుకురాగానే మైథిలి అతని పరిస్థితిని చూసి చలించిపోయింది.
వెంటనే మాలిని, శాలిని సహాయంతో అతని శరీరానికి గుచ్చుకున్న ముళ్లను తొలగించడం ప్రారంభించింది. ప్రభ, గంగాధర్ కూడా వారికి సహాయం చేశారు.
శరీరమంతా అంటుకున్న రక్తాన్ని శుభ్రం చేసి, అవసరమైన మందులు అందించింది మైథిలి.
గంగాధర్ ఆందోళనగా ఆమె వైపు చూశాడు.
“ఏమీ ప్రమాదం లేదుగా అమ్మా?” అని అడిగాడు.
“నాన్నగారూ! భయపడకండి. భరణి అదృష్టవంతుడు. బహుశా దీర్ఘాయుష్షు ఉండి ఉంటుందేమో! ముళ్లు గుచ్చుకోవడం వల్ల నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతానికి వేరే పెద్ద సమస్య ఏమీ కనిపించడం లేదు” అని ధైర్యం చెప్పింది మైథిలి.
“హమ్మయ్య!” అంటూ గంగాధర్ ఊపిరి పీల్చుకున్నాడు.
కాసేపు నిలబడటంతో కాళ్లు నొప్పి పెడుతున్నాయని భావించి కూర్చోవడానికి వెళ్లిన గంగాధర్‌కు ఫోన్ వచ్చింది. దాంతో అతను పక్కకు వెళ్లి మాట్లాడసాగాడు.
మైథిలి కూడా ఏదో తీసుకురావడానికి లోపలికి వెళ్లింది.
అప్పుడు మాలిని ప్రభ దగ్గరకు వచ్చి చిరునవ్వుతో, “ప్రిన్స్! నిజంగానే మీరు మీకు పెట్టిన పేరును నిలబెట్టుకున్నారు” అంది.
“సిస్టర్! ఇక్కడ ప్రిన్స్ కంటే, నాకు క్లూ ఇచ్చి సహాయం చేసిన మీకే థాంక్స్ చెప్పాలి” అన్నాడు ప్రభ.
భరణి కాలికి కట్టు కడుతున్న మాలిని ఆశ్చర్యంగా చూస్తూ, “అదెలా ప్రిన్స్?” అని అడిగింది.
“అదే సిస్టర్! మీరు క్లూ ఇవ్వకపోతే నేను భరణిని ఎలా వెతికి పట్టుకోగలిగేవాడిని?” అన్నాడు ప్రభ.
“క్లూ ఇవ్వడం గొప్ప కాదు ప్రిన్స్! మీరు సాహసించి, ఆ క్లూను ఆధారంగా చేసుకుని భరణిని కనిపెట్టడం గొప్ప!” అంది మాలిని.
“ఇందులో గొప్పేముంది సిస్టర్? తోటి మనిషికి సాయం చేయడం మానవ ధర్మం కదా!” అన్నాడు ప్రభ.
“అవును! మాటల్లో కూడా మీరు చాలా చతురులు ప్రిన్స్!” అంటూ నవ్వింది మాలిని.
“సిస్టర్!” అంటూ ప్రభ మరోవైపు చూశాడు.
గంగాధర్ తనను పిలుస్తున్నాడేమో అనుకుని అటువైపు వెళ్లాడు.
అప్పటికే అక్కడికి ఇద్దరు ముగ్గురు పెద్దలు వచ్చి గంగాధర్‌తో మాట్లాడుతున్నారు.
ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి, “గంగాధర్ గారూ! మమ్మల్ని క్షమించండి. అసలు నిజం తెలియక భరణిని అపార్థం చేసుకున్నాం” అన్నారు.
గంగాధర్ వారి మాటలకు పెద్దగా స్పందించలేదు.
ఒక మనిషి చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బు అతనికే కాదు, అతని కుటుంబం మొత్తానికి జీవనాధారం. అలాంటిది ఏడాది పొడవునా కష్టపడినా ఒక్క రూపాయి కూడా చేతికి రాకపోతే ఆ కుటుంబం ఎంతటి వేదనను అనుభవిస్తుందో ఆయనకు తెలుసు.
అయితే, తన కొడుకు ప్రాణాలతో తిరిగి రావడమే ప్రస్తుతం తనకు అన్నింటికంటే ముఖ్యమని భావించాడు గంగాధర్.
అతను ప్రభ వైపు తిరిగి, “బాబూ! ముందు నువ్వు ఫ్రెష్ అప్ అయి రా” అన్నాడు.
ప్రభ తన బట్టలవైపు చూసుకున్నాడు. దుమ్ము, రక్తపు మరకలతో అవి మాసిపోయి ఉన్నాయి.
“బాబూ! మా భరణి బట్టలు ఉన్నాయి. మీ ఇద్దరి వయసూ దాదాపు ఒకటే కాబట్టి అవి నీకు సరిపోతాయి. మొహమాటపడకుండా వెళ్లి ఫ్రెష్ అప్ అయి రా. మా ఇంట్లో నిన్ను ఒక వ్యక్తిలా కాదు, మా కుటుంబ సభ్యుడిలా భావిస్తున్నాం” అన్నాడు గంగాధర్.
అంతలో మైథిలి తల్లి అక్కడికి వచ్చింది.
ఆమె కూడా, “వెళ్లిరా బాబూ! ఎందుకు మొహమాటపడతావు? మా ఇంట్లో నువ్వూ ఒక వ్యక్తివే!” అంటూ ఆప్యాయంగా చెప్పింది.
గంగాధర్ భరణి బట్టలు తీసుకురమ్మని చెప్పడంతో ప్రభ వాటిని తీసుకుని ఫ్రెష్ అప్ కావడానికి వెళ్లాడు.
కాసేపటి తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి వచ్చి, గంగాధర్ పక్కన కూర్చున్నాడు.
గంగాధర్ భోజనం చేయడానికి సిద్ధమయ్యాడు. ముందుగా చేతిలో నీళ్లు తీసుకుని పళ్లెం చుట్టూ చల్లి, ఒక ముద్ద అన్నాన్ని పక్కన పెట్టాడు. ఆ తర్వాత భోజనం చేయడం ప్రారంభించాడు.
అతని ప్రతి కదలికనూ ప్రభ తదేకంగా గమనిస్తున్నాడు.
“బాబూ!” అని గంగాధర్ పిలవడంతో ప్రభ ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు.
తన పెదవులపై చిరునవ్వు మెరిసింది.
'మా అమ్మ కూడా భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఇలాగే చేస్తుంది. పళ్లెం చుట్టూ నీళ్లు చల్లి, ఒక ముద్ద పక్కన పెడుతుంది అని మనసులో అనుకున్నాడు.
“ఏంటి బాబూ! భోజనం చేస్తూ కూడా ఏదో ఆలోచిస్తున్నావు? పొలం మారానా? ముందు ప్రశాంతంగా భోజనం చేసి, తర్వాత ఆలోచించు” అన్నాడు గంగాధర్ నవ్వుతూ.
ఆ మాటలకు ప్రభ కూడా నవ్వాడు.
అంతలో గంగాధర్ భార్య ఓ గ్లాసు నీళ్లు తీసుకొచ్చి ప్రభకు అందించింది.
“తాగు బాబూ!” అంటూ అతని తలపై ఆప్యాయంగా కొన్ని నీళ్లు తట్టింది.
ఆ స్పర్శతో ప్రభ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు.
ఆమె చూపిన ఆప్యాయతలో అతనికి తన తల్లి గుర్తుకొచ్చింది .