pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక 52

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక 52


భరణిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మైథిలి అతనికి చికిత్స చేయడంతో ప్రభకు తెలియకుండానే అలసట ఆవరించింది. శరీరమంతా నీరసించినట్టుగా అనిపించడంతో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అయితే, రాత్రి భోజనానికి వెళ్లి కూర్చున్నాకే తన ఆకలిని గుర్తించినట్టుగా మెల్లగా అన్నం తినడం ప్రారంభించాడు.ఇంతలో అనుకోకుండా పొలమారింది.వెంటనే మైథిలి తల్లి అతని దగ్గరకు వచ్చి, ఆప్యాయంగా నీళ్లు అందిస్తూ, దగ్గరుండి వడ్డించసాగింది.ఆమె చూపిస్తున్న ఆప్యాయతలో ఏదో తెలియని అనుబంధం కనిపించింది ప్రభకు. క్షణకాలం అతని మనసు తన తల్లి జ్ఞాపకాలలోకి జారిపోయింది.అమ్మ చేతి ముద్దలో ఆకలి తీరుతుంది. అమ్మ చూపించే ప్రేమలో మనసు అలసట తీరుతుంది. ఆ ప్రేమకు దూరమైనప్పుడే దాని విలువ మరింతగా తెలుస్తుంది.
‘అమ్మ ఇప్పుడు ఏం చేస్తుందో? నా కోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో!’ అనుకున్నాడు.
కానీ, ఆ ఆలోచనను అక్కడితో ఆపేసి మౌనంగా భోజనం ముగించి బయటకు వచ్చిన ప్రభ వెనకే గంగాధర్ కూడా నడిచాడు.
“బాబూ! ఇప్పటికే బాగా పొద్దుపోయింది. అదిగో, అక్కడ ఓ గది ఉంది కదా! ఈ రాత్రికి అక్కడే పడుకో. ప్రయాణపు అలసట తీరుతుంది” అని ఆప్యాయంగా చెప్పాడు.
“సరేనండి!” అంటూ ప్రభ ఆ గది వైపు అడుగులు వేశాడు.
ఆ గదిని చూస్తుంటే అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలా అనిపించింది. అవసరానికి మించిన హంగులేవీ లేకపోయినా, చక్కగా సర్దిన వస్తువులు, పరిశుభ్రమైన పరిసరాలు మనసుకు హాయిని కలిగిస్తున్నాయి.లోపలికి వెళ్లిన కాసేపటికే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.గదంతా చీకటి పరుచుకుంది.అయితే, బయట మాత్రం వెన్నెల తన అందాలను ఆరబోస్తోంది. ఆకాశంలో విరాజిల్లుతున్న చందమామ వెదజల్లే చల్లని కాంతి కిటికీలోంచి గదిలోకి తొంగిచూస్తోంది.
ప్రభ కిటికీ తెరలను పక్కకు జరిపి, తలుపులు తెరిచాడు.వెన్నెలతో కలిసి లోనికి ప్రవేశించిన పిల్లగాలి అతని ముఖాన్ని సుతిమెత్తగా తాకింది.ఆ చల్లదనానికి మనసు ఒక్కసారిగా సేదతీరింది.
“ఆహా! ఈ వెన్నెలకు ఎంతటి హాయిగల మనసుందో! ఎవరినీ పలకరించకుండానే అందరినీ పలకరిస్తుంది. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండానే తన చల్లదనాన్ని పంచుతుంది” అనుకున్నాడు అలా కిటికీలోంచి బయటకు చూస్తున్న అతని దృష్టి, తన గదికి ఆరడుగుల దూరంలో ఉన్న మరో గది కిటికీపై పడింది.
అక్కడ కూడా కిటికీ తలుపులు తెరుచుకున్నాయి.
అంతే!
అటువైపు నుంచి వెన్నెల వెలుగులో మైథిలి అందమైన రూపం కనిపించింది.
‘మైథిలి... యు ఆర్ రియల్లీ గుడ్ పర్సన్." అని మనసులోనే అనుకున్నాడు.
నిన్ను చూస్తే‘నిజంగా గుణంతో పాటు నీ అందాన్ని వర్ణించకుండా ఉండలేరు సుమా! నువ్వు ఎలా ఉన్నావు తెలుసా ? గాజును కరిగించి, అందులో అందాన్ని నింపి, ఓ రూపంగా మలిచిన గాజుబొమ్మవేమో! నీ అందం కేవలం ముఖంలోనే కాదు... నీ చూపుల్లోనూ ఏదో తెలియని ప్రశాంతత ఉంది అంటూ అతని ఆలోచనలు అలా సాగుతుండగానే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించబడింది.
వెలుగులు గదిలోకి ఒక్కసారిగా ప్రవేశించాయి. మైథిలి కిటికీ తలుపులు మూసేసింది.
అది గమనించిన ప్రభకు ఎందుకో విద్యుత్తుపై కాస్త చిరాకు కలిగింది.
‘ఛీ! ఇంకొంచెం సేపు ఆ వెన్నెల అలాగే ఉంటే బాగుండేది!’అనుకున్నాడు.
అయితే, తన గదిలోని కిటికీ తలుపులు మాత్రం మూయలేదు. వెనక్కి తిరిగి మంచంపై వాలిపోయాడు.
బోర్లా పడుకున్న ప్రభ జేబు తడుముకున్నాడు.
అంతే!
ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు.“షిట్! గంగాధర్‌గారిని ఫోన్ అడగాలనుకున్నాను. పూర్తిగా మర్చిపోయాను!” అంటూ నుదుటిపై చేయి వేసుకున్నాడు.
“ఏమిటో... ఏదో మైకం నన్ను కమ్మేసినట్టుగా ఉంది. లేకపోతే నాకెందుకిలా జరుగుతుంది? చేయాల్సిన పని మరిచిపోయి, ఏదో లోకంలో విహరిస్తున్నాను.”
కాసేపు మౌనంగా ఉండిపోయాడు.
“వద్దు ప్రభా! నీకిప్పుడు ఈ కలల ప్రపంచం అవసరం లేదు. మనసులో అనుకోవడం వేరు... అనుకున్నది ఆచరణలో పెట్టడం వేరు. జీవితమంతా కలల్లోనే గడిపేస్తే గమ్యాన్ని ఎలా చేరుకుంటావు?”
అతని ఆలోచనల్లో మళ్లీ తల్లి రూపం మెదిలింది.
“పాపం అమ్మ! ఎన్నిసార్లు ఫోన్ చేసిందో ఏమో! నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. రేపు ఉదయాన్నే లేచి ఇక్కడి నుంచి బయలుదేరాలి.”అనుకున్నాడు.
ఆ నిర్ణయంతో మనసును నచ్చజెప్పుకుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.
ఉదయం తొమ్మిది గంటలైంది.క్లినిక్ పనులు ప్రారంభమైనా ప్రభ మాత్రం ఇంకా నిద్రలోనే ఉన్నాడు.
“ఆ అబ్బాయి ఇంకా లేవలేదా?” అని గంగాధర్ తన భార్యను అడిగాడు.
“లేదండీ! పాపం, రాత్రి బాగా అలసిపోయి ఉంటారు కదా! అదీగాక, గాయాల నొప్పిని భరిస్తూనే మన భరణికి సాయం చేశారు. నిజంగా ఆ దేవుడే మన భరణి కోసం ఈ అబ్బాయిని పంపించాడేమో!” అంది ఆమె కృతజ్ఞతతో నిండిన స్వరంతో.
“అవునమ్మా! నువ్వు చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది” అంటూ మైథిలి కూడా అక్కడికి వచ్చింది.
అంతలోనే ఓ పేషెంట్ రావడంతో ఆమె తన పనిలో నిమగ్నమైంది.
గంగాధర్ మాత్రం ప్రభ గురించి ఆలోచిస్తూ నిలబడ్డాడు.
‘ఎంత మంచి మనసున్న అబ్బాయి! నేను అతనికి గతంలో చేసిన చిన్న సాయాన్ని గుర్తుపెట్టుకుని, ఇంత పెద్ద సాయం చేశాడు. ఈ కాలంలో కృతజ్ఞతను గుర్తుపెట్టుకునేవాళ్లు ఎంతమంది ఉన్నారు?’అనుకుంటూ ప్రభ ఉన్న గది వైపు నడిచాడు.
‘చూస్తుంటే చదువుకున్న అబ్బాయిలా కనిపిస్తున్నాడు. నా కూతురు డిప్లొమా పూర్తిచేసినప్పటి నుంచీ ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. కానీ, తను మాత్రం పైచదువులు చదవాలంటూ పట్టుబట్టి చదువుతోంది. తన ఆశయానికి అడ్డు పడకూడదనే ఇంతవరకు ఆగాను.’
అలా ఆలోచిస్తూనే గది దగ్గరకు చేరుకున్నాడు.
ప్రభ అప్పటికే నిద్రలేచి, ఫ్రెషప్ అయి దుస్తులు మార్చుకున్నాడు.
తాను పడుకున్న మంచాన్ని చక్కగా సర్దాడు. బెడ్‌షీట్‌ను సరిచేసి, తలగడను యథాస్థానంలో పెట్టి బయటకు వచ్చాడు.
అదే సమయంలో ఎదురుగా వచ్చిన గంగాధర్‌ను చూసి చిరునవ్వుతో పలకరించాడు.
“శుభోదయం అండీ!”
“ఆ... శుభోదయం బాబూ! కొత్త ప్రదేశం కదా! రాత్రి బాగా నిద్రపట్టిందా?” అని అడిగాడు గంగాధర్.
“నిద్ర బాగానే పట్టిందండీ. అనిపించింది” అని సమాధానమిచ్చాడు ప్రభ.
అంతలోనే గంగాధర్ భార్య కాఫీ తీసుకొచ్చింది.“తీసుకో బాబూ!” అంటూ అందించింది.
“థాంక్యూ అండి!” అని కాఫీ అందుకున్న ప్రభ, కొద్దిసేపట్లోనే తాగి ఖాళీ కప్పును ఆమెకు అందిస్తూ “వెళ్లొస్తానండి!” అన్నాడు.
ఏదో చెప్పాలన్నట్టుగా గంగాధర్ అతని వైపు చూశాడు.“బాబూ... అదీ...” అంటూ మాట మొదలుపెట్టాడు.
“చెప్పండి !” అంటూ ప్రభ తన బ్యాగ్ తీసుకోవడానికి పక్కకు తిరిగాడు.
అయితే, అతని పర్సు జేబులోంచి జారి కిందపడిపోయింది.అది ప్రభ గమనించలేదు.
కానీ, గంగాధర్ దృష్టి మాత్రం ఆ పర్సుపై పడింది.వెంటనే వంగి దానిని చేతిలోకి తీసుకున్నాడు.పర్సులోంచి కనిపిస్తున్న ఓ ఫొటో అతని కంటపడింది.ఆ ఫొటోను చూసిన క్షణం..అతని ముఖంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది.
కళ్లలో ఏదో తెలియని ఆనందం మెరిసింది. పెదవులపై చిరునవ్వు విరిసింది. అయితే, ఆ ఆనందం వెనుక దాగున్న భావోద్వేగం అతని కళ్లలో తడిగా ప్రతిబింబించింది.ఆ ఫొటోను చూస్తూ కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు.
కొన్ని ముఖాలు మనకు పరిచయం లేకపోయినా, మనసుకు మాత్రం ఎంతో దగ్గరగా అనిపిస్తాయి. కొన్ని జ్ఞాపకాలు మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురుపడతాయనే ఆశతో మనసు ఎదురుచూస్తూనే ఉంటుంది.అలాంటి ఏదో తెలియని అనుభూతి గంగాధర్‌ను ఆవరించినట్టుగా ఉంది.
ఇటువైపు తిరిగిన ప్రభ, గంగాధర్ తనను తదేకంగా చూస్తుండటాన్ని గమనించాడు.“ఏమైందండీ?” అన్నట్టుగా అతని వైపు చూశాడు.
“బాబూ! ఇదిగో... నీ పర్సు కిందపడింది” అంటూ గంగాధర్ దానిని అతని చేతికి అందించాడు.
అయితే, అతని చూపులు మాత్రం ప్రభ ముఖంపైనే నిలిచిపోయాయి.
ప్రభకు ఏమీ అర్థం కాలేదు.
“థాంక్యూ అండీ! సరే, నేనిక బయలుదేరుతాను” అన్నాడు.
“ఒక్క నిమిషం బాబూ!” అన్నాడు గంగాధర్.
ప్రభ ఆగి అతని వైపు చూశాడు.
“ఓ పది నిమిషాలు ఆగు బాబూ! నేను ఇప్పుడే వస్తాను” అని చెప్పి గంగాధర్ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
‘ఏమై ఉంటుంది? నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నారా?’ అనుకుంటూ సరేఈలోగా మైథిలిని ఒకసారి పలకరించి వెళ్తే బాగుంటుందని అనుకుని.క్లినిక్ వైపు వెళ్లి అక్కడున్న మాలినిని అడిగాడు.
“మైథిలిగారు ఎక్కడ ఉన్నారండీ?”
“ప్రిన్స్! అదిగో మేడం పార్క్ వైపు వెళ్ళిoది అంటే చేయి చూపిస్తుంది . మాలిని.
“సరేనండి అంటూ ప్రభ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ పార్కులో రకరకాల ఔషధ మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. వాటి మధ్య నడుస్తుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. పార్కుకి వెళ్ళిన ప్రభ ఇది బహుశా తన ప్రశాంతత కోసం ఏర్పాటు చేసుకున్నది కావచ్చు అనుకుంటూ ఎలాగా మైథిలి ఏదో వెతుకుతున్నట్టుగా మొక్కల మధ్యకు వెళ్లింది.
అదే సమయంలో అటువైపు నడుస్తున్న ప్రభ ఆమెను గమనించాడు.
‘అమ్మో! ఈమెను చూస్తుంటేనే ఏదో గంధర్వకన్య మధువనంలోకి దిగి, పూల పరిమళాల మధ్య తనకోసం తానే ఏదో వెతుక్కుంటున్నట్టుగా ఉంది!’ అతని చూపులు ఆమెను అనుసరించాయి.
ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది. మరోవైపు తాను వెతుకుతున్నది కనిపించడం లేదన్న చిన్న బెంగ కూడా కనిపిస్తోంది.చూపుడు వేలిని పెదవుల చివర ఆనించి, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న తీరు ప్రభను ఆశ్చర్యపరిచింది.
‘వామ్మో! ఈమె అందమే కాదు, ఆలోచించే తీరు కూడా ఎంత బాగుందో!’అనుకున్నాడు.
అంతలోనే మైథిలి ముఖంలో చిరునవ్వు మాయమైంది.
మొక్కల సందుల్లోకి వెళ్లి, గుబురుగా పెరిగిన ఆకుల మధ్య వెతకడం ప్రారంభించింది.
‘ఏదో ముఖ్యమైన వస్తువును పోగొట్టుకున్నట్టుంది. లేకపోతే ఇంతగా ఎందుకు వెతుకుతుంది?’అనుకుంటూ ప్రభ ఆమెవైపు అడుగులు వేశాడు.
అలా వెళ్తున్న అతని కాలికి ఏదో తగిలినట్టయింది.ఆగి కిందికి చూశాడు.ఏమీ కనిపించలేదు.
మరో అడుగు ముందుకు వేశాడు.గుబురుగా పెరిగిన మొక్కల మధ్య తెల్లగా ఏదో కనిపించింది.ఆసక్తిగా అటువైపు చూశాడు.

చిన్నగా, ముద్దుగా ఉన్న ఓ కుందేలు పిల్ల!అది ప్రభను చూసి కాస్త దూరం పరుగెత్తింది. మళ్లీ కొద్దిదూరంలో ఆగిపోయింది.
ప్రభ నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్లాడు.‘ఎంత ముద్దుగా ఉందో!’
అంటూ దానిని చేతిలోకి తీసుకోవడానికి వంగాడు.
అది ఒక్కసారిగా దూకడానికి ప్రయత్నించింది. కానీ, నీరసంగా ఉండటంతో ఎక్కువ దూరం వెళ్లలేకపోయింది.
ప్రభ దానిని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాడు.
అయితే, దగ్గరగా చూసేసరికి అది అసౌకర్యంతో చిన్నగా శబ్దాలు చేయసాగింది.దాని శరీరంపై అక్కడక్కడా బొబ్బల్లాంటి పొక్కులు కనిపించాయి.కళ్ల దగ్గర కూడా వాపు ఉన్నట్టుగా అనిపించింది.
ప్రభ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది.‘పాపం! దీనికి ఏదో చర్మసంబంధమైన సమస్య వచ్చినట్టుంది. అందుకే నీరసంగా ఉంది. ఒళ్లంతా దురదతో బాధపడుతున్నట్టుంది.’దానిని జాగ్రత్తగా గుండెలకు ఆనించుకున్నాడు.
‘ఇప్పుడేం చేయాలి? ఇక్కడ ఔషధ మొక్కలు ఉన్నాయి కదా! వీటిలో దీనికి ఉపయోగపడే మొక్క ఏదైనా ఉందేమో!’అనుకుంటూ మొక్కల మధ్య వెతకసాగాడు.
అదే సమయంలో మైథిలి కూడా పార్కులోని మరోవైపు నుంచి అతని వైపుకు వచ్చింది.
ఇద్దరూ ఎదురెదురుగా వస్తూ ఇద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు.
మైథిలి ఏదో చెప్పాలని ప్రయత్నించింది.
“అది... అది...” అంటూ ప్రభ చేతుల్లో ఉన్న కుందేలు పిల్ల వైపు చూసింది.
ప్రభకు మొదట అర్థం కాలేదు.
“ఏమిటండీ?” అన్నట్టుగా కనుబొమ్మలు పైకెత్తాడు.
మైథిలి తల అడ్డంగా ఊపుతూ, అతని చేతుల్లో ఉన్న కుందేలు పిల్లను చూపించింది.
“ఓహ్! ఇదా?” అన్నాడు ప్రభ.
“మీ పెంపుడు జంతువా?” అని అడిగాడు.
మైథిలి వెంటనే తల ఊపింది.
“అవును” అన్నట్టుగా చేయి చాపి, దానిని తనకు ఇవ్వమన్నట్టు చూసింది.
“తీసుకోండి” అంటూ ప్రభ కుందేలు పిల్లను ఆమె చేతుల్లో పెట్టాడు.
మైథిలి దానిని ఎంతో ప్రేమగా చేతుల్లోకి తీసుకుంది.
దాని తలను నిమిరి, నుదుటిపై ముద్దుపెట్టుకుంది.
“టింకూ! నిన్నెంత వెతికానో తెలుసా? ఎక్కడికి వెళ్లిపోయావు బంగారం?” అంటూ ఆప్యాయంగా పలకరించింది.
ఆమె ప్రేమను చూస్తున్న ప్రభ ముఖంలో చిరునవ్వు విరిసింది.
అయితే, ఆమె కుందేలును తీసుకుని వెళ్లబోతుండగా...
“ఆగండి!” అన్నాడు ప్రభ.
మైథిలి వెంటనే వెనక్కి తిరిగి చూసింది.

“ఏమైంది?” అన్నట్టుగా ఆమె కళ్లలో ప్రశ్న మెరిసింది.
“దానికి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. ఒళ్లంతా పొక్కులు ఉన్నాయి. బాగా నీరసంగా కూడా కనిపిస్తోంది” అన్నాడు ప్రభ.
మైథిలి ఒక్కసారిగా కుందేలు పిల్లను పరిశీలించింది.
“అవునా?” అంటూ దాని శరీరమంతా నెమ్మదిగా తడిమి చూసింది.
ప్రభ చెప్పినట్టుగానే అక్కడక్కడా పొక్కులు కనిపించాయి.
“అయ్యో! టింకూ... నీకేమైంది?” అంటూ ఆందోళనగా దాని తల నిమిరింది.
“దీనిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి” అంది మైథిలి.
“అవసరం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్లొచ్చు. కానీ, ముందు దీని పరిస్థితిని కొంచెం పరిశీలిద్దాం” అన్నాడు ప్రభ.
“ఎందుకండి? సమస్య ఎక్కువైతే?” అంది మైథిలి.
“అప్పటివరకు చూస్తూ ఊరుకుంటామా అండీ? దానికి తగిన చికిత్స అందించాలి. అయితే, మనం ఏం చేస్తున్నామో తెలియకుండా ఏదో ఒక మందు వేయడం కూడా మంచిది కాదు.”అంటూ ప్రభ కుందేలు పిల్లను జాగ్రత్తగా పరిశీలించాడు.
“మీరు కొంచెం పక్కకు నిలబడండి. ఇక్కడున్న కొన్ని ఔషధ మొక్కలు నాకు తెలుసు. వాటిలో దీనికి ఉపయోగపడేది ఏదైనా ఉందేమో చూస్తాను” అన్నాడు.
మైథిలి వెంటనే పక్కకు జరిగింది.
ప్రభ అక్కడున్న మొక్కలను పరిశీలించి, తనకు తెలిసిన ఓ ఔషధ మొక్క ఆకులను తీసుకున్నాడు.
వాటిని చేతులతో నలిపి, వచ్చిన రసాన్ని కుందేలు శరీరంపై పూయవచ్చో లేదో మైథిలికి వివరించాడు. అయితే, ముందుగా జంతువులకు సురక్షితమో లేదో నిర్ధారించుకోవాలని కూడా చెప్పాడు.
ఆ తర్వాత కుందేలు పిల్లకు అవసరమైన చికిత్స గురించి కాగితంపై కొన్ని వివరాలు రాసిచ్చాడు.
“దీనిని పశువైద్యుడికి చూపించండి. అవసరమైన మందులు, ఇంజెక్షన్, మాత్రలు ఏవైనా ఉంటే ఆయన సూచన మేరకు మాత్రమే ఇవ్వండి. ఇలా పొక్కులు రావడానికి కారణం తెలుసుకోవడం ముఖ్యం” అన్నాడు ప్రభ.
మైథిలి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది.
ఆశ్చర్యం కంటే ఎక్కువగా ఆమె కళ్లలో కృతజ్ఞత కనిపించింది.
తన పెంపుడు జంతువు పట్ల చూపించిన శ్రద్ధ ఆమె మనసును తాకింది.
ప్రభ మాత్రం ఆమె అలా చూస్తుండటాన్ని గమనించి చిరునవ్వుతో...
“హలో, మేడమ్! ఏమిటి అలా చూస్తున్నారు?” అన్నాడు.
మైథిలి వెంటనే తేరుకుంది.
“థాంక్యూ అండి!” అంది.
“అయ్యో! ఎందుకండీ థాంక్యూ? ముందు నేనే మీకు థాంక్స్ చెప్పాలి” అన్నాడు ప్రభ.
“లేదు, లేదు! నేను మీకు డబుల్ థాంక్స్ చెప్పాలి” అంది మైథిలి.
ప్రభ నవ్వాడు.
“అదేమిటండీ? ఒక సాయానికి రెండుసార్లు కృతజ్ఞతలా?”
“అవునండి! ఒకటి మా అన్నయ్య ప్రాణాలు కాపాడినందుకు. మరొకటి మా టింకూని ఇంత శ్రద్ధగా చూసుకున్నందుకు!” అంటూ కుందేలు పిల్లను ప్రేమగా దగ్గరకు తీసుకుంది.
ఆ మాటలు విన్న ప్రభ ముఖంలో సంతృప్తి కనిపించింది.
“అవునండీ! మీరు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు. కానీ, మాట్లాడుతుంటే మాత్రం ఎంతో ఆప్యాయంగా ఉంటారు” అన్నాడు.
మైథిలి చిన్నగా నవ్వింది.
“అంటే, గంభీరంగా కనిపించే వాళ్లంతా మాట్లాడటం తెలియనివాళ్లని మీ ఉద్దేశమా?” అని సరదాగా అడిగింది.
“అయ్యో! నేను ఆ మాట అనలేదండీ! కొందరి ముఖాల్లో గంభీరత కనిపిస్తుంది. కానీ, వారి మనసుల్లో ఎంత సున్నితత్వం ఉంటుందో మాట్లాడితేనే తెలుస్తుంది. మీ విషయంలోనూ అదే అనిపించింది” అన్నాడు ప్రభ.
ఆ మాటలకు మైథిలి ముఖంలో చిరునవ్వు మరింత విరిసింది.
“మనసులో ఏముందో మాటల్లోనే తెలుస్తుందనుకుంటారా?” అని అడిగింది.
“ఎప్పుడూ కాదు. కొన్నిసార్లు మాటలు మనసులోని భావాలను బయటపెడతాయి. మరికొన్నిసార్లు మనసులోని బాధను దాచిపెడతాయి. కానీ, మనిషి మాట్లాడే విధానం, ఎదుటివారితో ప్రవర్తించే తీరు అతని వ్యక్తిత్వాన్ని ఎంతోవరకు తెలియజేస్తాయి” అన్నాడు ప్రభ.
మైథిలి అతని మాటలను ఆసక్తిగా వింటోంది.
“నిజమేనండి! మాట్లాడితేనే మనుషుల వ్యక్తిత్వం అర్థమవుతుంది. మనసులో ఉన్నదంతా చెప్పకపోయినా, ఎదుటివారిని గౌరవించే తీరు మన గురించి ఎన్నో విషయాలు చెబుతుంది” అంది.
“మీరు చెప్పింది అక్షర సత్యం!” అన్నాడు ప్రభ.
ఆ వెంటనే చిరునవ్వుతో మరో మాట జోడించాడు.
“మాట్లాడటం కూడా ఓ కళే మేడమ్! ఎదుటివారి మనసు నొచ్చుకోకుండా మన భావాన్ని చెప్పగలగడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు.”
“అయితే, మాటలతో మనసులను గెలుచుకోవచ్చంటారు?” అని అడిగింది మైథిలి.
“తప్పకుండా! కత్తితో గెలిచిన విజయం కంటే, మంచి మాటతో గెలిచిన మనసు విలువైనది. ఎందుకంటే, గాయం మానిపోవచ్చు... కానీ మాట చేసిన గాయం కొన్నిసార్లు జీవితాంతం గుర్తుండిపోతుంది.”
ప్రభ మాటల్లోని గంభీరతను గమనించిన మైథిలి క్షణకాలం మౌనంగా ఉండిపోయింది.
ఆమె కళ్లలో ఏదో కొత్త ఆలోచన మెరిసింది.
“మీరు చాలా బాగా మాట్లాడతారండి!” అంది చివరకు.
“అలా ఏమీ లేదండీ! మనసుకు అనిపించిన మాటను మనసుతో చెప్పడమే నాకు తెలుసు” అన్నాడు ప్రభ.
ఆ మాటలకు మైథిలి పెదవులపై మళ్లీ చిరునవ్వు విరిసింది.
వెన్నెల రాత్రిలో కిటికీ అవతల కనిపించిన ఆ అందమైన రూపం, ఇప్పుడు తన ముందే నిలబడి ఆప్యాయంగా మాట్లాడుతోంది.
అయితే, ప్రభ మనసులో మాత్రం ఓ చిన్న సందేహం మొలకెత్తింది.
‘ఈమెను చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతోంది. ఆమె నవ్వు బాగుంది. మాటలు బాగున్నాయి. మనసు కూడా అంతే అందంగా ఉన్నట్టుంది. కానీ...’
అక్కడితో తన ఆలోచనలకు అడ్డుకట్ట వేశాడు.
‘ప్రభా! పరిచయమైన ప్రతి మనిషిని మనసులోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. కొన్ని పరిచయాలు స్నేహంగా మారితే చాలు. మరికొన్ని జ్ఞాపకాలుగా మిగిలితే చాలు.’అనుకుంటూ మైథిలి వైపు చూశాడు.
ఆమె మాత్రం టింకును ప్రేమగా నిమురుతూ ఉంది.
ఆ దృశ్యాన్ని చూసిన ప్రభ మనసులో ఓ మధురమైన భావన మెదిలింది.
కొన్ని పరిచయాలు పలకరింపుతో మొదలవుతాయి. కొన్ని ఆప్యాయతతో దగ్గరవుతాయి. మరికొన్ని మాత్రం మనకు తెలియకుండానే మనసు తలుపు తడతాయి. ఆ తలుపు తెరవాలా, వద్దా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అనుకుంటూ ఉండగా మైతిలి వెళుతూ ఉంటే గంగాధర్ ఏదో ఒక చిన్న సంచితీసుకొని రావడం చూసి అటువైపు వెళ్తాడు.