విలువలు

విలువలు

- బివిడి.ప్రసాదరావు

BVD.Prasada Rao

నీలిమకూ కోరికలు ఉన్నాయి. కన్నవారింట నెరవేరలేదు. అత్తవారింటైనా తీర్చుకోవాలనుకుంది.

'కొత్త మోజులోనే భర్త ఆసరాతో కోరికలు తీర్చుకోవాలి' అనుకుంది. తొలి అస్త్రం సంధించింది - అత్తింట అడుగు పెట్టిన మొదటి నెలలోనే.

"ఇంకా బ్లాక్ అండ్ వైట్ టీవియే, కలర్ ది తీసుకుంటే బాగుంటుంది." అంది.

"మీదీ కలర్ ది కాదుగా" అన్నాడు భర్త విశ్వం, చిరునవ్వుతో.

"అందుకే ఇరుగు పొరుగువారి కలర్ టీవిలకై ఎగబ్రాకే దానిని" అంది నీలిమ.

విశ్వం మాట్లాడలేదు.

"ఇక్కడా అదే అవస్థనా" గుణుస్తున్నట్టు అంది.

విశ్వం ఏమీ అనలేదు.

వారం తర్వాత, మళ్లీ టీవి ప్రస్తావన వచ్చింది - నీలిమ ద్వారా, భర్త దగ్గర.

"నాది చిన్న ఉద్యోగం. సాధారణ జీతం. నాన్న పెన్షన్ కలుపుకుని సాఫీగా సాగిస్తున్నాం ఇంటిని. ప్రస్తుతం మోజులకు, ముచ్చటలకు వీలు కాదు నీలిమా" అన్నాడు విశ్వం.

నీలిమకు ఇల్లు గుర్తుకు వచ్చింది.

తండ్రి రాఘవరావు గుర్తుకు వచ్చారు.

రాఘవరావు రిటైర్డ్ టీచర్.

గిరిజ ఆయన భార్య.

వీరి ఏకైక సంతానం నీలిమ.

రాఘవరావు ఉద్యోగ విరమణ చేసిన ఏడాదిలోనే రెండు పోర్షన్ల ఇల్లు కట్టించారు. నీలిమకు పెళ్లి చేశారు.

వీటికై ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేశారు. తొలి నుండి దుబారాకు అడ్డుకట్టు వేస్తూ, కూడపెట్టిన డబ్బును ఖర్చు చేశారు.

"అంతా డబ్బు రూపాన్నే ఇచ్చే బదులు, కానుకలుగా కలర్ టీవి, ఫ్రిజ్, వాషింగ్ మెషన్, స్కూటర్ లాంటివి కొని ఇవ్వవచ్చుగా. ఇక్కడా పైసా పైసా లెక్కలేనా!" అంది నీలిమ, నిష్ఠూరంగా, తండ్రితో - తన పెళ్లిలో.

"మీ అత్తవారు డబ్బు అవసరమన్నారు. అందుకు తగ్గ కారణాలూ చెప్పారు. అబ్బాయికై కొన్ని అప్పులు చెయ్యవలసి వచ్చిందట. మనం ఇచ్చేది డబ్బు రూపేణా ఉండేలా చూడమని కోరారు. అందుకే ఇచ్చేది, డబ్బుగా సర్దుబాటు చేస్తున్నాను. సంబంధం మంచిది. అందుకే అంతా ఊడ్చి మరీ ఇస్తున్నాను." అన్నారు రాఘవరావు.

"మనకు ఎలాగండీ" అంది గిరిజ, ఆ సందర్భంలోనే.

"సొంత ఇల్లు ఉంది. పెన్షన్ వస్తోంది. చాల్లే మనకు." అన్నారు రాఘవరావు, నిబ్బరంగా.

"ఏమిటి నీలిమా, అలా ఉండిపోయావు." విశ్వం ఆమెను కుదుపుతూ అడిగాడు.

నీలిమ ఆలోచనల్లో నుండి బయట పడింది. తన తల్లిదండ్రుల ద్వారా తన మోజులు నెరవేరలేదు. 'ఇక భర్త ద్వారా తీర్చుకోవాలి' అనే ఆలోచనలో ఆమె ఉంది.

"నేను అంటే మీకు ఇష్టమేనా" నీలిమ అడిగింది గోముగా, భర్తని.

"అదేమిటి! ఎందుకు ఇష్టం ఉండదు? నువ్వు నాకు బాగా ఇష్టపడ్డావు" అన్నాడు విశ్వం.

"నా మీద మీకు ప్రేమ లేదా" అంది నీలిమ, మురిపంగా.

"అదేమిటీ, నువ్వు అంటే ప్రేమే కాదు, అభిమానం కూడా. నీ మూలంగానే కదా మీ వాళ్లు చాలా డబ్బు ముట్ట చెప్పారు. మా అప్పులన్నీ తీరాయి." అన్నాడు విశ్వం.

"నా పై మీకు ఎప్పుడూ అదే భావం ఉండాలి."

"తప్పక."

"మీరు నా మాట వింటారు కదూ."

"ముమ్మాటికి."

"మా అమ్మా, నాన్నా నా మాటను కానిచ్చేవారు కాదు. మీరైనా నా మాట కానిస్తారా?"

"తప్పక." - చిన్నగా నవ్వేడు విశ్వం.

"ఒట్టు" అంది చేయి చాస్తూ నీలిమ.

సన్నగా నవ్వుతూ, ఆమె తల మీద తన చేయి వేసి, "ఒట్టు" అన్నాడు విశ్వం.

"మీరు నా మాట వింటే, మనమూ అన్నీ సమకూర్చుకోవచ్చు." అంది నీలిమ.

విశ్వం ఏమీ అనలేదు.

"మా ఇరుగు పొరుగు వారు దర్జాగా వాయిదాల పద్ధతిలోనే, అన్నీ సమకూర్చు కుంటున్నారు. మనలాంటి వారికి వాయిదా పద్ధతులు మేలైనవండీ." అంది నీలిమ.

విశ్వం దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలాడు. కానీ ఏమీ అనలేదు.

"ఏమంటారు" అంది నీలిమ.

"చూద్దాం" అన్నాడు విశ్వం, చివరకు.

"ఉహుఁ, 'చేద్దాం' అనండి" అంది నీలిమ, టక్కున.

"మా అమ్మా నాన్నలతో మాట్లాడదాం" అన్నాడు విశ్వం.

"మీరు సరేనంటే, నేనే మీ వాళ్లని మేనేజ్ చేసుకుంటాను."

విశ్వం ఏదో అనబోయాడు -

"సరేనా..." అంది నీలిమ, అతడి మీదకు ఒరుగుతూ.

విశ్వం మరేమీ అనలేదు.

"మామయ్యగారూ ... బయటకు వెళ్లి, మంచి టూ బెడ్ రూమ్స్ పోర్షన్ ఒకటి అద్దెకు చూడరాదండీ" అంది నీలిమ, ఒక రోజున, తన మామగారైన సూర్యారావుతో, నెమ్మదిగా.

"అదేమిటమ్మా, ఈ ఇల్లు బాగానే ఉందిగా." అన్నారు సూర్యారావు.

"ఏం బాగుందండీ. సింగిల్ బెడ్ రూం. పైగా కప్ బోర్డులేవి? షోకేస్ లు లేవు! మొక్కలు పెంచుదామంటే స్థలం ఏదీ? టైల్స్ రూఫ్! అద్దె పెరిగినా దర్జాగా మరో ఇంటిలో ఉంటే బాగుంటుంది." అంది నీలిమ.

"మరో కొంత హెచ్చించడమంటే మాటలా" అంది అక్కడే ఉన్న నీలిమ అత్తయ్య, అన్నపూర్ణ, కల్పించుకుంటూ.

"అత్తయ్యగారూ, అంతగా సౌకర్యాలు లేని ఈ ఇల్లు ఎందుకు! సర్దుకుపోతే ఇంకా చిన్న ఇల్లు, మరీ తక్కువకు, దొరక్కపోదు" అంది నీలిమ నిర్లజ్జగా.

"అబ్బాయిని అడిగి, చూద్దామమ్మా" అన్నారు సూర్యారావు.

"వారే అన్నారు. గదిలో మేము, వరండాలో మీరేమిటని నొచ్చు కుంటున్నారు. ఏదోలా డబ్బు సర్దుబాటు చేసుకుందామనీ అన్నారు." అంది నీలిమ.

సూర్యారావు, అన్నపూర్ణ మొహాలు చూసుకున్నారు.

"పైగా, మీ అబ్బాయి, మొహమాటమో, మరేమో, కానీ, మీతో ఈ విషయాలు మాట్లాడడానికి సంశయిస్తున్నారు." అంది నీలిమ. ఆ వెంటనే -

"మొదట రెండు, మూడు ఇళ్లు చూసి పెడితే, తర్వాత మీ అబ్బాయితో మాట్లాడి, వాటిలో ఒకటి ఖాయపర్చుకుందాం. సరేనా?" అంటూనే,

"అత్తయ్యగారూ, మీరు, మామయ్యగారితో అలా వెళ్లండి. పెద్దవారు, మొదట మీకు నచ్చితే, అన్నీ సవ్యంగానే అవుతాయి" అంది, గలగలా.

సూర్యారావు, అన్నపూర్ణలు ఏమీ అనక, యాంత్రికంగా బయటకు నడిచారు.

"ఇల్లు మారాం. అద్దె పెరిగింది. మీకు తెలిసిందే. కనుక మనం వీలైనంత మేరకు ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది" అంది నీలిమ.

"అలాగని రాత్రులు, ఈ రొట్టెలు తినడమంటే ఎలా అమ్మా" అంది అన్నపూర్ణ.

"ఏం, మీ అబ్బాయి కూడా తింటున్నారుగా. అయినా నిప్పుల మీద కాల్చిన రొట్టెలు, ఆరోగ్యానికి మంచివి కూడా" అంది నీలిమ.

"అమ్మాయి చెప్పింది నిజమే" మాటలు మించ కూడదనే ప్రయత్నం చేశారు సూర్యారావు.

"ఆఁ, అలా చెప్పండి మామయ్యగారు" అంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది నీలిమ.

ఒక రోజున -

"మామయ్యగారూ, నాకీ మధ్య ఒంట్లో నలతగా ఉంటోంది. మీ అబ్బాయికి కుదరదు. కనుక, దయచేసి, ఉదయం, సాయంకాలం ఆ మొక్కలకు, పాదులకు మీరు నీళ్లు పెట్టరూ. ఫ్రెష్ కూరలు వండుకు తినొచ్చు. పైగా కూరల ఖర్చు ఆదా అవుతుంది. ఏమంటారు?" అంది నీలిమ.

సూర్యారావు, "అలాగేనమ్మా" అంటూ, "నాకూ పనయ్యి, బద్ధకం తీరుతుంది" అన్నారు, తప్పక, నొప్పించక.

"అత్తమ్మగారూ, ఒక పూటైనా, వంట పని మీరు చూడరూ. మీ అబ్బాయికి మీ చేతి వంటల అలవాటు తప్పించడం ఏం బాగుంటుం దనిపిస్తోంది. అలసి వస్తారాయే, ఆయన సదుపాయాలు మారితే సర్దుకోలేకపోతున్నారు." అంది నీలిమ.

అన్నపూర్ణ గొంతు మరి పెగలలేదు.

"చూశారా, మీ జీతం ప్లస్ మీ నాన్నగారి పెన్షన్ మొత్తంలో నుంచి నెలవారీ బడ్జెట్లు పోగా, ఇంతవరకు మిగిల్చిన దానితో కలర్ టీవి, చిన్నచిన్న ఇంటి సామాన్లు సమకూర్చగలిగాను." అంది నీలిమ, భర్తతో, గొప్పగా, ఒక రోజున.

విశ్వం మెచ్చుకోలుగా భార్య వంక చూశాడు.

"వాషింగ్ మెషిన్, వీసిడిలకు ప్లాన్ చేస్తున్నాను. మీరు నా మాట ఇలాగే వినాలి మరి." అంది మురిపంగా, భర్తను దగ్గరకు లాక్కుంటూ.

"కోడలి ఆగడాలు మితిమీరి పోతున్నాయి. అబ్బాయితో మాట్లాడండి. 'పూట' పోయి, పనులన్నీ నాకే వదిలేస్తోంది." అంది అన్నపూర్ణ, భర్తతో, ఒక రాత్రి, మంచం మీద నడుము వాల్చుతూ.

"ఏం చెప్తామే. వాడికి తెలియనిదా!" అన్నారు సూర్యారావు, చేత్తో కాళ్లు పిసుక్కుంటూ.

"అవునండీ. మనం ఇంకా ఇంతేసి ఇంటి చాకిరీ చేయడం వీలు కావడం లేదండీ. పైగా ఫలహారాలు బంద్. కొలత భోజనాలు. పొదుపు పేరున చాలా ఇబ్బందులు పడుతున్నాం." అంది అన్నపూర్ణ, నొచ్చుకుంటూ.

సూర్యారావు ఏమీ అనలేక పోయారు. ఆలోచనల్లో పడ్డారు.

"ఫోన్ కి అప్లై చేశారా?" అడిగింది నీలిమ.

"ఆఁ, చేశాను నీలిమా" చెప్పాడు విశ్వం.

"ప్రభుత్వం రేట్లు బాగా తగ్గించింది. మనకు బాగుంటుంది" అంది నీలిమ.

విశ్వం, "నిజమే" అన్నాడు.

"వాషింగ్ మెషిన్, వీసిడిల చివరి వాయిదాలు సాయంకాలం వెళ్లి కట్టేస్తాను. డీలర్ ని వాకబు చేస్తే, స్కూటర్ కూడా వాయిదాల రూపాన ఇస్తానన్నాడు. మనం వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నాం కదా. వాడు మనల్ని తెగ పొగుడు తుంటాడు. మీ సహకారం నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి మరి. మా మంచి శ్రీవారు." అంది భర్త బుగ్గన ముద్దు పెడుతూ.

"ఆఫీసులో మీ లోన్ పేపర్లు కదులుతున్నాయా" అడిగింది వెంటనే.

"ఆఁ, ఆఁ" అన్నాడు విశ్వం.

"అందులో కాస్తా చొరవ చూపండి" అంది.

"అలాగే" అంటూ ఆఫీసుకు బయలు దేరాడు విశ్వం.

"హలో, రాజేశ్వరి ఆంటీయా" - ఫోన్ లో మాట్లాడుతోంది నీలిమ.

"ఎవరూ?" - అటు రాజేశ్వరి మాట్లాడు తోంది.

"నేనాంటీ ... నీలిమను ..."

"నీలిమా, ఎలా ఉన్నావమ్మా."

"బాగున్నాను. ఇప్పుడే మాకు ఫోన్ వచ్చింది, ఆంటీ, ఒకసారి మా అమ్మని పిలుస్తారా."

"అలాగే."

నిముషం తర్వాత, ఫోన్ దగ్గరకు వచ్చి, "నీలిమా" అంది గిరిజ, ఫోన్ లో.

"అమ్మా, బాగున్నావా?"

"ఆఁ, నువ్వు ఎలా ఉన్నావు?"

"మేము బాగానే ఉన్నాం. ఉత్తరాల బాధ తప్పిందమ్మా. ఇక ఎంచక్కా ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. ఇల్లు మార్చాను. చాలా వస్తువులు సమకూర్చుకున్నాను. ఉత్తరాలు రాశానుగా. ఒకసారి రామ్మా." అంది నీలిమ.

"అలాగేనమ్మా. మాకూ నిన్ను చూడాలని ఉందమ్మా. నువ్వు పిలిచే వరకూ రావద్దు అన్నావుగా. అందుకే ఆగాము."

"ఇప్పటికి బాగా వసతులు సమ కూరాయి. నువ్వు, నాన్న రండమ్మా. వచ్చే ముందు ఫోన్ చెయ్యండి. నా ఫోన్ నెంబర్ చెప్తాను, రాజేశ్వరి ఆంటీకి ఫోన్ ఇవ్వు, రాసుకుంటుంది." అంది నీలిమ.

కొద్దిసేపటి తర్వాత, రాజేశ్వరి ఫోన్ లో మాట్లాడింది, "చెప్పు నీలిమ."

తమ ఫోన్ నెంబర్ చెప్పి, "అమ్మకు నెంబర్ ఇవ్వు ఆంటీ" అంటూ ఫోన్ పెట్టేసింది నీలిమ.

"రండి, రండి" - గుమ్మంలో పలకరించి, ఇంట్లోకి ఆహ్వానించింది నీలిమ, తన తల్లిదండ్రులను.

"రైలు లేటండీ" అడిగింది, స్టేషన్ కు వెళ్లిన భర్తను.

"అర గంట లేటు నీలిమా" చెప్పాడు విశ్వం, చేతిలో లగేజీని క్రింద పెడుతూ.

వియ్యంకుడును, వియ్యపురాలును పలకరించారు విశ్వం తల్లిదండ్రులు, హాలులో.

విశ్వం తిరిగి ఆఫీసుకు వెళ్లిపోయాడు.

వెంటనే, ఇంటినీ, సమకూర్చుకున్న వస్తువులనూ చూపించింది నీలిమ, తన తల్లిదండ్రులకు.

పిమ్మట, "ప్రయాణం చేసి వచ్చారు. విశ్రాంతి తీసుకోండి." అంటూ ఒక గదిలో తన తల్లిదండ్రులను కూర్చుండబెట్టింది.

"మేము మీ అత్తమామల దగ్గర కూర్చుంటామమ్మా. బాగోదు." అంటున్న తన తల్లిదండ్రులతో -

"వాళ్లు రెస్టు తీసుకుంటున్నారు. ఎక్కువగా పడుకోడానికి, ఒంటరిగా ఉండడానికి వారు ఇష్టపడుతున్నారు, ఈ మధ్య." అంది నీలిమ.

అడపాదడపా తన తల్లిదండ్రుల వద్ద నుండి బయటకు వస్తూ, తన అత్తకు వంట పని, మామకు బజారు పని పురమాయిస్తోంది నీలిమ, చాలా సౌమ్యంగా.

గిరిజ, రాఘవరావులు కూతురు ఇంటి వద్ద మూడు రోజులు ఉండి, తిరిగి ప్రయాణం అయ్యారు.

వాళ్లను రైలెక్కించి, ఆఫీసుకు వెళ్లిపోయాడు విశ్వం.

రైలు కదిలింది.

"అమ్మాయి ప్రవర్తన గమనించావా?" అడిగారు రాఘవరావు, ప్రక్కనే కూర్చున్న భార్యను.

"ఆఁ, బాగా తెలివి మీరింది" అంది గిరిజ.

"తన కోరికలకు భర్తను చెంగున కట్టుకుంది." అన్నారు రాఘవరావు.

"అవునవును. అబ్బాయి పల్లెత్తి మాట్లాడ్డం లేదు." అంది గిరిజ.

"అలాగే, తమ అత్తమామల విషయంలో ఏదో మభ్యం ఉంది." అన్నారు రాఘవరావు.

"నిజమే. వాళ్లతో మాట్లాడే అవకాశం కూడా రానీయలేదు".

"నువ్వూ గ్రహించావన్నమాట. మనం అక్కడున్న రోజుల్లో, ఇంటి పట్టున మనను ఉంచిందా! గుళ్లూ, గోపురాలని, చూడతగ్గ పరిసరాలని ఎక్కువగా ఊరంతా తిప్పింది."

గిరిజ, 'అవున'న్నట్టు తలూపింది.

"ఆ వంటలు ఇది చేసినట్టు లేవు!"

"అవునవును. దాని మొహం అంత బాగా అది వంటలు ఎప్పుడు చేసింది! ఏమైనా ఇప్పుడు అది ఎంతో మారింది."

"చాలా గోప్యంగా అన్నీ చేస్తోంది సుమీ. కానీ ఆమె అత్తమామలు గుంభనంగా ఉన్నారు."

చిన్నగా తలాడించింది గిరిజ.

రైలు పయనిస్తోంది.

"బాబూ, నేను, మీ అమ్మా, ఓల్డేజ్ హోంలో చేరాలనుకుంటున్నాం." అన్నారు సూర్యారావు, విశ్వంతో - ఒక రోజున.

"అదేమిటి!" అన్నాడు విశ్వం, విస్మయంగా.

"ఏమీ లేదు. మా ఏజ్ వారంతా ఉంటారు. కాలక్షేపం అవుతుంది."

"నీలిమకు చెబ్దాం" అన్నాడు విశ్వం. వెంటనే భార్యను పిలిచాడు.

నీలిమ వచ్చింది.

విశ్వం విషయం చెప్పాడు.

"చాలా డబ్బు అవుతుందిగా" అంది నీలిమ, వెంటనే.

"నా పెన్షన్ సరిపోతోందట..."

"మీ పెన్షనా!"

"ఆఁ, మీకు మా రాబడి తగ్గినా, మా ఖర్చులూ మిగులుతాయిగా."

'నొప్పించక ... తానొవ్వక ...' అనే రీతిలో భర్త మాట్లాడ్డం అన్నపూర్ణకు నచ్చింది, అప్పటికి.

"పెద్దలు. మీ ఇష్టం." అనేసింది నీలిమ.

వెంటనే, భర్తను పిలుచుకుని, అక్కడ నుండి వెళ్లిపోయింది.

ఫోన్ లో తల్లితో మాట్లాడుతోంది నీలిమ - ఒక రోజున.

"మీ అత్తమామలు బాగున్నారా?" అడిగింది గిరిజ.

"వాళ్లు ఈ మధ్యన ఓల్డేజ్ హోంలో చేరారు" చెప్పింది నీలిమ.

"అదేమిటమ్మా!"

"వాళ్లకి అక్కడ బాగుంటుందని..."

గిరిజ ఏదో అనబోయింది.

నీలిమ ఫోన్ కట్ చేసేసింది.

ఆ రాత్రి - నీలిమకు రాఘవరావు ఫోన్ చేశారు. ఆమె అత్తమామల విషయం మాట్లాడారు.

"అవును నాన్నా, మా ఆయనతో మాట్లాడారు. వాళ్ల ఇష్టంగానే వెళ్లి పోయారు." చెప్పింది నీలిమ.

"ఏ హోంలో చేరారు?"

అడ్రస్ చెప్పింది నీలిమ. తిరిగి, "మా మామయ్యగారి పెన్షన్ వాళ్లే అట్టె పెట్టు కుంటున్నారు" అంది.

"ఉదయం అమ్మతో మాట్లాడుతూ, టక్కున ఫోన్ పెట్టేశావట."

"అబ్బే, లేదు నాన్నా, ఫోన్ కట్ అయిపోయింది." అంటూ ఏదో చెప్పబోయింది నీలిమ.

"ఉంటాను" అంటూ ఫోన్ పెట్టేశారు రాఘవరావు.

ఫోన్ కట్ కావడంతో, నీలిమ ఫోన్ రిసీవర్ దించేసింది.

బస్సు దిగి, నేరుగా వియ్యపువారు ఉంటున్న ఓల్డేజ్ హోంకు వెళ్లారు - రాఘవరావు, గిరిజలు.

అక్కడ తమ వియ్యపువారిని చూసి, నొచ్చుకున్నారు.

"మాతో ఒక మాట అనవలసింది" అన్నారు రాఘరరావు.

"ఏం చెప్తాం, బావగారూ" అన్నారు సూర్యారావు.

"మా సర్దుకుపోయే తత్వం, పోనుపోను వెలవెల పోయింది. పైగా, అలుసు అయ్యింది." అంది అన్నపూర్ణ.

"జరిగిందేదో జరిగిపోయింది. ఇక అవి మర్చిపోండి." అంది గిరిజ.

"అవును. ఇంటికి పోదాం రండి." అన్నారు రాఘవరావు.

"ఆ ఇంటికా!?" అన్నారు సూర్యారావు.

"కాదు, మా ఇంటికి" అంది గిరిజ.

సూర్యారావు ఏదో అనబోయారు.

"ముందు లేవండి, బావగారు" అన్నారు రాఘవరావు లేస్తూ.

"రండి, వదినగారూ" అంది గిరిజ కూడా లేస్తూ.

అప్పటికీ వాళ్లల్లో ఏ చలనమూ లేదు.

"చెల్లెమ్మా, నీ తోబుట్టువు పిలిస్తే కాదంటావా? బావగారూ, పిల్లల ప్రవర్తనతో మనం చెయ్యని తప్పుకు గురి అయ్యాం. నన్ను బావగారే అంటారో, స్నేహితుడే అంటారో, మీ ఇష్టం. నా మాట కాదనకండి. నా చెల్లెమ్మతో కలిసి మీరు మాతో రండి." అన్నారు రాఘవరావు, శాంతంగా.

సూర్యారావు, అన్నపూర్ణలు మరేమీ మాట్లాడలేక లేచారు.

ఒక రోజున, పోస్టు ద్వారా వచ్చిన 'రిజిష్టర్డ్ దస్తావేజు' కాగితాలను చూసి, నీలిమ ఆశ్చర్యపోయింది.

అందులో -

తమ రెండు పోర్షన్ ల ఇల్లులో, ఒక పోర్షన్ ను తన పేరున, దాన విక్రయాది సర్వ హక్కులతో తన తండ్రి పక్కాగా రాసి ఇస్తున్నట్టు ఉండడం నీలిమను మరింత గాభరా పెట్టింది.

అలాగే, రెండో పోర్షన్ ను, తన తల్లిదండ్రులు, తన అత్తమామలు పేరున, వారి సమిష్టి హక్కుగా దఖలు పడేలా మరియు వారి తదనంతరం, ఆ పోర్షన్ 'ఓల్డేజ్ హోం'కు చెందేలా, తన తండ్రి రాయడం, నీలిమను గందరగోళంలో నెట్టేసింది.

భర్త విశ్వం రాగానే, విషయం చెప్పి, ఎకాఎకిన తన కన్నవారి ఊరు బయలు దేరింది నీలిమ, భర్తతో కలిసి.

"ఇదేమిటి?!" - నీలిమ అడిగింది, దస్తావేజు కాగితాలను చూపుతూ, తన తల్లిదండ్రులను.

ఆ పైన తమ వాళ్లు మాట్లాడేరు నిశ్చలంగా, నిక్కచ్ఛిగా.

"ఒక సమంజసమైన చర్య" అన్నారు ఒకరు.

"ఇది, సరైన 'సర్దుకుపోవడం' అంటే" అన్నారు మరొకరు.

"ఇది సానుభూతి కాదు. సమర్ధనీయం" అన్నారు వేరొకరు.

"ఇది, 'కుక్క కాటు కు చెప్పు దెబ్బ', అంటే" అన్నారు మిగిలినవారు.

నీలిమ, విశ్వంలు చేష్టలుడిగి ఉండి పోయారు.

***

(ముద్రితం : ప్రియదత్త వార పత్రిక - 9.7.2003)

***

***

Rate & Review

Verified icon

sai adarsh 1 year ago

Verified icon

Durga Reddy 2 years ago

Verified icon

P.Siddu 3 years ago

నచ్చింది

Verified icon

Laxmi 3 years ago

Verified icon

V.Krishnarao 3 years ago

Best