Incomplete Poem - 5 in Telugu Drama by swathi books and stories PDF | అసంపూర్ణ కావ్యం - 5

The Author
Featured Books
Categories
Share

అసంపూర్ణ కావ్యం - 5

అలా కొన్ని రోజులు వెన్నెల, కిషోర్ మధ్య మౌనమైనా, మనసులకి చేరువైన స్నేహం ఎంతో అందంగా గడిచింది. కానీ, లోకం ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని చూసి ఓర్వలేదు కదా! ఒకరోజు వెన్నెల ఎప్పటిలాగే కిషోర్ ఇంటికి వెళ్తుంటే, వీధి చివర ఉన్న కొందరు మనుషులు మళ్ళీ నోళ్లు పారేసుకున్నారు. "చూడండి.. ఆ మొక్కల పిచ్చిది వెళ్తోంది! దీనికి తోడు తోటలో ఇంకో మొక్కల పిచ్చోడు తోడయ్యాడు. ఇద్దరికీ పిచ్చి బాగా ముదిరినట్టుంది" అంటూ బిగ్గరగా హేళన చేశారు.ఆ మాటలు వెన్నెల చెవిన పడకముందే, వెనుక వస్తున్న శారదమ్మ గుండెల్లో మంటలు రేపాయి. ఇన్నాళ్లూ తన బిడ్డ గురించి వింటున్న వెటకారాలు, గుసగుసలు ఒక ఎత్తైతే, ఇప్పుడు నేరుగా చేస్తున్న ఈ అవమానం ఆమె సహనాన్ని పరీక్షించింది. శారదమ్మకు ఉన్న ఓపిక ఒక్కసారిగా నశించిపోయింది. "ఎవరది? నా బిడ్డ గురించి అంత మాట అన్నది ఎవరు?" అంటూ ఆమె ఒక సింహంలా గర్జించింది.ఎప్పుడూ శాంతంగా, పనిలో నిమగ్నమై ఉండే శారదమ్మలో ఆ ఆవేశాన్ని చూసి అందరూ ఒక్కసారిగా నిశ్శబ్ధమైపోయారు. "ఏం తెలుసని మాట్లాడుతున్నారు? నా బిడ్డ గురించి వాగడానికి మీకు ఎంత ధైర్యం? నా బిడ్డ ఎప్పుడైనా మీ పిల్లల్లా ఎవరికీ చెప్పకుండా గడప దాటిందా? లేక ఎవరికైనా ఎదురు సమాధానం చెప్పిందా? బుద్దిగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటే.. చూస్తూ ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతారా?" అని ఆమె నిలదీసేసరికి అందరి నోళ్లు మూతపడ్డాయి.శారదమ్మ కళ్ళలో కనిపిస్తున్న ఆ మాతృత్వపు ఆవేదన, ఆ రౌద్రం చూసి.. ఆ హేళన చేసిన వారు తలదించుకున్నారు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆమె గొంతులో అంతటి ఆవేశాన్ని ఊహించని గ్రామస్థులు, ఒక్క మాట కూడా మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి జారిపోయారు. ఆ క్షణం శారదమ్మ కేవలం ఒక తల్లిగా మాత్రమే కాదు, తన బిడ్డ గౌరవానికి అడ్డుగా నిలిచే ఒక కవచంలా నిలబడింది. వెన్నెల తన తల్లి వైపు గర్వంగా, కళ్ళలో నీళ్లతో చూస్తూ ఉండిపోయింది.
శారదమ్మ వెన్నెలను కిషోర్ ఇంటికి తీసుకువెళుతుండగా, కిషోర్ , వెన్నెల కోసం తన ఇంటికి తీసుకుని వద్దాము అని వెన్నెల కోసం వస్తుండగా మద్యలో జరిగిన సన్నివేశాన్ని చూసి తన గొంతు విప్పే సమయంలో శారదా గారు గొంతు విప్పి తన క్రోధాన్ని చూసి మౌనం గా నిల్చొని చూస్తున్నాడు కిశోర్. అప్పుడు కిషోర్ వెన్నెల నాకు అప్పచెప్పండి! 
"నేను తీసుకువెళ్తాను" అన్నట్టుగా కళ్లతోనే సైగ చేశాడు. ఆ సైగలో ఒక బాధ్యత, ఒక భరోసా కనిపించేసరికి శారదమ్మ నిశ్చింతగా తన పనికి వెళ్ళిపోయింది.తోటలోకి వెళ్ళాక, కిషోర్ మనసులో మెదులుతున్న ప్రశ్నను ఆపుకోలేక అడిగేశాడు. "వెన్నెలా! ఇందాక వీధి చివర అంతమంది నిన్ను అన్ని మాటలు అంటుంటే నీకు అస్సలు కోపం రాలేదా? ఎందుకంత మౌనంగా ఉన్నావు?" అని ఆశ్చర్యంగా చూశాడు.వెన్నెల చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక స్థితప్రజ్ఞత ఉంది. "కోపం ఎందుకు రాదు కిషోర్ గారు? వస్తుంది.. వాళ్ళని తిరిగి తిట్టాలని, నా ఆవేదన వినిపించాలని కూడా అనిపిస్తుంది. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తాను.. అసలు తప్పు ఎవరిది? ఒకవేళ నేను వాళ్ళ స్థానంలో ఉండి, నాకంటూ ఏ జ్ఞానం లేకపోతే నేను కూడా అలాగే చేసేదాన్ని కదా! ఆ కోపం వల్ల నా మనశ్శాంతి పోవడం తప్ప ఎవరికీ నష్టం ఉండదు. అందుకే ఒక గట్టి ఊపిరి తీసుకుని ఆ కోపాన్ని అక్కడే వదిలేస్తాను," అని నిమ్మళంగా చెప్పింది. ఆ మాటలు విన్న కిషోర్ నిశ్చేష్టుడై ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఈ స్వార్థపూరిత లోకంలో ఇంతటి క్షమాగుణం, ఇంతటి పరిణతి ఉన్న అమ్మాయి ఉంటుందా అని అతని మనసులో ఆమె పట్ల గౌరవం రెట్టింపయ్యింది.కిషోర్ తన లోకంలోకి వెళ్లిపోగా.. "చాలు చాలు.. ఇక ఈ లోకంలోకి రండి" అని ఆమె నవ్వింది. ఆ నవ్వుతో పాటు వారి స్నేహం కూడా ఆ తోటలోని మొక్కల్లాగే ప్రతిరోజూ కొత్తగా చిగురిస్తోంది. కిషోర్‌లో వస్తున్న మార్పును చూసి జానకి గారు, రాజు అబ్బురపోయారు. మనుషులను గుర్తుపట్టడమే కష్టమైన కిషోర్, ఇప్పుడు పొద్దున్నే లేచి "వెన్నెల రాలేదా?" అని అడుగుతుంటే వారి ఆనందానికి అవధులు లేవు.ఒకరోజు కిషోర్ కుతూహలంగా అడిగాడు.. "వెన్నెలా! అసలు నీకు ఈ ప్రకృతి అంటే ఎందుకు అంత ఇష్టం? మౌనంగా ఉండే ఈ చెట్లు, మొక్కల్లో ఏముందని అంతలా పరవశించిపోతావు?"వెన్నెల కళ్లు వెలిగిపోయాయి. "ఏముందా? నిన్న వెళ్ళిన సూర్యుడు మాట తప్పకుండా ఈరోజు మళ్ళీ ఉదయాన్నే రావడం ప్రకృతి కాదా! ఆ పక్షుల కిలకిలారావాలు, మనల్ని ప్రేమలో పడేసే గులాబీలు, ఎంతటి కోపిష్టినైనా శాంతపరిచే మల్లెల సువాసన.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రకృతిలో అన్నీ అద్భుతాలే కిషోర్ గారు. మనం అడగకపోయినా ఆ చెట్లు ఇచ్చే నీడ కూడా ఒక నిశ్శబ్దమైన ప్రేమే!" ప్రకృతి లో ఉన్న ప్రేమ ను వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు! ఆమె మాటలు వింటుంటే కిషోర్‌కు ప్రతి మొక్కలోనూ, ప్రతి పూవులోనూ ఒక కొత్త ప్రాణం, ఒక కొత్త అర్థం కనిపించసాగాయి.