Incomplete poem - 7 in Telugu Drama by swathi books and stories PDF | అసంపూర్ణ కావ్యం - 7

The Author
Featured Books
Categories
Share

అసంపూర్ణ కావ్యం - 7

వెన్నెల నిశ్శబ్దంగా తోటలోకి అడుగుపెట్టింది. కిషోర్ ముఖంలో అలజడి కనిపిస్తున్నా, చదువులో ఫెయిల్ అయిన విషయం తనకు తెలియనట్టే చాలా సహజంగా నటించింది. ప్రకృతి గురించి, పక్షుల గురించి కాసేపు కబుర్లు చెప్పాక, మెల్లగా కాలేజీ విషయాలు తీసింది. "మీకు కాలేజీలో ఎవరైనా లవర్ ఉన్నారా?" అని ఆమె అల్లరిగా అడిగేసరికి కిషోర్ ఒక్కసారిగా సిగ్గుపడిపోయాడు. "అవును" అన్నట్టు నెమ్మదిగా తల ఊపాడు కానీ, ఆ పేరు మాత్రం బయట పెట్టలేదు. వెన్నెల అతన్ని ఆటపట్టిస్తూ, "చెప్పండి.. ఎవరావిడ? అంతటి అదృష్టవంతురాలు ఎవరు?" అని పట్టుబట్టింది. ఆ నవ్వుల మధ్యే మెల్లగా ఫెయిల్ అవ్వడం గురించి ప్రస్తావించి, "జీవితంలో గెలుపోటములు చాలా సహజం కిషోర్.. ఈ మాత్రం దానికి అన్నం మానేసి మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారా? ప్రాణం ఉంటేనే కదా రేపు మళ్ళీ గెలవగలం!" అని ధైర్యం చెప్పింది. ఆ రోజుకు కిషోర్ ముఖంలో మళ్ళీ పాత నవ్వు చూసి జానకమ్మ, రాజు ఊపిరి పీల్చుకున్నారు.మరుసటి రోజు కిషోర్ కోసం వెన్నెల ఎంతో ఇష్టంగా తన చేతులతో 'ఆవడలు' చేసుకుని వచ్చింది. కానీ, కిషోర్ మాత్రం ఎందుకో మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఆ మౌనం వెన్నెలను కలవరపెట్టింది. తను పలకరించినా అతను మాట్లాడకపోవడం ఆమె గుండెలో ఏదో వెలితిగా అనిపించింది. అతను హైదరాబాద్ వెళ్ళే సమయం రానే వచ్చింది. బస్సు ఎక్కే ముందు కిషోర్ నెమ్మదిగా వెన్నెల దగ్గరకు వచ్చి, ఒక కాగితం మీద రాసిన తన ఫోన్ నెంబర్ ఆమె చేతిలో పెట్టాడు.
వెన్నెలా.. నీకు ఒక మంచి స్నేహితుడిగా ఉండటానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇక్కడ నీకు ఎంతమంది ఉన్నా, నీకోసం దూరంగా ఉన్న నేను కూడా ఉన్నానని మర్చిపోకు. నీ మనసులో ఏమున్నా, ఏ కష్టం వచ్చినా నాకు నిస్సంకోచంగా చెప్పచ్చు," అన్నాడు. ఆ మాటలు వినగానే వెన్నెలకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. కొన్ని రోజులుగా అతనిలో చూస్తున్న మార్పులకు, తనను మర్చిపోయాడేమో అన్న ఆమె ఆందోళన ఒక్కసారిగా మాయమైంది. "అలాగే.. జాగ్రత్తగా వెళ్ళి రండి," అని ఆమె చిరునవ్వుతో వీడ్కోలు పలికింది.బస్సు కదిలింది.. వెన్నెల చూపులు ఆ దూరాన్ని దాటి, కిషోర్ వైపు వెతుకుతూనే ఉన్నాయి. చందమామ మళ్ళీ సగంలా మారినా, త్వరలోనే అది నిండుగా మారుతుందన్న నమ్మకం ఆమె కళ్లలో మెరిసింది. వారి స్నేహం ఆ తోటలోని నీలం గులాబీలాగే అరుదైనదిగా, శాశ్వతంగా ఉండిపోయింది.
కిషోర్ హైదరాబాద్ వెళ్ళాక కూడా వారి మధ్య బంధం ఫోన్ కాల్స్ రూపంలో కొనసాగింది. ప్రతిరోజూ మొక్కల గురించి, కబుర్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వెన్నెల అప్పుడప్పుడు అతని లవర్ గురించి ఆటపట్టించేది. "మనం ఇలా గంటలు గంటలు మాట్లాడుకుంటే తనకి జెలసీ రాదా కిషోర్ గారు?" అని నవ్వుతూ అడిగేది. "తను నన్ను అర్థం చేసుకుంటుందిలే వెన్నెలా, నువ్వు దిగులు పడకు" అని కిషోర్ చాలా సహజంగా బదులిచ్చేవాడు. కానీ, కాలక్రమేణా ఆ ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి. "మధ్యలో నేను ఎందుకు? వారిద్దరి మధ్యలోకి నేను వెళ్లడం బాగుండదు" అని వెన్నెల కూడా తనని తాను నిగ్రహించుకుంది
ఒకరోజు వీధిలో నడుస్తుండగా రాజు ఎదురుపడ్డాడు. కుశలప్రశ్నల తర్వాత వెన్నెల మెల్లగా అడిగింది, "అన్నయ్య.. మీ తమ్ముడి లవర్ ఎలా ఉంది? తన పేరు కూడా చెప్పలేదు కిషోర్ గారు." ఆ మాట వినగానే రాజు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వేశాడు. వెన్నెల అయోమయంగా చూస్తుంటే, "వెన్నెలా! తనకి లవర్ ఎవరూ లేరు. అసలు తన పరిస్థితి నీకు తెలిసిందే కదా.. మనుషులనే సరిగ్గా గుర్తుపట్టలేని వాడు, ఇక ప్రేమికురాలిని ఎక్కడ గుర్తుంచుకుంటాడు? ఎవరినైనా దూరం పెట్టడానికి  ఒక అబద్ధం చెప్పి ఉంటాడు" అని రాజు అసలు విషయం బయటపెట్టాడు. ఆ మాట వినగానే వెన్నెల గుండె ఒక్కసారిగా భారమైపోయింది.
రాజు మాటలు వెన్నెల చెవుల్లో పిడుగుల్లా మోగాయి. "తనకున్న ఏకైక ప్రేమికులు పుస్తకాలే వెన్నెలా! ఎవరినైనా తనకు దూరం పెట్టాలనుకున్నప్పుడు వాడు ఇలాంటి అబద్ధాలే చెబుతుంటాడు. వాడి మనసు ఎవరికీ అర్థం కాదు" అని రాజు చెప్పి అసలు వాడికి లవర్ ఉందని ఎవరు చెప్పారు అని అడిగాడు తను ఏమీ చెప్పలేదు ఏమైంది వెన్నెల సమాధానం చెప్పవే అనీ అడిగాడు కానీ వెన్నెల ఏమీ మాట్లాడలేక మౌనం గా ఉంది. సరే వెన్నెల నాకు టైం అవుతుంది అనీ చెప్పి మామూలుగానే చెప్పి వెళ్లిపోయాడు. కానీ ఆ మాటలు వెన్నెలను నిశ్చేష్టురాలిని చేశాయి. "నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే నేరుగా చెప్పొచ్చు కదా? ఎందుకీ నాటకం? నన్ను తన జీవితం నుండి దూరం పెట్టడానికేనా ఇదంతా?" అని ఆమె మనసు విలవిలలాడింది. కిషోర్ ఒకప్పుడు తనతో "నేను అన్నయ్య దగ్గర ఏదీ దాచను" అన్న మాటలు గుర్తొచ్చి, రాజుగారు చెప్పింది అక్షర సత్యమని ఆమెకు అర్థమైంది
ఇంటికి ఎలా వచ్చిందో కూడా తెలియని స్థితిలో, మౌనంగా తోటలోని ఆ నీలం రంగు గులాబీ మొక్క ముందు నిలబడిపోయింది. కిషోర్ తన 'ప్రాణంగా' ఇచ్చిన ఆ పువ్వు, ఇప్పుడు కేవలం ఒక ఎండిపోయిన జ్ఞాపకంలా అనిపించింది.