Yevaru..? - 14 in Telugu Crime Stories by Suresh Josyabhatla books and stories PDF | ఎవరు....? - 14

Featured Books
Categories
Share

ఎవరు....? - 14

Part - 14

సంజీవీని రూరల్ హెల్త్ ఫౌండేషన్ తాలుకు జూనియర్ డాక్టర్స్ హరీష్ మరియు పద్మ కనిపించడం లేదు అని విని సాగర్ వర్మ షాక్ అయ్యాడు.

సాగర్ వర్మ : ఏం మాట్లాడుతున్నారు.? అలా ఎలా కనిపించకుండా మాయం అయిపోతారు.?

ఎస్.ఐ సుందర్ : అవును సార్ శ్వేత మరణానికి సంబంధించిన ఫైల్ మొత్తం పరిశీలించాం.

ఎస్.ఐ జాన్ బాబు : ప్రమాదం జరిగిన రోజు 2 గంటల ముందు వరకు డా. హరీష్ మరియు డా. పద్మ ఇద్దరూ శ్వేతతో కలిసి పనిచేసినట్టు రికార్డులు ఉన్నాయి.

ఎస్.ఐ సుందర్ : కానీ ప్రమాదం జరిగిన తరువాత వాళ్ళిద్దరు ఎక్కడా కనిపించలేదు.

సాగర్ వర్మ : అంటే..?

ఎస్.ఐ జాన్ బాబు : సాక్షుల జాబితాలో గాని విచారణాధికారుల నోట్సులో గాని లేరు. సార్

ఎస్.ఐ జాన్ బాబు : ఫౌండేషన్ తరువాతి రికార్డుల్లో కూడా పెద్దగా ప్రస్తావన లేదు.

గదిలో మౌనం.

సాగర్ వర్మ : ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారా లేదా అన్నది కూడా మనకి ఖచ్చితంగా తెలియదు కదా...?

ఎస్.ఐ సుందర్ : సంఘటనా స్థలంలొ వాళ్ళ అక్కడ లేరని కచ్చితంగా చెప్పచ్చు సార్. ఎందుకంటె ఆ సమయంలొ అక్కడున్న  సి.సి.టీ.వీ ఫూటేజ్ లని పరిశీలించగా రోడ్డుపై శ్వేత ఒంటరి గానె నడుస్తూ కనిపించింది.

సాగర్ వర్మ : సరె మరి ఈ హరీష్ మరియు పద్మ ల గురించి ఫౌండేషన్ వాళ్ళని అడిగారా?

ఎస్.ఐ జాన్ బాబు : అడిగాం సార్. కాని  శ్వేత మరణించిన కొద్ది రోజులకే వాళ్ళిద్దరూ ఫౌండేషన్ వదిలి వెళ్లిపోయారని చెప్పారు.

సాగర్ వర్మ : ఎక్కడికి...?

ఎస్.ఐ జాన్ బాబు : తెలియదు సార్.

సాగర్ వర్మ : హ్మ్...

సాగర్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

సాగర్ వర్మ
"రాఘవ రావు చనిపోయారు."
"ఆయన చనిపోయిన ఆరు నెలలకు శ్వేత చనిపోయింది."
"అక్కడ పనిచేసిన ఇద్దరు జునియర్ డాక్టర్లు  మాయమయ్యారు."

కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

ఎస్.ఐ సుందర్ : సార్... మీకు ఏమైనా అనుమానం వస్తుందా?

సాగర్ వర్మ : అనుమానం రావడానికి ఇంకా సమయం ఉంది. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

సుందర్ మరియు జాన్ బాబు అతని వైపు చూశారు.

సాగర్ వర్మ :
"డా. రాఘవ రావు మరణం..."
"డాక్టర్ శ్వేత మరణం..."
"ఈ రెండు సంఘటనలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా జరిగాయని నేను నమ్మడం లేదు."

గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది.

సాగర్ వర్మ : హరీష్, పద్మ ఇద్దరి పూర్తి బ్యాక్‌గ్రౌండ్ కావాలి.
"వాళ్ళ కుటుంబ వివరాలు."
"ఇంతకు ముందు వాళ్ళు పని చేసిన హాస్పెటల్స్ లేదా ఫౌండేషన్ల వివరాలు"
"ప్రస్తుత చిరునామాలు."
"బ్యాంక్ లావాదేవీలు."
"ప్రయాణ వివరాలు."
అన్నీ నాకు కావాలి

ఎస్.ఐ జాన్ బాబు : అలాగే సార్.

సాగర్ వర్మ : దానికంటె ముందు మనం పొనికె గూడెం వెళ్ళి సాంబయ్యని కలుసుకోవాలి. అప్పుడె మనకి ఈ సంజీవిని ఫౌండేషన్ డాక్టర్ల మరణాలకి మరియు అదృష్యాలకి కారణం తెలుస్తుంది.

సమయం : మధ్యాహ్నం 01:30 గంటలు
కొండపల్లి పర్వత శ్రేణులు 

ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి.
పెద్ద వర్షం కురుస్తోంది.

అప్పుడె ఆ కొండల మధ్య ఉన్న రహదారిపై తిరుగుతూ వెళ్తున్న ఒక గ్రే కలర్ ఇన్నోవా కారు నెమ్మదిగా ముందుకు సాగుతోంది.

ఆ కారులో సాగర్ వర్మ మరియు మిగతా SIT సిబ్బంది ఉన్నారు.

కారు అద్దాలపై వర్షపు చినుకులు బలంగా పడుతున్నాయి. 

సాగర్ వర్మ కిటికీ బయటకి చూస్తూ...

సాగర్ వర్మ : ఇంకా ఎంత దూరం..?

డ్రైవర్ : వచ్చేసింది సార్. ఇంకొంచెం దూరం వెళ్తే మట్టి రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు వెంబడి పావుగంట ప్రయాణిస్తే పొనికె గూడెం వస్తుంది.

సాగర్ వర్మ : మట్టి రోడ్డా...?

డ్రైవర్ : అవును సార్ గూడెం లోపలికి రోడ్డు లేదు. అక్కడికి వాహనాలు ఎక్కువగా వెళ్లవు సార్. పైగా ఈ వర్షం వల్ల రోడ్డు కూడా బాగా దెబ్బతిన్నట్టు ఉంటుంది. 

సాగర్ తల ఊపాడు.

కారు కొద్దిసేపటి తరువాత ప్రధాన రహదారి వదిలి మట్టి రోడ్డు వైపు తిరిగింది. వర్షం కారణంగా రోడ్డు అంతా బురదగా మారిపోయింది.

అక్కడక్కడ చిన్న చిన్న నీటి గుంటలు ఏర్పడ్డాయి. అందులొ ఒక గుంట మీద నుంచి కారు వెళ్ళెసరికి. కారు ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది.

ఎస్.ఐ సుందర్ : అబ్బా.. ఎంటయ్య బాబు దారి ఇలా ఉంది. కొంచెం మెల్లగా పోని. ఇలాంటి చోట్లల్లొ ఎలా ఉంటున్నారొ మనుషులు . 

డ్రైవర్ : పాపం సార్ వీళ్ళు బయట సమాజంతొ సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. ఎక్కువ ఓట్లు లేని ప్రాంతాలు కావడంతొ గత ప్రభుత్వాలు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మనం వచ్చామె ఆ ప్రధాన రహదారిపై రోడ్డు కూడా ఇంతకు ముందు లేదు సార్. ఈ మద్యనె 1.5 సంవత్సరం క్రితం వేశారు.

ఎస్.ఐ జాన్ బాబు : మరి ఇంతకాలం వీళ్ళు ఎలా బ్రతికేరొ. వీళ్ళకి ఏ రోగం వచ్చిన చూసె నాధుడు లేడనకుంటా.

సాగర్ వర్మ : అందుకె సంజీవిని ఫౌండేషన్ లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసమె మెడికల్ క్యాంపులు గట్రా నిర్వహించేది. ప్రభుత్వాలు పట్టించుకోకపోయిన ఇలాంటి ఎన్.జీ.ఓ లు ఉండ బట్టె. వీళ్ళు ఈ మాత్రమైన బ్రతకగలుగుతున్నారు.

అలా కారు ప్రధాన రహదారి దాటి మట్టి రోడ్డుకు వైపుకు తిరిగిన ఇరవై నిమిషాల తరువాత. వీళ్ళకి దూరంగా కొన్ని గుడిసెలు కనిపించాయి.

డ్రైవర్ : సార్... పొనికె గూడెం వచ్చేసింది.
కారు గూడెం మధ్యలో ఆగింది.
వర్షం కొంచెం తగ్గింది.

అందరూ కారు దిగారు.

గూడెంలోని ప్రజలు ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తున్నారు.

కొంతమంది పిల్లలు గుడిసెల వెనక నుంచి తొంగి చూస్తున్నారు.

ఒక వృద్ధుడు నెమ్మదిగా వీళ్ళ దగ్గరకు వచ్చాడు.

ఎస్.ఐ సుందర్ : నమస్కారం తాతయ్య...

వృద్ధుడు తల ఊపాడు.

ఎస్.ఐ సుందర్ : మేము పోలీసులం. మీ గూడానికి ఒక పని మీద వచ్చాం.

జాన్ బాబు తన ఫైలులో నుంచి ఒక ఫోటో తీసి సాగర్ కి ఇచ్చాడు. తను ఆ ఫొటొ ఆ వృద్దిడికి చూపించాడు.

అందులో రాఘవ రావు, శ్వేత మరియు మిగతా మెడికల్ టీమ్ సభ్యులు ఉన్నారు.

సాగర్ వర్మ : వీళ్ళలో ఎవరైనా మీకు తెలుసా..?

ఆ వృద్దుడు ఫోటును పరిశీలనగ చూసి 

వృద్దుడు : తెలుసు బాబు ఒకప్పుడు వీళ్ళు మా గూడెం ప్రజలకి వైద్యం చేయడం కోసం వచ్చే వాళ్ళు. 

సాగర్ వర్మ : చివరిగా వీళ్ళు ఎప్పుడు వచ్చారు.?

వృద్దుడు : దాదాపు 2 ఏళ్ళు అవుతుంది బాబు. వీళ్ళు వచ్చి

సాగర్ వర్మ : వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండడానికి మరియు తినడానికి గల ఏర్పాట్లన్నీ ఎవరు చూసేవారు.?

వృద్దుడు : మా గూడెం పెద్ద చెంచయ్య బాబు. 

ఎస్.ఐ జాన్ బాబు : ఆయన ఇల్లు ఎక్కడ..?

అప్పుడు ఆ వృద్దుడు అక్కడ ఉన్న ఒక పెద్ద గుడిసె వైపు చూపించాడు.

సాగర్ వర్మతొ పాటు మిగిలిన వాళ్ళంతా ఆ గుడిసె వైపు నడిచారు. 

ఆ గూడెంలొ అదొక పెద్ద గుడిసె. పాత మట్టిగోడలతొ కట్టి పైన తాటాకులతొ కప్పి ఉంది. గుడిసె బయట పెద్ద అరుగు కూడా ఉంది.

అక్కడకి చేరుకున్నాక ఆ వృద్దుడు చెంచయ్యని పిలిచాడు. కొద్దిసేపటి తరువాత...
ఊరు పెద్ద చెంచయ్య బయటకు వచ్చాడు.

70 ఏళ్ళ వయసు
తెల్లబడిన జుట్టు.
ముడతలు పడిన ముఖం.
కాని కళ్ళలో మాత్రం చురుకుదనం కనిపిస్తోంది.

సాగర్ వర్మ ముందుకు వచ్చాడు.

సాగర్ వర్మ : నమస్కారం చెంచయ్య గారు.

చెంచయ్య : నమస్కారం బాబూ. రండి అలా కూర్చోండి.

సాగర్ మళ్ళి ఆ ఫోటోను బయటకు తీసి చెంచయ్యకు చూపించాడు.

సాగర్ వర్మ : వీళ్ళలో ఎవరైనా మీకు తెలుసా..?

చెంచయ్య ఆ ఫోటో తీసుకొని జాగ్రత్తగా చూశాడు.

కొద్దిసేపటి తరువాత...

చెంచయ్య : తెలుసు బాబూ. 

సాగర్, జాన్ బాబు, సుందర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

చెంచయ్య : దాదాపు రెండేళ్ళ క్రితం వరకు వీళ్ళు తరచూ ఇక్కడికి వచ్చేవాళ్ళు. వీళ్ళకి మా గుడిసె దగ్గరె పాకలు అవి వేసి బస ఏర్పాటు చేసెవాళ్ళం. మా గూడెం వాళ్ళకే కాదు. చుట్టుపక్కల ఉన్న గూడెం వాళ్ళకి కూడా వైద్యం చేసేవాళ్ళు.
ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గూడేలలో మాదే పెద్ద గూడెం కావడం. పైగా రహదారికి కూడా మా గూడానికి కొంచెం దగ్గరగా ఉండడందతొ. వాళ్ళంతా వైద్యం కోసం ఇక్కడికె వచ్చె వాళ్ళు. 

సాగర్ వెంటనే మరో ఫోటో బయటకు తీశాడు.

ఈసారి అందులో రాఘవ రావు పక్కన గిరిజన దుస్తుల్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

సాగర్ వర్మ : మరి ఇతను..?

చెంచయ్య ఫోటో చూడగానే గుర్తుపట్టాడు.

చెంచయ్య : అరే... ఇతనెందుకు తెలియదు బాబు. మా గూడెం వాడె. మా సాంబయ్య. మేమందరం వీడిని సాంబడు అని పిలుస్తాం.

సాగర్ వర్మ కళ్ళలో ఒక్కసారిగా వెలుగు మెరిసింది.

సాగర్ వర్మ : ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు..?

చెంచయ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

చెంచయ్య : అదే మాకు కూడా తెలియడం లేదు బాబూ.

సాగర్ వర్మ : అంటే..?

చెంచయ్య : సంవత్సరం క్రితం నుంచి మా సాంబయ్య కనిపించడం లేదు. గూడెం వదిలి ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదు.

ఆ మాట వినగానే అధికారులు ఒకరిని ఒకరు చూసుకున్నారు.

సాగర్ వర్మ : సాంబయ్య గురించి ఇంకాస్త చెప్పగలరా..?

చెంచయ్య : చాలా మంచివాడూ బాబూ. వాడు పుట్టిన 1 సంవత్సరానికి వాళ్ళ అమ్మ అయ్యా పైన కొండపై నుంచి కాలు జారి క్రింద పడి చనిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ అవ్వ వాడిని పెంచింది. కాని ఆ ముసలవ్వ కూడా వాడి 10వ ఏట జబ్బు చేసి చనిపోయింది. ఆ తరువాత నేనె వాడిని పెంచాను.

సాగర్ వర్మ : ఏవరు లేని అనాధ అనమాట...

చెంచయ్య : ఆ మాట అనకండి బాబు. వాడికి రక్త సంబధీకులు ఎవరూ లేక పోవచ్చు కాని వాడు అనాధ కాదు. వాడు మా అందరికి అయినవాడె. ఈ గూడెం బిడ్డ

సాగర్ వర్మ : తను ఎలాంటి వాడు..?

చెంచయ్య : చాలా తెలివైన వాడు. బయట వాళ్ళతొ ఎలా మాట్లాడాలొ బాగా తెలిసిన వ్యక్తి. ఈ అడివి గురించి మా అందరికన్నా వాడికె బాగా తెలుసు.

ఎస్.ఐ జాన్ బాబు : మరి అంత తెలివైన వాడిని మీరు చదివించ లేదా.

చెంచయ్య : ఎందుకు చదివించ లేదు బాబు. పదో తరగతి వరకు ఈ కొండ క్రింద ఉన్న టౌన్లొ గిరిజన బాలురు ప్రభుత్వ హాస్టల్లొ ఉంటూ ప్రభుత్వ బడిలొ చదివాడు.

సాగర్ వర్మ : మరి ఆ తరువాత...?

చెంచయ్య : ఆ తరువాత మేము ఇంకా చదివించాలనుకున్నాం. కాని మా పరిస్థితులు బాగాలేవు. ఆడి చదువుకి కర్చు పెట్టేంత స్తోమత మాకు లేకపోయింది. అది అర్థం చేసుకొని వాడే.
"ఇక నాకు చదువు వద్దు" అని చెప్పి మానేశాడు. ఆ తర్వాత నుంచి ఈ గూడెం వాళ్ళ పనులే చూసుకునేవాడు.

సాగర్ వర్మ : రాఘవ రావు గారు వాళ్ళు వచ్చినప్పుడు సాంబయ్యె అన్నీ దగ్గరుండి చూసుకునె వాడా..?

చెంచయ్య : అవును బాబు. వాళ్ళు చెప్పేది మాకు పెద్దగా అర్ధం అయ్యేది కాదు. మా సాంబడుకె అవన్నీ బాగా అర్ధం అవుతాయి. అందుకె ఆ పెద్ద డాక్టర్ గారు సాంబడునె ఎక్కువ వెంటేసుకొని తిరిగెవారు.

సాగర్ వర్మ : ఏ విషయంలో..?

చెంచయ్య : గూడెం వాళ్ళని కలిపించడం.
వైద్య శిబిరాలకు తీసుకురావడం. వాళ్ళ సమస్యలు డాక్టర్లకి వివరించడం.అలాంటి పనుల్లొ...

సాగర్ ఏదో ఆలోచనలో పడ్డాడు.

అప్పుడే అక్కడికి మరో వృద్ధుడు వచ్చాడు.

చెంచయ్య : ఇతను జోగయ్య. రాఘవ రావు గారితో సాంబయ్య ఎక్కువగా తిరిగిన రోజుల్లో ఇతను కూడా ఉండేవాడు.

సాగర్ వెంటనే జోగయ్య వైపు తిరిగాడు.

సాగర్ వర్మ : రాఘవ రావు గారు సాంబయ్యతో ప్రత్యేకంగా ఏమైనా మాట్లాడేవారా..?

జోగయ్య కొద్దిసేపు ఆలోచించాడు.

తర్వాత నెమ్మదిగా అన్నాడు.

జోగయ్య : ఒకసారి రాఘవ రావు గారు...
"మీ గూడెంకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి..?"
అని సాంబయ్యని అడిగారు.
అప్పుడు సాంబయ్య ఈ గూడెం వెనుక వైపు ఉన్న వాగు దగ్గరికి తీసుకెళ్ళాడు.
ఆ వాగు నీళ్ళు రాఘవ రావు గారు ఒక సీసాలో పట్టుకుని ఆ వాగు పక్కన ఉన్న మట్టిని కూడా ఒక పెట్టెలో వేసుకొని తీసుకెళ్లారు.
అంతే బాబూ.

ఎస్.ఐ సుందర్ : ఎందుకు అలా తీసుకెళ్ళారు.? 

జోగయ్య : నాకు తెలీదు బాబు. మా గూడెంలొ పెద్ద సమస్య ఉంది. దానికోసం ఆయన ఏవేవొ పరీక్షలు చేసేవారు.

సాగర్ వర్మ : ఏంటా సమస్య..?

చెంచయ్య : గత 6 ఏళ్ళుగా మా గూడెంలొని ఆడవాళ్ళు తల్లులు కాలేకపోతున్నారు. తల్లులైన ఆడవాళ్ళు పిల్లల్నీ కనలేకపోతున్నారు. మొదట్లొ మేము మా దురదృష్టం అనుకున్నాం. తరువాత ఆ దేవుడికి మా మీద కోపం వచ్చిందని అనుకుంటున్నాం.

ఆ మాట వినగానే...సాగర్ వర్మ ముఖం గంభీరంగా మారిపోయింది.

ఎస్ ఐ సుందర్ : 6 ఏళ్ళుగా ఇక్కడ ఒక్క ఆడది కూడ పిల్లల్ని కనలేకపోతుందా..? ఎందుకు..?

చెంచయ్య : అదె బాబు మాకు తెలియడం లేదు. ఆ డాక్టర్ గారు కనుక్కుందామని చూశారు . కాని ఆయన్నీ ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇదంతా మా తలరాత. మా గూడెం ఇక్కడితొ అంతరించిపోవాల్సిందె.

వాళ్ళ పరిస్తితి చూసి అక్కడున్న అధికారులకు జాలి వేసింది.

కాని సాగర్ వర్మకి కాదు. అతని మనసులో అప్పటివరకు విడివిడిగా ఉన్న కొన్ని విషయాలు నెమ్మదిగా ఒకదానితో ఒకటి కలవడం మొదలుపెట్టాయి.

సాంబయ్య...
రాఘవ రావు...
పొనికె గూడెం...
మాయం అయిన డాక్టర్లు...
మరియు...
ఈ గూడెం ప్రజల్లో కనిపిస్తున్న విచిత్రమైన సమస్య.
సాగర్ నెమ్మదిగా వాగు వైపు చూశాడు.
అతని మనసులో ఒక్కటే ఆలోచన తిరుగుతోంది...
"ఈ గూడెం సమస్యకి... నీటికి... ఏదో సంబంధం ఉంది."

సాగర్ వర్మ కొద్దిసేపు ఆలోచించి జోగయ్య వైపు తిరిగాడు.

సాగర్ వర్మ : జోగయ్య గారు...మాకు కూడా ఆ వాగుని ఒకసారి చూపిస్తారా.

జోగయ్య : ఎందుకు చూపించను బాబూ. రండి.

అని చెప్పి చెంచయ్య ఇంటి నుంచి జోగయ్య నడవడం ప్రారంభించాడు

సాగర్ వర్మ మరియు మిగతా సిబ్బంది అతని వెనక నడిచారు.

గూడెం వెనుక వైపు.
వర్షం ఇంకా చిరుజల్లులా కురుస్తోంది.

అడవిలోని మట్టి దారిలో జాగ్రత్తగా నడుస్తూ. అందరూ ముందుకు సాగుతున్నారు. దాదాపు పది నిమిషాల తరువాత...

దూరంగా నీటి శబ్దం వినిపించడం మొదలైంది.
మరికొన్ని అడుగులు వేయగానే ఒక వాగు కనిపించింది.

కొండల మధ్య నుంచి వస్తున్న నీరు నెమ్మదిగా ప్రవహిస్తోంది.

జోగయ్య వాగు ఒడ్డున ఆగిపోయాడు.

జోగయ్య : ఇదే బాబూ...

సాగర్ వర్మ చుట్టూ పరిశీలించాడు.
వాగు నీరు మొదటి చూపుకు చాలా స్వచ్ఛంగా కనిపిస్తోంది.

ఎస్.ఐ సుందర్ : చూడటానికి అయితే చాలా శుభ్రంగా ఉంది సార్.

సాగర్ వర్మ ఏమీ మాట్లాడలేదు.

అతను వాగు ఒడ్డున కూర్చుని నీటిని చేతిలోకి తీసుకొని పరిశీలించాడు.

తర్వాత చుట్టూ ఉన్న మట్టిని గమనించాడు.
అప్పుడే ఒక విషయం అతని దృష్టికి వచ్చింది.

వాగు ఒడ్డున కొన్ని పాత ప్లాస్టిక్ డ్రమ్‌ల ముక్కలు కనిపిస్తున్నాయి.
మరికొన్ని తుప్పుపట్టిన ఇనుప కంటైనర్లు కూడా అక్కడక్కడా పడి ఉన్నాయి.

సాగర్ వాటి వైపు చూపిస్తూ...

సాగర్ వర్మ : ఇవి ఎవరివి...?

జోగయ్య వాటి వైపు చూసాడు.

జోగయ్య : తెలియదు బాబూ. గత 7 ఏళ్ళకు పైగా చూస్తున్నాం. ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాయి. ఎవరూ పట్టించుకోరు.

సాగర్ నెమ్మదిగా లేచాడు.

అతని చూపు వాగు ప్రవాహం పైభాగం వైపు వెళ్లింది.

సాగర్ వర్మ : ఈ వాగు ఎక్కడి నుంచి వస్తుంది...?

జోగయ్య : కొండల పైనుంచి బాబూ. అక్కడ అడవిలో చిన్న చిన్న నీటి ఊటలు ఉన్నాయి. అవి కలసి ఈ వాగుగా మారుతాయి.

కొద్దిసేపు నిశ్శబ్దం.

తర్వాత సాగర్ మరో ప్రశ్న అడిగాడు.

సాగర్ వర్మ : జోగయ్య గారు... మీ గూడెంలో పిల్లలు పుట్టకపోవడం మరియు పెళ్లైన వాళ్ళకి సంతానం లేకపోవడం లాంటి సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి...?

ఆ ప్రశ్న వినగానే జోగయ్య ముఖం గంభీరంగా మారింది.

జోగయ్య : మా పెద్దయ్య చెప్పినట్టు దాదాపు 6 - 6.5 సంవత్సరాల నుంచి బాబూ. మొదట్లో మాకు అర్థం కాలేదు. ఒక ఇంట్లో జరిగిందేమో అనుకున్నాం.
తర్వాత మరో ఇంట్లో.
తర్వాత ఇంకో ఇంట్లో.
అలా పెరుగుతూ వచ్చింది.

సాగర్ వర్మ : అంటె రాఘవ రావు గారు వచ్చిన తర్వాతే మీకు ఇది పెద్ద సమస్య అని తెలిసిందా...?

జోగయ్య : అవును బాబూ. రాఘవ రావు గారు పరీక్షలు చేసిన తర్వాత...
"ఇది సాధారణ విషయం కాదు" అని చెప్పారు.

సాగర్ వర్మ మిగిలిన వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొదటిసారి...
రాఘవ రావు ఎందుకు ఈ గూడెంపై అంత ఆసక్తి చూపించాడొ. ఇప్పుడె కొంచెం కొంచెం అర్థమవుతోంది.

అప్పుడే... సాగర్ మొబైల్ ఫోన్ మోగింది.

మొబైల్ స్క్రీన్ మీద "వంశి" పేరు కనిపించింది.

సాగర్ వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు.

సాగర్ వర్మ : చెప్పు వంశి...

అవతల నుంచి వంశి స్వరం సరిగ్గ వినిపించడం లేదు

సాగర్ వర్మ : వంశి నీ మాటలు నాకు వినిపించడం లేదు.

కాల్ కట్ అయ్యింది. కొంచెం సేపు తరువాత  
వంశి మళ్ళి కాల్ చేశాడు.

హ్యాకర్ వంశి : హలో సార్ ఇప్పుడు వినపిస్తుందా..?

సాగర్ వర్మ : వంశి నీ మాటలు సరిగ్గ వినిపించడం లేదు. ఇక్కడ సరిగ్గ సిగ్నేల్స్ లేవు. నేను ఒక 2 గంటలు ఆగి మళ్ళి కాల్ చేస్త.. ఎదైన ముఖ్యమైనది అయితె మెసేజ్ చెయ్యు.

అని చెప్పి కాల్ కట్ చేశాడు.

హ్యాకర్ వంశి : సార్.. సార్....

తరువాత వంశి వాట్సాప్ లొ సాగర్ కి ఏదొ పంపిస్తాడు.

కాసేపటికి సాగర్ వర్మ మరియు మిగతా సిబ్బంది అంతా కలిసి అక్కడ నుంచి బయలుదేరి రెండు గంటలు తరువాత కొండ క్రిందకు చేరుకుంటారు. 

కొంత దూరం వెళ్ళెసరికి మొబైల్ కి సిగ్నల్స్ వచ్చాయి. రాగానె సాగర్ వర్మ వాట్సాప్ కి వరుస పెట్టి మెసేజ్ తాలుకు నోటిఫికేషన్ సౌండ్స్ తెగ వచ్చాయి. 

ఏంటాని చూస్తె. అవి అన్నీ వంశి పంపించినవి. 

ఏవొ కొన్నీ ఫొటోలు, వీడియోలు, ఆడియొ క్లిప్సు మరియు ఏవొ రిపోర్ట్సు కూడా అన్నీ సాగర్ వర్మ వాట్సాప్ కి  పంపించాడు. 

అక్కడ కొండపై సిగ్నెల్స్ లేకపోడంతొ తనకి ముందు అవి వాట్సాప్ లొ డెలివరి కాలేదు. ఇప్పుడు సిగ్నెల్స్ రావడంతొ అవి అన్నీ వచ్చాయి. తెరిచాడు.

సాగర్ ఆ ఫోటోస్ అన్నీ వరస పెట్టి చూస్తున్నాడు. తరువాత ఒక విడియొ చూసి షాక్ అయ్యాడు. వెంటనె కారు ప్రక్కకి ఆపించి వంశి కి కాల్ చేశాడు.

సాగర్ వర్మ : హలొ వంశి ఇవి ఎక్కడ దొరికాయి. 

హ్యాకర్ వంశి : సార్ దీని గురించె మీకు ఇందాకల కాల్ చేశాను. కాని మీకు నా మాటలు వినబడలేదు.

సాగర్ వర్మ : మారుమూల గిరిజన ప్రాంతంలొ ఉన్న వంశి. అందుకె సిగ్నెల్స్ లేవు. ఇప్పుడు చెప్పు.

హ్యాకర్ వంశి : సార్... ఎందుకో నాకు అనుమానం వచ్చి మళ్ళీ డాక్టర్ రాఘవ రావు గారి ఫోన్ చెక్ చేయాలనిపించి చేశాను. అందులో నాకు ఒక ఫోల్డర్ రికవర్ అయింది సార్...

సాగర్ ఒక్కసారిగా నిటారుగా నిలబడ్డాడు.

సాగర్ వర్మ : ఫోల్డరా..?"

హ్యకర్ వంశి : అవును సార్ అందులోనివె ఆ ఫోటోలు... వీడియోలు... ఆడియో రికార్డింగ్స్... ఇంకా కొన్ని టెస్ట్ రిపోర్ట్స్. అవె మీకు పంపించాను.

రోడ్డుకు ప్రక్కన నిలబడి ఉన్న సాగర్ కళ్ళు ఒక్కసారిగా పదునయ్యాయి.
ఎందుకో...
అతనికి ఆ ఫోల్డర్‌లోనే రాఘవ రావు మరణానికి దారి తీసిన మొదటి నిజం దాగి ఉందనే భావన కలిగింది...।

కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. కారు ప్రక్కనే నిలబడి ఉన్న సాగర్ తన మొబైల్ స్క్రీన్ వైపు చూస్తున్నాడు.

మొదట ఒక ఫోటో తెరిచాడు.
అందులో పొనికె గూడెం ప్రజలు వరుసగా నిలబడి ఉన్నారు.
కొంతమంది మహిళలు.
కొంతమంది యువకులు.
వారి చేతులకు ట్యాగులు కట్టబడి ఉన్నాయి.
వైద్య పరీక్షలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

తరువాత మరో ఫోటో.
ఒక గర్భిణి మహిళ స్కానింగ్ రిపోర్ట్.

దాని పక్కనే మరో ఫోటో.
అసాధారణంగా పెరగని పిండం.

మరో ఫోటో.
ఒక చిన్న శిశువు శరీరంలో కనిపిస్తున్న జన్యుపరమైన లోపాలు.

సాగర్ ముఖం గంభీరంగా మారింది.

ఎస్.ఐ సుందర్ నెమ్మదిగా అడిగాడు.

ఎస్.ఐ సుందర్ : ఏముంది సార్..?

సాగర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ అతనికి ఇచ్చాడు.

సుందర్, జాన్ బాబు ఇద్దరూ వరుసగా ఫోటోలు చూడడం మొదలుపెట్టారు. వాళ్ళ ముఖాల్లో కూడా ఆశ్చర్యం పెరుగుతోంది.

తరువాత సాగర్ ఆ ఫోన్ తన చేతిలోకి తీసుకొని ఒక వీడియో ఓపెన్ చేశాడు.

వీడియోలో...
రాఘవ రావు స్వయంగా కెమెరా పట్టుకొని వాగు దగ్గర నిలబడి ఉన్నాడు.
అతని వెనక సాంబయ్య కనిపిస్తున్నాడు.
రాఘవ రావు నీటి నమూనాలు సీసాల్లో నింపుతున్నాడు.
మట్టిని ప్రత్యేక కంటైనర్లలో సేకరిస్తున్నాడు.

మరో వీడియో.
కొంతమంది గిరిజన మహిళలు తమ సమస్యలు చెబుతున్నారు.
"పెళ్లై ఐదేళ్లు అయింది డాక్టర్ గారు..."
"పిల్లలు పుట్టడం లేదు..."
"రెండు సార్లు కడుపు పోయింది..."
"మా అక్కకి కూడా అదే జరిగింది..."
"మా గూడెంలో చాలా మందికి ఇదే సమస్య..."
అని బాధతో చెబుతున్నారు.

కారు లోపల వాతావరణం ఒక్కసారిగా భారంగా మారిపోయింది.

తరువాత మరో వీడియో.
ఈసారి కొంతమంది పురుషులు.
"ముందు ఇలా ఉండేది కాదండి..."
"గత కొన్నేళ్ల నుంచి మొదలైంది..."
"పెళ్లిళ్లు అవుతున్నాయి... కాని పిల్లలు పుట్టడం లేదు..."
అని చెబుతున్నారు.

సాగర్ వీడియోను ఆపేశాడు.

కొన్ని క్షణాలు మౌనం.
తర్వాత...

ఆడియో క్లిప్స్ ఓపెన్ చేసి. స్పీకర్‌లో పెట్టాడు.

రాఘవ రావు స్వరం వినిపించింది.

డా.రాఘవ రావు : " నేను డాక్టర్ రాఘవ రావు..."
"పొనికె గూడెం మరియు పరిసర గూడేలలో కనిపిస్తున్న సంతానోత్పత్తి సమస్యలపై నేను నిర్వహిస్తున్న పరిశోధనలో భాగంగా ఈ ఆడియో రికార్డ్ చేస్తున్నాను..."

అందరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు.

డా.రాఘవ రావు : "మొదట ఇది జన్యుపరమైన సమస్య అనుకున్నాను..."
"కాని పరీక్షల ఫలితాలు అలా చెప్పడం లేదు..."
"ఈ సమస్య ఒకే కుటుంబానికి పరిమితం కాలేదు..."
"మొత్తం ప్రాంతంలో వ్యాపించింది..."

కొద్దిసేపు నిశ్శబ్దం.

తర్వాత సాగర్ ఇంకొ ఆడియ్ క్రిప్ ఓపెన్ చేశాడు

రాఘవ రావు స్వరం మళ్లీ వినిపించింది.

డా. రాఘవ రావు : "నేను సేకరించిన నీటి నమూనాలు మరియు మట్టి నమూనాల పరీక్ష ఫలితాలు చూసిన తరువాత తీవ్ర ఆందోళనకు గురయ్యాను..."
"ఈ ప్రాంతపు నీటి వనరులు కలుషితమయ్యాయి..."

అది వినగానే...
మిగతా అధికారులంతా ఒక్కసారిగా ఒకరి వైపు ఒకరు చూశారు.

చివరి ఆడియొ క్లిప్ ఓపెన్ చేశారు. మళ్ళి రాఘవరావు గొంతు.

డా. రాఘవ రావు : "ఇది సహజసిద్ధంగా జరిగిన కలుషితం కాదని నా అనుమానం..."
"ఎవరో కావాలనే ఏదో రసాయన పదార్థాన్ని ఈ నీటి వ్యవస్థలోకి చేరుస్తున్న అవకాశాన్ని నేను తోసిపుచ్చలేను..."
"కాని దానికి బాధ్యులు ఎవరు అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు..."

ఆడియో అక్కడితో ముగిసిపోయింది.

కారు లోపల పూర్తిగా నిశ్శబ్దం ఏర్పడింది.

కొద్దిసేపటి తరువాత...

సాగర్ వర్మ నెమ్మదిగా మాట్లాడాడు.

సాగర్ వర్మ : ఇప్పుడు అర్థమవుతోంది...

ఎస్.ఐ సుందర్ : ఏంటి సార్...?

సాగర్ వర్మ : రాఘవ రావు గారు సాధారణ మెడికల్ క్యాంప్ నిర్వహించ లేదు.
ఆయన ఒక పెద్ద నేరాన్ని కనిపెట్టారు.

ఎస్.ఐ జాన్ బాబు : అంటే...?

సాగర్ వర్మ : ఈ గూడెం ప్రజలకి జరుగుతున్నది ఆరోగ్య సమస్య కాదు జాన్...ఎవరో సృష్టించిన సమస్య.

జాన్ బాబు ముఖం గట్టిపడింది.

సాగర్ వెంటనే టెస్ట్ రిపోర్ట్స్ ఓపెన్ చేశాడు.
అందులో కొన్ని పదాలు ఎర్ర రంగుతో హైలైట్ చేయబడి ఉన్నాయి.

• "అబ్నార్మల్ కెమికల్ ట్రేసస్ డిటెక్టెడ్ (Abnormal chemical traces detected)"
• "రీప్రొడెక్టివ్ టాక్సిసిటి సస్పెక్టడ్ (Reproductive toxicity suspected)"
• "ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రికమెండడ్(Further investigation recommended)"

సాగర్ వాటిని కొద్దిసేపు చూస్తూ ఉన్నాడు.
తర్వాత నెమ్మదిగా అన్నాడు.

సాగర్ వర్మ : ఇప్పుడు నాకు ఒక విషయం ఖచ్చితంగా అర్థమైంది...

ఎస్.ఐ సుందర్ : ఏంటది సార్...?

సాగర్ వర్మ :
"డాక్టర్ రాఘవ రావు మరణం..."
"డాక్టర్ శ్వేత మరణం..."
"సాంబయ్య అదృశ్యం..."
"హరీష్, పద్మ మాయం..."
ఇవన్నీ వేర్వేరు సంఘటనలు కావు.
ఇవి ఒకే కథలోని భాగాలు.

అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఎస్.ఐ సుందర్ : ఎక్కడికి వెళుతుంది సార్ ఈ దర్యాప్తు..? మనం దేవేంద్ర గారి హత్య నుంచి మొదలు పెట్టి తవ్వితె అరవింద్ నేర చరిత్రతొ మొదలై మద్యలొ సూర్యనారాయణ గారి మరణం తరువాత డ్రగ్స్ కోణం. సంజీవిని ఫౌండేషన్ డాక్టర్ల మరణాలు, అదృష్యాలు. ఇప్పుడు ఈ పొనికె గూడెం దగ్గర ఆగాం. 

ఎస్. ఐ జాన్ బాబు : అవును సార్ దేనికి సంబంధం లేకుండా ఈ కేసు ఎక్కడికొ పాతుంది.

సాగర్ వర్మ : ఏది సంబంధం లేకుండా ఉండదు జాన్. ఈ పొనికె గూడెం సమస్యకి కారకులు ఎవరని తెలిస్తె. సంజీవిని ఫౌండేషన్ డాక్టర్ల మరణాలు, అదృష్యాల వెనక కారణం తెలుస్తుంది. ఆ కారకులను పట్టుకుంటె వాళ్ళకి దేవేంద్ర, సూర్యనారాయణల హంతకుడుకి సంబంధం ఏంటొ తెలుస్తుంది. అప్పుడు మనం వాడిని ఎలా పట్టుకోవాలొ అర్ధం అవుతుంది.

సాగర్ వర్మ మాటలు విన్న వెంటనే...
జాన్ బాబు గుండెలో ఏదో తెలియని ఉద్వేగం కలిగింది.
ఎందుకంటే...
మొదటిసారి...
వాళ్ళు అసలు కుట్ర దిశగా అడుగు పెడుతున్నారు.

కాని అదే సమయంలో...
విజయవాడ నగరంలో...
ఎవరికీ తెలియకుండా...
మరో వ్యక్తి కూడా అరవింద్ రెడ్డి కాల్ ఏ నంబర్ కి అయితె డైవర్టయిందొ. ఆ నంబర్ డాక్టర్ రాఘవ రావు ఫోన్ పేరు మీద ఉందని తెలుసుకొని దాని వెనక దాగి ఉన్న నిజాన్ని వెతకడం ప్రారంభించాడు...