Ventaade Needalu - 16 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెంటాడే నీడలు - 16

Featured Books
Categories
Share

వెంటాడే నీడలు - 16

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"హు, నాన్న. నా నాన్న ఆఖరిసారి నాతో ఎప్పుడు మాట్లాడాడో నీకు తెలుసునా? అసలు నేనొక్కర్తిని తన కూతురిగా వున్నానన్న విషయమే తనకి గుర్తు లేదు." కోపంగా అంది మల్లిక. "అసలు ఇక్కడికి వచ్చే సంవత్సరం పైన అయింది. ఇప్పుడు తనే సంపాదించుకుంటున్నాడు కదా, మా డబ్బుతో కూడా పనిలేదు."

"ఎదో ఉద్యోగంలో ఖాళీ లేకుండా వుండివుంటాడు. నువ్వు అనవసరం గా అపార్ధం చేసుకుని కోపం పెంచుకోకు. నువ్వు తన స్వంత కూతురివి. మీ కుటుంబానికి కావాల్సిన డబ్బులు పంపిస్తున్నాడు, ఆ విషయం మర్చిపోకు. "

"సర్లే, సర్లే, ఆ విషయాలు ఇప్పుడు అనవసరం. నువ్వు వీటన్నిటి గురించి చెప్తావా లేదా నాకు?"

"నేను చెప్పను. ఇప్పుడంత ఓపిక నాకు లేదు. బాగా చీకటి పడింది, పద ఇంటి దగ్గర దిగబెడతాను." కుర్చీలోనుండి లేచి అన్నాడు సింహరాజు.

"నేనేం చిన్నపిల్ల ని కాదు. నా దారిని నేను పోగలను." తనూ కోపంగా కుర్చీలోనుండి లేచింది మల్లిక.

"చిన్నపిల్లవి కాదు కాబట్టే నా భయం. ఈ వూళ్ళో చాలా దారుణాలు జరుగుతున్నాయి. వద్దన్నా నీ ఇంటివరకూ వస్తాను."

"ఎదో ఏడువ్." అక్కడినుండి నడుస్తూ అక్కడ అన్ని బొమ్మలకన్నా పెద్దదిగా వున్న కబుసా బొమ్మ దగ్గరికి వెళ్లి దానిముందు నిలబడింది మల్లిక. "పోనీ ఆ బొమ్మలన్నిటిగురించి వద్దు. ఈ పెద్ద బొమ్మగురించి చెప్పు. ఇదెందుకు ఇలా పెద్దదిగా వుంది? ఆ ఒంటె తల, ఈ నగ్న శరీరం. చూడు ఇది ఎలా నిలబడిందో? నీకూ అప్పుడప్పుడు ఇది ఇలా నిలబడుతుంది కదా." కబుసా మగతనం వైపు చూపిస్తూ అడిగింది సారిక.

"దానిగురించైతే ముందే చెప్పను. నిన్ను నీ మామ్మ వెదుక్కుంటూ రాకముందే ఇక్కడనుండి బయలుదేరు."    

సింహరాజు అలా అన్నాక విసుక్కుంటూ అక్కడనుండి బయలుదేరింది మల్లిక. 

&&&

"నా కోడలి తోడిదే నీ అమ్మ కూడా. నాకెంతో చేరికగా నాకు కూతురులా ఉండేది. తను బతికున్నా నాకు కొంత బావుండేది. అలా పడవ మునకలో మీ నాన్నతో పాటుగా చనిపోయి, నిన్ను మాత్రమే కాదు, నన్నూ వంటరిని చేసేసింది నీ అమ్మ."

ఆరోజు మల్లిక ని దిగబెట్టి, ఆ యింట్లో భోజనం చేస్తూండగా అంది సాముదమ్మ.

"ఇప్పుడా విషయాలన్నీ ఎందుకులే సామమ్మా? జరిగిపోయినదానికి మనమేం చెయ్యగలం?" సింహరాజు అన్నాడు.

"ఇంకా ఆ పాడు పూజలు, పాడు దేవతలు వదిలేయమని చెప్పాను. ఎక్కడో తేడా వచ్చి, ఏ చెడ్డ దేవత కో కోపం వచ్చి వాళ్ళలా చనిపోయారు."

"అప్పుడు ఆ పడవ మునకలో ఇంకో పదిమంది చనిపోయారు. వాళ్లంతా కూడా ఎదో చెడ్డ దేవత కి కోపం వచ్చి చనిపోయారా?" అప్పటికి సింహరాజు తల్లిదండ్రులు పడవ మునకలో చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతూంది. అప్పటి వాళ్ళ మరణం సింహరాజు మీద ఇప్పుడు ఎలాంటి ప్రభావం లేనట్టుగానే వుంది. "చేపల వేటకి వాళ్ళు వెళ్ళాక అకస్మాత్తుగా తుఫాను పట్టుకుంది. ఆ తుఫాను లో పడవ అలా ములిగిపోయింది. సముద్రం మరీ అంత అల్లకల్లోలం కాకపోతే వెళ్లేలాగో ఈదుకుని ఒడ్డుకి వచ్చేసేవారు."

"మగాళ్లు పోయే చేపల వేటకి నువ్వు కూడా ఎందుకే అన్నాను. పోయే రాత రాసిపెట్టివుంటే ఆగుతుందా? పెళ్ళైన అన్నేళ్ళకి ఎదో కొత్త దంపతులు విడిగా వుండలేరన్నట్టుగా వెళ్లారు.  నీకు తెలుసా ఆ పడవలో వున్న అడ మనిషి నీ అమ్మ ఒక్కటే. ఏదో చెడ్డ దేవత ప్రేరేపించకపోతే నీ నాన్న తో వెళ్లాలన్న ఆలోచన నీ అమ్మకి ఆరోజు వచ్చివుండేది కాదు."

"ఎదో రకంగా నా తల్లిదండ్రుల చావుకి ఆ చెడ్డ దేవతలే కారణం అని నన్ను నమ్మించి, నాతో వాటిని  పూజించడం ఆపించేయాలని నీ తాపత్రయం." నవ్వుతూ అన్నాడు సింహరాజు.

"నీ అమ్మానాన్నా వాళ్ళేదో పూజించారేమో కానీ, నువ్వు వాళ్ళ మార్గాన్ని అనుసరించాలనుకోలేదు. నువ్వు చదువుకుని బాగుపడాలని ఎన్నోసార్లు నా దగ్గర అంటూండేది నీ అమ్మ."

"ఎదో తొమ్మిదో తరగతి వరకూ చదువుకున్నాను కదా, ఆ చదువు చాలు నాకు." సింహరాజు అన్నాడు. "ఒక్క కబుసా ని తప్ప వేరే ఎవర్నీ నేనూ పూజించడంలేదు అంతగా."

"ఆ కబుసా ఊసెత్తకు. నా కుటుంబం ఒకప్పుడు ఆ చెడ్డ దేవతలని పూజించిన కుటుంబమే. ఆ కబుసా అంత ప్రమాదకరమైన దేవుడు లేడు. వాడి కోరికలే నీచమైనవి."

"కబుసా వల్ల ఇబ్బంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కాదు." నవ్వుతూ అన్నాడు సింహరాజు. "తనని ప్రసన్నం చేసుకోవడం అంత తేలిక కాదు కానీ, ప్రసన్నం అయితే మాత్రం అన్ని కోరికలు తీరుస్తాడు."

"సర్లే, నిన్ను నేనెక్కడ మార్చగలను?" నిట్టూరుస్తూ అంది సాముదమ్మ. "కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పేది జాగ్రత్తగా విను."

"సరే చెప్పు" భోజనం చెయ్యడం అపి సాముదమ్మ మొహం లోకి ఆసక్తిగా చూస్తూ అడిగాడు సింహరాజు.

"దేవుడి దయవల్ల నా కొడుక్కి మంచివుద్యోగం వచ్చింది. బాగానే సంపాదించుకుంటూ వున్నాడు. నాకూ అంతో ఇంతో పంపిస్తున్నాడు."అంటూ ఆగింది.

"మంచిదే కదా సామమ్మా." విషయం అర్ధం కాక అయోమయం గా అన్నాడు సింహరాజు.

"తనెలాగూ డబ్బులు బాగానే కూడబెడతాడు. ఆ డబ్బులతో మల్లిక ఒక మంచి కుర్రాడిని వెతికి పెళ్ళిచెయ్యాలని నా కోరిక."

"ఆ విషయం ఎవరు కాదంటారు చెప్పు? మల్లిక మంచి జీవితం గడపాలనే కదా నేనూ కోరుకునేది."

"కానీ అది నీ చుట్టూ తిరుగుతుంది. మీరిద్దరూ కలిసి కొంపముంచుతారేమో అని నా భయం." సాముదమ్మ గొంతులోనూ, మొహం లోనూ ఆ భయం స్పష్టంగానే వుంది.

"నేనెప్పుడూ అలాంటి తప్పుడు పని చెయ్యను. మల్లిక ని పెళ్ళిచేసుకుని ఉద్దేశమూ నాకు లేదు." భోజనం ముగించి లేస్తూ అన్నాడు సింహరాజు. "ఇంక తనని నా దగ్గరకి రావద్దని చెప్పనా? ఇక్కడే వుందా? ఇప్పుడే చెప్పనా?"

"ఊరంతా తిరిగొచ్చాక అలసిపోయి తనగదిలో తిండి కూడా తినకుండా పడుకుంది. ఇప్పుడు తనని లేపి నువ్వేం చెప్పక్కర్లేదు."  కూర్చున్నచోటనుండి తనూ లేస్తూ సాముదమ్మ అంది. "ఎప్పుడు చెప్పినా తను అర్ధం చేసుకునేలా చెప్పు. తను ఒక మంచి వుద్యోగం చేసేవాడిని పెళ్ళిచేసుకుని హాయిగా జీవితం గడపాలని నా అభిప్రాయం."

"అలాగే సామమ్మా." అన్నాక అక్కడనుండి ఇంటికి వచ్చేసాడు సింహరాజు.

&&&

చాలా నిరాశ గా, నిస్సత్తువగా వుంది సింహరాజు కి. సాముదమ్మ తన మనసులో మాట అంత స్పష్టంగా అలా చెప్పేస్తుందని తను అనుకోలేదు. సాముదమ్మ చెప్పినట్టుగా తన తల్లి సాముదమ్మ తో చాలా చనువుగా, చేరికగా, తనకి కూతురిలానే ఉండేది. ఇద్దరూ ఒకళ్ళమీద ఒకరు చాలా అభిమానం చూపించుకునేవారు. అది గుర్తుంచుకుని తన మనవరాలిని తనకిచ్చి పెళ్ళిచేద్దామనుకుంటుందేమో అనుకున్నాడు కానీ, అలా అంటుందని ఊహించలేదు. తను వేరే ఎవరితోనన్నా మంచి జీవితం గడపాలి అన్నది తను మనసులో మూలుగుతూనే అన్నాడు.      

అయినా తను అలా ఎలా ఆలోచించాడు? తనతో మల్లిక జీవితం ఏం బాగుంటుంది? తను తొమ్మిదో తరగతికన్నాచదువుకోలేదు, ఈ ఇల్లు తప్ప వేరే ఆస్తి లేదు. వాళ్ళ పొలాల్లో, వీళ్ళ పొలాల్లో పనిచేస్తే తప్ప తనకి గడవదు. తనకి మంచి మొగుడిని తీసుకుని వచ్చే అవకాశం వున్నప్పుడు, మల్లిక ని తను ఆశించడం ఎంతవరకూ న్యాయం? సాముదమ్మ కోరికలో తప్పేమీ లేదనే తనకి అనిపిస్తూ వుంది.

కానీ మల్లిక ని మర్చిపోవడం కూడా తనకంత తేలిగ్గా అనిపించడం లేదు. మల్లిక పుట్టినదగ్గరనుండీ తనకి తెలుసు. మల్లిక పుట్టినరోజున చాలా పెద్ద విపరీతమైన వాన. ఆ రోజు మల్లిక వాళ్ళ నాన్న కూడా ఇక్కడ లేడు. మల్లిక తల్లిని ఎక్కడికీ తీసుకువెళ్ళడానికి అవ్వలేదు. కాకపోతే తన తల్లికి పురుడు పోయడం లో కొంత అనుభవం ఉండడం తో సాముదమ్మ సహాయంతో తనకి పురుడు పోసింది.

"ఒరేయ్, నువ్వు నా కూతుర్ని పెళ్లిచేసుకుంటావా?" తన పక్కనే పడుకునివున్న మల్లికని ఆసక్తిగా చూస్తూన్న తనని, మల్లిక తల్లి సావిత్రమ్మ అడగడం ఇప్పటికీ గుర్తువుంది తనకి.

దానికి తను ఏం సమాధానం ఇచ్చాడో, అసలు సమాధానం ఇచ్చాడో లేదో మాత్రం తనకి గుర్తు లేదు. కానీ ఆ తరువాత మల్లిక తనూ కలిసి ఆడుకునేవారు. తామిద్దరూ కలిసి తనకంట పడ్డప్పుడల్లా సావిత్రమ్మ ఆ ప్రశ్న తనని అడుగుతూండేది.

"ఓ తప్పకుండా." తను అనేవాడు.

"వీడిని మాత్రం నేనెప్పటికీ చేసుకోను." మల్లిక అనేది.

అది విని సావిత్రమ్మ, ఇంకా అక్కడ ఎవరన్నా వుంటే వాళ్ళు నవ్వేవారు.       

మల్లిక తండ్రి ఎప్పుడో వచ్చేవాడు. వచ్చినా మల్లికతో సమయం పెద్దగా గడిపేవాడు కాదు. తననసలు పట్టించుకునేవాడే కాదు. సావిత్రమ్మ ని కూడా అసలు పట్టించుకోకుండా, ఆంటీ ముట్టనట్టుగా ఉండేవాడు.

"ఒరేయ్, నువ్వొక్క విషయం గుర్తుంచుకో. ఈ రోజు నీ ఈ జీవితానికి కారణం తనే. తననే అసలు పట్టించుకోకుండా వున్నవే. ఇది నీకేమన్నా బాగుందా?" ఒకరోజు సాముదమ్మ అడగడం తను విన్నాడు. 

"అయితే నేనేం చెయ్యను? నెత్తిమీద ఎక్కుంచుకుని తిరగనా? ప్రస్తుతం నేను చదువుకోవడం లో తీరికలేకుండా వున్నాను. మంచి మార్కులతో పాసయితే కానీ నాకు మంచి వుద్యోగం రాదు." చిరాగ్గా అన్నాడు మల్లిక తండ్రి  

తనకి బాగా చిన్నతనం. మల్లిక తండ్రి చెప్పినదాంట్లో ఎంత నిజముంది అన్నది అర్ధం చేసుకునే శక్తి లేదు. కానీ మల్లిక అన్నా తన తల్లి అన్నా అతనికి అంత ఇష్టం లేదన్న విషయం మాత్రం అర్ధం అవుతూ వుంది.

మల్లిక కి మాత్రం తన తండ్రి స్వభావం అంతో ఇంతో అర్ధం అయివుండాలి. అందుకే అతను తనని కసురుకుని, చీదరించుకుంటూ వున్నా తనతో తిరగడానికి ఇష్టపడుతూ ఉండేది.

మల్లిక తన కళ్ళముందే పెరిగి పెద్దదైంది. తను, తన పదో ఏటో ఎప్పుడో  పెద్దమనిషి అవ్వడం కూడా తనకి తెలుసు. కానీ ఆ సంఘటన జరగడం కన్నా ముందే తన జీవితం లో పెద్ద దుర్ఘటన జరిగింది. మల్లిక తల్లి సావిత్రమ్మ కి కాన్సర్ వచ్చింది. తను తీసుకొచ్చిన డబ్బుతో తనకి వైద్యం జరిపిస్తానంటే సావిత్రమ్మ ఒప్పుకోలేదు. ఆ డబ్బు తన భర్త చదువుకి ఉపయోగిస్తానని ఆశపెట్టి అతన్ని పెళ్లిచేసుకుంది. ఇప్పుడు ఆ డబ్బుని తన జబ్బు కి వాడేస్తే తనెలా చదువుకుంటాడు?

మల్లిక తండ్రి సావిత్రమ్మ జబ్బు గురించి పెద్దగా పట్టించుకోలేదు. తన డబ్బుతో సావిత్రమ్మకి వైద్యం చేయిపిస్తానన్న సాముదమ్మ మాటల్ని సావిత్రమ్మ ససేమిరా ఒప్పుకోలేదు. అలాగే ఆ జబ్బు ముదిరి కొన్నిరోజులకి చనిపోయింది. అప్పుడు మల్లిక ఆరేళ్ళ వయసు అలా ఉండొచ్చు.

తల్లి మరణం మల్లిక ని బాగానే కుంగదీసింది. నిజానికి తనతో స్నేహమే తనని మళ్ళీ అంతో ఇంతో మామూలుగా అయ్యేలా చేసింది. తను మల్లిక కి చాలా మంచి స్నేహితుడయిపోయాడు.తనని చాలా దగ్గరనుండి చూసే అవకాశం తనకి దక్కింది. చాపకింద నీరులా ఆమె వంటిమీద పరుచుకుంటున్న ఆమె యవ్వనం తనకి ఆసక్తిగా ఉండేది.

"నువ్వింక వాడితో తిరగడం తగ్గించు. ఇప్పుడు పెద్ద మనిషివి అయ్యావ్." సాముదమ్మ అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉండేది మల్లిక ని.

ఆ హెచ్చరికని పట్టించుకునేది కాదు మల్లిక. "అమ్మెప్పుడూ నిన్ను నన్ను పెళ్లిచేసుకోవడం ఇష్టమా అని అడిగేది అవునా?" ఒకరోజు అడిగింది మల్లిక.

"అవును." తను నవ్వుతూ అన్నాడు. "మనమిద్దరం భార్యాభర్తలం అవడం తనకి ఇష్టమేమో."

"కానీ నేనెప్పుడూ నాకిష్టం లేదని చెప్పేదాన్ని." మల్లిక అంది.   

"నిజంగానే నన్ను పెళ్లిచేసుకోవడం నీకు ఇష్టం లేదా? మరయితే నాతో ఎందుకు తిరిగుతున్నావ్?" కోపంగా అడిగాడు సింహరాజు.

"ఇష్టం ఉందీ లేదూ అని కాదు..........." ఒక కొంటె భావం మొహం లో ప్రస్పుతమవుతూ ఉంటే అంది. "............ నా మామ్మ నాకు మా నాన్న ఒక మంచి మొగుడ్ని తెస్తాడని చెపుతూంది. నీకు చూస్తే ఏముంది ఒక చిన్న ఇల్లు తప్ప."

"సరే అయితే. నువ్వు మీ నాన్న తెచ్చినవాడిని చేసుకో. ఇంక నాతో ఇలా తిరగడం తగ్గించు." నిరాశగా నిట్టూరుస్తూ అన్నాడు సింహరాజు.

"ఏం నేను నిన్ను పెళ్లిచేసుకోకపోతే నాతో స్నేహంగా వుండలేవా? నీకు పెళ్ళాన్ని కాకపోతే నా మీద నీకు అభిమానం ఉండదా?"

దానికి సమాధానం ఏం చెప్పాలో తోచలేదు సింహరాజు కి. తన తండ్రి మంచి మొగుడిని తెచ్చేమాట ఎలా వున్నా, మల్లిక తనతో తిరగడం ఆపలేదు. తనూ మల్లిక ఉద్దేశం మర్చిపోయి ఆనందంగానే వున్నాడు.

"నా నాన్న నాకు మంచి మొగుడిని తెస్తాడన్న మాట ఉట్టిదేలాగుంది. నన్నసలు పట్టించుకోవడమే లేదు. అయినా తన భార్య జబ్బుతో చచ్చిపోతుంటే పట్టించుకోనివాడు, కూతురిగురించి మాత్రం ఆలోచిస్తాడా?" మరొకరోజు అకస్మాత్తుగా అంది.

"ఆ విషయం గురించి నేనేం చెప్పలేను." తన మనసులో ఆనందం మొహం లో బయటపడకుండా అన్నాడు సింహరాజు.

ఏమీ ఆలోచించకుండా మౌనంగా వున్న మల్లికతో అన్నాడు. "నీకు మంచి మొగుడు రాడేమో అని కంగారుపడకు. నేను నిన్ను పెళ్ళిచేసుకుని జాగ్రత్తగా చూసుకుంటాలే."

"చూద్దాం లే. దానిగురించి ఆలోచన ఇప్పుడెందుకు. ఇప్పుడిప్పుడే పెళ్ళిచేసుకునే ఉద్దేశం నాకెలాగూ లేదు." నిట్టూరుస్తూ అంది మల్లిక.

అది విన్నాక సింహరాజు మాత్రం ఆనందంగానే వున్నాడు. మల్లిక తో తన పెళ్లి అయిపోవడం ఖాయం అయినట్టుగానే వుంది. అంత అందం తన స్వంతం అయిపోతుందంటే ఎంతో ఉషారుగా వుంది. మల్లిక నాన్న తన గురించి ఏమీ పట్టించుకోకుండా ఉండడం కూడా తనకి సంతోషం గానే వుంది. తన తల్లితో కూడా వున్న పరిచయం వల్ల సాముదమ్మ కూడా తమ పెళ్ళికి అంగీకరిస్తుంది అనుకుంటున్న సమయం లో ఈ రోజు ఆవిడ ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చింది.

ఆలోచిస్తూంటే సాముదమ్మ చెప్పినదాంట్లో కూడా తప్పేమీ లేదనే అనిపిస్తూవుంది. చదువు సంధ్యా లేని తనని మల్లిక పెళ్ళిచేసుకుని సుఖపడేదేమిటి? చదువు లేకపోయినా తను అందంగా ఉంటుంది. వాళ్ళ నాన్న బాగా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు కాబట్టి తనకి ఒక మంచి మొగుడిని తీసుకురావడం పెద్ద కష్టం ఏమీ కాదు. గుండెని రాయి చేసుకుని మల్లికని మర్చిపోవాలన్న నిర్ణయానికి వచ్చేసాడు సింహరాజు.

"ఇంక నువ్వు నా దగ్గరికి ఇలా తరచూ రాకు. నీ మామ్మ నీకు వేరే మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్ళిచేయాలని ఆలోచిస్తూ వుంది." ఆరోజు తన దగ్గరికి వచ్చిన మల్లిక తో అన్నాడు సింహరాజు.

"ఇది బాగుంది. నా మామ్మ నాకు వేరే వాడితో పెళ్ళిచేద్దామనుకుంటే నేను నీ దగ్గరికి రావడం మానేడం ఎందుకు?" నవ్వి అడిగింది మల్లిక.

"నువ్వు వేరే వాడిని పెళ్లిచేసుకోబోతూన్నప్పుడు నాతో ఇలా కలిసి తిరగడం బాగుంటుందా? అందరూ ఏమనుకుంటారు?"

"ఏమనుకుంటే అనుకోని. నేను పట్టించుకోను. నాకు ఇష్టం లేదు, రావద్దు అని చెప్పు మానేస్తాను." అంది.

ఎందుకనో అలాగని మాత్రం చెప్పలేకపోయాడు. తను వస్తూవుంటే, తనతో వుంటూవుంటే అందులో ఎదో ఆనందముంది. అది కాదనలేకపోయాడు. అందువల్ల ఆ తరువాత కూడా మల్లిక తనదగ్గరికి వస్తూనే వుంది.   

ఇదిలా వుంటే ఆ వూరికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. వస్తూనే వూళ్ళో రావిచెట్టు దగ్గర వున్న తనని కలిసాడు.

"నాకు ఈ వూళ్ళో కొంత పనివుంది. కొన్నిరోజులపాటు వుండాలనుకుంటున్నాను. నాకు కొన్నిరోజులపాటు వసతి దొరుకుతుందా?"

"ఇది పల్లెటూరు. పట్నంలో లా ఇక్కడ ఇల్లు అద్దెకి ఇవ్వడం లాంటిది ఉండదు. అసలు ఈ వూరికి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుని ఉండాలని ఎవరూ అనుకోరు." సింహరాజు నవ్వి అన్నాడు. "అసలు మీరు ఈ వూళ్ళో ఎందుకు ఉండాలనుకుంటున్నారు?"

"నా పేరు శమంతక మణి. అందరూ యస్మణి అని కూడా అంటూవుంటారు. ఈ వూరు బ్లాక్ మ్యాజిక్ అంటే వూడూ, బాణామతి, చేతబడి లాంటివాటికి చాలా ప్రసిద్ధి ట కదా. నేను వాటిమీద రీసెర్చ్ చేద్దామని వచ్చాను. ఈ వూళ్ళో ఎక్కడన్నా కొన్నిరోజులపాటు వుండి ఆ పని చూస్తాను."

మరోసారి నవ్వాడు సింహరాజు. "అది నిజమే కానీ మీరు బాణామతి, చేతబడి లాంటివి చేస్తారా అంటే ఇక్కడ ఎవరూ ఒప్పుకోరు. వాటిమీద మీ పరిశోధన అంత తేలిగ్గా అయ్యే విషయం కాదు."

"సరేలే. కానీ ముందు నాకెక్కడో ఒకచోట ఉండడానికి వసతి దొరికితే తరువాత వాటిగురించి ఆలోచిస్తాను. ఆ సాయం చేసిపెట్టు ముందు." యస్మణి అన్నాడు.

కాసేపు ఆలోచించాక సింహరాజు అన్నాడు. "వేరే చోట ఎందుకు? నా ఇంట్లోనే వుండండి. కాకపోతే వేరుగా వుండే అవకాశం లేదు. నాతోనే కలిసి ఉండాలి."

"మీ ఇంట్లో మరి ఎవరూ ఉండరా?"

"వుండరు. నేనొక్కడినే ఉంటున్నాను." సింహరాజు అన్నాడు. "నేను మనిద్దరికీ కలిపి వంట చేస్తాను. మనిద్దరం భోజనం చెయ్యొచ్చు."

"చాలా సంతోషం. నేను దానికంతటికీ డబ్బు చెల్లిస్తాను. మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు."

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)