భక్త శబరి కథ భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయంలో అత్యంత విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కథ కేవలం వాల్మీకి రామాయణంలోని అరణ్యకాండలోనే కాకుండా, పద్మ పురాణము, భాగవత పురాణము మరియు విబ్భిన్న ప్రాంతీయ రామాయణాలలో భక్తి మార్గానికి పరమావధిగా కీర్తించబడింది.
అరణ్యమధ్యంలో పంపానది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ నదీతీరంలో మాతంగ మహర్షి తపస్సు చేసుకునే పరమ పవిత్రమైన ఆశ్రమం ఉంది. ఆ గురువును సేవించే ఒక గిరిజన మహిళ శబరి.
ఆమె చిన్నతనంలోనే సంసార బంధాలను విడిచి ఆశ్రమంలో చేరింది. మునివృత్తానుసారంగా సత్యము, ధర్మము అనే సద్గుణాలను నేర్చుకుంది. ఆశ్రమంలో నిరంతరం రామనామ జపం, సీతారామ లక్ష్మణుల కల్యాణ గుణగణాలను వింటూ శబరిలో రామభక్తి అత్యంత ప్రగాఢంగా పెరిగింది.
కాలక్రమేణా మాతంగ ముని తన అవసాన దశకు చేరుకుని శబరితో, "అమ్మా! నీ నిశ్చల భక్తికి శ్రీరామచంద్రుడే స్వయంగా ఈ దక్షిణ దారిలో వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు" అని పలికి పరమపదించారు. గురువుగారి ఆ అద్భుత వాక్యం శబరి హృదయంలో అమృతధారలా నిలిచిపోయింది. గురువాక్యమే వేదవాక్యంగా భావించిన ఆ సాధ్వి, నాటి నుండి బాహ్య ప్రపంచాన్ని విస్మరించి కేవలం రాముని ధ్యానంలోనే కాలం గడిపింది. గురువు చూపిన మార్గమే పరమార్థమని నమ్మి, తన ఆరాధ్య దైవమైన శ్రీరాముని పాద పద్మాలను దర్శించుకునేందుకు నిరంతరం తపించింది. ఆశ్రమంలోని ప్రతి అణువులోనూ రామనామ ధ్వని ప్రతిధ్వనించేలా ఆమె చేసిన జపం, ఆ వన ప్రాంతమంతటికీ ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శోభను చేకూర్చింది. లౌకిక సుఖాలపై ఏమాత్రం ఆశ లేని ఆ మహాయోగిని, కేవలం భగవదనుగ్రహం కోసమే ప్రతి శ్వాసను అంకితం చేస్తూ, గురువు మాట సత్యమవబోయే ఆ పరమ పవిత్ర ఘడియ కోసం నిశ్చలమైన నిష్ఠతో వేచి చూసింది
ఆమె ఆ గురువాక్యంపై అచంచలమైన విశ్వాసముంచి, ప్రతిదినం ఆశ్రమ పరిశుద్ధతను కాపాడుతూ, పూజకు పుష్పాలను సేకరించేది. రాముని కోసం మధురమైన పండ్లను ఏరి తెచ్చేది. నది నుండి స్వచ్ఛమైన జలాలను తెచ్చుట నిత్యకృత్యంగా చేసుకుంది. ప్రతీ రోజూ రాముడు వచ్చే మార్గాన్ని ఎంతో అందంగా అలంకరించి, ఆయన పాదాలకు ముళ్లు గుచ్చుకోకుండా ఎండుటాకులను ఏరివేసేది. ఇలా రాముని రాక కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తూనే ఉంది. కాలం గడిచేకొద్దీ ఆమెకు వయసు పెరిగింది, శరీరం వృద్ధాప్యంతో క్షీణించింది, కంటిచూపు కూడా మందగించింది. కానీ ఆమె హృదయంలోని రామభక్తి, ఆశ ఏమాత్రం తగ్గలేదు.
మరోవైపు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి, లంకేశుడైన రావణాసురుడు అపహరించిన సీతాదేవిని అన్వేషిస్తూ దక్షిణాపథంలో ప్రయాణమయ్యాడు. అలా అన్వేషిస్తూ ఒక రోజు పంపానది సమీపంలో ఉన్న శబరి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమంలో ప్రవేశించిన నీలమేఘశ్యాముడైన రాముని, లక్ష్మణుని చూసి శబరి ఆనందబాష్పాలు రాల్చింది. తన గురువు చెప్పిన సత్యవాక్యం ఇన్నాళ్లకు నిజమైందని గ్రహించి పులకించిపోయింది. ఆమె పొందిన ఆనందం వర్ణనాతీతం. సాక్షాత్తు ఆ జగన్నాథుడే తన గుడిసెకు రావడం చూసి, వృద్ధాప్య భారంతో వణుకుతున్నప్పటికీ, పరుగు పరుగున వెళ్లి ఆ రాఘవుని పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసింది. ఇన్నాళ్లుగా తాను పడిన నిరీక్షణ శ్రమ అంతా ఆ స్వామి చిరునవ్వును చూడగానే పటాపంచలైపోయింది. ఎన్నో ఏళ్లుగా హృదయంలో దాచుకున్న తపనంతా ఆనంద అశ్రువులుగా మారి ఆ శ్రీరాముని చరణాలను అభిషేకించింది. గురువుగారి దివ్య దృష్టికి, ఆయన చెప్పిన భవిష్యత్తుకు మనస్సులోనే శతకోటి నమస్కారాలు చేసుకుంటూ, ఆ దివ్యమంగళ స్వరూపులను తన కళ్లతో మనసారా వీక్షిస్తూ పరవశించిపోయింది. చేతులు జోడించి లోక రక్షకుడైన ఆ పరమాత్మునికి సాదరంగా స్వాగతం పలికి, తన జన్మ ధన్యమైందని భావించింది.
పద్మ పురాణములోని శబరి వృత్తాంతం ప్రకారం, ఆమె శ్రీరామునికి పాద్యార్ఘ్యాలు ఇచ్చి అత్యంత భక్తితో పూజించింది. తాను సేకరించిన పండ్లలోని మధురత్వాన్ని స్వయంగా పరీక్షించి, ఎంతో రుచికరంగా ఉన్న వాటిని మాత్రమే రామునికి సమర్పించింది. ఆ సమయంలో రాముడు ఆమెను చూసి, "అమ్మా! లోకంలో ఎందరో వైభవంగా పూజిస్తారు, కానీ నీ కళ్లలో ఉన్న నిర్మలమైన ప్రేమ, ఈ పండ్లలోని తీపి నాకెక్కడా లభించలేదు" అని పలికాడు. దానికి శబరి వినయంగా, "ప్రభూ! నేను హీన కులంలో పుట్టిన దాన్ని, ఎలాంటి శాస్త్రాలు తెలియని అజ్ఞానిని, మిమ్మల్ని ఎలా పూజించాలో కూడా నాకు తెలియదు" అన్నది. అప్పుడు రాముడు చిరునవ్వుతో, "శబరీ! నాకు కులం, విద్య, ధనం, రూపం ముఖ్యం కావు. కేవలం భక్తి సంబంధం ఒక్కటే నాకు ముఖ్యం. నన్ను చేరడానికి నిష్కల్మషమైన ప్రేమే ఏకైక మార్గం" అని ఆశీర్వదించాడు. లోకనాథుడైన ఆ శ్రీరాముడు ఆమె నిష్కపటమైన సేవకు, పరమ పవిత్రమైన అర్పణ భావానికి మనస్సారా పొంగిపోయాడు. వస్తువుల బాహ్య రూపం కంటే భక్తుని అంతరంగ భావమే తనకు అత్యంత ప్రధానమని చాటాడు.
స్కాంద పురాణంలో కూడా శబరి భక్తిని నవవిధ భక్తి మార్గాలకు ప్రతీకగా వర్ణించారు. జాతి, కుల భేదాలకతీతంగా కేవలం ప్రేమతోనే భగవంతుని వశం చేసుకోవచ్చని రాముడు శబరిని ఆదరించి లోకానికి నిరూపించాడు. భగవంతుని ముందు అందరూ సమానులే అనే గొప్ప సత్యాన్ని ఈ ఘట్టం మనకు బోధిస్తుంది. ఆమె అనన్య సామాన్యమైన భక్తికి ప్రతిఫలంగా శ్రీరామచంద్రుడు శబరికి శాశ్వత మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ సమయంలో శబరి తన భౌతిక దేహాన్ని యజ్ఞకుండంలోని అగ్నికి ఆహుతి చేసి, దివ్యమైన తేజోరూపంలో వినువీధికి చేరి పరమపదాన్ని పొందింది.
భక్త శబరి జీవితం ఆదర్శవంతమైన సద్గుణాలకు నిలయం. ఆమెలో కనిపించే పరమావధి అయిన గురుభక్తి, దశాబ్దాల కాలం పాటు ఏమాత్రం సడలని అచంచలమైన సహనం, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. బాహ్య ప్రపంచంలోని ఆడంబరాలకు దూరంగా, అహంకారం లేని నిష్కపటమైన హృదయంతో, భగవంతునిపై సర్వస్వం ఉంచిన శరణాగతి ఆమె సొంతం. శబరి జీవితం భగవదనుగ్రహాన్ని పొందడానికి కేవలం నిర్మలమైన హృదయము, సహనము ఉంటే సరిపోతుందని నిరూపించే ఒక గొప్ప నిదర్శనం.